ఎండ.
…వెండి పళ్లెం మీద సూర్యకాంతి తిరగబడితే మెరిసినట్లుగా చుట్టూ తెల్లటి కాంతి. దూరంగా ఆకాశపుటంచు దాకా, కళ్ళు బైర్లు కమ్మే వెలుగు.వెలుగు లోంచి వేడి. వేడి లోంచి కాంతి!
వెలుగే కాక వేడి.
వేడి గాలి.
ఎటు చూసినా ఎండిపోయిన చెట్లు. రాలిన ఎండుటాకుల మీద నడుస్తున్నారు వాళ్ళు ఐదుగురు. బూట్ల బరువుకి పొడిపొడి అయిపోతున్న ఎండుటాకులు ఎర్రని మట్టిలో కలిసిపోయి గరగరా చప్పుడు చేస్తున్నాయి.
ఉండుండి వేడి గాలి విసురుగా వీస్తోంది.
యూనిఫారంలో ఇంకా వేడిగా వుండి, చెమట కూడా ఎండిపోయింది.
దాహం. నోరు ఎండిపోయి కళ్ళముందు నీటి కొలనుల మృగతృష్ణలు కనిపిస్తున్నాయి. అయినా వాళ్ళు ఫ్లాస్కులలోని నీళ్ళు తాగకుండా నిగ్రహించుకున్నారు.
ఇంకా పదిహేను మైళ్ళ నడక వుంది. రిలీఫ్ క్యాంప్‌కి చేరాలంటే నడవాలి. ఆఖరి చుక్క దాకా నీరు సంరక్షించుకుని, తక్కువగా వాడాలి.
వేడి గాలి మళ్ళీ.
“50 డిగ్రీ సెంటీగ్రేడ్ వుండచ్చు” అన్నాడు కల్నల్ రావ్.
దూరంగా సుడులు తిరుగుతూ ధూళిమేఘం.
ఐదుగురు. వారికి నాయకుడు రిటైర్డ్ కల్నల్ రావ్.
అతనితో భార్య లక్ష్మిందేవి, కొడుకులు ఇద్దరు అప్పన్న, నరసింహ. సహాయకుడిగా ఇంట్లోనే పని చేసే సింహాచలం.
చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉన్నారు.
తూర్పు సముద్ర తీర ప్రాంతం అంతా ఎండిపోయింది. ఆకాశంలో వాతావరణ కాలుష్యానికి నల్లటి మేఘాలు, బూడిద రంగు పొగ (smog) ఎల్లప్పుడూ వుండేవి. పంటలు పండటం మానేసి చాలా కాలం అయింది.. నదులు ఎండిపోయాయి. దూరంగా సముద్రపు నీరు కూడా నల్లగా నూనె నిండిన ద్రవంలా వుండి అలలు నల్లటి నురుగు తోనే వస్తున్నాయి. అది కంపెనీలు తరతరాలుగా వదిలిన కాలుష్యం!
సముద్ర తీరం రోడ్డు అంతా విషజలాలకి చచ్చిపడిన చేపలు, పీతలు, కుళ్ళి ఎండిన వాసన…
ఈ హీట్ వేవ్ నెల నుంచీ వుంది. అందుకనే వాళ్ళు కళింగపట్నం నుంచి నడుస్తూ వస్తున్నారు. ఒక్కొక్కసారి ఏదయినా లారీలో కాని, కాందిశీకుల బస్‌లో కాని లిఫ్ట్ దొరికినా, వాళ్ళు దిగిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు విశాఖపట్నం దాటేశారు.
విశాఖపట్నంమారిపోయింది. నిర్మానుష్యమైంది. ఖాళీ ఇళ్ళు, రోడ్లు. కాలుష్య ప్రళయానికి, ఇంకా మిగిలిన జనాన్ని, ఇంకా దక్షిణం వైపు, తూర్పు వైపు రైళ్ళల్లో, బస్సుల్లో పంపించడం ఎప్పుడూ జరుగుతూనే వుంది.
ఇప్పుడు ఇక్కడ నివాసితులు ఎవరూ లేరు. ఎవరో దారి దొంగలూ, వీధి కుక్కలూ తప్ప.
అందరూ నిర్వాసితులే.
