Site icon Sanchika

సాగర ద్వీపంలో సాహస వీరులు-6

[box type=’note’ fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]”నా[/dropcap]యనలారా ఈ రోజు మీకు దానం విలువ, కాలగమనం మరియు మన్వంతరాల గురించి చెపుతాను.

మూర్ఖో న హి దదాత్యర్థం, నరో దారిద్య్రశంకాయ,

ప్రాజ్ఞస్తు వితర త్యర్థం, నరో దారిద్య్రశంకాయ.

మూర్ఖుడు ఈ జన్మలో తనకు ఏమి ఉండదేమోనని తన సొమ్మును ఎవ్వరికి దానం ఇవ్వడు. ప్రాజ్ఞుడు ముందుజన్మలో ఉండదేమోనని తన సంపాదనను యోగ్యులకు దానం చేస్తాడు. ఇది జీవిత సత్యం.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, నిస్వార్ధంతో చేసే దానాన్ని ‘స్వాతిక’ దానం అని, ఫలాపేక్ష ఆశించి చేసే దానాన్ని’రాజస’ దానం అని, తృణీకార భావంతో, డాంబికంతో ఇచ్చే దానాన్ని ‘తామస’ దానం అని చెప్పారు. దానంలో ‘కన్యాదానం’ – ‘గోదానం’ – ‘భూదానం’ – ‘విద్యాదానాల’తో పాటు, తిల, హిరణ్య, రత్న, ఆజ్య, వస్త్ర, ధాన్య, గుడ, రౌష్య, లవణ, అవయవ దానాలు వంటివి ఎన్నోఉన్నాయి.

“భీతేభ్యశ్చా అభయం దేయం-వ్యాధితేభ్యస్థ దౌషధం-దేయాం

విద్యార్థినే విద్యా-దేయమన్నం క్షుధాతురే”

మరణ భయంతో ఉన్నవారికి అభయం ఇవ్వడం. వ్యాధిగ్రస్థునకు చికిత్స చేయించడం. విద్యాదానం, అన్నదానం వంటి ఎన్నో రకాల దానాలు మన పెద్దలు సూచించారు.

ఇలా దానం చేసేవారిని మూడు రకాలుగా విభజించారు. తనకు ఉన్నంతలో అడిగిన వారికి దానం చేసేవారిని ‘దాత’ అని, అడిగినంత ఇచ్చిఇంకా ఇవ్వలేక పోయానే అనే భావన కలిగిన వారిని ‘ఉదారుడు’ అని, తన వద్ద లేకున్నా ఇతరుల వద్ద అడిగి తెచ్చి దానం చేసేవారిని ‘వదాన్యుడు’ అంటారు.

‘శ్రధ్ధయా దేయం’ – దానాన్ని శ్రధ్ధతో ఇవ్వాలి. ‘హ్రియాదేయం’ – దానం గర్వం లేకుండా ఇవ్వాలి. ‘శ్రీయాదేయం’ – ఇలా ఇవ్వడం వలన తనకు నష్టం రాదని భావించాలి. ‘తులాపురుష దానం’ – తన బరువుతో సమమైన బంగారాన్ని దానం చేయడం. ‘హిరణ్యదానం’ – బంగారాన్ని ధాన్యంలా కొలచి దానం చేయడం.

‘సువర్ణ బ్రహ్మండ దానం’ – బంగారం గుడ్డు ఆకారంలో దానం చేయడం. ‘కల్పదానం’ – బంగారంతో చేసిన వృక్షాన్ని దానం చేయడం. ‘గోసహస్త్రదానం’ – వేయి గోవులను దానం ఇవ్వడం.’ కామధేను దానం ‘ బంగారంతో ఆవు, దూడను చేసి దానమివ్వడం.

‘హిరణ్యాశ్వదానం’ బంగారు గుర్రాన్ని దానం చేయడం. ‘అశ్వరథ దానం’ గుర్రం కట్టబడి ఉన్ననాలుగు చక్రాల బంగారు రథాన్ని దానం ఇవ్వడం.

