[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ష[/dropcap]రీఫ్‌కు తన పెద్దక్క జైనాబీ అంటే చాలా యిష్టం. నమాజ్ చేశాక అక్క వాళ్ళింటికెళ్ళి ఓ అరగంటైనా కూచుని, అక్క పిల్లల్లో కబుర్లు చెప్పి వస్తుంటాడు. ఆ పిల్లల్లో అక్క చిన్న కూతురు అనీస్ అంటే అతనికి ప్రాణం.. హసీనా ఈ విషయంలో చాలాసార్లు అతనితో గొడవపడింది. “మన స్వంత పిల్లల్ని కూడా అంత ప్రేమగా చూడరు కదండీ. అనీస్ అంటే ఎందుకు మీకంత ఇష్టం” అని. ఎందుకో తనకూ తెలియదు. కొన్ని బంధాలకూ, వాటిమీద ఏర్పడే ఇష్టాలకు అర్థాలు ఉండవేమో..
అతను మెల్లగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళగానే జలజలా పారుతున్న షింగో నది కన్పించింది. బ్రోల్మో గ్రామాన్ని తన గ్రామంతో కలుపుతూ ప్రవహించే ఆ నదిని చూస్తే చాలు అతనికి తన బాల్యం గుర్తొస్తుంది. ఎంత మధురమైన బాల్యమో తనది.. యింట్లో పేదరికం తాండవిస్తున్నా తన తల్లి మొహంలో ఎప్పుడూ చిర్నవ్వు చెరిగిపోవడం తను చూళ్ళేదు. తండ్రి వాత్సల్యానికైతే అంతు లేదు. నిరంతరం జీవధారలా ప్రవహించే షింగో నదిలానే తన తండ్రి యాకూబ్ గుండెలో పిల్లల మీద ప్రేమ తగ్గిపోవడమో ఎండిపోవడమో ఎప్పుడూ జరగలేదు.
షింగో నదితో అల్లుకుని ఎన్ని జ్ఞాపకాలో.. తనకు యిద్దరు అక్కలు, ఓ తమ్ముడు.. తన చిన్నప్పుడు సాయంత్రాలు వ్యాహ్యాళికి నాన్న తననీ తమ్ముడు బషీర్‌ని పిల్చుకుని ఈ నది ఒడ్డుకు వచ్చేవాడు. బషీర్‌కి నీళ్ళలోకి దిగి ఆడుకోవాలని చాలా ఉత్సాహంగా ఉండేది. వాడు నది వైపుకు పరుగెత్తినపుడల్లా నాన్న వాడ్ని అదిలిస్తూ ఉండేవాడు. “నీళ్ళకు దగ్గరగా వెళ్ళిద్దు బషీర్.. ప్రమాదం” అనేవాడు.
“నాకు ఈతొచ్చు నాన్నా.. ఎంత లోతుగా ఉన్నా పర్లేదు. చేపలా ఈదుకుంటూ వెళ్ళగలను” అనేవాడు బషీర్.
“అదేమీ చెరువు కాదు ఈత కొట్టడానికి. నది.. నీళ్ళు చూశావా ఎలా ప్రవహిస్తున్నాయో.. ఆ వేగానికి నువ్వు కొట్టుకుని పోతావు. నా మాటిను” అంటూ నాన్న కూడా వాడ్ని పట్టుకోడానికి వాడి వెంట పరుగెత్తేవాడు. వాడి జబ్బ పట్టుకుని లాక్కొచ్చి నీటికి దూరంగా ఉన్న రాళ్ళ గుట్టల మీద కూచోబెట్టాక గాని ఆయన మనసు శాంతించేది కాదు.
