Site icon Sanchika

స(న)వ్యరాగం

[అనుకృతి రచించిన ‘స(న)వ్యరాగం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రా[/dropcap]జారావు, సంయుక్త రవీంద్ర ఫామ్ చేరుకునేసరికి ఉదయం తొమ్మిది గంటలైంది. గేట్ మీద చేయి వేసాడు రాజారావు. ఎక్కడనించి వచ్చాయో రెండు గ్రేహౌండ్స్ పెద్దగా మొరుగుతూ గేట్ ముందుకు వచ్చాయి. పై ప్రాణాలు పైనే పోయినట్టనిపించి ఇద్దరూ భయంతో వెనక్కి వెళ్లారు. రిమోట్ ద్వారా ఆ డాగ్స్ కెన్నెల్ ఓపెన్ చేసి ఆ రెండింటినీ లోపలికి పంపి, గేట్ తెరిచాడు ఒకతను. అప్పుడు చూసారు ఇద్దరు ‘కుక్కలున్నాయి జాగ్రత్త’ అన్న బోర్డుని.

“గుండెలవిసిపోయాయి, ఇంకా నయం, లోపలికి వచ్చాము కాదు” అన్నాడు రాజారావు.

“అయినా దీనికి ఇంత సెక్యూరిటీ ఎందుకయ్యా”

“లోపలికి వెళ్లి చూస్తే తెలుస్తుందిలెండి, వెళ్ళండి” కొంచెం వ్యంగ్యం జోడించి అన్నాడతను.

సెల్ తీసి రవీంద్రకి ఫోన్ చేసాడు, ఏదో చెప్పాడతను, “ఏదో బోదె మీద కాటేజ్ అట. అక్కడికి రమ్మంటున్నాడు.” సంయుక్తతో అన్నాడు రాజారావు.

ఆమెకి ఎందుకో అనవసరంగా మేనమామ వెంటపడి వచ్చానేమో అనిపించింది.

గేట్ కీపర్ “సీదా వెళ్ళండి” అన్నాడు.

ఇద్దరు మనుషులు నడిచే దారి కిరువైపులా రకరకాల పూల చెట్లు, పేర్లు తెలియని వింత ధ్వనులు, ఎంతో ఆహ్లాదంగా వున్నది ఆ వాతావరణం.

ఆ బాట చివరికి వచ్చేసరికి, వాళ్ళ కెదురొచ్చాడు రవీంద్ర. అతన్ని పరీక్షగా చూసింది సంయుక్త. ఆరు అడుగుల పైనే ఉన్నాడతను. నిరంతరం శ్రమించే యువకుడు కాబట్టి చాలా బలంగా, ఆరోగ్యంగా వున్నాడు. బాగా సన్ ట్యాన్ అయిన శరీరం. అతను కూడా ఆమెకేసి నిశితంగా చూసాడు. మంచి పొడవు, జుట్టు అల వంకీలతో అందమైన తలకట్టు, తీరైన కనుముక్కు తీరుతో, తెల్లని దేహచ్ఛాయతో చక్కగా వుంది. బోదె అంటే పొలం మధ్యలో చిన్న గుట్ట లాంటిది. చుట్టూ విరబూసిన పూలమొక్కలతో, ఒక పుష్ప వాటికలా వుంది ఆ కుటీరం.

“నాకు గవర్నమెంట్ పాలీ హౌస్, సబ్సిడీ మీద శాంక్షన్ అయ్యింది. మీరు ఇవ్వాళ వస్తానంటే, అందుకే ఇవ్వాళ రావద్దనన్నాను సారీ, నేను వెళ్ళాలి, మీరు వెయిట్ చెయ్యక తప్పదు”

“అయితే నేను ఈవెనింగ్ ఆఫీస్ పని చూసుకొని వస్తాను, అమ్మాయి ఉంటుంది, ఎవరితోనైనా ఫామ్ చూపించండి. టైం పాస్ అవుతుంది తనకు.” ఆ గొంతులోని ఆత్రతకి చిరాగ్గా చూసాడు రవీంద్ర అతనికేసి. తప్పు చేసినవాడిలా చూసి, రాజారావు వేగంగా వెళ్ళిపోయాడు.

