[dropcap]నా[/dropcap] బాల్యమంతా హైదరాబాద్‌లో గడిచింది. 1980వ దశకం నా బాల్యానికి చిరునామా. అద్దె ఇళ్ళతో ఉండేవాళ్ళం. పదిహేనేళ్ళలో ఐదు ఇళ్ళు మారాం. ఇంటి బయటి రోడ్డే ఆటస్థలం. మొదట్లో స్కూలుకి వెళ్ళే దారిలో ఓ సినిమా థియేటర్ ఉండేది. ఆ పోస్టర్లు వింతగా చూస్తూ ఉండేవాడిని. అప్పట్లో మార్నింగ్ షోలో పాత సినిమాలు ప్రదర్శించేవారు. ‘పరమానందయ్య శిష్యుల కథ’ అక్కడే చూశాను. బాలజ్యోతి, చందమామ పత్రికలు ప్రతి నెలా కొనుక్కుని చదివేవాడిని. ‘బాలల బొమ్మల రామాయణం, మహాభారతం, కృష్ణలీలలు’ పుస్తకాలు చదివేవాడిని. పాస్‌పోర్ట్ ఫొటో సైజులో దేవుళ్ళ చిత్రాలు అమ్మేవారు; వాటిని సేకరించేవాడిని. తర్వాత మా అమ్మ వాటిని మా అమ్మమ్మకి ఇచ్చేసింది. వినాయకచవితి, దీపావళి ఎంతో ఇష్టమైన పండుగలు. వినాయకచవితికి కొన్న విగ్రహం పూజ గూట్లో సంవత్సరమంతా ఉండేది. పండగకి కొత్త విగ్రహం కొని రెండు విగ్రహాలకూ పూజ చేసి పాత విగ్రహం నిమజ్జనం చేసేవాళ్ళం. దీపావళికి పెరుగు గారెలు (ఆవడలు) స్పెషల్. శివరాత్రికి ఒకసారి ఉపవాసం చేస్తానని పట్టుబట్టి సాయంత్రం నాలుగింటికి ఆకలి తట్టుకోలేక అన్నం తినేయటం ఇంకా గుర్తే.
మా అమ్మ అప్పుడప్పుడూ ఫొటో స్టూడియోకి తీసుకెళ్ళి నాకు, చెల్లికి ఫొటోలు తీయించేది. ఆ ఫొటోలలో నేను ఒక చెయ్యి ఎప్పుడూ కాస్త వెనక్కి పెట్టేవాడిని. ఫొటో వచ్చే దాకా తెలిసేది కాదు. ఇప్పట్లా డిజిటల్ ఫొటోలు కాదు మరి. టీవీ చూడటానికి పక్కింటికో స్నేహితుల ఇంటికో వెళ్ళేవాళ్ళం, సొంత టీవీ కొనుక్కునేవరకు. ఒకటే చానల్. హిందీ సీరియల్స్ చూసేవాళ్ళం. శనివారం సాయంత్రం తెలుగు సినిమా, ఆదివారం సాయంత్రం హిందీ సినిమా. సినిమాలకు అప్పుడప్పుడూ వెళ్ళేవాళ్ళం. రెస్టారెంట్‌కి వెళ్ళిన గుర్తు లేదు, తిరుపతి లాంటి ప్రదేశాలకు యాత్రలకు వెళ్ళినప్పుడు తప్ప. భోజనం ఎప్పుడూ ఇంట్లోనే. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో జ్ఞాపకాలు. ఇప్పుడు ఆ పరిస్థితులూ లేవు, ఆ పద్ధతులూ లేవు. ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది?
మెక్సికో సిటీలో పెరిగిన ఆల్ఫాన్సో క్వరాన్ తన బాల్యం జ్ఞాపకాలతో తీసిన సినిమా ‘రోమా’ (2018). ఎగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి, తల్లి, బామ్మ, నలుగురు పిల్లలు ఉంటారు. ఇద్దరు పనిమనుషులు, ఒక డ్రైవరు. ఒక పనిమనిషి క్లియో పిల్లలను చూసుకుంటుంది. ఇంకో పనిమనిషి అదేలా వంటపనులు చూస్తుంది. ఇంటి వెనుక భాగంలో ఒక గదిలో ఇద్దరూ ఉంటారు. తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు. పిల్లలకు ఈ విషయం తెలియకుండా తల్లి జాగ్రత్త పడుతుంది. క్లియోకి ఒక ప్రియుడు ఉంటాడు. ఆమె గర్భవతి అని తెలిసి అతను ఆమెని వదిలి వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితులలో ఆ కుటుంబం, క్లియో ఎలా ఒకరికొకరు తోడుగా నిలిచారు అనేది మిగతా కథ.
