రెండు ఆకాశాల మధ్య-34

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

పోస్ట్‌మాన్ తల తిప్పి అతని వైపు పరిశీలనగా చూసి, “నేరుగా వెళ్ళి ఎడం వైపు సందులోకి తిరగండి. కొంత దూరం వెళ్ళాక మీకు కుడివైపున పోస్టాఫీస్ కన్పిస్తుంది” అన్నాడు.

షరీఫ్ అతనికి షుక్రియా చెప్పి ముందుకు నడిచాడు. పోస్టాఫీస్‌లో కార్డు కొనుక్కుని, అక్కడ నిలబడున్న వాళ్ళలో ఒకతన్ని అడిగి కలం తీసుకుని ఉర్దూలో ఉత్తరం రాశాడు. “మేరీ జాన్ హసీనా బేగం, ఎలా ఉన్నావు? చూశావా ఒక్క రాత్రిలో మన జీవితాలు ఎలా తల్లక్రిందులైపోయాయో.. మనిద్దరి మధ్య దూరం రెండు మైళ్ళే అయినా ప్రస్తుతం మనిద్దరం రెండు దేశాలుగా విభజించబడ్డాం. నిన్నూ, ఆస్‌మాని చూడాలని నా ప్రాణం కొట్టుకుపోతోంది. మన వూరికి రావాలంటే కొన్ని వేల మైళ్ళు చుట్టూ తిరిగి రావాలట. రెండు ప్రభుత్వాల అనుమతి కావాలట. నువ్వేమీ దిగులు పడకు. నేను ఎట్లాగయినా వస్తాను. నాకోసం ఎదురుచూస్తూ ఉండు. మనిద్దరం కల్సుకునేలా చేయమని రోజూ నమాజ్‌లో అల్లాని వేడుకుంటూ ఉండు. ఆస్‌మాకు చెప్పు. నిఖా తప్పకుండా జరుగుతుంది. లతీఫ్ నా ప్రాణ స్నేహితుడు. నా మాట కాదనడు. కొన్ని నెలలు పెళ్ళి వాయిదా వేద్దామని చెప్తాను. అక్క అడ్రస్‌కి జవాబు రాయి. నువ్వు లేని జీవితం రేగిస్తాన్‌లా ఉంది. ఖుదా హాఫిజ్”.

అతనికి చాలా రాయాలని ఉన్నా రాయలేకపోయాడు. కలం ముందుకు కదలడానికి మొరాయించింది. అప్పటికే కన్నీళ్ళు కారి కొన్ని అక్షరాలు అలికినట్టు అయిపోయాయి. ఉత్తరాన్ని బైటున్న పోస్ట్ డబ్బాలో వేశాక కొద్దిగా వూరటగా అన్పించింది. తను క్షేమంగా ఉన్న విషయం హసీనాకు తెలిస్తే చాలు. ఆలస్యంగా నైనా నిఖా జరుగుతుందన్న నమ్మకం ఆస్‌మాకు ఏర్పడితే చాలు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు…

బ్రోల్మోకి తిరిగిరాగానే లతీఫ్‌ని కల్సుకుని, ఎవరినుంచయినా పొలాన్ని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. లతీఫ్‌కి బాబాయి వరసయ్యే అతను నెల క్రితం చనిపోయాడు. అతను స్కూల్లో ప్యూన్‌గా పనిచేసేవాడు. ఇప్పటివరకూ అతని స్థానంలో ఎవ్వరూ వచ్చి చేరలేదు. “తాత్కాలికంగా ఆ ఉద్యోగం చేయగలవా? హెడ్మాస్టర్ గారితో నేను మాట్లాడతాను. అతను నాకు బాగా తెల్సినతనే. ఆ స్థానంలో ఎవరైనా వచ్చి చేరేవరకు నువ్వు పని చేసుకోవచ్చు” అన్నాడు.

“నేనా… ఆ ఉద్యోగం చేయగలనా? వ్యవసాయం తప్ప నాకేమీ రాదే” అన్నాడు షరీఫ్.

“అందులో కష్టమేమీ ఉండదు. స్కూల్‌ని శుభ్రంగా ఉంచడం, హెడ్మాస్టారుగారి ఆజ్ఞలు పాటించడం, వారు సూచించిన సమయానికి బెల్ కొట్టడం.. అంతే.”

