రేపటి పువ్వు

    2
    5

    [box type=’note’ fontsize=’16’] రాముడి పాదసన్నిధి కోసం పరితపించిన పుష్పం నిరంతరం రామ నామ ధ్యానంలో గడిపుతోంది..రామ నామసంస్మరణ ఫలితంగా ఆ పువ్వుకు అనూహ్యంగా లభించిన బహుమానాన్ని అత్యంత కోమలంగా, తాత్వికంగా ప్రదర్శిస్తుందీ తెలుగు సాహితీ వనంలో తాజాగా విరిసిన కథాకమలం జొన్నలగడ్డ సౌదమిని కథ “రేపటి పువ్వు“.[/box]

    నేను మెల్లిగా తలెత్తి చూశాను. నా అక్కయ్యలైన పూలు చేసే హడావిడి చూసి “ఏంటి ఈ తొందర “అని ఎవరిని అడుగుదామన్నా అందరూ ఎవరి తొందరలో వాళ్ళున్నారు. చివరికి చిన్న అక్కయ్య నవనీతం నావైపు తిరిగింది

    “రాముడు, సీత వొస్తున్నారు ఇటు. వాళ్ళ పాదాలమీద పడి జీవితం ధన్యం చేసుకుందామని అందరి తొందర”

    “వాళ్ళెవరు”

    “…. హహహ..”

    “ఎందుకంత నవ్వు”

    “ఇక్కడ మేము మా జీవితాలని ఆ ప్రభువు పాదాల దగ్గర వొదిలేద్దామని పోటీ పడుతుంటే నువ్వు వాళ్ళెవరంటుంటే నవ్వొచ్చింది”

    “ఇప్పుడే పుట్టాను కదా, ఇంకా…. చెప్పవూ”

    “రాముడు నీలమేఘ శ్యాముడు, మనోమోహనుడు, సర్వాతిశయ సుందరుడూ”

    “ఆపు ఆపు, అంత బావుంటాడా నిజంగా”

    “ఎంత బావుంటాడంటే ఆయన మన చెట్టు కిందకి వొస్తే అన్ని పువ్వులూ ఆయన కాళ్ళ మీద పడటానికి సిద్ధంగా వున్నయ్యి చూడు.”

    “అయ్యో ఆత్మహత్యే”

    “ఆత్మహత్య కాదు, ఆత్మార్పణం, భగవంతుడి పాదాల శరణాగతి, సమాశ్రయణం, ..తేడా అర్ధమౌతోందా”

    “లేదు, అంటే …”

    “ఎల్లాగూ పది రోజుల్లో చస్తాము. ఆ పోయేది భగవచ్చరణారవింద స్పర్శతో అయితే రెండ్రోజులు ముందైతే ఏమి నష్టం చెప్పు”

    “నువ్వు చెప్పేదీ సబబే, కానీ …”

    “అడుగడుగో రామయ్య ప్రభువూ, సీతమ్మా ఇటే వొస్తున్నారు. నిజ్జంగా ఎంత అందంగా ఉన్నాడు రాముడు”

    “నిజంగా శరణాగతి చేస్తావా”

    “నేనొక్కణ్ణే కాదు, అందరు పూల బాలలూ ఎప్పుడెప్పుడు రాముడొస్తాడా, ఆయన పాదాల దగ్గరో, శరీరం మీదో ఎలా పడదామా అని వేచి ఉన్నారు చూడు”

    ” …”

    “అదిగో పొగడచెట్టు కిందకి సీతారాములు రాగానే ఆ పూలబాలలన్నీ ఎలా వారి ముఖం మీదకీ, హృదయం మీదికీ, చేతుల మీదికీ దూకుతున్నాయో చూడు”

    ” చాలా బావుంది, అదొక పూలవర్షంలా కనిపిస్తోంది. …..ఆ ప్రభువుని ముట్టుకోవాలని నాకూ అనిపిస్తోంది”

    “ఇప్పుడే పుట్టి ఒక సారి చూసినందుకే నీకు ఇల్లా అనిపిస్తే, ఇక వారం రోజుల నించీ చెట్టు పైనించీ ప్రతి క్షణం కళ్ళు విప్పారించి చూసిన ఆ పూలకెలా ఉంటుందో ఊహించు”

    “వాళ్ళ జన్మ ధన్యం, ఆ పొగడ చెట్టు జన్మ కూడానూ.”