‘హేమ హస్తరథ దానం’ బంగారంతో ఏనుగు రథం చేయించి దానం చేయడం. ‘పంచలాంగక దానం’ ఐదు బంగారు-కలప నాగళ్లు దానం చేయుట.

‘ధారాదానం’ బంగారాన్ని భూగోళ ఆకారంలో చేయించి దానం చేయుట. ‘మహకల్పలత దానం’ బంగారంతో పది లతలు చేయించి దానం ఇచ్చుట. ‘సప్తసముద్రదానం’ ఏడు గుంటలు తీసి మెదటి దానిలో ఉప్పు- రెండవదానిలో పాలు – మూడవదానిలో వెన్న – నాల్గవదానిలో బెల్లంపాకం – ఐదవదానిలో పెరుగు – ఆరవదానిలో పంచదార – ఏడవదానిలో పవిత్రజలంతో నింపి, బంగారంతో బ్రహ్మ- విష్ణువు – శివుడు – సూర్యుడు – యముడు – లక్ష్మీ- పార్వతిదేవి విగ్రహలుతో పాటుగా దానం చేయాలి. ఇలా ఎన్నోదాలు మీకు తెలియనివి ఉన్నాయి.

కాల గమనం గురించి తెలుసుకొండి…

‘రెండు పరమాణువులు’ ఒక ‘అణువు’. మూడు అణువులు ‘త్రసరేణువు’. మూడు త్రసరేణువులు ఒక ‘త్రుటి’. నూరు త్రుటులు ఒక ‘వేధ’. మూడు వేధలు ఒక ‘లవం’. మూడు లవాలు ఒక ‘నిమేషం’. మూడు నిమేషాలు ఒక ‘క్షణం’. ఐదు క్షణాలు ఒక ‘కాష్ట’. పది కాష్టలు ఒక ‘లఘవు’. పదిహేను లఘవులు ఒక ‘నాడి’. రెండు నాడులు ఒక ‘ముహూర్తం’. ఆరు లేక ఏడు నాడులను మానవులకు ఒక ‘ప్రహరం’. దీనినే ‘యామ’ లేక ‘జాము’ అంటారు. నాలుగు జాములు ఒక ‘పగలు’. అదే విధంగా నాలుగు జాములు ఒక ‘రాత్రి’ అవుతుంది. ఒక పగలు రాత్రి కలిపితే మానవులకు ఒక ‘దినం'(రోజు). పదిహేను రోజులకు ఒక ‘పక్షం’. ఒక నెల(మాసం)కు ‘శుక్లపక్షం’  – ‘కృష్ణపక్షం’లు ఉంటాయి. అది పితృదేవతలకు ఒక ‘దినం’. రెండు నెలకు ఒక ‘ఋతువు’. ఆరు నెలలకు ఒక ‘ఆయనం’లు. అవి ‘దక్షణాయనం’-‘ఉత్తరాయణం’. ఇవి రెండు కలసిన పన్నెండు నెలలు, ఒక ‘సంవత్సరం’ ఈ సంవత్సరం దేవతలకు ఒక ‘దినం’ అవుతుంది. నూరు సంవత్సరాలు మానవులకు ‘పరమాయువు’. మానవులకు ముప్ఫై సంవత్సరాలు దేవతలకు ఒక ‘నెల’. మానవులకు మూడువందల అరవై ఏళ్లు, దేవతలకు ఒక ‘ఏడాది’తో సమం. కాలం నాలుగు యుగాలుగా విభజింపబడింది. ‘సత్యయుగం’ లేక ‘కృత యుగం’ 17,28,000 సంవత్సరాలు. ‘త్రేతాయుగం’ 12,96,000 సంవత్సరాలు. ‘ద్వాపరయుగం’ 8,64,000 సంవత్సరాలు. ‘కలియుగం’ 4,32,000 సంవత్సరాలు. వీటి అన్నింటిని కలిపి ‘మహయుగం’ అంటారు. ఇవి ‘వేయి’ అయితే బ్రహ్మదేవునికి ఒక ‘పగలు’. మరో ‘వేయి’ అయితే ఒక ‘రాత్రి’ అవుతాయి. బ్రహ్మదేవుని పగలు ఒకొక్కటి పధ్నాలుగు ‘మన్వంతరాలు’.

