రెండు ఆకాశాల మధ్య-19

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]భ[/dropcap]ర్త పక్కనే మరో పీట వేసి, దాని ముందు కంచం పెట్టి, రెండు కంచాల్లో పరోటాలు, చేపల పులుసు వడ్డిస్తున్న హసీనా అందుకుంది. “మీ అత్త కాదే ముఖ్యం. ఆవిడగారి చిన్న కూతురుందిగా. అనీస్.. దాన్ని చూడకుండా ఈయన ఉండలేడుగా. ఇప్పటికే ఆ వూరెళ్ళి మూడు రోజులైంది. ప్రాణం కొట్టుకుపోయి ఉంటుంది. అనీస్‌తో కబుర్లు చెప్తూ మనల్ని మర్చిపోయి ఉంటాడు.”

“అదేదో తప్పయినట్టు మాట్లాడతావేంటి హసీనా.. అనీస్‌ని దాని చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగినవాణ్ణి. నాకు ఆస్‌మా ఎంతో అనీస్ కూడా అంతే” అన్నాడు షరీఫ్.

“అందుకే నేను అలిగాను. ఇప్పుడే చెప్పారుగా మీకు నేనూ అనీస్ ఇద్దరమూ సమానమే అని” అంది ఆస్‌మా.

షరీఫ్ తల తిప్పి కూతురి వైపు చూశాడు. ఆ అమ్మాయి మొహంలో కోపంతో పాటు బాధ కూడా కన్పిస్తోంది. తను మాట్లాడిన దాంట్లో తప్పు దొర్లిందని అర్థమైంది.

“నా ఉద్దేశం అది కాదు బంగారు తల్లీ. అనీస్‌ని కూడా కూతురిలా చూస్తానని అర్థం తప్ప నా ముద్దుల కూతురిమీద ఎంత ప్రేమ ఉందో తన మీద కూడా అంత ప్రేమ అని అర్థం కాదు.”

“అలా డొంక తిరుగుడు వద్దు. అమ్మే కాదు నేను కూడా గమనిస్తున్నా. మీకు నాకన్నా అనీస్ అంటేనే ఎక్కువ ఇష్టం కదూ” అంది ఆస్‌మా.

“లేదు తల్లీ… నీకన్నా నాకు ఎవ్వరూ ఎక్కువ ఇష్టం కాదు. నువ్వు నా ప్రాణం.”

“నిజంగానా..”

“నిజం తల్లీ.. అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నన్ను నమ్ము” అన్నాడు.

అప్పుడొచ్చింది ఆ అమ్మాయి మొహంలోకి కళ.. నవ్వుతూ వచ్చి పీట మీద కూచుని “చాలా ఆకలేస్తోంది అబ్బాజాన్” అంటూ తినసాగింది.

“ఇప్పుడంటే నీకు చెల్లుబాటవుతుందే. రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తావు? అప్పుడు మీ నాన్న పక్కనుండడుగా, తినకుండా పస్తులుంటావా?” అంది హసీనా.

ఆస్‌మా కొన్ని క్షణాలు తీవ్రంగా ఈ విషయం గురించి ఆలోచించింది. “నాకో విషయం అర్థం కాదు మా.. పెళ్ళయ్యాక ఆడపిల్లలే అత్తారింటికి ఎందుకెళ్ళాలి? అబ్బాయిలే వచ్చి ఉండొచ్చుగా” అంది.

“తప్పమ్మా.. అది ఆచారం. దాన్ని ప్రశ్నించకూడదు. ఆడపిల్లే అత్తారింటికి వెళ్ళాలి. తప్పదు” అన్నాడు షరీఫ్.

“అలాగైతే నాకు పెళ్ళే వద్దు నాన్నా. నేను మిమ్మల్నొదిలి పెట్టి వెళ్ళను. బలవంతంగా పంపినా మిమ్మల్ని చూడకుండా బతకలేను” అంది ఆస్‌మా.

“అవునే.. నీకే మీ నాన్నంటే ప్రేముంది. మాకెవ్వరికీ లేదు. అంతేనా.. మేమందరం అమ్మానాన్నల్ని వదిలి అత్తారింటికి వచ్చిన వాళ్ళమే” అంది హసీనా.

“ఏమో.. మీ అందరి గురించి నాకు తెలియదు. నాకు మా నాన్నంటే ప్రాణం” అంటూ మళ్ళా కొన్ని క్షణాలు ఆలోచించి “ఓ పని చేయవచ్చుగా నాన్నా.. నాకు ఈ వూళ్లోనే సంబంధం చూడండి. అప్పుడు ఇక్కడే ఉండొచ్చుగా” అంది.

“చాల్లేవే నీ ముదిమి మాటలు.. నీ పెళ్ళికి యింకా చాలా సమయం ఉంది. మొదట అక్కల పెళ్ళిళ్ళు కానీ. అప్పుడాలోచిద్దాంలే” అంది హసీనా.

