Site icon Sanchika

రేపటి భయమై నీవు…

[dropcap]రే[/dropcap]పటి భయాల్ని తప్ప తాగి
కోరికలపై కాలు జారి
కళ్ళు తిరిగిన తలపులు
వర్తమానం కింద నలిగిపోతూ
నిలువుగా చీలిన మనిషి
రెండు చేతులతో
ప్రోగు చేసుకున్న ఆశలను
మెదడు పొరల్లో కన్నీటి ద్రావకంలో దాచి
కలల దువ్వలో
కలత దుమ్ములో
కలవరింత ఎత్తిపోతలో
వంకరటింకరి దారిలో
పిచ్చిగా తూలుతూ
పచ్చిగా వాగుతూ
ముడతలుబారిన ఊహాలకి
మెలికలు తిరిగిన ఆలోచనలను ముడివేసి
చితికిన మనసులో
చీకిన జ్ఞాపకాలతో
చిరిగిన మాటలో
చెదిరిన అర్థాలలో
నీవు ఎక్కడున్నావో
కనిపించిన ప్రతి అందాన్ని అడిగి
తడిమి మరీ పలకరిస్తూ
తనలోని నిజాన్ని ఊతంగా
నిజాయితీని వెన్నుగా
నాలో ఉన్న నీతో
నీలో లేని నాతో కలసి
దిక్కులు వెంట నీ జాడలని వెతకుతున్నాను
నేడు నిన్ను ఇలా వెతుకుతుంటే
రేపటి భయం నీ పక్కనే
కనిపిస్తూనే ఉంది.

Exit mobile version