రెండు ఆకాశాల మధ్య-41

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“రెం[/dropcap]డు దేశాల మధ్య మన కళ్ళకు కన్పించకుండా గీసిన లకీర్ మనుషుల మధ్య ఉన్న ప్రేమల్నీ అనుబంధాల్ని చేరిపేయగలదంటే నేను నమ్మను భయ్యా. దానికంత శక్తి ఉందని అనుకోను. నీ బావ సరిహద్దు రేఖకి ఆ వైపున్నారు. నేనీ వైపున్నాను. ఇలా ఎన్ని యుగాలున్నా నాకు ఆయన మీదున్న ప్రేమ గానీ, ఆయనకు నా మీదున్న అనురాగం గానీ ఇసుమంతైనా తగ్గుతాయని నేననుకోను.”

“అందరూ నీలా బావలా అమాయకంగా ఉంటారనుకోకు బహెన్. నూటికి తొంభై మంది హృదయంతో ఆలోచించరు. వ్యాపార బుద్ధితోనే ఆలోచిస్తారు. లాభ నష్టాలు బేరీజు వేసుకునే పనులు చేస్తారు. సరిహద్దు రేఖకి అవతల ఉన్న అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలియనంత అమాయకుడనుకుంటున్నావా లతీఫ్? నామాటిను. ఆస్‍మాకి మా వూళ్లోనే సంబంధాలు వెతుకుతున్నాను. తొందర్లోనే దానికి నిఖా చేసి ఓ అయ్య చేతిలో పెడ్తే నీ బాధ్యత, నా బాధ్యత తీరిపోతుంది. యిక మిగిలింది ఆరిఫ్‌ని పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేయడమే.”

అప్పటివరకూ మెడవరకు దుప్పటి కప్పుకుని పడుకునే తన అన్నతో మాట్లాడుతున్న హసీనా, ఓపిక తెచ్చుకుని లేచి కూచుంది.

“అంతేనంటావా? కానీ ఆస్‌మా కూడా వాళ్ళ నాన్న రానిదే పెళ్ళి చేసుకోనంటుందిగా” అంది.

మంచానికి ఓ చివర కూచుని ఉన్న ఆస్‌మా వైపు చూస్తూ “ఏం తల్లీ… ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నావా? మీ నాన్న లేకుండా పెళ్ళి చేసుకోవా?” అని అడిగాడు.

ఆస్‌మా అభిప్రాయంలో ఒకప్పుడున్న దృఢత్వం లేదిప్పుడు. నాన్న ఉంటే బావుంటుందన్న కోరికైతే ఉంది కానీ నాన్న ఎప్పుడొస్తాడో తెలియని అనిశ్చిత స్థితిలో పెళ్ళిని వాయిదా వేయడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి కూడా ఆలోచిస్తోంది.

ఆమె సమాధానమివ్వకపోవడంతో “నా మాట విను తల్లీ. మీ నాన్న ఎప్పటికొస్తాడో తెలీదు. అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. దానికి నీ పెళ్ళికి ముడి పెట్టకపోవడమే మంచిది” అన్నాడు ఫక్రుద్దీన్.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత “నీ ఇష్టం మామూ” అంది ఆస్‌మా.

ఆమె తన అంగీకారం తెల్పడంతో ఫక్రుద్దీన్ చాలా సంతోషపడ్డాడు. షరీఫ్ బ్రోల్మోలో చిక్కుకుపోయాడని తెల్సినప్పటినుంచి చెల్లెలి బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఆరిఫ్ పెద్దయి, సంపాదనాపరుడయ్యేవరకు ఈ కుటుంబాన్ని ఆదుకోవడం తన ధర్మం అనుకున్నాడు. ఆస్‌మా పెళ్ళి జరిగిపోతే తన చెల్లికి కూడా కొంత మనశ్శాంతి లభిస్తుందని అతని ఆశ..

మరునాడు హసీనాని ఆర్.ఎస్.పురాలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి పిల్చుకెళ్ళాడు. డాక్టర్లు అవసరమైన పరీక్షలన్నీ చేసి ఆమెకు గుండె జబ్బు ఉందని తేల్చారు. మందులిచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి పంపారు.

