సాగర ద్వీపంలో సాహస వీరులు-14

0
2

[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]చే[/dropcap]తిలో పండుతో మౌనంగా ఉన్న జయంతుని చూసిన కోతి తన చేతిలోని పనస తొనలు అతని నోటికి అందించింది. ప్రేమగా కోతిని దగ్గరకు తీసుకున్నాడు జయంతుడు.

“చూసారా మూగజీవుల విశ్వాసం, ప్రేమానురాగాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. అవి అనుభవించాలే కాని చదవడం ద్వారానో, వినడం ద్వారానో ఆ అనుభూతికి లోనుకాలేము. ‘ఏమి తోచనమ్మ మొగుడు తల మీద మిరియాలు నూరిందంట’. మన విజయుడు తన పేరులోనే విజయాన్ని పెట్టుకున్నవాడు. తనని నమ్ముకున్నవాళ్ళకు ఎన్నడు అన్యాయం జరగనివ్వడు, నామాటపై నమ్మకం లేకపోతే జయంతుని అడగండి” అన్నాడు ఇకఇక.

“నిజమే విజయుడు అజేయ పరాక్రమవంతుడు, కత్తి పట్టిన నాటినుండి నేటివరకు ఓటమి ఎరుగని వీరుడు. దయార్ద్ర హృదయుడు. ఎందరికో పలురకాల సహాయం అందించిన మానవతావాది. అతని సేవాఫలం, నిస్వార్ధంగా ఇతరులకు మనంచేసే సహాయం, మేలు ఎన్నడు వృథా కాదు. అతని ఉత్తమ ఆశయమే, సేవాభావమే అతన్ని కాపాడుతుంది. పైగా అతని మెడలో రక్షరేఖ ఉంది. మనం భయపడనవసరం లేదు” అన్నాడు జయంతుడు.

అంతా నిద్రలోనికి వెళ్ళిపోయారు.

జయంతుడు నెగడుకు దూరంగా లోయ వైపు చూస్తూ కూర్చున్నాడు.

కొద్దిసేపటి అనంతరం ఎక్కడి నుండో నిశబ్దంగా వచ్చి ఎలుగుబంటి జయంతుని వీపుపై తన చేతితో బలంగా తాకింది. ఎలుగు బంటి దెబ్బకు నేలపైపడి దొర్లుకుంటూ లోయ లోనికి జారిపోతూ జయంతుడు పెట్టిన కేక లోయ అంతా ప్రతిధ్వనించింది.

జయంతుని కేకకు మెలకువ వచ్చిన అక్కడి వారికి ఎలుగుబంటును చూస్తూనే జరిగిన విషయం అర్థమైయింది.

కోపంతో చేతిలోని బళ్ళెం గురిపెట్టి శక్తికొద్ది బలంగా విసిరాడు జగ్గా. అది ఎలుగు బంటు గుండెను ఛేదిస్తు వీపు భాగానికి పొడుచుకువచ్చింది.

పెద్దగా గుర్రు పెడుతూ బాధతో ఎలుగు బంటు లోయలోకి పడిపోయింది.

“సహచరులారా అధైర్యపడవద్దు. మన ఏలికలు ఇద్దరూ, శివన్న క్షేమంగా తిరిగి వస్తారు. మనందరం వాళ్ళరాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉందాము. అదిగో వేగు చుక్కపొడిచింది. నేను తెల్లవారుతూనే తాళ్ళవంతెన ఆధారంగా లోయలోనికి దిగుతాను, మన దగ్గర ఉన్న తాళ్ళని ఒకదానితో ఒకటి ముడివేయండి. మన వాళ్ళెవరైన గాయపడి పైకిరాలేని స్థితిలో తాళ్ళ వంతెన పట్టుకుని ఉంటే వారికి మీరు వదిలిన తాడు కడతాను. వారిని మనం జాగ్రత్తగా తాడు సహాయంతో పైకి తీసుకు వద్దాం. మనవాళ్ళను కాపాడుకోవడానికి ఇంతకు మించి వేరే మార్గంలేదు” అన్నాడు జగ్గా.

పూర్తిగా తెల్లవారింది.

“‘ఉడతాభక్తి’గా నేను లోయలోనికి వెళుతున్న మనవాళ్ళు తాళ్ళ వంతెనపై ఎలా ఉన్నారో ఎక్కడఉన్నారో చూసి వస్తా” అన్నాడు ఇకఇక.

నేను వస్తానని సైగచేసింది కోతి.

