Site icon Sanchika

రుక్మిణి సాహసం!

అందరూ సత్యభామ వీరాంగన అని కీర్తి కట్టబెట్తారే కానీ కృష్ణుడి కొండంత అండ ఉండగా చేసిన విక్రమం అది, అని గ్రహించేవారే అరుదు!

సత్యభామకూ, ఆమె వీరశృంగారాలు క్షుణ్ణంగా తెలిసిన కృష్ణుడికీ ఓ నమస్కారం పెట్టి, కాస్త ఇంకో తరహా గొప్ప సాహసం చేసిన, రుక్మిణీ దేవి సంగతి కొంత ముచ్చటించుకుందాం అని!

“నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్” అని అన్నది, నిజంగాఎంత గాఢమైన నమ్మకమో అది! కాకపోతే అంత దూసుకుని పోయే సాహసం చేయటమే!!

తండ్రి చూస్తే మెతక, అన్న రుక్మి తన పట్ల ప్రేమ ఉన్నవాడే కానీ దుష్ట స్నేహాల ప్రభావమో, ప్రాబల్యమో శిశుపాలుడి కిఛ్చి పెళ్లి చేయాలని,తన చెల్లెలిని!! అదొక మంకు పట్టు, తోచిందేదో చెయ్యటమే గానీ, చెల్లెలి మనోగతం పట్టి వెళ్దామనే ఇంగితం బొత్తిగా శూన్యం!!

వారి ద్వారా వీరి ద్వారా విని యున్న యాదవ కుల మణి కృష్ణుడి గుణ గణాలు, శౌర్యపరాక్రమాలను మనసులో నిల్పుకొని, పెళ్లి అంటూ చేసుకుంటే ఆయనతోనే అని భీష్మించుకు కూచుంది, ఈ భీష్మకుడి పుత్రిక!!

బంధువులందరూ, తండ్రీ కూడా మెచ్చి అంగీకరించిన సంబంధమది పైగా! ఈ పెద్దన్న, పెద్ద అడ్డమై పోవటంతో వచ్చిందసలు, సాహసం చేసే అవసరం!

***

వరుణ్ణి ఎన్నుకున్నది, సరే, ఆయన వరకు కబురు వెళ్ళటం ఎట్లా? పైగా ఈ ఆరాధన అంతా తన వైపు నుంచి,ఆ కృష్ణుడికి అసలు తన గురించే తెలుసో లేదో,తెలిసినా ఒప్పుకోవాల్సిన అగత్యం ఏమీ లేదే ఆ నీల మోహనుడికి!

మరి ఎట్లా?! ఇక్కడేమో ఏర్పాట్లు జరిగి పోతున్నాయి, జరాసన్ధాది రాజమిత్రులతో తరలి వస్తున్నాడు, ఆ చేది రాజు శిశుపాలుడు, వివాహ సంరంభంతో!

ఇదిగో, సరిగ్గా ఇక్కడే రుక్మిణి నిర్ణయ బలం, ఆలోచనా వేగం, వివేకం,అన్నిటికి మించి సాహసం కొట్టొఛ్చినట్లు కనిపిస్తాయి.

గుణ సంపన్నుడూ, తన మనోగతం తేటగా చెప్పగల మాట నేర్పరి, అగ్నిద్యోతనుడిని ఎన్నుకుంది. అరమరికలు లేకుండా, తండ్రి స్థానమిచ్చి, విషయం అంతా ఆయనకు చెప్పి, కృష్ణుడికి సందేశం పంపింది.

***

అంతఃపురంలో ఈ వార్త పొక్కి,అన్న రుక్మికి తెలిస్తే,ఇక అంతే,బలవంతంగానైనా ఆ పశు సమాన శిశుపాలుడికి తనను బలి ఇచ్చేస్తాడు!

లేదా, విన్న కృష్ణుడు ఆదరించక పోతే,ప్రయత్నం వ్యర్థం అవటమే కాకుండా, జీవితమంతా ఆ చిన్నతనాన్ని మోయాల్సిందే!!