షరీఫ్‌కి కూడా ఆ ఆలోచన నచ్చింది. నిజమే కదా.. ఇదే వూళో సంబంధం చేస్తే పిల్ల తన కళ్ళెదురుగానే ఉంటుంది. తను తొందరపడి లతీఫ్‌కి మాటిచ్చానా అనుకున్నాడు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి గానీ అడుగు ముందుకు వేయకూడదని బలంగా అనుకున్నాడు.

***

జోరాఫాం మీద బాంబుల వర్షం కురిపించినట్టే పాకిస్తాన్ సైనికులు భారతదేశ సరిహద్దులో ఉన్న మరికొన్ని గ్రామాల మీద కూడా కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. చిలికి చిలికి గాలివానగా మారినట్టు సరిహద్దు రేఖ వెంబడి పాకిస్తానీ సైనికులు జరిపిన కాల్పులే భారతదేశానికీ పాకిస్తాన్‌కి మధ్య యుద్ధానికి కారణమైనాయి. అసలీ యుద్ధం మొదలవడానికి మూలకారణం కాశ్మీర్ లోకి తీవ్రవాదుల్ని చొప్పించడానికి పాకిస్తాన్ తలపెట్టిన ఆపరేషన్ జిబ్రాల్టర్. 1962లో చైనాతో జరిగిన యుద్ధం వల్ల దెబ్బతిన్న భారత సైన్యం కోలుకోక ముందే యుద్ధం ప్రకటించి దాన్ని లొంగదీసుకోవచ్చని పాకిస్తాన్ అధినేత జనరల్ ఆయూబ్‌ఖాన్ భావించాడు.

కాశ్మీర్ జనాభాలో ముస్లింలు ఎక్కువ కాబట్టి చొరబాటుదారుల సాయంతో మత భావనల్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించాలని పాకిస్తాన్ వ్యూహం పన్నింది. పందొమ్మిది వందల అరవై ఐదు, ఆగష్ట ఐదవ తారీఖున పాకిస్తాన్‌కు చెందిన దాదాపు ముప్పయ్ వేల దళాలు కాశ్మీరీ ప్రజల్లా వేషాలు మార్చుకుని నియంత్రణ రేఖ దాటి దొంగచాటుగా భారత్ లోకి చొరబడ్డాయి. కానీ స్థానిక కాశ్మీరీలు చొరబాటుదారుల మాయమాటల్ని నమ్మకుండా వాళ్ళ వివరాలను భారత అధికార్లకు అందచేయడంతో పోలీసులు, మిలట్రీ కలిసి వాళ్ళ ఆట కట్టించారు.

పాకిస్తాన్‌కి దీటుగా జవాబు చెప్పే ఉద్దేశంతో భారత దళాలు సరిహద్దు దాటి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌పై దండెత్తాయి. ఆగస్ట్ నెలాఖరు వరకు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ దళాలు తిత్వాల్, ఉరి, పూంఛ్‌లో ముందుకు చొచ్చుకుని వచ్చాయి. భారత దళాలు హాజీపీర్ పాస్ వరకు స్వాధీనపర్చుకున్నాయి. మూడు ముఖ్యమైన పర్వతశిఖరాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అందులో ఒకటి హుందర్మో గ్రామానికి తూర్పు వైపునున్న పర్వతశిఖరం…

పందొమ్మిది వందల అరవై ఐదు, సెప్టెంబర్ ఒకటిన ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ పేరుతో పాకిస్తాన్ సైన్యం ప్రతిదాడికి దిగింది. దీని ముఖ్య ఉద్దేశం జమ్మూలోని అఖ్నూర్‌ని స్వాధీన పర్చుకోవడం. అఖ్నూర్ నుంచే భారతదళాలకు అవసరమైన సామగ్రి సరఫరా అవుతోంది. అఖ్నూర్‌ని తమ హస్తగతం చేసుకుని భారత సైన్యానికి సామగ్రి సరఫరా కాకుండా ఆపాలని పాకిస్తాన్ కుట్ర పన్నింది. పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాలు అత్యాధునికమైనవి. ప్రపంచంలోని ఏ శక్తీ తాము నిర్మించిన పైటాన్ టాంకుల్ని ధ్వంసం చేయలేదు అని అమెరికా ప్రగల్భాలు పలికిన పైటాన్ టాంకుల్ని పాకిస్తాన్ విస్తృతంగా ఉపయోగించడంతో భారత్‌కు అపార నష్టం జరిగింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద ట్యాంకుల మోహరింపు ఈ యుద్ధం లోనే జరిగింది. యిరు సైన్యాలకు చెందిన దాదాపు వెయ్యి ట్యాంకులు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. వాటిలో అధికభాగం పాకిస్తాన్‌కి చెందిన పైటన్ ట్యాంకులే.

అధునాతనమైన, అధిక శక్తివంతమైన పాకిస్తాన్ పైటాన్ ట్యాంకుల్ని భారతదేశంలోని పదాతిదళాలే వీరోచితంగా ఎదుర్కొన్నాయి. హవల్దార్ అబ్దుల్ హమీద్ ఏడు పాకిస్తానీ ట్యాంకుల్ని ధ్వంసం చేశాడు. భారత సైనికులు హస్తగతం చేసుకున్న ట్యాంకుల్ని, బాంబుల దాడితో ధ్వంసం చేసిన ట్యాంకుల్ని భిక్‌విండి అనే గ్రామంలో వరసగా నిల్చోబెట్టి, యుద్ధంలో తాము గెల్చుకున్న ట్రోఫీలుగా వాటిని ప్రదర్శనకు పెట్టింది భారత సైన్యం.

