Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-36

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]గో[/dropcap]రీబీ వయసు ముప్పయ్ ఎనిమిదేళ్ళు.. ముగ్గురు పిల్లల తల్లయినా ఆమెలోని సౌందర్యం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అస్లంఖాన్ మొదటి భార్యతో పోలిస్తే గోరీబీ చాలా చిన్నది. అందుకే అస్లంఖాన్ ఆమెను జాగ్రత్తగా పంజరంలో పెంచుకుంటున్న అందమైన పక్షిలా కాపాడుకుంటుంటాడు.

రావి రోడ్డులో ఉన్న టింబర్ మార్కెట్ దాటుతూ దాని ఎదురుగా విద్యుద్దీపాల కాంతిలో ధగధగా మెరుస్తున్న క్రిష్ణ మందిర్ చూడగానే గోరీబీ కళ్ళు సంతోషంతో విచ్చుకున్నాయి. మందిరం లోపల వరసగా పేర్చిన మట్టి దివ్వెలు… అందంగా ముస్తాబైన స్త్రీ పురుషుల్తో, కొత్త బట్టల్లో మురిసిపోతున్న పిల్లల్లో అక్కడంతా పండగ వాతావరణం నెలకొని ఉంది.

అక్కడ్నుంచి అనార్కలీ బజార్ వెళ్ళే దారిలోకి మళ్ళారు. దూరంగా వాల్మీకి మందిర్.. శిధిలమైపోయినట్టు కన్పిస్తున్న పాత భవంతి, నెర్రలు చీలిన గోడలు వాల్మీకి కులస్థుల దయనీయ స్థితికి ప్రతిబింబాల్లా కన్పిస్తున్నాయి. అది హిందువుల ప్రార్థనామందిరం మాత్రమే కాదు, కడు పేదరికంలో మగ్గుతున్న వాల్మీకీలకు ఆశ్రయం కల్పించే ఆలయం కూడా.

దేశవిభజనకు ముందు లాహోర్‌లో నాలుగు వందలకు పైగా హిందూ దేవాలయాలు, సిక్కుల పార్థనామందిరాలు ఉండేవి. ముస్లిం గుంపులు కూల్చివేయగా ప్రస్తుతం మిగిలున్న నాలుగైదు హిందూ ప్రార్థనా మందిరాల్లో వాల్మీకి మందిర్ ఒకటి. ఆ గుడి కూడా మట్టిదివ్వెల్తో, కొవ్వొత్తుల్తో అలంకరించబడి ఉండటాన్ని గమనించింది గోరీబీ. నుదుట కుంకుం బొట్టు పెట్టుకున్న స్త్రీలు బాణాసంచా కాలుస్తున్న పిల్లల్ని అజమాయిషీ చేస్తున్నారు.

పిల్లల చేతుల్లో కాకరపువ్వొత్తులు, మతాబాలు వెలుగుతున్నాయి. పిల్లల మొహాలు కూడా వింత కాంతితో మెరుస్తున్నాయి.

ఆమె భయపడూనే అస్లంఖాన్‌కి మాత్రమే విన్పించేంత మంద్ర స్వరంతో అడిగింది. “జీ సునియే. ఈ రోజు దీపావళి పండుగనా?”

అస్లంఖాన్ ఆమె వైపు కోపంగా చూశాడు. “ఏమో నాకు తెలియదు” అన్నాడు. పదిహేడేళ్ళ తన కూతురి కోసం బట్టలు కొనాలని అడిగితే ఆమెను అనార్కలి బజార్‌కి పిల్చుకెళ్తున్నాడు. ఆమెను హిందూ దేవాలయాలున్న ఈ దారిలో కాకుండా మరో దారిలో తీసుకుని వెళ్ళుండాల్సింది అనుకున్నాడు.

“అందరూ బాణాసంచా కాలుస్తున్నారు చూశారా? తప్పకుండా ఈ రోజు దీపావళి పండుగే అయి ఉంటుంది” అంది గోరీబీ.

