[dropcap]భా[/dropcap]రతంలో లేనిది మరెక్కడా లేదని పెద్దలు చెపుతారు. అంటే భారతంలో లేని ధర్మము కానీ అధర్మము కానీ నీతి, న్యాయ సూత్రాలు, రాజనీతి, రణతంత్రము కానీ మరేదైనా గాని మనకు మరెక్కడా లభించవు. అందుచేతనే భారతాన్ని పంచమ వేదము అంటారు. భారతంలో ప్రేమ కథలు కూడా ఉంటాయి. దేవతలను మెప్పించి నలుడిని భర్తగా పొంది అష్టకష్టాలు పడి తిరిగి భర్తను పొందిన దమయంతి కథ, అలాగే కచ దేవయాని శర్మిష్ఠల ట్రయాంగిల్ ప్రేమ కథ లాంటివి వింటూ వుంటాము. ప్రేమ గుడ్డిది అని ఆనాడు ఈనాడు అంటూ ఉంటారు. ఈ ప్రేమ కోసం విచక్షణా రహితంగా ప్రవర్తించటం కూడా చూస్తూ ఉంటాం. ప్రేమించిన వారి కోసము ప్రాణాలు అర్పించేవాళ్ళు ఉన్నట్లుగా అదే ప్రేమ కోసము ప్రాణాలు తీసేవారు కూడా ఉంటారు. అందుచేత ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన వారు వారి ప్రేమ కోసం ఏమైనా చేస్తారు. వారి ప్రేమకు ఎవరైనా ఆటంకము కలిగితే వారిని వారి సంబంధీకులను చంపటం వంటి పనులు చేస్తుంటారు. ఇటువంటి సంఘటన భృగు వంశీయుని వంశములో చోటు చేసుకుంది. ఈ కథ భారతము లోని ఆదిపర్వంలో వస్తుంది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం.
భృగు మహర్షి గురించి ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు, అయన మహా కోపిష్టి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే శపించిన మహర్షి భృగువు. అయన కుమారుడు చ్యవనుడు, అయన కుమారుడు ప్రమతి. అయన కుమారుడే మన కథానాయకుడు రురువు. భృగు వంశీయుడు కాబట్టి కోపధారి అని తెలుస్తుంది. ఇంకా కథానాయకురాలు ప్రమద్వర విషయానికి వస్తే ఆవిడ గాంధర్వ రాజు విశ్వావసుకు ఇంద్ర సభలో నర్తకి అయినా మేనకలకు జన్మించినది. మేనక తన వివాహము ఇంద్రుడు అంగీకరించాడని భావించి, జన్మించిన ఆడశిశువును నది ఒడ్డున ఉన్న స్థూలకేశు అనే ముని ఆశ్రమ సమీపములో వదిలివస్తుంది. ఆ శిశువును చూచిన స్థూలకేశు మహాముని ఆప్యాయముగా తన ఆశ్రమానికి తెచ్చుకొని కన్నబిడ్డ వలె పెంచసాగాడు. ప్రమద (ఆడవారిలో) లలో అందగత్తె కాబట్టి ఆమెకు ‘ప్రమద్వర’ అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు.
భృగు వంశీయుడైన రురువు తండ్రి ప్రమతి లాగానే ధర్మాత్ముడు, తపోమూర్తి, వారి శక్తి సామర్థ్యాలు విడిగా చెప్పనవసరం లేదు. రురువు ఒకసారి అనుకోకుండా ప్రమద్వరను చూడటము తటస్థించింది. తొలి చూపులోనే ఆవిడపై ప్రేమను పెంచుకున్నాడు. ప్రమద్వరను వివాహమాడాలన్న తన కోరికను మిత్రుల ద్వారా తండ్రికి తెలియజేశాడు. కొడుకు కోరిక తెలుసుకున్న ప్రమతి స్థూలకేశుల వారిని వారి ఆశ్రమములో కలిసి కన్యార్థినై వచ్చానని చెప్పగా స్థూలకేశుల వారు ప్రమద్వర జన్మ వృత్తాంతాన్ని వివరింపగా ప్రమతి అంగకరించాడు. భృగు వంశము వారితో వియ్యము పొందుతున్నందుకు స్థూలకేశు చాలా సంతోషించి వివాహానికి సత్వరం అంగీకారం తెలుపగా పెద్దలు వివాహానికి ముహార్తాన్ని నిర్ణయించారు.
