Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-49

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]మ[/dropcap]జీద్‌ని కార్డు తెచ్చివ్వమంటే ఇన్లాండ్ లెటర్ తెచ్చిచ్చాడు. కార్డులో ఏం రాశామో వేరేవాళ్ళకు కన్పిస్తుందని భయమట. తను పుట్టుకతో హిందూ అని చుట్టపక్కల ఎవ్వరికీ తెలియకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో గుర్తొచ్చి గోరీబీ నవ్వుకుంది. ఉత్తరం రాయడానికి కూచుంది. “నాన్నా.. నేను షామ్లీని. నేను బతికే ఉన్నాను నాన్నా. మిమ్మల్ని తొందర్లోనే కల్సుకుంటాను. మనల్ని కలపడం కోసం నీ మనవడు మజీద్‌ఖాన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏ రోజున కల్సుకోవాలో తెలియబరుస్తూ మీకు ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. చాలా రాయాలని ఉంది నాన్నా.. ఏడుపొస్తోంది. అందుకే ఇంకేమీ రాయలేను. ఇట్లు.. నలభై యేళ్ళ క్రితం తప్పిపోయిన మీ కూతురు.. షామ్లీ”

ఉత్తరాన్ని మరోసారి చదువుకుంది. ‘నీ మనవడు మజీద్ ఖాన్’ అని రాసిన వాక్యం దగ్గర ఆగిపోయింది. ఆ పేరు చదవగానే నాన్న ఏమనుకుంటాడు? తన కూతురు షామ్లీకి పుట్టిన కొడుకు పేరు మజీద్‍ఖాన్ అని తెలియగానే ఎంత బాధపడ్డాడో.. ఎలాగూ కల్సినపుడు తెలుస్తుందిగా. ఇప్పటినుంచే నాన్నను బాధ పెట్టడం దేనికి? అనుకుని మజీద్‌ఖాన్ పేరు కన్పించకుండా కొట్టేసింది.

ఇన్లాండ్ ఉత్తరం వచ్చిందని దర్శన్‌లాల్ చెప్పగానే “ఎక్కడినుంచిరా?” అని అడిగాడు శంకర్‌లాల్. అతనికిప్పుడు డెబ్బయ్ రెండేళ్ళు. చూపు బాగా మందిగించింది. మోకాళ్ళ నొప్పులు.. ఎక్కువ దూరం నడవలేడు.

దర్శన్‌లాల్ ఉత్తరాన్ని వెనక్కి తిప్పి చూశాడు. ఎవరినుంచో ఎక్కడినుంచో రాసి లేదు. స్టాంప్ మీదున్న అక్షరాలు అలికినట్టుండటంతో చదవలేకపోయాడు. “ఏమో తెలియడం లేదు నాన్నా” అంటూనే అంటించిన చోట జాగ్రత్తగా చింపి, ఉత్తరాన్ని తెరిచి “లాహోర్ నుంచి నాన్నా” అన్నాడు.

“లాహోర్ నుంచా..” శంకర్ ఉద్విగ్నతకు లోనవుతూ “ఎవరు రాశారో చూడు” అన్నాడు.

ఉత్తరం చివర్లో ఉన్న పేరు చూడగానే దర్శన్‌లాల్ సంతోషంతో పెద్దగా కేక పెట్టాడు. “అక్క నాన్నా.. షామ్లీ అక్క అక్క బతికే ఉంది నాన్నా” అన్నాడు.

శంకర్‌లాల్ వెంటనే లేచొచ్చి కొడుకు చేతిలోని ఉత్తరాన్ని తీసుకుని అక్షరాల్ని తడుముతూ “నా బంగారు తల్లి బతికే ఉందా? ఆ విషయం తెలియబర్చడానికి తనకు ఇన్నేళ్ళు పట్టిందా? ఏదీ చదువు ఏం రాసిందో” అన్నాడు.

దర్శన్‌లాల్ ఉత్తరం చదవడం పూర్తి కాగానే నాన్నను పట్టుకుని ఏడ్చేశాడు. ఉత్తరం షామ్లీ దగ్గరనుంచి అని విన్న క్షణం నుంచే శంకర్ కళ్ళలోంచి నీరు ధారాపాతంగా కారిపోతూనే ఉంది.

