Site icon Sanchika

రెండు ఆకాశాల మధ్య-9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]శ్యా[/dropcap]మ్‌లాల్ ఉన్న గది తలుపుల్ని బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించారు. వాళ్ళ కళ్ళలో క్రూరత్వం.. చేతుల్లోని కత్తులు రక్తపిపాసతో ఎర్రగా మండుతున్నాయి. మంచం మీద అసహాయంగా పడి ఉన్న శ్యామ్‌లాల్‌ని చంపడానికి అతని దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన జబ్బార్‌ఖానే మొదట కత్తి ఎత్తాడు. కిషన్‌లాల్ అతని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ “పక్షవాతంతో బాధపడున్న మా అన్నను కనికరించి వదిలేయండి. కావాలంటే నన్ను చంపండి. మా అన్ననేమీ చేయకండి” అన్నాడు. జబ్బార్ ఖాన్ ఏదో అనేలోపల అతని పక్కనున్న ముస్లిం తన తల్వార్తో కిషన్‌లాల్ గుండెల్ని చీల్చాడు.

అతి దయనీయంగా కన్పిస్తున్న శ్యామ్‌లాల్ వైపు చూస్తూ “ముఝే మాఫ్ కరనా సర్‍జీ” కత్తిని పైకెత్తి నరకబోతూ అన్నాడు జబ్బార్ ఖాన్. శ్యామ్‌లాల్ గొంతులోంచి ఏవో మాటలు వెలువడ్డాయి. అతనికి పక్షవాతం వచ్చినప్పటినుంచీ తరచూ వచ్చి పల్కరించిపోతుండటంతో జబ్బార్ ఖాన్‌కి అతనేమన్నాడో అర్థమైంది. “మా తప్పేమిటి? మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? అని కదా అడుగుతున్నారు. మీరు హిందువులు కావడమే మీ తప్పు సర్‌జీ. మేము తలపెట్టిన ఈ మారణహోమంలో మాకు తరతమ భేదాలు లేవు. మీ దగ్గర అసిస్టెంట్‌గా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. నా పై అధికారిగా మీరంటే గౌరవం ఉండేది. కానీ మీరు హిందువు కాబట్టి ఇప్పుడు నాకు శత్రువు. మిమ్మల్ని చంపక తప్పదు. నన్ను క్షమించండి” అన్నాడు.

“పది రోజుల క్రితం నువ్వు నీ భార్యతో సహా వచ్చి నన్ను పరామర్శించినప్పుడు కూడా నేను హిందువునే. అప్పుడు లేని శత్రుత్వం ఇప్పుడెక్కడ నుంచి వచ్చింది?” మాటల్ని కూడబలుక్కుంటూ అన్నాడు శ్యామ్‌లాల్.

“ఢిల్లీలో మా ముస్లింలని మీ హిందువులు వూచకోత కోస్తున్నారని వార్తలొస్తున్నాయి. జలంధర్‌లో ఎన్నో యేళ్ళుగా నివశిస్తున్న ముస్లిం కుటుంబాల్ని సిక్కులు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. ముక్కుపచ్చలారని మా ముస్లిం ఆడపిల్లల్ని బైటికీడ్చి మానభంగం చేస్తున్నారు. మా వాళ్ళ యిళ్ళని తగులబెడ్తున్నారు. మరి మీరు శత్రువులు కాకుండా మిత్రులెలా అవుతారు సర్‌జీ. మాది ప్రతీకార జ్వాల. యిందులో హిందువులంతా మాడి మసికాక తప్పదు” అన్నాడు జబ్బార్ ఖాన్.

“వీడితో మాటలేమిటి? సమయం వృథా. చంపేయి జబ్బార్ భాయ్” గుంపులోంచి ఎవరో అన్నారు.

“ఎంతయినా కొన్నాళ్ళు నా బాస్ కదా.. ఎందుకు చంపుతున్నామో చెప్పి చంపడం భావ్యమని తలచి..” అంటూనే జబ్బార్ ఖాన్ తన తల్వార్తో శ్యామ్‌లాల్ గుండెల్లో పొడిచాడు.

