Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-33

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“అ[/dropcap]లాంటిదేమీ జరిగినట్టు కన్పించడం లేదు షరీఫ్. మనం పాకిస్తాన్ హుకూమత్ లోనే ఉన్నాం. హుందర్మో గ్రామం మాత్రమే భారతదేశంలో భాగమైనట్టుంది” అన్నాడు లతీఫ్.

‘యా అల్లా.. నా మిన్నత్‌ను ఎలాగూ తీర్చలేదు. నేను నా కుటుంబాన్ని చేరుకోవడంలో ఏ అడ్డంకులూ లేకుండా చూడు’ అని మనసులో అల్లాని ప్రార్థించాడు షరీఫ్.

పొలిమేర దగ్గర పాకిస్తానీ సైనికులు గస్తీ తిరుగుతూ కన్పించారు. వీళ్ళని చూడగానే ఓ సైనికుడు “ఠహరో.. ఆగే మత్ బఢో” అంటూ అరిచాడు.

ఎదురుగా తన పైకి లంఘించబోతున్న పులిని చూసినట్టు భయంతో కదలకుండా నిలబడిపోయాడు షరీఫ్.

లతీఫ్ ధైర్యం కూడగట్టుకుని “ఆదాబ్ ఫౌజీ సాహెబ్. ఆప్ కె కదమోం మే ఏక్ గుజారిష్ అర్జ్ కరనే కా ఇజాజత్ దీజియే” అన్నాడు.

కదమోంమే, గుజారిష్, ఇజాజత్ లాంటి పదాలు వినడంతో సైనికుడు మెత్తబడ్డాడు. “మీరు ముందుకు రాకూడదు. అక్కడే నిలబడండి” అంటూ అతనే వాళ్ళున్న చోటికి చేరుకుని “ఏంటో చెప్పండి” అన్నాడు.

“సర్కార్. ఇతని పేరు షరీఫ్. నా దోస్త్. హుందర్మో గ్రామస్థుడు. ఇతని భార్యా పిల్లలు అక్కడే ఉన్నారు. నిన్న ఉదయం ఇతను బ్రోల్మోకి వచ్చాడు. దయచేసి ఇతన్ని హుందర్మోకి వెళ్ళి తన కుటుంబాన్ని కల్సుకునే అవకాశం ఇప్పించండి. మీకు అల్లా మేలు చేస్తాడు” అన్నాడు లతీఫ్.

“కుదర్దు. ఇది పాకిస్తాన్. అది ఇండియా. బార్డర్ దాటడానికి రూల్స్ ఒప్పుకోవు” అన్నాడతను

“సర్కార్.. ఇంకా బార్డర్ కోసం ఇనుప కంచెలేమీ బిగించలేదుగా. పొలిమేర దాటించడం ఎంత సేపు? మీరు పెద్ద మనసు చేసుకుని…”

“వీలు కాదంటున్నాగా. ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపొండి. కాల్పులు జరిగితే ప్రమాదం”

“ఎవరు కాల్పులు జరుపుతారు హుజూర్?”

“ఎవరైనా జరపొచ్చు.. అట్నుంచి ఇండియన్ సైనికులు కాల్పులు జరపొచ్చు లేదా మేమే వాళ్ళమీద కాల్పులకు తెగబడొచ్చు. చెప్పలేం. సాధారణ పౌరులు బార్డర్‌కి దగ్గరగా రాకూడదు. ఇనుప కంచె వేయనవసరం లేదు. ఇది రెండు దేశాలకు మధ్య సరిహద్దు రేఖ. వెళ్ళిపొండి.”

దుఃఖ సముద్రంలో మునిగి విలవిల్లాడుతున్న షరీఫ్‌కి బొటబొటా కన్నీళ్ళు కారాయి. అతను సైనికుడి కాళ్ళమీద పడిపోతూ “సర్కార్.. నా భార్యా పిల్లలు ఆ వూళ్లో ఉన్నారు. నన్ను వెళ్ళనివ్వండి. త్వరలో నా కూతురి నిఖా చేయాలి. నాకు నా కూతురంటే ప్రాణం హుజూర్. నేను వాళ్ళకు దూరమై బతకలేను. మీరు పంపించకపోతే ఇక్కడే తల నేలకేసి కొట్టుకుని చచ్చిపోతాను” అన్నాడు.

“నీకు చచ్చిపోవాలనిపిస్తే చచ్చిపో. నువ్వే కాదు కదా నీ శవం కూడా బార్డర్ దాటడానికి వీల్లేదు” అన్నాడు కటువుగా సైనికుడు.