“నోర్మోసుకుని నడువ్. అది మన పండుగ కాదు. హిందువుల పండుగ” అన్నాడు అస్లం.

ఆమె నిశ్శబ్దమైపోయింది. అనార్కలి బజార్ మనషుల్తో కిక్కిరిసిపోయి ఉంది. రోడ్డుకిరువైపులా రకరకాల వస్తువులు అమ్మే దుకాణాలున్నాయి. కొన్ని చోట్ల బట్టలు, చెప్పుల్లాంటివి రోడ్డు పక్కనే గుట్టలుగా వేసి అమ్ముతున్నారు. రంగు రంగుల విద్దుద్దీపాల కాంతిలో అనార్కలి బజార్ కూడా దీపావళి పండుగ జరుపుకుంటున్నట్టు అన్పించింది గోరీబీకి. ఆమె ఆలోచనలన్నీ బాల్యంలోకి ప్రవహిస్తున్నాయి. చిన్నప్పుడు తమ వూళ్ళో దీపావళి పండుగని ఎంత బాగా జరుపుకునేవారో.. అవన్నీ ఇప్పుడు దృశ్యాలు దృశ్యాలుగా కళ్ళముందు కదులున్నాయి.

బట్టలు కొనడంలో ఆసక్తి ఎప్పుడో చచ్చిపోయింది. కొనకుండా వెళ్లే కూతురు అలిగి కూచుంటుందని గుర్తొచ్చి రెండు జతల బట్టలు కొంది. యింటికి తిరిగొచ్చిందన్న మాటే గానీ ఆమె మనసంతా తన వూళ్ళోనే చిక్కుబడిపోయింది.

రాత్రి ఆమెకేమీ తినాలనిపించలేదు. ఆమెకు జోరాఫాం వూళ్లో తను గడిపిన అందమైన బాల్యం కళ్ళముందు కదులాడసాగింది.

“షామ్లీ.. చెరువుల్లో ఈత కొట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా, చూడు మళ్ళా జలుబు చేసింది” తడిసిన జట్టుని తువ్వాలుతో తుడుస్తూ అంది అమ్మ.

“నన్నే ఎందుకంటావు? మరి అన్నకూడా ఈత కొట్టాడుగా. వాడ్నెందుకనవు?” అంది షామ్లీ. అప్పుడామెకు పదేళ్ళు.

“వాడు మగపిల్లాడు. వాడు చెరువులో దిగినా చేపలు పట్టినా ఎవ్వరూ తప్పుపట్టరు. నువ్వు ఆడపిల్లవి. ఇలా మగపిల్లల్లో సమానంగా వూరేగితే వూళ్లో అందరూ నవ్వుతారే.”

“నవ్వితే నవ్వనీ.. నాకేంటి?”

“రేపు పెళ్ళెవరు చేసుకుంటారే.. ఈ అల్లరి పిల్ల మాకొద్దని వెళ్ళిపోతారే.”

“పోతే పోనీ.. నాకేంటి?”

“తప్పమ్మా.. అలా అనకూడదు. నువ్వు మరికొంత పెద్దయ్యాక మంచి కుర్రాడ్ని చూసి పెళ్ళి చేస్తాం కదా. తర్వాత నువ్వు గంపెడు పిల్లల్ని కని, నీ మొగుడ్తో పిల్లా పాపల్తో సంతోషంగా ఉండాలి.”

“చూడు నాన్నా అమ్మ ఎలా అంటుందో? అసలు నాకు పెళ్ళే వద్దు. నేను నాన్నని వదిలి ఎక్కడికీ వెళ్ళను” అంది షామ్లీ.

నులక మంచం మీద కూచుని తల్లీ కూతుళ్ళ సంభాషణ వింటున్న శంకర్‌లాల్ పెద్దగా నవ్వాడు. తన భార్య వైపు చూస్తూ “అమ్మో.. నేను కూడా నా కూతుర్ని వదిలి ఉండలేను” అన్నాడు.

“అంటే కూతురికి పెళ్ళే చేయరా ఏంటి?” అంది అతని భార్య.

