రెండు ఆకాశాల మధ్య-32

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“నా[/dropcap] షొహర్ రెండు మైళ్ళ దూరంలోనేగా ఉన్నాడు.. అలా అయితే తను రావడానికి అరగంటకన్నా ఎక్కువ పట్టదు” వెంటనే అందుకుంటూ అంది హసీనా.

మాన్‌సింగ్‌కి వాళ్ళని చూస్తే జాలేస్తోంది. బాధగా కూడా అన్పిస్తోంది. తను చెప్పబోయే జవాబు వాళ్ళ ఆశలమీద నీళ్ళు చల్లబోతోందని తెల్సినా చెప్పకుండా ఉండలేని ఇబ్బందికర పరిస్థితి.. దీనికన్నా యుద్ధరంగంలో శత్రు సైనికులతో హోరాహోరీగా పోరాడటమే సులభం అనుకున్నాడు. అక్కడ శరీరాలకు గాయాలౌతాయి. శరీర భాగాలు తెగిపడ్డాయి. ప్రాణాలు కోల్పోతారు. కానీ ఇక్కడ హృదయాలకు గాయాలౌతున్నాయి. తమ ఆత్మీయులు తమ శరీరం నుంచి ఛేదించబడిన అవయవాల్లా ఎక్కడెక్కడో విసిరేయబడ్తున్నారు. ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించిన తమ ప్రియతముల్ని కోల్పోతున్న సందర్భం.. అది ప్రాణం పోవడం కన్నా అత్యంత బాధాకరం..

“అలా నేరుగా బ్రోల్మో నుంచో, స్కర్దూ నుంచో ఈ వూరికి రావడానికి వీలుకాదు. సరిహద్దు రేఖని ఎక్కడంటే అక్కడ దాటడానికి అవకాశం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన దారిగుండానే ఈ వూరికి చేరుకోవాలి”

“ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది?” అని అడిగాడు జావేద్.

“దాదాపు మూడు నాలుగు వేల కిలోమీటర్లు..”

“మీ ప్రభుత్వం ప్రయాణ ఖర్చులు భరిస్తుందా?”

“భరించదు.”

ఆ మాట వినగానే హసీనా తోక తొక్కిన తాచుపాములా సర్రున లేచింది. “రెండు మైళ్ళ దూరం ఉన్న పక్క గ్రామం నుంచి ఇక్కడికి చేరుకోడానికి వేల మైళ్ళ దూరం ప్రయాణించాలంటున్నారు. మాలాంటి పేదవాళ్ళు అంత ఖర్చుని భరించగలరా? మీ ప్రభుత్వం భరించనప్పుడు అసలు మా గ్రామాన్ని మీరెందుకు కలుపుకున్నారు? మేమడిగామా కలుపుకోమని? హఠాత్తుగా దాడి ఎందుకు చేశారు? మాకు ఒకట్రెండు రోజుల సమయమైనా ఇవ్వాలి కదా. అప్పుడు పాకిస్తాన్ కావాలనుకున్నవాళ్ళు బ్రోల్మోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడే ఉండాలనుకునేవాళ్ళు వేరేవూళ్ళ కెళ్ళినా వెంటనే తిరిగొచ్చేసేవాళ్ళు. ఇలా మా వాళ్ళనుంచి మమ్మల్ని విడదీయడం మీకు అన్యాయమనిపించడం లేదా? పాపమనిపించడం లేదా? మీ దేవుడు క్షమిస్తాడనుకుంటున్నారా?” అంది.

జావేద్ ఆమెను సమీపించి, శాంతపరిచాడు. అధికారులతో మాట్లాడే తీరు అది కాదని ఆమెకు నచ్చచెప్పాడు. “నా గుండె మంట మీకెలా అర్థమౌతుంది బాబాయ్” అంది హసీనా.

“నీకేనా బాధ? నాకు లేదా? నా కడుపుమంట ఎవ్వరికి చెప్పుకోను? ఇంతే. మన నసీబ్‌లో ఇలా రాసి ఉందని సమాధానపడటమే” అన్నాడు జావేద్.

