రెండు ఆకాశాల మధ్య-27

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఎ[/dropcap]టొచ్చీ తను తన స్నేహితుడికిచ్చిన మాటను నిల్పుకోలేక పోతున్నందుకు బాధగానే ఉంది. అలాగని తన కూతురికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి చేయడం అతనికి సుతరామూ ఇష్టం లేదు. అతనికి మరో ఆలోచన కూడా వచ్చింది. హనీఫ్ మంచి కుర్రాడు. చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధాన్ని వదులుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ లతీఫ్ వత్తిడి చేస్తే హనీఫ్‌కి అనీస్ నిచ్చి నిఖా చేద్దామని చెప్పాలనుకున్నాడు.

అనీస్ కూడా అందంగా ఉంటుంది. ఒకవేళ ఆస్‌మానిచ్చి పెళ్ళి చేస్తే నమాజ్ కోసం వచ్చినపుడల్లా తన కూతుర్ని చూసుకోవాలనుకున్నాడు కదా. అలానే అనీస్ నిచ్చి పెళ్ళి చేసినా మసీదుకెళ్ళినపుడల్లా అనీస్‌ని చూసుకుంటాడు. అలా అనుకోగానే అతని మనసు కొద్దిగా శాంతించింది.

మసీదులో కూచుని ఉన్న లతీఫ్‌ని చూసి షరీఫ్ పేలవంగా నవ్వాడు. ఇద్దరూ నమాజ్ పూర్తయ్యేవరకు ఏమీ మాట్లాడుకోలేదు.

మసీదు బైటికి రాగానే లతీఫ్ “ఇంతకూ పెళ్ళి విషయం ఏం నిర్ణయించావు?” అని అడిగాడు.

“మా అమ్మాయి మంకుపట్టు పట్టి కూచుంది లతీఫ్. దానికి మా వూళ్లోని సంబంధమే కావాలట.”

“బంధుత్వం కలుపుకుని మన స్నేహాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని కదా నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేయాలనుకున్నాం.”

“నిజమే. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది? మా అక్క కూతురు అనీస్‌ని కోడలిగా చేసుకో. నాకు ఆస్‌మా ఎంతో అనీస్ కూడా అంతే. అనీస్ కూడా మా అమ్మాయిలానే అందగత్తె.. చాలా నెమ్మది పిల్ల. చాలా బుద్ధిమంతురాలు. అత్తా మామల్ని, భర్తని బాగా చూసుకుంటుంది. దానికి నేనూ హామీ.”

“ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు చూశాను. అందంగానే ఉంటుంది. కానీ మీ మిలట్రీ బావని తల్చుకుంటేనే వణుకొస్తుంది. అతని రూపంలోనే కాదు మాట తీరులో కూడా కర్కశత్వం కన్పిస్తో ఉంటుంది. అతన్తో వియ్యమంది నేను వేగలేను కానీ వదిలెయ్. మాక్కావల్సింది ఆస్‌మా, నా భార్యకు నీ కూతురంటే ప్రాణం. నా కొడుక్కూడా నీ కూతురే తన కాబోయే భార్య అని మనసులో స్థిరపర్చుకున్నాడు. అసలు నీ కూతురికి అభ్యంతరం ఏమిటి? నాకొడుక్కి ఏం తక్కువ? అందంగా ఉంటాడు. మంచి పొడగరి. వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇంకేం కావాలట” కొద్దిగా చిరాగ్గా అన్నాడు.

“అయ్యో.. అలాంటి అభ్యంతరాలేమీ లేవు. నీ కొడుక్కి కాబోయే భార్య తప్పకుండా అదృష్టవంతురాలై ఉంటుంది. నా కూతురికే ఆ అదృష్టం లేదు.”

“అదే ఎందుకని? ఏదో బలమైన కారణం ఉండాలిగా. ఏంటో చెప్పు”

“దానికి నేనంటే ప్రేమని నీకు తెల్సుగా లతీఫ్.”

“ఆడపిల్లకి తండ్రి మీద ప్రేమ ఉండటం సహజమేగా.”

“కానీ దానిది మితిమీరిన ప్రేమ. పిచ్చి పిల్ల లతీఫ్. మా వూళ్ళో సంబంధం అయితే నన్ను రోజూ చూసుకోవచ్చని దాని ఆలోచన.”

లతీఫ్ పెద్దగా నవ్వాడు. “ఇందుకా మా అబ్బాయిని వద్దంటోంది? నిజంగా పిచ్చి పిల్లే. నువ్వయినా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. సరే. ఓ పని చేయి. పెళ్ళయ్యాక వారంలో మూడు రోజులు మా యింట్లో ఉండి నీ కూతుర్ని చూసుకో. నాలుగు రోజులు మీ వూర్లో ఉండు. అప్పుడు కూడా రోజూ వచ్చి నీ కూతుర్ని పల్కరించిపో.. మాకేమీ అభ్యంతరం ఉండదు.”

