Site icon Sanchika

రుద్రప్రయాగ చిరుతపులి – పుస్తక పరిచయం

[dropcap]వం[/dropcap]ద సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవ గాథ ఇది. రుద్రప్రయాగ చిరుతపులి ఎనిమిదేళ్ళు వందలాది మనుషుల్ని చంపి తినేసింది. ఎవరికీ దొరకలేదు. ఆఖరికి జిమ్ కార్బెట్ కొన్ని వందల మైళ్ళు కాలినడకతో తిరిగి 65 రాత్రులు అడవిలో చెట్ల మీదా, ఇతర చోట్లా దాక్కుని మాటు వేసి ఈ నరమాంసభక్షకిని చంపగలిగారు.

70 సంవత్సరాల నుంచి ఇంగ్లీషులో ఈ పుస్తకం మిలియన్ల ప్రతులు అమ్ముడుపోయింది. ఇంగ్లీషులో జిమ్ కార్బెట్ రాసిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 27 భాషలలోకి అనువాదమైంది.

తెలుగులో మొట్టమొదటిసారిగా కందుకూరి రవీంద్రనాధ్ స్వేచ్ఛానువాదం చేశారు.

***

“ఈ పుస్తకంలో ఉన్నది ఉత్కంఠ. ఆ చిరుత కోసం కార్బెట్ మాటు వెయ్యడం, అది వచ్చినట్టే వచ్చి పారిపోవడం లేదా అదృశ్యం కావడం లాంటివి చదువుతూ ఉంటే ఏ కానన్ డాయల్ డిటెక్టివ్ పుస్తకమో, పాంచ్ కడీదేవ్ అపరాధ పరిశోధక నవలో చదువుతున్నట్లు అనిపిస్తుంది.

రుద్రప్రయాగ చిరుతపులిని వేటాడడంలో కార్బెట్ ఎంత శ్రమ పడ్డాడో, దాని ఉనికి తెలుసుకోవడానికి ఎంత కృషి చేశాడో వివరంగా తెలుస్తుంది.

కార్బెట్ ప్రఖ్యాతి ఆ చిరుతపులిని చంపడంలోనే లేదు – దాన్ని చంపి ఎందరి ప్రాణాలో కాపాడడంలో ఉంది” అన్నారు రావి కొండలరావు తన ముందుమాటలో.

***

“1918లో మొదలై ఎనిమిదేళ్ళు జనాల్నీ, యాత్రికుల్నీ చంపి తినేస్తూ మనదేశంతో సహా అమ్రో తొమ్మిది దేశాల్లో వార్తల్లోకెక్కిన చిరుతపులిని ఎన్నో ప్రయత్నాల తర్వాత 1-5-1926న మట్టుబెట్టిన వేటగాడు జిమ్ కార్బెట్.

కార్బెట్ ‘రుద్రప్రయాగ చిరుతపులి’ని వేటాడే క్రమాన్నంతా ఎంతో ఆసక్తికరంగా తన వేటానుభవాన్ని గ్రంథస్తం చేశారు. ఈ ‘మ్యాన్ ఈటింగ్ లెపార్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్’ పుస్తకంతో వేటగాడు గానే కాక, రచయితగా కూడా గొప్ప ప్రఖ్యాతి పొందాడు జిమ్ కార్బెట్. వంద సంవత్సరాల కిందటి నరభక్షక పులులు, చిరుతల్ని వేటాడ్డానికి జిమ్ కార్బెట్ ఏం చేశాడో ఈ కథనం చెబుతుంది.

రచయిత జిమ్ సహృదయతని, ఇతివృత్తంలోని ప్రాణధార ఆత్మను ఒడిసిపట్టి రవీంద్రనాధ్ అచ్చతెలుగు పుస్తకంలా ‘రుద్రప్రయాగ చిరుతపులి’ని రూపొందించారు” అన్నారు డా. కె.బి. లక్ష్మి ‘రుద్రప్రయాగ చిరుతపులి – అనుసృజనలోకి అక్షర సౌందర్యం స్వేచ్ఛానువాద సౌరభాలు’ అనే ముందుమాటలో.

***

“ఈ గ్రంథ రచన చాలా విలక్షణంగా వుంటుంది. ఒక యాత్రా చరిత్రలా ప్రారంభమౌతుంది. అలా అని, ఇది యాత్రాచరిత్ర కాదు. ఒక వేటగాడు ప్రజల సంరక్షణార్థం జరిపిన, క్రూరమృగ సంహార క్రతువును వర్ణించే వాస్తవ కథ.

రవీంద్రనాధ్ కార్బెట్ అనుభవసారాన్ని అత్యంత ప్రతిభాద్యోతకంగా అనువదించారన్న మాటకి, ఈ గ్రంథం నిస్సందేహంగా ఒక సాక్షి సంతకం” అన్నారు డా. వోలేటి పార్వతీశం తమ ముందుమాట ‘ఇదిగో తోక, మరి పులి…?’లో.

***

“నెలల తరబడి రుద్రప్రయాగ ప్రాంతమంతా చిరుతపులితో బాటు సంచారం చేసిన ఒక మనిషి అడుగడుగుని అక్షరబద్ధంగా తెలుగులో చదవడం ఓ మధురానుభూతి. జిమ్ కార్బెట్ తను తిరిగిన ప్రాంతంలో వాటి లోతు పాతుల్ని పొల్లుపోకుండా ఆంగ్లంలో రాస్తే, తెలుగులో అంతే ఉత్సుకతతో మనం చదువుతాం. పుస్తకమంతా చిన్న చిన్న ప్రకరణాలుగా, ఒక వ్యక్తి డైరీలాగా సాగుతుంది. వాక్యనిర్మాణం, ఉపయోగించిన భాష సరళంగా ఉండి మనల్ని కట్టిపడేస్తాయి.

మిమ్మల్ని మునివేళ్ళ కొనలపై నిలబెట్టి, లయ తప్పుతున్న గుండెతో చదివించే వాస్తవిక దర్పణం ఈ కథనం” అన్నారు సి.ఎస్. రాంబాబు తమ ముందుమాట ‘రుద్రప్రయాగ చిరుతపులి ఒక అద్భుత సాహస యాత్ర’లో.

***


రుద్రప్రయాగ చిరుతపులి
రచన: జిమ్ కార్బెట్
స్వేచ్ఛానువాదం: కందుకూరి రవీంద్రనాథ్
పేజీలు 292, వెల: ₹ 225
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్, నవచేతన, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు.
కందుకూరి రవీంద్రనాధ్, 8-43/3/బి, శ్రీనివాసాకాలనీ మెయిన్ ‌రోడ్, స్వరూప్ నగర్, ఉప్పల్ పోస్ట్, హైదరాబాద్ 500039. 94407 12903.

Exit mobile version