రెండు ఆకాశాల మధ్య-24

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]టువంటి పరిస్థితుల్లో ఫర్హానాని చేసుకోడానికి అఖ్తర్ అంగీకారం తెల్పడం అదృష్టం కాక మరేమిటి? అతని అమ్మానాన్నా ఆమోదం తెల్పడం అల్లా దయ కాక మరేమిటి? ఇదంతా తన పెద్ద కొడుకు ఆర్.ఎస్.పురాలో స్థిరపడటం, అఖ్తర్‌మియా అతనికి దోస్త్ కావడం వల్ల సానుకూలబడిన వ్యవహారం.. ఎందుకైనా మంచిది మరోసారి కాల్పులు జరక్కముందే పిల్ల పెళ్ళి చేసేయాలనుకున్నాడు.

మొదట యిల్లు కట్టాలి. చేతిలో చిల్లి కాణీ లేదు. యిల్లు కాలిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం పరిహారం యిస్తుందని వూళ్లో పెద్దలు చెప్పారు. ఆ పరిహారం రావడానికి ఎన్ని రోజులు పడ్తుందో తెలియదు. చనిపోయిన పశువులకు కూడా లెక్కకట్టి పరిహారం యిస్తారట. రక్తసంబంధీకుల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా పరిహారం యిస్తారని చెప్పారు.

ఆ వూళ్లో మొన్నటి యుద్ధం వల్ల చనిపోయింది యిద్దరే. ఒకరు ఫక్రుద్దీన్ కొడుకు రషీద్ అయితే మరొకతను ఫరూక్. కాల్పుల సమయంలో ఫిరంగి గుండు పేలి రషీద్ చనిపోతే, కాల్పులు సద్దుమణిగి, వూరి వాళ్ళందరూ క్యాంప్ వదిలి తిరిగి యిళ్ళకు వచ్చాక ఫరూక్ చనిపోయాడు.

ఆ రోజు ఫరూక్ తన భార్యాపిల్లల్లో కలిసి యింటికి రాగానే, యిల్లుండాల్సిన చోట కూలిపోయిన గోడలూ, కాలిపోయిన సామగ్రి చూసి ‘మనం బర్‌బాద్ అయిపోయాం బేగం’ అంటూ భోరుమని విలపించాడు.

‘నేనెవ్వరికీ ఏ అన్యాయమూ చేయలేదే.. మత నియమాలను పాటిస్తూనే బతుకుతున్నానే. నన్నూ నా బిడ్డల్ని అల్లా ఎందుకిలా శిక్షిస్తున్నాడు?” అంటూ పిల్లల్ని కౌగిలించుకుని ఏడుస్తున్న భర్తని అతని భార్య ఓదార్చింది. ఆమెలోనూ దుఃఖం ఉవ్వెత్తున లావాలా ఎగసి పడ్తూ కణకణాన్ని కాల్చేస్తోంది. కానీ తనకన్నా ఎక్కువగా తన భర్త పసిపిల్లాడిలా ఏడుస్తూ ఉండటంతో తన బాధను దిగమింగి అతనికి సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేసింది.

‘పాకిస్తానీ సైనికులు చేసిన ఘోరానికి అల్లానెందుకు తప్పుపడ్తారు? మన ఒక్కరి యిల్లే కాదుగా.. వూళ్ళోని చాలా యిళ్ళు కాలిపోయాయి. బాధపడి ప్రయోజనం ఏమిటి? అందరితో మనం… అందరూ కలిసి ఏం చేయాలో ఆలోచించండి. సర్కార్ నుంచి డబ్బులు అందుతాయంటున్నారుగా. ఆ డబ్బుల్తో కొత్త యిల్లు కట్టుకుందాం. దిగులు పడకండి” అంది.