“మీ అమ్మ బతికుంటే చాలా సంతోషించేది కదరా. దాన్ని తల్చుకుని ఏడ్చి ఏడ్చి ఆ దిగుల్తోనేగా మంచానపడి పోయింది. చనిపోయే ముందుకూడా ‘నేను పైకి వెళ్ళగానే నా కూతుర్ని ఏం చేశావని ఆ దేవుడ్ని నిలదీసి అడుగుతాను’ అనేది కదరా” అన్నాడు శంకర్‌లాల్.

“అన్నకూ చెల్లాయికి ఉత్తరం రాసి ఈ తీపి కబురు అందిస్తాను నాన్నా. వాళ్ళని కూడా పిల్చుకుని వెళ్లాం. షామ్లీ అక్కను చూసి వాళ్ళు కూడా సంతోషపడ్డారు” అన్నాడు దర్శన్‌లాల్.

దర్శన్ ఒక్కడే వ్యవసాయం చేసుకుంటూ నాన్నకు తోడుగా జోరాఫాంలో ఉండిపోయాడు. పెళ్ళిళ్ళయ్యాక అతని అన్న, చెల్లెలు వేరే వూళ్ళకెళ్ళి స్థిరపడ్డారు. దర్శన్‍లాల్‌కి నలుగురు పిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అందరూ పల్లెటూర్లో ఉండటం ఇష్టం లేక పట్నానికి వలస వెళ్ళారు. ప్రస్తుతం యింట్లో శంకర్‌లా‌ల్‌తో పాటు దర్శన్‌లాల్, అతని భార్య ఉంటారు.

ఆ రోజు వాళ్ళింట్లో పండుగ వాతావరణం నెలకొంది.

షామ్లీని కల్సుకోడానికి ఎవరెవరు వెళ్ళాలనే దాని మీద కొన్ని రోజుల వరకు చర్చ జరిగింది. మొదట పిల్లాజెల్లా అందర్నీ వేసుకుని కుటుంబాల్తో సహా వెళ్ళాలనుకున్నారు. వాఘా బార్డర్ ఇక్కడుందా సపరివారంగా ఓసారి వెళ్ళి వచ్చేద్దాం అనుకోడానికి? ఆర్.ఎస్.పురా వెళ్ళి అక్కడినుంచి అమృతసర్ వెళ్ళి అక్కడినుంచి వాఘా బార్డర్‌కి వెళ్ళాలి. ఖర్చుతో కూడుకున్న ప్రయాణం.. అందుకే శంకర్‌లాల్‌తో పాటు, అతని ఇద్దరు కొడుకులూ చిన్న కూతురు ప్రయాణానికి సిద్ధమైనారు.

ఎక్కువ రోజులు ఎదురుచూడకుండానే ఫలానా తేదీన రావల్సిందిగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారుల నుంచి ఉత్తరం వచ్చింది.

***

వాఘా బార్డర్ దగ్గర ఇండియాని పాకిస్తాన్ని విభజిస్తూ గీసిన తెల్లటి గీత ‘జీరో లైన్’కి కొద్ది దూరంలో నిలబడి ఉంది గోరీబీ. ఆమెకు కుడివైపున మజీద్‌ఖాన్ నిలబడి ఉన్నాడు. హిందూస్తాన్‌లో ఉన్న తమ బంధువులను కల్సుకోడానికొచ్చిన మరి కొంతమంది పాకిస్తానీయులు కూడా వాళ్ళతోపాటు నిలబడి ఉన్నారు. మరికొద్ది సేపట్లో తమకిష్టమైన వాళ్ళని చూడబోతున్నామన్న సంతోషం అందరి కళ్ళలో నక్షత్రాల్లా మెరుస్తో కన్పిస్తోంది.

జీరోలైన్‌కి అటువైపు కూడా ఓ గుంపు నిలబడి ఉంది. ఇటువైపున్న మనుషుల్లో తమ వాళ్ళు ఎక్కడున్నారో అని ఆత్రంగా వాళ్ళ కళ్ళు వెతుక్కుంటున్నాయి.

“అమ్మీ.. తాతయ్యా, అమ్మమ్మా కన్పిస్తున్నారా?” అని అడిగాడు మజీద్.