ఆ ఆలోచన బావుందనిపించింది. ఐనా ఏదో మొహమాటం అడొస్తోంది. “అల్లుడింట్లో అన్నన్ని రోజులుండటం భావ్యం కాదు కదా లతీఫ్” అన్నాడు.

“అప్పుడు నువ్వుండేది అల్లుడింట్లో కాదు. నీ స్నేహితుడింట్లో.. అదే యింట్లో నీ కూతురు అల్లుడూ ఉంటారు. అంతే. నా మాటిను. అమ్మాయితో ఈ విషయం చెప్పు. తప్పకుండా ఒప్పుకుంటుంది. తండ్రిని అంతగా ప్రేమించే అమ్మాయి భార్యగా దొరకడం మా అబ్బాయి అదృష్టం అనుకుంటాను” అన్నాడు.

“ఆస్‌మాకి ఈ ఏర్పాటు తప్పకుండా నచ్చుతుందనే నాకూ అన్పిస్తోంది. నీలాంటి స్నేహితుడుండటం నా అదృష్టం లతీఫ్” అన్నాడు షరీఫ్.

“మొదట యింటికెళ్ళి మాట్లాడి మాకు తీపి కబురు చెప్పు. వీలైనంత తొందర్లో మంగ్నా పెట్టుకుందాం.”

“నీకు మరో విషయం చెప్పాలి లతీఫ్. అనీస్ కోసం సంబంధాలు చూస్తున్నా. తన పెళ్ళి అయ్యాకే మా అమ్మాయి పెళ్ళి.”

“నీ కూతురు మా కోడలుగా వస్తుందంటే చాలు. ఎన్ని నెలలైనా మేం వేచి ఉండటానికి తయారుగా ఉన్నాం” అన్నాడు లతీఫ్.

షరీఫ్ చాలా ఉత్సాహంగా యింటికెళ్ళాడు. నడక్కన్నా మేఘాల్లో తేలుతున్నట్టు వెళ్ళిందే ఎక్కువ. అంత సంతోషంగా ఉన్నాడతను. లతీఫ్ చెప్పినట్లు జరిగితే తన మాట నిలుపుకున్నట్లూ ఉంటుంది, దాంతో పాటు ఆస్‌మా కోరుకున్నట్టు తను తన కూతురి దగ్గర ఉండే అవకాశమూ లభిస్తుంది.

ఆస్మాని పక్కన కూచోబెట్టుకుని లతీఫ్ చేసిన ప్రతిపాదన ఏమిటో చెప్పాడు. అది వినగానే హసీనా కూడా కూతురి పక్కన కూచుంటూ “ఇప్పటికైనా ఒప్పుకోవే. నువ్వంటే ఎంత యిష్టముంటే నీ కాబోయే మామ ఈ మాటంటాడు? కాళ్ళ దగ్గరకొస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకోకే” అంది.

ఆస్‌మా కూడా ఆలోచించింది. ఇదే వూళ్ళో కాపురం చేస్తున్నా తన తండ్రిని చూడగలుగుతుంది కానీ తన యింట్లో ఉంచుకోలేదు. అందులోనూ వారానికి మూడు రోజులంటే ఎవ్వరూ ఒప్పుకోరు. తను లతీఫ్‌కి కోడలైతే తన తండ్రి తనింట్లోనే వారంలో మూడు రోజులుంటాడు. అత్తా మామల్తో పాటు తన తండ్రికి కూడా సపర్యలు చేసుకోవచ్చు. మిగతా నాలుగు రోజులు తన తండ్రే వచ్చి చూసుకుని పోతుంటాడు. తనకు యింతకన్నా కావల్సింది ఏముంటుంది? ఆస్‍మా తన సమ్మతిని తెలియచేసింది.

షరీఫ్ చాలా సంతోషపడ్డాడు. తన కూతురి పెళ్ళి నిశ్చయమైపోయింది కాబట్టి అనీస్‌కి సంబంధాలు వెతకడం ముమ్మరం చేశాడు. చిన్న వూరు కాబట్టి వూళ్ళో పెళ్ళీడుకొచ్చిన ముస్లిం కుర్రవాళ్ళందరూ దాదాపుగా అతనికి తెల్సిన వాళ్ళే. ఎటొచ్చీ వాళ్ళలో అనీస్‌కి ఈడూజోడూ ఉండి, బాగా చూసుకునే అబ్బాయిలే కన్పించలేదు. బద్ధకస్తులో, బీడీలు తాగేవాళ్లో, ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లో, ఛాయ తక్కువవాళ్లో.. వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఒకరిద్దరు ఎన్నతగినవాళ్ళున్నా వాళ్ళకు బంధువుల్లోనే సంబంధాలు కుదిరిపోయి ఉన్నాయి.

