రెండు ఆకాశాల మధ్య-25

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఆ[/dropcap] యింటి చుట్టుపక్కల యిళ్ళున్న వాళ్ళందరం భయపడి చస్తున్నామనుకో. ప్రమాదవశాత్తు అది పేలితే మేము కట్టుకుంటున్న యిళ్ళు కూడా కూలిపోతాయన్న భయం.. అందుకే మేమందరం పూనుకుని దానిచుట్టూ ముళ్ళ కంచెతో దడిలా కట్టి పైనంతా కప్పేశాం.”

“ఎంత నిర్లక్ష్యం కదా ప్రభుత్వ అధికార్లది? మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. ముఖ్యంగా మనలా పల్లెటూరి బీదా బిక్కీ జనాలంటే మరింత చిన్న చూపు” అన్నాడు ఫక్రుద్దీన్.

యిల్లు కట్టడం పూర్తయినందుకు అతనికి అభినందనలు తెలిపి, ఫౌజియా తయారుచేసిచ్చిన ఖీర్ తాగి శంకర్ వెళ్ళిపోయాడు.

మరో నెలలో నిఖా తేదీని పక్కా చేసుకున్నారు. నిఖా దగ్గరపడే కొద్దీ మళ్ళా రషీద్ జ్ఞాపకాల తేనెతుట్టె కదలసాగింది.

ఫర్హానా పెళ్ళి నిశ్చయం కాగానే రషీద్ ఎంత సంబరపడ్డాడో… ‘దీదీ నిఖా అయ్యేవరకు నా జీతం డబ్బులు అడగొద్దు నాన్నా.. అన్నీ దాచి పెట్టి అక్కకి బంగారు ఉంగరం చేయిస్తాను. వొంటిమీద వీసమెత్తు బంగారం కూడా లేకుండా పిల్లని అత్తారింటికి పంపితే ఏం బావుంటుంది?” అనేవాడు.

అతను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా అగ్నికి ఆహుతైపోయాయి. కొడుకు చనిపోయినా అతని కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఫక్రుద్దీన్ తనకు పరిహారంగా వచ్చిన డబ్బుల్లోంచే ఫర్హానాకు బంగారు ఉంగరం చేయించాడు. దాన్ని తెచ్చి ఫర్హానాకు యిచ్చినరోజు యింట్లో అందరూ ఏడ్చారు. ఫర్హానా అయితే “తమ్ముడి చావుని గుర్తుకు తెచ్చే ఈ ఉంగరం నాకొద్దు నాన్నా” అంటూ దాన్ని వేలికి తొడుక్కోడానికి నిరాకరించింది.

“నువ్వు తొడుక్కుంటేనే ఏ లోకంలో ఉన్నా రషీద్ సంతోషిస్తాడమ్మా. తన కష్టంతో సంపాదించిన డబ్బుల్తో నీకు ఉంగరం చేయించాలనుకున్నాడు. చివరికి తన మరణం ద్వారా లభించిన డబ్బుతోనే నీకు ఉంగరం చేయించాడు కదమ్మా. నీ పెళ్ళికి రషీద్ ఇచ్చిన కానుక అది. వద్దనకూడదు” అన్నాడు ఫక్రుద్దీన్.

ఫర్హానాకి కూడా రషీద్ బాగా గుర్తుకొస్తున్నాడు. తన కాబోయే షొహర్ అఖ్తర్ తమ యింటికొచ్చినపుడు చూడటం తప్ప, దానికి ముందు పెద్దవాళ్ళు సంబంధం మాట్లాడుకుంటున్న సమయంలో అతనెలా ఉంటాడో తనకు తెలియదు.. దాన్ని అలుసుగా తీసుకుని ఎలా ఆట పట్టించేవాడో.. “నువ్వతన్ని చూడలేదు కదా.. అస్సలు బావుండడు తెలుసా? అన్నకు, నాన్నకు ఎలా నచ్చాడో ఎంతగా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావడంలేదు. కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది మీ జోడీ.. నల్లటి నలుపు తెలుసా.. దానికి తోడు బండ పెదాలు.. ముందుకు పొడుచుకొచ్చిన పళ్ళు” అనేవాడు.