“ఇల్లరికం వచ్చే అల్లుడ్ని తెచ్చుకుంటా. గంపెడు పిల్లలంటే వూర్కునేది లేదు. తనని పిల్లలు కనే యంత్రం అనుకుంటున్నాడా వాడు? నా కూతురు అంత కష్టపడటం నేను చూళ్ళేను. ఇద్దరో ముగ్గురో చాలు” అన్నాడు.

“నువ్వు కూడా ఏంటి నాన్నా.. నాకు పెళ్ళి వద్దు పిల్లలూ వద్దు” అంది సిగ్గుపడిపోతూ షామ్లీ.

గోరీబీ బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. మరుక్షణం అమ్మా నాన్నా అన్నా, తమ్ముడు దర్శన్‌లాల్, చెల్లెలు షానోదేవి గుర్తొచ్చి దుఃఖం ఉప్పెనలా ముంచేసింది.

ఎన్నాళ్ళయింది అమ్మను చూసి? దాదాపు పాతికేళ్ళు.. లాహోర్‍లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళ అన్నను చూడాలని తాత కిషన్‌లాల్ ప్రయాణమైతే అతన్తో పాటు నాన్న, తమ్ముడు దర్శన్‌లాల్‌తో కలిసి తను కూడా బయల్దేరుతూ అమ్మకు చెప్పిన వీడ్కోలే అమ్మను చివరిసారి చూడటం. ఇప్పుడు అమ్మ ఎలా ఉందో..

ఆమెకు లాహోర్‌లో పెదనాన్న యింటిని ముస్లిం ముష్కరులు చుట్టుముట్టిన ఆ కాళరాత్రి జరిగిన ప్రతి అనుభవమూ నిన్న జరిగినంత స్పష్టంగా గుర్తుంది.

రైల్వే స్టేషన్ చేరుకోడానికి గుంపుగా కొంతమంది హిందువులు పరుగెత్తుతున్నారు. ముందు నాన్న తమ్ముడ్ని ఎత్తుకుని పరుగెత్తుతున్నాడు. అతని వెనకే తను కూడా పరుగెత్తుతోంది. వెనక పొడవాటి కత్తులు పట్టుకుని పఠాన్లు పరుగెత్తుతున్నారు. దొరికిన వాళ్ళని దొరకినట్టు తమ కరవాలాలకు బలిస్తున్నారు. వయసులో ఉన్న ఆడపిల్లల్ని పట్టుకుని రోడ్డు మధ్యలోనే బలాత్కరిస్తున్నారు. తను భయంతో పరుగెత్తుతోంది. వాళ్ళకు దొరక్కూడదన్న పట్టుదలతో పరుగెత్తుతోంది.

దూరంగా లాహోర్ స్టేషన్ కన్పిస్తోంది. ఇంకా కొన్ని అడుగులేస్తే చాలు. ఆయాసంగా ఉంది. వూపిరందడం లేదు. కొద్దిగా వెనకపడింది. నాన్న వెనక్కి తిరిగి చూసి “షామ్లీ.. పరుగెత్తు” అనేసి మళ్ళా పరుగెత్త సాగాడు. తను శ్వాసని బలంగా తీసుకుని, కసిగా పరుగెత్తసాగింది. యింతలో ఎవరి కాలో తనకు అడ్డు తగిలి, తను ధడాల్న కిందపడిపోయింది.

మళ్ళా లేచి పరుగెత్తబోయి, కాలు బెణకడంతో బాధతో కూలబడిపోయింది. అదే క్షణంలో తనని వెనకనుంచి రెండు బలమైన చేతులు ఒడిసి పట్టుకున్నాయి. తను గింజుకోసాగింది. అతను ఆరడుగుల ఎత్తుగా బలంగా ఉన్నాడు. తను పెద్దగా “నాన్నా” అంటూ అరిచింది. నాన్న ఆగి వెనక్కి తిరిగి చూశాడు. క్షణకాలం నిలబడ్డాడు. విచ్చుకత్తులో తరుముకొస్తున్న గుంపుని చూశాడు. మళ్ళా వెనక్కి తిరిగి స్టేషన్ లోపలికి పరుగెత్తాడు.