“మీరు ఒక్కళ్ళే ఫామ్ లోకి వెళ్ళకండి, ఎవరైనా ఫ్రీగా ఉన్నారేమో చూసి పంపుతాను” అతని గొంతు చాలా మామూలుగా వుంది. ఒక అందమైన ఆడపిల్ల పట్ల చూపించాల్సిన కన్సర్న్ ఆ గొంతులో లేదు.

ఒంటరిగా, ఆ మొక్కల మధ్య, అలా కూర్చుండిపోయింది. ఆమె మనసంతా చేదు తిన్నట్టు అయ్యింది. మామయ్య వెళదాం అనగానే, ఏమి ఆలోచించలేదు తాను.. అసలతను రావాల్సింది తమ ఇంటికి చూసుకోవటానికి. తండ్రి, మామయ్య. ట్రై చేసిన మాచెస్ అన్నీ కట్నం దగ్గిర బోల్తా కొడుతున్నాయి. పదివేలు వచ్చే టీచర్ వుద్యోగం, చదువు బి.ఏ. ఎవడికి కావాలి తన అందం, అణకువ, ఇంటా బయటా పనితనం? తాను ధూర్తురాలు కాకపోతే, అతని మొదటి పెళ్ళి విచ్చిన్నమై రెండేళ్లయింది, అతనేమని అనుకుంటాడు తన గురించి? టీవీ ఛానెల్స్‌లో అతను సేంద్రియ వ్యవసాయంలో సాధించిన విజయాలు, అవార్డ్స్, దశాబ్దం పాటు అతను చేసిన కృషి అన్నీ చూసినప్పుడు కలుసుకొంటే బావుండునని వచ్చింది.

కానీ ఇలా అయ్యిందేమిటి? అతను తన పట్ల ఏ మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు. తాను ఇలా వచ్చేయ్యటo అతనికి ఒక రకమైన తేలిక భావం కలిగించిందేమో? పరిపరివిధాలా పోతోంది ఆమె మనసు.

అమ్మ ఉంటే జీవితం ఇలా ఉండేదా? అమ్మ పోయాక నాన్న పరాధీన అయిపోయాడు. మనసు విప్పి మాట్లాడడు. మామయ్య ఇలా తీసుకువచ్చాడని తెలిస్తే ఇద్దరూ ఎంత గొడవ చేస్తారో? మేనమామకు తనంటే జాలి, ప్రేమ. అమ్మ పోగానే మామయ్యా తనతో తీసుకు వెళదామని అనుకొన్నాడు, అత్తకి ఇష్టం లేదు. తండ్రి ఉండగా, నీకెందుకు? అంది. అదీ నిజమే కదా., అని ఇంటికి వచ్చేసింది. అన్నివిధాలా ఇది మంచి మ్యాచ్. కానీ, తొందర పడ్డారేమో తామిద్దరూ.

“అమ్మా” ఎవరో పిలిచినట్లయి తల ఎత్తి చూసింది. “రవీంద్ర బాబు, వంట చేయమన్నారండి. రోజూ నేనే చేస్తాను, మీక్కూడా వండమన్నారండి”

“నాకు చెయ్యకు, మీ బాబుగారికి చెయ్యి”

“మీక్కూడా చెయ్యమన్నారమ్మా”

“నా కవసరం లేదని చెప్తున్నా కదమ్మా, నేను తినేసి వచ్చాను.”

“పోనీ టీ తెమ్మంటారా?”

“వద్దమ్మా”

“బ్రాహ్మలా! మా చేతి వంట తినరు గామోసు!”

“అదంతా ఎందుకమ్మా, నేను తినను, తిని వచ్చానని చెబుతున్నాను కదా” వస్తున్న కోపాన్ని అదుపు చేసుకొంటూ అన్నది.

రెండింటప్పుడు వచ్చాడు రవీంద్ర. “నేను ఫ్రెష్ అయి వస్తాను, సారీ మిమ్మల్ని చాలా వెయిట్ చేయించాను” అన్నాడు.

“నేనే మీకు సారీ చెప్పాలి, మీరు వద్దన్నా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు” అంది.

అతను ఒక్క క్షణం ఆమె కేసి సాలోచనగా చూసి లోనికెళ్ళి పదినిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చి, “రండి, భోజనం చేద్దాము.” అన్నాడు.