క్వరాన్ తన ఆయా లిబోకు ఈ చిత్రాన్ని అంకితం ఇచ్చాడు. అయితే ఇది కల్పిత కథే. తన మాతృభాష స్పానిష్‌లో తీశాడు. ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం చిన్ననాటి జ్ఞాపకాలను తెరకు ఎక్కించటమే. తల్లికి, ఆయాకి కృతజ్ఞతలు చెప్పటమే. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించేలా బ్లాక్ అండ్ వైట్ లోనే ఈ సినిమాని తీశాడు క్వరాన్. 1970 దశకం లోని రోమా అనే కాలనీని తిరిగి సృష్టించాడు. అప్పట్లో టీవీ సిగ్నల్ల కోసం ఇంటి పైన యాంటెనాలు ఉండేవి. అవి కూడా కనబడతాయి. క్వరాన్ తానే స్వయంగా ఛాయాగ్రహణం చేశాడు. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాన్ని క్లియో కడుగుతుండగా చిత్రం మొదలవుతుంది. ఈ సన్నివేశం పేర్లు అయేంత వరకు ఉంటుంది. పనిమనుషుల పని ఎంత రొటీన్‌గా ఉంటుందో మనకు తెలిసిందే. అయినా ఓపికగా చేస్తారు. వారి పనిని మనం చిన్నచూపు చూస్తాం. కానీ వారు ఆ పని చేయకపోతే మనకు గడవదు. కింద ఉన్న నీళ్ళలో పైన దూరంగా వెళ్ళే విమానం కనపడుతుంది. ప్రపంచం ఎంత వేగంగా కదిలిపోతున్నా పనిమనుషులు మాత్రం వారి పని వారు చేయాలి.
ఇంట్లో ఓ పెంపుడు కుక్క ఉంటుంది. పిల్లలు స్కూలు నుంచి రాగానే ఇంట్లో సందడి మొదలవుతుంది. మేడ పైన క్లియో బట్టలు ఉతుకుతుంటుంది. పిల్లలు ఆట కత్తులతో ఆడుకుంటూ పైకి వస్తారు. “నిన్ను నేను చంపేశా” అంటాడు అన్న. “ఎప్పుడూ నేనే ఎందుకు చావాలి” అంటాడు తమ్ముడు. “ఇది నా ఆట కాబట్టి” అని అన్న వెళ్ళిపోతాడు. తమ్ముడు అక్కడ ఉన్న తిన్నె మీద పడుకుంటాడు. క్లియో ఏం చేస్తున్నావంటే “నేను చచ్చిపోయాను” అంటాడు. క్లియో కూడా తిన్నె మీద పడుకుంటుంది. పిల్లవాడు ఏం చేస్తున్నావంటాడు. “నేను కూడా చచ్చిపోయాను” అంటుంది క్లియో. అలా కాసేపు పడుకుని ఉంటారు. “అబ్బ. ఇలా చచ్చిపోవటం బలే బావుంది” అంటుంది క్లియో. చావులోనే విశ్రాంతి పొందే జీవితం ఆమెది.
ఈ పిల్లల ఆటలు మన చిన్నప్పటి ఆటలను గుర్తు చేస్తాయి. ఒక సందర్భంలో పెద్దబ్బాయి, రెండో అబ్బాయి దెబ్బలాడుకుంటూ ఉంటారు. బామ్మ అడ్డుపడుతూ ఉంటుంది. రెండో అబ్బాయి కోపంతో ఒక పేపర్ వెయిట్‌ని అన్న మీద విసురుతాడు. అన్న తప్పించుకోగా అది కిటికి అద్దానికి తగిలి అద్దం పగులుతుంది. బామ్మ తిట్టిపోస్తుంది. రెండో అబ్బాయి ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. మన చిన్నతనంలో ఇలాంటి సంఘటన ఒక్కటైనా జరిగి ఉంటుంది. నేను కాస్త ఎదిగాక మా పిన్ని కొడుకుకి విల్లు చేసిపెడితే వాడు దాన్ని విరిచేశాడు. దాంతో నా దగ్గర ఉన్న కర్రతో వాణ్ణి కొట్టాను. మా అమ్మ నన్ను విపరీతంగా తిట్టింది. నేను చాలా బాధపడ్డాను.
