Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-23

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఈ[/dropcap] వారం రోజుల్లో గుహకు దగ్గరగానో, గుహ పైనో, పక్కనో బాంబులు చాలాసార్లు పడ్డాయి. ఎటొచ్చీ ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. యిప్పుడు తమ వూరి మీద పడ్డ బాంబు వల్ల ఎంతమంది చనిపోయారో.. ఒక యిల్లు కాలిందో రెండిళ్ళు కాలినాయో తెలియడం లేదు. వూళ్ళోకి వెళ్తే కానీ వివరాలు తెలిసే అవకాశం లేదు.

అతను చెరువుకెళ్ళే దారిలోకి మళ్ళి వేగంగా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన పెద్ద గోతి, రోడ్డు మధ్యలో పడి ఉన్న బుర్హాన్ శరీరం కన్పించాయి. మరికొంత వెతికాక ముక్కలుగా తెగిపడి ఉన్న బషీర్ శరీరభాగాలు, చచ్చిపడి ఉన్న గాడిద కూడా కన్పించాయి. అతనికి ఏడుపు రాలేదు. యుద్ధమే దుర్మార్గమైంది. దానికి దయా, జాలి ఉండవు. ఆకలిగొన్న పులిలా అది మనుషుల ప్రాణాల్ని హరిస్తుంది. తప్పదు.. బార్డర్‌కి ఆనుకుని ఉన్న వూళ్లో ఉన్న పాపానికి కొంతమందైనా బలిగాక తప్పదు. ఈరోజు బషీర్, బుర్హాన్ బలైనారు. రేపు ఇంకెవరి వంతో రావచ్చు. యుద్ధోన్మాదానికి అమాయక ప్రజల రక్తతర్పణం తప్పదు.

అతను మొదట మొండిగా వూళ్ళోకే వెళ్ళాడు. బాంబులు పడి కాలిపోయిన యిల్లు ఫరీద్ అని గుర్తించాడు. అదృష్టం కొద్దీ ఆ యింట్లో ఎవరూ లేరు. తన కుటుంబ సభ్యులందర్నీ ఫరీద్ గుహలోకి పిల్చుకొచ్చాడు. వూళ్ళో బాంబు పడటం వల్ల మరికొన్ని ప్రాణాలు పోనందుకు అతను సంతోషించాడు. బుర్హాన్ తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పగానే వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ చెరువు కెళ్ళే రోడ్డు వైపుకి పరుగెత్తింది. ఆ సమయంలో ఆమెకు తన మోకాళ్ళ నొప్పులు గుర్తుకు రాలేదు.

తర్వాత బషీర్ వాళ్ళ యింటికెళ్ళి షరీఫ్‌ని పక్కకు పిలిచి విషయం చెప్పాడు. “నేను గుహలోకెళ్ళి బషీర్ భార్యకి బుర్హాన్ భార్యకీ కబురందిస్తాను. వీలైనంత తొందరగా మనం వాళ్ళ ఖనన సంస్కారాలు చేయడం మంచిది” అన్నాడు.

షరీఫ్ తన తండ్రికి మెల్లగా తమ్ముడి మరణం గురించి చెప్పాడు. వెంటనే యాకూబ్ “మేరా బేటా.. ఏమైందిరా నీకు? నీళ్ళలో కొట్టుకుపోకుండా నీ ప్రాణాలు కాపాడింది ఇలా బాంబులకు బలికావడానికా బేటా? నువ్వు యింట్లో ఉన్నా బతికేవాడివేమో కదరా.. ఎందుకెళ్ళావురా బైటికి?” అంటూ రోడ్డు మీదికి పరుగెత్తాడు. అతని వెనకే యింట్లోని వాళ్ళందరూ పరుగెత్తారు.