“సరే లతీఫ్. వారితో మాట్లాడు” అన్నాక కొన్ని క్షణాలాగి, “నీ వల్ల పని దొరికింది. అక్క వాళ్ళ యింట్లోనే ఉంటున్నా కాబట్టి తిండికీ, వసతికి ఇబ్బంది ఉండదు. అక్కకు భారం కాకుండా నా సంపాదనలో సగం ఆమె చేతికిస్తాను. నువ్వు చేసిన సాయాన్ని మర్చిపోను లతీఫ్” అన్నాడు షరీఫ్.

“అయ్యో అదేం పెద్ద సాయమని.. నువ్వు నా జిగరీ దోస్త్‌వి. నీకోసం ఆ మాత్రం చేయలేనా?” అన్నాడు లతీఫ్.

అదే అవకాశంగా తీసుకుని “మన రెండూళ్ళ మధ్యన సరిహద్దు రాకాసిలా అడ్డుపడకుండా ఉండి ఉంటే మరో వారంలో ఆస్‌మా పెళ్ళయిపోయి, ఈ వూరికి నీ కోడలిగా వచ్చుండేది. అంతా నా దురదృష్టం. నాదో విన్నపం.. మన్నిస్తావా?” అన్నాడు షరీఫ్.

లతీఫ్‌కి అతనేం అడగబోతున్నాడో అర్థమైంది. అందుకే సమాధానమేమీ ఇవ్వకుండా అతని వైపు చూశాడు.

“నీ కొడుకు హనీఫ్‌ని చూసినపుడే అతను ఆస్‍మాకి కాబోయే మొగుడని, నాకు కాబోయే అల్లుడని నిర్ణయించుకున్నాను. దయచేసి కొన్ని నెలలాగు. తొందరపడి వేరే సంబంధాలు చూడకు. ఈ లోపల పరిస్థితులు సద్దుమణిగితే నేను మా వూరెళ్ళి ఆస్‌మాని పిల్చుకొస్తాను. పెళ్ళి చేద్దాం. ఆస్‌మాని నీ కోడలు చేసుకో” అంటూ లతీఫ్ రెండు చేతులు పట్టుకుని నుదుటికి ఆనించుకున్నాడు.

అది జరిగేపని కాదని లతీఫ్‌కి తెలుసు. నెలలు కాదు కదా సంవత్సరాలు ఎదురుచూసినా జరిగే అవకాశం లేని కోరిక.. స్కూల్లో ప్యూన్‌గా పని చేయడం వల్ల వచ్చే డబ్బు అతని తిండికీ మిగతా ఖర్చులకే సరిపోదు. యింక అందులోంచి దాచిపెట్టుకోడానికి ఏం మిగుల్తుందని? అలా ఎన్నేళ్ళు పనిచేసి ఎంత కూడబెడితే ఇండియా వెళ్ళడానికి అవసరమైన డబ్బులు సమకూర్తాయి? మళ్ళా తన కూతుర్ని పిల్చుకుని వెనక్కి రావడానికి యింకెంత ఖర్చవుతుంది? ఇదంతా ఓ తండ్రి తన కూతురి సుఖసంతోషాల కోసం కంటున్న కల తప్ప నిజమయ్యే వీలు లేదు. అయినా తన మిత్రుడ్ని బాధపెట్టడం ఇష్టం లేక “అలాగేలే.. మాకూ తొందరేమీ లేదులే” అన్నాడు.

ఆ మాటకే షరీఫ్ ఎంత పొంగిపోయాడో.. ఎన్ని సార్లు లతీఫ్ కి షుక్రియాలు అదా చేశాడో..

స్కూల్లో చేరాక అతనికో విషయం అర్థమైంది. పొలంలో పని చేయడంతో పోలిస్తే ఇలాంటి ఉద్యోగాలు చాలా తేలికని. రోజులో ఎక్కువభాగం విశాంత్రిగా కూచోవడం తప్ప పెద్దగా పనేమీ ఉండదు. ఉదయం ఓ గంట ముందు స్కూల్ కెళ్ళి పిల్లలు కూచునే గదుల్ని, మాస్టర్లు కూచునే కుర్చీల్ని, బ్లాక్ బోర్డుని శుభ్రం చేశాక మళ్ళా బెల్లు కొట్టాల్సిన సమయం వరకు పనేమీ లేకుండా ఖాళీగా కూచోవడమే. అదే అతనికి చాలా కష్టంగా ఉంది.

