Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-46

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]రై[/dropcap]లు బయల్దేరిన క్షణం మదీహా కళ్ళలో సంతోషం చూడాలి.. వేకువ జామున విచ్చుకున్న తెల్ల కలువల్లా తన కళ్ళు నవ్వడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. “అబ్బాజాన్.. మన ప్రయాణం మొదలైంది. లాహోర్‌లో ప్రారంభించబోయే కొత్త జీవితానికి ఇదే నాందీ ప్రస్తావన” అంది.

నా భార్య కళ్ళలో నీళ్ళు పొంగడం గమనించి “ఎందుకు అమ్మీ సంతోషపడాల్సిన సమయంలో కన్నీళ్ళు?” అంది మదీహా.

“నేను పుట్టి పెరిగిన పాత ఢిల్లీ నగరాన్ని వీడిపోతుంటే చాలా బాధేస్తోంది. మీ అబ్బాజాన్‌తో నా పెళ్ళి.. మీ అన్నా నువ్వు పుట్టడం.. మీ పెంపకం.. చదువులు.. ఢిల్లీ నగరంతో ముడిపడి ఎన్ని తీపి జ్ఞాపకాలో.. పుట్టి పెరిగిన వూరి మీద ప్రేమా, కన్నతల్లి మీద ప్రేమా ఎప్పటికీ తరగవు. నాది, నా స్వంతం అని నమ్మిన భూమిని ఎవరో లాక్కుని మనల్ని పరాయి భూమికి తరిమేస్తున్నట్టు ఆవేదనగా ఉంది. దుఃఖం వస్తోంది” అంది నా భార్య.

నా మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధనే నా భార్య తన మాటల్లో వ్యక్తపర్చడంతో నాకూ ఏడుపు తన్నుకు వచ్చింది. “అబ్బాజాన్.. మీరూ ఏడుస్తున్నారా? నిజం చెప్పాలంటే నాకూ బాధగానే ఉంది. నేను గడిపిన బాల్యం.. నా స్నేహితురాళ్ళు.. మన యిల్లు.. మట్టితో పెనవేసుకున్న మమకారం ఎంత బలమైందో నాకూ తెలుస్తూనే ఉంది. అది నా గుండెని ముక్కలుగా కోస్తూనే ఉంది. అలాగని ఆ మట్టిలోనే అర్ధాంతరంగా చావలేం కదా. చావు కన్నా పరాయి నేలకెళ్ళి బతకడమే మంచిది కదా” అంది మదీహా.

అప్పటివరకు మౌనంగా కూచుని ఉన్న ఖాలిద్ “మొన్నటివరకు ప్రాణంలో ప్రాణంలా మెలిగిన హిందూ స్నేహితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదు అబ్బాజాన్. మత ప్రాతిపదికన రెండు దేశాలుగా విభజించబడినా ముస్లింలు కోరుకుంటే హిందుస్తాన్లోనే ఉండొచ్చని గాంధీ నెహ్రూలు, హిందువులు కూడా పాకిస్తాన్లో ప్రశాంతంగా బతకొచ్చని మహమ్మదాలీ జిన్నా కూడా అన్నారుగా. ఎవరికి నచ్చిన దేశానికి వాళ్ళు వెళ్ళిఉండొచ్చుగా. బలవంతంగా తరిమేయడం, రక్తపాతం ఏమిటి? ఈ చంపుకోడాలూ నరుక్కోవడాలు ఎందుకు మొదలయ్యాయో, ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు” అన్నాడు.

నాకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వాడి గుండెల్ని మండిస్తున్న ఆవేదన నా హృదయంలో కూడా నిప్పుల కుంపటిలా మండుతో ఉంది. దేశవిభజనకు ముందు ఢిల్లీలో అన్ని మతాలవాళ్ళు కలిసిమెలసి ఉండేవాళ్ళు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు… ఎవ్వరూ ఎవ్వరినీ మత ప్రాతిపదికన గుర్తించే వాళ్ళు కాదు. మతాలకతీతంగా స్నేహాలు ఉండేవి. పందొమ్మిది వందల నలభై ఆరు నుంచే నాయకత్వం కోసం పాకులాడే కొంతమంది పెద్దలు వాళ్ళ మతస్థుల్ని కూడగట్టుకోవడం మొదలెట్టారు. దాంతోపాటు పరాయి మతస్థుల మీద రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇవ్వసాగారు. మెల్లమెల్లగా ప్రజల్లో మత విద్వేషాలు సన్నటి మంటలా మొదలై చివరికి మహాగ్ని కీలల్లా మారి ఇప్పుడు ఆరని చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ఇదంతా కొంతమంది స్వార్థ రాజకీయవేత్తల కుట్రలూ కుతంత్రాల ఫలితమే అన్పిస్తోంది. అసలు దేశం రెండు ముక్కలు కావడానికి కారణం కూడా జిన్నాకుండిన అధికార దాహమే కదా.

రైలు మెల్లగా వెళ్తోంది. మేం నలుగురం పురానా షహర్ లోని మా యింటి గురించి మాట్లాడుకుంటున్నాం.. చాలా విశాలమైన స్థలంలో కట్టిన డాబా యిల్లు.. పెరట్లో నా భార్య పెంచుకున్న రకరకాల పూల మొక్కలు.. నా చిన్నప్పుడు నేను నాటిన వేప విత్తనం ఇప్పుడు పెద్ద చెట్టుగా విస్తరించింది.. ఉదయం మేమందరం దంతధావనం చేసేది ఆ చెట్టు రెమ్మల్ని విరిచి పందోము పుల్ల చేసుకునే.. సాయంత్రాలు ఆ చెట్టు కింద పడక్కుర్చీ వేసుకుని సేద తీరడం నాకెంతిష్టమో….

అకస్మాత్తుగా హాహాకారాలు విన్పించాయి. పెద్దగా కేకలు, అరుపులు.. పెట్టెలోని మిగతా వాళ్ళందరూ ఏం జరుగుతోందని ఆశ్చర్యపడేలోపల నాకు అర్థమై వెంటనే అప్రమత్తమైనాను. టాయిలెట్ తలుపు తెరిచి నా కుటుంబంతో సహా లోపలికెళ్ళి తలుపుకి గడియ పెట్టేశాను. బైట నుంచి తుపాకీ శబ్దాలు విన్పిస్తున్నాయి. దాడి చేస్తున్న దుండగుల మీద రక్షక దళం కాల్పులు జరుపుతోందనుకున్నాను. కొన్ని నిమిషాల్లోనే మేమున్న బోగీకి తూటాలు తగుల్తున్న శబ్దం వినొచ్చింది. అంటే దాడి చేస్తున్న సిక్కులు, హిందువుల చేతుల్లో కత్తులతో పాటు తుపాకులు కూడా ఉండి ఉంటాయని వూహించాను.

బాంబులు విసుర్తున్నారెవరో.. ఎస్కార్ట్‌గా వచ్చిన సైనికుల దగ్గర తుపాకులు తప్ప బాంబులు లేవు కాబట్టి దుండగులే వాటిని విసుర్తున్నారని అర్థం చేసుకున్నాను. బహుశా బోగీలోంచి దిగి పారిపోతున్నవాళ్ళ మీద బాంబులు విసిరి చంపేస్తూ ఉండొచ్చు. అప్పుడే నాకో భయం పట్టుకుంది. వాళ్ళు బోగీలమీద బాంబులు విసరరని గ్యారంటీ ఏముంది?మా బోగీ మీద బాంబు పడితే నా గతీ, నా కుటుంబ సభ్యుల గతేమిటి? బోగీలో మేము దాక్కుని ఉన్న టాయిలెట్లోనే మాడి మసైపోవటం ఖాయం.. నా భార్యా పిల్లలు భయంతో వణికిపోసాగారు. వాళ్ళను రెండు చేతుల్తో దగ్గరగా పొదివి పట్టుకుని నిలబడ్డాను.

తుపాకీ శబ్దాలు ఆగిపోయాయి. సైనికులందరూ చనిపోబట్టే కాల్పులు ఆగిపోయి ఉంటాయనుకున్నాను. ఎవరో చాలా మంది వేగంగా బోగీలోకి ఎక్కుతున్న శబ్దం.. ఆ వెంటనే మిన్నంటిన ఆర్తనాదాలు.. ‘యా అల్లా’ అంటూ ఎవరో చావుకేక పెట్టారు. “కిసీకో భీ జిందా మత్ ఛోడనా” అంటూ ఎవరో అరిచారు. భయంతో వేసే కేకల్తో పాటు బాధతో చేసే ఆర్తనాదాలు మిన్నంటాయి.