ఎప్పుడు చూసినా నవ్వుతూ తుళ్ళుతూ షింగో నదిలా ఉరకలేసే తన చెల్లెలికి గుండె జబ్బుందని తెలియగానే ఫక్రుద్దీన్ చాలా బాధపడ్డాడు. “దిగుళ్ళతోనే గుండెజబ్బు కొనితెచ్చుకున్నావు హసీనా. పరిస్థితుల్తో రాజీపడటం నేర్చుకో. మన చేతుల్లో ఏం ఉంది చెప్పు? ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. దిగులు పడటం వల్ల సమస్యలు పరిష్కారం కావుగా” అన్నాడు.

“నువ్వు చెప్పింది నిజమే భయ్యా. అలాగని నా భర్త దూరమైనా దిగులు పడకుండా ఉండటానికి నేనేమీ రాయిని కాను. హృదయమున్న మనిషిని” అడ్డుపడిన కన్నీటి తెరను తుడుచుకుంటూ అంది హసీనా.

ఫక్రుద్దీన్‌కి ఏమనాలో అర్థం కాలేదు. చెప్పడం సులభమే. అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధేమిటో… జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకర సంఘటనలు గుండెల్లో తీవ్రమైన గాయాలు చేస్తాయి. ఎన్నటికీ మానని గాయాలు.. అనుకున్నాడు.

“నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎలా బహెన్.. ఏదైనా జరక్కూడనిది జరిగితే పిల్లల గతేమిటి?” అన్నాడు.

హసీనా ఉదాసీనంగా నవ్వింది. “గుండె నొప్పితో చచ్చిపోతానేమోనని భయపడ్తున్నావా? అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఆయన తిరిగొచ్చేవరకు నా ప్రాణం పోదు” అంది.

సమయానికి మందులిస్తూ అమ్మను జాగ్రత్తగా చూసుకోమని ఆస్‌మాకి చెప్పి ఫక్రుద్దీన్ జోరాఫాంకి తిరిగొచ్చాడు. వచ్చిన క్షణం నుంచే తమ వూళ్లో పెళ్ళికి సిద్ధంగా ఉన్న యువకుల్లో తన మేనకోడలికి సరిపడే సంబంధం కోసం వెతకడం మొదలెట్టాడు. ఆస్‌మా అందానికి, మంచితనానికి సరితూగగల కుర్రాళ్ళెవరూ తన వూళ్లో లేరన్న నిర్ధారణకొచ్చాక, ఆర్.ఎస్.పురాలో ఉన్న అల్లుడు అఖ్తర్‌కి ఆ బాధ్యతను అప్పగించాడు. నెల్లోపలే అఖ్తర్ మియా తమ మొహల్లాలో నివాసముండే షాకత్ అలీ గుణగణాల గురించి, అతని అమ్మానాన్నల గురించిన సమాచారాన్ని తన మామగారికి చేరవేశాడు.

మొదట ఫక్రుద్దీన్ ఆర్.ఎస్.పురా వెళ్ళి అబ్బాయిని చూసి, వాళ్ళ అమ్మానాన్నల్తో మాట్లాడివచ్చాడు. అటువైపు పెద్దలు హుందర్మాన్ కెళ్ళి ఆస్‌మాని చూసి వచ్చాక, సంబంధం పక్కా చేసుకున్నారు.

ఫక్రుద్దీన్ పెళ్ళి పెద్దగా నిలబడి తన మేనకోడలు ఆస్‌మా పెళ్ళిని దూల్హా తరఫువాళ్ళ సంతృప్తి మేరకు జరిపించాడు. కూతురి నిఖా జరుగుతున్నందుకు హసీనాకి ఓ వైపు సంతోషంగా ఉన్నా తన భర్త ఆ వేడుకలో లేనందుకు బాధగా కూడా అన్పించింది. ఆమె ఓ కంట్లో మెరుపుతో మరో కంట్లో కన్నీటితో ఆస్‍మాకు వీడ్కోలు పలికింది.