మొబైల్, గూగుల్ మ్యాపులలో ఇక్కడో రిలీఫ్ క్యాంపు వుందని చూస్తున్నారు. ఇంకా పదిహేను మైళ్ళలో.
అక్కడ కనీసం పదివేల మందికి ఆశ్రయం, ఆహారం, నీడ, నీళ్ళు దొరుకుతాయి… దొరుకుతాయట!!!
అలా అలా హైద్రాబాద్, చెన్నై దాకా క్యాంపులు వున్నాయి. అలా వెళ్ళిపోవడం తప్ప వేరే పథకం లేదు.
అక్కడికి చేరుకుంటే ఈ బాధ తగ్గి కొన్నాళ్ళు, మళ్ళీ వాళ్ళు పంపించేసేదాకా వుండచ్చు. చిన్నపిల్లలు చాలామంది ఎప్పుడో పోయారు. పెద్దవాళ్ళే బతికి వున్నారు.
“నడవండి!మరొక్క పన్నెండు గంటలు! క్యాంపు కెల్లిపోదాం. ఎల్లిపోదాం కాదు. ఎల్లి తీరాలి. అంతే!” కల్నల్ రావ్ ఆజ్ఞాపించాడు.
***
కల్నల్ రావ్ మెదడులో ఆలోచనలు నడుస్తూనే వున్నాయి. ప్రపంచం వేడెక్కిపోవడం (గ్లోబల్ వార్మింగ్) అంటే ఏమిటి? ఈ విషయాలపై చర్చ ఒకటి రెండు శతాబ్దాలుగా వాతావరణ శాస్త్రజ్ఞులలో జరుగుతూనే వుంది.
భూమి అంతా గడ్డకట్టిపోవడం ‘ఐస్ ఏజ్’, ‘హిమయుగం’ అందాం. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రింతం జరుగుతూ వచ్చింది. హిమయుగాలు అంటే ఐస్ ఏజ్‌లు ముగిసి మళ్ళీ మంచుఖండాలు (గ్లేసియర్స్) కరిగిపోవడం జరుగుతుంది. దీనిని హాలోసిన్ అంటారు. 80,000 సంవత్సరాలకి ఒకసారి ఐస్ ఏజ్ అంతం అయి, మళ్ళీ ఐస్ కరిగి భూమి వేడెక్కడం జరుగుతూనే వుంటుంది. భూమిలో గ్లోబల్ వార్మింగ్ దశలో మనం ఇప్పుడు వున్నాం. ఈ వేడెక్కడం అనేది సహజంగా వాతావరణ మార్పుల వల్ల జరగవచ్చు లేక మానవ నాగరికత తెచ్చిన కాలుష్య ప్రమాదాల వల్ల కావచ్చు. మానవ నాగరికత వల్ల వచ్చే గ్లోబల్ వార్మింగ్‌ని ఏంథ్రపోసీన్ అంటారు.
ఇప్పుడు ఐస్ ఏజ్ వచ్చే సమస్య లేదు. నాగరికతనే శాపంగా పరిణమించి, వాతావరణం ఉపరితలంలో గ్రీన్ హౌస్ వాయువులు – అంటే కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, perfluorocarbons (PFCలు) ఎక్కువ అయి, భూమి వాతావరణం వేడెక్కుతోంది. వాతావరణంలో ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువ వేడెక్కితేనే మంచుగడ్డలు (అంటార్కిటికా, ఆర్కిటిక్ లోనివి) కరిగి, సముద్ర మట్టాలు పెరిగి, భూమిలో వరదలు వస్తాయి. కొన్ని చోట్ల పంటలు నాశనమయి కరువు వస్తుంది. వేసవికాలం ఉష్ణోగ్రతలు పెరిగి భయంకరమైన వడగాలి, వేడి రావడం, అకాల వర్షాలు, సముద్రాలు ముందుకు వచ్చి పట్టణాలు, పల్లంలో వున్న పల్లెలు, దేశాలు కొంచెం కొంచెం మునిగిపోతాయి.
అగ్నిపర్వతాలు పేలడం, సూర్యుడిలో మచ్చలు – ఇవి సహజంగా భూమి ఉష్ణోగ్రతలు పెంచుతాయి. ఇవి మనిషి నియంత్రణలో లేవు. అయితే మానవ నాగరికత వల్లనే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా జరుగుతుంది.
