Site icon Sanchika

రేపటి కోసం!!

[dropcap]అ[/dropcap]దొక కుగ్రామం..

ఆ రోజు సాయంత్రం..

నాలుగు గంటల సమయం..

వరండాలో కనకయ్య తన పెద్ద కొడుకు మాధవరావుతో మాట్లాడుతుండగా, తమ్ముడు సుబ్బారావు, చిన్న కొడుకు బాబూరావుని వెంట బెట్టుకుని వడివడిగా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడే వున్న కనకయ్య, మాధవరావులను పట్టించుకోకుండా బాబూరావుని చెయ్యి పట్టుకుని లాక్కుంటూ లోపలి గదిలోకి వెళ్లాడు సుబ్బారావు. కనకయ్య, మాధవరావులు ఊహించని ఆ సంఘటనను చూసి అవాక్కయ్యారు. నోట మాట పెగల్లేదు. గుడ్లప్పగించి చూస్తూ స్థాణువుల్లా నిల్చుండిపోయారు. కాసేపటికి లోపలి గదిలో నుండి, బాబూరావు ఏడుస్తూ పెడుతున్న పెద్ద కేకలు, అరుపులు వినపడుతున్నాయి.

“అబ్బా!.. అమ్మా!.. కొట్టొద్దు బాబాయ్! నీకు దణ్ణం పెడతా! కొట్టద్దు బాబయ్! దెబ్బలకు తట్టుకోలేకపోతున్నాను బాబాయ్! నీ కాళ్ళు పట్టుకుంటా బాబాయ్! కొట్టద్దు బాబాయ్!” అంటూ బాబూరావు చేస్తున్న ఆర్తనాదాలు వింటుంటే కనకయ్య, మాధవరావుల గుండెలు తరుక్కుపోతున్నాయి. కాని లోపలి గదిలోకి వెళ్లి బాబూరావును కొట్టకుండా సుబ్బారావుని వారించే సాహసం ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ చేయలేదు.

మరి కాసేపటికి బాబూరావు పెట్టే కేకలు ఆగిపోయాయి. దెబ్బలకు తట్టుకోలేక సొమ్మసిల్లిన బాబూరావు మూలుగులు మాత్రమే లీలగా వినపడుతున్నాయి. అంతలో.. లోపలి గదిలోంచి ఆవేశంతో ఊగిపోతూ వచ్చిన సుబ్బారావు, అక్కడే ఆతృతగా వేచి చూస్తున్న కనకయ్య, మాధవరావులతో ఏమీ మాట్లాడకుండా, కనీసం వారి వైపు కన్నెత్తైనా చూడకుండా గబగబా బయటికెళ్ళాడు. కనకయ్య, మాధవరావులు సుబ్బారావు ఆవేశాన్ని కోపాన్ని చూసి, ఏమిటి? ఎందుకు? అని అడిగే ధైర్యం చేయలేక లోపలి గదిలోకి వెళ్ళి బాబూరావుని ఓదారుద్దామని గది వైపు నడుస్తున్నారు. అప్పుడే కనకయ్య భార్య, కూతుళ్ళు అక్కడికి చేరుకున్నారు. జరిగిందేంటో తెలియలేదు వాళ్ళకి. పాపం! అమాయకంగా చూస్తూ అలా నిల్చుండిపోయారు.

అంతలో.. బయటికెళ్ళిన సుబ్బారావు తిరిగొచ్చి “అన్నా! నేనలా వాడ్ని చావబాది వెళ్తుంటే.. ఎందుకు? ఏమిటి? అని అడగవా? అదేంటన్నా! నీ ముద్దుల కొడుకుని నేను చితకబాదితే.. ‘ఎందుకలా కొట్టావు?..’ అని నన్ను నిలదీయకుండా.. నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నావన్నా!! వదినా.. నువ్వైనా నన్నడగవా!!!..” అత్యంత దయనీయంగా అడుగుతూ కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు, శాంతించిన సుబ్బారావు. ఆ స్థితిలో సుబ్బారావును చూసిన కనకయ్య, మాధవరావు, మిగతా వారందరూ చలించిపోయారు, వారందరి కళ్ళల్లో నీళ్ళు, రెప్పలు దాటి ఎప్పుడు బయటకొస్తాయా.. అన్నట్లు ఉన్నాయి.

అప్పుడు కనకయ్య..

