రెండు ఆకాశాల మధ్య-5

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]చి[/dropcap]న్నప్పటినుంచే వాళ్ళ మధ్య స్నేహబంధం పెనవేసుకుపోయింది. ఫక్రుద్దీన్ అతనికన్నా ఏడేళ్ళు చిన్నవాడు. వయసు తేడా వాళ్ళ స్నేహానికి ఏ రకంగానూ అడ్డుకాలేదు. శంకర్ లాల్‌కి నలుగురు అన్నలు. తమ్ముళ్ళు లేరు. తనకు తమ్ముడు లేని లోటుని ఫక్రుద్దీన్ తీర్చాడని శంకర్ లాల్ మురిసిపోయేవాడు.

సహాయ శిబిరంగా మార్చిన అగ్రికల్చర్ కార్యాలయం రెండంతస్తుల బిల్డింగ్.. ఒక్కో అంతస్తులో నాలుగు గదులున్నాయి. ఒక్కో గదిలో ముప్ఫయ్‌కి తక్కువ కాకుండా మనుషులున్నారు. ఫక్రుద్దీన్ కుటుంబం కింది గదుల్లో ఒకదానిలో ఉంటే శంకర్ లాల్ కుటుంబం పై గదుల్లో ఒకదానిలో ఉంది.

ఫక్రుద్దీన్ సమాధానమివ్వకుండా మౌనంగా ఉండటంతో “ఏంటీ ఏమీ మాట్లాడవు? కొడుకు పోయిన బాధ ఉంటుంది. కాదనను. కానీ యిలా తిండీ నీళ్ళు మానేసి కూచుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఆలోచించావా? నీ కూతురి పెళ్ళిచేయాల్సిన బాధ్యత ఉందన్న విషయం మర్చిపోయావా?” అన్నాడు శంకర్ లాల్.

“నువ్వు నన్ను వెతికితే దొరికినట్టు నేను మా రషీద్ కోసం వెతికితే వాడు దొరికితే ఎంత బావుంటుందో కదా” ఫక్రుద్దీన్ కళ్ళలో కన్నీటి సముద్రాలు…

“అనుభవాలతో పండిపోయిన నువ్వూ నేనూ మాట్లాడాల్సిన మాటలా ఇవి? మన జీవితంలో మనం ఎన్ని ఆటుపోట్లని తట్టుకోలేదూ.. ఎన్ని చావుల్ని చూడలేదూ.. ఆత్మీయుల్ని ఎంతమందిని పోగొట్టుకోలేదూ.. భాభీకి, నీ కూతురికి ధైర్యం చెప్పాల్సిందిపోయి ఇలా బేలగా మారిపోతే ఎలా చెప్పు?” అతని భుజం మీద చేయివేసి అనునయిస్తున్నట్లు అన్నాడు.

“నిజమే. మనం రెండు దేశాలుగా విడగొట్టబడటానికి ముందు చాలా సంతోషంగా ఉన్నాం. మన మధ్య హిందూ ముస్లిం అన్న భేదభావమే లేదు. ఆంగ్లేయులు తాము పాలించిన అఖండ భారతదేశాన్ని వదిలి వెళ్ళేముందు దాన్ని పాకిస్తాన్‌గా, హిందూస్తాన్‌గా చీల్చినపుడే రెండు మతాల మధ్య నిప్పు రాజుకుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి నాకు దాదాపు ఇరవై యేడేళ్ళ వయసుంటుంది. నీకు ముప్పయ్ నాలుగు ఉంటాయేమో. మతవైషమ్యాలు రగిలిపోయి ఇరుమతాల మధ్య జరిగిన వూచకోతల్లో నువ్వు నీ బంధువుల్ని, నేను నా బంధువుల్ని చాలా మందిని కోల్పోయాం. కానీ ఈ వయసులో ఎదిగొచ్చిన కొడుకుని కోల్పోవటం మాత్రం భరించరానిదిగా ఉంది శంకర్” అన్నాడు ఫక్రుద్దీన్.