బోగీలో ఉన్న అందర్నీ చంపేశాక, అనుమానంతో టాయిలెట్ తలుపు నెట్టి చూసి, బద్దలు కొట్టుకుని లోపలికొచ్చి చంపేస్తారేమోనన్న భయం కూడా వేసింది. దాదాపు గంట సేపు అల్లా మీద భారమేసి ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉండిపోయాం. బోగీలోంచి మనుషులు వేగంగా దిగిపోతున్న శబ్దంతో పాటు పరుగెత్తుతున్న శబ్దం.. అదేమిటో వెంటనే అర్థం కాలేదు. ఎవరు దిగి పరుగెత్తుతున్నారు? ఎందుకు పరుగెత్తుతున్నారు?

మరికొద్దిసేపు వేచి చూశాక బోగీలో మనుషులు తిరుగుతున్న శబ్దాలేవీ విన్పించలేదు. బాధతో అరుస్తున్న అరుపులు తప్ప కొత్తగా చావుకేకలేవీ విన్పించలేదు. ముష్కరులు రైలుని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారనిపించింది. అయినా నిర్ధారణ కోసం మరో పావు గంట గడిచేవరకూ ఉండి, మెల్లగా తలుపు కొద్దిగా తెరిచి చూశాను. భయపడాల్సిన శబ్దాలేవీ విన్పించలేదు. తలుపు పూర్తిగా తెరిచి కాలు బాత్రూంకి బైట పెట్టబోయి ఆగిపోయాను. అక్కడంతా చిక్కగా పారుతున్న రక్తం.. ఆ రక్తంలో తప్ప మరోచోట కాలు మోపడానికి పొడిగా ఉన్న స్థలం కన్పించకపోవడంతో దాన్లోనే కాళ్ళు పెట్టి నేనూ నా కుటుంబం బైటికొచ్చి బోగీలో కళ్ళెదురుగా కన్పిస్తున్న భీభత్స భయానక దృశ్యాన్ని చూశాం.

బోగీలో చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలు.. శరీరభాగాలు తెగిపోయి, కారుతున్న రక్తంలో తడిసిపోతూ విలపిస్తున్న మనుషులు.. ఒకతను నన్ను చూడగానే బలహీనమైన స్వరంతో “దాహం.. దాహం” అన్నా డు. అతని రెండు చేతులూ తెగిపోయి ఉన్నాయి.. పొట్ట మధ్యలోకి చీరిపోయి రక్తం కారుతోంది. కొన్ని నిమిషాల్లో చనిపోతాడనిపించింది.

మేము వెంట తెచ్చుకున్న నీళ్ళ సీసాని అతని నోటికందించి నీళ్ళు తాగించాను. అతనికి కొద్దిగా శక్తి వచ్చినట్టుంది. “మీరెలా తప్పించుకున్నారు?” అని అడిగాడు.

“టాయిలెట్లో దాక్కున్నాం” అని చెప్పాను.

“అదృష్టవంతులు. నాకైతే నిరాయుధులైన మామీద కత్తులూ, తుపాకులు ధరించిన సిక్కులు యుద్ధానికి వచ్చినట్టే అన్పించింది. దాదాపు పది వేల మంది సిక్కులూ, హిందువులు దాడి చేశారు. ఎస్కార్ట్ సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. పిడికెడు మంది పదివేల మందిని ఎలా ఎదుర్కోగలరు? అందరూ కొన్ని నిమిషాల్లోనే హతమైనారు. వెంటనే విచ్చుకత్తులో వాళ్ళు బోగీల్లోకి జొరబడి కన్పించిన వాళ్ళని కన్పించినట్టు నరికేశారు. నా వైపు ఓ సిక్కు కత్తి విసిరితే చేతులడ్డం పెట్టాను. నా చేతులు తెగిపడ్డాక కింద పడి బాధతో విలవిల్లాడుతున్న నన్ను జాలీ దయా లేకుండా పొట్టలో పొడిచాడు” అన్నాడు.

