Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-17

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ప్ర[/dropcap]వాహ వేగాన్ని తట్టుకోలేక పడిపోయినా రాళ్ళని ఆసరాగా చేసుకుని కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చని నాన్న ఆలోచన..

బషీర్ తన చేయి వదిలి పెట్టి మరికాస్త ముందుకెళ్ళాడు. “వద్దురా తమ్ముడూ.. అక్కడ లోతు ఎక్కువుంటుంది” అని తను హెచ్చరిస్తున్నా వినకుండా లోపలికెళ్ళి ప్రవాహ వేగానికి వ్యతిరేక దిశలో ఈదసాగాడు.

నాన్న కంగారుపడ్తూ ఒడ్డు వరకూ వచ్చి “ఒరేయ్.. వద్దురా.. బైటికొచ్చేయరా” అని అరవసాగాడు.

బషీర్ ఈదడంలో మునిగిపోయి నాన్న అరుపుల్ని పట్టించుకోలేదు. కష్టంగా ప్రవాహ వేగానికి ఎదురీదుతున్నాడు. అతను ఒకడుగు ముందుకు వెళ్తే నీళ్ళు అతన్ని రెండడుగులు వెనక్కి నెడ్తున్నాయి. మళ్ళా కసిగా ముందుకు ఈదుతున్నాడు.

చూస్తూ ఉండగానే ప్రవాహ వేగం పెరిగింది. దానికి వ్యతిరేక దిశలో ఈదలేకపోతున్నాడు. కొద్దిసేపటికే బాగా అలసిపోయినట్టు కన్పించాడు.

“తమ్ముడూ.. ఈ రాళ్ళ వైపుకు ఈదుకుని వచ్చేయి” అన్నాడు తను. అప్పటికే నాన్న కూడా భయపడ్తూ నీళ్ళలోకి దిగి రాళ్ళ దగ్గరకొచ్చేశాడు. బషీర్ పక్కకు తిరిగి నీటి ప్రవాహానికి అడ్డంగా ఈదడానికి ప్రయత్నించి, విఫలమై నీళ్ళలో కొట్టుకుపోసాగాడు.

తను పెద్దగా “తమ్ముడూ.. వెనక్కి ఈదుకుని రారా” అంటూ అరిచాడు. బషీర్ ప్రయత్నించాడు గానీ నీటి వేగానికి తట్టుకోలేక యింకా లోతైన నీళ్ళ వైపుకి జారిపోసాగాడు.

వెంటనే నాన్న నీళ్ళలోకి దూకి వేగంగా ఈదుకుంటూ వెళ్ళి తమ్ముడ్ని చేరుకున్నాడు. ప్రవాహ దిశగా ఈదడం వల్ల తొందరగా తమ్ముడ్ని చేరుకుని వాడిని ఒకచేత్తో ఒడిసి పట్టుకుని ప్రవాహానికి వ్యతిరేక దిశలో తిరిగి ఈదసాగాడు. ఒకచేత్తో ఈదడం కష్టమనిపించి “బషీర్.. నువ్వు నా నడుం దగ్గర గట్టిగా పట్టుకో. వదలకు” అన్నాడు. బషీర్ అతన్ని గట్టిగా వాటేసుకున్నాక రెండు చేతుల్తో ఈదసాగాడు.

నీళ్ళు వెనక్కి నెట్టడం, నాన్న ముందుకి ఈదడం.. మళ్ళా నీళ్ళు వెనక్కి నెట్టడం.. మొదట్లో నాన్న కొద్దికొద్దిగా నీటి ప్రవాహ దిశలో వెనక్కి వెళ్తున్నట్టు కన్పించింది. నాన్న మొహంలో పట్టుదల.. అంత బలంగా నాన్నా ఈదగలడని తను కలలో కూడా వూహించలేదు. బలాన్నంతా ప్రయోగించి నాన్న ఈదుతున్నాడు. మరికొద్ది సేపటి తర్వాత నీళ్ళు వెనక్కి నెడ్తున్న వేగం, నాన్న ముందుకు ఈదుతున్న వేగం సమానమై నాన్న ఒకే స్థలంలో నిలబడిపోయినట్టు కన్పించాడు.