“అడగాల్సిన అవసరం లేదు సుబ్బారావు! ఎందుకంటే, నువ్వలా ఎందుకు వాడ్ని కొడుతున్నావో మేము అర్థం చేసుకోగలం! అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది! లేకపోతే.. నువ్వు అంతలా వాడ్ని కొట్టవు! వాడేదో పెద్ద తప్పే చేసుంటాడు! అందులో ఏ మాత్రం సంశయం లేదు!” నిర్లిప్తంగా చెప్పాడు.

“నిజమే అన్నా! వాడు పెద్ద తప్పే చేశాడు!..” నింపాదిగా చెప్పాడు సుబ్బారావు.

“సుబ్బారావు! నువ్వు అనవసరంగా వాడ్ని కొడతావని మేమెవ్వరం అనుకోము! ఇంతకీ.. వాడేం చేశాడయ్యా?” భయంతో ఏడుస్తూ అడిగింది కనకయ్య భార్య. ఎంతైనా తల్లి మనసు కదా! కన్న కొడుకుని కనికరం లేకుండా కొడితే.. ఆ మాత్రం బాధ ఉండదా!

“అవునొదినా! వాడు పెద్ద తప్పే చేశాడు! మనవాడు నలుగురు కుర్రాళ్లను వెంటేసుకొని, ఖాసిం అన్న కొడుకుని కొట్టొచ్చాడు!..” కోపంగా చెప్పాడు సుబ్బారావు.

“అవునా! పోయి పోయి ఖాసిం వాళ్ల అబ్బాయితో గొడవ పడ్డాడు వీడు! ఇంకేమైనా ఉందా! వాళ్ళు మన వాడిని అంత తేలిగ్గా వదలరు! ఇప్పుడెలా సుబ్బారావు?” బాధగా అడిగాడు కనకయ్య.

“నాకూ ఇంతకు ముందే ఈ విషయం తెలిసిందన్నా! వెంటనే ఖాసిం అన్నను కలుద్దామని బయలుదేరాను. అప్పుడు వీడు గుడి దగ్గర కూర్చుని ఉన్నాడు. వాడ్ని చూసిన నాకు కాళ్లూ చేతులు ఆడలేదు. వెంటనే.. వాడ్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్దామని వాడ్ని తీసుకుని ఇక్కడికొచ్చాను!” బాధగా చెప్పాడు సుబ్బారావు.

“మరిప్పుడేం చేద్దాం సుబ్బారావ్?” ఆతృతగా అడిగాడు కనకయ్య.

“నువ్వేం కంగారు పడకన్నా! అదంతా నేను చూసుకుంటాను! ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారక ముందే ఖాసిం అన్న దగ్గరకు ఇప్పుడే వెళతాను. అంతా సద్దుమణుగేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కుదరకపోతే.. ఏం చేయాలో.. అప్పుడాలోచిద్దాం!” అంటూ బయలుదేరాడు సుబ్బారావు.

ఒక్క నిమిషం ఆగి, వెనక్కి తిరిగి.. “వదినా! ఏది ఏమైనా బాబూరావుని నేనలా కొట్టి ఉండాల్సింది కాదు! నాకూ చాలా బాధగావుంది ! వదినా.. అన్నా.. మీరు నన్ను క్షమించండి!” అంటూ తలవంచుకుని చేతులు కట్టుకుని వినమ్రంగా నిల్చున్నాడు సుబ్బారావు.

“పరవాలేదులే సుబ్బారావు! ఇటు మేమో అటు నువ్వో.. ఎవరో ఒకరం.. పిల్లలకు భయం పెట్టకపోతే, మందు ముందు వాళ్ళు హద్దులు దాటుతారు. అప్పుడు జరగబోయే అనర్థాలకు, నువ్వు ఇప్పుడే అడ్డుకట్ట వేశావు. నువ్వేం బాధపడకు సుబ్బారావు!” సాంత్వన వచనాలు పలికాడు కనకయ్య.

“మీరంతా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను ఖాసిం అన్న దగ్గరికి వెళతాను. అన్ని విషయాలు మాట్లాడుతాను. తిరిగొచ్చి మీకంతా చెప్తాను. ఆ! మీరెవరూ బాబూరావును ఇంకేమీ అనకండి! పాపం! వాడిప్పటికే చాలా బాధపడుతుంటాడు! ఆ! వదినా వాడికి నొప్పులు ఎక్కువగా వుంటే, కొంచెం వేడి నీళ్ళతో కాపడం పెట్టు!..” అంటూ బాధగా బయటికెళ్ళాడు సుబ్బారావు.

