[dropcap]వి[/dropcap]ద్య వ్యాపారమైన నేటి రోజుల్లో..
ప్రతి మార్కుకు లెక్కలు కట్టేస్తూ
ఇంప్రూవ్మెంట్స్ అంటూ
వ్రాసిన పరీక్షలనే మళ్లీ రాస్తూ
ర్యాంకులకై విద్యార్థులను
బట్టీ పద్ధతికి అలవాటు చేస్తూ
ప్రతి రోజునీ, ప్రతి గంటనీ,
ప్రతి క్షణాన్నీ.. అంటూ
కాలాన్ని లెక్కిస్తూ
అలవిగాని సిలబస్‌ని
చదివించాలని ప్రయత్నిస్తూ
నేటి కళాశాలలు, పాఠశాలలు..
విద్యార్థులను మానవ
యంత్రాలుగా మార్చేస్తున్నాయి!
తమ విద్యాసంస్థ
ర్యాంకుల పంట పడిస్తుందని..
ఊకదంపుడు ప్రకటనలతో
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో
వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తూ
గొప్పలు పోతున్నాయి!
వేలు దాటి లక్షల్లో ఫీజులు
వసూలు చేస్తున్నాయి!
నిజం ఎంతో తరచి చూస్తే..
నేటి విద్యార్థి..
చదువుల కొలిమిలో
సమిధగా రగులుతూ
ఆకలిదప్పికలు సైతం
మర్చిపోయి ర్యాంకుల సాధనలో కష్టిస్తూ
జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు!
విద్యాసంస్థలు సరస్వతీ దేవి నిలయాలు!
చల్లని చదువులమ్మ నీడలో..
విజ్ఞాన మనోవికాసాలు పెంపొందించుకుంటూ
సత్ ప్రవర్తన అలవర్చుకుంటూ
విద్యాబుద్దులు నేర్చుకుంటూ
సంస్కారవంతంగా ఎదగాలి.. రేపటి పౌరులు!
అప్పుడే
మన దేశ వెలుగు రేఖలు
ప్రపంచదేశాలకు మార్గదర్శనమై..
భారతావని పేరుప్రఖ్యాతులు
పునరావృత్తమై ..
సనాతన స్వర్ణ భారతావని
కీర్తిప్రతిష్ఠలు అజరామర మవుతాయి!