“నేను తన బాధని అర్థం చేసుకోగలను. అందుకే తనేమన్నా నాకు కోపం రావడం లేదు. ఆమె స్థానంలో నేనున్నా ఇంకా ఎక్కువ ఉద్రేకపడి మాట్లాడి ఉండేవాణ్ణి. మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోండి. నా పై అధికారులిచ్చే ఆజ్ఞల్ని పాటించడం తప్ప నేను స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోలేను. సరిహద్దుని దాటించే విషయంలో నాకు ఎటువంటి అధికారాలూ లేవు. మీరు బాధపడ్తుంటే చూసి మీతో పాటు బాధపడటం తప్ప ఏమీ చేయలేను” అన్నాడు మాన్‌సింగ్.

హసీనా అంత రెచ్చిపోయి మాట్లాడినా, ప్రశాంత వదనంతో మాట్లాడుతున్న ఆ మేజర్ మీద గ్రామస్థులందరికీ గౌరవభావం ఏర్పడింది. మీరు బాధపడితే మీతో పాటు బాధపడ్డానన్న అతని హృదయం ఎంత సున్నితమో అర్థమై అతనంటే అందరికీ ఇష్టం ఏర్పడింది. దండించే అధికారం చేతిలో ఉన్నా దయగా మాట్లాడుతున్న అతని మీద పెద్దవాళ్ళకు వాత్సల్యభావం కలిగింది. మిగతావాళ్ళకు అతను మిలట్రీ అధికారిలా కాకుండా అక్కున చేర్చుకునే ఆత్మీయుడిలా కన్పించాడు.

అప్పటికి సమయం రాత్రి ఏడు కావస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నపళంగా పరుగెత్తడంతో ఎవ్వరూ వంట సామగ్రి తెచ్చుకోలేదు.

పిల్లలు ఆకలికి తాళలేక ఏడుస్తున్నారు.

“అందరూ గ్రామానికి పదండి. ఈ రోజు మీ అందరికీ వంట దినుసులు మా సైనికులే అందచేస్తారు” అన్నాడు మాన్‌సింగ్.

గ్రామస్థులు జావేద్ అభిప్రాయం కోసం అతని వైపు చూశారు. జావేద్ అంగీకార సూచకంగా తల వూపుతూ తనే ముందు కదిలాడు. అతని వెనక మిగతా వాళ్ళందరూ నడిచారు.

ఎవరిళ్ళకువాళ్ళు చేరుకున్నాక సైనికులు ఇల్లిల్లూ తిరిగి, బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, బంగాళా దుంపలు పంచారు. చాలా ఇళ్ళలో ఆ రోజు మొదటిసారి అన్నాన్ని రుచి చూశారు.

జావేద్ యింట్లో, హసీనా యింట్లోనే కాకుండా మరికొన్ని యిళ్ళల్లో పొయ్యే వెలగలేదు. పక్క వూళ్ళకెళ్ళి యిప్పుడు పరాయి దేశస్థులైపోయిన తమ వాళ్ళ గురించిన దిగుల్తో వాళ్ళు మెతుకు ముట్టలేదు.

వాళ్ళు పస్తులు పడుకుంటారేమోనన్న అనుమానం మాన్‌సింగ్‌కి కూడా కలిగింది. అతను హసీనా వాళ్ళ యింటికి, జావేద్ వాళ్ళ యింటికి ప్రత్యేకంగా వెళ్ళి అన్నాలు తిన్నారో లేదో కనుక్కున్నాడు. అసలు పొయ్యే రాజెయ్యలేదని తెల్సుకుని “మా సైనికులకోసం చేసిన వంటలు పంపిస్తాను. తినండి. మీరు పస్తులుంటే నాకు బాధనిపిస్తుంది. నాకిప్పుడో విషయం అర్థమైంది. ఇన్నాళ్ళూ యుద్ధం సైనికుల తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు మాత్రమే గుండెకోత అనుకునేవాడ్ని. అది కొన్నిసార్లు మీలాంటి అమాయక ప్రజలకు కూడా గుండెల్లో గాయాలు మిగులుస్తుందని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను” అన్నాడు.

సైనికుల కోసం వండిన పరోటాలు, ఉడకబెట్టిన బంగాళాదుంపల కూర, అన్నం, పప్పు తెప్పించి వాళ్ళకు ఇప్పించాడు. ఎవరెంత బతిమాలినా హసీనా, ఆస్‌మా, అనీస్‌లు మెతుకు ముట్టలేదు. నిరంతరం ప్రవహించే షింగో నదికి మల్లె వాళ్ళ కన్నీళ్ళకు అంతం లేకుండా పోయింది.