- భూమి నుంచి తీసిన పెట్రోలు ఇంధనాలు, బొగ్గు వాడడం – గ్రీన్ హౌస్ వాయువులను పెంచుతాయి. కార్లు, ఇతర వాహనాల నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాస్, ఏసి, రిఫ్రెజ్‌రేటర్‍ల వల్ల వచ్చే PFC వాయువుల వల్ల భూమి పైన ఉండే ఓజోన్ పొర ఛిన్నమై అల్ట్రా వయొలెట్ రేస్ (అతి నీలలోహిత కిరణాలు) భూమి మీదకి ప్రసరించి జీవరాశులను నాశనం చేస్తాయి.
- అడవులు కొట్టివేసి చెట్లు నాశనం చేయడం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతాయి. ఎందుకంటే చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చి ఆక్సీజన్‌ని బయటకు వదులుతాయి. చెట్లు కొట్టేస్తే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది.
- మానవులు ఉత్పత్తి చేసే వృథా పదార్థాలు ప్లాస్టిక్ వంటివి (Non-recyclable Waste) కుళ్ళిపోయి మీథేన్ గ్యాస్ వస్తుంది
- బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీల వల్ల 46% కార్బన్ పెరుగుతుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది.
- భూమి లోంచి పెట్రోలియం తీసేందుకు ఆయిల్ డ్రిల్లింగ్ చేయడం వల్ల కూడా, కాలుష్యం పెరుగుతుంది.
- పెట్రోల్ వాడే వాహనాలు, ఇతర వాహనాల ద్వారా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ హౌస్ వాయువులు ఉత్పత్తి అయి, వాతావరణంలోకి చేరడం.
- వస్తు వినియోగం, ఎలెక్ట్రానిక్స్, పాలియెస్టర్ ఇలాంటివి వాడకం ఎక్కువవడం వల్ల…
- వ్యవసాయం చేయడం వల్ల కూడా మీథేన్ గ్యాస్ ఉత్పత్తి.
- పరిశ్రమల నుంచి వచ్చే కాల్యుష్య వాయువులు, వ్యర్థ పదార్థాలూ…
- చివరగా, చేపల వేట ఎక్కువగా చేసి సముద్ర జీవనాన్ని పాడు చేయడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ వస్తుంది.
ఇలాంటి మానవ నాగరికతా కారణాల వల్ల భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే అనేక లక్షల మరణాలు సంభవిస్తాయని, ఒక పక్క ఉష్ణోగ్రతలు, మరోవైపు వరదలు ఎక్కువయి, పల్లంగా ఉన్న పట్టణాలు, పల్లెలు మునిగిపోవడం, ఆహార కొరత, కరువులు రావడం జరుగుతాయి అని శాస్త్రజ్ఞులు చెప్పేవారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వాతావరణ ఉద్యమాలు నడుస్తూనే వుండేవి.
కొయోటో నగరం జపాన్‌లో ప్రపంచ దేశాలు సమావేశం అయ్యి, గ్రీన్ హౌస్ గ్యాస్‍లు ఉత్పత్తి అయ్యే పరిశ్రమల నియంత్రణను ప్రతిపాదించాయి. నిజానికి ధనిక దేశాలలోనే ఎక్కువగా వాతావరణ కాలుష్యం ఉంది, వారి ఆధునిక పరిశ్రమల యుగం వల్ల. బొగ్గు మీద, పెట్రోల్ లాంటి ఖనిజాల మీద (ఫాసిల్ ఫ్యూయల్స్) ఆధారపడి పెరుగుతున్న బీద దేశాలు ఇంత త్వరగా శక్తికి ప్రత్యామ్నాయాలు పెంచుకోలేమని చెప్పాయి.
పారిస్, డిసెంబరు 2015; లండన్ 2021 లలో దేశాలు సమావేశం జరుపుకున్నాయి. కార్బన్ కాలుష్యాలు పూర్తిగా మానేయాలి అని; భూమి వాతావరణంలో రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగితేనే అంతా నాశనం అవుతుందని తీర్మానం చేశాయి.