“మీరు తినండి, నేను తినే వచ్చాను”

అతని లంచ్ అయ్యాక, ఆమె ఎదురు బెంచిమీద కూర్చుని అన్నాడు, “మీరే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చారో తెలియదు. సిటీలో పెరిగిన వాళ్ళు మీరు, బహుశా ఒక రైతు జీవితం ఎలా ఉంటుందో మీకు అవగాహన వుండి ఉండదు. మీరు ఊహించినంత రొమాంటిక్‌గా ఉండదు మా లైఫ్. ఇదేమి వైట్ కాలర్ జాబ్ కాదు. మాకు ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండదు, అసలు వ్యవసాయాన్ని ఒక ప్రొఫెషన్‌లా మన సమాజం ఇంకా గుర్తించలేకపోతుంది. నా వీడియోస్ చూసి మీరు నా లైఫ్ చాలా రొమాంటిక్‍గా ఊహించుకొని వుంటారు. వర్కర్స్ రాని రోజు, పశువుల కొట్టం, కోళ్ల షెడ్ అన్నీ నేనే శుభ్రం చేయాల్సి వస్తుంది. అలాంటి లైఫ్ మీకు సరిపోదు, మీరు డైజెస్ట్ చేసుకోలేరు” ఆగాడు.

అతని సెల్ రింగయ్యింది. “వస్తున్నా” అని ఆమె కేసి చూసి, “మీరు మీ మామయ్య వచ్చిందాకా వెయిట్ చేస్తారా, లోపల చాలా బుక్స్ వున్నాయి” అతని మాటలు పూర్తి కాకుండానే లేచి నుంచుని, “మామయ్యకు లేట్ అవుతుందట, నే వెళతాను” చేతులు జోడించి నమస్కారం చేసి, తెల్లబోయిన రవీంద్ర ఏదో అనేలోగా ఆమె వడివడిగా గేట్ వైపు వెళ్ళిపోయింది.

***

కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది. అక్కడ రవీంద్ర లేడు. ఆమెకు చాలా కోపంగా వుంది తన మీద, రవీంద్ర మీద కూడా. తానేదో పెళ్లి కోసం వెంపర్లాడుతూ వచ్చినట్టు అంత కటువుగా మాట్లాడేమిటి? తనదేదో పెద్ద రామోజీ ఫిలిం సిటీ లాగా ఫీల్ అయిపోతూ, ‘మీరొక్కళ్ళే వెళ్ళకండి, దారి తెలియదు అంటాడా?’ కోపంగా అనుకొని, గేట్ వైపు వెళ్ళేదల్లా, యూ టర్న్ తీసుకొని కనిపించిన దారి వెంట నడుస్తూ వెళ్ళసాగింది.

కూరగాయల తోట కావచ్చు, కొంతమంది ఆడవాళ్లు యేవో కోస్తున్నారు, వాళ్లలో ఒకామె సంయుక్త వెలుతుండటం, గమనించినా పట్టించుకోలేదు. తరువాత ఒక అద్భుత దృశ్యం చూస్తున్నట్టుగా నిలుచుండి పోయింది. కూరగాయల మళ్ళకు, శాశ్వత పందిళ్ళపైన వేసిన తీగ జాతుల మొక్కల దగ్గిరలోనే, ముందుగా బంతిపూల తోట, మైమరిచూస్తూ ముందుకెళ్లింది. రంగు, రంగుల చామంతులు కనుచూపుమేరా విచ్చుకొని ‘A feast to the eye’ లా అనిపించి అక్కడనించి కదలాలని లేక, కన్నార్పకుండా చూస్తుండిపోయింది. అలాగే ఇంకా ముందుకి వెళ్ళింది. మళ్ళీ ఎన్నో రంగుల పూలు, చామంతులలాగే వున్నాయి కానీ అవి పెళ్లిళ్లలో డెకరేషన్‌కి వాడటం చూసింది. ఆ తర్వాత గులాబీ తోట. ఎన్ని రంగులో! జీవితంలో ఎప్పుడూ అన్ని రంగులు గులాబీలలో చూడలేదు ఆమె. తన చీరకు మ్యాచ్ అయ్యే పసుపు రంగు గులాబీని కోసి తలలో తురుముకోంది. ఆమె మనసు ఎంతో ఉల్లాసంగా వుంది. తన ఇరవై మూడేళ్ళ జీవితంలో ఇంత నిర్మలమైన ఆనందం ఎప్పుడూ పొందలేదు. ఆమెకి విలియం వర్డ్స్‌వర్త్ పోయెమ్ ‘డాఫడిల్స్’ గుర్తుకు వచ్చింది. ఆ పూల తోట ఎన్ని ఎకరాలో ఆమెకి తెలియదు. వర్డ్స్‌వర్త్ గోల్డెన్ యెల్లో daffodils పూలని చూసి “I felt the bliss of solitude” అంటాడు. ఆమె మనసంతా ఆ కవి వర్ణించిన మహదానందానికి లోనయ్యింది.

