రెండు ఆకాశాల మధ్య-39

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]తను తొడుక్కున్న జుబ్బా, తలకు పెట్టుకున్న సిల్క్ టోపీ చలినుంచి రక్షణ కల్పించలేకపోతున్నాయి. రోడ్డుకి కుడిపక్కన చిన్న హోటల్ కన్పించింది. ఒకతను చాయ్‌ని మరగపెడ్తున్నాడు. పక్కనే ఉన్న అల్యూమినియం పాత్రలో సమోసాలు పెట్టి ఉన్నాయి. అతనికి ఆకలి గుర్తొచ్చింది. బ్రోల్మో నుంచి బయల్దేరినప్పటినుంచి ఏమీ తినలేదు. రోడ్డు దాటి ఆ హోటల్ ముందు నిలబడ్డాడు. చాలామంది గుంపుగా నిలబడి వేడివేడి చాయ్ తాగుతున్నారు. లోపల ఎనిమిది బల్లలు, వాటి చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. కొంతమంది లోపల కూచుని పరోటాలు తింటున్నారు.

షరీఫ్ కూడా లోపలికెళ్ళి ఓ కుర్చీలో కూచుని, సర్వర్ రాగానే ఓ ఆలూ పరోటా, చాయ్ కావాలని చెప్పాడు. చాలా రోజులనుంచి తిండి లేనివాడికి మల్లే సర్వర్ సన్నగా బలహీనంగా ఉన్నాడు. గుబురుగా పెంచిన గడ్డం, మాసిపోయిన కుర్తా పైజామాలో వంద దిగుళ్ళని లోపల దాచుకున్నట్టు కన్పిస్తున్నాడు. షరీఫ్ అతనికేమీ భిన్నంగా లేడు. అలసిపోయి, దీనంగా… రాత్రికి ఎక్కడ తలదాచుకోవాలో తెలియని సందిగ్ధంలో దిగులుగా ఉన్నాడు.

సర్వర్ అతని ఉదాసీనమైన మొహం వైపు, అతని పక్కనే ఉన్న బట్టల మూట వైపు మార్చి మార్చి చూసి, తల పంకించి వెళ్ళిపోయాడు. రెణ్ణిమిషాల వ్యవధిలో వేడి వేడి ఆలూ పరోటా తెచ్చి అతని ముందు పెట్టి, గ్లాస్‌ని నీళ్ళతో నింపాడు. షరీఫ్ మొదట మంచినీళ్ళతో గొంతు తడుపుకుని, పరోటాని తుంచుకుని మెల్లగా తినసాగాడు.

అతను చాయ్‌ని వూదుకుంటూ తాగుతున్నప్పుడు సర్వర్ అతన్తో మాట కలిపాడు. “ఇంతకు ముందెప్పుడూ ఇక్కడ చూడలేదే.. ఈ వూరేనా?” అని అడిగాడు.

“కాదు” ముక్తసరిగా సమాధానమిచ్చాడు షరీఫ్.

“ఏదైనా పనిమీద వచ్చావా?”

“లేదు. పనేమైనా దొరకుతుందేమోనని వెతుక్కుంటూ వచ్చాను.”

“కష్టపడేవాళ్ళకు ఈ వూళ్లో పని దొరక్కపోవడం అంటూ ఉండదు. ఇంతకూ ఎక్కడ బస?”

“అద్దె గది కోసం కాళ్ళరిగేలా తిరిగినా దొరకలేదు. ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలో కూడా తెలియడం లేదు.”

పక్క బల్ల మీద ఇద్దరు కస్టమర్లు వచ్చి కూచోవడం గమనించిన సర్వర్ “ఇప్పుడే వస్తానుండు” అనేసి ఆ బల్ల దగ్గరకెళ్ళి వాళ్ళకేం కావాలో కనుక్కుని, అవి తెచ్చిపెట్టాక మళ్ళా షరీఫ్ పక్కకొచ్చి నిలబడ్డాడు.

“నీ పేరేంటి?” అని అడిగాడు.

“షరీఫ్. మాది హుందర్మో గ్రామం. అదిప్పుడు హిందూస్తాన్‌లో కలిసిపోయింది. నేనిక్కడ ఒంటరిగా చిక్కుబడి పోయాను.”

