Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-22

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“యు[/dropcap]ద్ధం ముగిస్తే గానీ చెప్పలేం. ప్రస్తుతానికైతే మనం తటస్థంగా ఉన్నాం లేదా ఇరుదేశాల సైనికుల ఆధీనంలో ఉన్నాం. ఒకవేళ మన గ్రామం భారతదేశంలో కల్సిపోయినా ఏమౌతుంది? అదే అర్జీని లాల్ బహదూర్ శాస్త్రి గారి సన్నిధికి పంపుతాం. అంతేగా” అన్నాడు బుర్హాన్.

“మన అభ్యర్థన వజీరే ఆలం దాకా వెళ్ళనక్కరలేదు. బంకర్లు కట్టించే నిర్ణయం తీసుకోవాల్సిన సంబంధిత అధికారుల దృష్టికి వెళ్తే చాలు. వాళ్ళు పాకిస్తానీ అఫ్సర్‌లా లేక భారతీయ అఫ్సర్‌లా అనే విషయంలో మనకు ఫర్క్ పడదు. ఏ ప్రభుత్వమైనా మనల్ని ఉద్ధరించేదేమీ లేదు. మన కష్టాలు మనకు తప్పవు. యింటి పన్నులు వాళ్ళకు కట్టే బదులు వీళ్ళకు కడ్తాం. మనక్కావల్సింది ప్రశాంతత. ఇలా ప్రాణభయంతో అడవిలోని జంతువుల్లా గుహల్లో దాక్కుని బతికే దుర్భరమైన బతుకులు మనకొద్దు” అన్నాడు జావేద్.

“మన ప్రాణాల్ని కాపాడటం కోసం వీళ్ళు యుద్ధాలు చేయకుండా ఆగుతారని నేననుకోను చిచ్చా. పాకిస్తాన్ ప్రభుత్వానిది భూదాహమే కాదు రక్త దాహం కూడా. గుల్ మొహర్ పువ్వులా కళకళలాడే కాశ్మీర్‌ని ఎర్రటి రక్త పుష్పంలా మార్చేసింది ఎవరు? ఏమాశించి ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసు” అన్నాడు బుర్హాన్.

“పెద్దగా మాట్లాడకు. గుహ గోడలక్కూడా చెవులుంటాయి” అన్నాడు బషీర్.

“వ్యవసాయం చేసుకుంటూ, గొడ్లని కాసుకుంటూ ప్రశాంతంగా బతికే మనకు ఈ రాజకీయాల్లో ఏంటీ సంబంధం? మనం సరిహద్దు రేఖకి దగ్గరగా ఉండటం మనపాలిట శాపమైంది. పిల్లలు తాడుకొసల్ని చెరో వైపు పట్టుకుని లాగే ఆట ఆడ్తారు చూడు. అటువైపు వాళ్ళు బలంగా లాగితే తాడు అటుకి జరుగుతుంది. యిటుకి లాగితే యిటుకి జరుగుతుంది. మన పరిస్థితీ అంతే. అడకత్తెరలో పోక చెక్క” నిస్పృహగా అన్నాడు జావేద్.

అతనికి గుహలో ఉన్న ఆడవాళ్ళ ఇబ్బందులు చూస్తుంటే కంట్లో నీళ్ళూరుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లోనే ఆడవాళ్ళ బతుకుల్లో బోలెడు నిర్బంధాలతో ముడిపడి చాలా కష్టాలుంటాయి. భీతి కలిగిస్తున్న ఇప్పటి యుద్ధ వాతావరణంలో గుహలో బతకడం వాళ్ళకి నరకప్రాయంగా ఉందన్న విషయం అందరికీ అర్థమౌతోంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత…

గుహలో ఉన్నవాళ్ళు స్నానాలు చేసి ఆరు రోజులు.. ఏ కట్టు బట్టల్తో యిళ్ళలోంచి వచ్చేశారో అవే బట్టలు… వంటలు చేసేటపుడు కట్టెల పొగ బైటికెళ్ళడానికి అవకాశం లేక కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. పిల్లలు మరింత ఇబ్బందికి లోనవుతున్నారు.