తన చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి ఆమె గమనించకుండా, ముందుకు సాగిపోయింది. మామిడి తోట కనిపించింది. పూత మీద వున్నా ఆ చెట్లపై పడుతున్న సాయంకాలపు నీరెండ వింత కాంతులీనుతోంది. మైమరచి చూస్తూ ఇంకా ముందుకెళ్లింది.

అడుగువేయబోయి ఆగిపోయింది, కళ్ళు విప్పార్చుకుని చూసింది. కలువలు, రంగు, రంగుల కలువలు, మధ్య, మధ్యలో తామరలు మొగ్గల్లా ముడుచుకొనిపోయి వున్నాయి. ఉదయం పూట అవన్నీ విచ్చుకొని ఎంత అందంగా వుంటాయో! ఇంత అద్భుతమైన వనాన్ని సృష్టించిన రవీంద్ర అంటే ఎంతో గౌరవo కలిగింది. ఆ కొలను ప్రక్కన వున్నా బల్లపరుపు బండ మీద కూర్చుని తదేకంగా ఆ కొలనుని చూస్తూ, మగత నిద్రలోకి జారిపోయింది. ప్రొద్దున ఎప్పుడో తిన్న మూడు ఇడ్లీలు, తర్వాత ఏమీ తినకపోవటం, ఆ పైన దాదాపు నాలుగు గంటల పైనే తనకు తెలియకుండానే నడచిన ఆమె, ఒక రకమైన మగత నిద్రలోకి జారుకొంది.

ఏదో గుర్రు గుర్రు మంటున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచింది సంయుక్త, ఎదురుగా వెన్నెల వెలుగులో కుక్కలాంటి జంతువేదో ఆమెకు దగ్గరలో నిలబడి భయంకరంగా ఆమెకేసి చూస్తూ అదొక రకమైన శబ్దం చేస్తున్నది. ముందు తానెక్కడుందో సంయుక్తకు అర్థం కాలేదు. స్మృతిలోకి రాగానే పెద్దగా అరిచింది. అది బెదరలేదు, రెండు అడుగులు ముందుకి వేసింది. ప్రక్కకు చూసి, చేతికందిన రాయి ఒకటి తీసి, విసిరేసింది. రెండోసారి విసిరిన రాయికి భయపడి అది వెళ్ళిపోయింది. భయంతో వళ్లంతా చెమటలు పడుతుండగా, “రవీంద్రా” అంటూ అరవసాగింది. క్రమంగా ఆమె శక్తీ క్షీణిస్తుండగా, బైక్ శబ్దం, రవీంద్ర వస్తూ కనపడ్డాడు. ప్రాణo లేచిరాగా, శక్తినంతా కూడతీసుకొని ఎదురు పరిగెత్తింది..

బైక్ ఆపి తూలిపోతున్న ఆమెని పట్టుకొన్నాడు. ఆమెనేమీ అనలేదు అతను. ఆమె బైక్ ఎక్కాక, “గట్టిగా పట్టుకొని కూర్చోండి” అంటూ బైక్ పోనిచ్చాడు. గేట్ దగ్గరకు రాగానే, రెండు కుక్కలు భయంకరంగా అరిచాయి.

“ఎక్కడికి వెళ్ళారమ్మా, చానా సేపట్నుంచీ వెతుకుతున్నాం” అన్నాడు గేట్ కీపర్.

“సరే, నువ్విక గేట్ క్లోజ్ చేసి డాగ్స్‌ని వదులు” అంటూనే బైక్ పోనిచ్చాడు.

అతని ఇంటిముందు ఆగిందాకా, అతనెక్కడికి తీసుకుపోతున్నాడో తెలియక, అడిగే సాహసం చేయలేక నిశబ్దంగా ఉండిపోయింది. గేట్ లోపలికిపోనిచ్చి, ఒక విశాలమైన భవంతి ముందు ఆపాడు.