“ఓ అదా సంగతి. నాపేరు సల్మాన్. ఈ హోటల్లో పదేళ్ళ నుంచి పన్చేస్తున్నా. ఈ పదేళ్ళలో కస్టమర్లు నాలుగింతలైనారు. ఐనా మరో సర్వర్‌ని మా యజమాని పనిలో పెట్టుకోలేదు. నేనొక్కడినే చేయలేక ఇబ్బంది పడ్తున్నా. ఈ మధ్య నా ఆరోగ్యం కూడా బావుండటం లేదు. నువ్వు ఒప్పుకుంటే మా యజమానితో చెప్పి నీకు పనిప్పిస్తా. చేస్తావా?”

వెతుక్కోకుండానే పని దొరుకుతున్నందుకు సంతోషమనిపించినా, షరీఫ్ ధ్యాసంతా తల దాచుకోడానికి, దాంతోపాటు తనకు ప్రాణప్రదమైన బట్టల మూట భద్రపర్చుకోడానికి అవసరమైన యింటి మీదే ఉంది. “మొదట నాకు ఉండటానికి వసతి కావాలి. ఎక్కడైనా ఓ గదిని అద్దెకిప్పించగలవా?” అన్నాడు.

“వేరే గదెందుకు? నా గదిలోనే ఉండు. ఇక్కడికి దగ్గరే. అద్దె ఇద్దరం పంచుకుందాం. ఏమంటావు?” అన్నాడు సల్మాన్.

“సరే. నీ యజమాని ఒప్పుకుంటే రేపటినుంచే పన్లో చేర్తాను” అన్నాడు షరీఫ్.

సల్మాన్ డ్యూటీ ముగిసేసరికి రాత్రి పదయింది. అతని గది అతను పని చేసే హోటల్‌కి మైలు దూరంలో ఉన్న మురికివాడలో ఉంది. ఎనిమిదడుగుల పొడవు ఆరడుగుల వెడల్పుతో ఉన్న చాలా చిన్న గది.. ఓ మూలలో నీళ్ళ కుండ, దాని మూత మీద పెట్టి ఉన్న సత్తు గ్లాసు, దానికి పక్కగా చుట్టచుట్టిన చాప, మరో మూలలో సొట్టలు పడిన పాత ట్రంకు పెట్టి, దానిమీద మాసిన బట్టలు.. ఎక్కడ పడుకోవాలో, తన బట్టల మూట ఎక్కడ పెట్టుకోవాలో షరీఫ్‌కి అర్థం కాక సల్మాన్ వైపు చూశాడు.

“ఈ రోజుకి నా చాప మీదే సర్దుకో.. నీ మూటని తలకింద పెట్టుకుని పడుకో. రేపు నీ కోసం ఓ చాప, వస్తువులు పెట్టుకోడానికి ఓ సందూక్ కొందాం” అన్నాడు సల్మాన్.

ఎంత ప్రయత్నించినా షరీఫ్‌కి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఏంటీ జీవితం? ఎన్ని అనూహ్యమైన మలుపులో… వూపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. తనకు ప్రతిదీ శుభ్రంగా ఉండాలి. యింట్లో తను పడుకునే మంచం మీద ఉతికిన చద్దర్ లేనిదే తనకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు వేరే వ్యక్తి పక్కన, అతని చెమటతో తడిచిన చాప మీద పడుకోవాల్సిన ఖర్మ పట్టింది. పొలం నుంచి వచ్చాక, భోంచేసే ముందు స్నానం చేయడం తనకు అలవాటు. ఇకముందు తన అలవాట్లకు భిన్నంగా బతకక తప్పదనిపిస్తోంది.

అర్ధరాత్రి దాటిన చాలా సేపటి తర్వాత అతనికి మాగన్నుగా నిద్ర పట్టింది. కల.. ఆస్‌మా నిఖా జరుగుతోంది. హనీఫ్ మొహం కన్పించకుండా మల్లెపూలతో దట్టంగా అల్లిన సేరా వేలాడుతోంది. తను స్కర్దూలో కొన్న పెళ్ళిబట్టల్లో ఆస్‌మా మరింత అందంగా కన్పిస్తోంది. తనతో పాటు యింటి లోపలికొచ్చిన ఖాజీ “హనీఫ్ మియాసే నిఖా కబూల్ హై?” అని అడుగుతున్నాడు. ఆస్‌మా సేరాని పక్కకు తొలగించకుండానే తల వొంచుకుని ‘కబూల్ హై’ అని మెల్లగా అంటోంది.

“షరీఫ్.. లే.. మనం ఐదింటికల్లా హోటల్లో ఉండాలి” అంటూ సల్మాన్ లేపడంతో కల చెదిరిపోయింది. షరీఫ్ గబుక్కున లేచి కూచున్నాడు. కొన్ని క్షణాల వరకు తను ఎక్కడున్నదీ అర్థం కాలేదు. నిద్ర సరిగ్గా లేనందువల్ల కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. “టైం ఎంతయిందీ?” అని అడిగాడు.

