[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“అ[/dropcap]లా అంటావేమిటి షరీఫ్? నేనేమైనా పరాయివాడ్నా? మన చిన్నప్పుడు నేను మీ యింటికి ఎన్ని సార్లు రాలేదూ.. ఎన్నిసార్లు నీకూ నాకూ అక్క రోటీలు వడ్డించలేదూ. నువ్వెంతో అక్కకి నేను కూడా అంతే.”
“నిజమే అనుకో.. మన మధ్య అనుబంధం ఎలాంటిదో మనకు తెలుసు.. బిరాదరీకి తెలియదుగా. నువ్వు అక్క వాళ్ళింటికి వస్తూపోతూ ఉంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని అక్క భయం.”
లతీఫ్ కొన్ని క్షణాలు ఆలోచించి “సమాజం చాలా క్రూరమైంది కదా. మనుషుల గురించి చెడు ఆలోచనలే ముందొస్తాయి దానికి. సరే కానీయ్. మా యింటికి మాత్రం రాక తప్పదు. మీ వూరెళ్ళి కూడా చేసే అత్యవసర పనంటూ ఏం ఉంది చెప్పు? బహెన్ వండిందేదో తినేసి పొలానికెళ్ళడటమేగా” అన్నాడు.
“ఈ రోజు మీ బహెన్ చేపల పులుసు చేసింది.”
“ఓ అందుకా తొందర? చేపల పులుసు చల్లబడే కొద్దీ దాని రుచి పెరుగుతుంది. కొద్దిగా ఆలస్యమైతే ఏమీ కాదులే” అంటూ భుజం మీద చేయివేసి తన యింటి ముఖం పట్టాడు.
“అందుక్కాదు. నేను వెళ్ళేవరకు ఆస్‌మా ఏమీ తినదు” మెల్లగా నసిగాడు షరీఫ్.
“ఒకసారి నా బీబీకి కన్పించి వచ్చేద్దువుగానీ.. ఎక్కువ సేపు పట్టదు. మా యింట్లో ఈ రోజు మేక తలకాయ కూర. ఐనా నిన్ను భోంచేయమని అడగనులే” అంటూ నవ్వాడు లతీఫ్.
షరీఫ్‌కి వెళ్ళక తప్పలేదు. లోపల మాత్రం భయంగానే ఉంది. ఆలస్యమైతే హసీనా ఎలా కోప్పడుతుందో తనకు తెలుసు. “ఎందుకంత మొహమాటం… రాను అని ఖచ్చితంగా చెప్తే తల తీసి ఏమైనా మొలేస్తారా.. మీకు కావాలనుకున్నది కావల్సిందేనని, మీరు వద్దనుకున్నది వద్దని ఎందుకు చెప్పరు? యింత మొహమాటమైతే ఎలా బతుకుతారు? మీ మెతకదనం మనకు కాబోయే అల్లుళ్ళకు తెల్సిందా మిమ్మల్ని ఓ ఆట ఆడిస్తారు” అంటుంది.
హసీనా అలా అన్నప్పుడల్లా ఆస్‌మా “మా అబ్బాజాన్‌ని అలా ఆడిస్తే చూస్తూ వూర్కుంటామా? మేమూ వాళ్ళ ముక్కుకి తాడేసి ఓ ఆట ఆడిస్తాం. అవును కదా దీదీ” అంటుంది తన పెద్దక్క వైపు చూస్తూ..
లతీఫ్ తన భార్యతో తనకూ షరీఫ్‌కి మధ్య మసీదులో కుదిరిన ఒప్పందం గురించి చెప్పగానే ఆమె చాలా సంతోషపడింది.
“ఆస్‌మా మా యింటికి కోడలుగా వచ్చినా తనని మా కూతురిలానే చూసుకుంటాం భాయీజాన్” అంది షరీఫ్‌తో.
అతను తొందరగా హుందర్మోకి తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పినా వినకుండా “యింత తీయని కబురు చెప్పిన మీ నోటిని తీపి చేయకుండా పంపేదే లేదు” అంది.
లతీఫ్ నిస్సహాయంగా మిత్రుని వైపు చూసి “నా మాట చెల్లేలా లేదు” అంటూ చేతులెత్తేశాడు.
“ఈ రోజుకి వదిలేయ్ బహెన్. రేపు తప్పకుండా వస్తాను. మీ యింట్లో భోజనం కూడా చేస్తాను. సరేనా” అన్నాడు షరీఫ్.
“సరే. రేపు భోజనం చేద్దురుగాని.. ఇప్పుడు తీపి తినిపొండి. సేమ్యా పాయసం చేస్తాను. పది నిమిషాలు కూడా పట్టదు” అందామె.