ఇండియా, చైనా 2060 నాటికి కానీ 0% కార్బన్ కాలుష్యాలు విసర్జించడం అనే లక్ష్యం సాధ్యం కాదని చెప్పాయి.
వేరే శక్తి ఉత్పత్తి ఎలా? సౌర శక్తి మీద, అణుశక్తి మీద ఆధారపడి పరిశ్రమలు, ఇతర ఎలెక్ట్రానిక్స్ నడిపించుకోవాలి. అది ఖరీదైన పని.
అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ అనుకున్నవి కావు. ఇందాక చెప్పిన కారణాలే కాదు, యుద్ధాలు వచ్చాయి, అంటువ్యాధులు వచ్చాయి. రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాలు అకాల యుద్ధాలు చేశాయి. ఎవరూ ఎవరి మాట వినని ప్రపంచం అయిపోయింది.
అందుకనే కాలుష్య ప్రళయం, విధ్వంసం 2041 డిసెంబరు 15న రానే వచ్చింది.
ఒక పక్క వరదలు. పల్లంలో వున్న బంగ్లాదేశ్ మునిగిపోయింది. హాలండ్ కొంత సముద్రంలో కలిసిపోయింది. కెనడాలో గ్రీష్మ తాపం! వందలమంది చనిపోగా, ఇతరులు కాందిశీకులయ్యారు,
సౌరశక్తిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు మొదలయి, బొగ్గు, పెట్రోల్ ఆధారిత సంస్థలలో కార్మికులు, ఉద్యోగస్థులు నిరుద్యోగంలోకి నెట్టబడ్డారు. వేలమంది నిరాశ్రయులు, కాందిశీకులు అయ్యారు. అమెరికా కొంత జాగ్రత్తలు తీసుకుంది. అయినా ఇదే పరిస్థితి అన్ని ధనిక దేశాల్లోనూ వుంది.
ఇక ఇండియాలో, పరిస్థితి ఇలానే వుంది. ఒక పక్క ఎండలు, మరొక పక్క జలప్రళయం, వ్యాధులు.
కాందిశీకులు తెలుగునాట ఉత్తరం నుంచి దక్షిణానికి రోజూ నడిచి వెళ్ళిపోతున్నారు.
వేడి లోంచి చల్లదనానికి… నీటి కోసం… ఎక్కడ చూసినా ఖాళీ అయిన నగరాలు, పల్లెలు. అక్కడక్కడా క్యాంపులు. చివరికి ఎక్కడికో వలస! కాలి నడకన! అలాంటివాళ్ళలో మన కల్నల్ రావ్, అతని కుటుంబం కూడా వున్నారు. అతను ఆలోచనలు ఆపి “నడవండి” అని అరిచాడు.
అతని తొందరపాటుకి వేరే కారణం కూడా వుంది.
***
దూరంగా ఒక గుడారం కనిపిస్తోంది. పాత రోజుల్లోని నేషనల్ హైవే 65 మీద ఇప్పుడు వాహనాలు కనిపించడం లేదు, ఎప్పుడో ఒక మిలిటరీ వాహనం తప్ప. దారికి అటు ఇటూ మోడు వారిన చెట్లు! నల్లని రంగులో మాడిపోయిన ఆకారాలతో బూజు పట్టిన చెట్లు అచేతనంగా నించుని వున్నాయి.
కత్తిపూడి దాటారు. “అద్గదిగో అల్లంత దూరంలో గుడారం. తిండి, నీళ్ళూ ఇస్తారు. నడవండి.” అన్నాడు రావ్.
చాలా పెద్ద ఆవాసం. కేన్వాస్ కప్పు రెపరెపలాడుతోంది. నీలి పరదాలతో ద్వారాలు, కిటికీలు మూసి వున్నాయి.
లోపలికి ప్రవేశిస్తే, ముందే కుళ్ళిన వాసన ముక్కు రంధ్రాలని అదరగొట్టింది. చచ్చిన జంతువుల, మానవ కళేబరాల వాసన. జీవం ఛాయే లేదు. ఆకాశం లోంచి ఎండ సూటిగా శవాల మీద పడి వికారంగా నవ్వుతున్నట్లుంది.