కానీ మనిషి ఒకటి తలస్తే దైవము ఇంకొకటి తలంచినట్లుగా ప్రమద్వర చెలికత్తెలతో కలిసి వనములో ఆటలాడుతుండగా నిద్రిస్తున్న పామును తొక్కింది. ఆ పాము ప్రమద్వరను కాటేసింది. ఆ పాము కాటుకు ప్రమద్వర చనిపోయింది. ఆమె మరణము పెంచిన తండ్రి స్థూలకేశుని, కాబోయే మామగారు అయినా ప్రమతిని తీవ్ర విచారానికి లోను చేసింది. అమితముగా ప్రేమించిన రురువు పరిస్థితి చెప్పనవసరం లేదు. ఈ విషయం తెలుసుకున్న రురువు భృగు వంశీయుడు కదా, నిశ్చితార్ధము జరిగింది కాబట్టి ప్రమద్వర తన భార్య గానే భావించి ఆమెకు అపకారము చేసిన నాగజాతిపై ఆగ్రహము పెంచుకొని కనిపించిన పామునెల్ల చంపటం మొదలుపెట్టాడు. ఈ క్రమములో ఒకరోజు రురువునికి ఒక ముసలి సర్పము కంటబడితే దానిని చంపబోయాడు. వెంటనే ఆ ముసలి పాము మానవ భాషలో, “ఈ నాగుల సంహారము దేనికి నాయనా? అపకారము చేరిన వారికి కూడ ఉపకారము చేసే మహానుభావులు ఉన్న ఈ లోకములో నీవు ఎందుకిలా పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నావు?” అని రురువును అడిగింది. “నా ప్రాణములో ప్రాణము అయిన ప్రమద్వరను, చీమకు కూడా అపకారము తలపెట్టని నా ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. ప్రమద్వరకు జరిగిన అన్యాయానికి ప్రతీకార చర్యగా పాములను చంపుతున్నాను” అని రురువు ముసలి సర్పానికి కోపముగా సమాధానముగా చెపుతాడు.
అతని మాటలు విన్న డుండభ అనే పేరు గల వృద్ధ సర్పము, నిస్సహాయముగా రురువును చూస్తు, “ఒకళ్ళు తప్పు చేశారని కోపంతో సామూహిక మారణకాండ చేయటము నీలాంటి విజ్ఞులకు తగదు. ఆ పాము ఏ కారణము చేతనో భయపడి కాటు వేసి ఉంటుంది. సహజముగా పాములకు మానవులంటే ఉండే భయమే ఆ విధముగా పాము చేయటానికి కారణము అయిఉండవచ్చు.” అని చెపుతూ డుండుభ అనే వృద్ధ సర్పము తన పూర్వజన్మ వృత్తాంతాన్నితాను పాముగా మారటానికి వెనుక ఉన్న వృత్తాంతాన్ని రురువుకు వివరిస్తాడు. “నేను కూడా నీవలె సహస్రపాదుడు అనే పేరుగల మానవుడిని. నా మిత్రుడు ఖగముఖుడు అనే తపశ్శాలి. అతను ఒకనాడు హోమము చేస్తున్న సమయములో నేను సరదాకని ఆకతాయి తనముగా గడ్డి పరకలతో చేసిన కృత సర్పాన్ని అతని మీదకు విసిరాను. అతను భయపడటాన్ని చూసి నేను నవ్వగా అతను కోపించి ‘నీవు చేసిన పనికి నీవు పాము అవుతావ’ని శపించాడు. నా తప్పు తెలుసుకున్న నేను నా మిత్రుడిని శాప విముక్తికి మార్గము చెప్పమని బ్రతిమాలాను. నా మిత్రుడు నాయందు దయవుంచి శాంతించి, భృగు వంశీయుడైన ప్రమతి కుమారుడు రురువు దర్శనంతో నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అందువల్ల నీ దర్శన భాగ్యము వలన నేను మళ్లా నా మనుష్య రూపము పొందాను” అని చెపుతాడు
శాప విముక్తి పొందిన సహస్రపాదుడు రురువుతో బ్రాహ్మణునికి అకారణ కోపాలు తగవని హితబోధ చేస్తాడు. ప్రశాంత చిత్తముతో సావధానంగా సహస్రపాదుని మాటలు విన్న రురువు జ్ఞానమును పొంది, భార్య కాకపోయినప్పటికీ భార్యగా నిశ్చయించుకున్నందు వల్ల తాను తపశ్శక్తి వాళ్ళ సంపాదించుకున్న పుణ్యాన్ని ధారపోసి ప్రమద్వర ను బ్రతికించుకోవాలనుకుంటాడు. తనకు సహకరించమని ధర్మదేవతను ప్రార్థిస్తాడు. అప్పుడు ధర్మదేవత ప్రత్యక్షమై, “నీ పుణ్యము నీవే ఉంచుకో. నీ ఆయువులో సగము ఇచ్చి ఆమెను బ్రతికించుకో” ఆని సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారము రురువు తన ఆయువులో సగము ప్రమద్వరకు ఇచ్చి ఆవిడను బ్రతికించుకుంటాడు. తన నిత్యకర్మ, ధర్మ, వేదానుష్ఠాలతో ఆమెతో కలిసి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాడు. ఆ విధముగా తాను ప్రేమించిన ప్రమద్వర కోసము ముందు ఆవేశముగా పాములను చంపినా, తరువాత జ్ఞానోదయం అయి తన ఆయువును ప్రమద్వరకు ఇచ్చి బ్రతికించుకొని త్యాగధనుడైన ప్రేమికుడిగా గుర్తింపబడ్డాడు. ఆ విధముగా వారి ప్రేమ కథ ప్రఖ్యాతి చెందింది.