తండ్రి ఇంటికి కారులో వచ్చి ఇరుకుగా ఉన్న ప్రదేశంలో కారుని పార్క్ చేయటానికి అనేక మార్లు కారుని ముందుకీ వెనక్కీ తిప్పుతాడు. చాకచక్యంగా ఎక్కడా తగలకుండా పార్క్ చేస్తాడు. ఇలాంటివి కొన్ని ఎవరికి వారికి ఉండే చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలు. అయితే కుక్క విసర్జించిన మలం మీదుగా కారు చక్రం వెళ్తుంది. ఒక ప్రేక్షకుడిగా మనకు అసౌకర్యం కలుగుతుంది. రాబోయే కష్టాలకు సూచన ఈ సన్నివేశం. తర్వాత “అసలేమీ సరిగా ఉండదు ఈ ఇంట్లో. ఎక్కడ పడితే అక్కడ కుక్క మలం” అంటాడు తండ్రి విసుక్కుంటూ. తల్లి ఆ మాటలు బయటకి వినపడకుండా తలుపు వేసేస్తుంది. మగవాడికి విసుగు వస్తే అనేక వంకలు పెడతాడు. కొందరికి సరదాలే కానీ బాధ్యతలు పట్టవు. సరదా తీరిపోతే వేరే దారులు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇతనూ అలాగే వెళ్ళిపోతాడు. తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి. స్నేహితుల ద్వారా అనేక విధాల ప్రయత్నిస్తుంది.
పిల్లలను పడుకోబెట్టటం, నిద్ర లేపటం క్లియో పని. ఆఖరి పిల్లవాడికి తిండి కూడా ఆమే పెడుతుంది. అందరూ కలిసి టీవీ చూస్తుంటే పని చేసుకుంటూ కాసేపు కింద కూర్చుని టీవీ చూస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి టీవీ చూసే పద్ధతి లేదు. ఎవరి ఫోను వారిదే, ఎవరి స్క్రీను వారిదే. క్లియోకి, ఆమె తోటి పనిమనిషి అదేలాకి వారానికో పూట సెలవు. అదేలాకి ఒక ప్రియుడు. అతని ద్వారా క్లియోకి ఫెర్మిన్ పరిచయమౌతాడు. అతని వల్ల ఆమె గర్భవతి అవుతుంది. ఓరోజు సినిమా చూస్తూ ఉండగా ఆమె అతనికి తన గర్భం సంగతి చెబుతుంది. అతను టాయిలెట్‌కి వెళ్ళి వస్తానంటూ వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు. క్లియో అతని కోసం థియేటర్ బయట చూసే సన్నివేశం కన్నీరు తెప్పిస్తుంది. అక్కడ బొమ్మల వ్యాపారస్థులు బొమ్మలు అమ్ముకుంటూ ఉంటారు. పిల్లల్ని ఆకర్షించటానికి అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. క్లియో ఫెర్మిన్ కోసం నలుపక్కలా చూస్తూ ఉంటుంది. ప్రపంచం తన దారిన తాను నడుస్తూనే ఉంటుంది. ఎవరి కోసం ఏదీ ఆగదు. మన పక్కవారి గుండెల్లో ఎలాంటి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో మనకు తెలియదు. మన కంటే కష్టాలు పడేవారు ఎందరో ఉంటారు.
