Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-13

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”త[/dropcap]ప్పకుండా అలానే చేస్తాను. ఎటొచ్చీ ఒకవేళ నా కూతుర్ని ముస్లిం పెళ్ళి చేసుకుని ఉంటే…” అంటూ ఆగాడు .

“అటువంటి పెళ్ళిళ్ళు చెల్లవని, మతమార్పిడులు చెల్లవని ఇరుదేశాల ప్రధానమంత్రుల ఒప్పందంలో స్పష్టంగా రాయబడి ఉంది.”

“అలా సంసారం చేయడం వల్లనో శారీరక సంబంధం వల్లనో కడుపుతో ఉంటేనో..”

“అబార్షన్ చేయించి, యింటికి పిల్చుకెళ్ళటం మంచిది.”

‘ఏడో నెలో తొమ్మిదో నెలో గర్భం ఉంటే ఏం చేయాలి?”

ఆమె అతని వైపు విసుగ్గా చూసి, కదిలి ముందుకెళ్ళిపోయింది. మార్పిడి మొదలయ్యింది.

ఒక్కో అమ్మాయిని ముందుకు తెచ్చి నిల్చోబెట్టి, ఆమె కుటుంబీకులు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు గుర్తుపట్టాక ఓ రిజిస్టర్లో వాళ్ళ పేర్లు, చిరునామా నమోదు చేసి, ఆ అమ్మాయి వివరాలు కూడా రాసుకుని అప్పుడు అప్పగిస్తున్నారు. ఒకర్ని ఈ వైపు నుంచి పాకిస్తాన్ వాళ్ళకు అప్పగించాక మరొకర్ని ఆ వైపు నుంచి ఇండియా వాళ్ళకు అప్పగిస్తున్నారు.

తన కూతుర్ని కూడా తీసుకొచ్చి ముందు నిల్చోబెడ్తారని, అప్పుడు తను చేతులు చాచి తన కూతుర్ని గుండెలకు హత్తుకుంటానని, అటువంటి సువర్ణ ఘడియ కోసం శంకర్ ఎదురు చూస్తున్నాడు.

సిక్కులు ఎత్తుకెళ్ళిన ఓ ముస్లిం యువతిని తీసుకొచ్చి ముందు నిల్చోబెట్టారు. ఆమె వయసు ముప్పయ్ యేళ్ళు ఉండొచ్చు. మైక్‌లో ఆమె పేరు, వయసుతో పాటు ఆమె భర్త పేరు, ఏ ప్రాంతానికి సంబంధించిందో చెప్పి ఆమె కుటుంబీకులు ముందుకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఎవ్వరూ ముందుకు రాలేదు.

“ఏమమ్మా.. మీ వాళ్ళెవరూ వచ్చినట్టు లేదే” అన్నాడు పోలీస్ అధికారి.

“నా భర్తా పిల్లలు వచ్చారు. నేను వాళ్ళను చూశాను” అందామె ఏడుస్తూ.

“ఏరీ.. మరి నిన్ను తీస్కెళ్ళడానికి ముందుకు రావాలిగా” అన్నాడు.

ఆమె దూరంగా నిలబడి ఉన్న ముస్లింల గుంపు వైపు చూస్తూ “అదుగో నా భర్త.. అతని చేయి పట్టుకుని ఉన్న నా కూతురూ కొడుకూ” అంటూ వేలు పెట్టి చూపించింది.

ఆ గుంపులోంచి ఓ ముస్లిం యువకుడు ఇద్దరు పిల్లల్ని ఈడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పిల్లలిద్దరూ గింజుకుంటూ “మాకు అమ్మ కావాలి” అంటూ పెద్దగా ఏడుస్తున్నారు.

“నిన్ను తనతో తీసుకెళ్ళడం అతనికిష్టం లేదనిపిస్తోందమ్మా” అన్నాడు పోలీసు.

తన పిల్లల్ని చూడగానే ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. నేల మీద పడి శోకాలు పెడుతూ “నాపిల్లలు.. యా అల్లా.. నాకు షొహర్ లేకున్నా పర్లేదు. నా పిల్లల్ని నాకు ఇప్పించండి”  అంది.

“అలా వీలు కాదమ్మా. నీ భర్త అంగీకరిస్తే నిన్ను పాకిస్తాన్‌కి పంపించడం తప్ప, నీ పిల్లల్ని తెచ్చి నీ కప్పగించే అధికారం మాకు లేదు” అన్నాడా పోలీస్ బాధగా.

అపహరించబడినవాళ్ళు దొరికినపుడు వాళ్ళని తమ కుటుంబంలోకి ఆహ్వానించడాన్ని ఎవ్వరూ తిరస్కరించకూడదని అగ్రిమెంట్లో ఉన్న విషయం ఆ పోలీస్‌కి గుర్తుంది. కానీ కుటుంబ సభ్యులు ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తే తప్ప బలవంతంగా ఆడవాళ్ళని అప్పగించకూడదని ఇరువైపులా పోలీస్ అధికార్లు నిర్ణయించుకోవడం వల్ల ఏడుస్తున్న ఆమెను లేపి, పక్కకు తీస్కెళ్ళి పోయారు.

