[dropcap]ప్[/dropcap]రతి సంవత్సరం ఎందరో అమ్మాయిలు అదృశ్యమౌతున్నారని గణాంకాలు చూస్తూ ఉంటాం. వీరిలో చాలామంది మానవ అక్రమ రవాణాకి గురౌతున్నారు. కొంతమంది బందీలై లైంగిక హింసకు గురౌతున్నారు. ఏ దేశమూ దీనికి మినహాయింపు కాదు. రక్షణ వ్యవస్థ వైఫల్యం, అవినీతి లేకపోతే వీరిలో చాలామంది బయటపడేవారు. బందీగా సంవత్సరాల తరబడి ఉండిపోయి, ఒక బిడ్డకు తల్లి అయిన యువతి కథ ‘రూమ్’ (2015). నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా రాసిన నవలను చిత్రంగా రూపొందించాడు దర్శకుడు లెన్నీ అబ్రహామ్సన్. కథని ఆ యువతి అయిదేళ్ళ కొడుకు దృష్టికోణం నుంచి చెప్పటం విశేషం.
చిన్నపిల్లలకు ఉండే నిష్కల్మషమైన హృదయాలు ఎంతటి శక్తిని కలిగి ఉంటాయో కదా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. సినిమా ప్రారంభంలో ఒక గదిలో జాక్, అతని తల్లి జాయ్ ఉంటారు. తల్లిని ‘మా’ అని పిలుస్తాడు జాక్. ఆ గదిని ‘రూమ్’ అని పిలుస్తాడు. ప్రేక్షకులకు అతను తన కథ చెబుతున్నట్టు ఉంటుంది కథనం. “గది పైకప్పులో ఉన్న స్కైలైట్ (అద్దంతో కప్పివేసిన చిన్న కిటికీ) ద్వారా నేను స్వర్గం నుంచి ‘మా’ దగ్గరకు వచ్చాను” అంటాడు నేపథ్యంలో. గదిలో అవసరమైన వస్తువులు ఉంటాయి. ఒక టీవీ ఉంటుంది. ఈ గదిలోనే ఇద్దరూ బందీలై ఉంటారు. జాక్‌కి ఇదే ప్రపంచం. గది బయట అంతరిక్షముంటుందని, అక్కడ వేరే గ్రహాలుంటాయని చెబుతుంది జాయ్. టీవీలో కనిపించే మనుషులు, జంతువులు, చెట్లు, సముద్రాలు కేవలం రంగులబొమ్మలని చెబుతుంది. బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో అంతకన్నా ఆ పసివాడికి ఏం చెబుతుంది? బయటి ప్రపంచం గురించి చెబితే వాడు చూడాలని మారాం చేస్తే?
రాత్రివేళ నిక్ వస్తాడు. తినటానికి కావలసినవి తెస్తాడు. జాయ్‌తో పడుకుంటాడు. అతను వచ్చే ముందు జాయ్ జాక్‌ని వార్డ్ రోబ్ (అల్మారా) లో పడుకోబెడుతుంది. జాక్‌ని నిక్‌తో కలవనివ్వదు. నిక్ మ్యాజిక్ ద్వారా తమకు కావలసిన వస్తువులు తెచ్చిపెడతాడని జాక్‌కి చెబుతుంది. అయిదేళ్ళు నిండిన జాక్‌కి బుద్ధిశక్తి కూడా పెరుగుతుంది. నిక్‌ని అడిగి ఇంకా వస్తువులు తెప్పించుకోవచ్చు కదా అంటాడు. తల్లితో వాదిస్తాడు. మారాం చేస్తాడు. ఓపిగ్గా అన్నీ భరిస్తుంది జాయ్.