***

జమీల్ ఉంటున్న గదిలోకి మారాక షరీఫ్‌కి హాయిగా అన్పించింది. సల్మాన్‌తో పంచుకున్న మురికివాడలోని అపరిశుభ్రమైన గదికి పూర్తి భిన్నంగా.. మంచి పరిసరాల్లో ఉందా గది. చిన్న గదైనా జమీల్ దాన్ని అందంగా అలంకరించుకున్నాడు. చాపమీద మెత్తటి దూది పరుపు.. దాని మీద మల్లెపూవులాంటి తెల్లటి దుప్పటి పరిచిఉంది. ఓ దిండు.. దాన్ని కప్పుతూ గులాబీ రంగు దిండు కవరు.. పైన ఫ్యాన్ ఉంది. గదికి ఆనుకుని స్నానాల గది కూడా ఉంది.

షరీఫ్‌ని బజారుకి పిల్చుకెళ్ళి అతని కోసం కూడా దూదిపరుపు, దిండు, దుప్పటి కొనిపించాడు జమీల్. హోటల్లో చేసిన పనిలా గంటల తరబడి నిలబడాల్సిన అగత్యం లేదు. జమీల్ ఉదయం ఐదింటికి లేచి, పూలు హోల్‌సేల్‌గా అమ్మే ఖాద్రి యింటికెళ్ళి, ఆ రోజుకవసరమైన రకరకాల పూలు కొనుక్కొస్తాడు. గదిలో కూచుని ఇద్దరూ ఆ పూలని మాలలుగా కడ్తారు. ఎనిమిదింటికల్లా మాలలుగా కట్టిన పూలని, విడిపూలని వెదురు బుట్టల్లో పెట్టుకుని పూల మార్కెట్‌కి వెళ్తారు. జమీల్ ఓ చోట కూచుంటే అతనికి కొద్దిగా ఎడంగా షరీఫ్ కూచుని పూలు అమ్ముతారు. సమయం దొరికినపుడల్లా అక్కడ కూచునే విడిపూలతో మాలలల్లు కుంటారు. వేడుకలప్పుడు మెళ్ళో వేసే పూలదండలు ఎలా అల్లాలో, నిఖాలప్పుడు అవసరమైన సేరాలు ఎలా తయారుచేయాలో కూడా జమీల్ షరీఫ్‌కి నేర్పించాడు.

హోటల్లో పని చేసినపుడు అందిన జీతం కంటే పూలవ్యాపారం వల్ల వచ్చే ఆదాయం బాగుంది. షరీఫ్ మళ్ళా సందూక్ కొని, డబ్బులు దాచడం మొదలెట్టాడు. అతను రోజూ కనే కల ఒకటే. హుందర్మో గ్రామానికెళ్ళి తన భార్యా పిల్లల్ని కల్సుకోవాలని… అతనికున్న కోరిక ఒకటే. తను పుట్టి పెరిగిన నేలలోనే తన చివరి రోజులు గడవాలని.. అక్కడి మట్టిలోనే తను చివరి నిద్ర పోవాలని…

“బాబాయ్.. మీరు ఈ షెహర్‌లో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూశారా?” అని ఓ రోజు జమీల్ అడిగాడు.

“హోటల్లో పని చేసిన రెండేళ్ళూ తీరికెక్కడిది జమీల్.. ఉదయం ఐదింటికి లేచి పన్లో కెళ్తే మళ్ళా రాత్రి గదికొచ్చేటప్పటికి పదకొండు దాటేది. శుక్రవారం, ఆదివారం అనేది లేకుండా అన్నిరోజులూ పనేగా. ఆ హోటల్ పరిసరాలు, మా గది చుట్టుపక్కల ఉన్న మురికివాడ తప్ప ఈ షెహర్‌లో యింకేమీ తెలియదు నాకు” అన్నాడు షరీఫ్.

“అయ్యో బాబాయ్… స్కర్దూ షెహర్ చాలా అందమైన పట్టణం తెలుసా. చుట్టూ అందమైన పర్వతాలు, రకరకాల పూల మొక్కల్తో, దట్టమైన చెట్ల సముదాయంతో పచ్చగా అలరారే విశాలమైన లోయ, పట్టణాన్ని ఆనుకుని ప్రవహించే సింధూ నది, పక్కనే షిగార్ నది, కచురా సరస్సు, సత్పరా సరస్సు, ఎత్తయిన షిగార్ కోట, స్కర్దూ కోట.. పనులన్నీ మానుకుని వారమంతా తిరిగినా ఈ ప్రదేశాలన్నీ చూడటానికి, చూసి అద్వితీయమైన అనుభూతి పొందడానికి సమయమే సరిపోదు.”