మొదట్లో నిజమేనేమో అనుకుని ఎంత దిగులు పడిపోయిందో.. ముస్లిం ఆడపిల్లగా పెద్దవాళ్ళు పక్కా చేసిన సంబంధాన్ని చేసుకోవడం తప్ప వద్దనే వెసులుబాటు తనకు లేదు. ఏడుపు కూడా వచ్చింది. తప్పించుకోడానికి వీల్లేదు కాబట్టి తనకంతకన్నా అదృష్టం లేదనుకుంది. ఆ రోజంతా ఏడ్పించి రాత్రి పడుకోబోయే ముందు నిజం చెప్పాడు. “రాత్రంతా ఆలోచిస్తూ నిద్ర పాడు చేసుకుంటావేమోనని నిజం చెప్తున్నా విను. అఖ్తర్ మియా చుక్కల్లో చంద్రుడిలా ఉంటాడు. మన దిష్టి తగుల్తుందేమో అనేంత అందంగా ఉంటాడు” అన్నాడు. ఆ మాటలు వినగానే సంతోషాన్ని తట్టుకోలేక తనకు కన్నీళ్ళు కూడా వచ్చాయి.

ఓ రోజు ఆర్.ఎస్.పురా నుంచి తిరిగి రాగానే “నీకో రహస్యం చెప్పాలి. ఎవ్వరికీ చెప్పకూడదు” అన్నాడు. “చెప్పన్లే.. ఏంటో చెప్పు” అంది తను.

“నా కాబోయే బావగారు అఖ్తర్ మియా ఈ రోజు బజార్లో కన్పించారు తెలుసా?” అన్నాడు.

తనను సంతోషపెట్టే కబురేదో చెప్తాడనుకుని, చేస్తున్న పనిని పక్కన పెట్టి, “నువ్వు మాట్లాడావా?” అని అడిగింది.

“లేదు. పక్కనెవరో స్నేహితుడున్నాడు. ఇద్దరూ సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అందుకే దూరం నుంచే చూసి, అతనికి కన్పించకుండా వచ్చేశాను” అన్నాడు.

తన కాబోయే భర్త సిగరెట్లు తాగుతాడా… తన మనసంతా వికలమైంది. అదే రోజు సాయంత్రం ఆర్.ఎస్.పురా నుంచి తన అన్న సిరాజ్ వచ్చాడు. మాటల మధ్యలో “నీ స్నేహితుల్లో సిగరెట్లు తాగేవాళ్ళు కూడా ఉన్నారా?” అని అడిగింది.

“స్నేహితులా? లేరే. ఎవరి గురించి అడుగుతున్నావు?” అన్నాడు సిరాజ్.

“నీ కాబోయే బావ గురించి.. చాలా బుద్ధిమంతుడన్నావుగా. మరి సిగరెట్లు తాగడం మంచి అలవాటా?” అంది.

‘అఖ్తర్ సిగరెట్లు తాగుతాడని ఎవరూ చెప్పింది? అతనికి ఆ వాసనే పడదు. ఎవరో ఏదో చెప్తే నమ్మకు. అతనికి ఒక్క చెడు అలవాటు కూడా లేదనేగా పెళ్ళి సంబంధం మాట్లాడాను” అన్నాడు సిరాజ్.

రషీద్ చెప్పాడని ఎవ్వరికీ చెప్పకూడదనుకుంది. కానీ రొక్కించి అడగడంతో తనకు నిజం చెప్పక తప్పలేదు. రషీద్‌కి బాగా చీవాట్లు పడ్డాయి. “ఇలాంటి అబద్ధాలు చెప్పి దాన్ని బాధపెట్టడానికి నీకు మనసెలా వచ్చిందిరా” అంటూ సిరాజ్ రషీద్ మీద విరుచుకుపడ్డాడు.

