Site icon Sanchika

రెండు సినిమాలు – ఒక విశ్లేషణ

[dropcap]ఫే[/dropcap]స్‌బుక్ తెరిస్తే చాలు ‘రంగమార్తాండ’ అన్న సినిమాను పొగడ్తున్న పోస్టులు కనబడుతూంటే ఆ సినిమా గురించి ఆసక్తి కలిగింది. అయితే, తెలుగు సినిమాకు మాతృక మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ అనీ, ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫారం అయిన అమేజాన్ ప్రైమ్‌లో వుందని తెలిసింది. వెంటనే వీలు చూసుకుని మరాఠీ సినిమాను చూశాను. నానాపాటేకర్ తనకలవాటయిన రీతిలో వీలయినంత ఓవర్ యాక్షన్ చేశాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా అనిపించాయి. అయితే, స్క్రీన్ ప్లేలో పెద్ద లోపం సినిమాలో సంభాషణలు సంఘటనలను డామినేట్ చేయటం. సాధారణంగా కొత్తగా కథలు రాస్తున్నవారికి ఒక సలహా ఇస్తారు. కథలో ఉపన్యాసాలుండకూడదు. చెప్పదలచుకున్నది కథలో చొప్పించినట్టు ఉపన్యాసాల రూపంలోవుంటే కథనం దెబ్బతింటుంది. కాబట్టి చెప్పాల్సినదాన్ని సంఘటనలలో చెప్పాలి అని సలహాలిస్తారు. ఈ సలహా ‘నటసామ్రాట్’ దర్శకుడికీ వర్తిస్తుంది. ఎంత నాటకానికి సంబంధించిన సినిమా అయినా అతి సంభాషణలు సినిమాని దెబ్బతీశాయనిపించింది. కొన్ని దృశ్యాలలో సంభాషణలు అసహజంగా చొప్పించినట్టు అనిపించి విసుగు కలిగింది. అదీకాక, సినిమా ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. చిన్నప్పుడు చూసిన ధర్మదాత, బడిపంతులు నుంచి మొన్న మొన్నటి బాఘ్‍బన్ వరకూ, అంతకుముందరి, అవతార్, అమృత్, శంకరాభరణం వంటి అనేకానేక సినిమాలు గుర్తుకువచ్చాయి. ఏ దృశ్యం కూడా కొత్తగా అనిపించలేదు. పిల్లకు తాత చెడు నేర్పుతున్నాడన్న ఆవేదన నుంచి, డబ్బు దొంగతనం అంటగట్టటం వరకూ, ‘తాత మనవడు’తో సహా అనేకానేక సినిమాలు మనసులో మెదిలాయి. అందుకేనేమో బహుశా నాకు ‘నటసామ్రాట్’ అంతగా నచ్చలేదు.

‘నటసామ్రాట్’ చూసిన తరువాత ప్రైం వాడు, ఈ సినిమా చూశావు కాబట్టి నీకు ఈ సినిమాలూ నచ్చవచ్చు అని కొన్ని సినిమాల బొమ్మలు చూపించాడు. వాటిల్లో అన్నిటికన్నా ముందు కనిపించిన ‘బాలగంధర్వ’ అన్న సినిమా బొమ్మ ఆకర్షించింది. బాలగంధర్వ పేరు నాకు చిరపరిచితమే. నాటకాలు సమాజాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలంలో బాలగంధర్వ ఒక ప్రభంజనం. ఒక సంచలనం. ఆకాలంలో బాలగంధర్వ అంటే పురుషులే కాదు, మహిళలు కూడా వెర్రి ఆరాధనను కనబరిచేవారు. ముఖ్యంగా, మగవారే మహిళల వేషాలు వేసే ఆ కాలంలో మహిళల వేషధారణతో మహిళలను సైతం మెప్పించినవాడు బాలగంధర్వ. నటి వేషం వేసే నటుడిగా బాలగంధర్వ ప్రభావం ఎంతగా వుండేదంటే, అతడు మహిళలకు ఒక స్టైల్ ఐకాన్. అతనిలా చీరకట్టాలని, అతను కట్టినటువంటి చీరలు కట్టాలని లాహోర్ నుంచి లాతుర్ వరకూ మహిళలు తపించేవారు. అయితే, ఇదొక్కటే కాదు, బాలగంధర్వ గొప్ప సంగీత విద్వాంసుడు, గాయకుడు. ఆ కాలంలో మరాఠీ సంగీత ప్రపంచంలో ఎంతో ఖ్యాతిని గౌరవాన్ని పొందినవాడు. నాటకాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలు పాడేవాడు. ఉత్తమ గానానికి గీటురాయి బాలగంధర్వ. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సమకాలికుడు. మంచి మిత్రుడు. దీనానాథ్ మంగేష్కర్‌ను తన నాట్యమండలికి ఆహ్వానించినవాడు బాలగంధర్వ. లతా స్వరంలో గాంధారం పలుకుతుందని ప్రశంసించినవాడు బాలగంధర్వ. దీనికితోడు, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ మోహన్ కుల్‍కర్ణి రాసిన బాలగంధర్వ జీవిత చరిత్ర చదివి ఆయనను అభిమానిస్తున్నవాడిని. అందుకే ఆ సినిమావైపు ఆకర్షితుడనయ్యాను. అదీగాక, ఈ సినిమా మరాఠీ సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిందనీ, జాతీయ స్థాయి అవార్డులందుకుందనీ తెలుసు. అందుకే, ఈ సినిమా కనబడగానే, వెంటనే చూడడటం ఆరంభించాను. ఒక రెండు గంటలపాటూ ఒక అద్భుతమయిన ప్రపంచంలో విహరించి, జీవితాంతం మరచిపోలేని, మరపుకు రాని అనుభూతులను మూటకట్టుకున్నాను. మనకు ఏదైనా మంచి తెలిస్తే పదిమందికీ చెప్పాలన్న నియమాన్ని అనుసరిస్తూ, సంచిక పాఠకులకు బాలగంధర్వ సినిమాను పరిచయం చేస్తున్నాను. ఆ పరిచయంలో భాగంగా నటసామ్రాట్, బాలగంధర్వ సినిమాలూ నాటకానికి, నటుడికీ సంబంధించినవి కాబట్టి రెంటినీ పోల్చిచూసే ప్రయత్నమూ చేస్తున్నాను.

బాలగంధర్వ సినిమా ఆరంభ దృశ్యమే కట్టిపారేస్తుంది. ఒక పిల్లవాడు సంగీతం పాడుతూంటాడు. పక్కగదిలో ఏదో రాసుకుంటున్న బాల గంగాధర తిలక్ ఆ పాటవిని ముగ్ధుడయి బయటకువచ్చి పిల్లవాడిపాట ఆసాంతం వింటాడు. అతడిని బాలగంధర్వుడని అంటాడు. అప్పటినుంచీ నారాయణ్ శ్రీపాద రాజహంస్, బాలగంధర్వగా విఖ్యాతి పొందుతాడు. సంగీతనాటకాలకు ప్రసిధ్ధి పొందుతాడు. ఇక్కడినుంచీ ‘బాలగంధర్వ’ సినిమా ఆరంభమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా, ఎదిగిన తరువాత బాలగంధర్వ ఎలా నాటకాలలో నాయిక పాత్రలు వేసి ప్రజలను మెప్పించేవాడో చూపిస్తారు. నిజానికి ఎదిగిన బాలగంధర్వ మహిళలా పరిచయం ఆశ్చర్యంతో పాటూ ముగ్ధులను చేస్తుంది. నటుడు సుబోధ్ భావే అందమయిన అమ్మాయిగా మనసు దోచేస్తాడు. అంత అందమయిన అమ్మాయి మగ గొంతుతో పాడుతూంటే ఎబ్బెట్టుగా అనిపించదు. పాట మాధుర్యం సృజించిన మధుర రస స్రవంతిలో మునకలేస్తూ సర్వం మరచిపోతాం. నిజంగా ఇదొక అద్భుతమయిన అనుభవం. ఆ కాలంలోవారు నటులను నటీమణులుగా గత్యంతరం లేక పోవటంవల్ల ఆమోదించారన్న భావనతో వున్నవారికి, ఈ కాలంలోకూడా, తెరపై ఒక పురుషుడు సినిమాల్లో మనకలవాటయిన వెకిలి వేషంలా కాక, నిజంగానే మహిళ వేషం వేసి నమ్మించగలగటమే కాదు, ఒప్పించి మెప్పించటం పరమాద్భుతం అనిపిస్తుంది. సినిమా సాంతం ఈ భావన ప్రేక్షకుడిని వెన్నంటివుంటుంది. బాలగంధర్వ మామూలుగా