ఆ ముస్లిం తనని ఎత్తుకుని భుజంమీద వేసుకున్నాడు. వెనక్కి తిరిగి వూరి వైపుకు నడవసాగాడు. తను గింజుకుంటూనే ఉంది. అప్పుడు చాలా భయమేసింది. రోడ్డుకిరువైపులా దట్టంగా పెరిగిన పొదలు… ఏం చేయబోతున్నాడు తనని? పాడు చేస్తాడా? చంపేస్తాడా? తను తుఫానులో చిక్కుకున్న చిగురుటాకులా వణికిపోసాగింది.

అతను మధ్యలో ఎక్కడా ఆగకుండా నడుస్తుంటే అంత భయంలోనూ తనకు ఓ విషయం స్పష్టమైంది. అతనికి తనను పాడు చేసే ఉద్దేశం లేదని. అదే గనక ఉంటే తనని వూళ్ళోకి ఎందుకు తీసుకెళ్తాడు?

చీకట్లో ఏ పొదల చాటునో ఆ రాక్షసకృత్యం కానిచ్చేసి తనని అక్కడే వదిలేసి లేదా చంపేసి వెళ్ళేవాడు. వెంటనే మరో ఆలోచన కూడా వచ్చింది. యింటికి తీసుకెళ్ళి గదిలో బంధించి రోజుల తరబడి తన కోరిక తీర్చుకుని.. ఆ తర్వాత చంపేసే ఉద్దేశం ఉందేమోనని.. ఆ ఆలోచనకే మరింత భయమేసింది. ఆ నరకాన్ని అనుభవించడం కన్నా ఇక్కడే ఇప్పుడే చచ్చిపోతే బావుంటుందనిపించింది.

అతను ఓ యింటిని సమీపించి తలుపు తట్టాడు. లోపల్నుంచి మంద్ర స్వరంతో “కౌన్” అని విన్పించింది.

“నేనే.. తలుపు తెరువ్” అన్నాడతను.

కొన్ని క్షణాల విరామం తర్వాత తలుపు తెర్చుకుంది. అతను లోపలికి నడిచి, తనని భుజం మీదనుంచి దింపి కింద కూచోబెట్టాడు.

తను భయం భయంగా చుట్టూ చూసింది. చిన్న గది.. దానికానుకుని ఉన్న వసారా.. అందులో ఒక వైపు కుట్టుమిషన్ పెట్టి ఉంది.

తన వైపు దయ్యాన్ని చూసినట్టు చూస్తుందో మధ్య వయసు స్త్రీ.. “ఎవరీ పిల్ల? ఎందుకు తెచ్చారు యింటికి?” అని అతన్ని అడిగింది.

“హిందువుల అమ్మాయి.. చంపాలనిపించలేదు. యింట్లో పని చేయడానికి, బట్టలకు కాజాలు, గుండీలు కుట్టడానికి మనిషి అవసరం కదా. అందుకే ఎత్తుకొచ్చాను” అన్నాడతను.

అతని మాటలు విన్నాక తనకు ధైర్యం వచ్చింది. అంటే తనను పాడు చేయడు.. చంపడు. యింట్లో పనిమనిషిగా వాడుకుంటారు.

కానీ తన ఆలోచన తప్పని వారంలోపలే అర్థమైంది.

ఉదయం లేచినప్పటి నుంచి పని.. ఇల్లంతా కసువూడ్చి, అంట్లు తోమి, వంట చేయడంలో అతని భార్యకు సాయం చేసి, ఆ తర్వాత మిషన్ దగ్గర కూచుని అతను కుట్టే జాకెట్లకు జుబ్బాలకు కాజాలు, గుండీలు కుట్టి.. ఆమె పెట్టిన చాలీ చాలని సుక్కీ రోటి తిని, మిషన్ పక్కనే శుభ్రం చేసుకుని వసారాలోనే ముడుచుకుని పడుకునేది.