“‘అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు’ అన్నట్లు ఉంది నీ వ్యవహారం. ‘తాను దూర దారి లేదు మెడకో డోలట’. నేను నిన్ను మోయలేను. అయినా ‘అడిగేవానికి చెప్పేవాడు లోకువ’ అని నేను నీకు లోకువ తాళ్ళవంతెన పట్టుకు దిగి వెళ్ళరాదా మిత్రమా!” అన్నాడు ఇకఇక.

కోతిని వద్దని వారించి ‘అక్కడకు వెళ్ళే సమయంలో నీ చేయి జారినా, కళ్ళు తిరిగినా ప్రమాదం’ అని సైగ చేసాడు జగ్గా.

“నేను అట్లా వెళ్ళి ఇట్లా వస్తా, లోయలోనికి వెళ్ళి వస్తా” అని ఇకఇక వెళ్ళాడు.

ఇకఇక రాకకోసం అందరూ ఊపిరిబిగబట్టి భయం భయంగా లోయ కేసి చూడసాగారు.

కొద్దిసేపటి అనంతరం “ఓహో మన వాళ్ళందరూ క్షేమమే. కాకుంటే కొద్దిపాటి గాయాలు అయ్యాయి. విజయుడు, జయంతులతో నేను మాట్లాడాను. మనందరిని ధైర్యంగా ఉండమన్నారు. లోయలోనికి జారిన జయంతునికి తాళ్ళవంతెన ఆదరుగా దొరికిందట, దాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నడట. మరికొద్దిసేపట్లో ముందుగా జయంతుడు, అనంతరం విజయుడు, శివన్న మన వద్దకు తాళ్ళవంతెన ఎక్కుతూ వస్తారు. అందుకే ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులేమిన్న!’ అన్నారు పెద్దలు” అన్నాడు ఇకఇక.

తన వద్దనున్న ఆకులు నూరి రాబోయేవారి గాయాలకు మందు సిధ్ధం చేయసాగాడు జగ్గా.

తాళ్ళ వంతెన కదలడం గమనించిన అందరూ అక్కడకు చేరుకున్నారు. కొద్దిసేపటికి జయంతుడు తాళ్ళనిచ్చెన ఆధారంగా పైకివచ్చాడు.

అతన్ని చూస్తునే ఆనందంతో కిచకిచలాడింది కోతి.

జయంతుని చేతులపై మోసుకుంటూ ఓ పెద్దచెట్టు కిందకు చేర్చారు. ఒక భిల్లు యువకుడు దాహం తీర్చాడు.

తనవద్దనున్న ఆకుపసరును జయంతుని గాయాలపైన ఉన్న రక్తమరకలు తడిగుడ్డతో శుభ్రపరచి ఆకుపసరు పూసి అదే ఆకును గాయంపై వేసి కట్లు కట్టసాగాడు జగ్గా.

నిద్రలోనికి వెళ్ళిన జయంతునికి రక్షణగా నలుగురు సాయుధులు కావలిగా నలుమూలలా నిలబడ్డారు.

మరికొద్దిసేపటికి అదే మార్గంలో విజయుడు, శివన్నాకూడా వెలుపలకు వచ్చారు.

వారి ఇరువురిని జయంతుని వద్దకు చేర్చి వారికి ఉన్నగాయాలను శుభ్రంచేసి ఆకు పసర మందు పూతవేసి కట్లుకట్టాడు జగ్గా.

“హమ్మయ్య ఆపద తప్పింది. ‘పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు’ అని పెద్దలు ఊరికే అన్నారా?” అన్నాడు ఇకఇక.

అలసిన జయంతుడు, విజయుడు, శివన్నా నిద్ర పోసాగారు.

ఆ రోజు తమ క్షేమ సమాచారం తెలియజేయడానికి గూడెంకు బయలుదేరింది జగ్గా వదిలిన పావురాయి.

మధ్యాహ్న భోజన సమయానికి ఆ పరిసరాలలోని పండ్లు, చిలకడ దుంపలు, రాత్రికి కూడా సరిపడా సేకరించుకువచ్చారు కొందరు. మరికొందరు ఆ రాత్రి నెగళ్ళకు కావలసిన కట్టెలు సేకరించారు.

జయంతుడు, అనంతరం విజయుడు, శివన్నలు నిద్రలేచారు.

అంతా కలసి మధ్యాహ్నం ఆహారం తీసుకున్నారు. ఎండ వేడి భరించలేక అంతా ఒక పెద్ద చెట్టుకింద సేదతీరారు.

“చిలకన్నా ఈ సంతోష సమయంలో ఏదైన కథ చెప్పు” అన్నాడు జగ్గా.

“సరే మీరు నవ్వుకునేందుకు కోతిబావ కథ చెపుతాను వినండి. కథ పేరు… ‘రాసేది తక్కువ – వాగేది ఎక్కువ’.