పని లేకుండా కూచున్నంత సేపు ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టి వూపిరాడకుండా చేస్తున్నాయి. తన వూరు గుర్తొస్తోంది. తన యిల్లు.. వయసు మళ్ళిన అమ్మానాన్న.. హసీనా.. పిల్లలు.. అవిశ్రాంతంగా వాళ్ళ గురించే ఆలోచనలు.. తల బద్దలైపోయేంతగా ఆలోచనలు.. క్షణం తీరిక దొరకనంత పని కావాలనిపిస్తోంది. లేకపోతే ఈ ఆలోచనలు చేసే గాయాలతోనే చచ్చిపోవడం ఖాయమన్పిస్తోంది.

అతనికి స్కూల్ పరిస్థితి చూసినా దిగులుగా ఉంది. ఒకప్పుడు అరవైకి తక్కువ కాకుండా విద్యార్థులుండేవారట. ఇప్పుడు కేవలం పద్దెనిమిది మంది మాత్రమే స్కూల్‌కి వస్తున్నారు. వాళ్ళలో కూడా స్కూల్‌కి రాకుండా ఎగ్గొట్టేవాళ్ళే ఎక్కువ. కారణం చదువుమీద శ్రద్ధ లేక కాదు. ఏ క్షణంలో ఎటువైపునుంచి వచ్చి తూటాలు తగుల్తాయో, గ్రెనేడ్లు స్కూల్ మీద పడ్డాయోనన్న భయంతో తల్లిదండ్రులే పిల్లల్ని స్కూల్‌కి పంపడానికి భయపడ్తున్నారు.

యుద్ధం జరుగుతున్న సమయంలోనే కాదు, యుద్ధం రాబోయే ముందు వాతావరణం, యుద్ధం ముగిశాక మరో యుద్ధం మొదలవుతుందేమోనన్న భయంతో బతికే కాలం.. ఎంతటి వినాశనాన్ని కలుగచేస్తుందో అతనికి అర్థం కాసాగింది. మనిషికీ మనిషికి మధ్య ఈ వైషమ్యాలెందుకు? ఎందుకు మనుషులు కొట్టుకుని చస్తారు? ఎందుకు దేశాలు యుద్ధాలకు కాలుదువ్వుతుంటాయి? దానివల్ల ఎందరి జీవితాలు ఛిద్రమైపోతున్నాయో ఎవరికీ పట్టదా?

పిల్లలు చదువులకు దూరమైతే వాళ్ళ భవిష్యత్తేమిటి? తన తరంలో ఎక్కువమందికి చదువుమీద శ్రద్ధ లేకుండా పోయింది. కనీసం ఇప్పటి తరమైనా చదువుకోకపోతే ఎలా?

ఒకటో తరగతి పిల్లలు కేవలం నలుగురే వస్తున్నారు. వాళ్ళని కూడా పెద్దవాళ్ళు స్కూల్లో దింపి మళ్ళా స్కూల్ వదిలాక వచ్చి తీసుకెళ్తున్నారు. కనీసం పదిహేనూ ఇరవై మంది ఉండే తరగతి అది. విద్యార్థుల ఇళ్ళకెళ్ళి తల్లిదండ్రులకు నచ్చచెప్పి పిల్లల్ని స్కూల్‌కి రప్పించే పనిని హెడ్మాస్టర్ షరీఫ్‌కి అప్పచెప్పాడు.

స్కూల్లో రికామీగా కూచోవడం కన్నా ఇళ్ళిళ్ళూ తిరిగి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడటం షరీఫ్‌కి బాగా నచ్చింది. కానీ పిల్లల్ని స్కూల్‌కి పంపండి అని వాళ్ళకు నచ్చచెప్పడం ఎలాగో మాత్రం అర్థం కావడం లేదు.