అటకమీద దాక్కుని ఉన్న శంకర్ తన తండ్రి చావు కేక విన్నప్పుడే భయంతో బిగుసుకుపోయాడు. పెదనాన్న గొంతులోంచి వచ్చిన చివరి శబ్దం వినగానే యిక తనకూ తన పిల్లలకు చావు తప్పదనుకున్నాడు. వాళ్ళు గదిలోని అంగుళం అంగుళం వెతికి గానీ బైటికెళ్ళరని అతనికర్థమైంది. అటక మీదున్న పరుపులు కిందికి లాగితే చాలు తాము ముగ్గురూ కన్పించడం తథ్యం.. వాళ్ళ కత్తులకు బలి కావడం తథ్యం అనుకోగానే తన యిద్దరు పిల్లల్ని మరింతగా హత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.

“ఆడవాళ్ళూ పిల్లలూ ఎక్కడ దాక్కున్నారో” అన్నాడు గుంపులోంచి మరొకడు.

“పైన మరో పడగ్గది ఉంది. పదండి వెళ్లాం” అన్నాడు జలీల్ ఖాన్.

ఆ మాటలు వినగానే శంకర్‌లాల్‌కి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. గుంపు ఆ గదిలోంచి బైటికెళ్తున్న శబ్దం విన్పిస్తున్నంత సేపు వూపిరి బిగపట్టుకుని ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారని రూఢి చేసుకున్నాక, తన యిద్దరు పిల్లల్ని కౌగిలించుకుని నిశ్శబ్దంగా కన్నీళ్ళు కార్చాడు.

మత ఘర్షణల సమయంలోనో, మూకదాడులప్పుడో పాత పగలు, కక్షలు ఏమైనా ఉంటే తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. దాడుల్తో పాటు మానభంగాలు కూడా జరుగుతుంటే, మనసులో ఎన్నాళ్ళనుంచో రహస్యంగా దాచుకున్న కోరికలు పడగలు విప్పి బుసలు కొడ్తాయి. జలీల్ ఖాన్‌కి ఎప్పటినుంచో కమ్లేష్ భార్య మీద కోరిక.. ఆమె చాలా అందంగా ఉంటుంది. నాజూగ్గా, అధునాతనంగా ఉంటుంది. పైకి బహెన్‌జీ అంటున్నా లోపల మాత్రం కామంతో రగిలిపోయేవాడు. శ్యామ్‍లాల్ వాళ్ళ యింటిమీదకి దాడికి వెళ్తున్నారని తెలియగానే అతను కత్తి పట్టుకుని బయల్దేరినా అతని మనసులో మాత్రం కమ్లేష్ భార్యని చెరపట్టాలన్న కోరికే ఎక్కువగా ఉంది.

మొదటి అంతస్తులోని పడక గది దగ్గరకొచ్చి తలుపు నెట్టి చూశారు. లోపల్నుంచి గడియ పెట్టి ఉందని అర్థమై “బహెన్ జీ.. బైటికి రండి. మీ భయ్యాను నేనొచ్చాను. నాతో పాటు జబ్బార్ భాయ్ కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు” అన్నాడు జలీల్ ఖాన్.

కమ్లేష్ భార్య తన అత్త వైపు చూసి మంద్రస్వరంతో “అత్తమ్మా.. వచ్చిన వాళ్ళలో జలీల్ భయ్యాతో పాటు జబ్బార్ గారు కూడా ఉన్నారు. మనకు రక్షణ కల్పిస్తారు. తలుపు తీయడం మంచిది” అంది.

“వద్దు. ఈ సమయంలో ఎవ్వర్నీ నమ్మడం మంచిది కాదు. వాళ్ళిద్దరూ మనకు రక్షణగా వచ్చినట్లయితే కమ్లేష్ రివాల్వర్ని మూడుసార్లు ఎందుకు పేలుస్తాడు? వాళ్ళు కింది గదిలో ఉన్న వాళ్ళందర్నీ చంపి మన దగ్గరకు వచ్చారు. తలుపు తీయొద్దు” అంది కమ్లేష్ వాళ్ళమ్మ.

