రెండు ఆకాశాల మధ్య-48

1
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“నే[/dropcap]ను పూర్తి స్పృహలో ఉండే హిందూ దేవుళ్ళ మందిరంలోకి వెళ్ళాలనుకుంటున్నాను బాబూ. నీకు చాలా విషయాలు తెలియవు. వాటిని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. నేను గుళ్ళోకి వెళ్ళొచ్చాక సావకాశంగా చెప్తాను.”

“ఏంటమ్మా ఆ విషయాలు? ఏంటో ఇప్పుడే చెప్పు.”

“లోపలికెళ్ళిచ్చాకే చెప్తానన్నాగా. నువ్వూ రాకూడదూ నాకు తోడుగా.”

“నేను రానమ్మా. నువ్వెళ్ళడం కూడా నాకిష్టం లేదు. నీ మాటకు ఎదురుచెప్పలేక గమ్మునుండిపోతున్నా.”

“అదే బుద్ధిమంతుల లక్షణం” అంటూ నవ్వింది గోరీబీ. “ఇక్కడే ఎక్కడైనా కూచో. తొందరగా వచ్చేస్తాను” అంటూ మందిరం ముఖద్వారం వైపుకు కదిలింది.

చెప్పులు బైట వదిలి, లోపలికి అడుగు పెడ్తున్న క్షణంలో ఉద్వేగంతో గుండె వేగంగా కొట్టుకుంది. పంపు దగ్గరకెళ్ళి కాళ్ళు కడుక్కుని దేవుళ్ళ విగ్రహాలున్న గదిలోకి వెళ్ళబోతూ తలుపు మీద అతికించి ఉన్న చెక్క పలక మీద ‘ఓం’ అని రాసి ఉన్న అక్షరాల్ని చూసింది. దానికింద ఉర్దూలో “ఇన్సాఫ్ కా మందిర్ హై. యే భగవాన్ కా ఘర్ హై” అని రాసి ఉంది.

లోపల గోడల మీద విద్యుద్దీపాలతో అలంకరించిన వనవాసంలో ఉన్న రాముడు సీతాదేవి చిత్రపటం, లక్ష్మీదేవి చిత్రపటం, దుర్గాదేవి చిత్రపటం ఉన్నాయి. ఓ చెక్క పలక మీద వాల్మీకి విగ్రహం, దానికిరు వైపులా కృష్ణుని విగ్రహం, హనుమంతుని విగ్రహం ఉన్నాయి. విగ్రహాలన్నీ పూలదండలో అలంకరించబడి ఉన్నాయి. ఓ పూజారి వాటికి పూజ చేస్తున్నాడు. మరోవైపు గోడమీద ‘ఓం నమశ్శివాయ’ అని రాసి ఉంది. దాని పక్కనే వినాయక విగ్రహం కూడా ఉంది.

తన దేవుళ్ళ చిత్రపటాలూ, విగ్రహాలూ చూడగానే గోరీబీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన పేరు షామ్లీ కాబట్టి చిన్నప్పటినుంచి ఆమెకు కృష్ణుడంటే ఇష్టం. లక్ష్మీదేవి అంటే మరీ ఇష్టం. ఏనుగు తలతో, ఏకదంతంతో, చిరుబొజ్జతో అలరారుతూ సకల విఘ్నాలను తొలగించే వినాయకుడంటే మరీ మరీ ఇష్టం.

మొదట సీతారాముల చిత్రపటం ముందు నిలబడి, చేతులు జోడించింది. శరీరంలోకి ఏదో విద్యుత్తు ప్రవహించినట్టు.. అలౌకిక శక్తేదో నరాల్లోకి పాకుతున్నట్టు.. ఎంత గొప్ప అనుభూతి.. ఇంతటి అద్భుతమైన అనుభూతికి ఎన్నేళ్ళుగా దూరమైందో…

తర్వాత దుర్గాదేవికి మొక్కింది. అట్నుంచి వినాయకుడి విగ్రహం ముందుకెళ్ళి ముకుళిత హస్తాల్తో నిలబడి ‘నా తల్లిదండ్రుల్ని ఒక్కసారి కల్సుకునేలా చేయి తండ్రీ.. చాలు. యింక నిన్నేమీ కోరను’ అని మొక్కుకుంది.

