రోగ మాయ

1
2

[dropcap]ప్రై[/dropcap]వేట్ హాస్పిటల్‌లో –
ముందుగా నువ్వు డబ్బు చెల్లించాక
నీకో బెడ్ దయతో కేటాయిస్తారు
నీ శరీరం పక్క మీద వాల్చాక –
సూదులు నీ చేతి నరాలపై దాడి మొదలెడతాయి
సెలైన్లు, ఇంజక్షన్‍లు నీ శరీరాన్ని ఆక్రమిస్తాయి
బొడ్డు చుట్టూ సూదులు తాండవమాడతాయి
గంటకో మందు బిళ్ళ గొంతులో దిగబడుతుంది
అవసరమో, అనవసరమో మందులు
మూకుమ్మడి దాడిని చేస్తాయి
నిన్ను మత్తులోకి నెట్టేస్తాయి
అవి నువ్వు బతకడానికంటే
ఆసుపత్రి యాజమాన్య దోపిడికే అని
నీకు అర్థమవుతూ ఉంటుంది
రోగం పెట్టే బాధ కంటే
హాస్పిటల్ హింసే నిన్ను ఎక్కువ బాధిస్తుంది
ఒక రోజులో డిశ్చార్జ్ చేసే రోగమైనా
ఆసుపత్రి వారి అత్యాశ అనవసరంగా
నిన్ను ICU లోకి నెట్టేస్తుంది.
నిన్ను వారమో, పది రోజులో బందీని చేస్తారు
చెఱసాలకు మించిన శిక్షను అనుభవిస్తావు
బిల్లు నీ కళ్ళెదుట ప్రత్యక్షమై
నీ గుండె బెల్లును మోగిస్తుంటుంది.
నీ అదృష్టం బావుండి బయటపడితే –
నీవు చెల్లించిన డబ్బులో
సగం బిల్లే నీ చేతికి వస్తుంది.
ఎందుకింత తక్కువ కిస్తున్నారని
ప్రశ్నించే ధైర్యం కూడా నీకు నశిస్తుంది
ఒక వేళ అడిగినా ‘అదంతే’ అని
సమాధానం వస్తుంది.
రోగం సంగతేమో గాని –
చికిత్సా మాయాజాలంలో నువ్వు
చిక్కి శల్యమై పోతావు
చివరికి –
నీ ఉనికినే కోల్పోతావు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here