లతీఫ్ కల్పించుకుని “అంత నిర్దయగా మాట్లాడకండి సర్కార్. అల్లా మెచ్చడు. సాటి ముసల్మాన్‌కి సాయం చేస్తే మీకు పుణ్యం లభిస్తుంది” అన్నాడు.

“నేను ఫౌజీని. పాకిస్తాన్ ప్రభుత్వ ఆజ్ఞల్ని పాటించడమే నా విధి. నా విధి నిర్వహణలో నువ్వు ముసల్మాన్ హిందువా అని చూడను. ఇప్పటికే చాలా సమయం వృథా చేశారు. వెళ్ళిపొండి.”

“పోనీ నా దోస్త్ తన భార్యాపిల్లల్ని కల్సుకునే మార్గమేదైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి” అన్నాడు లతీఫ్.

“ఒక్కటే మార్గం.. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పాస్‌పోర్ట్ తీసుకుని, ఇండియా వెళ్ళడానికి వాళ్ళ ఎంబసీ నుంచి వీసా సంపాయించి, తన గ్రామాన్ని చేరుకోవచ్చు. అప్పుడైనా ఈ వూరి పొలిమేర దాటి ఆ వూరికి చేరుకోవచ్చనుకుంటున్నారేమో. కాదు. ఇరు ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గంలోనే వెళ్ళాలి.”

“షుక్రియా సర్కార్.. ఆ నిర్దేశించిన మార్గం ఏమిటో శెలవిస్తారా?”

సైనికుడికి కోపం వచ్చింది. “నేనేమైనా సమాచార కేంద్రంలో పని చేస్తున్నాననుకుంటున్నావా? పో.. పోయి ఎక్కడ సమాచారం దొరుకుతుందో అక్కడ కనుక్కో” అన్నాడు.

ఇంక అతన్ని బతిమాలటంవల్ల ప్రయోజనం లేదని లతీఫ్‌కి అర్థమైంది. షరీఫ్ చేయి పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ “మనం వెళ్ళి ఆ సమాచారం ఎక్కడ దొరుకుతుందో కనుక్కుందాం పద” అన్నాడు.

షరీఫ్ పెద్దగా ఏడుస్తూ “నేను రాను. రాలేను. నాకు మా వూరు కావాలి. నాకు నా భార్యబిడ్డలు కావాలి” అన్నాడు.

అప్పటికే మరో ఇద్దరు సైనికులు ముందుకొచ్చి మొదటి సైనికుడ్ని వివరాలడిగి తెల్సుకున్నారు.

“మీకు రెణ్ణిమిషాల సమయం ఇస్తున్నాం. ఇక్కణ్ణుంచి కదిలి వెళ్ళకపోతే షూట్ చేసేస్తాం” అన్నాడు కొత్తగా వచ్చి చేరిన సైనికులలో ఒకడు. మరొకడు నిజంగానే తుపాకీ ఎక్కుపెట్టి షరీఫ్ వైపు గురిపెట్టాడు.

లతీఫ్‌కి భయమేసింది. బలవంతంగా షరీఫ్‌ని లేపి దూరంగా లాక్కెళ్ళాడు.

ఏడుస్తున్న షరీఫ్‌ని ఓదారుస్తున్నాడన్నమాటేగాని లతీఫ్ మెదడునిండా తన కొడుకు పెళ్ళి గురించిన ఆలోచనలే ఉన్నాయి. తనకూ తన భార్యకే కాదు తన కొడుకు హనీఫ్‌కి కూడా ఆస్‌మాని నిఖా చేసుకోవడం ఇష్టం. పెళ్ళి మరికొద్ది రోజుల్లో ఉండగా రెండూళ్ళ మధ్య బార్డర్ రూపంలో కళ్ళకు కన్పించని ఇనుప ముళ్ళ కంచె మొలవడంతో అతనికి దిక్కు తోచకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆస్‌మా కోడలిగా తమ యింటికి రావడం సాధ్యపడుందా? నిఖా కోసం తనూ, తన భార్య, కొడుకు ఇండియా వెళ్ళాలి లేదా ఆస్‌మా పాకిస్తాన్‌కి రావాలి. ఇది కుదిరే వ్యవహారమేనా? ఇందాక సిపాయి చెప్పినట్టు ఒకవేళ రెండు ప్రభుత్వాలు అనుమతులిచ్చినా అది రెండూళ్ళ మధ్య ఉన్న పొలిమేరని దాటడం అంత సులభం కాదు. కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి హుందర్మోని చేరుకోవాలి.