కనిపించేదానికి, ఆడవేషం వేసే సమయంలో కనిపించేదానికి నడుమ తేడా అబ్బురపరుస్తూనే అలరిస్తుంది. నటుడిగా సుబోధ్ భావేకు విజయం ఇది. అతని ముఖం భావాలు అద్దంలా ప్రతిబింబిస్తుంది. తల్లీతండ్రి బలవంతాన పెళ్ళికి ఒప్పుకున్న బాలగంధర్వ, పెళ్ళికూతురు ముఖాన్ని చూడగానే అతని వదనంపై ప్రతిఫలించిన నిరాశ, తిరస్కృతిభావనలను అత్యద్భుతంగా ప్రదర్శిస్తాడు సుబోధ్ భావే. అక్కడినుంచీ నటుడిగా బాల గంధర్వ ఎదగటం, నాటక రంగంలోని రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలపట్ల అంత ఆసక్తిలేక, సంపాదించిన ధనాన్ని నాటకంలో మహిళ పాత్ర వేషధారణ విషయంలో రాజీ లేకుండా వెచ్చించటం, మోసపోవటం, నాటకాలలో పడి కుటుంబాన్ని విస్మరించటం, మారుతున్న పరిస్థితులకు ఎదురునిల్చి పోరాడాలని ప్రయత్నించటం, ఏది ఏమయినా, కళతో రాజీపడలేకపోవటం.. ఇలా బాలగంధర్వ జీవితంలోని ప్రధాన అంశాలను అత్యంత రమణీయంగా, ప్రతిభావంతంగా, మనసుకు హత్తుకుపోయేలా ప్రదర్శిస్తుందీ సినిమా. సినిమా చూస్తూంటే, కాస్సేపటికి సినిమా చూస్తున్న భావననను మరచిపోతాము. మారుతున్న కాలంతోపాటూ మారలేక ఎదురునిలచి వోడిపోయే పోరాటాన్ని వీరోచితంగా పోరాడిన ఒక విషాదాంత నాయకుడిని చూస్తాము.

ఈ సినిమాలో ప్రధానంగా సుబోధ్ భావే అగ్రతాంబూలం అందుకుంటాడు. మొదటి దృశ్యం నుంచి చివరి దృశ్యం వరకూ మనకు బాలగంధర్వ కనిపిస్తాడు. అత్యద్భుతమయిన హావభావాలతో, మనసుదోచే అతిసుందరమయిన మహిళగా, కుటుంబంపై ఎంత ప్రేమ వున్నా కళపై వున్న తీవ్రమైన ప్రేమవల్ల సర్వం విస్మరించే కళాకారుడిగా అనేకానేక భావనలను అవలీలగా ప్రదర్శించాడు సుబోధ్. వెండి తెరపై ఇంత పరిణత నటన ప్రదర్శన చాలా అరుదుగా చూసేందుకు లభిస్తుంది. అయితే, ప్రధానంగా స్క్రిప్ట్ లోపంవల్ల కావచ్చు, వయసెదిగిన తరువాత బాలగంధర్వ పాత్రలో సుబోధ్ నటన అంత కన్విన్సింగ్‍గా వుండదు. స్క్రిప్ట్ కూడా ఈ సంఘటనలను అంత లోతుగా ప్రదర్శించకుండా పైపైనే చూపిస్తుంది. ముఖ్యంగా సినిమాలు రంగప్రవేశం చేశాక, నాటకాలకు ఆదరణ తగ్గి వారి జీవిక ప్రమాదంలో పడిన సంఘటనలలో మానసిక సంఘర్షణల వంటివి లేకపోవటం, అంతవరకూ మహిళ వేషాలలో అలరించిన నటుడు, వయసు మళ్ళటంవల్ల అవే మహిళ వేశాలలో మెప్పించలేకపోవటం వల్ల కలిగే మానసిక వేదన వంటి అంశాలను సినిమా స్పృశించదు. అలాగే, భార్య పిల్లలను ప్రేమించే మనిషి, హఠాత్తుగా ఓ అమ్మాయి కోసం కుటుంబాన్ని వదిలివెళ్ళేందుకు కూడా బలమైన కారణం, మానసిక వేదన వంటి వాటిని సినిమా చూపకపోవటం నిరాశ కలిగించటమే కాదు, ప్రధాన పాత్ర వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తుంది. అయితే, సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి లోపాలను చూసీ చూడనట్టు వదిలేయాల్సివుంటుంది. మొత్తంగా సినిమా కలిగించే అత్యద్భుతమయిన భావన ఈ లోపాలను కప్పిపుచ్చుతుంది.