అన్నిటికీ మించిన కష్టం ఆడవాళ్ళు బహిర్భూమికి వెళ్ళాల్సిన అవసరం.. చీకటి పడేవరకు వేచి ఉండి, లాంతర్లు పట్టుకుని గుహ బైటికి జట్లు జట్లుగా వెళ్ళి వస్తున్నారు. ఆ సమయంలో ఏ వైపు నించి తూటా దూసుకొస్తుందో లేక ఏ బాంబో నెత్తిమీద పడి శరీరాలు ఛిద్రమైపోతాయోనన్న భయంతో కొంతమంది బలవంతంగా ఆపుకుని అనారోగ్యాల బారిన పడున్నారు. ప్రత్యక్ష నరకం అంటే ఇదే అనుకున్నాడతను.

మరునాడు నీళ్ళు తీసుకురావాల్సిన వంతు బషీర్ మీద, బుర్హాన్ మీద పడింది. వూరికి దూరంగా ఉన్న చెరువుకెళ్ళి నీళ్ళు తీసుకురావాలి. నీళ్ళు మోసుకురావడానికి వీలుగా కావడి బద్దలాంటి కర్రకు రెండు వైపులా తాళ్ళు కట్టి, వాటికి బిందెల మూతుల్ని బిగించి కట్టి, గాడిద వీపు మీద కావడి బద్దల్ని మోపి, నీళ్ళు తెస్తున్నారు. కొండ చరియల పైకి బరువులు మోయాల్సి వచ్చినపుడు ఆ వూళ్లో గాడిదల్నే ఎక్కువగా వాడతారు. అందుకే కిందినుంచి కట్టెల మోపులు గుహదాకా మోయడానికి ఓ గాడిదని, నీళ్ళ కోసం మరో గాడిదని వాడుకుంటున్నారు. రోజుకి నాలుగు బిందెల నీళ్ళు తెచ్చినా సరిపోవటం లేదు. అప్పటికీ వంటలో వీలైనంత తక్కువ నీళ్ళు వాడుతున్నారు. గోధుమ పిండి కలపడానికి మాత్రమే నీళ్ళు ఉపయోగిస్తున్నారు. బంగాళా దుంపల్ని ఉడకబెట్టకుండా నిప్పుల్లో కాల్చి రోటీల్లో నంజుకుంటున్నారు. కొన్నిసార్లు పచ్చి ఉల్లిపాయల్తోనే సర్దుకుంటున్నారు.

బషీర్, బుర్హాన్ కావడి బద్దల్ని గాడిద వీపు మీద వేసి, దాని పక్కనే నడుస్తూ మెల్లగా కిందకు దిగసాగారు. ఆ ఎత్తు నుంచి చూస్తే వూళ్లోని యిళ్ళన్నీ కన్పిస్తున్నాయి. మరికొంత దిగి కుడి వైపుకు వెళ్తే వూరొస్తుంది. ఎడం వైపుకు వెళ్తే చెరువొస్తుంది.

“బుర్హాన్.. ఒకసారి వూళ్ళోకి వెళ్ళి మన వాళ్ళని చూసుకుని వద్దామా?” అన్నాడు బషీర్.

“మనం ఇలా ఆరుబయట ఎక్కువ సేపు ఉండటం ప్రమాదం. చెరువుకెళ్ళి నీళ్ళు నింపుకుని వీలైనంత త్వరగా గుహను చేరుకోవటం మంచిది” అన్నాడు బుర్హాన్.

“మా అమ్మానాన్న గుర్తొస్తున్నారు. అన్నా వదిన కూడా.. ఎలా ఉన్నారో.. ఏం తింటున్నారో.. వాళ్ళకూ నీళ్ళు కావాలిగా, ఎవరు తెస్తున్నారో?”

“యింకెవరు? మీ అన్న షరీఫ్ ఉన్నాడుగా. నాల్రోజులకొకసారైనా నీళ్ళు తెచ్చుకోక తప్పదుగా. గొంతు తడుపుకోడానికి గుక్కెడు నీళ్ళయినా లేకపోతే ప్రాణాలు నిలబడవుగా.. మీ యింట్లో పర్వాలేదు. మా యింటి పరిస్థితి తల్చుకుంటే ఏడుపొస్తుంది. నాన్న పక్షవాతంతో మంచంలో ఉన్నాడని తెల్సుగా. అమ్మే వెళ్ళి నీళ్ళు మోసుకురావాలి. అమ్మకు మోకాళ్ళ నొప్పులు” అతని గొంతు బాధతో వణికింది.