అయినా చేసింది, ఆ సాహసం!!

తన ప్రేమతో ప్రేరేపింపబడి,బుద్ధితో నడిపిన, దౌత్య వ్యవహారం, అతి చొరవతో కూడినది!!

మనస్సులో ఉన్న నమ్మక బలమే కదా సాహసంగా బయటకు వచ్చేది! అదే జరిగింది ఇక్కడ!

***

ఏమని ఆ సందేశం?!

కృష్ణా, నీ గుణాలు విని అర్పణ భావంతో చేస్తున్న విన్నపమిది!

నా మనస్సు నీ మీదే అన్ని విధాలా లగ్నమై ఉన్నది, దాపరికం, మొగమాటం వదిలి చెప్తున్నాను, నన్ను వివాహమాడి నీ దానిని చేసుకో అని డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పేసిన ప్రేమసాహస సందేశం!!

కృష్ణా! నేను ఇట్లా ముందుకు రావడం అనుచితమని భావించవద్దు, సర్వ గుణ సంపన్నుడవైన నిన్ను ఏ ఉత్తమ కులీనయైన స్త్రీ తనకు పతిగా రావాలని కోరుకోదు!

కనుక,ఇది సహజమే అన్న ధోరణిలో నిర్ద్వంద్వంగా చెప్పిన గడసరి! కానీ నయశాలి, వినయశీలి!!

ముందు తనెవరో, తన మనస్సులోని భావం ఏమిటో, సమయం ఎంత తక్కువ ఉందో, బలవంతపు పెళ్లి జరగకుండా ఆపడానికి అన్నీ వివరించింది, ఆ దూత ద్వారా!

పురుష సింహమా, ఓ, కృష్ణా, నీకు దక్కాల్సిన నాపై నక్కతో సమానమైన శిశుపాలుడి కన్ను పడింది, నీవే రక్ష అని నోరార వేడుకొన్నది!

***

ఈ విన్నపంలో కూడా రుక్మిణి మాటల సాహసం మెరపులా మెరుస్తుంది! అంతా చెప్పి, చల్లగా, ఇట్లా నిన్ను ఇష్టపడటం నాతోనే మొదలవుతోందా ఏమిటి, మునుపు ఆ లక్ష్మీదేవి వలచి, నిన్నంటి పెట్టుకొని లేదూ” అని ముక్తాయింపు ఇస్తుంది!!

ఔరా, అర్థిస్తూ అదరించటమా?!!

ఆయన రాశీభూత సౌజన్యం, రసావతారుడు!!

చెల్లిపోయింది!!

అదీ గాక,కృష్ణుడు కూడా ఆమె రూపలావణ్య గుణసంపద గూర్చి విని, సుముఖుడై ఉన్నాడన్న అసలు విషయం, ఆమెకు తెలియదు,పాపం!!

***

ఎంత స్థిర సంకల్పంతో ఉన్నదంటే,తను కృష్ణుడి సొత్తు అయ్యే ఉపాయం కూడా తనే చెప్పేసింది!

ఎట్లాగూ నేనే ఇష్ట పూర్వకంగా వస్తున్నా కదా, దీనికోసం నువ్వు అంతఃపురంలోకి వచ్చి,కాపలాదారులను చంపి తీసుకువెళ్ళటం, ఈ హింస అంతా ఎందుకు, ఒక ఉపాయం చెపుతాను అని తానే స్వతంత్రించి సూచన ఇచ్చింది.

కులాచారం ప్రకారం పురానికి బయట ఉన్న గౌరీ ఆలయానికి, పూజకు వస్తాను, అక్కడ, నీ అనుమతి అయితే, నా సర్వస్వం వదులుకుని, నీతో ద్వారకకే, ఇక నా ప్రయాణం, నీ రథంలోనే అని కార్యాచరణ ప్రణాళిక విశదంగా రచించి చెప్పింది!

ఈ సాహసపు మాట రావాలంటే, ఎంతగా నమ్మిందో, తనని తాను, దానిని మించి ఆ కృష్ణుడిని!!

