రెండు ఆకాశాల మధ్య-52

1
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]స[/dropcap]న్నగా, జాజి తీగలా ఉన్న తనని సునాయాసంగా ఎత్తుకుని, బొంగరాన్ని తిప్పినట్టు గిరగిరా తిప్పాడు.

“కళ్ళు తిరుగుతున్నాయి. చాలింక ఆపండి” అంది తను.

“నన్నెత్తుకో చూద్దాం” తనను కిందికి దింపాక అల్లరిగా అడిగాడు షరీఫ్.

“అమ్మో.. నేనెత్తుకోలేను బాబూ” అంది తను సిగ్గుపడిపోతూ.

“ప్రయత్నించు” అన్నాడు.

తను అతని నడుంచుట్టూ చేతులు వేసి బిగించి, శ్వాసను బలంగా తీసుకుని, ఎత్తడానికి ప్రయత్నించి విఫలమై, మూడో ప్రయత్నంలో నాలుగంగుళాల ఎత్తువరకు ఎత్తి, దింపేస్తూ “అమ్మో.. నావల్ల కాదు. ఎంత బరువున్నారో” అంది.

బరువు.. గుండెల్లో కొండలేవో మొలిచినట్లు బరువు.. శ్వాస ఆడటం లేదు.. చెమటలు పడ్తున్నాయి.. తన శరీరాన్ని ఎవరో నేలకేసి అదిమిపట్టినట్టు.. ప్రాణం పోతున్నంత బాధ..

భయంతో కళ్ళు తెరిచి చూసింది. గదంతా చీకటిగా ఉంది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. గుండెలో నొప్పనిపిస్తోంది. కలలో కాదు.. నిజంగానే.

లేచి, మంచం కింద పెట్టుకున్న చెంబులోంచి నీళ్ళు తాగింది.. చల్లటి నీళ్ళు గొంతు దిగంగానే కొద్దిగా ఉపశమనంగా అన్పించింది. మళ్ళా మంచం మీద పడుకుంది. సమయం ఎంతై ఉంటుందో తెలియడం లేదు. మూడై ఉంటుందేమో.. చీకటి యింకా చిక్కగానే ఉంది. యింకో రెండు మూడు గంటలు.. అంతే.. తన షొహర్ ప్రత్యక్షమౌతాడు.. ఆమెకు చాలా ఉద్విగ్నంగా ఉంది. ఆ ఆలోచనకే గుండె వేగంగా కొట్టుకుంటోంది.

మళ్ళా ఆలోచనలు.. మధురమైనవి కొన్ని.. మనసుని కలచి వేసినవి కొన్ని.. చాలా సేపటికి నిద్ర లోకి జారుకుంది.

కల.. సుహాగ్ రాత్.. “అదేమిటి బేగం.. సుహాగ్ రాత్ రోజు ఎర్ర రంగు దుస్తులు ధరించాలి కదా. నెమలి కంఠం రంగు కమీజ్ వేసుకున్నావేమిటి?” అంటున్నాడు షరీఫ్. తను లాల్ దుపట్టాని తీసి, అతని చేతిలో పెట్టింది. “నాకు ఈ రంగంటే ఇష్టమని నీకెలా తెలుసు?” అంటున్నాడు.

“నీ పెదవుల రంగు ఒలికిపోయి, చూశావా దుపట్టా మొత్తం ఎలా ఎర్రగా మారిపోయిందో” అంటున్నాడు. ఆమె సిగ్గుల మొగ్గయి మరింత ముడుచుకుపోయింది.

లాల్ దుపట్టాని గాల్లోకి ఎగరేశాడు. “హవామె ఉడతాజాయే.. మేర లాల్ దుపట్టా మలమల్ కా…” అంటూ పాడుతున్నాడు. తను దుపట్టా అందుకోడానికి పరుగెత్తుతోంది. ఎంత దూరం పరుగెత్తిందో.. పాట ఇప్పుడు మంద్రస్వరంలో వినిపిస్తోంది.. దుపట్టా యింకా పై పైకి వెళోంది.. మేఘాల్లోకి.. యింకా పైకి… నక్షత్రాల్లోకి.. తన భర్తకు ఆ దుపట్టా అంటే ఎంతిష్టమో.. వస్తున్నాడుగా.. ఏదీ నాకిష్టమైన లాల్ రంగు దుపట్టా అని అడుగుతాడు. ఎట్లాగయినా సరే దాన్ని అందుకోవాలన్న పట్టుదలతో తను కూడా గాల్లోకి ఎగిరింది… పై పైకి వెళోంది. మేఘాల్లోకి.. నక్షతాల్లోకి..