ఆ సమయంలో అమ్మనే రషీద్‌ని కాపాడింది. “రషీద్‌కి చిన్నప్పటినుంచీ దాన్ని ఆటపట్టించడం అలవాటే కదరా. అదో సరదా వాడికి” అంది.

నాన్నక్కూడా కోపం వచ్చింది. “అదేం సరదా.. అబద్ధాలు చెప్పి బాధపెట్టేదాన్ని సరదా అనరు. అదో రకమైన క్రూరత్వం” అన్నాడు.

అంతే… ఆ రోజు నుంచి రషీద్ తనని ఆటపట్టించడం మానేశాడు.

బారాత్ వచ్చే రోజు కొత్త బట్టలు వేసుకుని తన బావగార్ని తనే లోపలికి పిల్చుకు రావాలని రషీద్ కోరిక. “ఆ రోజు లాల్చీ పైజమా వేసుకోనా షేర్వాణీ వేసుకోనా.. నువ్వు ఏదంటే అది కొనుక్కుని కుట్టించుకుంటాను” అన్నాడు. షేర్వాణీ తొడుక్కుంటే బావుంటుందని తను అనడంతో షేర్వాణీ కుట్టించుకున్నాడు. లేత నీలం రంగు షేర్వాణీ..

ఇప్పుడు బారాత్ రాబోతోంది. లేత నీలం రంగు షేర్వాణీ సందూక్ అడుగున పడి ఉంది. ఆ షేర్వాణీ తొడుక్కుని పెళ్ళి కొడుకుని లోపలికి తోడ్కొని వస్తానన్న రషీద్ మట్టి అరల్లో ఎక్కడో పడుకుని ఉన్నాడు. బారాత్ యింటి ముందు దాకా వచ్చిందని తెలియగానే ఫర్హానాకి ఉప్పెనలా ఏడుపు తన్నుకొచ్చింది.

యింటిముంది నాలుగు గుంజలు పాతి, పైన టార్పాలిన్ కప్పిన పందిట్లోకి దూల్హాని సగౌరవంగా తోడ్కొని వెళ్ళి కూచోబెట్టాడు సిరాజ్. మొహాన్ని మేలి ముసుగులో దాచుకుని యింట్లో కూచుని ఉన్న ఫర్హానాని “అఖ్తర్‌మియాసే నిఖా కబూల్ హై క్యా” అని మూడుసార్లు అడిగారు. మంద్ర స్వరంతో “కబూల్ హై” అని మూడుసార్లు చెప్పింది.

నిఖా పూర్తయింది. ఫర్హానా మెడలో నల్లపూసల దండ వచ్చి చేరింది. దూలాని దుల్హన్ని ఎదురెదురుగా కూచోబెట్టి, ఒకర్నొకరు చూసుకోకుండా మధ్యలో ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ షాల్‌ని అడ్డంగా పట్టుకున్నారు. ఫర్హానా మొహాన్ని ముసుగు తొలగించి అద్దంలో పెళ్ళి కొడుక్కి చూపించారు. అలానే అఖ్తర్ మొహాన్ని సేరా పక్కకు తొలగించి అద్దంలో ఫర్హానాకి చూపించారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న ఫర్హానా తన షొహర్ మొహాన్ని మొదటిసారి దగ్గరగా చూసుకుంది. అతను తమ యింటికి వచ్చినపుడు తను పరదా చాటునుంచి క్షణకాలం చూసిన మొహం కన్నా అద్దంలో కన్పిస్తున్న మొహం మరింత అందంగా ఉంది. రషీద్ చెప్పినట్టు ‘నిజంగానే చుక్కల్లో చంద్రుడు నా మొగుడు’ అనుకుని మురిసిపోయింది.

జల్వా పూర్తయ్యాక కొత్త పెళ్ళికూతుర్ని ఆర్.ఎస్.పురా పిల్చుకెళ్ళిపోయారు.