అక్కడక్కడా కుండలు మట్టి గళాసులు, సత్తు పళ్ళేలు. చిరిగిన చీరలు, పంచెలు. ‘శరణార్థులకి సహాయం’ అనే బోర్డు కింద కూర్చున్న ఖాకీ యూనిఫారం మనిషి కుర్చీలోనే వాలి పడిపోయి వున్నాడు.
“భయపడమాకండి! జేబుల్లో డబ్బులు దొరుకుతాయి. తీసుకోండి. ఏమయినా సుబ్బరమయిన తిండి, అన్నం, మజ్జిగా నీళ్ళు దొరికితే తీసేసుకోండి. ఈ క్యాంపులో లాభం లేదు. ఎల్లిపోదాం!”
లక్ష్మిందేవి కెవ్వున అరిచింది.
“ఏటండి బాబు ఇంత గోరం. ఇంత మంది చనిపోయారు! ఇక ముందు మనకి దారేటండి!”
అప్పన్న, నరసింహ, సింహాచలం ముందు నిర్ఘాంతపోయినా, వాళ్లూ మిలిటరీ డిసిప్లిన్‌తో, ఆహారం కోసం వెతుకులాట సాగించారు.
ఓ గంటకి బయటపడిన వాళ్ళకి భుజాన వేలాడే గుడ్డ సంచిీల లోపల కొంత నీరు, మజ్జిగ, చల్లటి చద్దన్నం ముద్దలు దొరికినవి వేసుకున్నారు.
“బతకాలి! బతకాలంటే నడవండి!”
మధ్యాహ్నం నాలుగ్గంటలు. మళ్లీ నడక సాగించారు.
“ఎండ తగ్గింది. రేపటికి రాజమండ్రి చేరుకుంటే, రేపు సాయంత్రానికి కావల్సినంత గోదారి నీరు!” అన్నాడే కానీ, నదులలో నల్లటి నీరు – కొంచెం తప్ప – నది ఎండిపోయిందని తెలుసు.
***
క్రమక్రమంగా గాలిలో కాలుష్యాలు పెరిగిపోతాయి. ఋతువులు మారిపోతాయి. వానలు, వరదలు ఒకచోట, కరువు ఒకచోట. కార్బన్ విసర్జనలు తొలగించడానికి అన్ని దేశాలు ఒప్పుకున్నా, నిజానికా నిబంధనలు పాటించలేదు. 100% విసర్జనలు తగ్గించాలి అని పారిస్, ఆ తర్వాత లండన్, ఆ తర్వాత వేరే దేశాల్లో నిర్ణయించినా ఫలితాలు లేవు. కొన్ని చోట్ల అణుశక్తితో ఎలెక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే రియాక్టర్లు నిర్మించారు. కొన్ని చోట్ల సౌరశక్తితో నిర్మించారు.
ఒకపక్క విద్యుచ్ఛక్తి ఖరీదు భరించలేనంత ఎక్కువ కావడమే కాక, బొగ్గు, పెట్రోల్, ఆయిల్ డ్రిల్లింగ్ లాంటి పరిశ్రమలలో పనిచేసే వారి ఉద్యోగాలు ఎన్నో పోవడం ఒక పరిణామం. అలాగ కూడా కుటుంబాలు విచ్ఛిన్నం అయ్యాయి. మధ్యలో కొన్ని యుద్ధాలు. అన్నీ ఆయా ఖండాలలో వున్న చిన్నా పెద్దా దేశాల మధ్యనే.
అణుబాంబులు కూడా వాడటం జరిగింది. కాలుష్యం మరింత పెరిగింది. క్రమక్రమంగా దేశాలలో ఆర్థిక సామాజిక వ్యవస్థలు మారిపోయినాయి. అతి వేగంగా కాలుష్య ప్రళయం వచ్చే రోజు అని శాస్త్రవేత్తలు, వివిధ రకాలు జోస్యాలు చెప్పడం…
2047 డిసెంబరు 16 అనీ, 2050 జనవరి లో అనీ… ఇలా.
చివరికి, కాలుష్యం ముందే వచ్చి భారతదేశాన్ని తాకింది. రానే వచ్చింది. దేశాలకు దేశాలే లాక్‍డౌన్ లోకి వెళ్ళాయి. తిండి నీరు లేక నడిచిపోయే శరణార్థులు ఎక్కువయ్యారు. కొందరు ధనవంతులు మాత్రమే మిగిలారు…. ఆలోచిస్తున్నాడు కల్నల్ రావ్.
