Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఫౌ[/dropcap]జియా తన తలమీద కప్పి ఉన్న దుపట్టాని సవరించుకుని “మేమందరం బాగానే ఉన్నాం. కూతురు ప్రీతిని చూడటానికి కపూర్పూర్ వెళ్ళారుగా. ప్రీతి ఎలా ఉంది? మీ మనవడు, మనవరాలు ఎలా ఉన్నారు?” అని అడిగింది.

“ప్రీతి బావుంది భాభీ.. మనవడూ మనవరాలు పోరు పెట్టబట్టే రెండ్రోజుల్లో తిరిగొద్దామని వెళ్ళిన వాడ్ని నాలుగు రోజులుండిపోయాను. ఇదిగో ఇప్పుడే రావటం” నవ్వుతూ అన్నాడు. మేకపోతు వైపుకు రెండడుగులు వేసి దాని తల నిమరబోతూ “ఏరా మున్నా.. బావున్నావా?” అన్నాడు.

మున్నా తల కిందికి వాల్చి బుసలు కొడ్తూ అతన్ని కొమ్ములో పొడవబోయాడు. “ఒరేయ్.. నేనురా.. నీ పెద్దనాన్నని. చిన్నప్పటినుంచీ చూస్తున్నావు కదరా. నన్నే పొడవడానికొస్తున్నావే” అంటూ నాలుగడుగులు వెనక్కి వేశాడు.

ఫౌజియా మున్నాని అదిలించి, తన మున్నా గురించి అతను తప్పుగా అనుకోకూడదని దాన్ని సమర్థిస్తూ అంది. “లేదు భయ్యా. నా మున్నా చాలా మంచివాడు. వీడికి వయసొచ్చినప్పటినుంచి నా రక్షణ బాధ్యతంతా తనదే అనుకుంటున్నాడు. మీరు దగ్గరికొస్తుంటే నాకేమైనా ప్రమాదం తలపెడ్తారేమోనని హెచ్చరించాడు. అంతే.”

“బంధుమిత్రుల్ని కూడా అనుమానిస్తే ఎలా భాభీ? వాడికి చెప్పండి ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయివాళ్ళో.”

“లాభం లేదు భయ్యా. నా షొహర్ నా దగ్గరకొచ్చినా కొమ్ములు జాడిస్తాడు. వీడికి నేను తప్ప యింకెవ్వరూ అక్కరలేదు. ఆకులు కూడా నేను తెంపి వేస్తేనే తింటాడు. వేరేవాళ్ళు ఎంత బలవంతం చేసినా తిండి ముట్టడు” మున్నాని ప్రేమగా నిమురుతూ అంది.

“సరే భాభీ.. సాయంత్రం యింటికొచ్చి కలుస్తానని ఫక్రుద్దీన్‌కి చెప్పండి” అంటూ అతను వూరి వైపుకు కదిలాడు.

ఫౌజియా గుబురుగా పెరిగిన చెట్ల కిందికి చేరుకుని దోటితో చిన్నచిన్న కొమ్మల్ని తెంపి మున్నా ముందు వేస్తూ “లేత ఆకులే తెంపుతున్నా. నీకు ముదురాకులు తినడం ఇష్టం ఉండదుగా” అంది.

మున్నా కొన్ని ఆకులు తిన్నాక “ఇప్పుడు మరో చెట్టు ఆకులు రుచి చూద్దువుగానీ పద. రోజూ ఒకే రకం కూర తింటే ఎవరికైనా మొహం మొత్తుతుంది. నీక్కూడా రకరకాల ఆకులు తినాలని ఉంటుందని నాకు తెల్సులే” అంటూ మరో జాతి చెట్టు కిందికెళ్ళి ఆకులు తెంపి దాని ముందు వేసింది.