ఈ సంబంధాన్ని వదులుకోవడమే ఉత్తమం అన్పించిందతనికి. షరీఫ్ దుఃఖంలో మునిగున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పకుండా అతను కుదుటపడేవరకు వేచి ఉన్నాక ఈ విషయం చెప్పాలనుకున్నాడు.

***

షరీఫ్ పిచ్చిపట్టినవాడికి మల్లే తిరుగుతున్నాడు. తిండి మీద ధ్యాస లేదు. నిద్రపోడు. యింట్లో ఉన్న కొద్దిసేపు కూడా అక్కతో మాట్లాడడు. ఎప్పుడు చూసినా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. తమ్ముడి పరిస్థితి చూసి జైనాబీ కూడా దిగులుపడ్తోంది. ఇలానే కొన్నాళ్ళుంటే నిజంగానే పిచ్చివాడై పోతాడేమోనని భయపడిపోతోంది.

“ఎందుకంత దిగులుపడ్డావు? ఇలాగైతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? మొన్ననేగా హుందర్మో హిందూస్తాన్ సల్తనత్ కిందికెళ్ళింది. కొన్ని రోజులు ఓపిక పట్టు. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తవాతావరణం చల్లబడనీ. నీకు తప్పకుండా దారి దొరుకుతుంది. నువ్వు నీ భార్యాపిల్లల్ని చేరుకుంటావు” అంది.

షరీఫ్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు నిస్పృహగా చూశాడు. కొన్ని క్షణాలు తదేకంగా చూసి, వెంటనే లేచి బైటికెళ్ళబోతుంటే “ఎక్కడికెళ్తున్నావు? నిన్నంతా బైట తిరుగుతూనే ఉన్నావుగా. కొద్దిసేపు విశ్రాంతి తీసుకో” అంది జైనాబి.

అతను సమాధానమివ్వకుండా వెళ్తుంటే “కనీసం ఏమైనా తిని వెళ్ళరా” అంది. ఆమె మాటలు విన్పించినా వెనక్కితిరిగి చూడకుండా షరీప్ వెళ్ళిపోయాడు.

‘యా అల్లా.. నా తమ్ముడికి ఈ వయసులో రావాల్సిన కష్టమేనా ఇది? అసలే మెతక మనిషి. నోట్లో నాలుక లేని అమాయకుడు. పెళ్ళాం బిడ్డలకు దూరంగా ఎలా బతగ్గలడు? పర్‌వర్ దిగార్.. వాడికొచ్చిన కష్టాన్ని దూరం చేయి’ అంటూ జైనాబీ అల్లాని వేడుకుంది.

ఆమెకూ బాధగానే ఉంది. ఇప్పుడు తను తన కూతురు అనీస్‌ని కానీ అల్లుడ్ని కానీ చూసుకోడానికి అవకాశం లేదు. రేపు మనవడో మనవరాలో పుట్టినా వాళ్ళని ఎత్తుకుని ఆడించే అదృష్టం తనకు లేదు. కాని తన తమ్ముడు పడ్తున్న వేదన ముందు తన కష్టం చిన్నదే అన్న అవగాహనకొచ్చి, తమ్ముడి గురించే మరింత దిగులు పడ్తోంది.

షరీఫ్ బస్సెక్కి స్కర్దూ చేరుకున్నాడు. పట్టణం ఎప్పటిలానే సందడిగా ఉంది. దిశాహీనంగా రోడ్డెంట తిరిగాడు. మూడ్రోజుల క్రితం తనూ, జైనాబీ కలిసి పెళ్ళి బట్టలు కొన్న షాపుల దగ్గరకెళ్ళి అప్పటి అనుభూతుల్ని మననం చేసుకున్నాడు. ఆ రోజు తను ఎంత సంతోషంగా ఉన్నాడో.. తనకు చాలా ఇష్టమైన కూతురి పెళ్ళికోసం కొంటున్న బట్టలు.. తను ప్రాణంలా ప్రేమించే హసీనా కోసం నెమలికంఠం రంగు దుస్తులు కొంటున్న సమయంలో ఎంతటి మధురానుభూతికి లోనయ్యాడో.. ఎంతలో ఎంత మార్పు… ఇప్పుడు తను విషాదానికి ప్రతిరూపంలా ఉన్నాడు. మూడ్రోజుల క్రితం తీయగా అన్పించిన అనుభవం ఈ రోజు చేదు విషంలా గుండెల్లోకి దిగుతోంది.