అతని పేరు అస్లంఖాన్ అని, అతని భార్య పేరు జహరా అని తొందర్లోనే గ్రహించింది. పడుకోడానికి ఓ గది, దాని పక్కనే చిన్న వంటగది, వసారా ఉన్న పెంకుటిల్లు వాళ్ళది. అతనికి దాదాపు నలభై యేళ్ళ వయసుంటుంది. ముగ్గురు ఆడపిల్లలు… ముగ్గురికీ పెళ్ళిళ్ళు చేసి పంపించేశాడు. ప్రస్తుతం యింట్లో అతనూ అతని భార్య మాత్రమే ఉంటారు.

ఎంత పని చేసినా జహరాతో తిట్లు తప్పేవి కావు. ఏ చిన్న పొరపాటు జరిగినా గొడ్డుని బాదినట్టు బాదేది. రాత్రుళ్ళు ఆమెకు కాళ్ళు కూడా పట్టాల్సివచ్చేది. తర్వాత వెళ్ళి వసారాలో పడుకుంటే నిద్ర పట్టేది కాదు. అమ్మా నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి గుర్తొచ్చి ఏడుపొచ్చేది. కడుపులో ఆకలి, గుండెలో వేదనతో ఎన్ని రాత్రుల్ని కన్నీళ్ళ కాల్వల్లో ఈదుతూ గడిపిందో..

ఓ రోజు పరధ్యానంగా అంట్లు తోముతోంది. మనసంతా జోరాఫాం గ్రామంలోని తమ యింట్లో చిక్కుబడిపోయింది. చిన్నప్పుడు తమ్ముడు దర్శన్ ఎంత అల్లరి చేసేవాడో.. నాన్న తన కోసం ఆటబొమ్మలు ఏం కొని తెచ్చినా అవి తనకే కావాలని మారాం చేసేవాడు. అవి ఆడపిల్లలు ఆడుకునే బొమ్మలని అమ్మానాన్న ఎంత చెప్పినా వినేవాడు కాదు. తను వాడిలా పట్టుపట్టేది కాదు. వాడు అడిగినవన్నీ ఇచ్చే సేది. కానీ ఒకే ఒక్కసారి ఓ బొమ్మ కోసం వాడితో గొడవపడింది.

తన ఆరో పుట్టినరోజు నాడు నాన్న రెండు గుడ్డ బొమ్మల్ని బహుమతిగా ఇచ్చాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి అలంకరణలో ఉన్న బొమ్మలు.. ఎంత ముద్దుగా ఉన్నాయో.. అవి కావాలని తమ్ముడు ఏడ్వసాగాడు. తను ఇవ్వనని మొండికేసింది. వాడు బొమ్మల్ని తన చేతుల్లోంచి లాక్కోడానికి ప్రయత్నించాడు. తను కూడా వాటిని వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ పెనుగులాడుకున్నారు. తమ్ముడు ఏడుపు లంకించుకున్నాడు. తనకు జాలేసింది. చిన్నపిల్లవాడు కదా. కొద్ది సేపు ఆడుకుని వాడే ఇచ్చేస్తాడు కదా అన్పించింది. తన చేతిలో ఉన్న బొమ్మల్ని వదిలేసింది.

అదే సమయంలో పింగాణీ ప్లేట్‌ని తోముతున్న తను దాన్నే గుడ్డ బొమ్మనుకుని కిందికి వదిలేసింది. అది రెండు ముక్కలుగా పగిలిపోయింది. ఆ శబ్దానికి జహరా పరుగెత్తుకుంటూ బైటికొచ్చింది. అప్పటికే తను తన జ్ఞాపకాల్లోంచి బైటపడి జరిగిందేమిటో అర్థమై, భయంతో కొయ్యబారిపోయి నిలబడింది.