    “అదుగో రామభద్రుడు వొస్తున్నాడు, ఆయన జటలో పడితే కాసిని ఎక్కువ రోజులు ఆయనతో గడపొచ్చు. బాలా ఇంక సెలవు”

    “నువ్వు దూకేస్తున్నావా”

    “తప్పకుండా. ఇంత మంచి అవకాశం మళ్ళీ వొస్తుందా మిగిలిన రెండు రోజుల్లో “

    “అక్కా, నాకూ దూకెయ్యాలని ఉందే, రాముడు ఎంత అందంగా ఉన్నాడే, నా హృదయాన్ని లాగేస్తున్నాడే “

    “నీ ఇష్టం, వొస్తానింక, రాముడు దగ్గరగా వొస్తున్నాడు. సరిగ్గా జటలో పడాలని నాతోపాటు మా అక్కలు చాలామంది పోటీ పడుతున్నారు. వుంటాను చెల్లీ”

    “నేను కూడా వొస్తాను నీతో… అక్కా “

    “…….”

    “అక్కా మీరందరూ అదృష్ట వంతులు, చక్కగా రామ పాదాల మీదా, దేహం మీదా పడ్డారు. నేను ఎంత ప్రయత్నించినా ఈ తొడిమె అడ్డం వొస్తోంది. అక్కా… ….. అక్కా …….

    అక్కా నేను ఎంత దురదృష్ట వంతురాలిని. ఎంత ప్రయత్నించినా కష్టం మీద రాముణ్ణి చూస్తున్నాను కానీ ఈ తొడిమె నన్ను వొదలటల్లేదు. “

    అలా బాధపడుతున్న పూలబాలని చెట్టు సముదాయించింది.

    “నువ్వు ఇప్పుడే పుట్టావు శశిప్రభా, ఇంక కొద్ది రోజుల తరవాతే నువ్వు పెద్ద దాని వయ్యేదీ, నీ నిర్ణయం నువ్వు తీసుకునేదీ. అప్పటిదాకా ఆగాలి”

    “నాపేరు శశిప్రభా?”

    “అవును, చంద్రుడి కాంతి లాగా స్వఛ్ఛంగా, అమ్మ ప్రేమ లాగా నిర్మలంగా ఉన్నావు. అందుకని”

    “ఆగక తప్పదా”

    “తప్పదు. అది ప్రకృతి ధర్మం. నన్ను చూడు ఇవాళ్ళ అన్నీవొదిలి మూలమట్టంగా ఆ ప్రభువు పాదాల మీద పడాలని వుంది కానీ ఏమీ చేయలేను. నాకంటే నా పూలే నయం. అదిగో రామచంద్రుడు వొస్తున్నాడు చూడు. పూలన్నీ రామచంద్రుడి మీదకి ఎలా దూకుతున్నయ్యో, అదృష్టం అంటే వాటిది”

    “నా పని ఇంతేనా”

    “ఎవరి అదృష్టం వారిది. ఏమీ చేయలేము.”

    శ్రీ రామచంద్ర ప్రభువు సీతాదేవితో వనవిహారానికి వొచ్చాడు. శశి ప్రభ ఉన్న చెట్టు దగ్గర నించీ ఏదో మాట్లాడుకుంటూ వెళుతున్నారు. పూలబాలలన్నీ పోటీపడి రామచంద్రుడి మీద దూకేస్తున్నయ్యి. అలా ధారా ప్రవాహంలా పడుతున్న పూలతో సీతాదేవి పొట్టుపొట్టై పోతోంది

    సీతాదేవి ఒక్క క్షణం ఆగింది.

    శశికి రాముడు స్పష్టంగా కనిపిస్తున్నాడు, ఆ నీలమేఘఛ్ఛాయా, ఆ నల్లని జటా, కిందుగా అందమైన ఆ ముఖమూ కనిపించి తనని పరవశురాలిని చేస్తున్నయ్యి. పాదాలమీద పడదామని ప్రయత్నం చేస్తోంది. రాముడి ముఖాన్నే కళ్ళార్పకుండా చూస్తోంది. మనసంతా రాముడే ,కనిపించేదంతా రాముడే, జగమంతా రాముడే ఇంకేమీ లేదు అనిపించింది.

    ఆయన పాదాల మీద పడకుండా ఈ ప్రకృతి తనని అన్యాయం చేస్తోంది అనుకుంది శశి.

    ఇంతలో సీతమ్మ నవ్వుతూ రాముడికి శశివైపు వేలు చూపించింది. “అదిగో ఆ చిటారు కొమ్మన ఉన్న పువ్వు కావాల”ని.

    “ఈ ఆడవాళ్ళకి తమ దగ్గర వున్న అద్భుతవిషయాలేవీ అక్కర్లేదు. కానీ ఎంత చిన్నదైనా, ఏ కొండ చివరో , ఏ చెట్టు పైనో ఉన్న దుర్లభమైన విషయాలే కావాలి”

    అని శశి నవ్వుకుంది.