‘బాలగంధర్వ’ సినిమా స్థాయిని పెంచే అంశాలు ప్రధానంగా సెట్లు, దుస్తులు, సంగీతం. ఈ మూడూ ఈ సినిమాను పరమాద్భుతమయిన కళాఖండం స్థాయికి ఎదిగిస్తాయి. ముఖ్యంగా, సినిమాలో నాటకాల కోసం సృజించిన సెట్లు అద్భుతంగా వుండి, గొప్ప చిత్రలేఖనాలను చూస్తున్న ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. నటీనటులు దుస్తులు పరమ సుందరంగావుండి ఆయా పాత్రలను అందంగా చూపుతాయి. బాలగంధర్వ మహిళ వేషంలో కనిపించినప్పుడలా, ఆ దుస్తులు సమ్మోహనంగా వుండి, ఆ పాత్ర అందాన్ని ఇనుమడింపచేస్తాయి. విక్రం గైక్వాడ్‌కు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా, నీతా లుల్లాకు ఉత్తమ దుస్తుల రూపకర్తగా జాతీయ అవార్డులు లభించటం సమంజసమే అనిపిస్తాయి. జాతీయ అవార్డులు కూడా అప్పుడప్పుడు అర్హులకు అందుతాయన్న విశ్వాసాన్ని కలిగిస్తాయి వీరిద్దరికీ అవార్డులు లభించటం. సంగీతానికి కౌశల్ ఇనామ్దార్ కు బహుమతి రాకపోవటం నిరాశకలిగించినా, ఆనంద్ భాటేకు ఉత్తమ గాయకుడిగా జాతీయ స్థాయిలో అవార్డు లభించటం సంతృప్తినిస్తుంది. ఎందుకంటే, మొదటి దృశ్యం నుంచి చివరి దృశ్యంవరకూ సినిమాలో అంతటా తానే అయి కనిపించేవి సంగీతం గానం. సినిమాలో మొత్తం 16 పాటలున్నాయి. ఇందులో రెండు పాటలు మాత్రం సినిమా కోసం ప్రత్యేకంగా సృజించినవి. మిగతావన్నీ బాలగంధర్వ నాటకాలలో పాడిన పాటలు. ఆ పాటలను ఈ కాలంలో ఆ కాలంనాటి పాటలలా రూపొందించి, ఎలక్ట్రానిక్ వాయిద్యాలపై కాక, అప్పటి వాయిద్యాలపైనే వినిపించటంతో అత్యద్భుతమైన ఎఫెక్ట్ వస్తుంది. మనం తెరపై జరిగేవి చూస్తూ ఆ కాలాన్ని అనుభవిస్తాము. నిజంగా, నటన, సంగీతం, దుస్తులు ఆర్ట్ వంటివి సినిమా స్క్రిప్ట్ లోని లోపాలు, ఇతర నిరాశకలిగించే అంశాలను వెనక్కు నెట్టివేస్తాయి. సినిమా పూర్తయ్యేసరికి ఒక గొప్ప కళాఖండాన్ని చూసిన సంతృప్తిని కలిగిస్తాయి.

ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనబడే లోపం స్క్రిప్ట్. బాలగంధర్వ జీవిత చరిత్ర ప్రధానంశమయినా ఇతర ఏ పాత్రలుకూడా మనసుకు హత్తుకునే రీతిలో ఎదగవు. బాలగంధర్వ భార్య పాత్రను సరిగ్గా తీర్చిదిద్దివుంటే, మరో కస్తూరిబాయి స్థాయిలో ఎదిగే పాత్ర అది. గౌహర్ పాత్రతో సహా ఇతర పాత్రలేవీ సరిగ్గా ఎదగలేదు. అయితే, కొన్ని దృశ్యాలు మాత్రం ఎంత అద్భుతంగా వుంటాయంటే, మనసు వాటిని మరచిపోలేదు. పెళ్ళయిన తరువాత భార్య తనను మహిళ వేషంలో చూడాలనుకున్నప్పుడు కోపంలో గది వదలి వెళ్ళిన బాలగంధర్వ మహిళ రూపంలో రావటం అత్యద్భుతమయిన దృశ్యం. అయితే, లెస్బియన్ ఓవర్టొన్స్ వున్న ఆ దృశ్యాన్ని అంతగా పొడిగించక, మళ్ళీ ప్రస్తావించక, అనవసర వివాదాలను దూరం పెట్టారు. కానీ, ఆడవారినే మోహింపచేసే బాలగంధర్వ అందం నిజంగానే అసమానం, అద్వితీయం అనిపిస్తుంది. నిజంగా, ఆ కాలంలో ప్రజలు ఆయనంటే వెర్రి అభిమానం ఎందుకు చూపేవారో బోధపడుతుంది. బాలగంధర్వ ఎదిగిన తరువాత పరిచయం చేసిన దృశ్యం ఎదను మురిపిస్తుంది. మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆ క్షణంలో ఆ పాత్రతో కలిగిన మైత్రి, అనుభూతులు సినిమా అంతా కొనసాగుతాయి. అలాగే, పిల్లవాడు చనిపోయిన వార్త తెలిసికూడా నాటకంలో నటించే దృశ్యం సినిమాకే హైలైట్. తన చుట్టూ వున్నవారంతా కన్నీరు కారుస్తూన్నా, అన్నీ విస్మరించి పాటను తన్మయమై పాడుతున్నవాడు అద్దంలో మహిళగా తన ప్రతిబింబాన్ని చూసి, విలపిస్తున్న భార్యను గుర్తుకు తెచ్చుకుని ఆమె బాధను అర్ధంచేసుకోవటం ఒక అద్భుతమయిన దృశ్యం. సినిమా దృశ్య మాధ్యమం అనీ, వెయ్యి మాటలు అనుభవింపచేయలేనిదాన్ని ఒక దృశ్యం అద్భుతంగా అనుభవానికి తెస్తుందని దృశ్య మాధ్యమం గొప్పతనాన్ని మనసు అర్ధంచేసుకునే అతి గొప్ప దృశ్యం అది.  కానీ, మహిళ పాత్రలు వేసి మెప్పించే వ్యక్తి మామూలు జీవితంలో మానసికంగా ఎదుర్కొనే సమస్యలను సినిమా స్పృశించదు. నటులు సాధారణంగా తాము ధరించే పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. నిజానికీ, నటనకూ నడుమ తేడాలు మరచిపోతారు. ఈ సంఘర్షణను స్క్రిప్ట్ విస్మరించటం నిరాశకలిగిస్తుంది. అలాగే, సినిమాలు రంగప్రవేశం చేశాక నాటకాలపై పెరిగిన నిరాదరణ, వయసు మళ్ళటంతో స్త్రీ పాత్రతో అలరింఛకలేకపోవటం వల్ల కలిగే సంఘర్షణలను కూడా స్క్రిప్ట్ స్పృశించదు. ఈ విశయంలో దాదాఫాల్కే జీవితం ఆధారంగా రూపొందించిన హరిశ్చంద్రాచి ఫాక్టరీ బాలగంధర్వ సినిమా కన్నా మెరుగు అనిపిస్తుంది. కానీ, మహారాష్ట్ర వారికి తప్ప ఇతరులకు అంతగా పరిచయం లేని, మహారాష్ట్రలో కూడా, మూడు తరాల ముందువారికే పరిచయం వున్న వ్యక్తి జీవిత చరిత్రను సినిమాగా నిర్మించటంలో వున్న సాధకబాధకాలను స్మరిస్తే బాలగంధర్వ సినిమా గొప్పతనం మరింత స్పష్టం అవుతుంది. ఈ సినిమాలోనే దర్శకుడు వీ శాంతారాం బాల గంధర్వను సినిమాల్లో నటించేందుకు ఒప్పించే దృశ్యంలో ఒక మాటంటాడు. “నారాయణ్ రావ్, పడ్దా పడలా కి నాటక్ సంపతి. పణ చిత్రపట్ అజరామర్ అసతో” (నారాయణ్ రావ్, పరదా పడటంతోనే నాటకం పూర్తి అయిపోతుంది. కానీ, సినిమా అజరామరం. ఎప్పటికీ నిలచివుంటుంది.)