ఒకరోజు నిక్ తన ఉద్యోగం పోయిందని, సరుకులు ఎక్కువ తేలేనని చెబుతాడు. అతను పడుకుని ఉండగా జాక్ వార్డ్ రోబ్ లోనుంచి ఆసక్తి కొద్దీ అతని దగ్గరకు వస్తాడు. నిక్ మేలుకుని జాక్‌తో మాట్లాడుతుంటే జాయ్‌కి మెలకువ వస్తుంది. నిక్‌ని వెనక్కి లాగటంతో అతను జాయ్ మీద దాడి చేసి బెదిరించి వెళ్ళిపోతాడు. కోపంతో వారి గదికి విద్యుత్ సరఫరా ఆపేస్తాడు. చలికాలం కావటంతో హీటర్ పనిచేయక ఇబ్బంది పడతారు జాయ్, జాక్. ఇక తప్పించుకోవటమే మార్గమని జాక్‌కి బయటి ప్రపంచం గురించి చెబుతుంది జాయ్.
ఆ చిన్ని మెదడుకి మొదట అర్థం కాదు. మనుషులూ, జంతువులూ, చెట్లూ, సముద్రాలు అన్నీ నిజమైతే అవన్నీ పట్టడానికి చోటెక్కడుందని అడుగుతాడు. ఆ గది తప్ప ఏమీ తెలియని ఆ పసివాడికి ఎలా అర్థమౌతుంది? అబద్ధమాడుతున్నావు అంటాడు. తనని నిక్ దొంగిలించి తెచ్చాడని చెబుతుంది. తన పెంపుడు కుక్క జబ్బుపడిందని అబద్ధం చెప్పి సాయం చేయమని అడిగి నిక్ తనని తీసుకువచ్చి షెడ్‌లో దాచిపెట్టాడని, అదే ఈ గది అని, తలుపులు తెరవటానికి వీలు లేకుండా సెక్యూరిటీ కోడ్ పెట్టాడని చెబుతుంది. వినలేక అరుస్తాడు. మర్నాటికి జాక్‌కి నిక్ మీద కోపం పెరుగుతుంది. జాయ్ ఒక పథకం వేస్తుంది. చలి వల్ల జాక్‌కి జ్వరం వచ్చిందని నిక్‌ని నమ్మించి జాక్‌ని ఆసుపత్రికి తీసుకువెళ్ళేలా చేస్తే అక్కడ డాక్టర్ల ద్వారా పోలీసులకి కబురు చేయొచ్చని చెబుతుంది. జాయ్, జాక్ ఎలా బయటపడ్డారన్నది చూస్తేనే బావుంటుంది.
బయట పడిన తర్వాత ప్రపంచంలో ఇమడటానికి జాక్‌కి భౌతికంగా కష్టమైతే, జాయ్‌కి మానసికంగా కష్టమౌతుంది. పదిహేడేళ్ళ ప్రాయంలో అపహరించబడి ఏడేళ్ళు బందీగా ఉన్న తర్వాత తిరిగి బయటి ప్రపంచాన్ని చూస్తుంది. తన స్నేహితురాళ్ళు ఎవరి జీవితాలు వారు గడుపుతుంటారు. నాకే ఎందుకిలా జరిగింది అనే ప్రశ్న తొలిచి వేస్తుంది. అప్పుడు కలిసి ఉన్న తలిదండ్రులు ఇప్పుడు విడిపోయారు. ఎందుకో మనం ఊహించుకోవచ్చు. ఒక్కగానొక్క కూతురు బతికి ఉందో లేదో తెలియని పరిస్థితి వారిది. ఇలాంటి సమయంలో ఎవరిది తప్పు అనే ప్రశ్న వస్తుంది. వారిలో ఒకరు అంతా మరిచిపోయి బతుకుదాం అంటే రెండో వారు ఒప్పుకోలేకపోయి ఉండవచ్చు. విడాకుల వరకు వెళ్ళిందంటే ఆశ్చర్యం లేదు.