“ఇంతకు ముందు హిందూస్తాన్ బార్డర్ హుందర్మోకి అవతల ఉండేది. ఇప్పుడది మన పొలిమేర దాకా వచ్చేసింది. ఏ సిపాయో తుపాకీ పేలిస్తే నా కొడుక్కి తగలదని గ్యారంటీ ఏమిటి?” అని అడిగాడో పిల్లాడి తండ్రి.

“యుద్ధం ముగిసిందిగా జనాబ్. ఇప్పుడెందుకు తుపాకులు పేలుస్తారు?” అన్నాడు షరీఫ్.

“మనం బార్డర్‌కి ఆనుకుని ఉన్న వూళ్లో ఉన్నాం. పొలిమేరలో మన సైనికులు… వాళ్ళకు కొన్ని అడుగుల దూరంలో హిందూస్తాన్ సైనికులు.. తుపాకులు పేల్చడానికి యుద్ధమే ఉండనవసరం లేదు జనాబ్. ఒకర్నొకరు రెచ్చగొట్టుకోవడం మామూలేగా. ఏ సైనికుడు కాల్చిన తూటానో స్కూల్ కెళ్తున్న మా అబ్బాయికి తగిలేనో.. అమ్మో.. మా వాడికి చదువులేకున్నా పర్వాలేదు. ప్రాణాల్లో ఉంటే చాలు. కాయకష్టం చేసుకోనైనా బతుకుతాడు” అన్నాడతను.

నిజమే కదా అనుకున్నాడు షరీఫ్. సరిహద్దుని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టిన దీపాలే. రెపరెపా కొట్టుకుంటూ ఏ క్షణంలో ఆరిపోతాయో ఎవ్వరూ చెప్పలేరు.

మరొక విద్యార్థి తాత బైటికొచ్చి “నా మనవడ్ని స్కూల్‌కి పంపే ప్రసక్తే లేదు. నాకు అక్షరమ్ముక్క రాదు. ఐనా నేను బతకలేదా? ఆరుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేయలేదా? నా మనవడు కూడా అలానే బతుకుతాడు” అన్నాడు.

“అయ్యా మీరు బుజుర్గ్.. మీరే అలా అంటే ఎలా? పిల్లలు చదువుకుంటే నీడపట్టున కూచుని పని చేసుకునే ఉద్యోగాలు దొరుకుతాయిగా జనాబ్” అన్నాడు షరీఫ్.

“ఒప్పుకుంటాను. కానీ ఆ చదువుకోసమని ప్రాణాల్ని బలి చేయలేం కదా.”

“అటువంటి పరిస్థితి ఎదురుకాదు జనాబ్. ఇప్పుడంతా ప్రశాంతంగానే ఉంది.”

“ప్రశాంతంగా ఉన్నా భయమేసే దారుణమైన పరిస్థితుల్లో కదా మన వూరుంది. తుఫాను ముందు ప్రశాంతత కూడా కావొచ్చుగా. ఎవ్వరికీ మనలాంటి దుర్గతి పట్టకూడదు. ఇటువంటి దయనీయమైన పరిస్థితి పగవాడిక్కూడా రాకూడదని కోరుకుంటాను” అంటున్నప్పుడు అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

షరీఫ్‌కి ఏమని సమాధానం చెప్పాలో తెలీక అతనికి ఖుదా హాఫీజ్ అని చెప్పి వెనక్కి తిరిగాడు.

యింటికి ఉత్తరం రాసినప్పటినుంచి హసీనా నుంచి జవాబొస్తుందని ఎదురుచూడటం అతని దినచర్యల్లో ఓ భాగమైపోయింది. విద్యార్థుల్ని మధ్యాహ్న భోజనానికి వదిలే బెల్ కొట్టడానికి గంట ముందు పోస్ట్‌మాన్ ఆ వూళ్ళోకి వస్తాడు. షరీఫ్ అతని కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తూ గంట కొట్టడానికి తీగకు వేలాడదీసిన ఇనుప దిమ్మ దగ్గరే కూచుని ఉంటాడు. హెడ్మాస్టర్‌కి పోస్ట్‌లో వచ్చిన ఉత్తరాల్ని అందచేయడానికి పోస్ట్‌మాన్ స్కూల్ ఆవరణలోకి అడుగు పెట్టడం ఆలస్యం షరీఫ్ అతనికి ఎదురెళ్ళి “జనాబ్.. నా పేరుతో ఏమైనా ఉత్తరం ఉందా?” అని అడుగుతాడు. అతను లేవని చెప్తాడు. ఈ మధ్య అతనికి ఉత్తరం రాలేదని చెప్పడానికి పోస్ట్‌మాన్ కూడా ఇబ్బంది పడ్తున్నాడు. అతని యింటి దగ్గరనుంచి ఉత్తరం రానందుకు షరీఫ్‌తో పాటు అతను కూడా దుఃఖపడ్తున్నాడు.