ఓ పన్నెండేళ్ళ ముస్లిం అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు కన్నీళ్ళతో ఆలింగనం చేసుకున్నారు.

పన్నెండేళ్ళ చిన్నపిల్లని కూడా చూడకుండా సిక్కులు చెరబట్టారా అని శంకర్ ఆశ్చర్యపోయేలోపల ముస్లింలు ఎత్తుకెళ్ళిన పదేళ్ళ హిందూ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు. పదేళ్ళ పసిపిల్లని కూడా రాక్షంగా పీల్చి పిప్పిచేసిన ముస్లింలు తన పదమూడేళ్ళ కూతురి జీవితంతో ఎలా ఆడుకుని ఉంటారో తల్చుకోగానే శంకర్‌కి దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘నా కూతురు ఎముకల గూడులా మారినా, రోగాల పుట్టలా మారినా పర్లేదు. బతికుంటే చాలు. కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటాను’ అనుకున్నాడు.

మార్పిళ్ళు మొదలై రెండు గంటలు గడిచినా తన కూతురి జాడ కన్పించలేదు. అటువైపు యింకా చాలామంది నిలబడి ఉన్నారు. అటువైపు వాళ్ళతో పోలిస్తే యిటువైపు దానికి రెండింతలమంది తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. అలా ఎలా జరిగిందో అతనికి అర్థం కాలేదు. అంటే పాకిస్తాన్ ముష్కరులు ఎత్తుకెళ్ళిన హిందూ యువతుల కంటే సిక్కులు ఎత్తుకొచ్చిన ముస్లిం స్త్రీల సంఖ్య రెండింతలుందా లేక ముస్లింల నుంచి రక్షించబడ్డ యువతుల కంటే సిక్కుల నుంచీ హిందువుల నుంచీ రక్షించబడ్డ ముస్లిం స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉందా? అతనికి రెండోదే నిజమేమో అన్పించింది.

ఈ పనికోసం పాకిస్తాన్‍లో నియోగించబడిన పోలీసులు, సమాజ సేవకులు చిత్తశుద్ధితో పనిచేసి ఉండరు. అదే ఇండియాలో చిత్త శుద్ధితో పనిచేసి ఎక్కువమందిని గుర్తించి రక్షించి ఉంటారనుకున్నాడు.

పాకిస్తాన్ పోలీసులు నలభైయేళ్ళ హిందూ స్త్రీని ముందుకు తెచ్చి నిలబెట్టారు. ఆమె పేరూ, భర్త పేరు మైక్‌లో చెప్పడం ఆలస్యం ఇటువైపు గుంపుని చీల్చుకుంటూ ఓ నలభై ఐదేళ్ళ వ్యక్తి ముందుకొచ్చి “ఆమె నా భార్య” అన్నాడు. రాతకోతలు ముగిసేవరకు ఇద్దరూ ఒకర్ని చూసుకుని మరొకరు కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నారు. ఆమెను బార్డర్ దాటించి పంపడం ఆలస్యం అతను వేగంగా ముందుకెళ్ళి ఆమెను అక్కున చేర్చుకోబోయాడు.

ఆమె అతనికి అందకుండా రెండడుగులు వెనక్కి వేసి “నేను చాలా మైల పడ్డానండీ. ఒకరో ఇద్దరో కాదు చాలామంది నా శరీరాన్ని ఎంగిలి చేశారు. నన్ను తాకకండి. నేనా అర్హతను కోల్పోయాను” అంటూ అతని కాళ్ళదగ్గర కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

అతను ఆమెను భుజాల దగ్గర పొదివి పట్టుకుని పైకి లేపాడు. “గంగానదిలో ఎన్ని మలినాలు కలవడం లేదూ.. అంత మాత్రాన దాని పవిత్రతకేమైనా భంగం వాటిల్లిందా? నీ శరీరమూ అంతే. నీ ప్రమేయం లేకుండా బలవంతంగా జరిగిన వాటికి నువ్వెలా బాధ్యురాలివవుతావు?” అన్నాడు.

“నాకు తెలుసు మీరిలా అంటారని. మీరు నాకు దేవుడు. కానీ కుక్కలు ముట్టిన అన్నాన్ని ఈ దేవుడికెలా నైవేద్యంగా పెట్టనండీ” అంటూ ఆమె మళ్ళా ఏడ్చింది.

“నువ్వు మేలిమి బంగారంతో చేసిన కంఠాభరణం.. కుక్కలు ముట్టాయని పడేసుకుంటారా ఎవరైనా? నీళ్ళతో శుభ్రంగా కడిగి మెళ్ళో వేసుకుంటారు” అంటూ అతను ఆమెను గుండెలకు హత్తుకున్నాడు.