***

ఇక్కడ కనకయ్య, సుబ్బారావుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం..

నిజానికి, ఆ రెండు కుటుంబాలు చిన్న రైతు కుటుంబాలు. వ్యవసాయమే వాళ్ళ జీవనాధారం. వాళ్ళిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్లు కారు. అయినా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువే.. కనకయ్య వాళ్ల తాత, సుబ్బారావు వాళ్ళ తాత సొంత అన్నదమ్ములు. తరాలు మారినా, ఆ రెండు కుటుంబాలు, పేరుకి వేరు వేరు ఇళ్ళల్లో ఉంటున్నా, ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి మెలిసి జీవిస్తాయి. ఈ తరంలో కనకయ్య తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. సుబ్బారావుకు ముగ్గురు తమ్ముళ్ళు.. మొత్తం నలుగురు.. కనకయ్యతో కలుపుకుని, వారిని పంచపాండవులని అనుకుంటుంటారు, ఆ గ్రామంలోని వారంతా..

ఆ అయిదుగురు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా, అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. పండగలకు, పబ్బాలకు అందరూ కలిసే పిండివంటలు వండుకుంటారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయాల్లో, ఒకరి పొలాల్లో మరొకరు – పొలం పనుల్లో సహాయం చేసుకుంటుంటారు.

వారిలో ప్రత్యేకత ఏమిటంటే.. వాళ్ళు ఎవరితో అనవసరంగా గొడవ పడరు. తమ తప్పు లేకపోయినా, తమపై ఎవరైనా గొడవకు దిగితే, వెనుదిరిగి చూడరు, ఎంత వరకైనా వెళతారు. తాడో పేడో తేల్చుకునే వరకు వదలరు. ఆ విషయం గ్రామంలోని వారందరికీ బాగా తెలుసు. అందుకే.. అనవసరంగా వారితో గొడవలు పడడానికి ఎవరూ పూనుకోరు. మొత్తానికి, నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు ఆ కుటుంబాలు. పరువు ప్రతిష్ఠల కోసం ప్రాణం పెడతాయి ఆ కుటుంబాలు. ఎవరైనా సమస్యలతో సతమతమవుతుంటే, కష్టాలతో అల్లాడిపోతుంటే, చూస్తూ ఊరుకోవు ఆ కుటుంబాలు. అలాంటి వారికి తమకు చేతనైనంత సహాయం చేస్తూ, ఆపన్న హస్తాలను అందిస్తాయి, ఆ కుటుంబాలు. మీకు మేమున్నామంటూ, అండగా నిలుస్తాయి ఆ కుటుంబాలు.

***

పెద్ద పెద్ద అంగలు వేస్తూ, వడి వడిగా నడిచి, ఖాసిం ఇల్లు చేరుకున్నాడు సుబ్బారావు. నిజానికి, సుబ్బారావు తరపు కుటుంబాలకు సుబ్బారావు ఎంతో, ఖాసిం తరపు కుటుంబాలకు ఖాసిం అంత! పౌరష పరాక్రమాలలో ఎవరికెవరూ తీసిపోరు. ఇంటి ముందే నిలబడి,

“ఖాసిం అన్నా! ఖాసిం అన్నా!! ఇంట్లోనే ఉన్నావా? ఉంటే బయటకి రా!” కేకలు పెట్టాడు సుబ్బారావు.

ఆ కేకలు విన్న ఖాసిం ఇంట్లో నుండి బయటికొచ్చి,..

“ఓ! సుబ్బారావు భయ్యా! నువ్వా! రా.. రా.. కూర్చో!” లోనికి ఆహ్వానించాడు.

“ఏంటి భయ్యా! ఆవేశంతో, కంగారుగా ఉన్నావు! పెద్దగా కేకలు పెట్టావు! ఏంటి? ఏమైనా సమస్యా?”

“అవును భయ్యా! పెద్ద సమస్యే!!”

“పెద్ద సమస్యా!! ఏంటో చెప్పు! మనిద్దరం తలుచుకుంటే ఎలాంటి సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించగలం! నువ్వు ధైర్యంగా ఉండు! ఇప్పడు చెప్పు!”

“మా అన్న చిన్న కొడుకు, మీ చిన్నబ్బాయి రహమాన్‌ని నలుగురు కుర్రాళ్లతో కలిసి కొట్టాడట!”

