[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]ది పందొమ్మిది వందల నలభై ఆరు, మార్చి నెలలో మొదటి ఆదివారం.. ఆ రోజు శంకర్‌లాల్ వాళ్ళింట్లో గొడవ జరుగుతోంది. లాహోర్ వెళ్ళి తన అన్నను చూడాల్సిందే అని పట్టుబట్టాడు శంకర్ వాళ్ళ నాన్న కిషన్‌లాల్. శంకర్‌కి ఇష్టం లేదు. “యిన్నాళ్ళూ పెదనాన్నకి మనం గుర్తుకే రాలేదుగా నాన్నా. మనం పేదరికంలో మగ్గుతున్నా ఎప్పుడైనా కన్నెత్తి యిటువైపు చూశాడా? నీకేమీ సాయం చేయలేదు సరే స్వంత తమ్ముడి బిడ్డనేగా, నాకేమైనా చేశాడా? నా అన్నలకేమైనా చేశాడా? వాళ్ళకు ధనవంతులమన్న అహంకారం చాలా ఉంది నాన్నా. మనల్ని చిన్నచూపు చూసినవాళ్ళ యింటికెందుకెళ్ళాలి? వద్దు. నా మాటిను” అన్నాడు.
‘నువ్వు చెప్పింది నిజమేరా.. వాడు లాహోర్ వెళ్ళాక మనల్ని మర్చిపోయిన విషయం నాకు గుర్తులేదనుకున్నావా? నాకు బాధ లేదనుకున్నావా? అలాగని రక్త సంబంధాన్ని వదులుకోమంటావా? తన ఆరోగ్యం బాగోలేదని కదరా రాశాడు. నన్నోమారు చూడాలని ఉందని కదా అన్న కోరిక.. నాకే యాభై ఎనిమిదేళ్ళు. అన్న నాకంటే నాలుగేళ్ళు పెద్ద. ఎక్కువ రోజులు బతకనేమోరా అని కూడా రాశాడ్రా. ఈ సమయంలో పట్టుదలలూ పంతాలూ మంచివి కావురా” అన్నాడు.
యినుప తీగకు గుచ్చి ఉన్న కార్డుని మెల్లగా బైటికి లాగి, కళ్ళద్దాలు సరిచేసుకుని, మరోసారి ఆ ఉత్తరాన్ని చదువుకుని, తలెత్తి, చెమ్మగిల్లిన కళ్ళతో కొడుకు వైపు చూశాడు. అలా తన అన్న రాసిన ఉత్తరం ఏ వందసార్లో చదివి ఉంటాడు. చదివిన ప్రతిసారీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. అప్పటికే ఆ ఉత్తరం వచ్చి నెల దాటిపోయింది.
ఎన్ని కష్టాలు వచ్చినా నాన్న కన్నీళ్ళు పెట్టుకోవడం చూడని శంకర్‌కి హృదయం కరిగిపోయింది. “సరే అయితే. మీ అన్న కదా, నువ్వెళ్ళిరా. మేమెవ్వరం రాము” అన్నాడు.
“అలా అంటే ఎలారా? నాకు మన వూరి చుట్టుపక్కల ఉన్న వూళ్ళు తప్ప వేరే ప్రపంచం తెలియదుగా. ఒంటరిగా వెళ్ళలేను. దానికితోడు అన్న నిన్నూ నీ పిల్లల్ని కూడా పిల్చుకు రమ్మని రాశాడుగా. నువ్వంటే వాడికి ఇష్టంరా. వాడి చివరి కోరిక తీర్చడం మన బాధ్యత.”
“పెద్దనాన్న మీద నాకున్న కోపం పోదు నాన్నా. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి బాగానే సంపాయించాడుగా. మనకు కొద్దిగా సాయం చేసి ఉంటే ఈ బర్రెగొడ్లని సాకుతూ, పొలంలో గొడ్డులా పనిచేస్తూ బతికే బతుకు ఉండేది కాదుగా” కోపంగా అన్నాడు శంకర్.