చీకటి పడింది.
దారిలో రోడ్డు పక్క పల్లెలలో పూరి గుడిసెలలో మిణుకు మిణుకుమనే దీపాలు. ఎండిపోయిన పొలాలు, చెట్లు. హఠాత్తుగా కల్నల్ రావ్ ఆగిపోయాడు.
ఎదురుగా నాలుగు ఆకారాలు… చేతులలో బరిసెలతో, కర్రలతో… మెల్లగా ముందుకు వస్తున్నారు.
తుపాకీ తీశాడు కల్నల్. ఆహారం కోసం, బట్టల కోసం, నీటి కోసం, డబ్బు కోసం కాందిశీకుల మీద దాడి చేసే దొంగలు. తిండి కోసం చంపేస్తారు కూడా. “ఆగండి. దొంగలే ఆళ్ళు!” అంటూ గాలిలో తూటా పేల్చాడు.
దొంగలు ఆగలేదు. ముందుకు వస్తూనే వున్నారు. పైగా రాళ్లు విసురుతున్నారు. ఆకలి మీద వున్నారు. భయపడటం లేదు.
కల్నల్ రావ్ “సింహాచలం, ఆపరా ఆళ్ళని! కుదరకపోతే కాల్చేస్తా!” అన్నాడు.
దొమ్మీ. చేతులతో యుద్ధం.
ఎవర్నీ చంపడం కల్నల్ రావ్‍కి ఇష్టం లేదు. కానీ ఇలాంటి దాడులు జరుగుతాయని తెలుసు. అందుకే గన్, తూటాలు తెచ్చుకున్నాడు.
మసక చీకటి.
శిథిలమైన జాతీయ రహదారి మీద ఒక్క వాహనం కూడా, పోలీస్ పాట్రోల్ కానీ ఏమీ లేదు.
నాలుగు సార్లు గన్ పేలింది.
ఇద్దరి మూలుగులు.
కొడుకులిద్దరికి కత్తిపోట్ల గాయాలయ్యాయి. సింహాచలానికి తల మీద దెబ్బ తగిలింది.
దొంగలు నలుగురు ప్రాణాలు వదిలారు. సాయంత్రపు గాలిలో మృత్యువు.
ఎంత మాజీ సైనికుడైనా కల్నల్, స్వంత కుటుంబానికి జరిగిన గాయాలు, ప్రాణ నష్టానికి చకితుడై పోయాడు.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ భుజానికే వుంది. గాయపడిన వాళ్ళకి కట్టు కట్టి, చనిపోయిన దొంగల శవాలని పక్కన గుట్టలుగా ఎండిన ఆకులలోకి, రాళ్ళలోకి తోసేశారు.
ఏదైనా వాహనం వస్తే అందర్నీ రాజమండ్రి హాస్పిటల్‌కి తీసికెళ్లాలి. ఎప్పుడొస్తుందో, కానీ, ఏదో ఒకటి రాకపోదు.
ఆ తర్వాత రెండు గంటలకి కానీ దూరాన ఒక లారీ, హెడ్ లైట్లు కనబడలేదు.
షర్ట్ జేబులోని నోట్ల కట్టలు జాగ్రత్తగానే వున్నాయి.
లక్ష్మిందేవికి ఏమీ కాలేదు. ఏమయినా సరే… వెళ్ళాలి. ఈ నరకం నుంచి శాశ్వతంగా బయటపడే దారి వుంది! దానికే ఈ ఏర్పాట్లు.
ఏమయినా సరే, అక్కడికి చేరుకోవాలి.
***
రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. అది దాటరాదు. అదే లక్ష్యం పెట్టారు శాస్త్రజ్ఞులు 2009లోనే. ప్రపంచ దేశాలన్నీ రెండు డిగ్రీల లిమిట్ కంటే భూమి వేడెక్కకూడదని అంగీకరించాయి.