గోరీబీ కళ్ళు చిట్లించి బార్డర్‌కి అటువైపు నిలబడి ఉన్న గుంపు వైపు చూసింది. కొంతమంది ముసలి వాళ్ళు కన్పించారుగానీ అందులో తన అమ్మానాన్న పోలికలో ఎవ్వరూ కన్పించలేదు.

“ఏమోరా.. అర్థం కావడం లేదు. బాగా ముసలివాళ్ళయిపోయి ఉంటారుగా. గుర్తుపట్టలేకపోతున్నాననుకుంటా” అందామె.

“పోనీ దర్శన్‌లాల్ మామయ్య కన్పిస్తాడేమో చూడు. అతన్ని సులభంగానే గుర్తుపడ్డావనుకుంటా” అన్నాడు.

గోరీబీ నవ్వింది. “నేను విడిపోయినప్పుడు వాడు తొమ్మిదేళ్ళ పిల్లవాడు. ఇప్పుడు నలభై తొమ్మిదేళ్ళ వయసులో చిన్నప్పటి పోలికలేమైనా ఉంటాయని అనుకోను” అంది.

హిందూస్తాన్ బార్డర్లో నిలబడి ఉన్న శంకర్‌లాల్‌కి దర్శన్‌లాల్‌కి మధ్య కూడా అచ్చం ఇలాంటి సంభాషణే జరుగుతోంది. “వాళ్ళలో షామ్లీ అక్క ఎవరో తెలియడం లేదు నాన్నా” అంటున్నాడు దర్శ లాల్.

మైక్‌లో గోరీబీ పేరు వినొచ్చింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారితో పాటు ఓ పాకిస్తానీ రేంజర్ ముందుకొచ్చి గోరీబీని, మజీద్‍ఖాన్‌ని వెంట తీసుకెళ్ళి జీరోలైన్ దగ్గర నిలబెట్టారు.

ఇప్పుడు వాళ్ళిద్దరూ హిందూస్తాన్ వైపు నిలబడి ఉన్న గుంపుకి స్పష్టంగా కన్పిస్తున్నారు. శంకర్ తన కళ్ళద్దాల్ని సవరించుకుని చూశాడు. అతని కొడుకులూ, కూతురు కూడా చూశారు. ‘మన షామ్లీ కాదు’ అనుకుంటున్నంతలో మైక్‌లో శంకర్‌లాల్ పేరు విన్పించింది.

“నాన్నా.. షామ్లీ అక్కే” అంటూ దర్శన్ లాల్ జీరో లైన్ వైపుకు పరుగెత్తబోయాడు. అక్కడే నిలబడి ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారి అతన్ని ఆపి, పేరూ వివరాలు కనుక్కుని, నలుగురినీ జీరోలైన్ దాకా తీసుకెళ్ళి షామ్లీ ఎదురుగా నిలబెట్టాడు.

షామ్లీ వొళ్ళంతా కళ్ళు చేసుకుని తన నాన్న వైపు చూస్తోంది. ముడతలు పడి వొడలిపోయిన ఆ మొహంలో నలభై యేళ్ళనాటి తన తండ్రి ఆనవాళ్ళని వెతుక్కుంటోంది. తన అన్న వైపు, తమ్ముడి వైపు, చెల్లి వైపు ఆపేక్షగా చూస్తూ, తన చిన్నప్పటి జ్ఞాపకాల్లో పదిలపర్చుకున్న ముఖ కవళికలో వాళ్ళని పోల్చుకునే ప్రయత్నం చేస్తోంది.

శంకర్‌లాల్ తన కళ్ళద్దాల్ని సవరించుకుంటూ ఆమె వైపు చూశాడు. నలభై యేళ్ళప్పుడు విడిపోయిన తన కూతురి పోలికల కోసం వెతుక్కున్నాడు. కన్పించలేదు. నవ్వితే బుగ్గల్లో సొట్ట పడితే పోల్చుకోగలడు. కానీ తన ఎదురుగా ఉన్న యాభై మూడేళ్ళ స్త్రీ కన్నీటి చెలమలా ఉంది. అతని కళ్ళల్లో నీళ్ళూరుతుండగా “నువ్వేనా నా బంగారు తల్లి షామ్లీవి?” అన్నాడు.

గోరీబీ అతని చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుంటూ “నేనే నాన్నా మీ షామ్లీని” అంది.

“ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు తల్లీ…. ఏమైపోయావు?” అన్నాడు శంకర్ లాల్. ఆమె సమాధానం చెప్పకుండా తడికళ్ళతో అతని వైపు చూసింది.

“గోరీబీ నీ పేరేనా?” అన్నాడు.

ఆమె పెద్దగా ఏడుస్తూ “ఔను నాన్నా.. నా పేరే గోరీబీ” అంది. పక్కన నిలబడి ఉన్న కొడుకుని పరిచయం చేస్తూ “నీ పెద్ద మనవడు నాన్నా.. మజీద్‌ఖాన్” అంది. మజీద్ “ఆదాబ్ నానాజీ” అని అభివాదం చేశాక, అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

దర్శన్‌లాల్ ముందుకొచ్చి “షామ్లీ అక్కా. నేను దర్శన్‌లాల్‌ని” అన్నాడు.

ఆమె తమ్ముడ్ని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంది. తర్వాత అతన్ని ఆపాదమస్తకం చూస్తూ “ఎంత మారిపోయావురా.. గుర్తే పట్టలేకపోయాను” అంది.

“నువ్వూ చాలా మారిపోయావుగా అక్కా” అన్నాడు దర్శన్‌లాల్.

అన్ననీ, చెల్లెల్ని చూసి చాలా సంతోషపడింది. తన కొడుకుని వాళ్ళక్కూడా పరిచయం చేసింది.

“నువ్వు ఉత్త పేరు మాత్రమే మార్చుకున్నావా లేక పూర్తి ముస్లింలా మారిపోయావా అక్కా” అని అడిగింది ఆమె చెల్లెలు.

షామ్లీ సమాధానం చెప్పకపోవడంతో “నమాజ్ చదువుతావా?” అని మళ్ళా అడిగింది.

అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిగా అన్పించి, షామ్లీ గమ్మునుండిపోయింది.

“అలా అడగడం తప్పు కదా. మనం వచ్చింది అటువంటి విషయాలు కనుక్కోడానికా?” అంటూ తన చిన్న కూతుర్ని కోప్పడ్డాడు శంకర్‌లాల్.

“ఇంతకూ అమ్మను పిల్చుకురాలేదేమిటి నాన్నా?” అని అడిగింది షామ్లీ.

తన భార్యను తల్చుకుని శంకర్ మరోసారి కన్నీటి పర్యంతమైనాడు. “అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందమ్మా” అన్నాడు.

“ఏమైంది నాన్నా? ఏమైనా జబ్బు చేసిందా?” అని అడిగింది.

‘నువ్వేమైపోయావోనన్న దిగుల్తో, మనోవ్యధతో చచ్చిపోయింద’ని చెప్పి షామ్లీని బాధ పెట్టడం ఇష్టం లేక “ఔను తల్లీ..” అన్నాడు.

పాకిస్తానీ రేంజర్ ముందుకు వచ్చి మజీద్‌ఖాన్‌తో “మీకిచ్చిన పదిహేను నిమిషాల సమయం ఐపోవచ్చింది. యింకో మూడు నిమిషాలే మిగిలింది. తొందరగా కానివ్వండి” అంటూ హెచ్చరించాడు.

షామ్లీకి చాలా అసంతృప్తిగా అన్పించింది. మజీద్ వైపు తిరిగి “నలభై యేళ్ళ ఎడబాటు వల్ల గుండెల్లో పేరుకు పోయిన దుఃఖం ఎంత పెద్దదో తెలుసా.. హిమాలయాలంత పెద్దది. దాన్ని పదిహేను నిమిషాల్లో కరిగించడం ఎలా సాధ్యమౌతుంది బాబూ?” అంది.

“మామూలుగా పది నిమిషాల సమయమే ఇస్తారమ్మీ. ఈ రోజు కల్సుకునే పార్టీలు తక్కువ ఉండటంతో మనకు పదిహేను నిమిషాల సమయం దొరికింది. ఇది మన అదృష్టం అనుకో” అన్నాడు మజీద్.