“తొందరగా బైటికి రండి. లేకపోతే వీళ్ళందరూ తలుపులు పగులకొట్టి లోపలికి వచ్చేస్తారు. అప్పుడు నేనేమీ సాయం చేయలేను” అన్నాడు జలీల్ ఖాన్.

“తలుపు తీస్తే మీరు మమ్మల్ని చంపుతారని తెలుసు. మేము తీయం” అంది కమ్లేష్ వాళ్ళమ్మ.

“మాజీ. మీరు తలుపు తీయకపోతేనే అందర్నీ చంపేస్తారు. మీరు బైటికొస్తే మీ ప్రాణాలకు హాని జరక్కుండా నేను చూసుకుంటాను. మీ కోడల్ని మాకప్పగించండి చాలు” అన్నాడు జలీల్ ఖాన్.

కమ్లేష్ వాళ్ళమ్మ తన కోడలితో “చూశావా వాడి నిజస్వరూపం.. తుచ్ఛుడు.. నీచుడు.. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. వాళ్ళ చేతులకు మాత్రం నిన్ను చిక్కనివ్వను” అంది.

“జలంధర్లో పదేళ్ళ కన్నా తక్కువ వయసున్న మన ముస్లిం అమ్మాయిల్ని కూడా వదలకుండా మానభంగాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయిగా భాయ్. ఈ యింట్లో పన్నెండేళ్ళు, పదేళ్ళు ఉన్న యిద్దరుమ్మాయిలు ఉన్నారుగా. వాళ్ళనెలా వదుల్తాం?” మరో ముస్లిం కోపంగా ముందుకొచ్చి తలుపుని కత్తి పిడితో గట్టిగా బాదుతూ అన్నాడు.

“మొదట తలుపు తీయనీ భాయ్.. అప్పుడు ఎవర్నీ వదలొద్దు” అతనికి మాత్రమే విన్పించేలా మెల్లగా అన్నాడు జలీల్ ఖాన్.

“బతిమాలితే తలుపులు తెరుస్తారా ఎవరైనా? బద్దలు కొడదాం పదండి” అన్నాడు మరొక ముస్లిం.

ఓ పదిమంది తమ భుజాలతో బలంగా తలుపుల్ని తెరిచే ప్రయత్నం చేయసాగారు.

కమ్లేష్ వాళ్ళమ్మకి అర్థమైపోయింది. తమని కాపాడుతున్న ఆ తలుపు యింకా ఎంతో సేపు తమ మధ్యన అడ్డుగా నిలబడలేదని.

కోడలి వైపు చూసి “నువ్వు తయారుగా ఉన్నావుగా?” అని అడిగింది. ఆమె తయారుగా ఉన్నాను అనేలా తల వూపింది.

కిరోసిన్ డబ్బా మూత తెరిచి మొదట తన బట్టల పైన చల్లుకుంది. తర్వాత కోడలి మీదా పిల్లల మీదా చల్లింది. మిగిలిన కిరోసిన్న గదంతా ఒలకబోసింది.

జలీల్ ఖాన్ ముక్కు పుటాలకి కిరోసిన్ వాసన సోకింది. “వాళ్ళు ఆత్మాహుతి చేసుకోబోతున్నట్టున్నారు. తలుపుని త్వరగా బద్దలు కొట్టండి” అన్నాడు తను కూడా భుజంతో తలుపుని గట్టిగా ఢీకొంటూ.

“మనం చంపాలనుకున్నవాళ్ళు వాళ్ళకు వాళ్ళే కాల్చుకుని చచ్చిపోవడంకన్నా మనక్కావల్సింది ఏముoది?” అన్నాడు గుంపులోంచి ఒకడు.