***

స్కర్దూ పట్టణంలో చీకట్లు ముసురుకోసాగాయి. బట్టలు కొనడం ఆలస్యమయ్యేకొద్దీ షరీఫ్‌లో పెరుగుతూ ఆదుర్దా.. “తొందరగా కానివ్వు దీదీ.. ఎన్ని దుకాణాలని తిప్పుతావు? ఏదో దొరికిందే కొనెయ్యొచ్చుగా” అన్నాడు జైనాబీతో అసహనంగా.

“ఇవేమీ రోజూ వాడకానికి కొనే బట్టలు కావు కదరా. పెళ్ళి బట్టలు.. నిదానంగా చేయాల్సిన పని. మనక్కావల్సిన రంగు బట్టలు దొరికేవరకు పది చోట్లకైనా తిరగాలి. నువ్వు ప్రశాంతంగా ఉండు. నన్ను తొందర పెట్టకు” అంటూ కసురుకుంది జైనాబీ..

“సమయం ఎంతయిందో చూశావా? మనం మీ వూరెళ్ళేదెప్పుడు? అక్కడ్నుంచి నేను మా వూరెళ్ళేదెప్పుడు? అర్ధరాత్రి అయిపోయేలా ఉందక్కా”

“ఏం కాదులేరా.. అసలు పెళ్ళి బట్టలు కొనడానికి మగవాళ్ళని వెంటపెట్టుకుని రావడమే తప్పు. నువ్వు హసీనాని నాకు తోడిచ్చి పంపితే సరిపోయేది. నీ నస ఉండేది కాదు” జైనాబీ నవ్వుతూ అంది.

“మరీ చీకటి పడితే ఇంత ఖరీదు పెట్టి కొన్న బట్టలు తీసుకుని మా వూరెళ్ళడం ప్రమాదం కదక్కా, మధ్య దారిలో ఎవరైనా దొంగలు అడ్డుపడి దోచుకుంటేనో” తన మనసులోని భయాన్ని వెళ్ళగక్కాడు.

“నేనా విషయం ముందే ఆలోచించానులేరా. ఏం కొంపలు మునిగిపోతున్నాయని రాత్రికి రాత్రి మీ వూరెళ్ళాలి? మా యింట్లోనే పడుకుని ఉదయం వెళ్దువుగానీలే” అంది జైనాబీ.

ఆ మాటలో షరీఫ్‌లోని ఆరాటం కొద్దిగా తగ్గింది. రాత్రికి అక్కవాళ్ళింట్లో ఉండిపోతానని హసీనాకు చెప్పి ఉంటే బావుండేది. ఎంత రాత్రయినా రాకపోతే ఆమె కంగారు పడదా? ఆస్‌మా భోజనం చేయకుండా తన కోసం ఎదురుచూస్తూ కూచోదా?

దార్లో తనకేదైనా ప్రమాదం జరిగిందేమోనని భయపడే అవకాశం కూడా ఉందిగా. ఎంత రాత్రయినా సరే యింటికెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. బట్టలు అక్క వాళ్ళింట్లోనే ఉంచేసి మరునాడు వెళ్ళి తెచ్చుకుంటే సరి. అలా అనుకోగానే అతనికి మనశ్శాంతిగా అన్పించింది.

దుకాణాల్లో లైట్లు వెలిగించారు. వీధి లైట్లు కూడా వెలిగాయి. నిఖా రోజుకి అవసరమైన రంగూ నాణ్యత ఉన్న బట్టలు కొనడం పూర్తవడానికి మరో అరగంట సమయం పట్టింది. షరీఫ్‌కి కూడా సంతృప్తిగా అన్పించింది. సుహాగ్ రాత్ రోజు హసీనా కట్టుకున్న నెమలికంఠం రంగు కమీజ్, లాల్ దుపట్టా, ఆస్మా కోసం గులాబీ రంగు షల్వార్ కమీజ్ దొరికాయి.

ఇద్దరూ బ్రోల్మో చేరుకునేటప్పటికి ఏడు దాటింది. వూళ్ళోకి ప్రవేశిస్తూనే వాతావరణంలో ఏదో తేడాని గమనించాడు షరీఫ్. బైట మనుషులెవ్వరూ తిరగడం లేదు. ఎటు చూసినా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అన్ని యిళ్ళల్లో తలుపులు మూసేసి ఉన్నాయి. బైట చాయ్ అమ్మే దుకాణాలు కూడా మూతబడి ఉన్నాయి.