తను చాలా భయపడిపోయాడు. నాన్న క్షేమంగా తమ్ముడ్ని తీసుకుని బైటికి రాగలడా లేక తమ్ముడి తోపాటు నాన్న కూడా నీళ్ళలో కొట్టుకుని పోతాడా?

‘యా అల్లా’ అంటూ నాన్న పెద్దగా అరిచి మరింత బలంగా కాళ్ళతో చేతుల్తో నీళ్ళ మీద బాదసాగాడు. కొద్దిసేపటి తర్వాత నాన్న రెండడుగులు ముందుకు వచ్చాడు. అదే వూపుతో నాన్న శక్తినంతా ఉపయోగించి ఈదసాగాడు. మరికొంత ముందుకు రావడంతో లోతు తగ్గి ప్రవాహ ఉధృతి తగ్గింది. మరో పది నిమిషాల్లో తను నిలబడి ఉన్న రాళ్ళ దగ్గరకు చేరుకుని బషీర్‌ని ఓ రాతిమీద కూచోబెట్టి తను కూడా ఓ రాతి మీద ఒరిగిపోయి ఆయాసం తీర్చుకోసాగాడు.

కొద్దిసేపు ఆయాసం తీర్చుకున్నాక తనూ నాన్న బషీర్‌ని రెండు వైపులా పట్టుకుని ఒడ్డుకి తీసుకొచ్చారు. నాన్న వాడ్ని వదిలేసి అక్కడే నేల మీద పడిపోయి ఆకాశం వైపుకు చూస్తూ “యా అల్లా.. పర్‌వర్ దిగార్.. తేరా లాఖ్ లాఖ్ షుకర్.. నా కొడుకు ప్రాణాల్ని కాపాడావు” అన్నాడు.

తీరంలో ఉన్న రాళ్ళ గుట్టల మీద నాన్నా తమ్ముడు పావు గంట వరకూ అలా పడుకునే ఉండిపోయారు. తర్వాత నాన్న లేచి తమ్ముడ్ని కూడా లేపి కూచోబెట్టాడు. ఇప్పుడు నాన్న తప్పకుండా బషీర్‌ని చెడా మడా తిడ్తాడనుకున్నాడు తను. కానీ నాన్న వాడ్ని పల్లెత్తు మాట అన్లేదు.

“ఈ రోజు చాలా మంచి రోజు. పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాం. అందుకు మనం అల్లాకు కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి” అన్నాడు నాన్న.

“మసీద్ కెళ్ళి నమాజ్ చేద్దాం నాన్నా” అన్నాడు తను.

“సమయం దాటిపోయిందిరా. యిక్కడే నమాజ్ చేద్దాం” అంటూ నాన్న నది నీళ్ళతో వజూ చేసుకుని అక్కడే పొడిగా, శుభ్రంగా ఉన్న స్థలం చూసి, నమాజ్ చదివాడు. తనూ తమ్ముడు కూడా అతని పక్కనే నిలబడి నమాజ్ చదివారు.

ఇది జరిగాక బషీర్ మళ్ళా ఎప్పుడూ షింగో నదిలో ఈత కొట్టాలని ప్రయత్నించలేదు.

ఆలోచనల్లోనే షరీఫ్ బ్రోల్మో వూరు చేరుకున్నాడు. అతనికి ఎదురుపడిన వాళ్ళంతా “సలాం వలేకుం షరీఫ్ భాయ్” అంటూ అభివాదం చేశారు. అందరూ తెల్సిన వాళ్ళే. అందులో సగం మంది బంధువులే. చిన్న వూరు కావడం వల్ల అపరిచితులంటూ ఎవరూ లేరు. వాళ్ళకు “వలేకుం అస్సలాం” అంటూ ప్రత్యభివాదం చేస్తూ షేక్ అలీ మసీదు వైపుకు సాగిపోయాడు.