తన గర్భం సంగతి యజమానురాలికి చెబుతుంది క్లియో. “నన్ను పని లోంచి తీసేస్తారా?” అంటుంది కన్నీరు పెట్టుకుంటూ. అప్పటికే భర్త చేతిలో మోసపోయిన యజమానురాలు “పిచ్చిదానా! నీ బాగోగులు నేను చూసుకుంటాను” అంటుంది. మగవారి చేతిలో మోసపోయిన ఆడవారు ఒకరికొకరు తోడు ఉండకపోతే ఎలా అని ఆలోచించే మంచి మనసు ఆమెది. కట్టుబాట్ల పేరుతో తెలిసిన వారిని కూడా దూరం పెట్టేవారు ఇది చూసి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆఖరి పిల్లవాడు వచ్చి క్లియో ఎందుకు ఏడుస్తోంది అని అడుగుతాడు. కడుపు నొప్పి అంటుంది తల్లి. నొప్పి వెంటనే పోవాలి అని క్లియో కడుపుని నిమురుతాడు పిల్లవాడు. ఆమె పిల్లవాణ్ని హత్తుకుని మౌనంగా రోదిస్తుంది. కాలాన్ని వెనక్కి తిప్పలేని అశక్తత అది. క్లియోని ఆసుపత్రికి తీసుకువెళుతుంది యజమానురాలు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న రెండు భారీ వాహనాల మధ్య తన కారుని పోనివ్వటానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె అంచనా తప్పు కావటంతో కారు రెండు వాహనాలకి తగులుతుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు మరి. కారు నడపటమైనా అంతే, జీవితమైనా అంతే. అంచనాలు తారుమారవుతాయి. ఈ విషయాన్ని ప్రతీకాత్మకంగా సూచించాడు క్వరాన్. అలా గీతలు పడిన కారు వారి దగా పడ్డ జీవితాలకు సంకేతంగా ఉండిపోతుంది.
బామ్మ పాత్ర గురించి మొదట్లో క్లియో, అదేలా గుసగుసలాడుకుంటుంటారు. ఎప్పుడూ వాళ్ళను గమనిస్తూ ఉంటుందని, వారి గదిలో లైటు ఎక్కువసేపు వేసి ఉంచితే గొడవచేస్తుందని అనుకుంటారు. కానీ క్లియోకి పుట్టబోయే బిడ్డ కోసం ఉయ్యాల కొనటానికి బామ్మే తీసుకువెళుతుంది. కొందరికి కొన్ని చాదస్తాలు ఉంటాయి. చూసీ చూడనట్టు వదిలేయాలి. పిల్లల పాత్రల చిత్రణ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, చివర ఒక అబ్బాయి. పెద్ద అబ్బాయిలో పరిణతి కనబడుతుంది. అయినా రెండో వాడితో దెబ్బలాడుతూ ఉంటాడు. ఇంకా పూర్తిగా చిన్నతనం పోలేదు. రెండో వాడు చిన్నవాడితో ఆడుతుంటాడు. పెద్దవాడికి తండ్రి ఇంటికి రాకపోవటంపై అనుమానం వస్తుంది. తండ్రి కెనడాలో ఉన్నాడని తల్లి అబద్ధం చెబుతుంది. పెద్దవాడు ఒకరోజు తల్లి ఫోన్లో తండ్రితో మాట్లాడుతుంటే గది తలుపు బయట నిల్చుని వింటాడు. తల్లి కోప్పడుతుంది కానీ వెంటనే అతన్ని కౌగిలించుకుని విలపిస్తుంది. తాము విడిపోతున్న సంగతి తల్లి పిల్లలకు చెప్పినపుడు పెద్దవాడు గంభీరంగా ఉంటాడు. రెండో వాడు, అమ్మాయి ఏడవటం మొదలుపెడతారు. చిన్నవాడు అమాయకంగా చూస్తూ ఉంటాడు. చిన్నవాడు అప్పుడప్పుడు తన పూర్వజన్మ గురించి క్లియోకి చెబుతుంటాడు. మెక్సికోలో ఆదివాసీల జాతికి చెందిన క్లియో పూర్వజన్మలను నమ్మటంలో ఆశ్చర్యం లేదు. ఏ దేశంలో చూసినా ఆదివాసీలు తమ ఆచారాలను కాపాడుకుంటూ ఉంటారు. వారిని వెనకబడినవారిగా మిగతావారు చూస్తూ ఉంటారు. ఎంత అన్యాయం!