“ముగ్గురికి భోజనo తయారు చెయ్యి,” కాంపౌండ్ లోని ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆమెతో చెప్పి, సంయుక్తతో “లోపలికి పదండి, మీ మామయ్యకు ఫోన్ చేసాను” అంటూ లోపలికెళ్ళాడు. గ్రేప్ జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. అతనికి అంతలా ట్రబుల్ ఇచ్చినందుకు సారీ చెప్పింది.

“ముందు జ్యూస్ తాగండి, లంచ్ కూడా చెయ్యలేదు మీరు” అన్నాడు.

“అది మా గార్డెన్ గ్రేప్ జ్యూస్” నవ్వుతూ అన్నాడు.

లోపలికి వెళ్ళి ఒక క్రొత్త పంజాబీ డ్రెస్, టవల్ ఇచ్చి, “వెళ్లి ఫ్రెష్ అవ్వండి, ఈ లోపల భోజనo చేద్దురుగాని” నెమ్మదిగా అన్నాడు.

“మూడేళ్ళ క్రితం ఆమె కోసం కొన్నాను” అభావంగా అన్నాడు.

భయంతో చెమట పట్టిన శరీరం చీదరగా అనిపించి, మారుమాట్లాడకుండా వెళ్ళి తలారా స్నానo చేసి, తయారై బయటకు వచ్చింది.

హాల్ లోకి వచ్చి, అతని కెదురుగా కూర్చుంటూ చేతులు జోడించి అన్నది, “వెరీ సారీ అండీ. మీకివ్వాళ చాలా ఇబ్బంది కలిగించాము. అమ్మ నా పదో యేట పోయాక, స్వంత వాళ్ళు అంటే మా పిన్ని, నాన్నని కూడా ఇబ్బంది పెట్టకుండా బ్రతకటం నేర్చుకున్నాను. అమ్మ పోయిన కొద్దీ నెలల్లోనే, నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని, కోపం తెచ్చుకొని మామయ్యా వాళ్ళింటికి తీసుకెళ్లాడు. అత్త లలిత, కొత్తలోబాగానే వున్నది, కానీ, మామయ్య భాద్యత తీసుకొంటానంటే, నా ఉనికిని సహించలేక పోయింది. ఇంటికి తిరిగి వచ్చేసాను. పిన్నికి నా రాక ఇష్టo లేదు, రకరకాలుగా తన అయిష్టత చూపించేది. పన్నెండేళ్ళకే అన్ని పనులు వచ్చేసాయి. ఇప్పుడు బి.ఏ లిటరేచర్ చేసి స్కూల్లో జాయిన్ అయ్యా. పదివేలు శాలరీ, నాన్న దగ్గరికి తీయడు, ఇన్ని వైరుధ్యాల మధ్య నాకున్న ఒకే ఒక పిచ్చి, మొక్కలు, ప్రకృతి.

జీవితంలో ఒక్క సెంటు భూమి కూడా కొనలేనని తెలుసు అయినా, ఆ వీడియోలు చూడటం మానలేను. మామయ్య మీ గురించి చెప్పినప్పుడు, మీరు నన్ను మెచ్చి పెళ్లి వరకు వస్తుందని నేనాశలేమి పెట్టుకోలేదు. మా నాన్న చిన్న ఉద్యోగస్థులకు నన్ను చూపించి, తర్వాత ఏభై వేలకు మించి కట్నం ఇవ్వనని చెబుతుంటే పుంజాలు తెంపుకొని పారిపోతున్నారు. మీ ఫామ్ చూడవచ్చని ఆశపడి వచ్చాను. మీరేమో నేను యేవో రొమాంటిక్ ఐడియాస్‍తో వచ్చానని అనగానే నాకు చాలా కష్టం వేసింది. ఇంగ్లీష్ సాహిత్యంలో రొమాంటిక్ ఏజ్‌కి చెందిన కవులు ప్రకృతి ఆరాధకులు. మీ ఫామ్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. ఎప్పుడూ లేని ఆనందం కాదు, కాదు బ్లిస్‌ఫుల్ మూమెంట్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాను, చివరికి ఇలా అయ్యింది” అంది నవ్వుతూ.

తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. అంతలో నరసమ్మ అన్నావిడ పెద్ద క్యారేజీ తెచ్చి టేబుల్ మీద పెట్టిపోయింది. “మీరు ఫ్రెష్ అయి వస్తారా, నాకు చాలా ఆకలిగా వుంది” అంది మళ్ళీ నవ్వుతూ.

అతను ఫ్రెష్ అయి వచ్చాక, “ఏవండీ, మీరేమి అనుకోకపోతే నాకు చచ్చే ఆకలిగా వుంది, గబాగబా తింటాను, ఏమి అనుకోకండి, మీకు తొందర లేదుగా, నెమ్మదిగా తినండి” అంటూనే స్టార్ట్ చేసింది. అతను చిరునవ్వుతో ఆమెకేసి చూస్తూ కూర్చున్నాడు.

భోజనo అయ్యాక, “మీ ఇల్లు అదీ చూపించండి, ప్లీజ్, చాలా బావుంది మళ్ళీ చూసే అవకాశo రాదుగా” పెరట్లోకి తీసుకెళ్లాడు, వెన్నెల్లో పెరడంతా కాంతులీనుతోంది. “ఈ వెన్నెల్లో మీ తామర కొలనుని చూడలేక పోయాను, ఆ కుక్క” అంటూ ఆగిపోయింది

అతను నవ్వుతూ,” అది కుక్క కాదు, నక్క, ప్రక్కన అడవి వుంది, ఒక్కోసారి అడవి పందులు, తోడేళ్ళు, పులులూ..” అతని మాటలు మధ్యలోనే అందుకొని “ఏనుగులు, సింహాలు కూడా వస్తాయా” పకపకా నవ్వుతూ అంది.

“సారీ, ఎక్సట్రీమిలీ సారీ”. మరుక్షణమే అంది పరవశంగా, “ఆ వెన్నెల్లో, ఆ తామర కొలను చూస్తుంటే, నిద్ర వచ్చేసింది”.

“అది నిద్ర కాదు, ఉదయం నించీ ఏమీ తినక, మగత కమ్మింది మీకు. గంటసేపు మీకేమయ్యిందో అని హడలిపోయాను”. అతను తనకేసే చూస్తూండటం గమనించి “సారీ” అంది

“ఇంత అందమైన ఇంట్లో, ప్రకృతి ఒడిలో జీవిస్తున్న మీరు చాలా అదృష్టవంతులండీ”

“అవును, చాలా. మొక్కలంటే, పల్లె జీవనమంటే చాలా ఇష్టమంటే నమ్మాను. ప్రేమించిన వాడితో పారిపోవటానికి నన్ను పావుగా వాడుకోంది. నా జీవితమంతా అపసవ్యమైంది. ఆమె పేరెంట్స్, అన్నదమ్ములు పరువు హత్యలు చేయటానికైనా వెనుకాడేవారు కారు. ఆ అమ్మాయి మీద నాకు కోపం లేదు. పాపo వాళ్ళను ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మార్గం ఎంచుకోంది. వాళ్ళ వాళ్ళు నన్ను రకరకాలుగా వేధించారు. తాతయ్య, నాన్న, అన్నయ్యలు గట్టిగానే ఎదుర్కొన్నారు. మధ్యలో నేను scape goat నయ్యాను. అందుకే మీరు సిటీ అనగానే, కరుగ్గా మాట్లాడి హర్ట్ చేసాను, సారీ”

“అసలు ఈయన ఏమైనా రామోజీ ఫిలిం సిటీ సృష్టించాడా పెద్ద, అనుకొని ఒక్కదాన్నే వెళ్లి చూస్తా అనుకొన్నా, నిజంగా ఒక అద్భుతమైన అనుభవం, ఆ నక్క వచ్చి పాడుచేసింది కాని” ఆమె చెబుతున్న తీరుకి అతను నవ్వేసాడు.

“తామరలు, కలువల కొలను రాత్రిపూట కాదు, ఉషోదయ సమయంలో చూడాలి, మీరు రోజూ చూడొచ్చు కావాలంటే” మృదువుగా అన్నాడు రవీంద్ర

“ఎలాగా, వీడియో తీసి పంపుతారా?

వెలుగు నిండిన కళ్ళతో అన్నాడు, “నాతో రోజూ తోటలోకి వస్తావా సంయుక్తా?”

అతనేమంటున్నాడో అర్థమై, పున్నమిలా చుట్టేసింది అతణ్ని.

Exit mobile version