ఐక్యరాజ్యసమితి ప్రతీ ఏడూ నిర్వహించే సమావేశాల్లో రెండు డిగ్రీలు దాటితే ప్రమాదం, ప్రమాదం అని హెచ్చరిస్తూనే వుంది. నాలుగు దశాబ్దాల తర్వాత ఆ లక్ష్యం కాపాడుకోలేక, భూమి లోని ఉపరితల వాతావరణపు వేడి నాలుగు డిగ్రీలు ఎప్పుడో దాటేసింది. ఎప్పుడో వంద సంవత్సరాల తరువాత కాని జరగనిది ఇప్పుడే జరిగిపోతోంది.
“గేమ్ ఓవర్” అని 2022లోనే ఆలివర్ గిడెన్ అనే జర్మనీ శాస్త్రజ్ఞుడు అన్నారు.
ప్రళయం రానే వచ్చింది. వస్తుంది. వస్తుందని ముందే ఊహించిన ప్రపంచ ధనవంతులూ, కుబేరులూ పథకాలు సిద్ధం చేసుకుంటూనే వున్నారు… ఎలాన్ మస్క్ ఎలక్ట్రిసిటీతో నడిచే కార్లు, కొంత మంది సౌరశక్తితో నడిచే సాధనాలు… తయారు చేసి అమ్మేవారు.
కొంతమంది, మరీ, ఊహించనలేనంత రహస్యంగా, గ్రహాంతర కాలనీలకి టికెట్లు అమ్మడం, గ్రహాంతర కాలనీలలో కొత్త జీవితానికి అంకురార్పణ చేయడం జరిగిపోతోంది. అది అతి గోప్యంగా వుంది.
భయం, అరాచకం వున్న చోట రహస్యం, అబద్ధాలు, తప్పుడు సమాచారం, అవినీతి, నల్లబజారు ధరలు సహజమే; తప్పవు.
ఇదివరకు ఒకసారి పాండెమిక్ వచ్చినప్పుడు ఆక్సీజన్ సిలిండర్, వైరల్ మందులకు కూడా ధరలు అంతరిక్షం అందుకున్నాయి కదా!
ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణాలకే వందల లక్షల రూపాయలలోనే ధనం అవుతుంది. వెళ్ళడానికి వాహనాలే దొరకడంలేదు.
***
రాజమండ్రి హాస్పటల్…
సింహాచలం తల మీద దెబ్బకి కోమాలోకి పోయాడు. కొడుకులిద్దరూ గాయాలకి చికిత్స చేసుకున్నా, సెప్సిస్‌కి ప్రాణాలు వదిలారు. గోదావరిలో నీళ్ళు లేవు! వ్యవసాయమూ లేదు! ఎండిన కృష్ణతో విజయవాడకి… అది దాటిన తరువాత నీళ్ళు లేని చెన్నై!
బెంగళూరు మాత్రం ఇంకా కంప్యూటర్లతో బతుకుతోంది. ఊరి బయటే అంతరిక్ష కేంద్రం.
ఈ ఒక్క నెలలో వందేళ్ళు వయసు వచ్చినవాడై పోయాడు కల్నల్ రావ్.
ఎలాగో వాహనాలు, అక్కడక్కడా నడిచే రైళ్ళు పట్టుకుని బెంగళూరు ఊరి బయట ఉన్న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
నల్లటి డీసిల్ ఎగ్జాస్ట్ పొగ వదులుతున్న ఆటోలోంచి దిగారు ఇద్దరూ.
లక్ష్మిందేవి, కల్నల్ రావ్ ఇద్దరు, అనుచరుడు, కొడుకులని పోగొట్టుకుని, దుఃఖంతో.
చీకటిలో దురాన, మిణుకుమిణుకుమనే కేంద్రం కిటికీ కనిపిస్తోంది.
కుంటుకుంటూ వెళ్ళాడు.
అతని చేతిలో నోట్ల కట్ట, ఆపైన ఒక చిన్న ఆరు నెంబర్ల కోడ్ ఉన్న కాగితం పెట్టాడు.బ్యాంక్ ట్రాన్స్ ఫర్ నంబర్.
ఇంతలోనే కల్నల్ రావ్‍కి ఆయాసం రావడం మొదలైంది. ఎడమ వైపు ఛాతిలో నొప్పి మొదలయింది. చెమటలు పట్టసాగాయి.
లక్ష్మిందేవి “ఏమైందండీ?” అంటోంది. కానీ ఏమైందో ఆమెకి అర్థం అవనే అయింది.