“అయ్యో పిచ్చిదానా.. సర్కార్ యిచ్చే డబ్బు మనం నష్టపోయినదాన్లో సగమైనా ఉండదే. కాలిపోయిన యింట్లోని వస్తువులకు డబ్బులెవరిస్తారు? చాపలూ, చెంబులూ, తప్పేళాలు, దుప్పట్లు, దిండ్లూ.. అన్నీ మళ్ళా కొనుక్కోవాల్సిందే. యా అల్లా.. ఈ కష్టాన్నుంచి గట్టెక్కడం ఎలానో తెలియడం లేదే” అన్నాడు.

అతని భార్యకు వెంటనే తమ ఎకరం పొలంలో వేసిన మొక్కజొన్న పంట గుర్తొచ్చింది. “ఈ సారి పంట బాగా పండిందని చెప్పారుగా, పంట కోతకొచ్చాక అమ్మిన డబ్బుతో కావల్సిన వస్తువులు కొందాం లెండి. బాధపడకండి” అంది.

ఫరూక్ లేచి నిలబడి “బాగా గుర్తుచేశావు. మన పంటపొలం ఎలా ఉందో చూసి వస్తానుండు” అంటూ పొలం వైపుకు వేగంగా నడిచాడు.

యింతకు ముందు పాకిస్తానీ సైనికులు మోర్టార్లతో దాడికి పాల్పడినప్పుడు పొలాల్లో గుండ్లు పడి పేలిపోయి, పంటంతా ధ్వంసమైన అనుభవాలున్నాయి. అందుకే అతను ఆత్రుతగా నడుస్తున్నాడు. ‘యా అల్లా.. నా పొలం క్షేమంగా ఉండేలా చూడు’ అని ఎన్నిసార్లు మనసులో దువా చేసుకున్నాడో.. పొలం దగ్గర పడేకొద్దీ అతని హృదయ స్పందనల వేగం కూడా పెరిగింది. ఇప్పుడు అదొక్కటే తమకు మిగిలిన ఆశ..

దూరం నుంచి పొలం కన్పించింది. ఎత్తుగా పెరిగి గాలికి తలలూపుతున్న మొక్కలు కన్పించగానే అతను హాయిగా వూపిరి పీల్చుకున్నాడు. ‘యా అల్లా.. తేరా లాఖ్ లాఖ్ షుకర్’ అనుకున్నాడు. కంకులు పాలు పట్టి బరువుగా వూగుతున్నాయి. కంకి గట్టి పడ్డాక కోత కోసి, గింజల్ని నూర్చి, మార్కెట్లో అమ్మేస్తే చాలు.. గట్టున పడిపోవచ్చు అనుకున్నాడు.

కంకుల్ని మృదువుగా స్పృశిస్తూ పొలం లోపలికి వెళ్ళాడు. పంటకేమీ నష్టం జరగలేదన్న సంతోషంలో అతను పొలం మధ్యలో పడి ఉన్న ఫిరంగి గుండుని చూసుకోలేదు. అది పేలకుండా పడి ఉన్న మోర్టార్.. ఫరూక్ కాలు దానిమీద పడటంతోనే అది పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. అతని శరీరం తునాతునకలై పొలం నిండా వెదజల్లబడింది.

మోర్టార్ పేలిన శబ్దం వూళ్లో అందరికీ విన్పించింది. మళ్ళా యుద్ధం మొదలైందేమోనని అందరూ భయంతో పరుగులు తీశారు. ఆడవాళ్ళు శోకాలు పెట్టసాగారు. విరిగిన గోడల వెనక నక్కి తుపాకీ కాల్పులు విన్పిస్తాయేమోనని చెవులు రిక్కించి విన్నారు. పొలాల వైపున లేచిన దట్టమైన పొగ పల్చబడేంత వరకు ఎదురుచూసినా మరే శబ్దమూ విన్పించకపోవడంతో ఒక్కొక్కరూ చాటునుంచి బైటికొచ్చి అదేమై ఉంటుందా అని కొద్దిసేపు తర్జనభర్జన పడ్డారు. పేలకుండా ఉండిపోయిన ఫిరంగి గుండు పేలి ఉంటుందని నిర్ధారణ కొచ్చి, నలుగురు యువకులు పొలాల వైపుకు పరుగెత్తారు. తిరిగొస్తున్నప్పుడు ఫరూక్ శరీరభాగాల్ని ఏరుకుని మోసుకొచ్చారు.