తమ యింటికి నాలుగిళ్ళవతల ఉండే షంషుద్దీన్ నాలుగో కొడుకు ఇబ్రహీం బుద్ధిమంతుడు. తండ్రితో పాటు వ్యవసాయం చేస్తాడు. కష్టపడే మనస్తత్వం.. పెద్దలంటే గౌరవం. ఎటొచ్చీ రంగు తక్కువ.. అనీస్ పాలమీగడలా ఉంటుంది. ఇద్దరి జోడీ బావుండదేమో అని ఇన్నాళ్ళూ ఆగాడు. రంగు విషయంలో సమాధానపడటం తప్ప మరో గత్యంతరం లేదనిపించింది. వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాడు.

హసీనాతో ఈ విషయం చెప్పినపుడు మొదట నిష్ఠూరమాడింది. “మీ కిష్టమైన అక్క కూతుర్ని తెచ్చి యింటి పక్కనే పెట్టుకోవాలనుకుంటున్నారా? పక్కూర్లో ఉంటేనే దాంతో గంటలు గంటలు గడుపుతారుగా. యిక పక్కింట్లో కాపురానికొస్తే నేనూ పిల్లలు మీ కంటికి కన్పిస్తామా? పనీ పాటా మానేసి రోజంతా అక్కడే కూచుంటారేమో” అంది.

“అలా ఎందుకంటావు హసీనా.. అది నా కూతురితో సమానమని చెప్పాను కదా.”

“కూతుర్లు లేనివాళ్ళే కూతుర్ల ప్రేమకోసం పాకులాడ్డారు. మీకేమయ్యింది? ముగ్గురు కూతుర్లున్నారుగా. వాళ్ళలో మూడో కూతురు మీరంటే ప్రాణం పెడ్తుందిగా.”

“నిజమే. నాకు ఆస్‌మా అంటే ప్రాణం. దానికి ఈ వూళ్లోనే పెళ్ళి చేసి నా కళ్ళ ముందుంచుకోవాలనుకున్నా. కానీ లతీఫ్ కిచ్చిన మాటవల్ల దానికి పెళ్ళి చేసి బ్రోల్మోకి పంపాల్సి వస్తోంది. నాకు ఆస్మా ఎంతిష్టమో అనీస్ కూడా అంతే యిష్టం. ఆస్‍మా నాకు దూరంగా వేరే వూర్లో ఉందన్న బాధనుంచి ఉపశమనం పొందాలంటే కనీసం అనీస్ అయినా మన వూళ్లో నాకళ్ళెదురుగుగా ఉంటే బావుంటుందని ఆలోచించాను. నీకు కష్టంగా ఉంటుందంటే వద్దులే. దానికి ఈ వూరి సంబంధాలే చూడను.”

హసీనా తన భర్త వైపు చూసింది. అతని మొహం ఉదాసీనంగా మారిపోయింది. కళ్ళనిండా దిగులు గూడుకట్టుకుని కన్పించింది. ఆమెకు జాలేసింది. తన భర్త మంచివాడన్న విషయంలో తనకెటువంటి అనుమానమూ లేదు. ఎటొచ్చీ తన పిల్లల్ని ప్రేమించినంతగా అక్క పిల్లల్ని ప్రేమిస్తున్నందుకే కోపం వస్తుంది. ఆ ప్రేమకూడా తన పిల్లలకే యివ్వొచ్చుగా అన్న స్వార్థం. అనీస్ కోసం వెచ్చించే సమయం తన కోసం వెచ్చించొచ్చుకదా అన్న స్వార్థం..

“మొహం ఎందుకలా పెట్టుకుంటారు? మీ ఇష్టపకారమే కానివ్వండి. నాకూ ఓ రకంగా మంచిదే” అంది.

షరీఫ్‌కి ఆమె ఉద్దేశమేమిటో అర్థం కాలేదు. అనీస్ పేరెత్తితేనే సవతి ప్రస్తావన తెచ్చినంతగా రెచ్చిపోయే తన భార్యకు అనీస్‌కి ఈ వూరి సంబంధం చేయడం వల్ల ఒనగూడే మంచేమిటో ఎంత ఆలోచించినా అతని బుర్రకు తట్టలేదు.

“నీకు మంచిదా? ఏమిటా మంచి?” అని అడిగాడు.

“పక్కనే ఉంటుందిగా. రోజూ మిమ్మల్ని సాధించడానికి దొరికిన మంచి అవకాశం కదా. నేనెందుకు వదులుకుంటాను” అంది అల్లరిగా నవ్వుతూ,

“అయ్యో వద్దు హసీనా. నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడుతుంటేనే యిల్లు జన్నత్‌లా ఉంటుంది. పోట్లాటలు తట్టుకోలేను. నువ్వు అనీస్ విషయంలో నాతో దెబ్బలాడనని ప్రమాణం చేస్తేనే ఈ వూరి సంబంధం చూస్తాను.”

“సర్లెండి. కసం.. మీతో పోట్లాడను. కానీ ఆ సంబంధమే చేయాలని ఎందుకనుకుంటున్నారు?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here