అడవిలో పిల్ల జంతువులు అన్నింటి కూర్చేపెట్టి చదువు చెపుతున్న నక్కమామ “పిల్లలు ఈరోజు పాఠం లేదు, నీతికథ చెప్పుకుంద్దాం! ముందుగా హాజరు పలకండి. సింహారాజు కొడుకు, వచ్చానయ్యా, కోతి కూతురు, ఉన్నానండి, కుందేలు కొడుకు, ఈడనే ఉన్నా! హజరు ముగిసిన అనంతరం అనగనగా ఓ అడవిలో… అంటుండగా… ఓండ్రపెట్టాడు గాడిద కొడుకు.

“ఒరేయ్ అడ్డగాడిద కొడకా, నీకు వేపకాయంత వెర్రి, వెలగ పండు అంత తిక్క ఉందని నాకు తెలుసు. నువ్వు రాసేది తక్కువ వాగేది ఎక్కువ. అరిచావో తోలుతీస్తా తింగరి వెధవా! పక్కవాళ్ళకి పనికిమాలిన సలహాలు ఇవ్వడం మాని కథ విను, ఆ అడవిలో అన్ని జంతువులు కలసి మెలసి స్నేహంగా ఉండేవి. అక్కడ మన అడ్డగాడిద లాంటి మరో తింగరి కొతి ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆ అడవికి తెచ్చి పెడుతుండేవాడు. ఒక రోజు అత్యవసరంగా సింహరాజు అడవిలోని జంతువులతో సమావేసమై ఉండగా, వచ్చిన కోతిబావ ‘ఏమిటండి మీ పరిపాలన తిరునాళ్ళకు వెళ్ళకూడదంటారు, నాట్యం చేయకూడదు అంటారు, పాటలు పాడకూడదు, హరికథ వద్దు బుర్రకథ వద్దు అంటు నన్ను విసిగిస్తున్నారు. నాకు స్వేచ్ఛ లేనేలేదు ఇదేం పరిపాలన అస్సలు బాగాలేదు.’ అన్నాడు కోతిబావ.

కోపంతో పళ్ళు పటపట లాడిస్తూ సింహరాజు ‘కోతిబావ ఉదయాన్నే ఉమ్మెత్త కాయ తినివచ్చాడులా ఉంది. తీసుకువెళ్ళి చిన్నపాడు పడిన బావిలో వేసి పైన రాతి మూత పెట్టండి పదిరోజులు ఉంచండి. నీళ్ళు ఆహారం రోజు మార్చి రోజు ఇవ్వండి’ అన్నాడు. రెండు చేతులు పట్టుకుని ఎత్తి బావిలో కుదేసారు ఎలుగుబంటి రక్షకభటులు.

పది రోజుల అనంతరం కోతిబావను బావిలోనుండి తీసి వదిలిపెట్టారు.

బావిలోనుండి బైటపడిన కోతిబావ సింహరాజు మెప్పు పొందాలని ‘సింహరాజు వర్ధిల్లాలి. అమోఘం ఇలాగే వారి పాలన కొనసాగాలి’ అని పెద్దగా అరుస్తూ అడవి అంతా తిరగసాగాడు. మళ్ళీ కోతి బావను తీసుకువచ్చి ఎత్తి బావిలో కుదేశారు. ‘ఏమిటిది నేను సింహారాజును పొగిడానుగా, నన్ను తీసుకువచ్చి మళ్ళీ బావిలో వేస్తున్నారేమిటి?’ అన్నాడు.

‘ఓరి తిక్కలోడా సింహరాజు గారికి బధ్ధశత్రువైన పులి ఇప్పడు పరిపాలిస్తున్న రాజు. పులి రాజు గారి శత్రువైన సింహారాజును నువ్వు పొగిడినందుకు నీకు మళ్ళీ పది రోజులు అదేశిక్ష అమలు చేస్తున్నాం’ అన్నారు ఎలుగుబంటి భటులు.

‘ఓర్ని రాజుగారి బిడ్డను ఎత్తుకున్నా తప్పే దించినా తప్పే లా ఉందే’ అన్నాడు కోతిబావ.

‘సమయం సందర్బం తెలియకుండా స్ధాయికి మించిన పనులు, ఇతరుల విషయాలలో వేలు పెడితే ఇలాగే తల బొప్పికడుతుంది’ అన్నది రామచిలుక. ‘నిజమే మనకు సంబంధం లేని విషయాలలో తలదూర్చ కూడదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. బుద్ధివచ్చింది మరెన్నడూ నాది కాని విషయంలో జోక్యం చేసుకోను’ అన్నాడు కోతిబావ.

సంతోషంగా అంతా చేతులు తట్టారు.

