సా. మా. కి ఆ వైపు!

1
3

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘సా. మా. కి ఆ వైపు!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చం[/dropcap]ప ఆరేళ్ళ పిల్ల.

చురుకైన కళ్ళు,ఇంపైన కంఠం, చూడచక్కని రూపం.

“మా కొండ దేవత కళ అంతా మా చంపలో ఉంది”, అని వాళ్ళ నాన్న, నరసింగకు గట్టి నమ్మకం!

ఏదో ఒకటి చేసుకుని బతుకుదాం అని, దేవతకు ఇప్పపూల మాలలతో పసుపు కుంకుమ పూజ, భక్తిగా చేసి, భార్య గట్టూదేవితో నగరాని కొచ్చాడు, రెండేళ్ళ క్రితం.

ఈ చంపాలచ్చిని వెంటబెట్టుకుని, అడవి జీవితం వద్దనుకుని!

తండాలో తోటివాళ్ళు ఎందుకురా మనకు ఇదంతా, అని చెప్పినా వినకుండా తరలి వచ్చేశాడు.

ఎప్పటికైనా, ఎట్లాగైనా తన కూతురికి చదువు చెప్పించాలని అతని కల!

ఊరికి కాస్త దూరంలో పెద్ద మాల్ కడుతుంటే అక్కడ రోజు కూలీకి కుదిరాడు.

ఆ కట్టడం నుంచి కొద్ది దూరంలోనే టెంట్ లాంటివి వేసుకుని ఉంటున్నారు, మిగిలిన పనివారితో!

ఆ రోజు ఆదివారం, అతనికి కూడా పనికి సెలవు, ఇంటి దగ్గరే ఉన్నాడు.

టైము ఉదయం సుమారు ఎనిమిదవుతోంది.

ఏదైనా తిందామనిపించి, ముఫ్ఫై రూపాయలిచ్చి బ్రెడ్ తీసుకురమ్మని చంపాను పంపాడు, దగ్గరలోనే ఉన్న ఒక షాపుకి.

కూతురి ఒత్తైన నల్ల తుమ్మెదల గుంపు లాంటి జుట్టును దువ్వి, రిబ్బన్ చుట్టి, మురిపెంగా ఒకసారి చూసుకుని, పంపించింది తల్లి, నవ్వుతూ!

***

షాపు కెళ్ళి, బ్రెడ్ తీసుకుని, ఏదో కూనిరాగం తీసుకుంటూ, వస్తోంది చంపా!

ఆ పిల్ల ఉత్సాహానికి సగం కారణం, వాళ్ళ నాన్నతో ఇవాళ రోజంతా గడిపే అవకాశం దొరికిందని!

ఏదో పని మీద వెళ్తున్న జాహ్నవి కారులోంచి ఈ పిల్లను చూసింది.

ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరు అయిన ఆమెకు, ఈ చలాకీ అమ్మాయిని చూడగానే ముచ్చటేసింది.

కారు రోడ్డు పక్కన ఆపి, బ్రెడ్ ప్యాకెట్ పట్టుకుని నుంచున్న చంపా ఫోటోలు తీసింది, రెండు మూడు యాంగిల్స్‌లో, ఆ అమ్మాయికి చెప్పే!

నవ్వు ముఖంతో ఆనందంగా తీయించుకుంది, పిల్ల కూడా ఆ ఫోటోలు.

“మీ ఇల్లెక్కడ”, అని అడిగి, ఆ అమ్మాయి దారి చూపిస్తుండగా, వాళ్ళ టెంట్ దగ్గరకు వచ్చింది జాహ్నవి.

నరసింగతో అంతా చెప్పి, అతని ఫోనుకి కూడా రెండు ఫోటోలు పంపించి, “వీటిని అందరికీ చూపిస్తాను మీకేం అభ్యంతరం లేదుగా”, అని అడిగింది.

అప్పుడప్పుడే ఫోను వాడకానికి అలవాటు పడుతున్న నరసింగకు ఏం చెప్పాలో తెలియక, “అయ్యో మీ ఇష్టం అమ్మా” అని ఊరుకున్నాడు.

అతని భార్య అంతా వింతగా చూస్తోంది!

వారిద్దరికీ ఉంటానని చెప్పి, చంపాకు షేక్ హ్యాండిచ్చి, ‘బై’ అంటూ, జాహ్నవి తన కారు వైపు కదిలింది!