“ఏంటి భయ్యా నువ్వుంటుంది! అంటే.. ఆ బాబూరావు నా బిడ్డని కొట్టాడా!! వాడి కేంటి ఆ ధైర్యం? అసలు వాడెందుకు మా వాడ్ని కొట్టాడో తెలుసుకున్నావా?”

“లేదన్నా! వాడికి నాలుగు తగిలించి తగిన బుద్ధి చెప్పి, సరాసరి నీ దగ్గరికొచ్చాను!”

కొంచం ఆశ్చర్యం, మరి కొంచెం కోపంతో..

“అరే.. రహమాన్.. ఇదర్ ఆవో!” అంటూ పెద్దగా అరిచాడు ఖాసిం.

ఇంట్లోనే ఉన్న రహమాన్ భయంతో వచ్చి రెండు చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

“ఏరా.. రహమాన్! ఆ బాబూరావు నిన్ను కొట్టడటగా?”

“అవును బాబా! నలుగురితో కలిసొచ్చి ఒంటరిగా ఉన్న నన్ను కొట్టాడు!”

“అసలు వాడు నిన్నెందుకు కొట్టాడ్రా! (కొంచెం సేపాగి) ఏం మాట్లాడవేంటి? చెప్పు??..”  గట్టిగా గదిమాడు ఖాసిం.

“అసలేం జరిగిందంటే.. నేను.. నేను..” చెప్పేందుకు సంశయిస్తాడు రహమాన్.

“ఏంట్రా నీ నసుగుడు.. జరిగింది చెప్పు.. నిజంగా ఏం జరిగింది?”

“నేను వాడి అక్కను వెంబడించి సూటి పోటి మాటలతో ఏడిపించాను. ఆ విషయం తెలుసుకున్న బాబూరావు నన్ను కొట్టాడు!” భయం భయంగా నిజం చెప్పాడు రహమాన్.

“ఏంటి? మా అన్న కూతుర్నే ఏడిపించావా?!”.. కోపంతో లేచి నిల్చుని చెయ్యెత్తి రహమాన్‍ని కొట్టేందుకు మందుకెళ్ళాడు సుబ్బారావు.

“నువ్వాగు సుబ్బారావు.. వీడి సంగతి నేను చూస్కుంటాను.. (రహమాన్ వైపు తిరిగి) ఏరా? ఒక ఆడపిల్లను ఏడిపిస్తావా? అందునా.. కనకయ్య భాయ్ కూతురునే ఏడిపిస్తావా? ఆ అమ్మాయి నీకు బెహన్‌తో సమానం రా! ఎంత తప్పు పని చేశావురా బద్మాష్! అలా ఆడపిల్లలను ఏడిపించే చెడ్డబుద్ది మన ఖాందాన్‌లో ఇంత వరకు ఎవరికీ లేదు కదరా! మన పరువు తీశావు కదరా!”.. అంటూ రహమాన్‌ని ఎడా పెడా కొట్టాడు ఖాసిం.

“తప్పయిపోయింది బాబా! ఇంకెప్పుడూ అలా చెయను బాబా! కొట్టొద్దు బాబా!..” అంటూ కాళ్ళా వేళ్ళా పడుతున్నా వినిపించుకోకుండా రహమాన్‌ని కొడుతూనే ఉన్నాడు ఖాసిం.

సుబ్బారావు జరుగుతున్న సన్నివేశాన్ని గుడ్లప్పగించి చూస్తూ నిల్చున్నాడు.

“అరే.. రహమాన్, నువ్వు ఉన్న పళాన కనకయ్య భయ్యా ఇంటి కెళ్ళి బాబూరావుతో మాఫీ మాంగో! తిరిగొచ్చి నాక్కనపడు.. జావ్!!”.. అంటూ రహమాన్‌ని తోసేశాడు ఖాసిం.

“మాఫ్ కర్నా సుబ్బారావు చిచ్చా!..” అంటూ సుబ్బారావు కాళ్ళపై బడి, లేచి, ఒక్క ఉదుటున బయటికెళ్ళాడు రహమాన్.

“భయ్యా! మావాడు పెద్ద తప్పు చేశాడు! వాడి తరపున నిన్ను నేనూ అడుగుతున్నా! మాఫ్ కరో!” అంటూ సుబ్బారావు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు ఖాసిం.

“ఖాసిం అన్నా! ఏంటన్నా ఇది! నువ్వు నన్ను.. మాఫ్ కరో.. అని అడగడమేంటన్నా! వద్దన్నా!..” అంటూ ఖాసిం చేతులను విడిపించుకున్నాడు సుబ్బారావు.