“మీ కుటుంబం?” అంటూ ఆగాను.

పక్కన పడి ఉన్న శవాన్ని చూపిస్తూ ‘అదుగో అదే నా భార్య… అటు పక్కన పడిఉన్న శరీరాలు పదేళ్ళ మా కొడుకూ, ఎనిమిదేళ్ళ కూతురివి” అంటూ పెద్దగా ఏడ్వసాగాడు. అతని కళ్ళలోంచి ధారగా కన్నీరు కారసాగింది.

“ఎవర్నీ ప్రాణాల్తో వదలకూడదన్న ఉద్దేశంతో కాళ్ళూ చేతులు తెగిపడి ఉన్న వాళ్ళని సమీపించి వాళ్ళ గుండెల్లో కత్తి దింపి చంపేశారు. నన్నూ చంపేసేవాళ్ళే. పది ట్రక్కుల్లో సైన్యం సమీపిస్తోందని సిక్కుల్లో ఒక తను అందర్నీ హెచ్చరించడంతో, గాయాలపాలైన వాళ్ళని పూర్తిగా చంపకుండా వదిలేసి పారిపోయారు” అన్నాడు.

మేము టాయిలెట్లో దాక్కుని ఉన్నప్పుడు విన్పించిన మనషులు బోగీ దిగి పారిపోతున్న శబ్దం ఏమిటో అతను చెప్పాక అర్థమైంది.

అతని చివరి ఘడియల్ని చూడలేక, వెళ్ళి నా భార్యా పిల్లల పక్కన కూచున్నాను. మదీహా భయంతో షాక్‌కి లోనయింది. కళ్ళు తిరుగుతున్నాయంటూ వాళ్ళమ్మ ఒడిలో పడుకుంది. ఖాలిద్ మొహం తెల్లగా పాలిపోయింది. వెంట్రుకవాసిలో చావుని తప్పించుకున్న దిగ్భమ అతన్లో స్పష్టంగా కన్పిస్తోంది.

నేను పూర్తిగా స్థిమితపడలేదు. మళ్ళా దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరమని మా వాళ్ళతో చెప్పాను. ముఖ్యంగా అమృతసర్‌ సమీపించే సమయంలో దాడులు జరగొచ్చు. అది దాటితే చాలు. క్షేమంగా లాహోర్ చేరుకున్నట్టే. అక్కడినుంచి వాఘా బార్డర్ ఇరవై యేడు కిలోమీటర్లు. వాఘా బార్డర్ నుంచి లాహోర్ లోని ముఘల్‌పురా రైల్వే స్టేషన్ పాతిక కిలోమీటర్లు.. అంతే..

“మరోసారి దాడి జరిగితే ఏం చేయాలి? మళ్ళా టాయిలెట్లో కెళ్ళి దాక్కుందామా?” అన్నాడు ఖాలిద్.

నేను కొన్ని క్షణాలు ఏం చేస్తే ప్రాణాలు కాపాడుకోగలం అని ఆలోచించాను. బోగీనిండా అడ్డదిడ్డంగా పడిఉన్న శవాల్ని, నెత్తురోడుతున్న క్షతగాత్రుల్ని చూశాను. నాకో ఉపాయం తట్టింది. “బోగీలో చంపాల్సిన మనుషులు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈసారి తప్పకుండా టాయిలెట్లలో కూడా వెతుకుతారు. మనం ఈ శవాల మధ్య శవాల్లా పడుకుండిపోదాం. చచ్చినట్టే నటించాలి. వాళ్ళు శవాల్ని తొక్కుకుంటూ పోయే ప్రమాదముంది. అప్పుడు ఎంత నొప్పనిపించినా భరించాలి తప్ప కిక్కురుమనకూడదు. ఎంత దుర్మార్గులైనా గాయపడిన వాళ్ళని సైతం చంపాలనుకుంటారేమోగాని చచ్చినవాళ్ళని చంపాలనుకోరుగా” అన్నాను.

“వెల్లకిలా పడుకోకుండా రెండు మూడు శవాల మధ్య బోర్లా పడుకోవాలి” అంది నా భార్య.