***

తన అన్న కూతురి పెళ్ళి గురించిన సమాచారం ఏదీ రాలేదని హసీనాకు దిగులుగా ఉంది. రోజూ ఉత్తరం ఏమైనా వస్తుందేమోనని ఎదురుచూడటం, రాకపోయేసరికి నిరాశ పడటం…

“ఆ వతన్ నుంచి మన వతన్‌కు ఉత్తరాలు రావడానికి చాలా రోజులు పడుంది హసీనా” అన్నాడో రోజు షరీఫ్.

“ఎందుకని అన్ని రోజులు పడుంది? యిక్కడికి దగ్గరగా ఉన్న వూరేగా.. నడిచెళ్ళినా మూడు నాలుగు గంటల ప్రయాణం. నాకెందుకో భయమేస్తోందండీ. రషీద్‌కి జరిగినట్టు ఏమీ ప్రమాదం జరగలేదు కదా. మా అన్నా వదిన, ఫర్హానా.. అందరూ సహీ సలామత్ ఉన్నారు కదా” అంది ఏడుపు గొంతుతో.

“తప్పు.. అలా చెడు జరిగుంటుందన్న ఆలోచనే మనసులోకి రానీయకూడదు.”

“సరిహద్దుకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో నివసించే వాళ్ళ గురించి తల్చుకుంటే అటువంటి ఆలోచనలే వస్తాయి. మనం వూహించామా వూరి జనాల్లో సగం మంది యిల్లూ వాకిలి వదిలేసి గుహలోకెళ్ళి ఉండాల్సి వస్తుందని? బషీర్ బుర్హాన్ల శరీరాలు ఛిద్రమై కన్పిస్తాయని మనం అనుకున్నామా? రషీద్ అంత అర్ధాంతరంగా చనిపోతాడని ఎవరైనా వూహించి ఉంటారా? ఈ యుద్ధాల వల్ల మనలాంటి గ్రామాల్లోని ప్రజలు ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో ఎవ్వరికీ తెలీదు కదండీ.”

“నిజమే.. మన బతుకులు నీటి బుడగల్లా మారిపోయాయి. ఏ క్షణంలో టప్పున పేలిపోతాయో తెలియదు. ఐనా ఆ తర్వాత మళ్ళా తుపాకి మోతలేవీ విన్పించలేదుగా. అంటే సరిహద్దు రేఖ దగ్గర ప్రశాంతత నెలకొని ఉన్నట్టేగా.”

“అలా చెప్పటం కష్టం. జోరాఫాం వద్ద మన సైనికులు కాల్పులు జరిపితే మనదాకా విన్పించాలని లేదుగా. అక్కడ పుట్టి పెరిగిన దాన్నండీ.. అక్కడి పరిస్థితి నాకు బాగా తెలుసు.. మొన్న జరిగిన యుద్ధం లాంటి యుద్ధమే జరగక్కరలేదు. రెండు దేశాలూ శాంతిగా ఉన్నా కూడా అక్కడక్కడా సైనికులు కాల్పులు జరుపుతూనే ఉంటారు. మా రషీద్ లాంటి అమాయకులు చనిపోతూనే ఉంటారు.”

“అక్కడ మీ వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని నమాజ్‌లో దువా చేయడం తప్ప మనమేం చేయగలం చెప్పు” నిస్పృహగా అన్నాడు.

“మనం రెండు దేశాలుగా విడిపోక ముందే బావుండేదండి. ఈ రెండూళ్ళ మధ్య రాకపోకలు ఉండేవి. ఇప్పుడు సరిహద్దు రేఖ మధ్యలో ఉండటంతో ఇక్కడివాళ్ళు అక్కడి బంధువుల్ని కల్సుకునే వీల్లేకుండా పోయింది. ఎవడు గీశాడో గాని సరిహద్దు రేఖని నాలాంటి కొన్ని వేల మంది గుండెల్ని మధ్యకు రెండుగా చీలుస్తూ గీశాడండీ.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here