హుందర్మో భారతదేశంలో భాగమైపోయి రెండు నెలలు దాటింది. ఒకరోజు ఉదయాన్నే బ్రోల్మో గ్రామంలోనికి మిలటరీ వాళ్ళ ట్రక్కొచ్చింది. దాన్ని చూసి ప్రజలందరూ భయాందోళనలకు గురయ్యారు. ఎందుకొచ్చిందో తెల్సుకోవడం కోసం దాని వెనకే యువకులు కొంతమంది పరుగెత్తారు. ట్రక్కు ఒక చోట ఆగింది. అక్కడినుంచి కాలి నడక తప్ప ట్రక్కు వెళ్ళే అవకాశం లేదు. అందులోంచి మొదట ఓ సిపాయి దిగాడు. డ్రైవర్ స్థానంలో ఉన్న సిపాయి కూడా దిగాక ఇద్దరూ కలిసి ట్రక్కులోంచి మరో సిపాయిని చెరో రెక్కా పట్టుకుని దింపారు. అతనికి రెండు కాళ్ళూ లేవు..

అతన్ని అలా చెరోవైపున మోస్తూనే అతను చూపించే దిశగా మెట్లు మెట్లుగా ఉన్న ప్రాంతాన్ని ఎక్కసాగారు. వచ్చిన మిలట్రీ వాళ్ళ వల్ల ప్రమాదం లేదని తెలిసిపోవడంతో ఇళ్ళలోంచి చాలామంది బైటికొచ్చి వింతగా చూడసాగారు. షరీఫ్ కూడా యింటి బైటికొచ్చి నిలబడ్డాడు. మిలట్రీ జవాన్లు మోసుకొస్తున్న వ్యక్తి దగ్గరయ్యేకొద్దీ అతను తన బావలా అన్పించి షరీఫ్ వ్యాకులపాటుకు లోనయి, జైనాబీని కేకేశాడు. కాళ్ళు లేని తన భర్తను చూసి జైనాబీ పెద్దగా ఏడుస్తూ “ఏమైంది? నా షొహర్‌కి ఏమైంది?” అని ఇద్దరు జవాన్లని నిలదీసింది.

“యుద్ధంలో జనాబ్ తమీజుద్దీన్ గాయపడ్డాడమ్మా. అతను నిలబడున్న చోటే గ్రెనేడ్ పడి పేలింది. రెండు కాళ్ళూ విరిగిపోయాయి. మిలటరీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి నుజ్జు నుజ్జయిన కాళ్ళని తొడలకింది నుంచి తొలగించారు. నిన్నటివరకూ ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఇతన్ని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తెచ్చాం” అన్నాడో సిపాయి.

వాళ్ళు అతన్ని యింటి లోపలికి మోసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి “ఖుదా హాఫీజ్” అని చెప్పి వెళ్ళిపోయారు.

జైనాబీ ఏడుస్తూ “ఏంటండీ ఇదంతా.. ఇలా జరిగిందని నాకెందుకు కబురు చేయలేదు?” అంది.

“నీకు తెలియడం వల్ల ఒరిగేదేమిటి? జరగాల్సిన అనర్థమేదో జరిగిపోయిందిగా” అన్నాడు తమీజ్.

దూరంగా నిలబడి, మిలట్రీ నుంచి అవిటివాడై తిరిగొచ్చిన తన వైపు దిగాలుగా చూస్తున్న షరీఫ్ మీద అతని కన్ను పడింది. “నీ తమ్ముడు ఎప్పుడొచ్చాడు?” అని జైనాబీని అడిగాడు.