“శవాల్ని మన పైన వేసుకుని పడుకోవడం యింకా మంచిది” అన్నాను.

ఖాలిద్ మొహంలో జుగుప్సతో కూడుకున్న భయమేదో కన్పించింది. చీకటి పడింది. అంత భయంకరమైన రాత్రిని నేనెప్పుడూ చూళ్ళేదు. చుట్టూ చిక్కటి చీకటి.. రైలు బోగీలో శవాల గుట్టలు.. వాంతికొచ్చేలా రక్తపు వాసన.. గాయాలో విలపిస్తున్న వాళ్ళు.. తమ సమీప బంధువుల చావుని తల్చుకుని ఏడుస్తున్నవాళ్ళు.. నా పక్కన భయంతో బిగుసుకుపోయి కూచున్న నా భార్యా పిల్లలు..

నేనూహించినట్టే రైలు అమృతసర్ స్టేషన్‌కి మరో అరగంటలో చేరుకుంటుందనగా సిక్కుల గుంపు పెద్దగా అరుచుకుంటూ పరుగెత్తుతున్న రైలు బోగీల్లోకి ఎక్కే ప్రయత్నం చేసింది. నేనూ నా భార్య శవాల మధ్యన పడుకుండిపోయాం. మాకు కొద్ది దూరంలో ఖాలిద్, మదీహా పడుకున్నారు.

బోగీలోకి ఎక్కిన సిక్కులు మూల్గుతున్న వ్యక్తుల్ని చంపుకుంటూ మా పైనుంచే నడిచి వెళ్ళారు. నేనూ నా భార్య ఆ బాధని పళ్ళ బిగువున భరిస్తూ కదలకుండా నిశ్చలంగా ఉండిపోయాం. వాళ్ళు ఖాలిద్‌ని కూడా దాటేశారు. కానీ వాళ్ళ బూటు కాళ్ళు మదీహా అరచేతుల మీద పడ్డాయేమో తను బాధతో అరిచి, భయంతో కళ్ళు విప్పదీసి చూసింది.

“ఈ పిల్ల బతికే ఉంది” అని అరిచారెవరో.

ఇద్దరు సిక్కులు మదీహాని వెల్లకిలా తిప్పారు. దాని బట్టలకు అంటి ఉన్న రక్తం చూసి బాగా గాయపడిందనుకున్నారనుకుంటా. “తొందర్లోనే చచ్చిపోయేలా ఉంది. ఏం చేద్దాం?” అని అడిగా డొకడు.

“వయసులో ఉందిగా. మజా చేద్దాం” అన్నాడు మరొకడు.

అప్పటివరకూ శవంలా పడి ఉన్న ఖాలిద్‌కి వాళ్ళేం చేయబోతున్నారో అర్థమై, తలయెత్తి “నా చెల్లెల్ని ఏమీ చేయవద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. దాన్ని వదిలేయండి” అన్నాడు.

“వీడెవడో యింకా ప్రాణాల్తో ఉన్నాడు” అంటూ ఓ సిక్కు కత్తితో ఖాలిద్‌ని నరుకబోతున్నప్పుడు వాడు కుడిచేతిని అడ్డుగా పెట్టడంతో చేయి తెగిపడింది. వాడి హృదయవిదారకమైన కేక నాకు విన్పించికూడా కదలకుండా ఉండిపోయాను. కానీ నా భార్య అలా ఉండలేకపోయింది. వెంటనే లేచి ఖాలిద్‌‍ని ఒళ్ళోకి తీసుకుని, ‘నా కొడుకునీ, కూతుర్ని ఏమీ చేయకండి” అంటూ పెద్దగా ఏడ్వసాగింది.

“ఈ తల్లీ కొడుకులు చచ్చినట్టు ఎలా నాటకమాడారో చూశారా?” అన్నాడొక సిక్కు ఎగతాళిగా నవ్వుతూ.

“నాటకాన్ని నిజం చేస్తే సరిపోతుందిగా” అంటూ మరొక సిక్కు ఖాలిద్ పొట్టలో కత్తితో పొడవబోతున్నప్పుడు నా భార్య వాడిపైన అడ్డంగా పడిపోయింది. కత్తి ఆమె గుండెల్లో దిగింది. అదే కత్తిని బైటికి లాగి ఖాలిద్ పొట్టలో కూడా పొడిచాడా దుర్మార్గుడు. ఖాలిద్‌కి స్పృహ తప్పింది.