వెండి పళ్ళెంలో పెట్టి ఉన్న పూజా ద్రవ్యాల్లో కుంకుమ చూడగానే ఆమెకు ప్రాణం లేచొచ్చింది. బొట్టు పెట్టుకోవడమంటే తనకెంతిష్టమో.. ఉంగరం వేలితో కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుంది. పూజ ముగిశాక పూజారి చేతిలో ఉన్న హారతి పళ్ళెంలో రెండు రూపాయి నాణేలు వేసి హారతిని కళ్ళకద్దుకుంది. ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని కొద్దికొద్దిగా తింటూ అంతులేని సంతృప్తికి లోనయింది.

ఆమె గుళ్లోంచి బైటికొచ్చే సమయానికి ఆమె మొహం అఖండ తేజస్సుతో వెలిగిపోతోంది. నుదుట పెట్టుకున్న కుంకుమ బొట్టు అరుణోదయ భానుబింబంలా భాసిస్తోంది. ఎన్నాళ్ళుగానో ఆమెను దహిస్తున్న కోరికను తీర్చుకున్న సంతృప్తి వల్ల ఆమె కళ్ళలో ఎన్ని చంద్రోదయాలో.. చల్లటి వెన్నెలని కురిపిస్తూ.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె గుళ్ళోంచి నడిచొస్తున్న దేవతా స్త్రీలా ఉంది.

గుడి ముఖద్వారానికి కొద్ది దూరంలో నిలబడి అమ్మకోసం ఎదురుచూస్తున్న మజీద్‍ఖాన్ గుళ్ళోంచి బైటికొస్తున్న అమ్మను చూడగానే నెత్తిమీద పిడుగు పడ్డట్టు వణికిపోయాడు. అమ్మ నుదుట ఎర్రగా మెరుస్తున్న కుంకుమ బొట్టు అగ్నిగోళంలా మారి, ఆ జ్వాలల్లో అమ్మతో పాటు తామందరూ దహించుకుపోతున్నట్టు. …వొళ్ళంతా మంటలు…

“అమ్మా.. ఈ బొట్టేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? మన బిరాదరీలో ఎవరికైనా తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? మన కుటుంబాన్ని వెలి వేస్తారమ్మా” అన్నాడు కోపంగా,

గోరీబీ చల్లగా నవ్వింది. “ఉద్రేకపడకు. నీకు కొన్ని నిజాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాగా. ఎక్కడైనా కూచుని మాట్లాడుకుందాం. అంతా విన్నాకకూడా నేను చేసింది తప్పని నీకనిపిస్తే యింకెప్పుడూ ఇలాంటి పని చేయను” అంది.

మజీద్‌ఖాన్ మొహం జేవురించింది. అతనికి బాగా కోపమొచ్చింది. ఐనా తను అమితంగా ప్రేమించే, గౌరవించే అమ్మనేమీ అనలేక, ఎదురుగా కన్పిస్తున్న ఓ రాతి చప్టా మీద కూచుంటూ ‘ఏదో చెప్పాలన్నా వుగా.. చెప్పు” అన్నాడు.