బషీర్ శరీరభాగాల్ని ఓ చోట చేర్చి తెల్లటి గుడ్డలో చుట్టి రెండు వైపులా తాడుతో కట్టేశారు. బుర్హాన్ తెగిపోయిన కాళ్ళను తెచ్చి మిగతా శరీరంతో కలిపి కఫన్ తయారుచేశారు. హసీనా ఎంత ఓదార్చినా ఆగ కుండా ఆమెను చుట్టుకుని రుబియా ఏడుస్తూనే ఉంది.

యాకూబ్ తన కొడుకు శవం మీదపడి శోకాలు పెట్టి ఏడుస్తున్నాడు. గుహలో ఉన్న కొంతమంది మగవాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు.

“మనం యింతమందిమి యిక్కడ గుమికూడి ఎక్కువ సేపు ఉండటం ప్రమాదం. మళ్ళా బాంబుల దాడి జరగొచ్చు. మీ నాన్నను వూరడించు. మిగతా కార్యక్రమం తొందరగా కానిచ్చేద్దాం” అన్నాడు జావేద్ షరీఫ్‌తో.

షరీఫ్ నాన్నని బలవంతంగా లేపి భుజం చుట్టూ చేయి వేసి పక్కకు తీసుకొచ్చాడు. రెండు శవాల్ని మోసుకుంటూ ఖబరస్తాన్ వైపుకు మగవాళ్ళు బయల్దేరారు.

రెండు గోతులు తవ్వి, శవాల్ని మత నియమాల ప్రకారం పూడ్చిపెట్టేవరకు అక్కడ గుమికూడిన వాళ్ళెవ్వరూ బాంబులు పడ్తాయేమోనని భయపడలేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నారు. తమ కోసం ప్రాణాలు విడిచిన బషీర్, బుర్హాన్ చివరి ప్రయాణాన్ని గౌరవ మర్యాదలతో నిర్వహించి బరువెక్కిన హృదయాలతో వెనక్కి తిరిగారు.

మరో రెండ్రోజుల తర్వాత యుద్ధం ముగిసింది. సెప్టెంబర్ ఇరవై మూడున అగ్ర రాజ్యాల జోక్యంతో ఇరువైపులా కాల్పుల విరమణ జరిగి, శాంతి నెలకొంది.

గుహలో తొమ్మిది రోజులు నరకం అనుభవించిన హుందర్మో గ్రామస్థులు తమ యిళ్ళకు చేరుకున్నారు. ఈ యుద్ధంలో భారతదేశం గెల్చుకున్న భూభాగాన్నంతా పాకిస్తాన్‌కి తిరిగి యిచ్చుకోవాల్సివచ్చింది. పందొమ్మిది వందల అరవై ఆరు, జనవరి పదో తారీఖున తాష్కెంట్లో భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ శాంతి ఒప్పందం మీద సంతకాలు చేశారు. దాని ప్రకారం సరిహద్దు రేఖకు సంబంధించి ఆగస్ట్‌కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలనీ, ఆక్రమించుకున్న భూభాగాల్ని తిరిగి ఇచ్చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

అప్పటివరకూ హుందర్మోకి తూర్పు వైపున్న పర్వత శిఖరాన్ని ఆక్రమించుకుని ఉన్న భారత సైనిక దళాలు అక్కడినుంచి తమ శిబిరాల్ని ఎత్తివేశాయి.

యుద్ధం వల్ల నాలుగైదు నెలలు తమ గ్రామం పాకిస్తాన్‌లో ఉందో లేక భారత సైనికుల హస్తగతమైందో తెలియక కంగారు పడ్డ హుందర్మో గ్రామస్థుల అనుమానం తీరింది. హుందర్మో గ్రామం పాకిస్తాన్ భూభాగంలోనే ఉందని తెల్సుకుని అందరూ హాయిగా వూపిరి పీల్చుకున్నారు.