జాయ్ తల్లి ఇంకో పెళ్ళి చేసుకుంది. వారింట్లో ఉంటారు జాయ్, జాక్. జీవితమంతా తల్లితో తప్ప వేరొకరితో మాట్లాడని జాక్ బెదురుతూ ఉంటాడు. జాయ్ తల్లి, ఆమె భర్త… జాక్‌ని ముద్దు చేస్తారు. జాయ్ తండ్రి చూడటానికి వస్తాడు. జాక్‌ని మాత్రం చేరదీయడు. తన కూతురికి జరిగిన అన్యాయానికి ప్రతిరూపంగా జాక్ కనబడతాడు. తన బిడ్డని అసహ్యించుకునే తండ్రి మీద కోపం వస్తుంది జాయ్‌కి. అతను ఉండలేక వెళ్ళిపోతాడు. ఏ తండ్రీకూతుళ్ళకీ రాకూడని పరిస్థితి ఇది. ఒక దుర్మార్గుడి పాపానికి ఎన్ని జీవితాలు బలి అయ్యాయో తలచుకుంటే హృదయం రగిలిపోతుంది.
టీవీకి అలవాటు పడిన జాక్ ఫోన్లో వీడియోలు చూస్తుంటే చిరాకుపడుతుంది జాయ్. బొమ్మలతో ఆడుకోమని చెబుతుంది. జాయ్ తల్లి జాయ్‌ని సముదాయించబోతే తల్లి మీద చిరాకుపడుతుంది. నేను లేకుండా బాగానే బతుకుతున్నావుగా అంటుంది. ఏ తల్లికైనా ఈ మాట బల్లెంలా గుచ్చుకుంటుంది. పిల్లవాడి గురించి ఆలోచించమంటుంది ఆమె తల్లి. జాయ్ తన మానవత్వమంతా పోతున్నట్టుందంటుంది. అందరితోనూ మంచిగా ఉండాలని తల్లి చిన్నప్పుడు చెప్పిన మాటలను తప్పుపడుతుంది. నువ్వలా చెప్పబట్టే నేను నిక్‌కి సాయం చేయబోయి అపహరణకి గురయ్యానని అంటుంది. ఈ మాటలకు ప్రేక్షకులకు కూడా మనసు చేదుగా అయిపోతుంది. సాయం కోరేవారికి సాయం చేయటం మంచి విషయమే. కానీ మేకల రూపంలో సాయమడిగే పులులని ఎలా గుర్తించాలి? సాయం చేయకపోతే మంచివాళ్ళ అంతరాత్మ ఊరుకోదు. సాయం చేయబోతే అపకారం తలపెడితే పరిస్థితి ఏమిటి? మోసానికి భయపడే సాయం చేయటానికి వెనకాడతారు చాలామంది. నిజంగా సాయం అవసరమైనవాళ్ళు మానవత్వం లేదా అని నిందిస్తారు. ఎవరిది తప్పు? ఏది ఏమైనా అమ్మాయిలు పరిచయం మగవారిని నమ్మకపోవటమే మంచిది.
(చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందనేది ఈ కింద ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు నెట్ ఫ్లిక్స్‌లో, ఆమెజాన్ ప్రైమ్‌లో కూడా చూడవచ్చు. చూసిన తర్వాత కింది భాగం చదవవచ్చు. ప్రస్తుతానికి కింద చుక్కలు వచ్చే దాకా వదిలేసి చదవవచ్చు.)
కోర్టులో నిక్ మీద కేసు నడుస్తూంటుంది. ఆశ్చర్యమైన విషయమేమిటంటే ఇంత జరిగాక కూడా న్యాయవిచారణ జరగటం. అందరికీ న్యాయపరంగా హక్కులుంటాయని చట్టం చెబుతోంది. జాయ్ నిక్ యే తనను అపహరించాడని చెప్పినా అతను అంగీకరించకపోయి ఉండవచ్చు. సినిమాలో మనకిది చూపించరు. మొత్తం జాక్ దృష్టికోణంలోనే కథ నడుస్తూ ఉంటుంది. జాయ్ తరఫు లాయరు కేసు తాలూకు ఖర్చులుంటాయి అని చెబుతాడు. ఒక టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు బాగా డబ్బులిస్తారని చెబుతాడు. జాయ్ మొదట ఒప్పుకోకపోయినా తల్లితో గొడవపడటంతో వేరుగా ఉండాలనుకుని తర్వాత ఒప్పుకుంటుంది. టీవీ ఛానల్ వాళ్ళకి టీఆర్పీలు కావాలి. వారి స్వార్థం వారిది.