గోరీబీ అతని పక్కన కూచుంది. “నేను చెప్పబోయే విషయాల్ని ప్రశాంతంగా విను. విన్నాక ఆవేశపడొద్దు. చిన్నప్పటినుంచే నీది ఉద్రేక స్వభావం. దానికి తోడు మీ నాన్నంటే నీకు పడదు. అందుకే చాలా సార్లు మనసు విప్పి నీకు కొన్ని నిజాలు చెప్పాలనిపించినా నిగ్రహించుకున్నాను. నేనంటే నీకెంతిష్టమో నాకు తెల్సు. అందుకే అన్నీ తెలిశాక నువ్వు మీ నాన్నను ఏమైనా చేస్తావేమోనన్న భయం.. నేను చెప్పబోయే విషయాలు విన్నాక మీ నాన్నకు ఏ రకమైన హానీ కలిగించనని మొదట మాటివ్వు” అంది.

మజీద్‌ఖాన్ భృకుటి ముడిపడింది. “నాన్న ఏం చేశాడమ్మా? ఐనా నాన్న చేసిన దుర్మార్గాలకు అతన్ని శిక్షించాలి గానీ నువ్విలా కాఫిర్‌లా మారి మన అల్లాని ధిక్కరించి హిందూ దేవుళ్ళకు మొక్కడం ఘోరమైన పాపమని నీకు తెలియదా? బొట్టు పెట్టుకోవడం గునాహ్ అని తెలియదా?” అసహనంగా అన్నాడు.

“మొదట నాకు మాటివ్వు. నాన్ననేమీ అననని. నేను చెప్పబోయే విషయాలు నీకూ నాకూ మధ్యనే ఉండాలి. తమ్ముడికీ, చెల్లికే కాదు, ఎవ్వరికీ తెలియకూడదు.”

“విసిగించకుండా మొదట నువ్వు చెప్పాలనుకున్న విషయమేంటో చెప్పు. అది వేరేవాళ్ళకి చెప్పాలో లేదో నేను నిర్ణయించుకుంటాను” కోపంగా అన్నాడు.

అతని కోపాన్ని చూసి గోరీబీ మెల్లగా నవ్వుకుంది. దేవుడూ మతమూ.. రెండూ చాలా బలమైన విశ్వాసాలు.. రాతిలో చెక్కిన అక్షరాల్లా హృదయంలో స్థిరపడిపోతాయి. వాటి నుంచి మనిషి పక్కకు తప్పుకోలేడు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పుకుంటున్నారని తెల్సినా సహించలేడు. వూహ తెల్సినప్పటినుంచి మజీద్‌ఖాన్ ఇస్లాంనే అనుసరించాడు. ఖురాన్ని భక్తిగా చదివాడు. శ్రద్ధగా నమాజ్ చేశాడు. త్రికరణశుద్ధిగా అల్లానే పూజించాడు. ఇప్పుడు అమ్మ హఠాత్తుగా హిందూ దేవాలయంలోకి ప్రవేశిస్తే కోపం రాకుండా ఎలా ఉంటుంది? బొట్టు పెట్టుకుంటే రక్తం మరిగిపోక ఎలా ఉంటుంది?

తనని అస్లంఖాన్ ఎత్తుకొచ్చిన కొత్తలో తను బొట్టు పెట్టుకుంటే చూసి, జహరా కొట్టినపుడు తనకూ రక్తం అలానేగా మరిగింది. నమాజ్ చదవమని బలవంత పెట్టినపుడు తనకూ అలానేగా కోపం వచ్చింది…

“మజీద్ బేటా.. నా పేరు గోరీబీ అనే కదా నీకు తెలుసు. నా అసలు పేరు అది కాదు. నా పేరు షామ్లీ. మాది సరిహద్దు రేఖకు దగ్గరగా ఉన్న జోరాఫాం అనే చిన్న పల్లెటూరు. మా నాన్న పేరు శంకర్ లాల్. మేము హిందువులం.”

వెయ్యి వోల్టుల ఎలక్ట్రిక్ షాకేదో తగిలినట్టు మజీద్‌ఖాన్ మ్రాన్పడిపోయాడు. “అమ్మీ.. ఏంటి నువ్వు చెప్తోంది?” అని పెద్దగా అరిచాడు.

“నిజం” అంది గోరీబీ.