“నువ్వు ఎల్లిపో లక్ష్మీ, నీకు టికెట్ కొన్నాను. రెండు టికెట్ల డబ్బు కావాలి. కానీ ఐదు టికెట్ల డబ్బు… జీవితంలో దాచిందంతా వాళ్ళకి ఇచ్చేశాను. ఎల్లిపో! నా పని మాత్రం అయిపోయింది. నేను వచ్చినా బతకను అక్కడ! రావడం ఎందుకు? అంతరిక్ష నౌక టిక్కెట్టు తీసుకున్నాను, నీకు మాత్రం. ఈ విమానం నిన్ను అమెరికా తీసుకెళ్తాది. అక్కడ్నించి రెండు రోజుల్లో వేరే నౌకలో ఎక్కిస్తారు. వేరే గ్రహానికి ఎల్లిపోతావ్! మన ఐదుగురి డబ్బుతో నీకు అన్ని సౌకర్యాలు వస్తాయి. వీళ్ళ దగ్గర కూలీ పని చేయక్కర్లా. ఎల్లిపో! ఎల్లిపో! హాయిగా వుండు!”
“అయ్య బాబోయ్, మీరు లేకపోతే ఎలాగండీ. నేనెల్లను!”
“లక్ష్మి! ఇంత కష్టపడింది మీ అందరి కోసమే. కానీ ఆళ్ళు చచ్చిపోయారు. అక్కడ గోదావరే ఎండిపోయింది. ఇక్కడ కృష్ణ ఎండిపోయింది. నగరాల్లో రాబందులు తిరుగుతున్నాయి. అంత దూరం నుంచి వచ్చినం. అన్ని కష్టాలు పడ్డాం. పిల్లలు బతకనేదు. ఆస్తులు పోయినయి. ఎవసాయం లేదు. ఇంకేం పనీ చేసుకోలేం. నా మాట ఇను!
నాకు గుండెపోటు వస్తోంది. నేనొచ్చినా ఇమానం ఎక్కనీరు! కాబట్టి నువ్వెల్లిపో!”
బలవంతంగా ఆమెని తోశాడు. బయటకి వచ్చిన ఇద్దరు తెల్లటి దుస్తుల వ్యక్తులు లక్ష్మిందేవిని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టబోయారు.
“ఎల్లిపో లక్ష్మమ్మా, బతికితే నేనెలాగైనా మళ్ళొస్తా. రాలేకపోయినా పరవాలేదు. చల్లగా వుండు! ఇది నా ఆజ్ఞ! మిలిటరీ ఓడిని కదా, ఇను!”
ఏడుస్తూ ఆమె చక్రాల కుర్చీలో కూలబడింది.
మరొక అరగంటకి దూరాన నీలి ఎరుపు రంగుల దీపాలు వెలుగుతుండగా విమానం లాంటి అంతరిక్ష నౌక చీకటిలో కనబడకుండా పొగలు చిమ్ముకుంటూ ఎగిరిపోయింది.
దూరంగా ఒక ఏంబులెన్స్ దయ్యంలా కూతలు వేస్కుంటూ వస్తోంది.
రావ్ గుండెను తడుముకున్నాడు. నొప్పి తగ్గినట్లనిపిస్తోంది.
ఎందుకంటే, లక్ష్యం కొంతవరకైనా నెరవేరింది. అతనికి తృప్తిగా వుంది.
ఏంబులెన్స్ కాలుష్య మేఘాల స్మాగ్ ఆవరించిన బెంగళూరు నగరం వైపు పరిగెట్టసాగింది.
అర్ధరాత్రి పక్షి కూత లాగా సెల్ ఫోన్‍లో సందేశం.
“కల్నల్ రావ్, నీ భార్య సురక్షితంగా వుంటుంది ‘మస్క్ స్పేస్ కాలనీలో’. సారీ! వుయ్ మిస్‌డ్ యు! టేక్ కేర్!”
అర్ధరాత్రి గుడ్లగూబ లాంటి మరొక పక్షికూత లానే అరుస్తూ ఏంబులెన్స్ కల్నల్ రావ్‍ని గుండె జబ్బుల ఆస్పత్రికి తీసుకుని వెళ్ళసాగింది.
మరొక కాలుష్య రాత్రి భూమి మీద వాలసాగింది.