***

షరీఫ్ ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా బస్సులు, లారీలు, ఆటోలు… ఏవి దొరికితే అవి పట్టుకుని ప్రయాణిస్తే కార్గిల్ చేరుకునేటప్పటికి ఉదయం ఐదు కావస్తోంది. కార్గిల్ నుంచి హుందర్మాన్ గ్రామానికి మధ్య దూరం దాదాపు పది కిలోమీటర్లు..

రోడ్డు పక్కనున్న చాయ్ దుకాణంలో ఓ కప్పు చాయ్ తాగాడు. రాత్రంతా నిద్ర లేనందువల్లనేమో కళ్ళు మండుతున్నాయి. రెండు రోజులుగా సరైన తిండి లేనందువల్లనేమో నీరసంగా ఉంది. చాయ్ తాగాక కొద్దిగా శక్తి వచ్చినట్టనిపించింది. తన కోసం హసీనా ఎదురుచూస్తో ఉంటుందన్న ఆలోచనే అతన్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బస్టాండ్‌లో వాకబు చేస్తే మొదటి బస్ బయల్దేరడానికి మరో గంట సమయం ఉందని చెప్పారు. అంతసేపు బస్ కోసం అక్కడే వేచి ఉండటం తన వల్ల కాదనిపించింది. పది కిలోమీటర్లు.. తనకూ తన ప్రియమైన హసీనాకు మధ్య దూరం ప్రస్తుతం కేవలం పది కిలోమీటర్లు.. పరుగెత్తుకుంటూ పోవాలన్న కోరిక మనసులో ఎగసిపడ్తోంది. తన వయసు డెబ్బయ్‍కి చేరువౌతోందన్న విషయం గుర్తొచ్చి. తనలో తను నవ్వుకుంటూ హుందర్మో వైపుకు నడవసాగాడు.

స్కూటర్ల మీద యిద్దరు యువకులు అటు వైపుకే వెళ్తుండటం చూసి లిఫ్ట్ కావాలంటూ చేత్తో సైగ చేశాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళి, ఆగి, వెనక్కి తిరిగి అతని వైపు రమ్మన్నట్టు చూశారు. షరీఫ్ వేగంగా పరుగెత్తి వాళ్ళను చేరుకున్నాడు. అప్పుడతనికి తన వయసు గుర్తుకు రాలేదు. హసీనాను చేరుకోబోతున్న సంతోషంలో యవ్వనం తిరిగొచ్చుంటుందన్న ఆలోచన రాగానే ఆయాసపడూనే మెల్లగా నవ్వుకున్నాడు.

“ఎక్కడికెళ్ళాలి?” ఓ యువకుడు అడిగాడు.

“హుందర్మో” అన్నాడు షరీఫ్.

“హుందర్మో కాదు జనాబ్, హుందర్మాన్” అతను నవ్వుతూ అన్నాడు.

“మా వూరి పేరు మారిందా? ఎప్పుడూ?” షరీప్ ఆశ్చర్యపోతూ అడిగాడు.

“అది మీ వూరంటున్నారు. మరి పేరు మారిన విషయం తెలియదా? ఇరవై యేళ్ళ క్రితమే మారిందిగా” అన్నాడు.

“తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇరవై యేళ్ళ తర్వాత మా వూరికి తిరిగెళ్తున్నాగా” చిన్న పిల్లాడిలా సంబరపడిపోతూ అన్నాడు షరీఫ్.