“మన ఆడోళ్ళను మానభంగం చేస్తుంటే మనం చేతులు ముడుచుకుని కూచోవాలా? మనం కూడా హిందూ స్త్రీలని, ఆడపిల్లల్ని మానభంగం చేశాకే చంపాలి” అన్నాడు జలీల్ ఖాన్.

అతని మాటలు మరింత రెచ్వగొట్టడంతో “అవును. మనం వాళ్ళ రక్తం కళ్ళ చూసేముందు వాళ్ళ అందాల్ని రుచి చూడాల్సిందే” అన్నారు చాలా మంది.

కమ్లేష్ వాళ్ళమ్మ పన్నెండేళ్ళు, పదేళ్ళున్న తన యిద్దరు మనవరాళ్ళ వైపు, వాళ్ళకన్నా చిన్నవాళ్ళయిన యిద్దరు మనవళ్ళ వైపు జాలిగా చూసింది. వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాక, నాయనమ్మ తమ బట్టల పైన కిరోసిన్ ఎందుకు పోసిందో అర్థం కాక వాళ్ళమ్మను గట్టిగా పట్టుకుని కూచుని ఉన్నారు. ‘యింత లేత వయసులోనే మీ ప్రాణాల్ని హరిస్తున్నందుకు నన్ను క్షమించండి’ అనుకుని అగ్గిపుల్ల వెలిగించి నేల మీదవేసింది.

తలుపు బద్దలు కావడం, గదంతా నిప్పుల కొలిమిలా మారిపోవడం ఒకేసారి జరిగాయి. లోపలికెళ్ళాలనుకున్న గుంపంతా గదిలో కాలిపోతున్న మనుషుల వైపు చూసి “వేరే యింటికి వెళ్లాం పదండి” అంటూ వేగంగా మెట్లు దిగి రోడ్డు మీదికి చేరుకుంది.

అటక పైన వెల్తురు రావడానికి ఏర్పాటుచేసిన చిన్న కిటికీ ఉండడం, అది పైగది కిటికీతో సమాంతరంగా ఉండటంతో శంకర్‌లాల్‌కి కొన్ని మాటలు విన్పించాయి. కాలిపోతున్నప్పుడు తన పెద్దమ్మ, మరదలు, పిల్లలు చేసిన ఆర్తనాదాలు కూడా విన్పించాయి.

అతనికి కొన్ని క్షణాలు ఏం చేయాలో అర్థం కాలేదు. పైగదిలో మంటలు ఎలా వ్యాపించాయో తెలియడం లేదు. ఆత్మాహుతి చేసుకునే ఉద్దేశంతో పెద్దమ్మ వాళ్ళే కాల్చుకున్నారా లేక దాడిచేసిన మూకే వాళ్ళని గదిలో పెట్టి మంట పెట్టారా అనేది తెలియడం లేదు. మంటలు కిందికి కూడా వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడినుంచి తప్పుకోకపోతే తనూ తన పిల్లలు కూడా మంటల్లో కాలిపోవడం ఖాయం.

గుంపు బైటికెళ్తున్నప్పుడు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ వెళ్ళారు. కానీ అందరూ వెళ్ళిపోయారా లేక గేట్ బైట ఎవరైనా కాచుకుని ఉన్నారా అనే విషయం కూడా తెలియడం లేదు. శంకర్ మరికొంత సేపు అటక మీదే ఉండిపోయాడు. వేడి సెగ గదిలోకి రావడం మొదలైంది. దట్టమైన పొగ గది లోకి వ్యాపిస్తోంది.

ఏమైతే అదైందని కిందికి దిగి, తన యిద్దరు పిల్లల్ని కూడా దింపాడు. మంచం మీద తన తండ్రి శవం. దాని పక్కనే తన పెదనాన్న శవం.. కిశోరీలాల్‌ని కూడా తమతో పాటు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో అతని గదిలోకెళ్ళి చూశాడు. మంచం మీద కిశోరీలాల్ శవం కన్పించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version