యింకో చెట్టు దగ్గరకు వెళ్ళబోతున్నప్పుడు ఆకాశంలో ఎవరో టపాసులు కాలుస్తున్నట్టు శబ్దం వచ్చింది. ఫౌజియా అప్రమత్తమై, మరోసారి శబ్దం వచ్చినపుడు జాగ్రత్తగా వింది. అది తుపాకుల శబ్దమేనని అర్థమైంది. “ఒరే మున్నా. తొందరగా యింటికెళ్లాం పదరా. ఫౌజీలు మళ్ళా కాల్పులు మొదలెట్టారు. ఈ పాకిస్తాన్ సైనికులకు చేతులు దురద పుట్టినపుడల్లా కాల్పులు జరుపుతుంటారు. సైనికులు సైనికులో కదా తలపడాలి. అమాయకులైన వూరి ప్రజల మీద బాంబులేసి చంపటం ఏంటి రాక్షసత్వం కాకపోతే” అంటూ మున్నాని మెడ దగ్గర పట్టుకుని లాగింది.

మున్నా చెట్ల ఆకుల వైపు ఆశగా చూస్తూ, అక్కడినుంచి కదలడానికి మొరాయించాడు.

“నీకింకా ఆకలిగా ఉన్నట్టుంది. ఐనా ఇప్పుడు కడుపు నింపుకోవడం ముఖ్యం కాదు. ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం. పదరా” అంటూ అదిలించింది.

మున్నా అయిష్టంగానే కదిలాడు. ఫౌజియా వేగంగా నడవసాగింది. ఆమెను అనుసరిస్తూ మున్నా కూడా వడివడిగా నడుస్తున్నాడు. వెనకనుంచి ఫక్రుద్దీన్ గొంతు విన్పించింది. పరుగెత్తుతున్నట్టు నడవడం వల్లనేమో ఆయాసపడ్తూ ఫౌజియాని చేరుకున్నాడు.

భర్త తన పక్కన ఉండటంతో ఫౌజియాకు ధైర్యంగా అన్పించింది. ఇద్దరూ యింటి వైపుకి వేగంగా అడుగులు వేస్తున్నారు. మాటల్లేవు.. మనసులో మరణభయం.. క్షేమంగా యింటికి చేరుకుంటామో లేదోనన్న భయం.. ఏ వైపు నుంచి తూటా దూసుకొస్తుందోనన్న భయం.. యిళ్ళ సముదాయాల్లోకి ప్రవేశించారు. మరో పదిళ్ళు దాటితే తమ యిల్లు వస్తుందనగా ధడేల్ మంటూ శబ్దం చేస్తూ వాళ్ళ ముందు మోర్టార్ పడింది. దాన్ని చూడగానే వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. కొన్ని క్షణాల్లో బాంబు పేలడం, తమ శరీరాలు ముక్కలు ముక్కలు కావడం ఖాయం అనుకుని, కళ్ళు మూసుకుని ‘యా అల్లా’ అనుకున్నారు. ఎన్ని క్షణాలు గడిచినా పేలుడు శబ్దం విన్పించక పోవడంతో కళ్ళు తెరిచి చూశారు. మోర్టార్ మృత్యుదేవతలా కన్పిస్తోంది కానీ పేలడం లేదని అర్థమై బతుకుజీవుడా అనుకుంటూ వేగంగా దాన్ని దాటుకుని యింటికి చేరుకున్నారు.

మున్నాతో పాటే యింట్లోకెళ్ళి తలుపేసుకుని, భీతహరిణేక్షణలా ఉన్న ఫర్హానాని దగ్గరకు తీసుకుని సముదాయిస్తున్న క్షణంలోనే వాళ్ళకు రషీద్ గుర్తొచ్చాడు.

“ఈ పాటికి రషీద్ పట్నం చేరుకుని ఉంటాడా?” ఫౌజియా భయం భయంగా అడిగింది.

“తమ్ముడు బయల్దేరి గంటకు పైగా అయింది కదమ్మా. పట్నం చేరుకుని ఉంటాడ్లే” అంది ఫర్హానా.