“మన వూళ్లో రక్త సంబంధీకుల్ని కోల్పోని కుటుంబం ఒక్కటైనా ఉందా చెప్పు? హెచ్చరిక లేకుండా వచ్చిపడే సైనికుల తూటాలకు ఎంతమంది చనిపోయారో గుర్తుకు తెచ్చుకో.. మూడేళ్ళ పసిపిల్ల రిజ్వానాని బలి తీసుకుంది పాకిస్తానీ సైనికుల ఫిరంగులేగా. ఏడాది క్రితం పొలంలో పని చేసుకుంటున్న జోగిందర్ సింగ్ గుండెల్లోకి దూసుకెళ్ళిన తూటా మన సైనికులదేగా.. ఎవర్నని తప్పు పట్టగలం? ఇరువైపులా ఉన్న సైనిక శిబిరాలకు సరిగ్గా మధ్యన ఉండటం మన గ్రామస్థులు చేసుకున్న పాపం. బార్డర్‌ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో నివసించే మనలాంటివాళ్ళ నెత్తిమీద ప్రతిక్షణం చావు సన్నటి దారానికి వేలాడే కత్తిలా భయపెడుతూనే ఉంటుంది” అన్నాడు శంకర్‌లాల్.

“అసలీ యుద్ధాలేమిటి? ఈ కవ్వింపు చర్యలేమిటి? రెండు దేశాల మధ్య వైషమ్యాలు లేకుండా బతకలేమా? ఎత్తయిన కొండల మీదున్న శిబిరాల్లోంచి ఎవరో తుపాకీ పేలుస్తారు. అది ఎవరికి తగుల్తుందో ఆ అల్లాకే తెలుసు. సైనికులు ఒకర్నొకరు చంపుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. సైనికుడిగా చేరినపుడే వాళ్ళు ప్రాణాలకు తెగించి ఉంటారు. మనలాంటి అమాయక ప్రజలు ఏం పాపం చేశారని ఈ శిక్ష? గ్రామస్థుల కడుపు కోతకు, గుండె మంటకు బాధ్యులెవరు? ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోదు?”

“బార్డర్‌‍కి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న మన గ్రామం రెండు దేశాల సైనికుల ఫైరింగ్ రేంజ్‌లో ఉండటం మన దురదృష్టం. మిగతా గ్రామాల్లోని ప్రజలు మోర్టార్ దాడుల్లో మాత్రమే గాయపడితే మనం తుపాకీ తూటాలక్కూడా ప్రాణాలు కోల్పోతున్నాం.”

“నేనెంతో యిష్టంగా కట్టుకున్న మా యింటి గోడలు గమనించావా? తూటాలు తగిలి ఎన్ని చోట్ల పెచ్చులూడిపోయాయో.. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే పాకిస్తానీ సైనికుల తూటాల కన్నా మన సైనికుల తూటాల వల్లనే ఎక్కువ నష్టం జరిగింది.”

“మన ప్రాణాల్ని రక్షించుకోడానికి బంకర్లు నిర్మించమని ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా అటువంటి ప్రయత్నమేదీ కన్పించడం లేదు. తూటాల వర్షం మొదలవగానే ఇలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో వందల మందిని కుక్కి చేతులు దులుపుకుంటున్నారు. అదీ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శిబిరాల్లో.. అక్కడికి చేరుకునేలోపల ఏ తూటానో తగిలి ప్రాణాలు పోవన్న భరోసా ఏముంది? ఒక్కో బంకర్లో నలభై మంది వరకు తల దాచుకోవచ్చు. ఆ లెక్కన మనూరి జనాభాకు పాతిక బంకర్లు నిర్మించిస్తే చాలు కదా. అవి కూడా వూళ్లోనే నిర్మించాలి. ఇలా దూరంగా కాదు” అన్నాడు శంకర్‌లాల్.