కాలిపోయిన యిళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి దానికీ, చనిపోయిన పశువులకూ లెక్క కట్టి పరిహారం అందించడానికి కొంత సమయం పడుందని జిల్లా అధికార్లు తెలిపారు. వూళ్లో జరిగిన మరణాలు రెండే కాబట్టి వాళ్ళ కుటుంబాలకివ్వాల్సిన పరిహారం తొందరగా అందే అవకాశముందని చెప్పారు.

పరిహారం అందుకోడానికి రావల్సిందిగా కబురందినపుడు ఫక్రుద్దీన్‌కి కాలూ చేయి ఆడలేదు. ఇప్పుడు తను తీసుకోబోయే డబ్బు తన కొడుకు రషీద్ మరణానికి ప్రభుత్వం వెల కట్టి యిస్తున్న డబ్బు.. అసలు మనిషి ప్రాణానికి వెల కట్టడం ఎవరికైనా సాధ్యమా.. ఎన్ని కోట్లు కుమ్మరించినా తన కొడుకు ప్రాణాల్ని తిరిగి తీసుకురాగలరా? వాడి చావుని నోట్లుగా మార్చుకోవడానికి అతని తండ్రి మనసు ఒప్పుకోవడం లేదు. “నాకు డబ్బులొద్దు నా కొడుకుని తిరిగి నాకిచ్చేయండి” అని అరిచి చెప్పాలనిపిస్తోంది.

శంకర్ చాలా సేపు అతనికి నచ్చచెప్పాడు. “చావునీ పుట్టుకనీ మనం దేవుని ఖాతాలో వేసేయాలి. వీటిలో మన ప్రమేయం ఉండదు. కానీ మన బతుకు మనం బతకాలిగా. తప్పదు. ప్రభుత్వం అందిస్తున్న సాయం కంటితుడుపు మాత్రమే. నువ్వు ఫర్హానా పెళ్ళి గురించి ఆలోచించు. డబ్బులు వద్దనకు. డబ్బుల్లేకుండా ఏ అవసరాలు తీరవు” అని బుజ్జగించి చెప్పాక అతను పరిహారం అందుకోవడం కోసం జిల్లా అధికార్లని కల్సుకున్నాడు.

అతని చేతిలో పడిన నోట్లు పచ్చగా కన్పించలేదు.. రక్తం పులుముకుని ఎర్రగా కన్పించాయి.. తన రషీద్ లేత శరీరం నుంచి స్రవించిన రక్తం.. ఆ నోట్లని చూస్తుంటే మూటగట్టి తెచ్చిన తన కొడుకు శరీర భాగాలు కన్పిస్తున్నాయి. వాటిని అక్కడే విసిరేసి, ఏ చెరువులోకో దిగి, అరచేతులకంటిన రక్తాన్ని శుభ్రంగా కడుక్కుని, తన వూరికి పారిపోవాలన్న బలమైన కోరిక.. ఎంత బలవంతంగా అణుచుకున్నాడో.. తన పేదరికం.. అవసరాలు.. ఫర్హానా పెళ్ళి.. కాలిపోయిన యిల్లు.. ఎంతటి దౌర్భాగ్యం! కొడుకు అర్ధాంతరపు చావుని, ఫిరంగి గుండు తగిలి తునాతునకలైన శరీరాన్ని డబ్బుగా మార్చుకుని యింటికి తెచ్చుకునేంత దౌర్భాగ్యం ఏ తండ్రికీ పట్టకూడదనుకున్నాడు. యింటికి తిరిగొచ్చే సమయానికి, దారి పొడుగూతా కొడుకుని తల్చుకుని ఏడ్వటంవల్ల వంద రూపాయల నోట్లన్నీ అతని కన్నీళ్ళతో తడిసిపోయాయి.

