రెండు ఆకాశాల మధ్య-7

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”ఎం[/dropcap]దుకు?”

“ఏమో నాకు తెలియదు” అంటూ వాడు మిగతా పిల్లలో ఆడుకోడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

పెదనాన్నను అడిగాడు కానీ అతనేం చెప్తున్నాడో అర్థం కాలేదు. మరదల్ని అడిగితే “నాకంతగా వివరాలు తెలియవు. ఏవో గొడవలు జరిగే అవకాశం ఉందని అందరూ భయపడున్నారు. మీరు మీ తమ్ముడు ఆఫీస్ నుంచి వచ్చాక అడగండి” అంది.

సాయంత్రం కమ్లేష్ ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం, “ఎందుకు యిక్కడి స్కూళ్ళన్నీ మూసేశారు?” అని అడిగాడు.

“మన దేశాన్ని రెండుగా చీల్చబోతున్నారుగా బ్రిటీషర్లు.. ముస్లింలకు ప్రత్యేకమైన దేశం కావాలని మహ్మదాలీ జిన్నా చిరకాల కోరిక. అందుకే దేశాన్ని హిందూస్తాన్‌గా, పాకిస్తాన్‌గా త్వరలోనే విభజిస్తారని వార్తలొస్తున్నాయి” అన్నాడు కమ్లేష్.

డోగ్రా జాతికి చెందిన మహారాజా హరిసింగ్ పాలించే జమ్మూ కాశ్మీర్ రాజ్యంలోని ఓ చిన్న పల్లెటూరిలో నివాసముంటున్న శంకర్ లాల్‌కి ఈ విషయాలేమీ తెలియవు. తెలిసే అవకాశం కూడా లేదు. అప్పటికి జోరాఫాం అనే పల్లెటూరికి భారతదేశంతో ఏ రకమైన సంబంధమూ లేదు.

“నాకో విషయం అర్థం కావడం లేదు. రెండు దేశాలుగా విడిపోవడానికి స్కూళ్ళకు శెలవలీయడానికి సంబంధం ఏమిటి?” అని శంకర్ అడిగాడు.

కమ్లేష్ ఉదాసీనంగా మారిపోయాడు. “అదే మా దురదృష్టం. దేశాన్ని రెండుగా విభజించినా, ముస్లింలైనా హిందువులైనా వాళ్ళకిష్టమైన చోట ఉండొచ్చని నాయకులు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్‌లో నివాసముంటున్న హిందువులందర్నీ ఇండియాకు తరిమేయాలనీ, ఇండియాలో ఉన్న ముస్లింలందర్నీ పాకిస్తాను తరిమేయాలనే కుట్ర లోపల్లోపల జరుగుతోంది.”

“అదేమిటి? పెదనాన్న ఎన్నో యేళ్ళనుంచి ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకుని ఉంటున్నాడు కదా. లాహోర్‌ని పాకిస్తాన్‌లో భాగం చేసినా మిమ్మల్ని వెళ్ళిపొమ్మనడం అన్యాయం కదా.”

“అదే మా బాధ కూడా. నేను పుట్టి పెరిగిన వూరు లాహోర్. నాన్నకే కాదు నాక్కూడా చాలా యిష్టమైన వూరు. ఈ మోడల్ టౌన్‍లో కట్టుకున్న ఈ ఇల్లంటే నాకు ప్రాణం. యిక్కడి ముస్లింలందరూ నాతోనూ నాన్నతోనూ చాలా సఖ్యతగా ఉంటారు. యివన్నీ వదిలేసి ఇండియాకి వెళ్ళిపొమ్మంటే ఎక్కడికని వెళ్తాం? అక్కడెలా బతుకుతాం?” దిగులుగా అన్నాడు.

“వెళ్ళకపోతే ఎవరేం చేస్తారు?”

“బలవంతంగా వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. కొన్ని చోట్ల హిందూ ముస్లింలు ఒకర్ని మరొకరు పొడుచుకుంటున్నారనీ, వేరే మతస్థుల యిళ్ళనీ, వ్యాపార సముదాయాల్ని కాల్చేస్తున్నారని కూడా పుకార్లు వస్తున్నాయి. అందుకే పిల్లల ప్రాణాలకు హాని ఉందని తలచి యిక్కడి స్కూళ్ళు కాలేజీలు మూసేశారు.”

శంకర్ లాల్‌కి భయమేసింది. పచ్చగా, ప్రశాంతంగా ఉండే తమ గ్రామంలో ఏదో ఉన్నది తిని పడుకోక అనవసరంగా వచ్చి పులినోట్లో యిరుక్కున్నానా అనుకున్నాడు. అతనికి తనతో పాటు పిల్చుకొచ్చిన తన యిద్దరు పిల్లలు గుర్తొచ్చి మరింత భయమేసింది.

“ఈ యింటి చుట్టుపక్కలంతా ముస్లింలేగా తమ్ముడూ. మన మీద దాడిచేస్తే మన గతేమిటి?” అన్నాడు. అతని గొంతు భయంతో వణకటం స్పష్టంగా తెలుస్తోంది.