వాళ్ళు వంతుల వారీగా మదీహాను బలాత్కరిస్తున్నప్పుడు దాని అరుపులు, ఏడ్పులు వింటూ కూడా రాయిలా ఉండిపోయాను. ఎంత కర్కోటక తండ్రినో కదా. ఇప్పటికీ బాధపడ్డాను. నా భార్యలా, నా కొడుకులా ప్రాణాలకు తెగించి, నా కూతుర్ని కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయానూ అని. నా రక్తంలో కల్సిపోయిన పిరికితనాన్ని అసహ్యించుకుంటూనే జీవచ్ఛవంలా బతుకుతున్నాను.

మదీహా పిచ్చిదై పోయింది. ఎప్పుడు చూసినా శూన్యంలోకి భయం భయంగా చూస్తో ఉంటుంది. అకస్మాత్తుగా ఎవరో మీద పడినట్టు ‘ముఝె ఛోడో” అంటూ అరుస్తో ఉంటుంది.

లాహోర్ చేరాక ఖాలిద్‌ని ఆస్పత్రిలో చేర్చాను. అప్పటికే చాలా రక్తం పోవడంతో బతకడం కష్టం అన్నారు. పొట్ట పైన పది కుట్లు పడ్డాయి. కుడి చేతికి ఆపరేషన్ చేశారు. వారం రోజులు మృత్యువుతో పోరాడాక వాడు ప్రాణాలతో బైటపడ్డాడు. కుడిచేయి లేకున్నా నా కొడుకు బతికినందుకు చాలా సంతోషపడ్డాను. నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కూతురిమీద అత్యాచారం జరుగుతున్నా, భార్యనీ కొడుకునీ కత్తులో నరుకుతున్నా కిక్కురుమనకుండా శవంలా పడి ఉన్నానని చెప్పానే.. ఆ క్షణం నుంచి ఇప్పటివరకు నిజంగానే శవంలా బతుకుతున్నాను. నడుస్తున్న శవం.. శ్వాస తీసుకుంటున్న శవం.. అంతే.. నాలోపల జీవం లేదు. జీవితం మీద అనురక్తి లేదు. అన్నీ చచ్చిపోయాయి.

నా కొడుకు మాత్రం నా పిరికి చర్యని ఇప్పటికీ సమర్థిస్తో ఉంటాడు. “నువ్వు కూడా అమ్మలా నోరు విప్పి వాళ్ళ కత్తులకు బలై ఉంటే, ఒకవేళ నేను కూడా చచ్చిపోయి ఉంటే, పిచ్చిదైన మదీహాని ఎవరు చూసుకునేవారు మనిద్దరం బతికుండబట్టేగా చెల్లెల్ని పసిపిల్లలా చూసుకుంటున్నాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వాడు పౌరుషమున్న మగాడు. చెల్లెలి గౌరవాన్ని కాపాడటం కోసం పోరాడి బతికాడు. మరి నేనో..

మేము లాహోర్ చేరుకున్నాక ఎప్పుడూ సంతోషంగా లేము. నా భార్య చావుతోనే మా సంతోషాలు ఎగిరిపోయాయి. మదీహాపైన సామూహిక అత్యాచారం జరగడంతోనే మా జీవితాలు విషాదంలో కూరుకుపోయాయి. దేశ విభజన నా కొడుకుని అవిటివాణ్ణి చేసింది. నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసింది. నా భార్య ప్రాణాల్ని హరించింది. ఇప్పుడేం మిగిలిందని బతికుండాలి? నాకూ చచ్చిపోవాలని ఎన్నిసార్లు అనిపించిందో… ఖాలిద్ చెప్పింది నిజమే. నేను చచ్చిపోతే మదీహాను ఎవరు చూసుకుంటారు? అందుకే బతికున్నా… జీవచ్ఛవంలా బతికున్నా” అంటూ ఉస్మాన్‌ఖాన్ చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు. అతన్ని ఓదార్చడాం షరీఫ్ వల్ల కాలేదు.

(ఇంకా ఉంది)

Exit mobile version