“వాడు చదువుకున్నాడా. నాకు చదువబ్బలేదు. అది వాడి తప్పు కాదుగా. యింగ్లీష్ బాగా మాట్లాడేవాడు. తెల్లదొరల దగ్గర కొలువుకు చేరాడు. వాడి తెలివితో, స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి లాహోర్‌లో పెద్ద హోదాలో ఉద్యోగ విరమణ చేశాడు. వాడికీ మనకు సాయం చేయాలనే ఉండేదిరా. వదిన పడనిచ్చేది కాదు.”
“మీ అన్నను సమర్థించుకుంది చాల్లే. సాయం చేయాలని మనసులో ఉండాలేగాని దానికి వంద మార్గాలుంటాయి.”
“ఈ ఒక్కసారికి నా మాటినరా. నేనైనా ఎన్నాళ్ళు బతుకుతాను? ఇది నా చివరి కోరిక అనుకుని తీర్చరా” అన్నాడు.
కన్న తండ్రి నోటినుంచి అలాంటి మాటలు వినగానే శంకర్ కరిగిపోయాడు. కుటుంబంతో కలిసి లాహోర్‌కి వెళ్ళడానికి సన్నద్ధమైనాడు.
కానీ అందర్నీ పిల్చుకెళ్తే యిక్కడున్న బర్రెల్ని, మేకల్ని ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న తలెత్తింది. అతని భార్య యింటి దగ్గరే ఉండిపోతానని చెప్పింది. ఆమెకు లాహోర్ వెళ్ళడం ఇష్టం లేదు. తన పెళ్ళప్పుడు చూసిందే తన బావగార్ని. అప్పుడు కూడా అతను కుటుంబంతో రాలేదు. తనొక్కడే వచ్చి ఓ రోజుండి, నాలుగక్షింతలు వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతనీ పల్లెటూరికి రాలేదు.. వీళ్ళ అతీగతీ కనుక్కున్న పాపాన పోలేదు.
ఆమెకు తోడుగా తన పెద్ద కొడుకుని, పదకొండేళ్ళ చిన్న కూతుర్ని ఉంచేసి, పదమూడేళ్ళ పెద్ద కూతురు షామ్లీని, తొమ్మిదేళ్ళ చిన్న కొడుకు దర్శనలాల్‌ని తీసుకుని శంకర్ తండ్రితో సహా లాహోర్ ప్రయాణమైనాడు. రైల్లో ప్రయాణం చేస్తున్నంత సేపు తండ్రి తన చిన్ననాటి విషయాలు చెప్తూనే ఉన్నాడు. అవన్నీ శంకర్ లాల్ ఎన్నోసార్లు విన్నవే అయినా తండ్రి సంతృప్తి కోసం వినసాగాడు.
“మా చిన్నప్పుడు నేనూ అన్నా ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో తెలుసా? అప్పుడు మనూరు యిప్పటిలా ఉండేదనుకున్నావా? ఎటు చూసినా పచ్చటి పంటపొలాలూ, ఏ రుతువులో చూసినా నీళ్ళతో నిండుగా కళ కళలాడే చెరువులు.. గాదెల్నిండా ధాన్యాలు.. యిప్పుడు పట్నం వెళ్ళడానికి సిమెంటు రోడ్డు ఉంది కదా.. అప్పుడు మట్టి రోడ్డే.. బడికెళ్ళాలంటే ఏడు మైళ్ళు నడిచి పట్నం వెళ్ళాల్సిందే. అన్నకు చదువంటే ఇష్టం. నాకైతే మేత కోసం బర్రెల్ని తోలుకెళ్ళి తిప్పుకు రావడంలో ఉన్న ఆసక్తి పుస్తకాల్లో ఉండేది కాదు” కిషన్‌లాల్ చెప్తూనే ఉన్నాడు.