“ఆస్‌మా పెళ్ళికోసం బట్టలు కొనాలని వచ్చాడు. అదే రోజు రాత్రి హుందర్మోని హిందూస్తాన్ సిపాయీలు ఆక్రమించారు. షరీఫ్ తిరిగెళ్ళడానికి ప్రయత్నిస్తే సరహద్ వద్ద కాపలా కాసే సైనికులు పోనివ్వకుండా అడ్డుకున్నారండి. అప్పటినుంచి మనింట్లోనే ఉన్నాడు. పాపం ఇంకెక్కడికి పోతాడు చెప్పండి” తన భర్త మనస్తత్వం తెల్సిన జైనాబీ భయపడూనే సమాధానమిచ్చింది.

“అంటే దాదాపు రెణ్ణెల్లనుంచి నీ తమ్ముడు మనింట్లో తేరగా కూచుని తింటున్నాడన్న మాట. నేను మిలట్రీలో డ్యూటీ చేయడానికి పనికిరానని ఇంటికి పంపించారే ముదనష్టపుదానా.. ఇప్పుడు నాకొచ్చే పెన్షన్ మనిద్దరి తిండికే సరిపోదని దిగులు పడ్తుంటే నువ్వు మీ పుట్టింటివాళ్ళని యింట్లో పెట్టుకుని మేపుతున్నావా? నా యిల్లేమైనా ధర్మసత్రమనుకుంటున్నారా నువ్వూ మీ తమ్ముడు?” అతను పెద్ద పెద్దగా అరుస్తున్నాడు.

“అయ్యో మెల్లగా మాట్లాడండి.. మా తమ్ముడు వింటే బాధపడ్డాడు.”

“వింటే విననీవే. నీ తమ్ముడు బాధపడ్డాడని అతన్ని భరిస్తూ నన్ను బాధపడమంటావా? యిప్పటివరకూ మీ వాళ్ళకు దోచిపెట్టింది చాలు.”

“షరీఫ్ వూరికే ఏమీ లేడండీ. ఇక్కడి స్కూల్లో పన్లో చేరాడు. ఆ జీతం డబ్బులు తెచ్చి నాకే యిస్తున్నాడు” జైనాబీ అబద్ధం చెప్పింది. షరీఫ్ ఇవ్వబోయినా “వద్దు. దాచిపెట్టుకో. ఎప్పటికైనా హిందూస్తాన్ వెళ్ళి నీ కుటుంబాన్ని చూసుకోడానికి దారిఖర్చులకు పనికొస్తాయి” అంది.

“అతనిచ్చే డబ్బులూ వద్దు. అతను మనింట్లో ఉండనూ వద్దు. అతనికి వాళ్ళ వూరు వెళ్ళడానికి అవకాశం లేకపోతే బైటెక్కడైనా ఉండమను. మనింట్లో కాదు” అన్నాడు తమీజుద్దీన్.

షరీఫ్‌కి చాలా అవమానంగా అన్పించింది. యింకక్కడ ఉండలేక బైటికెళ్ళడానికి నాలుగడుగులు వేశాడో లేదో జైనాబీ ఏడ్చుకుంటూ పరుగెత్తుకుంటూ వచ్చి అతని చేతుల్ని పట్టుకుని “నీకు మీ బావ గురించి తెల్సిందేగా. మాట కరుకు. మనిషి మంచివాడే. ఆయనేదో అన్నాడని మనసులో పెట్టుకుని ఈ యిల్లొదిలి వెళ్ళకు. నా మాటిను. నువ్వు తినే పిడికెడన్నం పెట్టలేనంత గరీబుది కాదు నీ దీదీ. నా మీద ఒట్టేయి. నన్నొదిలి వెళ్ళనని” అంటూ బలవంతంగా అతని చేత చేతిలో చేయి వేయించుకుంది.

లోపల్నుంచి తమీజ్ అరుస్తూనే ఉన్నాడు. జైనాబీని బూతులు తిడ్తూనే ఉన్నాడు. అసలే దిగుళ్ళ పుట్టలా ఉన్న షరీఫ్ మరింత నిరాశలో కుంగిపోయి ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని ఆమె భయం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here