భారత సైన్యం పాకిస్తాన్‌లో భాగమైన ఉత్తర పంజాబ్ మీద దాడికి దిగింది. ఉత్తర పంజాబ్‌ను కాపాడుకోడానికి పాకిస్తాన్ కొంత సైన్యాన్ని కాశ్మీర్ నుంచి ఉపసంహరించి పంజాబ్‌కు పంపించాల్సి వచ్చింది. దాంతో ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ విఫలమైంది. పాకిస్తాన్ సైన్యం అఖ్నూర్‌ని స్వాధీనం చేసుకోలేక పోయింది.

భారతదేశం దాదాపు మూడు వేల మంది సైనికుల్ని కోల్పోతే పాకిస్తాన్ దాదాపు నాలుగు వేల మందిని కోల్పోయింది. యుద్ధంలో భారతదేశం పద్దెనిమిది వందల చ.కి.మీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటే, పాకిస్తాన్ 550 చ.కి.మీటర్ల భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.

పందొమ్మిది వందల అరవై ఐదు, సెప్టెంబర్ పద్నాలుగు..

యింకా యుద్ధం జరుగుతూనే ఉంది..

హుందర్మో గ్రామస్థుల పరిస్థితి అయోమయంలో పడింది. తూర్పున ఉన్న పర్వత శిఖరం భారత సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. పశ్చిమాన ఉన్న శిఖరం పాకిస్తాన్ సైనికుల ఆధీనంలోనే ఉంది. ఈ రెండు పర్వత శిఖరాల మధ్య ఉన్న లోయలో హుందర్మో గ్రామం ఉంది. ఇప్పుడు తమ గ్రామం యింకా పాకిస్తాన్ పాలనలోనే ఉందా లేక భారతదేశం ఆక్రమించుకుందా అనే విషయం ఎవ్వరికీ తెలియటం లేదు.

రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కాల్పులకు భయపడి కొంతమంది ప్రజలు యిళ్ళొదిలి బైటికి రాకుండా, తలుపులు బిడాయించుకుని లోపలే ఉండిపోయారు. మరికొంతమంది దగ్గర్లోని గుహలోకెళ్ళి తల దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ గుహ ముఖద్వారం సన్నగా ఓ మనిషి పట్టేంత వెడల్పుగా ఉన్నా లోపల విశాలంగా ఉంటుంది. ఎటొచ్చీ ఉదయం పూట కూడా లోపల చీకటిగా ఉంటుంది. గాలీ వెల్తురు లేని చీకటి గుయ్యారంలా.. మరో గత్యంతరం లేదు కాబట్టి అందులోకి వెళ్ళి ఉండాలని నిర్ణయించుకున్న గ్రామస్థులు తమతోపాటు వంట సామగ్రిని, వెళ్తురు కోసం లాంతర్లను తీసుకుని బయల్దేరారు.

ఎప్పుడైనా యుద్ధం వస్తే ఆ గుహలోకి దూరి ప్రాణాలు కాపాడుకోవచ్చని మొదట తెల్సుకుంది జావేద్. అతనికి దాదాపు యాభై ఎనిమిదేళ్ళ వయసుంటుంది. కాయకష్టం చేసిన శరీరం కావడంతో ఆ వయసులో కూడా అతనిలో శక్తి సన్నగిల్లలేదు. పొలం పనులకు వెళ్ళడంతో పాటు గొడ్లని మేపుకొచ్చేపని కూడా చేస్తాడు. ఒకరోజు మేత కోసం తోలుకొచ్చిన గొడ్లలో ఓ బర్రెగొడ్డు తప్పిపోయింది. దాన్ని వెతుకుతూ కొండచరియలన్నీ తిరిగే క్రమంలో ఆ గుహ అతని కంటపడింది. లోపల పాములో తేళ్ళో ఉంటాయోమోనని భయపడూనే లోపలికెళ్ళి పరిశీలించాడు. అటువంటివేమీ కన్పించలేదు. లోపల చాలా విశాలంగా ఉండి పై కప్పు ఎత్తుగా ఉండటంతో సునాయాసంగా వందమందికి పైగా అందులో ఉండొచ్చనుకున్నాడు.

వూళ్ళోకి తిరిగొచ్చాక, కన్పించిన ప్రతి ఒక్కరికీ ఆ గుహ గురించి చెప్పటమే కాకుండా మరునాడు నలుగురు యువకుల్ని పిల్చుకెళ్ళి గుహను శుభ్రం చేయించాడు. సరిహద్దురేఖకు దగ్గరగా ఉన్న గ్రామం కాబట్టి యిరుదేశాల మధ్య కాల్పులు మొదలైతే గ్రామస్థులు ఈ గుహలో తలదాచుకోవచ్చని అందరూ అనుకున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here