ఆ యువకుడు అతని వైపు ఆశ్చర్యంగా చూసి, “అలిగెళ్ళిపోయారా?” అని అడగబోయి, అలా అడగడం మర్యాదకాదని గుర్తొచ్చి, “ఎక్కండి” అన్నాడు.

వూళ్ళోకి దారితీసే మట్టి రోడ్డు దగ్గర షరీఫ్ దిగిపోయి ఆ యిద్దరు యువకులకు షుక్రియా అదా చేశాడు. అక్కడినుంచి మెల్లగా నడుచుకుంటూ వూళ్ళోకి వెళ్తుంటే అతనికి తల్లి ఒడిలోకి వెళ్తున్న అనుభూతి కలిగింది. తను పుట్టి పెరిగిన నేల.. తన గర్భంలో నాటిన విత్తనాల్ని పంటగా మార్చి తనకు అన్నం పెట్టిన మట్టి..

అతను తన యింటి వైపుకు నడుస్తుంటే వొంటినిండా ఏదో తెలీని పులకింత.. ఇరవై యేళ్ళ క్రితం తప్పిపోయిన పిల్లాడు మళ్ళా చేతికి దొరికినంత సంబరం..

ఆస్‌మా ఉదయం ఐదింటికే మేల్కొని, తండ్రి రాక కోసం ఎదురుచూడసాగింది. అమ్మను కూడా లేపుదామనుకుంది. గదిలోకి తొంగిచూస్తే ఆమె ప్రశాంతంగా పడుకుని కన్పించింది.

రాత్రి బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఉండటంవల్ల, కొద్ది సేపటి క్రితమే ఆమెకు నిద్ర పట్టి ఉంటుందనీ, పడుకుంటున్న ఆమెను లేపడం భావ్యం కాదని తలచి, నాన్నకు ఆహ్వానం పలకడానికి తనొక్కతే యింటి ముంగిట నిలబడింది.

ఐదూ ముప్పావుకి షరీఫ్ వస్తూ కన్పించాడు. “నాన్న వచ్చేశాడూ” అంటూ పెద్దగా అరిచి, ఆస్‌మా అతనికి ఎదురెళ్ళింది. ఆమె అరుపు విని, యింట్లోంచి ఒకరొకరూ బైటికొచ్చి, విప్పారిన మొహాల్తో నిలబడ్డారు. షరీఫ్ వారిస్తున్నా వినకుండా అతని చేతిలోచి సందూక్‌ని అందుకుని “అబ్బాజాన్.. ఎంత సంతోషంగా ఉందో నాకు.. మిమ్మల్ని మళ్ళా చూస్తానని అనుకోలేదు. అమ్మ రోజూ నమాజ్‌లో చేసిన మిన్నత్‌ల ఫలితమే ఇది” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఇరవై యేళ్ళ తర్వాత కూతుర్ని చూసిన సంతోషంలో షరీఫ్ కళ్ళు కూడా చెమర్చాయి.

అతను యింటి ముంగిటకు రావడం ఆలస్యం మిగతా కుటుంబ సభ్యులందరూ అతని చుట్టూ మూగిపోయారు. ఇరవై యేళ్ళ తర్వాత తిరిగొచ్చినందుకు బధాయీలు, మనవళ్ళ మనవరాళ్ళ ఆదాబ్‌లు, బావమరిది ఫక్రుద్దీన్‌తో అలాయి బలాయీలు, కూతుర్ల కన్నీళ్ళు.. కొడుకుతో ఆలింగనాలు.. తన కుటుంబ సభ్యుల ప్రేమకూ, అభిమానానికి సంతోషంతో ఉక్కిరిబిక్కిరౌతూనే షరీఫ్ కళ్ళు హసినా కోసం వెతుక్కు న్నాయి. ఏదీ తన హసీనా? ఏదీ తన జానేమన్? ఏదీ తన జానే జిగర్?

యిక ఉండబట్టలేక “అమ్మేదమ్మా?” అని ఆస్‌మాని అడిగాడు.