తనకు మాత్రం నీళ్ళలోకి దిగడంకన్నా గట్టున ఉన్న రాళ్ళమీద కూచుని ఆ నీటి ప్రవాహాన్ని చూస్తూ, అది చేసే అందమైన శబ్దాన్ని వింటూ ఉండిపోవాలనిపించేది. షింగో నది నీళ్ళు ఎంత తేటగా ఉంటాయో… లేత నీలంరంగు నీళ్ళు రాళ్ళమీద ప్రవహించడం వల్ల ఏర్పడిన తెల్లటి నురగతో కనులకు విందు చేస్తూ… యింట్లో కుండలో నింపిన నీళ్ళలా స్వచ్ఛంగా… నీళ్ళలోకి కాణీనో అణానో విసిరేసి, అది పడిన చోట నిట్ట నిలువుగా చూడగలిగితే అడుగున ఉన్న ఆ నాణెం కన్పిస్తుందేమో అన్నంత శుభ్రంగా..
ఓ రోజు నాన్నని ఈ విషయమే అడిగాడు. “మన వూళ్లో ఉన్న చెరువులో నీళ్ళు మడ్డమడ్డిగా ఉంటాయి కదా నాన్నా. మరి ఈ నది నీళ్ళు యింత తేటగా ఎలా ఉన్నాయి?” అని. అప్పుడు తనకు ఎనిమిదేళ్ళు ఉంటాయేమో.. తమ్ముడు తనకంటే రెండేళ్ళు చిన్నవాడు.
“చెరువులో నీళ్ళు కదలకుండా ఉంటాయి కదా. అందుకే తొందరగా కలుషితమైపోతాయి. నది నీళ్ళు ప్రవహిస్తుంటాయిగా, పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉండటంతో తాజాగా ఉంటాయి” అన్నాడు.
నాన్న యిచ్చిన సమాధానం తనకు నచ్చలేదు. నది నీళ్ళు ప్రవహిస్తుంటాయనీ, చెరువులో నీళ్ళు నిలకడగా ఉంటాయని తనకూ తెలుసు. తన అనుమానం అది కాదు. వర్షాకాలంలో నీళ్ళతో నిండుగా ప్రవహించే కాలువలు కూడా మురిగ్గానే ఉంటాయిగా. కాబట్టి ప్రవాహం కారణం కాదు.
తనలా అనగానే నాన్న తన వైపు మెచ్చుకోలుగా చూశాడు. “ఈ నది మంచు కరగడం వల్ల ఏర్పడిన నీళ్ళతో నిండి ఉండటం కారణం కావచ్చు” అన్నాడు.
ఓ రోజు జరిగిన సంఘటనని తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. అప్పుడు బషీర్‌కి ఎనిమిదేళ్ళుంటాయి. వాడు వయసులో చిన్నవాడయినా తనకు సమానంగా ఎత్తుగా ఉండటంతో పాటు లావుగా బలిష్టంగా ఉండేవాడు. తెలియని వాళ్ళు అతన్ని అన్న అనీ బక్కగా ఉన్న తనని తమ్ముడని అనుకునేవాళ్ళు.
వాడికి ఎప్పటికైనా షింగో నదిలో ఈత కొట్టాలన్న కోరిక… చెరువుల్లో వూరి కుర్రాళ్ళతో పోటీ పడి ఈత కొట్టినపుడల్లా వాడే అందరికంటే ముందుండేవాడు. వాడితో సమానంగా వేగంగా ఈత కొట్టగలవాళ్ళు వూళ్లో లేరనే చెప్పాలి. వాడి మెదడ్లోకి తనని మించిన ఈతగాడు లేడన్న అహం అప్పుడే ఎక్కేసింది. ప్రవహించే నీళ్ళలో ఈత కొట్టడం ప్రమాదమని నాన్న రెండేళ్ళ క్రితం వాడ్ని మందలించినప్పటినుండి వాడిలో పట్టుదల పెరిగింది.
అలాగని వాడు నాన్న మాటని ధిక్కరించి ఏమైనా చేసే పిల్లాడు కాదు. నాన్న గిరి గీస్తే దాన్ని దాటి బైటికి వచ్చే రకం కాదు. అందుకే నాన్నకు వాడంటే అంతిష్టం.