సమయం మధ్యాహ్నం పన్నెండు దాటింది.. ఎక్కడో దగ్గరగా ఉన్న మసీదు నుంచి ఆజా విన్పించింది. రెండ్రోజుల్నుంచి నమాజ్ చేయలేదన్న విషయం గుర్తొచ్చింది. మెల్లగా నడుస్తూ మసీదుని చేరుకున్నాడు. చాలా పెద్ద మసీదు.. బ్రోల్మోలో ఉన్న మసీదుకి నాలుగింతలుంది. వజూ పూర్తి చేసుకుని లోపలికెళ్ళి చాప మీద కూచున్నాడు. అన్నీ కొత్త మొహాలే..

వయసులో అందరికంటే పెద్దగా కన్పిస్తున్న ఓ వ్యక్తి అక్కడ కూచుని ఉన్నవాళ్ళనుద్దేశించి ఏదో మాట్లాడుతున్నాడు. షరీఫ్ కూచున్నాక అతని వైపు తిరిగి “నేనిక్కడ మౌల్వీని. మిమ్మల్ని మొదటిసారి ఈ మజీద్‌లో చూస్తున్నాను. ఎక్కడినుంచొచ్చారు?” అని అడిగాడు.

షరీఫ్ తన పరిచయం చేసుకున్నాక “మాది హుందర్మో గ్రామం జనాబ్. మూడ్రోజుల క్రితం బట్టలు కొనడానికి ఇక్కడికొచ్చాను. అదే రోజు రాత్రికి రాత్రే మా వూరు హిందూస్తాన్‌లో కలిసిపోయింది. ఇప్పుడు మా వూరెలా వెళ్ళాలో తెలియడం లేదు. నా భార్యా పిల్లలు అక్కడే ఉన్నారు జనాబ్” అన్నాడు. అతని గొంతు దుఃఖంతో వణికింది.

మౌల్వీ దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. “మీరే కాదు. ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల నుంచి ఏవో పనులమీద ఆ రోజు స్కర్దూ వచ్చిన చాలామంది, తమ వూళ్ళని భారత సైనికులు స్వాధీనం చేసుకోవడంతో ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయారు. మొన్నటివరకూ మనదైన వూరు ఇప్పుడు పరాయిది కావడంకన్నా దురదృష్టం ఏముంటుంది?” అన్నాడు.

“పాస్‌పోర్ట్, వీసా లభిస్తే తిరిగెళ్ళిచ్చని బార్డర్లోని సైనికులు చెప్పారు జనాబ్. నేను మొదట పాస్‌పోర్ట్ కోసం అర్జీ పెట్టాలనుకుంటున్నా” అన్నాడు షరీఫ్.

ఎర్రగా ఉన్న నిప్పు కణికను మెత్తటి పువ్వనుకుని ముట్టుకోబోయే పసిపిల్లాడివైపు చూసినట్టు అతని వైపు చూశాడు మౌల్వీ. “పాస్‌పోర్ట్ పొందడం అంత కష్టం కాదు. కానీ వీసా రావడమే…” అంటూ ఆగిపోయాడు.

“వీసా రావడం కష్టమా జనాబ్?”

“మీరు అమెరికా వెళ్ళాలంటే వీసా ఇస్తారు. ఇంగ్లండ్ వెళ్ళాలన్నా సులభంగానే దొరుకుతుంది. సౌదీ, కువైట్, దుబాయ్ వెళ్ళాలనుకుంటే మరింత సులభంగా దొరుకుతుంది. కానీ హిందూస్తాన్ వెళ్ళాలనుకుంటే మాత్రం దొరకదు.”

“ఏం.. ఎందుకని?” ఆదుర్దాగా అడిగాడు.

“ఆ దేశం మన వాళ్ళను రానివ్వకుండా ఎప్పుడో తలుపులు మూసుకుందిగా. మన దేశం కూడా అలానే చేస్తోందనుకోండి. మామూలు సమయంలోనే అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసి, సలుపుతున్న గాయాల్ని నెమరేసుకుంటున్న సందర్భంలో వీసా రావడం అసంభవం.”

“అది అన్యాయం కాదా.. రాత్రికి రాత్రి మన వూళ్ళమీద దాడిచేసి స్వాధీనం చేసుకుంది కాక ఇప్పుడు వీసాలు కూడా జారీ చేయకపోవడం దుర్మార్గం కాదా. నేను అర్జీ పెడ్తాను. వీసా ఇవ్వకపోతే దానికోసం నిరాహారదీక్ష చేస్తాను.”