***

ఫక్రుద్దీన్ని ప్రస్తుతం మూడు దిగుళ్ళు బాధిస్తున్నాయి. ఎదిగొచ్చిన కొడుకు రషీద్ మరణం మానని గాయంలా గుండెల్లో సలుపుతూ ఉంది. యిల్లు కాలి బూడిదైపోయింది. తన భార్య ప్రేమగా పెంచుకుంటున్న మున్నా మంటల్లో పడి మాడిపోయాడు. పిల్ల పెళ్ళికని దాచుకున్న డబ్బులు కాలి మసైపోయాయి. దానికి తోడు పిల్ల పెళ్ళి మరో రెండున్నర నెలల్లోనే ఉంది. తల దాచుకోడానికి యిల్లనేదే లేకుండా పిల్ల పెళ్ళి ఎలా చేయడం? ఆకాశం ఒక్కసారిగా కూలి నెత్తిమీద పడ్డట్టు అతను దిగుల్తో కుంగిపోసాగాడు.

కాబోయే వియ్యంకుడి యిల్లు కాలిపోయిందని, కొడుకు చనిపోయాడని తెల్సుకుని ఫర్హానాకి కాబోయే అత్తగారు, మామగారు పరామర్శించడానికి జోరాఫాంకి వచ్చారు. కూలిన గోడల మధ్యనే వండుకుని తింటూ, ఆరు బయట పడుకుంటున్న వాళ్ళ దుస్థితి చూసి వియ్యంకుడు చాలా జాలిపడ్డాడు. రషీద్ మరణానికి తమ సంతాపం తెలియచేస్తూ “జంగ్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులని షహీద్ ఐనాడంటూ గౌరవిస్తాం. మీ కొడుక్కూడా షహీద్ అయ్యాడని అనుకోండి. పాకిస్తాన్‌కి మన దేశానికీ మధ్య జరిగిన యుద్ధానికి మీ అబ్బాయిని బలి యిచ్చాననుకోండి” అంటూ ధైర్యం చెప్పాడు.

“మీరేమీ అనుకోనంటే నిఖాని మరికొన్ని రోజులు వాయిదా వేద్దాం. యిల్లు కట్టుకున్నాకే నిఖా పెట్టుకుందాం” అన్నాడు వియ్యంకుడితో ఫక్రుద్దీన్.

“మీ ఇష్టం బావగారూ. మాకు తొందరేమీ లేదు. ప్రశాంతంగా మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. మీకు సానుకూలమైన రోజే నిఖా పెట్టుకుందాం” అన్నాడతను.

“బహుత్ బహుత్ షుక్రియా హుజూర్” కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతుండగా అన్నాడు ఫక్రుద్దీన్.

“అయ్యో ఎంత మాట.. మీకొచ్చిన కష్టాన్ని మా కష్టంగానే భావిస్తాం. మా అబ్బాయి మీతో మరో మాట చెప్పమన్నాడు. నిఖా చాలా నిరాడంబరంగా జరగాలన్నాడు. మేమూ అదే కోరుకుంటున్నాం. మీరు పెళ్ళి విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకండి. ఈ వూళ్లో దావత్‌లు కూడా ఏమీ పెట్టుకోకండి. నిఖా అయ్యాక ఆర్.ఎస్.పురాలో మేము వలీమా ఏర్పాటు చేస్తాం. చాలు” అన్నాడు వియ్యంకుడు.

వాళ్ళు వచ్చి వెళ్ళాక ఫక్రుద్దీన్‌కి ఓ దిగులు తీరినట్టయింది. మీకు వీలైనప్పుడే నిఖా తేదీ ఖరారు చేసుకుందాం అని వియ్యంకుడు చెప్పినా వీలైనంత తొందరగా చేసేస్తేనే మంచిదని ఫౌజియా అభిప్రాయం. “కాల్పులు ఆగిపోయినంత మాత్రాన మళ్ళా మొదలవ్వవని చెప్పలేం కదా. పాకిస్తాన్ సైనికులు చీటికిమాటికి రెచ్చగొడ్తూ కాల్పులు జరుపుతూనే ఉంటారుగా. మన సైనికులు దీటుగా జవాబులిస్తుంటారు. ఇప్పటికే మనం కొడుకుని బలిచ్చాం. కూతుర్ని కూడా బలివ్వలేమండీ. దీన్ని తొందరగా అత్తారింటికి పంపించండి. అదైనా అక్కడ ప్రాణాల్లో ఉంటుంది. మనం ఏమైనా పర్వాలేదు” అంటూ ఫౌజియా వెక్కివెక్కి ఏడ్చింది.