స్కూల్‌కి వేసవి శెలవలు.. పగలంతా మిగతా పిల్లల్లో కలిసి రకరకాల ఆటలు ఆడి అలసిపోయి పడుకునేవాళ్ళు. ఆదివారం రోజు తమ గల్లీలో ఒకతను మేకను కోసి, మాంసం కుప్పలుగా పెట్టి అమ్ముతుంటే నాన్న కూడా ఓ కుప్ప మాంసం కొని యింటికి తెచ్చాడు. చాలా రోజుల తర్వాత మాంసం కూర తినబోతున్నందుకు తనకూ తమ్ముడికి తెగ సంబరంగా ఉండింది.
పెద్దక్క, అమ్మ కలిసి కూర వండుతున్నారు. ఉడుకుతున్నప్పుడే సట్టి మూత తీసి ఓ ముక్కను తీసుకోబోతున్న తమ్ముడ్ని అమ్మ కసురుకుంది. “ఉడికేవరకు ఆగలేవా? ఏంటా ఆత్రం” అంటూ తిట్టింది. పెద్దక్క జైనాబీ తమ్ముడ్ని వెనకేసుకొస్తూ “పోన్లే అమ్మీ.. మనింట్లో మాంసం కూర వండి రెండు నెలల పైనే అయిందిగా. చిన్న పిల్లాడు కదా.. అది ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసనకే నోరూరి ఉంటుంది. అంతే కదా తమ్ముడూ” అంది.
వాడు సమాధానం చెప్పేలోపల గరిటతో చిన్నముక్క తీసి, చల్లబడేవరకు వూది వాడి చేతిలో వేసింది.
“ఉడక్కుండా పెత్తే అజీర్తి చేస్తుందే” అని అమ్మ అంటున్నా వినకుండా, “ఉడికిందిలేమ్మా.. లేత మాంసం కదా.. తొందరగానే ముక్క మెత్తబడింది” అంటూ మరో ముక్క తీసి వూది తనక్కూడా పెట్టింది.
మాంసం ముక్కని నోట్లో వేసుకుని నముల్తూ ఆడుకోడానికి బైటికి పరుగెత్తుతుంటే నాన్న ఆపేశాడు. “ఈ రోజు శుక్రవారం అనే విషయం మర్చిపోయారా? మసీదుకెళ్ళి నమాజ్ చేయాలి. పదండి” అన్నాడు.
“మాంసంకూర వేసుకుని రోటీ తినేశాక అసర్ నమాజ్‌కి వస్తాం నాన్నా” అన్నాడు తమ్ముడు.
“అలా కుదర్దు. జుమ్మేకీ నమాజ్ తప్పకుండా చేయాలి. పదండి. మనం వచ్చేలోపల వంట పూర్తయి ఉంటుంది” అన్నాడు.
తమ్ముడు ఓ క్షణం ఆలోచించి “సరే. ఓ షరతు మీద వస్తాను. నన్ను షింగో నదిలో కొద్దిసేపు ఆడుకోనివ్వాలి” అన్నాడు.
“నీళ్ళలో ఆడుకోవటం ఏమిట్రా… మునిగిపోయి కొట్టుకుపోతారా” అన్నాడు విసుగ్గా నాన్న. “అంత లోతుండదు నాన్నా. నా నడుం వరక్కూడా రావు నీళ్ళు” అన్నాడు తమ్ముడు.