“ఇప్పుడైనా మనకు సమయం ఎక్కడుంది జమీల్. పూలు తెచ్చుకోవడం, మాలలల్లుకోవడం, బజార్లో పూలు అమ్మడం.. మనక్కూడా రాత్రి పది దాటుతోందిగా.”

“మీరు పనిచేసిన హోటల్లో మీకో యజమాని ఉన్నాడుగా. ఇక్కడ మనమే పనివాళ్ళం. మనమే యజమానులం. రోజంతా పూలమ్మాలని ఎక్కడుంది బాబాయ్… ఉదయం పది వరకు అమ్ముదాం. మళ్ళా సాయంత్రం ఐదు నుంచి రాత్రి వరకూ అమ్ముదాం. ఆ సమయంలోనేగా ఎక్కువమంది పూలుకొనేది. పది నుంచి ఐదు వరకు తిరిగి చూడతగ్గ ప్రదేశాలు చూద్దాం.”

“నువ్వు చూశానంటున్నావుగా. మళ్ళా నాకోసం వస్తావా?”

“మీ కోసం కాదు బాబాయ్.. నాకోసమే. అటువంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. రేపటి నుంచి రోజుకొక ప్రదేశం చొప్పున చూద్దాం” అన్నాడు జమీల్..

జమీల్‌తో కలిసి స్కర్దూలోని పర్యాటక ప్రదేశాలు చూస్తున్నప్పుడు షరీఫ్‌కి ఆ పట్టణం గురించి చాలా విషయాలు తెలిశాయి. నలభై కిలోమీటర్ల పొడవు. పది కిలోమీటర్ల వెడల్పున్న లోయలో ఉంది స్కర్దూ పట్టణం. స్కర్దూ అంటేనే బాల్టీ భాషలో రెండు ఎత్తయిన ప్రదేశాల మధ్య ఉన్న లోయలాంటి ప్రాంతమని అర్థం. ప్రపంచంలో ఎనిమిదివేల మీటర్లకన్నా ఎత్తుండే పధ్నాలుగు పర్వతాల్లో నాలుగు స్కర్దూలోనే ఉన్నాయి. గిల్గిట్ బాల్టిస్తాన్‌లో స్కర్దూ ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందడానికి కారణం చుట్టూ ఉన్న మంచు పర్వతాలు, నదులు, సరస్సులే. ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు పర్వతారోహణ కోసం, ట్రెక్కింగ్ కోసం, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం స్కర్దూని సందర్శిస్తుంటారు.

మొదట వాళ్ళిద్దరూ స్కర్దూ కోట చూడటానికి వెళ్ళారు. పదిహేను మీటర్ల ఎత్తులో ఏడంతస్తులుగా కట్టబడిన కోట పైకెక్కి చూస్తే స్కర్దూ పట్టణ సొబగుల్తో పాటు లోయ సౌందర్యం, సింధూ నది సోయగం కళ్ళముందు సాక్షాత్కరించాయి.

మరో రోజు షిగార్ కోటని సందర్శించారు. ప్రపంచలోకెల్లా ఎత్తయిన పర్వతాల్లో రెండోదైన కె-2 పర్వతానికి వెళ్ళే దారిలో ఉందా కోట. యింకో రోజు గాఢమైన నీలం రంగు నీళ్ళతో కనువిందు చేసే కచుర్పా సరస్సు చూడటానికి వెళ్ళారు. స్కర్దూ ప్రజల దాహార్తిని తీర్చే సత్పరా సరస్సుని కూడా చూశారు. ఒకరోజు ద్యోసాయి నేషనల్ పార్కు చూసి, అక్కడినుంచి డెబ్బయ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన మంథొఖా జలపాతాన్ని చూసి ఆనందించారు.

రెండున్నరేళ్ళు గడిచిపోయాయి. హోటల్లో పని చేస్తున్న రోజుల్లో ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు వూపిరాడనంత పని ఉండేది. హసీనాని, ఆస్‌మాని తల్చుకోడానిక్కూడా తీరిక దొరికేది కాదు.