పోలీసులు, సైనికుల్తో పాటు అక్కడ గుమికూడి ఉన్న జనాలందరూ చప్పట్లతో వాళ్ళని అభినందించారు. కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఆమె పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకున్నారు.

ఆ కుటుంబ సభ్యుల్తో పాటు చాలామంది కళ్ళల్లో కన్నీళ్ళు ఉబికొచ్చాయి. శంకర్ కూడా కన్నీళ్ళను ఆపుకోలేకపోయాడు. వాళ్ళ మధ్య ఉన్న గాఢమైన అనుబంధానికీ, వాళ్ళ సంస్కారానికి జరిగిన కన్నీళ్ళ అభిషేకం అది..

మరో అరగంట వరకూ మార్పిడులు జరిగాక పాకిస్తాన్ పోలీసులు పదహారేళ్ళ ఓ హిందూ అమ్మాయిని ముందుకు తెచ్చి పెట్టారు. ఆ అమ్మాయి గర్భవతి అని చూస్తేనే తెలుస్తోంది. కడుపు మరీ ముందుకొచ్చి ఉండటంతో ఏడో నెలో ఎనిమిదో నెలో అయి ఉంటుందనుకున్నాడు శంకర్.

ఆమె పేరు, వూరు, తండ్రి పేరు మైక్‌లో వినగానే ముందుకొచ్చిన ఆమె తల్లిదండ్రులు కడుపుతో ఉన్న కూతుర్ని చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆగిపోయారు.

యింత క్రితం శంకర్‌తో మాట్లాడిన సంఘ సేవకురాలు “ఆగిపోయారేం.. మీ కూతుర్ని యింటికి పిల్చుకెళ్ళండి” అంది.

“మాకు మా కూతురు కావాలి. అదంటే నాకూ నా భార్యకు ప్రాణం. కానీ ఓ ముసల్మాన్ వల్ల వచ్చి న ఆ కడుపు వద్దు” అన్నాడు ఆ అమ్మాయి తండ్రి.

‘మీ మనోభావాల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మరో నెల్లోనో నెలన్నరలోనో కాన్ఫయ్యేలా ఉంది. అబార్షన్ చేయడానికి అవకాశం లేదు” అంది సంఘ సేవకురాలు.

“మరి ఆ బిడ్డను మేమేం చేసుకోమంటారు? మాకా బిడ్డ వద్దు. ఆ బిడ్డకు జన్మనిస్తే వాడు హిందూ అవుతాడా ముస్లిం అవుతాడా? పాకిస్తానీ అవుతాడా భారతీయుడవుతాడా?”

“మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా దీని గురించి స్పష్టమైన ఉత్తర్వులేమీ లేవు. బిడ్డను కన్నాక దానికి కారణమైన ముస్లిం తండ్రి ఒప్పుకుంటే బిడ్డను అతనికి అప్పగించవచ్చు. లేకపోతే బిడ్డను ఏ అనాథాశ్రమంలోనే వదిలేయాల్సి వస్తుంది.”

“నా కూతురు చచ్చిపోయినా భరిస్తాం కానీ ఓ ముసల్మాన్ బిడ్డకు జన్మనివ్వడానికి మేం ఒప్పుకోం” అంటూ అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అతని భార్య కూడా అతని వెంటే నడిచింది.

ఆ అమ్మాయి కొన్ని క్షణాలు అక్కడే కన్నీరు కారుస్తున్న శిలలా నిలబడిపోయింది. ఏమనుకుందో ఏమో మెల్లగా తను కూడా వెనక్కెళ్ళిపోయింది.

మరో రెండు గంటల వరకు ఆ కార్యక్రమం నడిచింది. కానీ షామ్లీ జాడ మాత్రం లేదు.

కార్యకమం ముగిసే సమయానికి తమ కుటుంబాన్ని తిరిగి పొందిన వాళ్ళు కన్నీళ్ళతో తడిసిపోతున్నారు. తప్పిపోయిన తమ వాళ్ళ జాడ తెలియని శంకర్ లాంటి వాళ్ళు కూడా దుఃఖంతో కన్నీళ్ళ చెలమలా మారిపోయారు. ముష్కరుల యిళ్ళనుంచి రక్షించబడి కూడా తమవాళ్ళ చేత తిరస్కరించబడిన స్త్రీలు కన్నీటి నదుల్లా ఉన్నారు. అక్కడున్న ప్రతి మనిషీ అశ్రు బిందువుల సమూహంలా ఉన్నాడు. అక్కడ బార్డర్‌కి యిరు వైపులా రెండు కన్నీటి సముద్రాలు పోటెత్తుతున్న దృశ్యం…

శంకర్ దర్శన్‌లాల్‌ని తీసుకుని నిరాశగా వెనక్కి తిరిగాడు. అలా వరసగా నాలుగు సంత్సరాలు బార్డర్ వద్ద జరుగుతున్న మార్పిడి కార్యక్రమాలకు హాజరయ్యాడు. కానీ షామ్లీ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆ తర్వాత ఆశ వదులుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version