ఫక్రుద్దీన్‌కి కూడా అచ్చం అలానే అన్పించింది. మొదట వీలైనంత త్వరగా యిల్లు కట్టుకోవాలి. వెంటనే నిఖా చేసి కూతుర్ని ఆర్.ఎస్.పురా పంపించేయాలి అనుకున్నాడు. పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్య శాంతి కుదర్చడానికి అగ్ర రాజ్యాలు చేస్తున్న ప్రయత్నాల గురించి అతనికి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెల్సినా ఇరుదేశాల మధ్య జరిగే శాంతి ఒప్పందాల ప్రభావం బార్డర్‌లో ఉన్న వూళ్ళ మీద ఏమీ ఉండదన్న విషయం ఆ వూరి వాళ్ళకు అనుభవమే. కాల్పుల విరమణ ఒప్పందాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా జరిగే కాల్పులు ఎన్నిటిని చూళ్ళేదూ.. ఎన్ని మార్లు ప్రాణాలరచేత పెట్టుకుని, యిళ్ళొదిలి పారిపోలేదూ…

ఈ సంబంధం కుదరడం ఫర్హానా అదృష్టం.. కాబోయే అత్తామామలు చాలా మంచివాళ్ళు. రెండు సార్లు హజ్ యాత్ర చేసొచ్చిన పవిత్రాత్మలు.. అబ్బాయి కూడా చాలా బుద్ధిమంతుడు. టౌన్లో అతనికి స్వంత పండ్ల దుకాణం ఉంది. పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్న అబ్బాయి.. ఐదు పూటలా నమాజీ…

అసలు జోరాఫాంలోని అబ్బాయిలకు, అమ్మాయిలకు సంబంధాలు దొరకడం చాలా కష్టం. అబ్బాయిలకైతే పెళ్ళిళ్ళు జరగడం మరీ కష్టం. ఏరోజు ఏ తూటా వచ్చి గుండెల్ని చీలుస్తుందో, ఏ రోజు ఏ ఫిరంగి గుండు మీదపడి యిల్లు కూలిపోతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతికే వూళ్ళోకి తమ కూతుర్లని కాపురానికి పంపడానికి ఎవ్వరూ సుముఖంగా లేరు.

జోరాఫాంకి కాపురానికి పంపడమంటే కాటికి పంపడంతో సమానమని బార్డర్‌కి దూరంగా ఉండే గ్రామాల్లోని ప్రజల అభిప్రాయం. అమ్మాయికి చావు తప్పినా అల్లుడికి ఏమైనా అయితే పిల్ల జీవితాంతం వైధవ్యంతో బాధపడాల్సి వస్తుందని వాళ్ళ భయం…

వూళ్లోని అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోడానికి ముందుకొచ్చేవాళ్ళు కూడా తక్కువే. పెళ్ళయ్యాక అత్తారింట్లో వండి పెట్టే వంటకాల్ని సుష్ఠుగా భోంచేస్తూ, నాలుగు రోజులు సరదాగా ఉండటానికి అవకాశం లేని వూరని వెనుకంజ వేస్తుంటారు. కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ అక్కడి అమ్మాయిల్ని చేసుకున్నా, ప్రసవానికి పిల్లని పుట్టింటికి పంపడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. కోడలితో పాటు పసిబిడ్డకి కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని జంకుతారు.

(ఇంకా ఉంది)

Exit mobile version