కానీ జమీల్‌తో పాటు పూలమ్మే పని చేస్తున్నప్పటినుంచి ఆలోచనలు అవిశ్రాంతంగా వస్తూనే ఉన్నాయి.. మనసులో తుఫాన్లు చెలరేగుతూనే ఉన్నాయి.

హసీనా జ్ఞాపకాలు.. తన ప్రాణంలో ప్రాణంలా మెదిలిన హసీనా.. ప్రేమకు ప్రతిరూపం లాంటి హసీనా.. ఒకప్పుడు తీయగా మధురంగా అన్పించిన అనుభవాలు ఇపుడు గుర్తుకొస్తే గుండెల్లో ఎవరో శూలాల్తో పొడుస్తున్నంత బాధగా ఉంటోంది. ఎన్ని తీయటి రాత్రులు.. మత్తెక్కించే ఎన్నెన్ని కబుర్లు.. మళ్ళా ఎప్పటికైనా ఆ రోజులు తిరిగొస్తాయా? తను హసీనా ఒడిలో తలపెట్టుకుని పడుకుంటే ఆమె తన మృదువైన వేళ్ళతో తన జుట్టును సవరిస్తూ…. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సమ్మోహనంగా చూస్తూ…

పెళ్ళయి ఎన్నేళ్ళయినా హసీనా తన కళ్ళకు సుహాగ్ రాత్ రోజు ముగ్ధ మనోహరంగా కన్పించిన హసీనాలానే కన్పించేది. విరబూసిన సన్నజాజి చెట్టులాంటి హసీనా… ఇప్పుడెలా ఉందో.. ఆమె లేకుండా తను మోడువారిపోయినట్టు తను లేకుండా ఆమె కూడా ఎండిపోయి, వడలి పోయి.. ఆ ఆలోచనకే అతనికి భయమేసింది. తన హసీనా అలా కావడానికి వీల్లేదు. ఆమె మళ్ళా చిగురించాలి.. పువ్వుల్లో మొగలో కళకళలాడాలి. అలా జరగాలంటే తను వీలైనంత త్వరగా హుందర్మోని చేరుకోవాలి. అప్పుడే ఇద్దరి జీవితాల్లోకి వసంతం ప్రవేసించేది.

అతనికి ఆస్‌మా కూడా బాగా గుర్తొస్తోంది. తనంటే ఎంత పిచ్చి ప్రేమో.. అమ్మలా ప్రేమించే కూతురుండటం ఎంతదృష్టం అనుకుని ఎన్నిసార్లు మురిసిపోయేవాడో.. తను రావడం ఎంతాలస్యమైనా అన్నం తినకుండా ఎదురుచూసేది. ఇప్పుడేం చేస్తుందో, దుఃఖాన్ని నముల్తో తన రాకకోసం ఎదురుచూస్తోందేమో.. దాని పెళ్ళి గురించి ఎన్ని కలలు కన్నాడో… హుందర్మోని భారత సైనికులు హస్తగతం చేసుకోవడం ఓ పది రోజులు ఆలస్యమై ఉంటే దాని పెళ్ళి లతీఫ్ కొడుకుతో ఐపోయి ఉండేది. ఆ తర్వాత తను బ్రోల్మోలో ఇరుక్కునిపోయినా ఇంత దిగులుండేది కాదు. అమ్మలా ఆస్‌మా తనను వూరడించేది. పసిపిల్లాడిని చూసుకున్నట్టు తనకేలోటూ రాకుండా చూసుకునేది.

ఆస్‌మాకి పెళ్ళయిందో లేదో.. పిచ్చిది. మా నాన్న వచ్చేవరకు నిఖా చేసుకోనని మొండికేసి కూచుందో ఏమిటో.. హసీనా ఇప్పుడు మగతోడు లేని ఆడదైపోయింది. ఎలా సంసారాన్ని నిభాయించుకుంటుందో.. ఆసమాకి సంబంధాలు చూడాలంటే పది చోట్లకు తిరగాలి. పది చోట్ల వాకబు చేయాలి. అవన్నీ హసీనా చేయగలుగుతుందో లేదో.. ఆస్‌మాకి ఎటువంటి కుర్రవాణ్ని తెచ్చి నిఖా చేస్తుందో?