“మీరొస్తున్నారన్న సంతోషంలో అమ్మకు రాత్రంతా నిద్ర పట్టి ఉండదు నాన్నా. ఇప్పుడు చూస్తే నిద్రపోతోంది. మీరొచ్చాక లేపుదామని నేనే లేపలేదు. ఉండండి. లేపుతాను” అంటూ ఆస్‌మా అమ్మ నిద్ర పోతున్న గదిలోకి పరుగెత్తింది.

హసీనా నిద్రకళ్ళతో గదిలోంచి బైటికొస్తే చూడాలని ఆతురతగా ఎదురుచూస్తూ నిలబడ్డాడు షరీఫ్. క్షణాలు గడిచే కొద్దీ అతని అసహనం పెరగసాగింది. ఎంత సేపు? యింకా ఎంత సేపు? భారంగా అరవై సెకన్ల సమయం గడిచి ఉంటుంది. లోపల్నుంచి ‘అమ్మీ’ అంటూ ఆస్‌మా పెట్టిన గావుకేక విన్పించి, షరీఫ్‌తో సహా అందరూ గదిలోకి పరుగెత్తారు. జీవం లేని హసీనా గుండెల మీద వాలిపోయి “అమ్మీ.. నాన్నొచ్చాడు చూడు.. నీ కోసమే వచ్చాడమ్మీ.. కళ్ళు తెరిచి చూడమ్మీ..” అంటూ హృదయవిదారకంగా ఏడుస్తున్న ఆస్‍మాని సముదాయించడం ఎవరి తరమూ కాలేదు.

షరీఫ్ షాక్ వల్ల మొదట రాతిబొమ్మలా మారిపోయాడు. జరిగిందేమిటో అతని మెదళ్ళోకి యింకేకొద్దీ అతను కన్నీటి సంద్రమే అయ్యాడు. ఎవర్ని కల్సుకోవాలని ఇన్నేళ్ళూ ఆరాటపడ్డాడో, ఎవర్ని చేరుకోవడం కోసం దివారాత్రాలు శ్రమ పడ్డాడో, ఎవరి సామీప్యాన్ని కలగన్నాడో ఆ హసీనానే తనను విడిచి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. అతను ఫక్రుద్దీన్‌ని పట్టుకుని “నా అంత దురదృష్టవంతుడు ఈ దునియాలో ఉండడు బావా” అంటూ ఏడ్చాడు. “అమ్మలేని నేను బతికున్నా జీవచ్ఛవాన్నే” అంటూ ఆమెని పట్టుకుని ఏడ్చాడు.

హసీనా వొంటిమీద తను తెచ్చిన నెమలికంఠం రంగు కమీజ్ కప్పి, మెడచుట్టూ లాల్ దుపట్టాని వేసి, “నీకిష్టమైన పోషాక్ తెచ్చాను హసీనా. ఒక్కసారి వేసుకుని చూపించవా” అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు.

షరీఫ్ తన భార్య జనాజాని మోస్తూ ‘నీ మాట నెగ్గించుకున్నావుగా హసీనా.. నేనొచ్చాకేగా నీ జనాజా లేచింది’ అనుకుంటూ కన్నీటి పర్యంతమైనాడు. ఆమె సమాధిని పాలరాతితో అందంగా కట్టించాడు. దాని మీద “సహద్ జమీన్ బాంట్ సక్తి హై పర్ దిల్ నహీ” అనే అక్షరాల్ని చెక్కించాడు.

నిజమే.. సరిహద్దులు నేలని విడగొడ్డాయేమో కానీ హృదయాల్ని కాదు. సరిహద్దు గీతలకింద పడి నలిగిపోతున్న ఎంతోమంది నిర్భాగ్యుల వ్యథాభరిత జీవితాల్లో బతికుండాలనే ఆశను నింపుతున్న నమ్మకం అదే. సరిహద్దుకి అవతలి వైపున్న తమ ఆత్మీయుల్ని ఎప్పటికైనా కల్సుకోవాలన్న కోరికకు మరణం లేదు. అది చిరంజీవి.. వాళ్ళు బతికున్నంత కాలం ఆ ఆశ కూడా బతికుంటుంది. వాళ్ళని బతికిస్తూ ఉంటుంది.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here