“యుద్ధాలే లేని దునియా ఉంటే ఎంత బావుంటుందో కదా..”

“దుర్లభం.. అసంభవం.. మనిషిలో స్వార్థం, అత్యాశ, ఆధిపత్య ధోరణి, పక్కవాడి ఆస్తుల్ని ఆక్రమించుకోవాలన్న దుర్భుద్ధి.. యివి ఉన్నంత కాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి” అన్నాడు బుర్హాన్.

స్కర్దూ నుండి కార్గిల్‌కి వెళ్ళే రోడ్డు దాటి కిందికి దిగుతున్నప్పుడు బుర్హాన్ అన్నాడు. “మనకు స్వాతంత్ర్యం రాక ముందు ఈ రోడ్డు ఎంత సందడిగా ఉండేదో తల్చుకుంటే బాధేస్తుంది. ఈ రోడ్డు గుండా కార్గిల్‌కి సరుకులు తీసుకెళ్ళే వ్యాపారులంతా ఇక్కడ ఆగి మన వూళ్ళో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళా ప్రయాణాన్ని కొనసాగించేవారు. ఇప్పుడు కార్గిల్ కెళ్ళే దారే మూసుకుపోయింది. కార్గిల్ పరాయి దేశంలో భాగమైపోయింది.”

“అవునూ.. ఈ రోడ్డుని సిల్క్ రోడ్డని ఎందుకంటారు భయ్యా” అని అడిగాడు బషీర్.

“చైనా నుంచి వ్యాపారులు సిల్క్ వస్త్రాల్ని అమ్మడానికి ఈ దారి గుండానే వచ్చేవాళ్ళు. ఈ రోడ్డు సిరియా దాటి చాలా మైళ్ళు విస్తరించి ఉంది. మన హుందర్మో నుంచి కార్గిల్‌కి వెళ్ళే రోడ్డు అందులో ఓ చిన్న భాగం మాత్రమే” అన్నాడు బుర్హాన్.

చెరువు వైపుకు వెళ్ళే రోడ్డులో నడవసాగారు. దారిలో అక్కడక్కడా ఫిరంగి గుండ్లు పడటం వల్ల ఏర్పడిన లోతైన గుంతలు భీతి గొలిపేలా నోళ్ళు తెర్చుకుని కన్పిస్తున్నాయి.

“మనమీద యిప్పుడేమీ బాంబులు పడవు కదా” అన్నాడు బషీర్ వాటి వైపు భయం భయంగా చూస్తూ.

“పడవు. మనం నమాజ్ చదివే సమయం చూసుకునే బైటికొస్తున్నాంగా”

“సైనికులు నమాజ్ చేస్తారా అసలు? నమాజ్ వేళల్ని పాటించేంత వెసులుబాటు ఉంటుందా వాళ్ళకు?”

బుర్హాన్‌కి కూడా ఆ విషయాలేమీ తెలియవు. తెలియదని చెప్పటం నామోషీగా భావించి “మన పాకిస్తానీ జవాన్లు తప్పకుండా నమాజ్ చేస్తారు” అన్నాడు.

“మరి భారతీయ సైనికులు ఫిరంగులో కాలిస్తేనో?”

“అవకాశం లేకపోలేదు. కానీ గత ఆరు రోజుల్లో బైటికెళ్ళిన మనవాళ్ళకేమీ జరగలేదుగా. అల్లా మీద భారం మోపి మన పని మనం చేసుకోవడమే.”

బషీర్ ఏమీ మాట్లాడకుండా గాడిదను అదిలిస్తూ కొద్ది దూరం నడిచాడు. దూరంగా చెరువు కన్పిస్తోంది. ఎండ పడి చెరువు నీళ్ళు వెండి జలతారులా మిలమిలా మెరుస్తున్నాయి.

