[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]”కా[/dropcap]శ్మీర్ లోయలో పఠాన్ల దాడులు ఎక్కువైనాయి. తన రాజ్యానికి అటువంటి దాడుల నుంచి రక్షణ కావాలంటే బలమైన సైనిక సంపత్తిగల దేశంలో తన రాజ్యాన్ని కలిపేయడమే ఉత్తమం అని రాజా హరిసింగ్ అభిప్రాయం” అన్నాడు కమ్లేష్.
“ఇటువంటి పరిస్థితుల్లో మేము రాకుండా ఉంటే బావుండేదేమో తమ్ముడూ” అన్నాడు శంకర్.
“నిజమే. కానీ నాన్నగారు బాబాయిని రమ్మని ఉత్తరం రాయించే సమయానికి పరిస్థితి యింత దారుణంగా లేదు. మీకు ఉత్తరం అందిన నెల తర్వాత మీరు బయల్దేరి వచ్చారు. మీరు వస్తున్నట్టు ముందుగా ఉత్తరం రాసినా రావద్దని జవాబు రాసేవాడిని. కానీ మీరు బయల్దేరబోయే రోజే ఉత్తరం రాశారు. అది నాకు అందే సమయానికి మీరు మధ్య దారిలో ఉన్నారు. ఐనా భయపడాల్సింది ఏమీ లేదన్నయ్యా. మా యిల్లు కంచుకోటలాంటిది. ప్రహరీ దాటి లోపలికి ఎవ్వరూ రాలేరు. దానికి తోడు చుట్టుపక్కల ఉన్న ముస్లింలందరూ నా స్నేహితులూ, హితులే. నువ్వు నిశ్చింతగా ఉండు. ఎల్లుండి మిమ్మల్ని రైలెక్కించే బాధ్యత నాది” అన్నాడు కమ్లేష్.
మనసులో గుబులుగా ఉన్నా, ఈ రెండు రోజులు ఎలాగో కళ్ళు మూసుకుంటే చాలు తమ వూరికి ప్రయాణం కావొచ్చు అనుకుని స్థిమితపడ్డాడు శంకర్ లాల్.
మరునాడు సాయంత్రం కిశోరీలాల్ సరుకులు కొనడానికని పచారీ దుకాణానికి వెళ్ళాడు. కమ్లేష్, శంకర్, కిషన్ లాల్ వసారాలో కూచుని చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
పిల్లలు మేడమీద ఆడుకుంటున్నారు.
రేపు వూరెళ్ళిపోతున్నందుకు శంకర్‌కి చాలా సంతోషంగా ఉంది. అప్పటికే వాళ్ళొచ్చి నాలుగు రోజులైంది. తను భయపడినట్టు అవాంఛిత సంఘటనలేమీ జరగలేదు. అతనికి తమ పల్లెటూరు బాగా గుర్తొస్తోంది. వూళ్లో వదిలేసి వచ్చిన భార్యా పిల్లలు కూడా గుర్తుకొస్తున్నారు.
చాయ్ తాగడం అయ్యాక “నేనెళ్ళి అన్న దగ్గర కొద్దిసేపు కూచుని వస్తాను” అంటూ కిషన్ లాల్ తన అన్న ఉండే పడగ్గదిలోకి వెళ్ళిపోయాడు.
యిన్నేళ్ళుగా రాకపోకలు లేకున్నా కమ్లేష్, అతని భార్య చూపించిన ఆప్యాయత శంకర్‌ని ముగ్ధుణ్ణి చేసింది. “పిల్లలకు శెలవలున్నప్పుడు మరదల్ని తీసుకుని మా వూరొచ్చి నాలుగు రోజులుండిపో తమ్ముడూ. మా వూరు చాలా అందంగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది” అన్నాడు.
కమ్లేష్ నవ్వి “యిక్కడ పట్నవాసం అలవాటైనాక పల్లెల్లో ఉండలేంలే అన్నయ్యా. మా పిల్లలక్కూడా పల్లెటూర్లలో ఏం తోచదు” అన్నాడు.