“దేశ విభజనకు దాదాపు ఓ యేడాది ముందు నేనూ తమ్ముడూ మా నాన్న తాతయ్య లాహోర్‌లో ఉన్న పెద్ద తాతయ్యను చూడటానికొచ్చాం. నాకప్పుడు పదమూడేళ్ళు. మేం వచ్చిన కొన్ని రోజులకే మతకలహాలు మొదలయ్యాయి. ముసల్మానులు మా పెద్ద తాతయ్య యింటి మీద దాడి చేసి అందర్నీ చంపేశారు. నేనూ నాన్న తమ్ముడూ ఎట్లాగో తప్పించుకుని రైల్వే స్టేషన్ వైపుకు పరుగెత్తాం. హిందువుల గుంపొకటి ప్రాణాలరచేత పట్టుకుని మాతోపాటు పరుగెత్తింది. మా వెనక విచ్చు కత్తులో పఠాన్లు.. ఆ సమయంలో ఎవరిదో కాలు తట్టుకుని కిందపడిపోయాను. అప్పుడు.. అప్పుడు..”

గోరీబీ తలొంచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

“అప్పుడేమైందమ్మీ?” పదమూడేళ్ళ లేత వయసులో తన అమ్మకేమైందోనన్న ఆందోళన అతని గొంతులో… దేశ విభజన సమయంలో జరిగిన ఘోరాల గురించి, ఇటు ముసల్మానులు, అటు సిక్కులూ చేసిన దురాగతాల గురించి అతనికి అవగాహన ఉంది.

“అప్పుడు మీ నాన్న నన్ను బలవంతంగా యింటికి ఎత్తుకొచ్చాడు. నా పేరు గోరీబీగా మార్చి నిఖా చేసుకున్నాడు. నన్ను నా దేశం నుంచి, మా అమ్మానాన్నల్నుంచి, నా దేవుళ్ళనుంచి, నా మతం నుంచి విడదీశాడు. దాదాపు నలభై యేళ్ళ తర్వాత మళ్ళా నేను మా ఆలయంలోకి ప్రవేశించాను. నువ్వు నన్నూ నా బాధనూ అర్థం చేసుకుంటావన్న నమ్మకంతోనే నిన్ను పిల్చుకొచ్చాను నాన్నా. ఇప్పుడు చెప్పు.. నేను గుళ్ళోకెళ్ళి తప్పుచేశానా? బొట్టు పెట్టుకుని తప్పు చేశానా?” అంది.

జవాబు చెప్పడానికి ముందు కొన్ని క్షణాల వరకు మజీద్ తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యాడు. ఓ వైపు ఇన్నాళ్ళూ నమ్ముతూ వచ్చిన నిజం.. మరో వైపు అమ్మ కొన్ని నిమిషాలముందు వెల్లడించిన నిజం..

కొంత విరామం తర్వాత గొంతు పెగల్చి అన్నాడు. “నాకేమీ తప్పనిపించడం లేదమ్మా. ఎవరి మతం వారికి గొప్పది. నా ఉద్దేశంలో వూహ తెల్సినప్పటినుంచీ అమ్మానాన్నని పిల్లలు ఎలా తమ స్వంతం చేసుకుంటారో అలానే దేవుళ్ళనీ, మతాన్ని కూడా స్వంతం చేసుకుంటారు. నువ్వు నీ తల్లిదండ్రులతో పాటు నీ మతానికి కూడా దూరమై ఎంత బాధపడి ఉంటావో నేనర్థం చేసుకోగలను” అన్నాడు.

“చాలా సంతోషం నాన్నా.. నాకు నీ మీదున్న నమ్మకాన్ని వమ్ము చేయనందుకు” అంది గోరీబీ.

“ఇప్పటికీ నీకు అమ్మమ్మా తాతయ్యలను చూడాలనే ఉందా?”