ఇంటర్వ్యూ జరిగినంత సేపు జాక్ దూరం నుంచి చూస్తూనే ఉంటాడు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు పైకి అమాయకంగా, న్యాయబద్ధంగా అనిపించినా జాయ్ మనసుని గాయపరిచేలా ఉంటాయి. పెద్దయ్యాక జాక్‌కి అతని తండ్రి గురించి చెబుతావా అని అడుగుతుంది ఇంటర్వ్యూ చేసే ఆమె. అతను జాక్‌కి తండ్రి కాదు అంటుంది జాయ్. అంటే వేరే మగవారు కూడా ఇందులో భాగస్థులా అనేది తర్వాతి ప్రశ్న! జాయ్ అవాక్కవుతుంది. బిడ్డని ప్రేమించని వాడు తండ్రి కాదు, జాక్ నా బిడ్డ మాత్రమే అంటుంది. జాక్ పుట్టినపుడు నిక్‌కి చెప్పి జాక్‌ని ఏ ఆసుపత్రిలోనో వదిలేసి ఉండొచ్చు కదా, అలా చేస్తే జాక్ కొంతవరకు సాధారణమైన బాల్యాన్ని చవిచూసేవాడు కదా అని తర్వాతి ప్రశ్న. అతన్ని రక్షించటానికి నేనున్నాను కదా అంటుంది జాయ్. తర్వాతి ప్రశ్న – కానీ అది జాక్‌కి ఎంతవరకు మేలు చేసింది? ఈ ప్రశ్నతో జాయ్ కుంగిపోతుంది. జాక్‌ని పంపించేసి ఉంటే అతనికి మరింత మేలు జరిగేదా? జాక్ ఉండబట్టే తనకు జీవితం మీద ఆశ కలిగింది. అది తన స్వార్థమా? ఈ ఆలోచనలతో సతమతమౌతుంది. ఆత్మహత్యకి ప్రయత్నిస్తుంది. ఏడేళ్ళు బందీగా ఉన్నా ఆత్మహత్యకు పయత్నించని యువతి బయటకు వచ్చాక ఇమడలేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి సంఘమే బందిఖానా అయిపోతుంది.
సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్ళటంతో బతుకుతుంది. ఆమెకు మానసిక చికిత్స అందిస్తారు. తన కొడుకు కోసం బతకాలని నిశ్చయించుకుని తిరిగివస్తుంది. అతన్ని విడిచి వెళ్ళినందుకు సారీ చెబుతుంది. మళ్ళీ ఆ పని చేయకు అంటాడు జాక్. కొన్నాళ్ళకి తాము ఉన్న ‘గది’ని చూద్దామంటాడు. అక్కడికి వెళతారు జాయ్, జాక్. తలుపు తొలగించి ఉంటుంది. లోపలికి వెళ్ళి “ఇంత చిన్నగా ఉందేంటి” అంటాడు. మళ్ళీ తనే “తలుపు లేదు కదా, అందుకే పాత గదిలా లేదు” అంటాడు. ఇంతకు ముందు మూసి ఉన్న గదే అతని ప్రపంచం. అమ్మ ఉంటే ఇంకేం అవసరం లేదు. అమ్మ లేకపోతే ఎంత పెద్ద ప్రపంచమైనా వెలితిగానే ఉంటుంది.