“నాలుగు దాటి ఉంటుంది. ఐదింటినుంచే చాయ్ తాగడానికి మనుషులు రావడం మొదలౌతుంది. ఆలస్యమైతే యజమాని తిట్టే అసహ్యమైన తిట్లన్నీ తినాల్సి వస్తుంది” అంటూ తొందర పెట్టాడు సల్మాన్.

డ్యూటీలో చేరిన మొదటి రోజు కాబట్టి షరీఫ్ కొంత ఇబ్బంది పడ్డాడు. సల్మాన్ అతనికి గురువులా మారిపోయి, ఆర్డర్ ఎలా తీసుకోవాలో, వాళ్ళడిగిన వాటిని వేగంగా బల్ల మీదకు ఎలా చేర్చాలో, బిల్లు ఎంతయిందో లెక్కకట్టి, చెవి వెనక పెట్టుకున్న పెన్సిల్‌తో కాగితపు ముక్క మీద రాసిస్తే కౌంటర్లో ఉన్నతను డబ్బులు వసూలు చేసే విధానం.. అన్నీ నేర్పించాడు. మొత్తం ఎనిమిది బల్లలు.. ఒక్కో బల్లకి ఇరువైపులా కస్టమర్లు కూచోడానికి కుర్చీలు.. నాలుగు బల్లలవద్ద కూచునే కస్టమర్ల బాధ్యత షరీఫ్‌ది.

ఉదయం డ్యూటీలోకి ఎక్కగానే ఒక పరోటా, చాయ్ ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఓ పరోటాతో పాటు పనోళ్ళ కోసం వండిన అన్నం, నీళ్ళలాంటి పప్పుచారు వడ్డిస్తారు. హోటల్ వాళ్ళు పెట్టే తిండికి, అపరిశుభ్రంగా ఉండే గదిలో పడుకోడానికి షరీఫ్ అలవాటు పడినా, అన్ని గంటలు నిలబడి పని చేయడానికి శరీరం సహకరించక చాలా ఇబ్బంది పడ్డాడు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది వరకు విశ్రాంతి అనేదే లేకుండా పని చేస్తూనే ఉండాలి. పదిహేడు గంటలకు పైగా నిలబడి ఉండటం వల్ల రాత్రుళ్ళు కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయి.

దానికి ప్రతిఫలంగా యజమాని ఇచ్చే జీతం చాలా తక్కువ. ఎటొచ్చీ తిండికోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఆ డబ్బులోంచే ప్రతినెలా కొంత మిగల్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ డబ్బుని దాచుకోవడం కోసం సందూక్‌తో పాటు తాళం కప్పని కూడా కొన్నాడు. అవసరమైనంత డబ్బు కూడబెట్టాక, హిందూస్తాన్లో ఉన్న తన గ్రామం హుందర్మో చేరుకోవాలనేది అతని కోరిక. అందుకోసం ఎంతటి కష్టమైనా పడటానికి అతను తయారుగా ఉన్నాడు.

నెల తిరిగేసరికి షరీఫ్ మంచి పనివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలసటనేదే లేకుండా బొంగరంలా తిరుగుతూ పని చేయడంతో పాటు కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో అటు కస్టమర్లకీ ఇటు యజమానికి అతను ప్రీతిపాత్రుడైనాడు. ఏడాది గడిచింది. సల్మాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. అతను వేగంగా నడవలేకుండా ఉన్నాడు. ఎక్కువ సేపు నిలబడలేకుండా ఉన్నాడు. రోజు రోజుకీ చిక్కిపోతున్నా డు. తిండి సయించడం లేదంటున్నాడు. కొద్దిగా తిన్నా వాంతులు చేసుకుంటున్నాడు.

అతని పరిస్థితి చూసి షరీఫ్ కంగారు పడ్డాడు. తను ఈ పట్టణంలో ఓ అనాథలా దిక్కుతోచక తిరుగుతున్నప్పుడు తనకో ఆశ్రయం కల్పించిన మహానుభావుడతను. ప్రస్తుతం తను తింటున్న తిండీ, సంపాదించి దాచుకుంటున్న డబ్బూ అతని చలవే. అందుకే షరీఫ్‌కి అతనంటే కృతజ్ఞతాభావం.

గదిలో చేరిన రెండో రోజే సల్మాన్‌కున్న తాగుడు అలవాటు గురించి తెల్సింది. రాత్రి హోటల్ మూసేశాక, గదికెళ్ళేముందు ఆ మురికివాడలో ఉన్న సారాయి దుకాణం దగ్గర ఆగి, తాగందే ఉండలేడని అర్థమైంది.