శంకర్‌కి నిద్రొస్తోంది. ఆవులిస్తూనే పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారా అని చూశాడు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ప్రపంచంలో మునిగిపోయి ఉన్నారు. శంకర్‌కి తన కూతురు షామ్లీ అంటే చాలా యిష్టం. లక్ష్మీదేవిలా ఉంటుంది. పెద్ద కళ్ళు.. ఎంత పెద్ద జుట్టో.. తన భార్య పోలిక.. నవ్వినపుడు గులాబీ రంగు బుగ్గల్లో పడే సొట్టల్ని చూసి మురిసిపోతుంటాడు. అవకాశం దొరికినపుడల్లా “ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండు తల్లీ. నీ సొట్ట బుగ్గల అందం చూసి ఏ రాజకుమారుడో మనసు పారేసుకుంటాడు” అంటుంటాడు. అలా అన్నప్పుడల్లా ఆ పిల్ల సిగ్గు పడిపోతుంటే చూడటం అతనికి మరింత యిష్టం.
“సమయం రాత్రి పది దాటింది. పడుకోవచ్చుకదా” అన్నాడు యిద్దర్నీ ఉద్దేశించి. అదేమాట నాన్నతో అనలేడు కాబట్టి ఆయనక్కూడా అర్థమై మాటలాపి పడుకుంటాడని అతని ఉద్దేశం.
“నిద్ర రావడం లేదు నాన్నా” అంది అమ్మాయి.
“వాళ్ళకు రైల్లో ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి కదా. ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. యింక నిద్రెలా పడుంది?” వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ అన్నాడు కిషన్‌లాల్.
శంకర్ ఏదో అనే లోపల అతనికా అవకాశం యివ్వకుండా చిన్ననాటి కబుర్లు కొనసాగించాడు. “మన వూరికి దక్షిణం వైపు పెద్ద చెరువుండేది. యిప్పుడు లేదులే. ఎండిపోయింది. దాన్ని పూడ్చేసి, అక్కడ యిళ్ళు కట్టుకున్నారు. ఆ చెరువులో ఈత కొట్టడం ఎంత బావుండేదో. అన్నయ్యకు నీళ్ళలోకి దిగాలంటే భయం. ఈత నేర్పుతాను రా అని ఎంత బతిమాలినా వచ్చేవాడు కాదు. దానికి తోడు యింటికి రాగానే అమ్మకు నా పైన చాడీలు చెప్పేవాడు. ఈత కొట్టినందుకు అమ్మ తిట్టేది. కానీ చెరువులో గాలం వేసి చేపల్ని పట్టుకొచ్చినందుకు సంతోషపడేది.”
శంకర్ మరోసారి ఆవులించాడు. “నాకు నిద్రొస్తోంది నాన్నా, నేను పడుకుంటాను” అన్నాడు. నాన్న అభ్యంతరం చెప్పేలోపల కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు. కొద్దిసేపటికి నిజంగానే అతనికి నిద్ర పట్టింది. ఉదయం మెలకువ వచ్చేటప్పటికి రైలు లాహోర్ స్టేషన్లో ఉంది. వీళ్ళ కోసమని పెద్దనాన్న జట్కాబండిని పంపించాడు. “మీ అన్నకు కారుందన్నావుగా. కారు పంపించొచ్చుగా. అందుకే నేను రానంది” అన్నాడు శంకర్.
కానీ తన అన్న స్టేషన్‌కి జట్కాబండిని పంపినందుకే మురిసిపోయాడు కిషన్‌లాల్. పిల్లలక్కూడా జట్కా ఎక్కడం సరదాగా ఉంది.
దార్లో జట్కా నడిపే అతనితో కబుర్లలో పడ్డాడు కిషన్‌లాల్. అతని ద్వారా తెల్సిన సమాచారమేమంటే ఆ జట్కాబండిలోనే పిల్లలు బడికెళ్తారు. తన అన్న అతని చిన్నకొడుకు కమ్లేష్‌తో కలిసుంటున్నాడు. కమ్లేష్‌కి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు..
“మా అన్న దగ్గర ఎన్ని కార్లున్నాయి?” అని అడిగాడు కిషలాల్.