చెయ్యి ఊపుతూ, వీడ్కోలు చెప్పింది చంపా, ఆ తెలియని నేస్తానికి!

***

జాహ్నవి ఇంటి కెళ్ళి, ముందుగా చేసిన పని, తాను ముచ్చటపడి తీసిన వనబాల లాంటి చంప ఫోటోలను తన వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర మాధ్యామాల్లోనూ పెట్టటం!

ఆ పిల్ల బాల్యం తాలూకు అమాయకత, ఏమీ తెలియని ఉత్సాహం, ఆ నవ్వూ – అందరినీ ఆకట్టుకుని ఆనందింప చేస్తాయని, ఆమె గట్టి నమ్మకం!

అనుకున్నట్టే, ఆ ఫోటోలు వైరల్ అయిపోయినై, ఒక అరగంటలో!

ఎవరై ఉంటుందా ఈ అమ్మాయి అన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు జోరందుకున్నాయి కూడా!

కావాలనే జాహ్నవి, ఆ ఫోటోలు ఎవరివో ఏమీ రాయకుండా పెట్టింది, చూసిన వారి ఊహలు కాస్సేపు ఆకాశంలో ఎగరనిచ్చి, తరువాత వివరాలు రాద్దామని, just for fun!

కొందరైతే, జాహ్నవిని మెచ్చుకోవటం కూడా ఆరంభించేశారు, మీ చిన్నప్పటి ఫోటోలు చాలా బాగున్నాయండీ అంటూ!

***

కానీ ఆ ఫోటోలు యాదృఛ్ఛికంగా చూసిన వివేక్ రాయ్ మదిలో ఆలోచనలు ఇంకో కోణంలో సాగినై!

వివేక్-సిటీలో, రాష్ట్రం మొత్తంలో బాగా పాపులర్ అయిన బ్రెడ్ తయారు చేసే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్!

వెంటనే అతను జాహ్నవికి ఫోను చేసి “ఒకసారి మిమ్మల్ని కలవచ్చా”, అని అడిగి తను అనుకుంటున్న విషయం వివరంగా చెప్పాడు.

ఇద్దరూ సాయంత్రం నాలుగింటికి చంపా వాళ్ళ టెంట్ దగ్గరికి వెళ్ళారు.

నరసింగ, అతని భార్య ఆశ్చర్యపోయారు, పొద్దున వచ్చిన ఆమె మళ్ళీ రావటంతో, అదీ ఇంకెవరినో తీసుకుని మరీ!

జాహ్నవి, విషయం చెప్పింది – వాళ్ళకు అర్థమయ్యే తేలిక భాషలో.

ఆయన పొద్దున వారు కొన్న బ్రెడ్ తయారు చేసే కంపెనీకి ఓనర్ అనీ, వాళ్ళమ్మాయి చంపాని తన కంపెనీకి, ‘బ్రాండ్ అంబాసిడర్’ గా నియమించుకోవాలని ఆయన అడుగుతున్నారని, అందుకే తన ద్వారా వారిని వెతుక్కుంటూ వచ్చారనీ!

తాను తీసిన వారి అమ్మాయి ఫోటో చూసి, ఆయనకు ఈ ఆలోచన వచ్చింది అని కూడా చెప్పింది, వారికి స్పష్టంగా అర్థం కావాలని!

ఇంతలో పక్కన ఆడుకుంటున్న చంపా కూడా వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చుని వారి మాటలు వినసాగింది.

అమ్మాయిని ప్రత్యక్షంగా చూసిన వివేక్ ఇంకా సంతోషించాడు తన నిర్ణయం పట్ల!

ఆ అమ్మాయిని, ఆనందంగా పలకరించాడు ఇంగ్లీషులో, హిందీలో!

అన్నిటికీ, చంపా చిరునవ్వే జవాబైంది, అతని మాటలు ఆ అమ్మాయికి అర్థం కాకపోవటం వల్ల!

వారికి ఒక చిన్నపాటి పక్కా ఇల్లు ఇచ్చేట్టు, నరసింగకు కూడా ఆ కంపెనీలో రెండేళ్ళ పాటు కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేట్టు, జాహ్నవి ఆ పేద కుటుంబం తరఫున వకాల్తా పుచ్చుకుని ఒప్పింపచేసింది వివేక్‌ని!