పరదా పడటంతో విస్మృతికి గురయ్యే నాటకాల ద్వారా అజరామరమయిన కీర్తి గడించిన బాలగంధర్వను ఆధునికులకు సినిమాద్వారా పరిచయంచేయటం ద్వారా ఆయనను చిరంజీవిగా నిలపాలన్న మరాఠీ కళాకారుల లక్ష్యం గొప్పది. ఈ సినిమా ద్వారా బాలగంధర్వ గంధర్వ గానాన్ని, దివ్య గంధర్వ కన్య స్వరూపాన్ని, నాటకమే నిజం, నిజమే నాటకంగా జీవించిన కళాకారుడి జీవితాన్ని నవతరానికి పరిచయంచేసి బాలగంధర్వను అమరుడిగా నిలిపింది మరాఠీ కళాకారుల ప్రతిభ.

బాలగంధర్వకు నటసామ్రాట్ అన్న బిరుదువుంది. బాలగంధర్వ సినిమా 2011లో విడుదలయింది. 2016 లో విడుదలయిన ‘నటసామ్రాట్’కు 1970లో తొలిసారిగా ప్రదర్శితమయిన నాటకం ప్రేరణ. ఈ నాటకం మరాఠీలో ఎంతగా ప్రాచుర్యం పందిందంటే, పలువురు గొప్ప గొప్ప నటులు నటసామ్రాట్ పాత్రను తమ అద్భుతమయిన నటన ప్రదర్శనతో  ప్రేక్షకులను అలరించారు. అనేక సినిమాల్లో నాటకంలోని సంఘటనలు చోటుచేసుకుని బాగా నలిగేయి. అందుకే ఆ దృశ్యాలు సినిమాలో అంతగా అలరించవు. ఎక్కడయినా కళ్ళు చెమరిస్తే అది నటీనటుల గొప్పతనం తప్ప స్క్రిప్ట్ రచయిత, దర్శకుల ప్రతిభ కాదు. నటసామ్రాట్ నాటకాన్ని తెరకెక్కించటంలో స్క్రిప్ట్ రచయిత నాటకాలలో పాత్రల అంతరంగాల సంభాషణను వినిపించే స్వగతం  పద్ధతిని సినిమాకూ వాడేడు. దాంతో, నాటకంలో అలరించిన మోనోలోగ్‌లు సినిమాలో విసుగు కలిగిస్తాయి. సినిమాలో చర్చలు కూడా విసుగును చిరాకును కలిగిస్తాయి. ముఖ్యంగా, రోడ్డు పక్కన మెట్లపై నానాపాటేకర్, మరో నటుడు కూచుని తాగుతూ నాటకాల గురించి మాట్లాడే దృశ్యాలు కథాగమనాన్ని దెబ్బతీసి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, నానా పాటేకర్ సంభాషణలను ఎంత గొప్పగా పలికినప్పటికీ, అతని మోనోలాగ్‌లు ఒక దశలో అర్థవిహీనం అనిపించి విసుగు కలిగిస్తాయి. పాత్ర మీద కలిగే సానుభూతిని దెబ్బతీస్తాయి.

‘నటసామ్రాట్’ సినిమాలో రెండు విభిన్నమైన అంశాలను కలపాలన్న విఫల ప్రయత్నం కనిపిస్తుంది. నిజానికి నాటకానికీ భేదాన్ని గ్రహించలేక, నిజంతో రాజీపడలేక, గత వైభవాన్ని మరవలేక కల్పన నిజాల సరిహద్దుల్లో కొట్టుమిట్టాడే కళాకారుడి మానసిక సంఘర్షణ ఒక అంశం. పిల్లలను నమ్మి సర్వం కోల్పోయి ఇబ్బందులు పడే తల్లితండ్రుల విషాద దుస్థితి మరో అంశం. ఈ రెండు విభిన్నమైన అంశాల మధ్య సమన్వయం సాధించటం కుదరదు. ‘నటసామ్రాట్’ సినిమాను ప్రధానంగా దెబ్బ తీసిన అంశం ఇది. ఏదో ఒకే అంశంపై సినిమా దృష్టి పెట్టివుంటే బాగుండేది.  