జహరా రావడం రావడం తన చెంప మీద ఈడ్చికొట్టింది. “బంగారం లాంటి థాలీని పగులకొట్టావు కదే.. నీ చేతులిరిగిపోను” అంటూ జుట్టు పట్టుకుని వంగో పెట్టి కొట్టింది.

“నిన్ను మూడుపూటలా మేపుతుంది కాకుండా నీవల్ల ఈ నష్టాలు కూడా భరించాలా హరాంజాదీ?” అంటూనే బరబరా ఈడ్చుకుంటూ పొయ్యి దగ్గరకు లాక్కెళ్ళింది. తను ఏడుస్తూ విడిపించుకోడానికి ఎంత ప్రయత్నించినా వదలకుండా కుడిచేత్తో తన చేతి మణికట్టు దగ్గర పట్టుకుని ఎడంచేత్తో పొయ్యిలో మండుతున్న కట్టెపుల్లని తీసుకుంది. ఆమె ఏం చేయబోతుందో అర్థమై “ఇంకెప్పుడూ అలా చేయను. జాగ్రత్తగా ఉంటాను. దయచేసి నన్ను వదిలేయండి” అని పెద్దగా అరిచింది.

“ఇకముందు సంగతి సరేనే. ఇప్పుడు పగలకొట్టిన థాలీని ఎవరు తెచ్చిస్తారు? నీ బాబు తెచ్చిస్తాడా కాఫిర్ కీ బచ్చీ” అంటూనే కుడి అరచేతిలో కట్టెపుల్లని పెట్టింది. చేయి భగ్గున మండింది. తన ప్రాణం పోతున్నంత బాధ.. విసురుగా ఆమెను తోసేసి, వసారాలోకి పరుగెత్తింది. ఎంతసేపు ఏడ్చిందో.. ఓదార్చడానికి అమ్మ లేదుగా.. కన్నీళ్ళు తుడవడానికి నాన్న లేడుగా.. ఏడ్చి ఏడ్చి అక్కడే ముడుచుకుని పడుకుంది. మధ్యాహ్నం అన్నం తినమని ఎవ్వరూ పిలవలేదు. రాత్రిక్కూడా తిండి పెట్టలేదు.

“పోనీలే పాపం.. చిన్న పిల్ల.. పొరపాటున చేతిలోంచి జారిపడి ఉంటుంది. ఈ పూటకైనా రోటీ పెట్టు’ అని అస్లంఖాన్ తన భార్యతో అంటుంటే విని ‘జహరాతో పోలిస్తే అస్లంఖాన్ కొద్దిగా దయగలవాడే’ అనుకుంది.

మరునాడుదయం ఎప్పటికిమల్లే పని తప్పలేదు. ఎడం చేత్తోనే యిల్లు వూడ్చింది. కాలిన అరచేతికి తగలకుండా వేళ్ళతో పట్టుకుని ఎడం చేత్తో అంట్లు తోమింది. కాజాలు కుట్టింది.

కాలిన అరచేతికి వరసగా నాలుగు రోజులు కొబ్బరినూనె పూసింది. నొప్పి కొద్దిగా నెమ్మదించినా గాయం మాత్రం పూర్తిగా మానలేదు.

అప్పటికి అస్లంఖాన్ తనని ఎత్తుకొచ్చి ఎనిమిది రోజులు.. ఆ రోజు కూడా జహరా నిద్రపోయేవరకు ఎడంచేత్తోనే కాళ్ళు నొక్కి, వసారాలో ఓ మూల ముడుచుకుని పడుకుంది. రాత్రి వాళ్ళిద్దరూ తిన్నాక మిగిలిన సగం రోటీనే జహారా తనకు పెట్టింది. ఆకలి కన్నా ఆవేదన ఎక్కువగా బాధిస్తోంది. అమ్మ ఒళ్ళో పడుకుని తనివితీరా ఏడ్వాలని ఉంది. ఇంతేనా ఇక తన బతుకు… దేశం కాని దేశంలో… పరాయి మతస్థుల యింట్లో… ఇలా బానిసలా బతకాల్సిందేనా…

(ఇంకా ఉంది)

Exit mobile version