“నాకూ చాలా అసంతృప్తిగా ఉంది బాబూ. నలభై యేళ్ళ క్రితం విడిపోయిన కూతురితో నలభై నిమిషాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఇవ్వని ఈ ములాఖత్‌ల వల్ల ప్రయోజనం ఏమిటి? మరింత దుఃఖాన్ని కలుగచేయడం తప్ప” అన్నాడు శంకర్‌లాల్.

“ఈ ములాఖత్ కూడా ఆర్నెల్లు కష్టపడితే దొరికింది తాతగారూ. యింక ఇదే భాగ్యమనుకోవాలి” అన్నాడు మజీద్.

“మనం ఎక్కడైనా కల్సుకుని ప్రశాంతంగా ఒకట్రెండు రోజులు గడిపే అవకాశమే లేదా?” అని అడిగాడు శంకర్‌లాల్.

మజీద్ కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు. “ఒక మార్గముంది తాతగారూ. ఇలా కల్సుకోడానికి అవకాశం దొరకని వాళ్ళు దుబాయ్‌కో, సౌదీ అరేబియాకో వెళ్ళి అక్కడ కల్సుకుంటారు. కానీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం” అన్నాడు.

“యింట్లో వాళ్ళకు ఎక్కడికని చెప్తాం? ఎందుకంటే ఏమని చెప్తాం బాబూ? అది సాధ్యమయ్యే పని కాదు” అంది షామ్లీ.

“అమ్మీ.. మక్కా మసీద్ సౌదీ అరేబియాలో ఉందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. చాలా సులభంగా వీసా దొరుకుతుంది. మక్కాకు హజ్ యాత్ర చేయడానికెళ్తున్నామంటే యింట్లో ఎవ్వరూ అభ్యంతరపెట్టరు. ఎటొచ్చీ తాతగారికే ఖర్చుతో బాటు శ్రమతో కూడుకున్న వ్యవహారం” అన్నాడు మజీద్.

“ఎంత ఖర్చయినా పర్లేదు బాబూ.. మనం ఏదో ఓ రోజు అక్కడే కల్సుకుందాం. అదెప్పుడో నువ్వే ఆలోచించి చెప్పు. యింకా ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు. చనిపోయేలోపల నా కూతురి దగ్గర రెండు మూడు రోజులు గడిపితే చాలు. తృప్తిగా చచ్చిపోతాను” అని శంకర్‌లాల్ అనగానే షామ్లీ అతన్ని చుట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది.

“యింకా ఒక్క నిమిషమే ఉంది. హర్రీ అప్” అన్నాడు రేంజర్.

“మనం ఉత్తరాలు రాసుకుంటూ ఉందాం” అన్నాడు దర్శy.

“మీరు నా ఆఫీస్ అడ్రస్‌కే ఉత్తరాలు రాయండి. నేను అమ్మకు భద్రంగా చేరవేస్తాను. మేము మిమ్మల్ని కలిసినట్టు మా యింట్లో ఎవ్వరికీ తెలియదు. తెలియకూడదు కూడా” అన్నాడు మజీద్. తన ఆఫీస్ అడ్రస్‌ని దర్శనలాల్‌కి పేపర్ మీద రాసిచ్చాడు.

వీడ్కోలు తీసుకునే సమయం వచ్చింది.

అందరి కళ్ళల్లో కన్నీరు..

బార్డర్ సెక్యూరిటీ అధికారితో పాటు పాకిస్తానీ రేంజర్ వచ్చి షామ్లీనీ, మజీద్‌ఖాన్‌ని అక్కడినుంచి తీసుకెళ్ళిపోతుంటే, నలభై యేళ్ళ క్రితం ఎవరో దుర్మార్గుడు ఎత్తుకెళ్ళిపోయిన తన కూతురు దొరికిన కొన్ని నిమిషాలకే ఇద్దరు అధికార్లు కలిసి మరోసారి తనకు దూరంగా ఎత్తుకెళ్ళిపోతున్నట్టు శంకర్‌లాల్ విలవిల్లాడిపోయాడు.

షామ్లీ వెనక్కితిరిగి చూస్తూనే మజీద్ చేతిని ఆసరాగా పట్టుకుని ముందుకు నడిచింది. కళ్ళు రెండూ నీళ్ళతో నిండిపోవడంతో ఇప్పుడు తన తండ్రీ అన్నా తమ్ముడూ చెల్లీ అందరూ మసకమసగ్గా కన్పిస్తున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version