“ఏమైందిరా మా వూరికి? ఒక్కడూ కన్పడడేం? అసలు యిళ్ళల్లో ఐనా ఉన్నారా లేక ఎక్కడికైనా పారిపోయారా? చిన్న అలికిడి కూడా విన్పించడం లేదేమిట్రా?” అంది జైనాబీ..

“అదే నాకూ అర్థం కావడం లేదక్కా.. ఏ దయ్యాన్నో జిన్నాత్‌నే చూసి భయపడి తలుపులు బిడాయించుకున్నట్టు బిడాయించుకున్నారు” అన్నాడు షరీఫ్.

దార్లోనే లతీఫ్ వాళ్ళ యిల్లుంది. మిగతా వాళ్ళకు మల్లే ఆ యింటి తలుపులూ కిటికీలు కూడా మూసేసి ఉన్నాయి.

“ఆశ్చర్యంగా ఉందే.. ఏమైందో లతీఫ్‌ని కనుక్కుంటా ఉండు” అన్నాడు షరీఫ్. జైనాబీ రోడ్డు వారగా నిలబడి “తొందరగా వెళ్ళిరా. మీరిద్దరూ కబుర్లలో పడితే మీకు సమయమే తెలియదు. యింటికెళ్ళి వంట చేసుకోవాలి” అంది.

షరీఫ్ తలుపు తట్టాడు. నిశ్శబ్దం తప్ప అసలు లోపల మనుషులున్న అలికిడికానీ, తలుపు తీయడానికి ఎవరైనా వస్తున్న అడుగుల సవ్వడి కానీ విన్పించలేదు. ఈసారి గట్టిగా తలుపు తట్టాడు. లోపల్నుంచి లతీఫ్ గొంతు “ఎ.. ఎ.. ఎవరూ” అంటూ విన్పించింది. లతీఫ్ ఎందుకంతలా భయపడున్నాడో అతనికర్థం కాలేదు. “లతీఫ్.. నేను.. షరీఫ్ ని. తలుపు తీయి” అంటూ లోపలికి విన్పించేలా గొంతు పెంచి అన్నాడు.

రెణ్ణిమిషాల తర్వాత మెల్లగా తలుపు సగం తెరిచి, తల మాత్రం బైటకు పెట్టి చూశాడు లతీఫ్. అక్కడ నిలబడి ఉంది షరీఫే అని నిర్ధారించుకున్నాక “నువ్వు మొదట లోపలికి రా.. బైట నిలబడితే ప్రమాదం” అంటూ అతని చేయిపట్టి లోపలికి గుంజాడు.

“అక్క కూడా బైటనే ఉంది” అన్నాడు షరీఫ్.

“అయ్యో.. అక్క కూడా ఉందా?” అంటూ మళ్ళా తల బైట పెట్టి అటూఇటూ చూసి, జైనాబీ కన్పించగానే “దీదీ.. మీరు కూడా లోపలికి రండి. తొందరగా రండి” అన్నాడు లతీఫ్.

జైనాబీకి యింటికెళ్ళాలన్న తొందర.. లోపలికెళ్తే చాయ్ తాగి వెళ్ళండని బలవంత పెడ్తాడనుకుని “పర్లేదు. యింటికెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి?” అంది.

“మీరు మొదట లోపలికి రండి. చెప్తాను” అంటూ తొందరపెట్టాడు. ఆమె లోపలికి రాగానే తలుపు మూసేసి, షరీఫ్ వైపు తిరిగి “హిందూస్తాన్ సైనికులు హుందర్నో గ్రామాన్ని ఆక్రమించుకున్నారు. మన తూర్పు పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో మన దేశం ఓడిపోయిందట. సరిహద్దుకి ఆనుకుని ఉన్న మన మరికొన్ని గ్రామాల్ని కూడా భారతదేశం స్వాధీనపర్చుకుందట. హుందర్మోను దాటి సైనికులు మన గ్రామం మీద కూడా దాడి చేసి, కన్పించిన వాళ్ళని కాల్చేస్తారని అనుకుంటున్నారు. అందుకే అందరం భయపడి, యిళ్ళల్లో దాక్కున్నాం” అన్నాడు లతీఫ్.

“మా వూరు హిందూస్తాన్ సైనికుల హస్తగతమైందా?” నమ్మలేని నిజమేదో విన్నట్టు అడిగాడు షరీఫ్.