***
జాక్ మొదటిసారి బయటి ప్రపంచాన్ని చూసినపుడు కదులుతున్న ఒక టెంపో లాంటి వాహనంలో వెనక వెల్లకిలా పడుకుని ఉంటాడు. ఆకాశాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత తల్లిని ఇది వేరే గ్రహమా అని అడుగుతాడు. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. చెట్లు ఒక అద్భుతం. పువ్వులు అద్భుతం. చూడటానికే మనకి తీరిక లేదు. ‘స్టాప్ అండ్ స్మెల్ ద రోజెస్’ అని ఆంగ్ల నానుడి. ఎప్పుడూ హడావుడిగా ఉండకుండా జీవితాన్ని ఆస్వాదించాలి అని అర్థం. అదే నిజమైన ఐశ్వర్వం.
మామూలుగా అపహరణ అంశంగా గల చిత్రాల్లో అపహరణ ఎలా జరిగింది, నేరస్థులు ఎలా పట్టుబడ్డారు, ఏం శిక్ష పడింది అనే విషయాలు చూపిస్తారు. కానీ ఈ చిత్రంలో అవేమీ చూపించలేదు, బాధితుల జీవితాలే చూపించారు. ప్రతి సన్నివేశంలోనూ జాక్ ఉంటాడు. పిల్లలు కొత్త విషయాలు ఎంత తొందరగా నేర్చుకుంటారో, సరైన దారి చూపిస్తే ఎంత తెలివిగా వ్యవహరిస్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జాక్‌గా జేకబ్ ట్రెంబ్లే నటించాడు. ఆ బాలనటుడి నుంచి అద్భుతమైన నటన రాబట్టాడు దర్శకుడు లెన్నీ అబ్రహామ్సన్. జాయ్‌గా నటించిన బ్రీ లార్సన్ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుంది. ఆ సంవత్సరం ఆమెకు అవార్డ్ ఇవ్వటం అనివార్యం అయిపోయేంత గొప్పగా నటించింది. నిస్సహాయతలో కూడా జాక్‌తో సహనంగా వ్యవహరిస్తుంది. జాక్ మారాం చేసినపుడు చిరాకు పడకుండా తనలో తానే కుమిలిపోయే అభినయంతో బ్రీ కట్టిపడేస్తుంది. ఆడవారికి, అందునా తల్లులకి భూదేవికున్నంత సహనముంటుందనే విషయాన్ని ఆకళింపు చేసుకుని నటించింది.
సగం సినిమా ఒక గదిలోనే నడుస్తుంది. కొన్ని సినిమాల్లో ఎంత చిన్న ఇల్లైనా పెద్దగా కనిపిస్తుంది. ఇందులో మాత్రం గది ఎంత చిన్నదో అనుక్షణం మనకి స్ఫురిస్తుంది. అలాగని ఇరుకుగా అనిపించదు. డానీ కోహెన్ తన ఫొటోగ్రఫీతో అద్భుతమే చేశాడు. ఎమ్మా డోనహ్యూ తన నవలని తానే చిత్రానువాదం చేసింది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. మన సినిమాల్లో ఇంటెర్వల్ బ్యాంగ్ అంటారు. ఈ సినిమాలో నిజమైన ఇంటెర్వల్ బ్యాంగ్ ఉంటుంది. జాక్, జాయ్ బయటపడే దృశ్యాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం ఆస్కార్ నామినేషన్లు కూడా వచ్చాయి. తప్పక చూడవలసిన చిత్రమిది. భాష అర్థం కాదు అనుకునే వారికి ఆంగ్లంలో సబ్ టైటిల్స్‌తో చూసే అవకాశం కూడా ఉంది. ముందు ముందు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి సంస్థలు అవెంజెర్స్, జేమ్స్ బాండ్ చిత్రాలకే కాక ఇలాంటి చిత్రాలకు కూడా తెలుగు మొదలైన ప్రాంతీయ భాషల్లో కూడా సబ్ టైటిల్స్ అందిస్తాయని ఆశిద్దాం.