***

వెళ్లిన విప్రవరుణ్ణి సముచితంగా గౌరవించి,అంతా విని, కృష్ణుడు కూడా, “వచ్చెద విదర్భ భూమికి…తెచ్చెద బాలన్ వ్రేల్మిడి” అని ఘంటాపథంగా చెప్పి, విప్రుడితో పాటు రథంలో, హుటాహుటి బయల్దేరాడు,రుక్మిణీ నివాసమైన కుండిన నగరానికి!!

అనుకున్నట్టే, అమ్మవారి పూజ కాగానే,సాక్షాల్లక్ష్మి లాగా నడచి వస్తున్న రుక్మిణిని, రాజుల మధ్యగా వచ్చి, క్రష్ణుడు తన రథంలో ఎక్కించుకొని ద్వారకకు తీసుకువెళ్ళి సలక్షణంగా వివాహం చేసుకున్నాడు.

ఈ తెగింపు కూడా,మనోభీష్టం నెరవేరటానికే,అదీ అందరి ముందూ!

నానా దుర్భాషలాడిన అన్న రుక్మిని, కృష్ణుడు శిక్షించబోతే, రథంలో నుంచి దిగి కాళ్ళ మీద పడి, ఇతనిని చంపితే నా తల్లితండ్రులకు పుత్ర శోకమే కదా, కనుక క్షమించి వదలి వేయవలసినది, అని వేడుకొన్నది. అన్నను విడిపించింది,ప్రాణాలతో!!

సాహసమే అయినా,విచక్షణతో కూడినది, అవసరం అయినంత మేరకే!!

అదీ రుక్మిణి ప్రత్యేకత!!

***

అట్లా ఆమె ముందరికెళ్లి, తన కళ్యాణ కార్యక్రమం పూర్తి చేసుకుని కృష్ణ పట్టమహిషి అయింది.

స్వామి వారు తరువాత చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి,అది లీలామానుష విగ్రహుడి రసవచ్చరిత!!

***

రామావతారంలో, గర్భవతిని, సీతను, రాజశాసక కఠినత్వం వల్ల రథంలో పంపించి అడవిలో దిగవిడచిన అనౌచిత్యాన్ని; సాక్షాత్తు తానే వచ్చి, రథంలో కూచోబెట్టుకొని తన ద్వారకా పురికి తోడ్తెచ్చి వివాహం చేసుకోవటంతో, కృష్ణావతారంలో బాపుకున్నారు స్వామి, అని పెద్దల వ్యాఖ్యానం!!

అమరేంద్రుణ్ణి గెలిచి, సుధాభాండాన్ని,గరుడుడు తెచ్చిన రీతి, చైద్యాది రాజలోకాన్ని ఓడించి కృష్ణమూర్తి, రమావ తారమైన రుక్మిణిని దక్కించుకున్న కథ యిది అని కవుల సారాంశము.

ఏది ఏమైనా ఇది రుక్మిణీ బాల సాహస గాథ అని ఇంకొందరి నమ్మకమున్నూ!!

ఉత్త సాహసమనీ అనలేమేమో, ఆమె “వాత్సల్యాది గుణోజ్జ్వలా, భగవతీ,నిత్యానపాయిని” యైన లక్ష్మే కదా, అందుకయ్యుంటుంది ఆ చొరవ!! పూర్వ పరిచయ ఫలం!!

***

కనుక, ఏతావాతా మనం ఏమి అనుకోవచ్చంటే సత్యభామది సంగర సాహసం అయితే, రుక్మిణిది జీవన సాహసం,అని!

మధ్యలో సాహస మూలం, అయ్యవారు!

చుట్టూ మిగతా భార్యలను కూడా కలుపుకుంటే, అది ఒక అష్ట భార్యా సహిత నవ నవోన్మేష ఉత్సాహ,సాహస, సౌందర్య మూర్తి అంతఃపుర సంపూర్ణ చిత్రమౌతుంది!!

Exit mobile version