నిజమేనేమో అన్పించింది శంకర్‌కి. యింత పెద్ద పట్నంలో అతనికి వూపిరాడటం లేదు. ఎటు చూసినా గుంపులుగా మనుషులు, రణగొణ ధ్వనులు.. పల్లెటూర్లలో ఉండే ప్రశాంతత అలవాటైన తనలాంటి వాళ్ళకు పట్టణ వాతావరణం నచ్చనట్టే వీళ్ళకు పల్లెటూర్లు నచ్చవేమో అనుకున్నాడు.
ప్రహరీ గేటు మీద ఎవరో దబ్బున పడినట్టు శబ్దం రావడంతో అతను ఆలోచనల్లోంచి బైటపడి గేట్ వైపు చూశాడు. కమ్లేష్ కూడా అప్రమత్తమై ‘ఏంటా శబ్దం?’ అనుకుంటూ లేచి నిలబడ్డాడు. అతను మెట్లు దిగి గేట్ వైపుకు నాలుగడుగులు వేసి, మెల్లగా గేటు తెర్చుకుంటూ ఉండటంతో అక్కడే నిలబడిపోయాడు.
ఎడం చేత్తో పొట్ట దగ్గర పట్టుకుని, కుడిచేత్తో గేటక్కున్న ఓ వైపు తలుపుని తోసుకుంటూ లోపలికి వచ్చిన కిశోరీలాల్ కమ్లేష్‍ని చూడగానే “చిన్నయ్యగారూ” అంటూ ముందుకు తూలి అతని కాళ్ళ దగ్గర పడిపోయాడు. అతని పొట్టలోంచి రక్తం కారుతోంది. చేతులు రెండూ రక్తంతో తడిచిపోయి ఉన్నాయి.
కమ్లేష్ అతని భుజం పట్టుకుని లేపడాడనికి ప్రయత్నిస్తూ “ఏమైంది కిశోరీలాల్” అని అడిగాడు. అప్పటికి శంకర్ కూడా మెట్లు దిగి, అతన్ని మరో వైపు పట్టుకుని పైకి లేపాడు.
“పచారీ దుకాణంలో సరుకులు కొంటుంటే ఓ ముసల్మాన్ నా పక్కకొచ్చి నీ పేరేంటి అని అడిగాడయ్యా. కిశోరీలాల్ అన్నాను. అంతే. కత్తి తీసి పొట్టలో పొడిచాడయ్యా. బజార్లో కన్పించిన హిందువునల్లా కత్తుల్తో నరుకుతున్నారయ్యా. పచారీ షాప్‌ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. నా కళ్ళముందే పచారీ షాపతన్ని ఆ మంటల్లోకి నెట్టి నిలువునా కాల్చేశారయ్యా” బాధతో విలవిల్లాడుతూనే ఓపిక తెచ్చుకుని చెప్పాడు.
కిశోరీలాల్‌ని వసారాలో పడుకోబెట్టి “మొదట రక్తం పోకుండా కట్టుకడ్తానుండు. తర్వాత ఆస్పత్రికి పిల్చుకెళ్తాను” అంటూ కమ్లేష్ యింట్లోకి వెళ్ళబోయాడు.
కిశోరీలాల్ పెద్దగా ఏడుస్తూ “వద్దయ్యా.. అంత సమయం లేదు. పఠాన్లు పొడవాటి తల్వార్లు పట్టుకుని యిటువైపుకే వస్తున్నారయ్యా. మీరెక్కడికైనా పారిపొండి. లేకపోతే అందర్నీ చంపేస్తారు” అన్నాడు.
కమ్లేష్ యింటి లోపలికి పరుగెత్తి, తాళం తెచ్చి గేటుకి వేశాడు. శంకర్ సాయంతో కిశోరీలాల్‌ని అతని పడగ్గదిలోకి పిల్చుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి గాయం మీద దూదిని పెట్టి గాజు గుడ్డతో గట్టిగా కట్టుకట్టాడు.