యిల్లు కట్టడం మొదలెట్టినప్పటినుంచీ మళ్ళా రషీద్ జ్ఞాపకాలు అతన్ని ఇబ్బంది పెట్టసాగాయి. ఎదిగిన కొడుకు కదా.. బతికుంటే తనకు చేదోడుగా ఉండేవాడు కదా అన్పించిన క్షణాలెన్నో.. యిప్పుడు తనొక్కడే కట్టుడు పనంతా చూసుకోవాల్సి వస్తోంది. మొదట్లో శంకర్ కొంత సాయపడినా, అతను తన యిల్లు కట్టుకోవడం మొదలెట్టాక అది కూడా ఆగిపోయింది.

ఫక్రుద్దీన్ యిల్లు కట్టడం మొదలెట్టిన కొన్ని రోజులకు మిగతావాళ్ళకు కూడా యిళ్ళు కట్టుకోడానికి పరిహారం అందడంతో వాళ్ళూ మొదలెట్టారు. మట్టి గోడలు లేపి, యింటి పైకప్పు వేయడం పూర్తిచేసిన రోజు, యింటిని చూడటానికి శంకర్ వచ్చాడు.

“కొత్త యిల్లు ఎంత బావుందో ఫక్రూ.. యింతకుముందు మన యిళ్ళ గోడలు ఎలా ఉండేవో గుర్తుందిగా. వెనక వైపు గోడ మన సైనికులు కాల్చిన తూటాలతో చిల్లులు పడి, పెచ్చులూడి కన్పించేది. ముందు వైపు గోడ పాకిస్తాన్ సైనికుల తుపాకీ గుళ్ళు తగిలి పెద్ద పెద్ద స్ఫోటకపు మచ్చల మొహంలా వికారంగా కన్పించేది. యిప్పుడు చూడు గోడలు ఎంత నున్నగా నిగనిగలాడూ మెరుస్తున్నాయో” అన్నాడు శంకర్.

“ఇదెంతకాలం ఉంటుందో చెప్పలేంగా శంకర్.. మనంత దురదృష్టవంతులు ఈ లోకంలో ఎక్కడా ఉండరేమో.. ఏం చెప్పగలం చెప్పు.. ఈ రోజో రేపో మళ్ళా పాకిస్తాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడితే చాలు, మళ్ళా గోడలనిండా బొట్లు పెట్టినట్టు రంధ్రాలు పడక తప్పదు” అన్నాడు ఫక్రుద్దీన్.

శంకర్ బాధగా నిట్టూర్చాడు. నిజమే… ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి తమది. అలాగని వూరొదిలి ఎక్కడికో వలస వెళ్ళడానికి మనసొప్పదు. పుట్టి పెరిగిన వూరాయె. యిల్లూ పొలాలూ, గొడ్డూ గోదా సమకూర్చుకున్న వూరాయె.. ఎక్కడికని వెళ్తారు? తప్పదు… బతికున్నన్నాళ్ళు ఈ నరకం అనుభ వించక తప్పదు.

“మనమింకా అదృష్టవంతులం … యిల్లు కట్టుకోగలుగుతున్నాం.. మా యింటి పక్కనున్న ఆ బల్వీందర్ యిల్లు చూశావా… ఒక గుండు తగిలి యిల్లంతా నాశనమయ్యిందా.. మరో గుండు పేలకుండా యింటి మధ్యలో పడుంది. సంబంధిత అధికార్లెవరో వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి తొలగిస్తే తప్ప అతను యిల్లు కట్టుకోడానికి లేదు.”

“అధికార్ల దృష్టికి తీసుకెళ్ళలేదా?”

“ఎందుకు తీసుకెళ్ళలేదూ..పాపం బల్వీందర్.. కాళ్ళరిగేలా జిల్లా అధికార్ల చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదట. బాంబుల్ని నిర్వీర్యం చేసే నిపుణులెవరో రావాలట. మన జిల్లాలో లేరట. వాళ్ళోచ్చే వరకు దాన్ని కదిలించొద్దనీ, దాని పైన ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ ఉచితసలహా మాత్రం యిచ్చారట.”

“నిజమే.. పొరపాటున దాని మీద ఏదైనా పడితే ప్రమాదం కదా.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here