“ఎందుకుండదూ.. నాకు మిగిలిన ఒకే ఒక కోరిక అదే బాబూ. ఒక్కసారైనా మా అమ్మానాన్నల్ని చూడాలని.”

“నీ కోరిక తీర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానమ్మీ. నలభై యేళ్ళ క్రితం నాన్న చేసిన దుర్మార్గాన్ని తల్చుకుంటేనే నా రక్తం మరుగుతోంది మమ్మీ. నీకు మాటిచ్చానుగా.. ఆయన్నేమీ అనను. కనీసం నీ అమ్మానాన్నల్తో నిన్ను కలిపి, కొంతైనా నీ మనసుకు వూరట లభించేలా చేస్తాను. కసమ్ సే అమ్మీ” అన్నాడు ఉద్వేగంగా.

“అంటే నన్ను జోరాఫాంకు పిల్చుకెళ్తావా?” సంతోషంతో ఉక్కిరిబిక్కిరౌతూ అంది.

“అది సాధ్యం కాకపోవచ్చేమో అమ్మీ. పాస్‌పోర్ట్, వీసాలు దొరకడం కష్టం. ఇంకో సమస్య కూడా ఉంది. నీ గతం గురించి నాన్నకూ, ఇప్పుడు నాకూ తప్ప మన కుటుంబంలో మరెవ్వరికీ తెలియదు. మా చిన్నప్పటినుంచీ తాతయ్యా అమ్మమ్మల గురించి అడిగినపుడల్లా లేరనే చెప్పేదానివి. మనం జోరాఫాం ఎవర్ని కలవడానికి వెళ్తున్నామని చెప్తాం? నువ్వు హిందువ్వి అని మన బంధువులకు తెలిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించావా? నీ మనవరాళ్ళకు పెళ్ళిళ్ళవుతాయా? నీ మనవళ్ళకు సంబంధాలొస్తాయా?”

గోరీబీకి తన కొడుకు చెప్తున్నదానిలో నిజముందనిపించింది. “మరి ఎలా కలుపుతావు?” నిరాశగా అడిగింది.

“నీకు తాతయ్య యింటి అడ్రస్ గుర్తుందా?”

“అదెలా మర్చిపోతాను?”

“సరే. మిగతా విషయాలు నాకొదిలెయ్. నిన్ను మీ అమ్మానాన్నలో తప్పకుండా కలుపుతాను. సమయం పట్టొచ్చు. కొద్దిగా ఓపిక పట్టు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. యింట్లో వాళ్ళు కంగారు పడ్తుంటారు. వాళ్ళకనుమానం రాకుండా అనార్కలీ బజార్లో చెప్పులో, బట్టలో కొనుక్కుని యింటికెళ్దాం” లేచి నిలబడ్డూ అన్నాడు మజీద్‌ఖాన్.

“ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది బాబూ.. ఈ రాత్రి తృప్తిగా నిద్రపోతాను. పద వెళ్దాం” అంటూ గోరీబీ కూడా లేచి నిలబడింది.

మజీద్ అమ్మ వైపు నవ్వుతూ చూసి “ఇలానే వెళ్దామా?” అన్నాడు. ఆమెకు తన కొడుకలా ఎందుకడిగాడో అర్థం కాక అతనివైపు ‘ఇంకెలా వెళ్తాం?’ అనేలా చూసింది.

“ఆ బొట్టు తుడిచేయి అమ్మీ” అన్నాడు మజీద్.

“ఓ.. మర్చే పోయాను” అంటూ గోరీబీ తన నుదుట ఉన్న కుంకుమను పైటచెంగుతో తుడిచేసింది.