అంతా సంతోషంగా ఉన్న సమయంలో విజయుడు తన నడుము పట్టిలో ఉండవలసిన నిథి పత్రాలు లోయలో జారిపోయాయని గ్రహించాడు. ఆవిషయం అక్కడ ఉన్నవారితో చెప్పగా, అందరు నిరుత్సాహంతో చతికిలబడిపోయారు.

“నేను వెళ్ళి లోయలో తాళ్ళ వంతెన వేళ్ళాడుతున్న దిగువ పరిసర ప్రాంతాలన్ని గాలించనా?” అన్నాడు ఇకఇక.

“వృధాప్రయాస, అవి నీటి ప్రవాహంలో ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అయినా ఆ చిత్రపటం నాకు బాగా గుర్తు. బైరవకోన దాటగానే జలపాతం వస్తుంది. ఆ జలపాతం వద్ద ఉన్నకాళికామాత ఆలయంలో నిధి దాయబడి ఉంది” అన్నాడు విజయుడు.

ఆ రోజు మరుదినం అంతా అక్కడే విశ్రాంతి పొందారు. గాయాలు తగ్గడంతో మరలా ప్రయాణం కొనసాగించారు.

“నా తెలివి తేటలు, మేధావితనం మీకు తెలియదు. ‘పువ్వుల వాసన దారానికి అబ్బినట్టు’ నేను ఉన్నాననే ధైర్యమే మిమ్ములను ముందుకు నడిస్తుంది. మీకు భయం వద్దు విజయుడు, జయంతుడు ఉన్నారు. అంతగా వారిని కూడా పరిస్ధితి దాటిపోతే నే ఉన్నాను” అన్నాడు ఇకఇక.

“దేనికి ఎవరికి చెప్పకుండా కోతిబావతో కలసి పారిపోవడానికా?” అన్నాడు శివన్న.

ఫక్కున నవ్వారు అందరు.

అలా అందరు సంతోషంగా పరిసరాలను గమనిస్తూ ఎటునుండి ఎటువంటి దాడి జరిగినా సిధ్ధంగా ఉంటూ ప్రయాణం చేయసాగారు.

వారి ముందు పరుగు తీస్తూ వెళ్ళిన ఒక జింక చూస్తుండగానే బురదగుంటలో దిగబడి పూర్తిగా మునిగి ప్రాణాలు వదిలింది.

అది చూసినవారంతా ఆశ్చర్యపోయారు.

“మిత్రులారా ఈ ప్రదేశమంతా ప్రమాదకరమైన ఊబిలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా నడవాలి. ముందు నేను వెళ్ళి మార్గం సురక్షితమేనా అని పరిశీలిస్తాను. అనంతరం మీరు నే వెళ్ళిన దారినే రండి” అని ముందుకు కదిలాడు విజయడు. అలా ముందుకు దారితీసి కొంతదూరం వెళ్ళగానే ఒక్కఉదుటున అక్కడ ఉన్న ఊబిలో నడుము వరకు దిగబడిపోయాడు.

తన భుజంపై ఉన్న తాడును తీసి ఉచ్చు ముడివేసి విజయుని పైకి విసిరాడు శివన్న.

అప్పటికే ఊబిలోకి పూర్తిగా వెళ్ళిపోయిన విజయుని కుడిచేయి వెలుపలకు ఉండటంతో ఆచేయి తాడు ఉచ్చులో చిక్కుకుంది.

అందరుకలసి విజయుడిని ఊబిలోనుండి వెలుపలకు లాగారు.

చేరువలోని జలాశయంలో శరీరాన్ని శుభ్రపరచుకున్నాడు విజయుడు.

“అమ్మో ఎంత ప్రమాదం తప్పింది” అన్నాడు జగ్గా.

“జగ్గన్నా, ‘ముంతడు నీళ్ళకే ఉలిక్కిపడితే పొంతడు నీళ్ళు ఎవరు పోసుకుంటారు?’ ఇటువంటివి ముందు మందు ఎన్నిచూడాలో కదా!” అన్నాడు ఇకఇక.

ఎప్పటిలా విజయుడు ముందు వెళుతుంటే అతని వెనక మిగిలినవారు జాగ్రత్తగా అనుసరించసాగారు.

సాయంత్రానికి అందరు భైరవకోన చేరారు.

“మిత్రులారా ఈ భైరవకోన వివరాలు మీకు చెపుతాను. ఇక్కడ ఉన్నది శివుని ఆలయం. భైరవకోనలో చాలా గుహలు ఉన్నాయి. ఎక్కడ చూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకు ఉన్న మరో విశేషం.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచీ ఉన్నదే. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖానికీ ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగానూ చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే ప్రత్యేకరాతి శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here