ఫక్రుద్దీన్ మనసులో మాత్రం భయం తిష్ట వేసుకుని కూర్చుంది. కాల్పులు మొదలయ్యే సమయానికి వాడు దారి మధ్యలోనే ఉండిఉంటాడని అతనికి తెలుసు. రెండువైపుల్నుంచి వర్షంలా కురుస్తోన్న తూటాలను తప్పించుకుని పట్నం చేరుకుని ఉంటాడో లేదోనని అతని తండ్రి మనసు ఆందోళన పడ్తోంది. తన భయాన్ని వెల్లడిస్తే భార్యా కూతురు కూడా దిగులు పడ్తారనుకుని, మనసులోనే తన కొడుకు క్షేమంగా ఉండాలని అల్లాని ప్రార్థించాడు.

ఎక్కడో అతి సమీపంలో ఫిరంగి నుంచి వెలువడిన మోర్టార్ పడి పెద్ద శబ్దంతో పేలిపోయింది. “ఎవరి యింటిమీదో పడినట్టుంది. యా అల్లా… యింకెన్ని ఫిరంగులు పేలుస్తారో.. మన యింటి మీద పడితే మన గతేమిటి? ముగ్గురం కాలి బూడిదైపోతాం” ఫౌజియా పెద్దగా ఏడ్వసాగింది.

ఫక్రుద్దీన్‌కి కూడా భయం పట్టుకుంది. కానీ శరపరంపరలా వచ్చిపడ్తోన్న తూటాల నుంచి, మధ్య మధ్యలో వూళ్ళోకి వచ్చిపడుతున్న మోర్టార్లనుంచి రక్షించుకునే మార్గమే కన్పించడం లేదు. యింట్లో ముడుచుకుని కూచుంటే మట్టి గోడలు తూటాల నుంచి కాపాడాయేమోగాని ఫిరంగి గుండు పడితే యిల్లూ యింటితోపాటు మనుషులూ నేలమట్టం కావడం ఖాయం. అలాగని బైటికి పరుగెత్తితే ఏ క్షణంలో అయినా తూటాలు శరీరాన్ని ఛిద్రం చేస్తూ దూసుకుపోవచ్చు. ‘యా అల్లా.. నా కుటుంబాన్ని, నా వూరి ప్రజల్ని కాపాడు’ అని ప్రార్థించాడు ఫక్రుద్దీన్.

మరో రెండుగంటల పాటు నిర్విరామంగా తుపాకుల, ఫిరంగుల మోతలు విన్పించాయి. ముగ్గురూ ఓ మూలలో ఒదిగి ప్రాణభయంతో వణికిపోతూ గడిపారు. మున్నాని తమతో పాటే యింట్లోకి తెచ్చుకున్నారు కానీ రెండు బర్రెగొడ్లు బైటే కట్టేసి ఉన్నాయి. అవి బతికున్నాయో లేక ఏ వైపునుంచయినా పేల్చిన ఫిరంగి గుండ్లు తగిలి చచ్చిపోయాయోనన్న భయం కూడా ఫౌజియాని పీడించసాగింది. కాల్పులు ఆగితేగానీ బైటికెళ్ళి చూసుకునే వీలులేదు.

యిలా పాకిస్తానీ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడల్లా పొలాల్లో మేతకెళ్ళిన పశువులు కొన్ని చనిపోవటం ఆ వూరివాళ్ళకు అనుభవమే. ఒక్కోసారి ఒకరో యిద్దరో గ్రామస్థులు కూడా సైనికుల తూటాలకు బలౌతుంటారు. దురదృష్టం ఏమిటంటే ఆ తూటాలు పాకిస్తానీ సైనికులవే కానక్కరలేదు. అదే తమ గ్రామం చేసుకున్న పాపం.. యిరుదేశాల సైనిక శిబిరాలకు సరిగ్గా మధ్యన.. వాళ్ళ కాల్పులకి అందేంత దగ్గరలో తమ గ్రామం ఉండటం దురదృష్టం కాక మరేమిటి? ఫౌజియాకి మూడు నెలల క్రితం పాకిస్తానీ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చి గుండె బరువెక్కింది.