***

తను బతికే ఉన్నాననీ, తొందర్లోనే కల్సుకుంటాననీ నాన్నకు ఉత్తరం రాయాలన్న ఆరాటం గోరీబీలో.. ఆ ఉత్తరం చదవగానే నాన్నా అమ్మా తమ్ముడూ ఎంత సంతోషపడ్డారో తల్చుకోగానే ఆమె కాళ్ళు భూమి మీద ఆనడం లేదు. వాల్మీకి మందిరానికి వెళ్ళిచ్చిన మరునాడే మజీద్‌కి చెప్పి కార్డు ముక్క తెప్పించుకుని యింటికి ఉత్తరం రాయాలనుకుంది. మజీదే వారించాడు. తను చేయబోయే ప్రయత్నాలు ఫలించేవరకు ఆగడం మంచిదని సలహా ఇచ్చాడు. ఆమెక్కూడా అదే మంచిదనిపించింది. లేకపోతే తన తల్లిదండ్రుల్ని కల్సుకోవడం కోసం తను అసహనంతో రోజులు లెక్కపెట్టుకున్నట్లే వాళ్ళు కూడా వత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

ఓ వారం రోజుల వరకు మజీద్‌ని కదిలించలేదు. ఆ మరుసటి రోజు నుంచి అతన్ని సతాయించసాగింది. అతను ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం మొదట కళ్ళతోనే ‘నీ ప్రయత్నాలు ఫలించాయా?’ అని అడుగుతుంది. తర్వాత ఒంటరిగా ఉన్న సమయం చూసి “యింకా ఎంత కాలం పడ్తుంది? అసలు సాధ్యపడ్తుందా లేదా? నీ ఆఫీస్ పనుల్లో పడి ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదా?” లాంటి సవాలక్ష ప్రశ్నల్తో విసిగిస్తుంది.

మజీద్ నవ్వుతూనే “మర్చిపోలేదమ్మా. ప్రయత్నిస్తున్నా. సమయం పడ్తుంది” అని సమాధానమిస్తాడు.

అతను పాకిస్తాన్ ప్రభుత్వానికీ, ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమీషనర్‍కి తన విన్నపాన్ని రాత పూర్వకంగా తెలియచేసుకున్నాడు. సచివాలయంలో పని చేస్తూ ఉండటంతో కొంతమంది మంత్రులూ, యంపీల చేత కూడా సిఫారస్ చేయించాడు. బ్యూరోక్రసీలో సాధారణంగా ఎదురయ్యే అడ్డంకులూ, అభ్యంతరాలూ దాటుకుంటూ ఫైళ్ళు కదిలి, ఇరు ప్రభుత్వాల ఆమోదముద్ర పడటానికి ఆర్నెల్ల సమయం పట్టింది. వాఘా బార్డర్‌లో ములాఖత్ తేదీనీ, సమయాన్ని నిర్ణయించి ఇరువర్గాల వారికి తెలియపర్చడమే మిగిలుంది.

ఆ కబురు విన్న గోరీబీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్నెల్లు ఎంత హింస పడిందో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో.. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉన్న తనను చూసి కోడళ్ళు అడిగారు కూడా ‘ఏమైంది సాసూమా.. ఎందుకలా ఉంటున్నారు? ఆరోగ్యం బాగోలేదా?” అని. ఆరోగ్యానికేం బాగానే ఉంది. మనసే జోరాఫాంలో తను పుట్టి పెరిగిన యింట్లో తన వాళ్ళమధ్య తచ్చాడుతో ఉంది. తన తల్లిదండ్రుల్ని కల్సుకునే అదృష్టం తనకుందా? కల్సుకునే ఆ అద్భుతమైన క్షణాల్ని ఎన్నిసార్లు కలగందో.. తనేం మాట్లాడుతుంది? తన్నుకొచ్చే ఏడుపులో అసలు మాటలు బైటికి వస్తాయా? అమ్మానాన్న తనను గుర్తుపడ్డారా? ఎలా గుర్తుపడ్డారు? ఈ నలభై యేళ్ళలో తనలో ఎన్ని మార్పులొచ్చాయో …. ఇవే ఆలోచనలు అనవరతం ఆమెను అల్లుకుంటూ..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here