తర్వాతి కథ చూస్తేనే బావుంటుంది. మురికివాడల్లో క్లియో ఫెర్మిన్‌ని వెతికే దృశ్యాలు మన మురికివాడల్ని గుర్తు తెస్తాయి. ఆ జీవితం నుంచి బయటపడాలని చూసేవారిని వాడుకునేవారు కూడా ఉంటారు. రెచ్చగొట్టి వారిని తమ ప్రయోజనాలకు వాడుకుంటారు. అడకత్తెరలో పోకచెక్కలా క్లియో లాంటి వారు నలిగిపోతుంటారు. 1971లో మెక్సికో సిటీలో జరిగిన కార్పస్ క్రిస్టీ ఊచకోత కూడా ఈ చిత్రంలో చూపించారు. ఈ సన్నివేశాన్ని క్వరాన్ చిత్రీకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కథలో ఈ ఉదంతం ఇమిడిపోయిన తీరు క్వరాన్ ప్రతిభకి తార్కాణం. అలాగే క్లియో సముద్రం లోకి నడిచి వెళ్ళే సన్నివేశం కూడా అనితరసాధ్యంగా తీశాడు. ఒక పక్క నుంచి సూర్యుడు ప్రకాశిస్తుండగా క్లియో తీరం మీద నుంచి సముద్రం వైపు నడిచి సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కెమెరా అలజడి మనకు కనిపించదు. అలల ఉధృతి పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు కనపడుతూ ఉంటాడు. ఇదంతా ఒకే షాట్‌లో తీశాడు. ఎందుకు ఆమె సముద్రంలోకి వెళ్ళింది అనేది చూడవలసిందే.
‘రోమా’కు ఆస్కార్లలో ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి (క్లియోగా నటించిన యాలిత్జా అపరీసియో), ఉత్తమ సహాయనటి (యజమానురాలిగా నటించిన మరీనా దె తవీరా), ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ సౌండ్ నామినేషన్లు వచ్చాయి. ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ఛాయాగ్రహణం అవార్డులు దక్కాయి. నెట్‌ఫ్లిక్స్ స్వయంగా నిర్మించిన చిత్రమిది. సినిమాలను ఇంట్లో కాక థియేటర్లలోనే చూడాలనే సంప్రదాయవాదులైన ఆస్కార్ సభ్యుల కారణంగా ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు దక్కలేదనే వాదన వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
చిత్రంలో తర్వాతి కథ విశ్లేషణ కోసం కింద చదవండి. చిత్రం చూడనివారు చూసిన తర్వాత చదవవచ్చు. ప్రస్తుతం చుక్కలు వచ్చేదాకా వదిలేసి కింద చదవండి.
మురికివాడలో వెతుక్కుంటూ వెళ్ళిన క్లియోకి ఒకచోట పోరాటానికి శిక్షణ పొందుతూ ఫెర్మిన్ కనపడతాడు. నీలాంటి పనిమనిషికి, నాకు ఏ సంబంధమూ లేదని వెళ్ళిపోతాడు. బామ్మగారితో ఉయ్యాల కొనటానికి క్లియో వెళ్ళినపుడు బయట అల్లర్లు చెలరేగుతాయి. ఇదే కార్పస్ క్రిస్టీ ఊచకోత సంఘటన. దుకాణంలోకి దూసుకొచ్చినవారు కొందరిని కాల్చి చంపేస్తారు. వారిలో ఫెర్మిన్ కూడా ఉంటాడు. ఆవేశంలో తుపాకీ గురిపెట్టిన అతను తాను గురిపెట్టినది క్లియో మీద అని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేరేవాడైతే ఆమెను చంపేసేవాడేమో! అక్కడే ఆమెకి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఆసుపత్రికి తీసుకువెళతారు. కానీ మృతశిశువు జన్మిస్తుంది. ఆడపిల్ల. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రాణం పోయలేరు.