ఆ రోజు జవనరి 26.. గణతంత్ర దినోత్సవం.. పిల్లలందరూ గ్రామంలో ఉన్న ఒకే ఒక ప్రాథమిక పాఠశాలకెళ్ళి జెండా వందనం చేసి, జాతీయగీతం పాడి, టీచర్లు పంచిన చాక్లెట్లు తింటూ యిళ్ళకొస్తున్న సమయం.. పిల్లల మొహాలు వెలిగిపోతున్నాయి. పండగ రోజు వేసుకున్నట్టు ఆ రోజు శుభ్రమైన బట్టలు వేసుకుని ఉన్నారు. మగపిల్లల చొక్కాలకు గుడ్డతో చేసిన మువ్వన్నెల జెండా బొమ్మలు గుచ్చి ఉన్నాయి. ఫౌజియా మున్నాని తీసుకుని ఆకులు తెంపడానికి వెళ్తూ పిల్లల వైపు మురిపెంగా చూసింది. ఆమెకు చిన్నపిల్లల్ని చూసినపుడల్లా దూరంగా ఉన్న మనవళ్ళూ మనవరాళ్ళు గుర్తిస్తారు.

జరీనా కొడుకు అహ్మద్, వాడి వేలు పట్టుకుని నడుస్తున్న అతని చెల్లెలు రిజ్వానా ఎదురుగా వస్తూ కన్పించారు. జరీనా తనకు కోడలు వరసవుతుంది. ఆరేళ్ళ క్రితం వాహెద్ ఆమెను నిఖా చేసుకుని తెచ్చినప్పటినుంచి జరీనాకు, తన మూడో కూతురు ఫర్హానాకు మంచి స్నేహం కుదిరింది. యిద్దరూ కబుర్లలో పడ్తే చాలు యింటిపని, వంటపనీ అన్నీ మర్చిపోతారు. ‘మా వదినా ఆడపడుచుల్ది విడదీయరాని బంధం’ అంటూ ఫర్హానా మురిసిపోతూ ఉంటుంది.

‘ఏరా అహ్మద్… బడికి నీ చెల్లెల్ని కూడా పిల్చుకెళ్ళావా?” అని అడిగింది తను.

‘ఔను దాదీమా.. అక్కడ అందరికీ చాక్లెట్లు పంచుతారుగా. అందుకు పిల్చుకెళ్ళా’ అన్నాడు అహ్మద్.

వాడికి ఐదేళ్ళ వయసుంటుంది. రిజ్వానాకి మూడేళ్ళకు మించి ఉండదు. అహ్మద్‌ని యింకా బళ్ళో భర్తీ చేయలేదు. ఆ వూళ్లో పిల్లల్ని బడికి పంపాలన్నా భయపడతారు. ఏ సమయంలో పాకిస్తానీ సైనికులు కాల్పులు జరుపుతారో తెలియదు. మానవత్వం లేకుండా ఒక్కోసారి పండగ రోజుల్లో కూడా కాల్పులు జరుపుతారు. గ్రామస్థులు తమ పిల్లల్ని చదివించడం కన్నా సైనికుల తూటాలకు బలి కాకుండా బతికించుకోవడమే ముఖ్యమనుకుంటారు. అందుకే బడికెళ్ళి చదువుకునే పిల్లలు చాలా తక్కువ. అమ్మాయిల్నయితే అసలు పంపరు.

‘ఎన్ని చాక్లెట్లు యిచ్చారా?” అని అడిగింది తను.

‘ఒకటే దాదీమా.. నాకొకటి.. చెల్లికొకటి’ ఒకటి కంటే ఎక్కువ యివ్వనందుకు వాడి మొహంలో నిరాశ కన్పించింది.

“సర్లే.. ఓ గంటాగి నీ చెల్లిని తీసుకుని యింటికి రా. నీకూ దానికి ఖీర్ చేసి పెడ్తాను’ అంది తను.

“షుక్రియా దాదీమా.. నాకు సాబుదానా ఖీర్ అంటే చాలా యిష్టం.. అందులో వేసిన కాజూల్ని ఏ రుకుని తినడమంటే మరీ ఇష్టం.” అహ్మద్ కళ్ళు సంతోషంతో మెరవడం గమనించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version