కమ్లేష్ సాలోచనగా తల పంకించాడు. “అలా చేస్తారని నేననుకోను. ఎన్నో యేళ్ళ నుంచి సఖ్యతగా ఉన్న కుటుంబాలు మావి.”

“ఒకవేళ అలా జరిగితే?”

“నాన్న పన్నులు వసూలు చేసే శాఖలో పని చేస్తున్నప్పుడే లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసుకున్నాడు. ఎవరైనా మన యింటి మీదికి వస్తే కాల్చిపడేస్తాను.”

“అసలిదంతా దేనికి? నువ్వు పెదనాన్ననీ నీ కుటుంబాన్ని తీసుకుని ఇండియాలో హిందువులు ఎక్కువగా ఉండే ఏదో ఓ వూరికి వెళ్ళిపోయి ఉండొచ్చుగా.”

“నువ్వు కూడా నా భార్య అన్నట్టే అంటున్నావన్నా. ఐనా మేమెందుకు పారిపోవాలి? ఏం తప్పు చేశామని ఇక్కడి ఆస్తుల్నీ, ఆప్తుల్నీ వదిలి వేరే చోటికి వెళ్ళాలి? మా నాన్నా నేనూ ఇక్కడి ప్రజల సంక్షేమం కోసమేగా యిన్నాళ్ళూ పాటుపడ్డాం. మేమెప్పుడూ హిందూ ముస్లిం అనే వేర్పాటు భావననే మనసులోకి రానీయకుండా మా బాధ్యతల్ని నిర్వర్తించాం కదా. ఒకవేళ లాహోర్‌ని పాకిస్తాన్ దేశంలో భాగం చేస్తే మేము పాకిస్తాన్‌లోనే ఉండిపోతాం” అన్నాడు ఆవేశంగా.

అప్పుడే వాళ్ళిద్దరి కోసం చాయ్ తెచ్చిచ్చిన అతని భార్య “నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను బావగారూ.. యిక్కడినుంచి వెళ్ళిపోదామని. ఈయన వింటేగా. తనకు తెల్సిన లాహోర్ తప్ప భారతదేశం లోని ఏ ప్రదేశమైనా తనకు పరాయిగానే కన్పిస్తుందట. మనం అనుకున్నట్టు ఇక్కడి ముస్లింలు కూడా అనుకోవాలిగా. ఈ మధ్య వాళ్ళను చూస్తేనే భయమేస్తోంది” అంది.

“ఎందుకూ భయం? మనకు కుడి వైపున్న యింట్లో ఉండే జలీల్ ఖాన్ కుటుంబం నిన్నెంత ఆప్యాయంగా చూసుకుంటుందో.. అతను తన స్వంత చెల్లెలికన్నా నిన్నే ఎక్కువగా ఆదరిస్తాడన్న విషయం మర్చిపోయావా? మనకు ఎడం వైపున్న హవేలీలో ఉండే జబ్బార్ ఖాన్‌కి నాన్నంటే ఎంత గౌరవమో తెల్సుగా. అతను నాన్న దగ్గరేగా అసిస్టెంట్‌గా ఎన్నేళ్ళో పని చేశాడు. రంజాన్‌కి, బక్రీద్‌కి మనకు బిర్యానీ తిన్పించకుండా వాళ్ళెప్పుడైనా మెతుకు ముట్టారా?” అన్నాడు కమ్లేష్.

ఆమె అతని వైపు నిరసనగా చూసి “ఎవరి చాదస్తాలు వాళ్ళవి. నా మాటెందుకు వింటారు?” అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

రాత్రి ఎనిమిదింటికి వంటవాడు కిశోరీలాల్ హాల్లోకొచ్చి “భోజనం తయారుగా ఉంది. వడ్డించమంటారా?” అని కమ్లేష్‌ని అడిగాడు.

“వడ్డించు. వస్తున్నాం.. పిల్లలందర్నీ పిలిచి డైనింగ్ టేబుల్ దగ్గర కూచోబెట్టే బాధ్యత నీదే. ఆటల్లో పడితే వాళ్ళకు ఆకలి గుర్తుండదు. యింతకూ నాన్నగారికి అన్నం తిన్పించారా?” అన్నాడు.

“పెద్దమ్మగారు తిన్పించారయ్యా” అని అతను వెనక్కితిరిగి వెళ్తున్నప్పుడు కమ్లేష్ శంకర్‌తో అన్నాడు. “మా కిశోరీలాల్ చాలా నమ్మకస్తుడు. నాకు వూహ తెలిసినప్పటినుంచి మా యింట్లోనే ఉన్నాడు. వంట ఎంత రుచిగా శుచిగా చేస్తాడో నువ్వు చూశావుగా.”