“జీవితాన్ని కొంతైనా అనుభవించిన మనలాంటి వాళ్ళు పోయినా పెద్దగా బాధ ఉండదు. కానీ జీవితంలోని తొలి పొద్దులోనే ఉన్న నా కొడుకు రషీద్ లాంటి వాళ్ళ చావే గుండెల్లో దిగబడిన ఖంజర్ చేసిన గాయంలా సలుపుతూనే ఉంటుంది” అన్నాడు ఫక్రుద్దీన్.

శంకర్ ఏమీ మాట్లాకుండా చెట్ల కింద గాడిపొయ్యిలు వెలిగించి చేస్తున్న వంట ప్రయత్నాల వైపు చూస్తూ కూచున్నాడు. అతనికి దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండతో పాటు సహాయ శిబిరాలు.. పఠాన్ల కరవాలాలకు దొరక్కుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బార్డర్ దాటి భారతదేశం చేరుకోవాలని పరుగెత్తుతున్న హిందువులు అలసిపోయి తల దాచుకున్న గుడారాలు.. సామూహిక వంటలు.. గుర్తొచ్చాయి.

“ఫక్రూ.. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించడానికి కొన్ని నెలల ముందు నేను లాహోర్‌లో ఉన్నానన్న విషయం నీకు తెలుసుగా. ఎంత రక్తపాతం.. రోడ్డు మీద వర్షపు నీళ్ళు ప్రవహించినట్టు రక్తం కాలువలై పారడం నా కళ్ళతో చూశాను. బతుకుతాననుకోలేదు. పందొమ్మిదేళ్ళ క్రితం జరిగిన సంఘటనలే అయినా గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తో ఉంటుంది తెలుసా? నిద్దట్లో పీడకలలొచ్చి ఎన్నిసార్లు ఉలిక్కి పడి లేస్తుంటానో” ఆకాశంలోకి శూన్యంగా చూస్తూ అన్నాడు శంకర్.

ఫక్రుద్దీన్‌కి అప్పటి భయంకరమైన రోజులు గుర్తుకు రాగానే తన కొడుకు చనిపోయిన విషయం మరుగున పడి, సిక్కుల చేతుల్లో మానభంగాలకు, వూచకోతకు గురైన తన బంధువులందరూ గుర్తొచ్చి మనసు వికలమైపోయింది. “విభజనకి కొన్ని రోజుల ముందువరకు ప్రాణ స్నేహితుల్లా మెలిగిన వాళ్ళే పరమ శత్రువులుగా మారి నిర్దాక్షిణ్యంగా పసిపిల్లల తలలు నరికిన సంఘటనల్ని ఎలా మర్చిపోగలను? కడుపుతో ఉన్న ఆడవాళ్ళ కడుపులు చీల్చి, పిండాల్ని నిప్పుల్లో వేసి.. ఆడపిల్లల్ని బైటికీడ్చి రోడ్లమీదే బహిరంగంగా మానభంగాలు చేసి… యా అల్లా.. మనుషులు మానవత్వం మరచి మతం పేరుతో మృగాలుగా మారి, జరిపిన రాక్షస క్రీడ.. పగవాడికి కూడా అటువంటి భయానకమైన అనుభవాలు ఉండకూడదు” అతను కూడా గతంలోకి తొంగిచూస్తున్నట్టు ఎటుకో చూస్తూ సమాధానమిచ్చాడు.

యిద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు.

మధ్యాహ్న భోజనం తయారుగా ఉందని పెద్దగా అరిచి చెప్తున్నారెవరో…

“పద.. భోజనం చేసొద్దాం.. నాకు చాలా ఆకలిగా ఉంది” అన్నాడు శంకర్.

“నా కొడుకుతో పాటు ఆకలి కూడా చచ్చిపోయింది శంకర్. నువ్వెళ్ళి తినిరా.. నేనిక్కడే కూచుని ఉంటాను” అన్నాడు ఫక్రుద్దీన్.

అప్పటికే భోజనాల దగ్గర పెద్ద గుంపు జమైంది. చిన్నపిల్లలున్న తల్లుల్ని మొదటి వరసలో నిలబడమని సైనికుడొకడు హెచ్చరిస్తున్నాడు.