మాటల్లో, నరసింగ తనకున్న ఒకే కోరిక కూతురు చంపాను చదివించాలని చెప్పటంతో, వివేక్ రాయ్, తన తరఫు నుంచి ఒక అదనపు కానుక కూడా ఇచ్చాడు.

అదేమిటంటే, చంపా డిగ్రీ చదువు పూర్తి అయ్యే వరకు మొత్తం ఖర్చు తానే భరిస్తానని!

మొదటి నుంచీ తన కింది ఉద్యోగులకీ, లేబర్‌కీ వారి అవసరాలను గుర్తించి సహాయం చేసే గుణమున్న వివేక్ రాయ్ లాంటి సహృదయుడు అట్లా తటస్థపడటం, ఆ కుటుంబం అదృష్టమనే చెప్పాలి.

ముఖ్యంగా ఆ అమ్మాయి చంపా అదృష్టం!

అన్నీ కాగితాల మీద, పకడ్బందీగా వివరాలు రాయించి, వ్యవహారం అంతా జాహ్నవే నడిపింది, నరసింగ కుటుంబం తరఫున!

ఈ ముక్కూ, మొహమూ తెలియని ఊరి కొచ్చినందుకు, ఆ కొండ దేవతే, ఆ అమ్మోరే ఇంతటి మేలు చేయించిందని నరసింగ, గట్టూదేవి వేల నమస్కారాలు పెట్టుకున్నారు, మనసులోనే ఆ దేవతకు!

ఇక జాహ్నవి, వాళ్ళ కళ్ళకు, కనిపించే దేవతతో సమానమే!

అనుకోకుండా వారికి తన ద్వారా ఏర్పడ్డ ఈ సౌకర్యాలు చూసి, జాహ్నవి కూడా చాలా సంతోషించింది, తన జీవితంలో ఇది ఒక అపురూప ఘటనగా తలపోస్తూ!

***

వివేక్ రాయ్ ‘శక్తి’ బ్రెడ్ బ్రాండ్ విలువ బాగా పెరిగింది, ఈ కొత్త ‘మోడల్’ తో వచ్చిన ప్రకటనల ద్వారా!

అమ్మకాలూ పెరిగినై ఆ కంపెనీకి, రాష్ట్రమంతా!

ముఖ్యంగా పిల్లలు ఎక్కడ చూసినా ఈ బ్రాండ్ బ్రెడ్ అడిగి కొనటం పెరిగిపోయింది!

***

కొన్నేళ్ళు గడిచాయి.

ఇప్పుడు హై స్కూలులో ఉన్న ఆ అడవి పిల్ల పేరు, “చంపాలక్ష్మి”!

ఆమె చదువుతున్న కాన్వెంట్లో ఆ పేరు మారుమోగుతోంది.

అన్నిట్లో ఆమె ఫస్టే, టీచర్లందరికీ ఆ అమ్మాయే, ఫేవరిట్ స్టూడెంట్ కూడా!

అంతే, ఒక్కో సారి, జీవితంలో మలుపులు, ఇంత అనుకోనివిగానూ ఉంటాయి.

నమ్మాల్సిందే, ఇట్లాంటి విచిత్రమైన సంఘటనలు చూస్తే మరి!

***

‘సామాజిక మాధ్యమాల’ వలన—

నటుల, నాయకుల అభిమానులు మాటామాటా అనుకోవడం, అవాకులు చెవాకులూ పేలడం, అభాండాల ఇనుప భాండాలను ఒకరి నెత్త మీద ఒకరు విసురుకోవటం అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పి సుబధ్ధాలుగా చలామణీ లో ఉంచటం — అబ్బో ఇంకా అనేకానేక ‘అసామాజిక అధమాలు’ మాత్రమే కాదు;

అప్పుడప్పుడు గంజాయి వనంలో తులసి మొక్కల లాంటి ఇట్లాంటి మంచివీ జరుగుతుంటాయి అన్నది మాత్రం ఓ ఆనందకరమైన నిజం!

***

అదన్న మాట ‘సోమీ’ కి ఆ వైపు!

అదే అదే, తెలుగులో సామాజిక మాధ్యమం(సా. మా), ఇంగ్లీషులో SO cial ME dia కదూ,అందుకని ఆ ‘SO ME- సోమీ’!

సెలవా మరి!

***

(కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా, కల్పించి వ్రాసినది!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here