“సరే! వాడు తిరిగొచ్చిందాకా ఇక్కడే ఉండు.. తరువాత వెళ్దువుగాని.. ఈలోపు ఇద్దరం వేడి వేడి మసాలా ఛాయ్ తాగుదాం!..” అంటూ ఛాయ్ పంపమని ఇంటిలోపల వున్న బేగంకు హుకుం జారీ చేశాడు ఖాసిం.

***

రహమాన్ కనకయ్య ఇంట్లోకి వచ్చి.. “బాబూరావ్.. బాబూరావ్.. ఒక సారి బయటకి రారా?” అని అరిచాడు.

ఆ కేకలు విని బాబూరావుతో బాటు అందరూ బయటికొచ్చారు.

“భయ్యా! నేను పెద్ద తప్పు చేశాను! బెహన్‌ని ఏడిపించాను! ఇక ముందెప్పుడూ అలా చేయను! నీ బెహన్ నాక్కూడా బెహనే! మాఫ్ కరో భయ్యా!”.. అంటూ బాబూరావు చేతులు పట్టుకున్నాడు రహమాన్. ఈ హఠాత్పరిణామానికి అందరూ అచ్చెరువందారు. బాబూరావు, రహమాన్‌ని ఆలింగనం చేసుకున్నాడు.

బాబూరావుని ఎగాదిగా చూసిన రహమాన్..

“భయ్యా! ఇక్కడ నిన్ను కొట్టాడు సుబ్బారావు బాబాయ్! అక్కడ నన్ను కొట్టాడు మా బాబా! అయినా సుబ్బారావు బాబాయ్ నిన్ను ఇంతలా కొట్టడేంట్రా! హు! పోనీ లేరా! మన బాబాయేగా కొట్టింది! మరెవరో కాదుగా! (కనకయ్య వైపు తిరిగి) పెద్దయ్యా! భయ్యాకి బాగా దెబ్బలు తగిలాయ్! వాడ్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి! నేను ఇక బయలుదేరుతాను! అక్కడ మా బాబా, సుబ్బారావు బాబాయ్.. నా కోసం ఎదురు చూస్తుంటారు! నేను త్వరగా వెళ్ళి వాళ్లని కలవాలి!” అంటూ పరుగెత్తాడు.

అప్పుడు కనకయ్య..

“చూశారా! వెళ్ళింది నా తమ్ముడు సుబ్బారావు! ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తాడు.. అదీ.. నా తమ్ముడంటే!” అని అందరితో గర్వంగా చెప్పాడు.

***

పరుగు పరుగున ఇంటికొచ్చిన రహమాన్.. “బాబా! నువ్వు చెప్పినట్లే బాబూరావు భయ్యాని మాఫ్ కరో అని కోరాను. భయ్యాతో పాటు.. వాళ్ళంతా నన్ను క్షమించారు! (సుబ్బారావు వైపు తిరిగి) చిచ్చా! వాడ్ని మరీ అలా కొట్టావేంటి చిచ్చా! చూస్తే చాలా బాధనిపించింది!” అంటూ కంటతడి పెట్టాడు రహమాన్.

అప్పుడు ఖాసిం..“సరే! ఇకనైనా బుద్ధిగా వుండు! జాగ్రత్తగా మసులుకో! ఇక ఈ విషయాన్ని ఇంతటితో మరిచిపో! నాకు తెలియకుండా ఏమైనా వెధవ్వేషాలు వేసి, మరలా గొడవలకు దిగావనుకో.. కన్న కొడుకని కూడా చూడను! ఛమడాల్ ఒలుస్తా! జాగ్రత్త! పో.. ఇక్కడ్నుంచి!..” అని గద్దించాడు.

“సుబ్బారావు భయ్యా! మనలో మనకి ఎప్పటికీ గొడవలు రాకూడదు.. రావు కూడా!! అంతే!!! నువ్వేమంటావ్ సుబ్బారావ్!”

“అన్నా! నువ్వున్నది నేనెప్పుడన్నా కాదన్నానా?  నాకు మా కనకయ్య అన్న ఎంతో, నువ్వు అంతే అన్నా! నువ్వు ఏం చెప్తే అదే నా మాట కూడా! మరి.. నేనిక బయలుదేరుతానన్నా!” అంటూ లేచాడు సుబ్బారావు.