ఐనా మనిషి చేతిలో ఏముందని? అనీస్ అంటే తనకెంత ప్రాణమో.. ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనేగా అందంతో పాటు మంచీ మర్యాద కలిగిన జమీల్ లాంటి కుర్రాడికిచ్చి నిఖా జరిపించాడు. చివరికేమైంది? పెళ్ళయి కొన్ని నెలలు కూడా కాకముందే జమీల్ ఈ దేశంలో అనీస్ ఆ దేశంలో మిగిలిపోయారు. ఈ వయసులో ఒంటరి బతుకు జమీల్‌కైనా ఎంత కష్టం? తన భర్త దూరమైనందుకు అనీస్ ఎంత దుఃఖపడ్తుందో.. ఎన్ని కన్నీళ్ళు కారుస్తుందో..

ఆ దురదృష్టకరమైన రోజు వ్యాపారనిమిత్తమో, షాపింగ్ చేసే ఉద్దేశంతోనో లేకపోతే బంధువుల ఇళ్ళకో చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి స్కర్దూ వచ్చినవాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని పల్లెటూర్లని భారతసైన్యం కైవసం చేసుకోవడంతో అలా వచ్చిన వాళ్ళు స్కర్దూలో చిక్కుకుపోయారు. తిరిగి మళ్ళా తమ వూళ్ళకు వెళ్ళడానికి అవకాశం లేదని గ్రహించి చాలామంది మగవాళ్ళు ఇక్కడే పునర్వివాహాలు చేసుకుని స్థిరపడి పోయారు. కొంతమంది స్త్రీలు కూడా మారు మనువులు చేసుకుంటున్నారు.

కానీ జమీల్ ఎంత బుద్ధిమంతుడో.. వయసులో ఉండి కూడా మరో నిఖా మాటే ఎత్తడం లేదు. తనలానే ఎప్పటికైనా హుందర్మో చేరుకుని తన బేగం అనీస్‌ని కల్సుకోవాలనుకుంటున్నాడు. నిజమైన ప్రేమంటే అదేగా.. తనకు హసీనా మీద ఉన్నటువంటి ప్రేమ..

ఇలా అనుకున్నప్పుడల్లా అతనకి జమీల్ మీద వాత్సల్యం పొంగుకొస్తోంది. దుఃఖసాగరంలాంటి తన జీవితంలో జమీల్ ఓ ఓదార్పులా కన్పిస్తున్నాడు. ఎడారిలో ఒంటరి ప్రయాణం లాంటి తన బతుకులో అతనో ఒయాసిస్సులా ఎదురై సేద తీరుస్తున్నాడు.

ఓ రోజు జమీల్ “నేను నిఖా చేసుకోబోతున్నాను బాబాయ్” అన్నాడు.

ఆమాట వినగానే నెత్తిమీద పిడుగు పడ్డట్టు షరీఫ్ మ్రాన్పడిపోయాడు. ఇక్కడ జమీల్ మరో అమ్మాయిని చేసుకుని జీవితమాధుర్యాన్ని అనుభవిస్తుంటే అక్కడ అనీస్ యవ్వనాన్నంతా అడవి కాచిన వెన్నెల్లా వృథా చేసుకుంటూ బతకాలా? ఎంతటి అన్యాయం? అనీస్ జీవితం మోడు వారిపోవాల్సిందేనా?

“నీ కోసం అనీస్ ఎదురుచూస్తో ఉంటుంది జమీల్. నువ్వు ఎప్పటికైనా తిరిగొస్తావన్న ఆశతోనే బతుకుతో ఉంటుందని తెలిసి కూడా నువ్వు మరో పెళ్ళి చేసుకోవడం అన్యాయం కాదా? ఈ విషయం తెలిస్తే అనీస్ గుండె బద్దలైపోదా? మరి కొన్నాళ్ళు ఓపిక పట్టు. హిందూస్తాన్ వెళ్ళడానికి దారులు తెర్చుకుంటాయేమో చూద్దాం” బాధగా అన్నాడు షరీఫ్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here