రోడ్డు పక్కన మట్టిలో ఏదో మార్పు గమనించాడు బషీర్. మట్టి రంగు మారినట్టు.. “యిక్కడ మట్టి ఎందుకిలా ఉంది?” అని బుర్హాన్‌ని అడిగాడు.

బుర్హాన్ కొద్ది సేపు పరిశీలనగా చూసి “తడిగా ఉన్నట్టుంది. ఐనా మనకెందుకు పద” అన్నాడు.

బషీర్ కుతూహలాన్ని ఆపుకోలేక అటువైపుకి రెండడుగులు వేసి ఆ మట్టిమీద నిలబడ్డాడు. అక్కడ పాకిస్తానీ సైనికులు భారత సైనికుల కోసం అమర్చిన ల్యాండ్‌మైన్ మరుక్షణం పెద్ద విస్ఫోటనంతో పేలి పోయింది. బషీర్ శరీరం తునాతునకలై దూరంగా విసిరేయబడింది. బుర్హాన్ కాళ్ళు రెండూ తెగిపోయాయి. గాడిద రెండు ముక్కలుగా తెగి పడింది. రోడ్డంతా రక్తంతో తడిసి ముద్దయింది. కొన్ని నిమిషాలు బాధతో విలవిల్లాడి బుర్హాన్ కూడా ప్రాణాలు వదిలాడు.

నీళ్ళ కోసం వెళ్ళినవాళ్ళు రెండు గంటలైనా రాకపోతే జావేద్ కంగారుపడసాగాడు. ఎంత మెల్లగా నడిచినా గంటకు మించి పట్టదు.. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ అసహనంగా పచార్లు చేస్తూ, బషీర్ భార్య రుబియా నిశ్చింతగా ఉండటం చూసి ఆగిపోయి “నీ షొహర్ రావడం ఎందుకాలస్యమైందో నీకేమైనా తెలుసా?” అని అడిగాడు.

“రెండ్రోజుల్నుంచీ వాళ్ళ నాన్నా అన్న గుర్తొస్తున్నారని నాతో చెప్పుకుని బాధపడ్డారు. బైటికెళ్ళే అవకాశం దొరికితే వూళ్ళోకెళ్ళి వాళ్ళని చూసొస్తానని కూడా అన్నారు. బహుశా యింటికెళ్ళి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి చెరువుకెళ్ళి ఉంటారు” అంది రుబియా.

ఆమె మాటల్ని విన్నాక జావేద్ కొద్దిగా స్థిమితపడ్డాడు. అలానే జరిగుంటుంది. బషీర్ యింటికెళ్ళా డని బుర్హాన్ కూడా తన యింటికెళ్ళి ఉంటాడు. అందుకే ఆలస్యమై ఉంటుంది. ఐనా తన భయానికి అర్థం లేదు. తుపాకుల శబ్దం తప్ప ఫిరంగులు పేల్చిన శబ్దమే విన్పించలేదు. జరగరానిదేదో జరిగుంటుందని వూహించడానికి అవకాశం లేదు.

మరో గంట గడిచినా వాళ్ళు రాకపోయేటప్పటికి రుబియా కూడా కంగారుపడసాగింది. యింట్లో వాళ్ళతో మాట్లాడినా గంటల కొద్దీ మాట్లాడుకోడానికి ఏముంటుంది?

యిక జావేద్ ఉండలేకపోయాడు. “నేను వెళ్ళి చూసొస్తాను” అని బయల్దేరాడు. అతనికి తోడుగా ఒకరిద్దరు వస్తామన్నా వారించి, జావేద్ ఒక్కడే బైటపడి దారెంట జాగ్రత్తగా చూసుకుంటూ నడవసాగాడు. అప్పుడప్పుడూ విన్పిస్తున్న తూటాల శబ్దం తప్ప యింకే రకమైన శబ్దమూ విన్పించడం లేదు. సిల్క్ రూట్ రోడ్డునించి కిందకి దిగి నాలుగడుగులు వేశాడో లేదో వూరి మీద పెద్ద శబ్దం చేస్తూ రెండు బాంబులు పడ్డాయి. ఎవరిదో ఇల్లు భగ్గున మండింది. వూరిమీద దట్టమైన పొగ కమ్ముకుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version