తన భార్యతో “నువ్వు అమ్మనూ మన పిల్లల్ని తీసుకుని మేడమీద గదిలోకెళ్ళి తలుపేసుకో. ఎవరు పిలిచినా తలుపు తీయకు” అన్నాడు.
శంకర్ వైపు తిరిగి “నాన్న పడుకుని ఉన్న గదిలో పైన అటక ఉంది. అటక మీద పాత పరుపులన్నీ చుట్టిపెట్టి ఉన్నాయి. నువ్వు బాబాయిని, నీ పిల్లల్ని తీసుకుని వాటి వెనక దాక్కో” అన్నాడు.
“నేను అన్న కోసమే వచ్చాను. అన్నను ఒంటరిగా వదిలి నేను దాక్కోను. అన్న దగ్గరే కూచుంటాను” అన్నాడు కిషన్ లాల్.
‘నాన్నకేమీ పర్లేదు బాబాయ్. నేను గది బైట కాపలాగా ఉంటాగా” అని కమ్లేష్ ఎంత చెప్పినా అతను విన్లేదు.
“సరే. సమయం లేదు. తొందరగా వెళ్ళి తలుపేసుకుని కూచోండి” అన్నాడు కమ్లేష్. అతని చేతిలో ఉన్న రివాల్వర్ మేగజిన్‍ని విప్పదీసి బుల్లెట్లు చూసుకుని మళ్ళా మేగజిన్ మూసి, వసారాలో ఉన్న కుర్చీని గేట్‌కి అభిముఖంగా వేసుకుని కూచున్నాడు.
శంకర్ తన కూతురు షామ్లీని, కొడుకు దర్శనలాల్‌ని మొదట అటకమీదికి ఎక్కించి వాళ్ళు కనబడకుండా చుట్టగా చుట్టి ఉన్న పాత పరుపుల్ని అడ్డుపెట్టి తను కూడా ఎక్కి వాటి చాటున పడుకున్నాడు.
కిషన్ లాల్ గదిలోపల్నుంచి గడియ పెట్టుకుని, తన అన్న మంచం మీద కూచుని ‘నేనున్నాను. భయపడకు’ అనేలా అన్న మీద చేయివేశాడు.
గేటుకవతల మనుషులు గుమికూడుతున్న శబ్దం విన్పడగానే కమ్లేష్ అప్రమత్తమైనాడు. రివాల్వర్‌ని గట్టిగా పట్టుకుని ట్రిగ్గర్ మీద వేలుంచి, సేఫ్టీలాక్‌ని తెరిచాడు. బైట ఎంతమందున్నారో తెలియటం లేదు. లోపలికి ఎలా వస్తారు? గేటు బద్దలు కొట్టి వస్తారా లేక ప్రహరీ గోడెక్కి కిందికి దూకుతారా? ఒకవేళ యాభయ్యో వందో మంది ఉంటే తనేం చేయగలడు? తన చేతిలో ఉన్న రివాల్వర్తో ఎంతమందిని చంపగలడు? వాళ్ళలో ఒక్కర్నో ఇద్దర్నో చంపాక, వాళ్ళు తనను చంపకుండా వదుల్తారా? తన కుటుంబ సభ్యుల్ని చంపకుండా వదుల్తారా?
గేటుని బలవంతంగా తెరిచి అందరూ గుంపుగా వస్తేనే ఎక్కువ ప్రమాదమనిపించింది. అలా కాకుండా ప్రహరీ ఎక్కడానికి ప్రయత్నిస్తే, వాళ్ళలో కొంతమందిని కాలిస్తే చాలు.. ప్రాణ భయంతో గుంపు చెల్లా చెదురయ్యే అవకాశం ఉంది. వాళ్ళు మళ్ళా తిరిగొచ్చే వ్యవధిలో తను తన కుటుంబాన్ని తీసుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు.