అతను మసీదు చేరుకునేటప్పటికి సమయం పన్నెండు కావస్తోంది. మసీదులోపల పరిచి ఉన్న చాపల మీద పది పన్నెండు మంది కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రవేశద్వారానికి కుడివైపున వరుసగా నాలుగు కుండల్లో నీళ్ళు పెట్టి ఉన్నాయి. షరీఫ్ చెంబుతో నీళ్ళు ముంచుకుని వజూ చేసుకుంటున్నప్పుడు ముఅజ్జిన్ లేచి ఎత్తుగా కట్టిన సిమెంటు దిమ్మ మీద నిలబడి ఆజా విన్పించాడు.

షరీఫ్ లోపలికెళ్ళి అక్కడ కూచుని ఉన్న వాళ్ళందరికీ సలాం చెప్పి కూచున్నాడు.

“ఏమిటీ విషయాలు షరీఫ్ భాయ్.. మీ చిన్న కూతురు ఆస్‌మా ఎలా ఉంది? నా బీబీ కూడా కలవరిస్తోంది. ఆస్‌మా‌ని చూసి చాలా రోజులైంది కదా.. ఓ సారి పిల్చుకు రాకూడదూ” అన్నాడు లతీఫ్.

లతీఫ్, షరీఫ్ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. షరీఫ్ ఎనిమిదో తరగతితో చదువు ఆపేస్తే లతీఫ్ ఏడు తర్వాత చదువుకు స్వస్తి పలికాడు. స్కూల్ మానేసినా వాళ్ళ స్నేహం మాత్రం నిరాటంకంగా కొనసాగింది.

షరీఫ్ నవ్వి “బాగా అల్లరి చేస్తోంది లతీఫ్. వాళ్ళమ్మ విసుక్కుంటుంది కానీ నాకు దాని అల్లరి చాలా ఇష్టం తెలుసా” అన్నాడు.

“పిల్లలు అల్లరి చేస్తేనే ముద్దు.. నా బీబీకి కూడా ఆస్‌మా అంటే చాలా ఇష్టమని నీకు తెలుసుగా. భయ్యానడగండి పాపను మనకు దత్తతకిస్తారేమో అంటూ ఉంటుంది” లతీఫ్ నవ్వుతూ అన్నాడు.

“అమ్మో.. దత్తత ఇవ్వడమా? దాన్ని చూడకుండా నేను బతగ్గలనా? అది నా ప్రాణం.”

“మాకు ముగ్గురూ కొడుకులేగా షరీఫ్.. కనీసం ఒక్కతైనా అమ్మాయి ఉంటే బావుండేదండీ అంటూ బాధపడ్తో ఉంటుంది నా భార్య. మీ ఆస్‌మాని చూసినపుడల్లా తనకు తల్లి ప్రేమ పొంగుకొస్తుందట.”

“ఓ పని చేద్దాం.. నీ ముగ్గురు కొడుకులు మా ఆస్‌మా కంటే పెద్దవాళ్ళేగా.. ఏదో ఓ కొడుక్కి నా కూతురో పెళ్ళి చేసి కోడలిగా యింటికి పట్టుకెళ్ళు, మీ ఆవిడ కోరికా తీరుతుంది. నీ యింట్లో నా కూతురూ సుఖపడ్తుంది.”

“పవిత్రమైన మసీదులోపల కూచుని ఎంత చల్లటి మాట చెప్పావు షరీఫ్. అంతకన్నా మాకు అదృష్టం ఏముంటుంది చెప్పు.. మనం వియ్యంకులమైతే మన స్నేహం మరింత బలపడుంది. గుర్తు పెట్టుకో. మాటిచ్చావు. నీ మూడో కూతురు మా యింటికి కాబోయే కోడలు” అన్నాడు లతీఫ్.