ఇంటికి తిరిగి వచ్చిన క్లియో విచారంగా ఉంటుంది. యజమానురాలు పిల్లలని విహారయాత్రకు తీసుకువెళుతూ క్లియో వెంట రమ్మంటుంది. పిల్లల బలవంతం మీద వెళుతుంది క్లియో. సముద్రతీర ప్రాంతానికి వెళతారు. అక్కడే యజమానురాలు తన పిల్లలకి తండ్రి వెళ్ళిపోయిన సంగతి చెబుతుంది. తాను కొత్త ఉద్యోగం చేస్తానని, తామందరూ కొత్త జీవితం ప్ర్రారంభించవచ్చని చెబుతుంది. మర్నాడు సముద్రతీరానికి వెళతారు. అక్కడ జనం చాలా తక్కువ ఉంటారు. కారులో సామాను సర్దటానికి తల్లి, పెద్దకొడుకు వెళతారు. రెండో కొడుకు, కూతురు ఇంకాసేపు ఆడుకుంటామని మారాం చేస్తారు. తీరంలోనే ఉండాలని చెప్పి క్లియోని చూడమని వెళుతుంది తల్లి. చిన్నవాడికి ఒళ్ళు తుడుస్తుండగా ఇద్దరు పిల్లలూ సముద్రంలోకి వెళ్ళటం చూసి సముద్రంలోకి వెళుతుంది క్లియో. ఆమెకి ఈత రాదు. అయినా పిల్లలు మునిగిపోతుండటం చూసి సముద్రంలోకి వెళుతుంది. అలల ఉధృతిని తట్టుకుని వెళుతుంది. పిల్లల్ని కాపాడి తీరానికి తీసుకొస్తుంది. అప్పుడే వచ్చిన తల్లికి “క్లియో మమ్మల్ని కాపాడింది” అని చెబుతారు పిల్లలు. అందరూ క్లియోని కౌగిలించుకుంటారు. “నా బిడ్డను వద్దనుకున్నాను. అది పుట్టకూడదని అనుకున్నాను. దాని తప్పేముంది?” అని రోదిస్తుంది క్లియో. తర్వాత అందరూ ఇంటికి చేరతారు. క్లియో మళ్ళీ పనిలో మునిగిపోతుంది.
తాను వద్దనుకోవటం వల్లే బిడ్డ చచ్చిపోయిందని క్లియో బాధపడుతుంది. తండ్రి లేకుండా పనిమనిషిగా పనిచేస్తూ ఎలా పెంచుతాను అనుకుంది. తాము చేసిన తప్పుకి బిడ్డ శిక్ష అనుభవించిందని బాధపడుతుంది. యజమానురాలి పిల్లల మీద అవ్యాజమైన ప్రేమ చూపించింది. ఇలాంటి వారిని పెద్దయ్యాక ఎంతమంది గుర్తుంచుకుంటారు? తన బిడ్డని డాక్టర్లు కూడా రక్షించలేకపోయారు. తాను వేరొకరి బిడ్డల్ని ప్రాణాలకు తెగించి రక్షించింది. కొవ్వొత్తి తాను కరిగిపోతూ ఇతరులకి వెలుగునిస్తుంది. క్లియో జీవితం కూడా అంతే. అందరూ పిల్లల్ని కాపాడినందుకు తనని హత్తుకుంటే నా బిడ్డను కాపాడుకోలేకపోయాను అనే దుఃఖం పొంగుకొస్తుంది. తుపాకీ గురిపెట్టి ఆమెకి భయం కలిగించి బిడ్డను పరోక్షంగా చంపినది ఆ బిడ్డ తండ్రే! శోకం తల్లికి మిగిలింది. చివర్లో ఇంటిపైకి బట్టలు ఆరేయటానికి వెళుతుంది క్లియో. కింద నుంచి కెమెరా ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది. ఆకాశంలో విమానం కనిపిస్తుంది. మొదట్లో నేల మీద విమానం ప్రతిబింబం చూశాం. ఇప్పుడు ఆకాశంలో చూస్తున్నాం. క్లియో ఆకాశమంత ఎత్తు ఎదిగింది అనటానికి సూచనగా. ఇలాంటి తల్లులకి పిల్లలు ఋణపడి ఉండాలి.
***
2021లో కెన్నెత్ బ్రానా తన చిన్ననాటి జ్ఞాపకాలతో ‘బెల్ ఫాస్ట్’ తీశాడు. అవార్డులు దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం స్టీవెన్ స్పీల్బర్గ్ తన చిన్ననాటి జ్ఞాపకాలతో ‘ద ఫేబుల్ మెన్స్’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సేసి అన్నట్టు “The most personal is the most creative”. మన అనుభవమే మన సృజనాత్మకతకు పునాది.