    పూల తల్లి అయిన చెట్టు వైపు తిరిగి “అమ్మా, నా వైపు వేలు చూపించింది సీతమ్మ కావాలని. మిగతా పూలన్నీ రామచంద్రుడి మీద పడటానికి ప్రయత్నిస్తే నన్ను కొయ్యాలని రాముడు ప్రయత్నిస్తాడు చూడమ్మా. నేనెంత అదృష్టవంతురాలినో చూడు.” అంది.

    పూలతల్లి నవ్వింది.

    ఇంతలో రామప్రభువు కోదండంతో చెట్టు కొమ్మని వొంచాడు. శశికి ఉద్వేగం హెచ్చింది. “వొస్తానమ్మా” అంది గద్గదస్వరంతో. ” శుభం. నీ మూలాన నాకు కూడా రాముడి కర స్పర్శ తగులుతోంది” అంది పూలతల్లి.

    రాముడు కొమ్మ పూర్తిగా వొంచాడు. సీత మెల్లిగా పూల రేకులని రుద్దుతూ “ఎంత మోహనంగా ఉందో చూడండి. ఎంత మధురమైన వాసనో ” అంటూ పూవుని వాసన చూసి రాముడివైపు పూవుని చూపించింది. శశి వేరేలోకంలో ఉంది. రాముడి ముఖం అంత దగ్గరగా రావటం చూసి హర్షోత్ఫుల్ల అయ్యింది. కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నయ్యి. రాముడు శశిని కాడ దగ్గర పట్టుకుని కొద్దిగా వంచి ఆఘ్రాణించి ” చాలా బావుంది” అన్నాడు.

    సీతాదేవి ” తలలో పెడతారా ” అంది.

    రాముడు కొమ్మని వొదిలేస్తూ “ఇది రేపటిపువ్వు” అన్నాడు.

    శశిని ఓదార్చటం పూలతల్లి వల్లకావట్లేదు. రాముడి కరస్పర్శా, ముఖస్పర్శా తగిలి ఇంకా మిగిలి ఉన్నందుకు పొగిలి పొగిలి మనసు పగిలి ఏడుస్తోంది. “మళ్ళీ వొస్తాడులే నీకోసం” “మిగతావాళ్ళు అందరి కంటే నువ్వే నయం, వాళ్ళు పైనించి ఒక్క క్షణం స్పర్శ కోసం దూకేశారు నిన్ను కావాలని రాముడే ముట్టుకున్నాడు చూడు” లాంటి మాటలు తనని ఓదార్చట్లేదు. కళ్ళు తుడుచుకుంది.

    ఆ క్షణం నించీ ఒకటే దృష్టి. ఆ పర్ణశాలవైపే. సీతారాములు మెల్లిగా నడిచి వెళ్ళుతున్నంతసేపూ దృష్టి నిలిపి రాముణ్ణే చూసింది. ఎంతసేపు చూడగలదో ఆవైపే అలాగే చూస్తోంది. మెల్లిగా సీతారాములు పర్ణశాల లోపలికి వెళ్ళారు. ఇంకాఅలాగే నిక్కి నిక్కి చూస్తోంది.

    సాయంత్రమైంది.

    రాముడు ఒకసారి బైటికి వొచ్చాడు.

    శశి మనస్సు విచ్చుకుంది.

    తన దగ్గరకు వొస్తాడేమో అనుకుంది. ఇంతలో రాముడు లోపలికివెళ్ళి పోయాడు .

    రాత్రి అయ్యింది. శశికి నిద్దరలేదు. సూర్యోదయం కాకుండానే లేచి రాముడికోసం ఎదురు చూపులు మొదలెట్టింది.

    రాముడు లేచి అటూ ఇటూ తిరిగి ఏవో పనులు చేస్తూ సీతతో కబుర్లు చెబుతున్నాడు. లక్ష్మణుడు పెద్దపనులన్నీ చూస్తున్నాడు. నిన్న తగిలిన రాముడి చేతి వేళ్ళ స్పర్శా, సీతాదేవీ రాముడి ఆఘ్రాణమూ ఆలోచిస్తున్న కొద్దీ శశిని ఉత్తేజితం చేస్తున్నయ్యి. మళ్ళీ మళ్ళీ,దగ్గరగా చూసిన రాముడి ముఖమే గుర్తుకొస్తోంది. పూర్ణానందుడూ, పరమానంద సుధా నిధానుడూ అయిన రామ పరబ్రహ్మం తన దగ్గరకు మళ్ళీ వొస్తుందా అని వితర్కించుకుంది. ఎవరికీ అందనివాడూ, జగన్మోహనుడూ అయిన ప్రభువుతో ఒక్కక్షణం ఈ జీవితానికి చాలదూ అని రెప్పలల్లార్చింది.