వాడు చెప్పింది నిజమే. నాన్న భయమే అర్థం లేనిది. ఈ వూరి నుంచి బ్రోల్మో కెళ్ళే దారిలో కన్పించే నది ఓ చోట చాలా పల్లంగా ప్రవహిస్తూ ఉంటుంది. లోపలంతా నల్లటి రాళ్ళు నీళ్ళ పైకి పొడుచుకొచ్చి కన్పిస్తుంటాయి. కొంత దూరం వెళ్ళాక లోతు పెరిగి ఓ కొండను ఆనుకుని ప్రవహిస్తుంది. అక్కడ యిటువైపు గట్టు కూడా చాలా ఎత్తుగా ఉండటం వల్ల ఆ నీళ్ళలోకి దిగడం కూడా వీలు కాదు. నది వెడల్పు ఎక్కువ ఉండదు. సాయంత్రాలు నాన్నతో కలిసి వెళ్ళి కూచునే చోట నది వెడల్పు మూడు నాలుగు బారలకు మించి ఉండదు.
తను తమ్ముడి కోరికను బలపరుస్తూ అదే మాట నాన్నతో అన్నాడు.
నాన్న ఏమనుకున్నాడో ఏమో “సరేరా.. జాగ్రత్త.. అన్న చేయి పట్టుకుని దిగు. ఓ రెండు మూడు నిమిషాలు మించి నీళ్ళలో ఉండకూడదు. సరేనా” అన్నాడు.
“నాకు నీళ్ళంటే భయం.. నేను దిగను” అన్నాడు తను.
“మగ పిల్లాడివై ఉండి నీళ్ళంటే భయమంటే ఎలారా? అలాగైతే బషీర్ కూడా నీళ్ళలోకి దిగడానికి వీల్లేదు” అన్నాడు నాన్న.
బషీర్ తనని బతిమాలుకోసాగాడు. “అన్నా.. నా కోసం.. ఈ ఒక్కసారికి.. నీకు భయం వేయకుండా నేను చేయి పట్టుకుంటాగా.. సరే అను.. సరే అను” అంటూ వత్తిడి చేశాడు.
తనకు సరే అనక తప్పలేదు.
షింగో నది నీళ్ళలో ఆడుకోడానికి అనుమతి లభించడంతో బషీర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఉడుకుతున్న మాంసం కూరని కూడా మర్చిపోయి తన కన్నా, నాన్న కన్నా నాలుగడుగులు ముందు నడవసాగాడు.
నది గట్టున ఎప్పుడూ కూచునే రాళ్ళ సముదాయం దగ్గర బషీర్ నిలబడిపోయాడు. నాన్న వాడిని దాటిపోతూ “ఇప్పుడు కాదు. నమాజ్ చదివి తిరిగొచ్చేటపుడు నీళ్ళలోకి దిగుదువుగానీ” అన్నాడు.
‘నమాజ్‌కి చాలా సమయం ఉంది నాన్నా.. నీళ్ళలో దిగి ఆడుకోడానికి నువ్విచ్చింది ఐదు నిమిషాలేగా. యిట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తాం” అన్నాడు తమ్ముడు.
వాడి ఉత్సాహం చూసి నాన్న నవ్వుతూ “సరే. తొందరగా రావాలి మరి. నేనిచ్చింది ఐదు నిమిషాల సమయం కాదు.. రెండు నిమిషాలే” అన్నాడు.
బషీర్ తన చేయి పట్టుకుని “అన్నా.. పరుగెత్తు” అంటూనే నీళ్ళ వైపుకు పరుగెత్తాడు.
నీళ్ళు చల్లగా ఉన్నాయి. మొదట భయంగా ఉండినా లోపలికి రెండడుగులు వేయగానే హాయిగా అన్పించింది. అక్కడ ఎవరో ఉదారంగా చల్లినట్టు రాళ్ళు కన్పిస్తున్నాయి. నీళ్ళు రాళ్ళని వొరుసుకుంటూ సన్నగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి. మరికొంత ముందుకెళ్ళగానే నీళ్ళు మోకాళ్ళ లోతు వరకూ వచ్చాయి.
“రాళ్ళను దాటి ముందుకెళ్ళాద్దు” అంటూ వెనకనుంచి నాన్న అరుస్తున్నాడు.
(ఇంకా ఉంది)