“ఔను. ఇక్కడినుంచి బంధువుల యిళ్ళకని హుందర్మో వెళ్ళిన ఇద్దరు యువకులు, సైనికులు వస్తున్నారన్న వార్త తెలియగానే ప్రాణాలకు తెగించి పారిపోయి వచ్చేశారు. ఇప్పుడు హుందర్మో పాకిస్తాన్ గ్రామం కాదు. హిందూస్తాన్లో గ్రామం..”

“యా అల్లా.. ఇప్పుడు నేనేం చేయాలి? నేనిక్కడ యింకో క్షణం కూడా ఉండలేను. ఇప్పుడే మా వూరికి బయల్దేరతాను” బైటికెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు షరీఫ్.

“పిచ్చా నీకేమైనా? వూరి పొలిమేరల్లో సైనికులు గస్తీ తిరుగుతున్నారట. ఎవర్నీ రానివ్వరు.”

“ఎందుకు రానివ్వరు? అది మా వూరు. నా పెళ్ళాం పిల్లలు ఆ వూళ్లోనే ఉన్నారు. నన్ను తప్పకుండా రానిస్తారు. నాకా నమ్మకముంది.”

“అసలే చీకటిగా ఉంది. నువ్వు మాట్లాడేది వాళ్ళు వింటారనుకున్నావా? దూరం నుంచే నిన్ను కాల్చేస్తారు. మాట్లాడే అవకాశమే ఇవ్వరు.”

“నా కూతురు అనీస్‌ని చూసుకోవాలంటే ఎలా? అయ్యో.. పక్క వూరే అని కదా ఇచ్చాను. నా కూతుర్ని చూసుకోకుండా నేనుండలేనే” అంటూ జైనాబీ ఏడుపు మొదలెట్టింది.

“నాకెందుకో భయంగా ఉంది లతీఫ్. నన్ను మావూరికి రానిస్తారు కదా” కొన్ని నిమిషాల క్రితం తప్పకుండా రానిస్తారన్నవాడే లోపల తొలుస్తున్న అనుమాన నివృత్తి కోసం అడిగాడు.

“యుద్ధవాతావరణం సద్దుమణిగాక రానిస్తారనే అన్పిస్తోంది. దేశ విభజన సమయంలోనే భారతదేశంలో ఉండాలో పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాలో నిర్ణయించుకోమని మన ఇష్టానికి వదిలేసినవాళ్ళు ఇప్పుడెందుకు అడ్డుపడ్తారు? హుందర్మో భారతదేశంలో భాగమైనప్పటికీ ఈ వూర్నుంచి ఆ వూరికెళ్ళి ఉండాలనుకునే వాళ్ళని ఉండనిస్తారు. ఆ వూర్నుంచి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళని రానిస్తారు.”

స్నేహితుడి మాటలు షరీఫ్‌కి సాంత్వన చేకూర్చాయి. “ఐతే ఇప్పుడే వెళ్ళాచ్చుగా” అన్నాడు.

“రేపుదయం వరకు ఆగుదాం. పుకార్లు నిజమై హిందూస్తాన్ సైనికులు మా వూరిని కూడా ఆక్రమించుకుంటారేమో వేచి చూడటం మంచిది” అన్నాడు లతీఫ్.

“అప్పుడు ఈ రెండూళ్ళూ ఒకే హుకూమత్ కిందికి వస్తాయి కాబట్టి నేను నా కూతుర్ని వెళ్ళి చూసుకోడానికి ఇబ్బంది ఉండదు” అంది జైనాబీ.

“మీరు మొదట జాగ్రత్తగా యింటికెళ్ళిపొండి. ఉదయం నేను కూడా మన వూరి పొలిమేర వరకు తోడొస్తాను. నిన్ను హుందర్మోకి పంపించాకే వెనక్కి తిరిగొస్తాను. సరేనా” అన్నాడు లతీఫ్.

షరీఫ్‌కి అనాయాసంగానే కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. దుఃఖం వరదొచ్చిన నదిలా పొంగుకొస్తోంది.