యిలా ఆలోచిస్తున్న కమ్లేష్‌కి దుండగులు ఆడవాళ్ళని వివస్త్రలని చేసి నడిపిస్తున్నారనీ, మానభంగాలు చేస్తున్నారనీ, పసిపిల్లల్ని కూడా వదలడం లేదని విన్న పుకార్లు గుర్తొచ్చి శరీరం చలిజ్వరం వచ్చినట్టు వణికింది. యింట్లో ఉన్న బాబాయి కూతురు షామ్లీ, పన్నెండేళ్ళు పదేళ్ళ వయసున్న తన ఇద్దరు కూతుర్లు, తన భార్య, అమ్మ.. వీళ్ళ గతేమిటి?
గేటును ఎవరో బైటి నుంచి తోశారు. తెర్చుకోకపోయేటప్పటికి బలంగా తోస్తున్నారు.
కమ్లేష్ వంట గదిలోకి పరుగెత్తాడు. మూలన పెట్టి ఉన్న కిరోసిన్ డబ్బా కన్పించింది. సగానికి పైగా కిరోసిన్ మిగిలే ఉంది. దాన్ని పట్టుకుని మెట్ల మీదకి పరుగెత్తి అమ్మా వాళ్ళు దాక్కుని ఉన్న గది తలుపుల్ని గట్టిగా కొడ్తూ “అమ్మా.. నేనే.. ఒక్కసారి తలుపు తీయి” అన్నాడు.
వెంటనే తలుపు తెర్చుకుంది. ఆమె కళ్ళలో భయం.. కమ్లేష్ కిరోసిన్ డబ్బాతో పాటు అగ్గిపెట్టెని ఆమె కందించి “దుండగులు మీ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికొస్తే ఏం చేయాలో తెల్సుగా.. ప్రాణం పోయినా పర్వాలేదు. వాళ్ళ చేతులకు మాత్రం చిక్కకూడదు” అనేసి మళ్ళా కిందికి పరుగెత్తాడు. ఆమె వెంటనే లోపలికెళ్ళి తలుపేసుకుంది.
“నాన్న కిరోసిన్ డబ్బా ఎందుకు తెచ్చిచ్చాడు నానమ్మా” వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుని గదిలో ఓ మూలన కూచుని ఉన్న కమ్లేష్ పెద్ద కూతురు అడిగింది.
ఆ పిల్లకు నానమ్మ నుంచి సమాధానం రాకపోవడంతో యింకేదో అడగబోయింది. వాళ్ళమ్మ “ష్.. శబ్దం చేయకూడదు” అనడంతో గమ్మునుండిపోయింది.
గేట్ బలంగా ఉండటంతో ఎంత గట్టిగా దాన్ని బాదుతున్నా అది తెర్చుకోవడం లేదు. గుంపులోంచి యిద్దర్ని పైకెత్తి ప్రహరీ గోడ ఎక్కించారు. వాళ్ళు గోడ దూకేలోపల కమ్లేష్ రెండుసార్లు రివాల్వర్ పేల్చాడు. పెద్దగా అరుస్తూ ఒకడు లోపల, మరొకడు బైట పడిపోయారు. గుంపు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కొన్ని క్షణాల్లోనే గుంపులో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అందరూ కట్టకట్టుకుని గేటుమీద పడిపోయారు. గేటు వేసిన తాళం వూడి పడిపోయింది. అందరూ పెద్దగా అరుచుకుంటూ లోపలికి పరుగెత్తారు.
కళ్ళముందు అంత పెద్ద గుంపు కన్పడగానే కమ్లేష్ రివాల్వర్ పేల్చడం మర్చిపోయి శిలా ప్రతిమలా నిలబడిపోయాడు. అందరి చేతుల్లో పొడవాటి తల్వార్లున్నాయి. ఆ గుంపులో తమ యింటి పక్కనుండే జలీల్ ఖాన్, జబ్బార్ ఖాన్లు కూడా ఉండటంతో కమ్లేష్ షాక్‌కి లోనయ్యాడు. కానీ వెంటనే తేరుకుని గుడ్డిగా రివాల్వర్ పేల్చాడు. అప్పటికే గుంపు అతనికి సమీపంగా వచ్చేసింది. ఒకడు కత్తితో అతని గుండెల్లో పొడుస్తుండగానే మరొకడు తలను నరికేశాడు.
(ఇంకా ఉంది)