“ఒక్కటే కారుంది. చిన్నయ్య గారి కారు. పెద్దయ్య గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆఫీస్‌కి వేసుకెళ్ళడానికి వేరే కారుండేదట. దాన్ని అమ్మేశారట. కార్లో చిన్నయ్య గారు అమ్మగార్ని ఎక్కించుకుని అనార్కలీ బజార్‌కో, షాలిమార్ బగీచాకో పిల్చుకెళ్తుంటారు” అన్నాడు జట్కా నడిపేవాడు.
“మరి మా అన్న యిప్పుడు కారు నడపడా?”
“లేదయ్యా. పెద్దయ్యకు ఆరోగ్యం బాగాలేదు కదా. రెండేళ్ళ నుంచి మంచం మీదే.”
“ఏమైంది అన్నయ్యకు?” ఆందోళన పడుతూ అడిగాడు.
“పక్షవాతం.. కాలూ చెయ్యి పడిపోయాయి. మాట కూడా కష్టంగా మాట్లాడతారు.”
ఆ కబురు వినగానే కిషన్‌లాల్‌కి దుఃఖం ముంచుకొచ్చింది. ఉత్తరంలో ఆరోగ్యం బాగాలేదు అని రాశాడు తప్ప పక్షవాతం అని రాయలేదు. అతనికి చిన్నప్పుడు అన్న వింటిని విడిచిన బాణంలా వేగంగా పరుగెత్తడం గుర్తొచ్చింది. అన్నతో ఎన్నిసార్లు పందెం వేసుకుని తను ఓడిపోయాడో గుర్తొచ్చింది. ఎంతటి గొప్పవాడికైనా, ఎన్నిసార్లు నెగ్గినవాడికైనా విధి చేతిలో ఏదో ఒక రోజు ఓడిపోక తప్పదు కదా అనుకున్నాడు.
జట్కా ఓ యింటిముందు ఆగింది. అది యిల్లు కాదు.. పెద్ద భవంతి.. విశాలమైన పడక గదిలో పట్టె మంచం మీద పడుకుని ఉన్న అన్న శ్యామ్‌లాల్‌ను చూడగానే కిషన్‌లాల్‌కు ఏడుపు తన్నుకొచ్చింది. మంచానికి ఓ చివర్న కూచుని అన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. శ్యామ్‌లాల్‌కు కూడా కన్నీళ్ళు పొంగుకొచ్చాయి. ఏదో మాట్లాడాడు కానీ కిషన్‌లాల్‌కి అతనేమంటున్నాడో అర్థం కాలేదు.
శ్యామ్‌లాల్ మనవళ్ళు మనవరాళ్ళు శంకర్ యిద్దరు పిల్లలతో బాగా కలిసిపోయారు.
ఆ రోజు ఆదివారం కాకున్నా పిల్లలు స్కూల్‌కి వెళ్ళకపోతే తన పిల్లల్తో ఆడుకోడానికి స్కూల్‌కి శెలవ పెట్టారేమో అనుకున్నాడు శంకర్. మరునాడు కూడా స్కూల్ కెళ్ళే ప్రయత్నం చేయకపోతే అనుమానమొచ్చి ఆ పిల్లల్లో పెద్దవాడైన తొమ్మిదేళ్ళ కుర్రాడిని పిలిచి “స్కూల్‌కి వెళ్ళరా మీరు? శెలవలేమైనా యిచ్చారా?” అని అడిగాడు.
“అవును పెదనాన్నా. కొన్ని రోజుల వరకు స్కూల్‌కి రావొద్దని పది రోజుల క్రితమే పిల్లలందర్నీ యిళ్ళకు పంపించివేశారు” అన్నాడు.
“ఎందుకు? మీ స్కూల్లో ఏమైనా మరమ్మత్తులు జరుగుతున్నాయా?”
“లేదు. మా స్కూలే కాదు.. యిక్కడి స్కూళ్ళూ కాలేజీలూ అన్నీ మూసేశారు.”
(ఇంకా ఉంది)