చాలా మృదువుగా, గౌరవంగా మాట్లాడే కిశోరీలాల్‌ని చూసిన మొదటి రోజే శంకర్‌కి అతనంటే యిష్టం ఏర్పడింది. వయసు యాభైకి దగ్గరగా ఉంటుంది. “మరి అతని కుటుంబం?” అని అడిగాడు.

“పెళ్ళి చేసుకోలేదు. ఆంజనేయ స్వామి భక్తుడు. బ్రహ్మచారిగానే ఉండిపోయాడు” భోజనానికి లేస్తూ అన్నాడు కమేష్.

దాదాపు పదిమంది ఒకేసారి కూచుని తినగల పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ పిల్లల పాటు కమ్లేష్, అతని భార్య, శంకర్‌లాల్, కిషన్‍లాల్ కూచున్నారు. కమ్లేష్ వాళ్ళమ్మ తన భర్తకు అన్నం తిన్పించాక తను కూడా అదే గదిలో కూచుని భోజనం చేసేస్తుంది.

కిశోరీలాల్ కొసరికొసరి వడ్డిస్తున్నాడు.

పిల్లలు తిండి మీద కన్నా కబుర్ల మీద, నవ్వుకోవడాల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో కమ్లేష్ వాళ్ళని నిశ్శబ్దంగా భోంచేయమంటూ మందలించాడు.

సంభాషణ మళ్ళా మెల్లమెల్లగా పెరుగుతోన్న ఉద్రికత్తల మీదకి, మతం పేరుతో మనుషుల్లో చెలరేగుతున్న ఉన్మాదం మీదకి మళ్ళింది.

“అసలు మతప్రాతిపదికగా దేశాన్ని విడగొట్టడమే తప్పు. మా వూళ్లో నాకో ప్రాణ స్నేహితుడున్నాడు. ఫక్రుద్దీన్. ఏ మతం వాడైనా మనిషేగా. అందరూ కలిసికట్టుగా ఉంటేనేగా బలం. యిలా విడిపోతే బలహీనపడిపోమా?” అన్నాడు శంకర్.

“యిదంతా పదవి కోసం జిన్నా పన్నిన పన్నాగం అన్నా” అన్నాడు కమ్లేష్.

“జిన్నాకు మత ఛాందసం ఎక్కువనుకుంటాను” అన్నాడు కిషలాల్.

కమ్లేష్ పెద్దగా నవ్వాడు. “అతనికి ఇస్లాం మతమంటే మక్కువేమీ లేదు బాబాయ్. అతనసలు మత వాది కాడు, లౌకిక వాది. అతను నమాజ్ చదవడు. గడ్డం పెంచడు. విస్కీ తాగుతాడు. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే అతను మతాంతర వివాహం చేసుకున్నాడు. చాలా అధునాతనంగా వస్త్రధారణ చేసుకునే పార్శీ మహిళను పెళ్ళాడాడు. చెప్పాగా. ఇదంతా పదవీ కాంక్షతో చేస్తున్న పని.”

“ఒరేయ్ అబ్బాయ్. యిక్కడసలు ఉండొద్దు. అన్నావదినలకు, మీకూ క్షేమం కాదు. మన పల్లెటూరి కొచ్చేయండి. నువ్వెలా యిక్కడ పుట్టి పెరిగావో అక్కడ మీ నాన్న అలా పుట్టి పెరిగిన వూరు. నీ తాతగారి వూరు. అక్కడే యిల్లు కట్టుకుని హాయిగా ఉండొచ్చు. పాకిస్తానా హిందూస్తానా అనే గొడవే ఉండదు” అన్నా డు కిషన్లల్.

‘మీ రాజు హరిసింగ్ కూడా నెహ్రూతో మంతనాలు జరుపుతున్నాడు బాబాయ్. పాకిస్తాన్‌లో కలవమని జిన్నా వత్తిడి తెస్తున్నా అతనికి మాత్రం ఇండియాతో కలిసే ఉద్దేశం ఉందని పుకార్లు విన్పిస్తున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం మౌంట్ బాటెన్‌ని చివరి గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి పంపించిందిగా, చాలా త్వరగా దేశ విభజన జరగడం, మీ జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియాలో కలిసిపోవడం ఖాయం” అన్నాడు.

ఆ మాట విన్నాక శంకర్ గానీ, కిషన్‌లాల్ గానీ చాలా సేపటి వరకు మాట్లాడలేదు. వాళ్ళ గొంతులకేదో అడ్డుపడినట్టు అన్పించింది. రాజు హరిసింగ్ పాలనలో అందరూ సంతోషంగానే ఉన్నారుగా. జమ్మూలోని గ్రామాల్లో ప్రజలైతే పాడిపంటల్తో సుభిక్షంగా ఉన్నారుగా. అలాంటప్పుడు పాకిస్తాన్‌తోనో ఇండియాతోనో కలవాల్సిన అవసరం తమ రాజుకేమొచ్చింది? అదే విషయం కమ్లేష్‌ని అడిగాడు శంకర్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here