మళ్ళా అతనిలోని మొహమాటమే గెలిచింది. మొహమాటమా మెతకదనమా… రెండూ ఒకటేనేమో లేక రెండు బలహీనతలూ తనలో ఉన్నాయేమో అనుకున్నాడు షరీఫ్.
లతీఫ్ ముగ్గురు మగపిల్లలు షరీఫ్‌కి సలాంలు చెప్పారు. అందులో రెండో పిల్లవాడు హనీఫ్ సలాం చెప్తున్నప్పుడు అతని వైపు శ్రద్ధగా చూశాడు.
పిల్లవాడు ఈ వయసులోనే మంచి ఎత్తుగా ఉన్నాడు. వాళ్ళ నాన్నలా పొడగరి అవుతాడనిపించింది. విచ్చుకున్న తెల్లకలువల్లాంటి పెద్ద కళ్ళు, కోటేరుముక్కు. పెదవుల మీద తీయటి చిర్నవ్వు.. పాలమీగడ లాంటి వొంటి రంగు.. నా కాబోయే అల్లుడు అందగాడే అనుకున్నాడు తృప్తిగా…
సేమ్యా పాయసం చేయడం పూర్తయ్యాక, వేడిగా ఉందని చెప్పి, దాన్ని చల్లబర్చడానికి వెడల్పాటి కంచంలో వేసి, విసనకర్రతో విసిరి, చల్లబడ్డాక ఓ పింగాణీ గిన్నెలో వేసి షరీఫ్ చేతికిచ్చింది.
అంత వద్దని చెప్పి, అందులోంచి సగం తీసేసి మిగిలిన సగం పాయసాన్ని జుర్రుకుంటూ తాగాడు షరీఫ్. తర్వాత వాళ్ళనుంచి వీడ్కోలు తీసుకుని అక్క జైనాబీ యింటికి చేరుకున్నాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం ఒంటిగంట…
తమ్ముడు రావడం చూసి జైనాబీ చాలా సంతోషపడింది. “మూడు రోజుల తర్వాత గుర్తుకొచ్చిందా ఇక్కడో అక్క నీ రాకకోసం ఎదురుచూస్తో ఉంటుందని” అంది చిరుకోపంగా.
షరీఫ్ ఇబ్బందిగా మొహం పెట్టి “వూళ్లో చేయాల్సిన పనులు చాలా ఉంటేనూ..” అంటూ నసిగాడు.
“సర్లె. మొదట కాళ్ళూ చేతులు కడుక్కుని రా .. భోంచేద్దువుగాని” అంది.
“లేదక్కా. యింటికెళ్ళాలి. నేను వెళ్ళేవరకు ఆస్‌మా మెతుకు ముట్టదు” వసారాలో వాల్చి ఉన్న మంచంమీద కూచుంటూ అన్నాడు.
“మామూ.. ఎప్పుడొచ్చావు? నీ కోసం ఎలా ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంది లోపలినుంచి వచ్చిన అనీస్.
“మొదట మామూకు గ్లాసుతో మంచినీళ్ళివ్వు.. ఎండన బడొచ్చాడు” అంది జైనాబీ.
ఆ అమ్మాయి నీళ్ళు తీసుకురావడానికి లోపలికెళ్ళాక “బావ మాకు దూరంగా ఎక్కడో ఉంటాడని తెల్సికూడా మమ్మల్ని నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పు.. ఇద్దరూ ఆడపిల్లలాయె. నీ రాకకోసం అనీస్ ఎలా కలవరిస్తుందో తెలుసా?” అంది.
“నాకు గుర్తుందక్కా. వద్దామనే అనుకున్నా.. కానీ వీలుపడలేదు. మాఫ్ కర్నా” అన్నాడు. అనీస్ తెచ్చిచ్చిన మంచినీళ్ళు తాగాక “తొందరగా యింటికెళ్ళాలి. రేపు తప్పకుండా వస్తాను. రోజూ వీలు కాకున్నా రోజు మార్చి రోజు తప్పకుండా వస్తా అక్కా” అన్నాడు లేచి నిలబడుతూ.
“అదేంటి మామూ.. ఇప్పుడేగా వచ్చావు. అప్పుడే వెళ్తావా? నీతో బోలెడు కబుర్లు చెప్పాలని అనుకున్నానే” అంది అనీస్.
“మామూ యింటికెళ్ళే భోజనం చేస్తాడటలేవే. యిప్పటికే ఆలస్యమైంది. వెళ్ళనీ. రేపొస్తానన్నాడుగా” అంది జైనాబీ.