“రిస్తా పక్కా లతీఫ్. నీ కొడుకే నా అల్లుడు. ఐతే ముగ్గురిలో ఏ కొడుకో యిప్పుడే నిర్ణయించుకుంటే మంచిది.”

“ఆస్‌మా ఆకాశంలా చాలా అందంగా ఉంటుందని కదా నువ్వు ఆ పేరు పెట్టావు. నా రెండో కొడుకు బావుంటాడు. తన అందానికి సరితూగే అందం వాడిది. యిప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాడే నీ అల్లుడు”

“ఈన్షా అల్లా..” అన్నాడు షరీఫ్.

నమాజ్ చేసే సమయం అయిందని ఎవరో చెప్పడంతో అందరూ లేచి నాలుగు వరసల్లో నిలబడ్డారు. నమాజ్ పూర్తయ్యాక లతీఫ్ షరీఫ్ చేయి పట్టుకుని “పద మా యింటికెళ్లాం. ఆస్‌మా తన కోడలు కాబోతుందన్న శుభవార్త నీ నోటి ద్వారా వింటే నా బీబీ చాలా సంతోషపడుంది” అన్నాడు.

షరీఫ్‌కి తొందరగా యింటికెళ్ళాలని ఉంది. తన పెద్దక్క జైనాబీ వాళ్ళ యింటికెళ్ళి కూడా మూడు రోజులు కావస్తోంది. అక్క కలవరిస్తో ఉంటుంది. మూడు రోజులైనా ఎందుకు రాలేదో అని కలవరపడ్తో ఉంటుంది. అక్క వాళ్ళింటికెళ్ళి పది నిమిషాలైనా కూచుని తమ వూరెళ్ళిపోవాలని అనుకున్నాడు. యిప్పుడేమో లతీఫ్ తన యింటికి రమ్మని బలవంతం చేస్తున్నాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ వాళ్ళ యిళ్ళు ఒకే గల్లీలో కూడా ఉండవు. అలా దగ్గరగా ఉంటే సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. తన అక్క యిల్లు వూరికి ఈ చివరుంటే లతీఫ్ యిల్లు ఆ చివరుంటుంది.

“మరోసారి వస్తాలే లతీఫ్. అక్కను చూసి మూడు రోజులైంది. నీకు తెలుసుగా.. మా బావ మిలట్రీలో పని చేస్తాడని. ఏడాదికో సారి వస్తాడు. అంతే. యింట్లో అంతా ఆడవాళ్ళే.. మా అక్కా.. తన ఇద్దరు ఆడపిల్లలు… బైటి పనులేమైనా ఉంటే నేనే చూసుకుంటాను. ఆడపిల్లల్ని బైటికి పంపలేం కదా” అన్నాడు.

“నేను నీతో చాలాసార్లు చెప్పాను గుర్తుందా.. బైటి పనులేమైనా ఉంటే అక్క నాకు చెప్పొచ్చుగా.. ఎందుకు యిబ్బంది పడటం… నీకైనా యిబ్బందేగా ఆ వూరినుంచి ఈ వూరికొచ్చి పనులు చేయాలంటే” అన్నాడు లతీఫ్.

“మా అక్కకు మొహమాటం ఎక్కువ. బైటి వాళ్ళ చేత పనులు చేయించుకోవడం యిష్టముండదు. దానికి తోడు యింట్లో వయసొచ్చిన ఆడపిల్లలున్నారు కదా.. గోషా ఉంటుంది. పోనీ మన యిళ్ళేమైనా నాలుగైదు గదులుండే బంగళాలా? ఒకట్రెండు గదుల యిళ్ళేగా.. అందులోనే ఓ మూల పొయ్యి పెట్టుకుని వంట చేసుకుంటూ లాక్కొస్తున్న సంసారాలేగా మనవి.”

(ఇంకా ఉంది)

Exit mobile version