“నువ్వూ ముసల్మానువేగా. తాగడం హరాం అని తెలియదా?” అని అడిగాడో రోజు.

“తెలుసు. కానీ తాగకపోతే నిద్రపట్టదు.”

“ఎందుకు పట్టదు? ఒక రోజు తాగకుండా పడుకో. చూద్దాం.”

“అమ్మో.. వద్దు. అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ గుర్తొస్తే ఏడుపొస్తుంది. తను గుర్తుకు రాకూడదనే తాగుతాను.”

“నీకు అమ్ముందా? నాకెప్పుడూ చెప్పలేదెందుకు?”

“అమ్ముంది. నాన్న నా చిన్నప్పుడే చనిపోతే, కష్టపడి పెంచిన అమ్మ.. కట్టెలు కొట్టుకొచ్చి, నెత్తిమీద మోపుని పెట్టుకుని, యిల్లిల్లూ తిరిగి అమ్ముకొచ్చేది. పిచ్చి తల్లి.. తను పస్తులుండి నా కడుపు నింపేది. పధ్నాలుగేళ్ళ వయసులో బేవార్సుగా తిరుగుతున్నానని తిట్టేది. ఓ రోజు స్నేహితుల బలవంతం మీద సారాయి తాగి యింటికెళ్ళాను. అమ్మకు బాగా కోపమొచ్చి చీపురు కట్ట తిరగేసి కొట్టింది. అంతే.. నాకూ అమ్మ మీద కోపమొచ్చి యింట్లోంచి పారిపోయి రైలెక్కి ఈ వూరొచ్చేశాను” సల్మాన్ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు.

“తిరిగి మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోవచ్చుగా.”

“రోజూ తాగందే ఉండలేని నేను ఏ మొహం పెట్టుకుని అమ్మ దగ్గరకు వెళ్ళమంటావు?”

“అమ్మ కోసం తాగుడు మానేయవచ్చుగా?”

“తాగుతుందే అమ్మ గుర్తొచ్చిన బాధతో కదా.”

షరీఫ్‌కి స్పష్టంగా అర్థమైంది. అమ్మ గుర్తుకు రావడం అనేది తన తాగుడుకి ఓ సాకులా వాడుకుంటున్నాడని. ఎన్నిసార్లు చెప్పి చూశాడో.. తాగుడు వల్ల ఆరోగ్యం చెడిపోయి, వొళ్ళంతా గుల్లవుతుందని.. సల్మాన్ అతని మాటల్నెప్పుడూ ఖాతరు చేయలేదు.

దగ్గు తెర అడ్డుపడి వూపిరాడక సతమతమౌతున్న సల్మాన్‌తో “నువ్వు దవాఖానాలో చూపించుకోవడం మంచిది” అన్నాడో రోజు రాత్రి.

“దవాఖానాకా?” అంటూ విషాదంగా నవ్వాడు సల్మాన్.

డబ్బు ఖర్చవుతుందని సంకోచిస్తున్నాడేమోనని “ప్రభుత్వ దవాఖానాలో చూపించుకో. ఉచితంగా అన్ని పరీక్షలు చేసి మందులిస్తారు. నీకు తప్పకుండా నయమౌతుంది” అన్నాడు.

“డబ్బు గురించి కాదు సమస్య. నువ్వుయినా మీ వూరెళ్ళి నీ కుటుంబాన్ని కల్సుకోవడం కోసం డబ్బులు దాచుకుంటున్నావు. నాకెవరున్నారని? ఒంటరి పక్షిని. మనం ఉదయం నాల్గింటికి లేస్తే రాత్రి పదివరకూ పనేనాయె. కంటినిండా నిద్రక్కూడా కరువైపోయింది కదా. ఇక ఆస్పత్రుల చుట్టూ తిరగడానికి సమయం ఎక్కడుంది?”

ఆ సమస్య గురించి షరీఫ్ కూడా ఆలోచించాడు. నిజమే.. తీరికలేని జీవితాలు తమవి. సగం నిద్రకు కూడా నోచుకోని జీవితాలు. రాత్రి నడుంవాల్చేవరకు ఒకటే పరుగు.. ఆదివారం కూడా శెలవ లేదు… గత్యంతరం లేక శెలవ పెడితే ఆ రోజుకి జీతంలో కోతతో పాటు తిండిక్కూడా ఇబ్బందే. తను రాక ముందైతే సల్మాన్ ఒక్కడే సర్వర్. అతను శెలవ పెడితే అతని బదులు పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేని పరిస్థితి.. ఇప్పుడలా కాదుగా, సల్మాన్ లేకున్నా మొత్తం పనిని తనొక్కడే చేసుకోగలడు. అదే మాట అతన్తో అన్నాడు.