తమ్ముడితో పాటు యింటి బైటికొచ్చాక “పిల్లలిద్దరికీ సంబంధాలు చూడాల్సిన బాధ్యత నీదేరా తమ్ముడూ. మిలట్రీలో వద్దండీ అంటే వినకుండా మీ బావ పాకిస్తాన్ సైన్యంలో చేరిపోయాడు. మొన్నటి యుద్ధంలో ఎంత భయపడ్డానో తెలుసా? ఏదైనా జరక్కూడనిది జరిగితే నాగతేం కాను.. పిల్లల గతేం కాను? పిల్లలిద్దరికీ తొందరగా పెళ్ళి చేసి అత్తారిళ్ళకు పంపితే నాకింక దిగులుండదురా తమ్ముడూ” అంది.
“యింకా సమయం ఉందిలే అక్కా. అనీస్ పెళ్ళి, ఆస్‌మా పెళ్ళి ఒకేసారి చేసేద్దాం. ఆస్‌మా కంటే అనీస్ ఓ ఏడాది పెద్దది. అంతేగా”
“ఎక్కువ సమయం ఏమీ లేదురా. అనీస్ కిప్పుడు పదకొండేళ్ళు. పెద్దదానికి పధ్నాలుగు. మొదట దానికి పెళ్ళి చేయాలిగా. ఇప్పటినుంచే సంబంధాలు చూస్తుంటే ఓ ఏడాదిలోపల దాని పెళ్ళి చేసేయవచ్చు. అనీస్‌కి యింకా మూడు నాలుగేళ్ళ సమయం ఉంటుంది” అంది.
“సరే అక్కా.. అలానే సంబంధాలు వెతుకుతానే… నువ్వు కూడా చుట్టుపక్కల అమ్మలక్కలకు చెప్పి పెట్టి ఉంచు” అన్నాడు.
తిరిగి యింటి వైపుకు నడుస్తూ అక్క పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించాడు. అతనికి పెద్ద పిల్ల కన్నా అనీస్ అంటేనే ఇష్టం ఎక్కువ. ఎలాగూ ఆస్‌మాని లతీఫ్ కొడుక్కిచ్చి చేయాలన్న నిర్ణయం జరిగిపోయింది కాబట్టి అనీస్ కోసం హుందర్మోలోనే మంచి కుర్రాడిని చూసి నిఖా చేయడం మంచిదనుకున్నాడు. నమాజ్ కొచ్చినపుడల్లా తన కూతురు ఆస్‌మాని చూసుకోవచ్చు. వూళ్లో ఉన్నప్పుడు అనీస్ బాగోగులు చూసుకోవచ్చు. ఏదేమైనా మొదట అనీస్ అక్క ఆలియా కోసం సంబంధాలు వెతకాలని నిర్ణయించుకున్నాడు.
యింటికి చేరేటప్పటికి ఒకటిన్నర.. హసీనా చెంబుతో నీళ్ళు అందిస్తే మొహమూ కాళ్ళూ చేతులు కడుక్కుని, భోజనానికి పీట మీద కూచోబోతూ “అమ్మా నాన్న తిన్నారా? పిల్లలు తిన్నారా?” అని అడిగాడు.
“అందరూ తిన్నారు ఒక్క మీ ముద్దుల కూతురు ఆస్‌మా తప్ప” అందామె.
గోడకానుకుని కూచుని ఉన్న అమా వైపు లాలనగా చూస్తూ “ఎందుకు తిన్లేదు బంగారు తల్లీ.. చూడు ఎంతాలస్యమైందో” అన్నాడు.
“మీతో కలిసి తిందామని ఎదురుచూశాను అబ్బాజాన్.. మీకు తెల్సుగా మీరు లేకుండా అన్నం ముట్టనని. మీరే ఆలస్యం చేశారు” అంది.
“ఇలాగైతే ఎలా తల్లీ… మగాళ్ళకి బైట సవాలక్ష పన్లుంటాయి. అన్నీ చక్కబెట్టుకుని రావాలి కదా. ఒక్కోసారి ఆలస్యమౌతుంది. అప్పుడు ఎదురుచూడకుండా తినేయాలి.”
“నేనలా తినలేను అబ్బాజాన్..”
“ఆకలిని చంపుకోకూడదు తల్లీ… సరే. తొందరగా వచ్చి పీట వాల్చుకుని కూచో” అన్నాడు.
“నేను మీ మీద అలిగాను నాన్నా.. నాకీ పూట అన్నం వద్దు” అంది ఆస్‌మా బుంగమూతి పెట్టి.
“ఎందుకు తల్లీ.. నేనేం తప్పు చేశాను? మీ అత్త జైనాబీ యింటికెళ్ళాల్సి వచ్చింది. దానివల్లనే కొద్దిగా ఆలస్యమైంది.”
“మీరు నాతో ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి. దునియాలో నాకన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవ్వరూ లేరని కదా చెప్పారు. మీకోసం నేను అన్నం తినకుండా ఎదురుచూస్తానని తెల్సుకదా. మరి నాకన్నా మీకు అత్తతో మాట్లాడటం ముఖ్యమైపోయిందా?”
(ఇంకా ఉంది)