“సరే భయ్యా! మళ్ళీ కలుద్దాం! ఆ.. కనకయ్య భయ్యాకి మీ వాళ్ళందరికీ నా మాటగా చెప్పు.. జరిగిన విషయాలను మనసులో పెట్టుకోవద్దని.. ఇంకో విషయం.. మిమ్మలందర్నీ చూసి చాలా రోజులైంది. ఏదో ఒక రోజు కనకయ్య భయ్యా దగ్గరకు వస్తాను. మిమ్మల్నందర్నీ చూస్తాను.. సరేనా!”

“ఏదో ఒక రోజు ఎందుకు ఖాసిం అన్నా! రేపే రావచ్చుగా! నువ్వొస్తే.. మా అందరికీ పండుగే! రేపే రా అన్నా! పెద్ద దావత్ కూడా ఇస్తాము! ఆ.. వచ్చేటప్పుడు రహమాన్‌ని కూడా తీసుకుని రా అన్నా! ”

“అలాగే.. రేపే వస్తాము.. మరి దావత్ అదిరిపోవాలి!”

“రేపు నువ్వే చూస్తావుగా అన్నా!”

కాసేపు అక్కడ నవ్వుల పువ్వుల సువాసనలు వ్యాపించి, వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచాయి.

కనకయ్య ఇంటికి చేరిన సుబ్బారావు, జరిగిన సంగతులన్నింటినీ, వారందరికి.. పూసగుచ్చినట్లు వివరించి చెప్పాడు..

అంతటి సున్నితమైన సమస్యను సునాయాసంగా పరిష్కరించిన సుబ్బారావుని అందరూ వేనోళ్ళ కొనియాడారు.

***

కాలచక్రం గిర్రున తిరిగింది. సుమారు ఐదు దశాబ్దాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరి.. అలనాటి తీపి గురుతులు ఆ గ్రామంలో ఇప్పటికీ చెక్కు చెదరుకుండా ఉన్నాయా??

అప్పటి.. ప్రేమలు.. అనురాగాలు

అనుబంధాలు – ఆనందాలు

బంధాలు – బాంధవ్యాలు

సుఖాలు – సంతోషాలు

..ఇప్పటికీ ఉన్నాయా??

అప్పటి.. నీతి – నిజాయితీ

న్యాయం – ధర్మం

అన్యోన్యం – ఆత్మీయత

సహాయం – సహకారం

..ఇప్పటికీ ఉన్నాయా??

నిశితంగా గమనిస్తే, లేవనే చెప్పాలి..

అప్పటి కుగ్రామం, ఇప్పుడొక మండల కేంద్రం. గుడులు, బడులు, కళాశాలలు, ఆసుపత్రులు, మేడలు, సిమెంటు రోడ్లు, సినిమా హాళ్ళు, వ్యాపార కూడలులు, మొదలైన వాటితో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఊరైతే విశాలంగా ఉంది కాని, మనుషుల హృదయాలు మాత్రం కుంచించుకు పోయాయి. కొంత మంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం, మరి కొంత మంది వ్యాపారాల నిమిత్తం, దేశవిదేశాల్లోని పెద్ద పెద్ద నగరాల్లో స్థిరపడ్డారు. ఉన్న వాళ్ళంతా సంపాదన యావలో పడి యాంత్రిక జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబపరంగా.. ఎవరికీ వారే యమునా తీరే!.. అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రజానీకం అంతా.. కుల, మత, రాజకీయ పార్టీల పరంగా సమూహాలుగా విడిపోయారు. ఎదుటి వారి ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం, ఈర్ష్యాద్వేషాలతో కొట్టుమిట్టాడటం, పగ ప్రతీకారాలతో రగిలిపోవడం, భయభ్రాంతుల గుప్పెట్లో నలిగి పోవడం. వీటితోనే కాలాన్ని భారంగా వెళ్ళదీస్తున్నారు.

ఆ క్రమంలో.. మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. రాక్షసత్వం జడలు విదిల్చి కరాళ నృత్యం చేస్తుంది. న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలు నిలువెత్తు పాతరలో పాతి వేయబడ్డాయి. పోను పోను పరిస్థితులు ఎటు దారితీస్తాయో.. అని ఊహించుకుంటేనే.. ఒళ్ళు జలదరిస్తుంది.

మరి.. అలనాటి తీపి గుర్తులు మరలా ఆవిష్కరించబడతాయా? ఆ మంచి రోజులు పునరావృత్తమవుతాయా?.. ఏమో..!? కొండంత ఆశతో వేచి చూడడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదనిపిస్తుంది..!

మరి.. ‘వేచి చూద్దాం!!’.

Exit mobile version