మౌల్వీ పెద్దగా నవ్వాడు. “అమాయకుడిలా ఉన్నారే. మీరు తింటే ఎంత, తినకుండా శుష్కించి చచ్చిపోతే ఎంత? ఎవరికి పట్టింది మనలాంటి సామాన్యుల బాధ?”

“వీసా ఇవ్వకపోవడానికి కారణాలేమిటో చెప్పాలిగా.”

“సవాలక్ష కారణాలు చూపిస్తారు. వాళ్ళడిగే ఆధారాలు, సర్టిఫికెట్లు మనం తెచ్చివ్వలేం. ఐనా ప్రభుత్వాలని ప్రశ్నించే అధికారం మనకెక్కడుంది? మనందరం వానపాములమేగా” అన్నాడు మౌల్వీ.

“మరి నా భార్యాపిల్లలో…” ఏడుపు గొంతుకతో అన్నాడు.

“దానికి సమాధానం అల్లాకొక్కడికే తెలుసు. మీకు మనశ్శాంతి ప్రసాదించమని ఈ రోజు నమాజ్‌లో ప్రార్థిస్తాను” అంటూ నమాజ్ చేయడానికి లేచి నిలబడ్డాడు. అతన్తో పాటు అందరూ లేచి వరసల్లో నిలబడ్డారు.

వ్యాకుల మనసుతోనే షరీఫ్ నమాజ్ చేసి, బైటికొచ్చాడు. ఇప్పుడు దుఃఖంతో పాటు నిరాశకూడా పోటీపడి అతన్ని క్రుంగదీయసాగింది. అంటే తనెప్పటికీ హుందర్మో వెళ్ళలేడా? తన భార్యనీ పిల్లల్ని చూసుకోలేడా? అసలు తను తన భార్య హసీనాని చూడకుండా బతగ్గలడా? ఆస్‌మా తన కళ్ళముందు కన్పించకపోతే తట్టుకోగలడా? ఇలాంటి బతుకు బతికేకన్నా చచ్చిపోవడం నయమనిపిస్తోంది.

లేదు. చావకూడదు. ఇప్పుడు తన జీవిత ధ్యేయం ఒక్కటే. ఎప్పటికైనా సరే భారతదేశానికి వెళ్ళడానికి వీసా సంపాయించి, హుందర్మో వెళ్ళి హసీనాని, ఆస్‌మాని చూడటం. జీవితంలో తనకున్న కోరిక ఒక్కటే. చనిపోయే ముందు ఒక్కసారైనా తన భార్యా పిల్లల్ని చూడటం. ఇకముందు తను బతికేది ఈ ధ్యేయం కోసమే. ఇకముందు తన సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నించేది ఈ కోరిక తీర్చుకోవడం కోసమే. అప్పటివరకూ తను చావడు. చావుని తన దరిదాపులకు కూడా రానివ్వడు.

అలా అనుకోగానే అతన్లో జీవశక్తి ప్రవేశించింది. ఇప్పుడు కాకున్నా కొన్నేళ్ళ తర్వాతైనా వీసా మంజూరయ్యే అవకాశం ఉంది. మొదట కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేయడానికి అవసరమైన డబ్బు సంపాయించి దాచి పెట్టుకోవాలి. ఏం పని చేస్తే బావుంటుందని ఆలోచించాడు. తనకు వ్యవసాయం చేయడం తప్ప మరో పని చాతకాదు. జైనాబీ అక్క వాళ్ళకు పొలాలేమీ లేవు కాబట్టి వేరే ఎవరి పొలంలోనైనా పన్చేయాలి. ఈ విషయంలో లతీఫ్ సలహా తీసుకోవడం మంచిదనుకున్నాడు.

మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నవాడల్లా ఠక్కున ఆగిపోయాడు. ఎదురుగ్గా రెండడుగుల ఎత్తున ఎర్రటి స్థూపాకారం ఆకృతిలో ఉన్న పోస్ట్ డబ్బా. దానికి వేసి ఉన్న చిన్న తాళాన్ని తీసి, పోస్ట్‌మాన్ లోపల్నుంచి ఉత్తరాలు తీసుకుంటున్నాడు. వాటిని చూడగానే తన మనసులోని ఆవేదనని, ఆశానిరాశల్ని తమ రెక్కలమీద మోసుకెళ్ళి హసీనా ఒళ్లో జారవిడిచే తెల్లటి బుజ్జి పావురాల్లా కన్పించాయి. అతను పోస్ట్‌మాన్‌కి చేరువగా వెళ్ళి “భాయీ సాబ్.. ఇక్కడికి దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్‌కి ఎలా వెళ్ళాలో చెప్తారా?” అని అడిగాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version