“రేపు నువ్వు పన్లోకి రాకు. ఆస్పత్రికెళ్ళి చూపించుకో. యజమానితో నేను చెప్పుకుంటాలే. అక్కడ పని కాగానే హోటల్ కొచ్చేయి” అన్నాడు

మరునాడు హోటల్లో పని చేస్తున్నాడన్న మాటేగాని అతని మనసంతా సల్మాన్ అనారోగ్యం గురించి డాక్టర్లు ఏమన్నారోనన్న దానిమీదే ఉంది. ముక్కూ మొహం తెలియని తనమీద నమ్మకంతో తన గదిలో చోటిచ్చి, బతుకు తెరువుకు తనకో దారి చూపించిన వ్యక్తి.. అతన్ని చల్లగా చూడమని అల్లాని ఎన్నిసార్లు ప్రార్థించాడో. మధ్యాహ్నం రెండు నుంచి అతని కళ్ళు సల్మాన్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తూనే ఉన్నాయి.

సాయంత్రమైంది. మెల్లగా చీకట్లు అలుముకోసాగాయి. చలి తన పంజా విసరడానికి సమాయత్త మౌతోంది. వేడి వేడి చాయ్ తాగడానికి వచ్చే జనాలు ఎక్కువయ్యారు. షరీఫ్ వాళ్ళకు చాయ్ గ్లాసులు అందించడంలో తీరికలేకుండా ఉంటూనే సల్మాన్ కోసం ద్వారం వైపు ఓ కన్నేసి ఉంచాడు.

ఏడు దాటాక సల్మాన్ నీరసంగా లోపలికి రావడం గమనించి అతని కెదురెళ్ళి “డాక్టర్లకు చూపించుకున్నావా? పరీక్షలన్నీ చేశారా? ఏం జబ్బని చెప్పారు? మందులిచ్చారా?” అంటూ వూపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పటికి చాయ్‌లు అడిగేవాళ్ళ రద్దీ తగ్గింది,

సల్మాన్ ఓ బల్లమీద కూచుని “మొదట ఓ గ్లాసు మంచినీళ్ళివ్వవా?” అని అడిగాడు.

మంచినీళ్ళతో పాటు వేడి వేడి చాయ్ కూడా తెచ్చి అతనెదురుగా పెట్టి, కస్టమర్లెవరో పిలవడంతో అటుకెళ్ళి, ఆర్డర్ తీసుకుని, వాళ్ళకు కావాల్సినవి అందించి వచ్చేలోపల సల్మాన్ చాయ్ తాగి లేచి నిలబడ్డాడు. సర్వర్లెవరూ కస్టమర్లు కూచునే బల్లల మీద కూచోకూడదన్న విషయం అప్పుడు గుర్తొచ్చిందతనికి.

“ఇంతకూ డాక్టర్లు ఏమన్నారో చెప్పవేంటి” అంటూ షరీఫ్ అసహనంగా అడిగాడు.

“కడుపులో పుళ్ళు పడ్డాయట. జబ్బు బాగా ముదిరిపోయిందని చెప్పారు. పేగులకి రంధ్రం పడే ప్రమాదముందని కూడా చెప్పారు. ఏవో గోలీలిచ్చారు. కారాలు, మసాలాలు తినొద్దని చెప్పారు. మళ్ళా రెండు వారాల తర్వాత రమ్మన్నారు.”

“నువ్వు మొదట ఆ తాగుడు మానేయి. అన్నీ సర్దుకుంటాయి. నీ సంపాదనంతా తాగుడికి తగలేస్తుంటే పేగులకి చిల్లులు పడకుండా ఎలా ఉంటాయి?”

“పదిహేనేళ్ళ వయసులో చేసుకున్న అలవాటు.. ఇప్పుడు పొమ్మంటే పోతుందా చెప్పు.”

“సర్లే.. అలసటగా ఉన్నావుగా, పరోటా పార్మెల్ చేసిస్తాను. గదికెళ్ళి తినేసి విశ్రాంతి తీసుకో.”

“పర్లేదు. ఇప్పుడు కొద్దిగా ఓపికొచ్చిందిలే. ఇద్దరం కలిసే వెళ్దాం” అంటూ పన్లోకి దిగిపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here