నటసామ్రాట్ సినిమాలో ప్రధాన పాత్ర ప్రవర్తన ఎంత అనౌచిత్యంగా వుంటుందంటే, కొడుకు, కోడలు, కూతుర్ల ప్రవర్తనలు, ఒక్క దొంగతనం ఆపాదించిన విషయంలో తప్ప మిగతా అంతా సమంజసమే అనిపిస్తాయి. చిన్నపిల్లకు ద్వంద్వార్ధాల పాటకు నృత్యం  నేర్పించటం ఏ కోణంలో చూసినా సమర్ధనీయం కాదు. పార్టీకి తాగివచ్చి అల్లరిచేయటం హర్షణీయంకాదు. దాంతో, నానాపాటేకర్ పాత్రపై ఎలాంటి సానుభూతి కలగదు.   ఈ విషయంలోనే ‘బాలగంధర్వ’ సినిమా ‘నటసామ్రాట్’ పై విజయం సాధిస్తుంది. బాలగంధర్వ స్క్రిప్ట్ లోనూ లోపాలున్నా, సినిమా ఫోకస్డ్‌గా సాగుతుంది. సినిమా నడకను తప్పుదారి పట్టించే అంశాలు ఎంత ప్రాధాన్యమైనవయినా స్క్రిప్ట్ వాటిని విస్మరించింది. బాలగంధర్వ ధనాన్ని లెక్కచేయకపోవటం అతని స్వభావం అన్నది చక్కగా బోధపడుతుంది. అప్పుల్లోవుంటే అందరూ చందాలు వేసుకుంటామంటే వొద్దన్న ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పాత్ర వ్యక్తిత్వాన్ని పెంఛుతాయి.  దాంతో, ప్రేక్షకుడి దృష్టి బాలగంధర్వవైపే   కేంద్రీకృతమై వుంటుంది. ఆ కాలం నాటి పరిస్థితులు, మనస్తత్వాలు, నాటకాలలో రాజకీయాలు, కళతో రాజీపడని దీక్ష వంటి అనేక విషయాలు తెలుస్తాయి. ‘నటసామ్రాట్’లో ఈ ఫోకస్ లేకపోవటంతో సినిమా అటు కళాకారుల గురించి కాక, ఇటు , మోసపోయే తల్లితండ్రుల సినిమా కాక, రెండీంటి మధ్యలో చతికిలపడింది. మోనోలోగ్‌లు అయోమయానికి విసుగును జోడిస్తాయి. అయితే నటీనటులంతా, సమర్థవంతంగా నటనను ప్రదర్శించటంతో సినిమా ఒక స్థాయిలో అలరిస్తుంది. అక్కడక్కడా కళ్ళు చెమరిస్తాయి కూడా. ఎలాగయితే, ‘బాలగంధర్వ’ సినిమాను ప్రధాన పాత్రధారి నటన ఎలివేట్ చేస్తుందో, అలా, ‘నటసామ్రాట్’ ను నానాపాటేకర్ నటన నిలబెడుతుంది. కానీ, ‘నటసామ్రాట్’ సినిమాను రెండోసారి చూడాలనిపించదు. ‘బాలగంధర్వ’ ఒకసారి చూస్తే తనివితీరదు.

ఈ రెండు సినిమాలను చూస్తూంటే, మరాఠీ కళాకారులు, తమ తరువాత తరాలకు గతతరంలోని అత్యుత్తమ వారసత్వాన్ని గుర్తుచేయాలని తపనపడటం తెలుస్తుంది. మరాఠీ భాషలో సినిమాలు నాటకాలూ సహజీవనం చేయటం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పలు పాత నాటకాలను సినిమాలుగా మలచటం కనిపిస్తుంది. తెలుగులోనూ ఒకప్పుడు నాటకాలు స్వర్ణయుగాన్ని అనుభవించాయి. సాహిత్యం అత్యంత వైభవాన్ని అనుభవించింది. కానీ, మన మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, కిల్లర్ స్టార్ల ప్రపంచంలో ఇలాంటి లక్ష్యాలకూ, ఉద్దేశాలకూ తావులేదు. కొంపతీసి ఏ పాండురంగడినో, అన్నమయ్యనో తెరకెక్కిస్తే ఆ మహాత్ములు హీరోల  హీరోయిజాలకు  తగ్గట్టు మారతారు తప్ప మన హీరోలు మారరు. మన సినిమాలు మారవు. అక్కడక్కడా మెరుపులా కొన్ని మంచి సినిమాలు కనిపించినా, అవి పొరపాట్లే తప్ప అలవాట్లు కావు.

Exit mobile version