    రెండు రోజులైంది.

    పొద్దుణ్ణించీ పర్ణశాల వైపు తప్పితే ముఖం తిప్పట్లేదు.

    తుమ్మెదలు వొస్తే “నా దగ్గర ఉన్నవి అన్నీ రాముడివి. పొండి” అని కసురుకుంటే అవి ఎక్కువ రొద పెట్టాయి.

    మిగతాపూలన్నీ “ఎంత గీర” అని అనుకొంటున్నాయి.

    పూలతల్లి మెల్లిగా వెన్ను నిమిరి సముదాయిస్తోంది.

    శశి తల తిప్పట్లేదు. తనువూ, మనస్సూ రామార్పణం చేసిన యోగిని లాగా స్థిరంగా చూస్తోంది. రాముణ్ణి చూట్టం తప్పితే ఏ కోరికా లేకుండా నిర్వికారంగా నిశ్చలంగా చూస్తోంది.

    వారం రోజులైంది.

    పువ్వు పూర్తిగా వికసించింది.

    తన మీదుగా వీచే వాయువులు కూడా రామ ప్రభువు దగ్గరకే చేరాలని తాపత్రయపడే శశి కోరిక తెలిసే ఏమో గాలి పర్ణశాల వైపు వీచింది.

    సీతమ్మ జడవేసుకుంటూ ఆ సుగంధాన్ని ఒక్కసారి ఆఘ్రాణించి తల తిప్పింది. అక్కణ్ణించే ఆవిడకి సుమనోహరంగా, సుమధుర పరిమళ విజిత సౌగంధికంగా ,సురభిళ పారిజాత పాదప ప్రసూన సమానంగా, మహోత్కృష్ట మణిభూషణ విరాజిత మహావిష్ణు వక్షస్స్థల విభాసిత వైజయంతీ దామాధిక మనోహరంగా ఉన్న పువ్వు కనిపించింది.

    కొత్తగా ఒక విషయాన్ని చూశాననే ఒక ఉత్సాహమూ, చూసిన దాన్ని సొంతంచేసుకోవాలనే ఒక ఆత్రుతా, సొంతం చేసుకున్నదాన్ని అనుభవించాలనే కోరికా, అనుభవించి ఆనందించాలనే ఒక తపనా, కలిగి సీతాదేవి చేస్తున్న పని ఆపి చటుక్కున లేచి భర్త దగ్గరకి వెళ్ళి దూరం నించే వనానికి అంతా శోభనిస్తున్న ఆ పూవుని చూపించింది.

    శశి చూసింది.

    తన గుండె ఒక్కసారి ఆగిపోయి కొట్టుకుంది.

    రామ ప్రభువుకి తనని చూబిస్తూ సీతాదేవి చెబుతున్నది చూస్తూంటే శశికి ఆనందంతో నోట మాట రాలేదు. రాముడే వొచ్చి తనని కోసుకుని వెళ్తాడని కలలో కూడా ఊహించనిది నిజమౌతుంటే తల్లకిందులైపోయింది. పూలతల్లిని కేకవేసి పిలిచి అంతా చెప్పింది.

    ” నీలాంటి బంగారు మనస్సున్న పువ్వుకి ఇలాగే జరుగుతుంది” అని పూలతల్లి వెన్ను నిమిరింది.

    సీతమ్మ ఏమి చెప్పిందో ఏమో, రామయ్య తండ్రి జగన్మోహనంగా నడుచుకుంటూ వొస్తున్నాడు.

    వొస్తుంటే శశి కళ్ళార్పకుండా, మళ్ళీ ఈ అవకాశం రాదనుకుని చూస్తోంది.

    మెల్లిగా వొచ్చి చెట్టు కింద నిలబడి మెల్లిగా కొమ్మవంచాడు రామయ్య.

    శశి ఆనందంతో దేహధ్యాస వొదిలింది.

    రాముడు మెల్లిగా పువ్వుని స్పృశించాడు.

    శశి మనస్సు అంతా రామ మయమై పోయి రాముడి స్పర్శతో అన్ని బంధాలూ వొదిలించుకుంది.

    మెల్లిగా రాముడు పువ్వుని మొత్తం సున్నితంగా ముట్టుకుంటుంటే “నాతో వొస్తావా” అన్నట్టు వినిపించింది. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని పూలతల్లి వైపు తిరిగి వొస్తానన్నట్టు తల ఊపి చటుక్కున రాముడి చేతుల్లోకి దూకింది శశి.

    “వజ్రం లాంటి పిల్ల” అనుకుంది పూలతల్లి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here