“ఇలా తిండి లేకుండా ఎన్ని రోజులుంటావు? మనమేమీ యువకులం కాదు తినకున్నా ఒంట్లో సత్తువ ఉండటానికి? పైనుంచి పిలుపు వచ్చేవరకు బతక్క తప్పదుగా. బతకాలంటే ఏదో ఒకటి తినక తప్పదుగా” అతని చేయి పట్టుకుని లేపుతూ అన్నాడు శంకర్.

“మనదీ ఒక బతుకంటావా? దినదిన గండమేగా శంకర్.. ఎప్పుడు నెత్తిమీద బాంబులు పడ్తాయో తెలీదు. ఏ వైపు నుంచి తూటా దూసుకొస్తుందో తెలీదు. మనం రాత్రి పడుకున్నాక ఉదయం వరకూ బతికుంటామో లేదోనన్న అనుమానం పీడిస్తూనే ఉంటుంది. నిజం చెప్పు.. మనం సుఖంగా నిశ్చింతగా నిద్ర పోయి ఎన్ని సంవత్సరాలైందో.. ఇలా అనుక్షణం భయంతో చచ్చే బదులు చావే నయం కదూ.”

మిత్రుడి అభిప్రాయాన్ని బలపరుస్తూ “ఔను ఫక్రూ.. యిక్కడ శిబిరంలో తలదాచుకుంటున్నామన్న మాటేగాని మన మనసంతా వూళ్లోనేగా ఉంది. మనం వెళ్ళేటప్పటికి మన యిళ్ళు ఎప్పటిలా గోడలూ పైకప్పుతో ఉంటాయో లేదో తెలియదు. పోయినసారి యిలా శిబిరానికొచ్చి రెండ్రోజుల తర్వాత తిరిగెళ్ళి చూస్తే దాదాపు ఐదారిళ్ళు నేలమట్టమై కన్పించిన విషయం గుర్తుందా? పాతిక్కి పైగా బర్రెగొడ్లు చచ్చిపడి ఉన్నా యి. ఎంత దుర్భరమైన బతుకులో మనవి” అన్నాడు శంకర్.

“ఎన్ని విషాదాల్ని మోస్తున్నామో కదా.. జరిగిన నష్టంతో పాటు యింకేమైనా నష్టం జరుగుతుందేమోనన్న భయం ఒక వైపు… వెంటాడే దేశవిభజన నాటి భయంకరమైన జ్ఞాపకాలు మరో వైపు.”

“అయ్యో .. నన్ను క్షమించు ఫక్రూ.. అనవసరంగా అప్పటి జ్ఞాపకాల్ని తిరగదోడానా.. యిల్లూ వాకిలి, గొడ్డూ గోదా వదిలేసి మనదేశంలోనే మనం శరణార్థుల్లా ఇక్కడ తలదాచుకోవటం.. ఈ సామూహిక భోజనాలు.. చూస్తే నాకెందుకో అప్పటి రోజులు గుర్తుకువచ్చాయి” నొచ్చుకుంటూ అన్నాడు.

“అసలు మర్చిపోతేగా శంకర్ నువ్వు గుర్తు చేయడానికి.. మనం చనిపోయే చివరి క్షణం వరకు ఆ దారుణమైన రోజులు గుర్తుకొస్తూనే ఉంటాయి. మనల్ని బాధపెడ్తూనే ఉంటాయి” అన్నాడు ఫక్రుద్దీన్.

శంకర్ లాల్ బలవంతం మీద అతను ఒక చపాతీ మాత్రమే తిన్నాడు. శంకర్ లాల్‌కి కూడా భోజనం సయించలేదు. “నాకు తలనొప్పిగా ఉంది. వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను” అనేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికెళ్ళిపోయాడు.

నేల మీద దుప్పటి పరచి, దాని మీద వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ ముందు పందొమ్మిదేళ్ళ క్రితం లాహోర్ పట్టణంలో తనకెదురైన అనుభవాలు మరోమారు ప్రాణం పోసుకుని కన్పించసాగాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here