యింటికి చేరుకున్నాక జైనాబీకి వంట చేయాలనిపించలేదు. కడుపునిండా దుఃఖం నిండిపోయి ఉండటం వల్ల ఇద్దరికీ ఆకలి వేయలేదు. రాత్రంతా ఇద్దరికీ కంటి మీద కునుకు లేదు. చిన్న అలికిడైనా షరీఫ్ ఉలిక్కిపడి లేచి కూచుంటున్నాడు. భారతదేశ సైనికులు బ్రోల్మో పైన దండెత్తి వచ్చారేమోనని తుపాకీ శబ్దాల కోసం చెవులు రిక్కించి వింటున్నాడు. అతని అంతరంగంలో వాళ్ళు బ్రోల్మోని కూడా స్వాధీనం చేసుకోవాలన్న కోరిక బలీయంగా ఉంది. రాత్రంతా ఆ కోరిక తీర్చమని అల్లాని ప్రార్థిస్తూనే ఉన్నాడు.

పాకిస్తానీ పౌరుడిగా అలా కోరుకోవడం దేశ ద్రోహం కిందికి వస్తుందని అతనికి తెలుసు. తనకు దేశంకన్నా తన కుటుంబమే ముఖ్యం. తనకు తన భార్యా పిల్లలు కావాలి. వాళ్ళకోసం ఏ దేశ పౌరసత్వం తీసుకోమన్నా సంతోషంగా తీసుకుంటాడు. అతనికి మరో ఆలోచన కూడా వచ్చింది. తను ఉదయం వరకు హుందర్మోలో ఉన్నాడు కాబట్టి పాకిస్తానీ పౌరుడు. ఇప్పుడు హుందర్మో భారతదేశంలో భాగమైపోయింది కాబట్టి రేపు తనని తన గ్రామానికి రానిస్తే తను భారతదేశ పౌరుడు. ఈ రాత్రి బ్రోల్మో ఉన్నాడు కాబట్టి, బ్రోల్మో యింకా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కాబట్టి పాకిస్తాన్ పౌరుడు. ఒకవేళ బ్రోల్మోని కూడా హిందూస్తానీ సైన్యం ఆక్రమించుకుంటే రాత్రికి రాత్రి తను భారతదేశ పౌరుడైపోతాడు. రెండు దేశాల మధ్య ఇది వాళ్ళ సైనిక బలాలకు, పౌరుషాలకు, ఆధిపత్యాలకు సంబంధించిన విషయం కావచ్చు. కానీ తనలాంటివాళ్ళ విషయంలో ఎంతటి హింస.. ఎంతటి నరకయాతన.. తనలాంటి వాళ్ళ జీవితాల్తో ఆడుకునే క్రూరమైన, భయంకరమైన ఆట.. విధి ఆడే ఆట కాదు.. దేశాలు ఆడుకుంటున్న ఆట.. రాక్షస క్రీడ..

ఐదింటికే లేచి యింట్లోనే నమాజ్ చేశాడు. ఆరింటికి పెళ్ళి కోసం కొన్న బట్టల మూట తీసుకుని లతీఫ్ వాళ్ళ యింటికి బయల్దేరబోతుంటే జైనాబీ కూడా తోడు వస్తానంది. బైట పరిస్థితి ఎలా ఉందో తెలియదు. రాత్రి సైనికులు దాడి చేసిన దానికి దాఖలాగా ఏ శబ్దమూ రాలేదు. అలాగని హిందూస్తానీ సైనికులు బ్రోల్మోని ఆక్రమించుకోలేదని చెప్పడానికి కూడా వీల్లేదు. అలా జరిగుంటే వూరంతా సైనికుల పహారాలో ఉండొచ్చు. అందుకే ఆమెను వద్దని వారించాడు.

బైట సైనికుల హడావిడి ఏమీ కన్పించలేదు. మనుషుల అలికిడి కూడా లేదు. వూరంతా నిశ్శబ్దంగా ఉంది. లతీఫ్ ఉదయం ఐదింటికే లేచి తయారై ఉండటంతో షరీఫ్ రావడంతోనే అతన్తోపాటు బయల్దేరాడు.

దార్లో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇద్దరి మనసుల్లో రకరకాల భయాలు సుళ్ళు తిరుగుతున్నాయి. బ్రోల్మో గ్రామ పొలిమేర దగ్గరపడే కొద్దీ వాళ్ళ గుండె వేగంగా కొట్టుకోసాగింది. నడక మందగించింది.

“ఈ వూరు పాకిస్తాన్లోనే ఉందా లేక రాత్రి హిందూస్తాన్ సైనికులు ఆధీనం చేసుకున్నారా?” తన మనసులోని అనుమానాన్ని వ్యక్తపరిచాడు షరీఫ్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here