ప్రతి మన్వంతరంలోనూ, సప్త ఋషులు, దేవతలు, ఇంద్రుడు వీరంతా మారిపోతుంటారు. ప్రస్తుత కల్పంలో ఆరు మన్వంతరాలు గడచి పోయాయి. మెదటి మనువు పేరు ‘స్వయంభువ’ మనువు. రెండవ మనువు పేరు ‘స్వారోచిషుడు’. అప్పటి దేవతలు పారావతులు, తుషితులు, ఇంద్రపదవిని ‘విపశ్చితుడు’ అధిరోహించాడు. ఊర్జ, స్తంబ, ప్రాణ, దంబోలి, వృషభ, తిమిర, అర్వరివన అనువారు సప్త ఋషులు. మూడవ మనువు ‘ఉత్తముడు’. అప్పటి దేవతలు సుధర్ములు, సత్యులు,శివులు, ప్రతిర్దనులు,వశవర్తులు అనువారు. అప్పటి ఇంద్రుని పేరు ‘సుశాంతి’. అప్పటి సప్త ఋషులు రాజ, గోత్ర, ఉద్దవాహుడు, సవనుడు, అనుఘుడు, సుతపుడు,శుక్రుడు అనువారు. నాల్గవ మనువు ‘తామసుడు’. అప్పటి దేవతల పేర్లు సురవులు, పౌరులు, సత్యులు, సుధులు. అప్పటి ఇంద్రుడు ‘శిబి’. సప్త ఋషుల పేర్లు జ్యోతిర్దాముడు, పిత్రుడు, కావ్యుడు, చైత్రుడు, అగ్ని, వరుణుడు, పివరుడు. అయిదవ మనువు ‘రైవతుడు’. ఇంద్రుడు ‘విభుడు’. దేవతల పేర్లు భూతులు, వైకుంఠులు. సప్త ఋషులు హిరణ్యరోముడు, వేదశ్రీ, ఉద్దవాహుడు, వేదవాహుడు, సువాహుడు, సువర్జన్యుడు, స్వరోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీరంతా స్వయంభూ మనువు సంతతి వారే. ఆరవ మనువు ‘చక్షుడు’. ఇంద్రుడు పేరు ‘మనోజుడు’. అప్పటి దేవతలు ఆద్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథుకులు, లేఖులు. అప్పటి సప్త ఋషులు సుమేధ, విరాజ, హవిష్మన, ఉత్తమ, మధు, అభిమాన,సహిష్ణు. ఏడవ మనువు పేరు ‘శ్రధ్ధాదేవుడు’. ఇంద్రుడి పేరు ‘పురంధరుడు’. దేవతలు ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు. సప్త ఋషులు వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు. ఎనిమిదో మనువు ‘సావర్ణి’. ఇంద్రుడు ‘బలి’. దేవతలు ‘పారావతులు’. తొమ్మిదో మనువు ‘దక్షసావర్ణి’. ఇంద్రుడు ‘అద్బుతుడు’. పదవ మనువు ‘బ్రహ్మసావర్ణి’. ఇంద్రుడు ‘శాంతి’. దేవతలు ‘వామనులు’. పదకొండో మనువు ‘ధర్మసావర్ణి’. దేవతలు ‘విహంగములు’. ఇంద్రుడు ‘గణుడు’. పన్నెండో మనువు ‘రుద్రశావర్ణి’. ఇంద్రుడు ‘ఋతుధాముడు’. దేవతలు ‘హరితులు’. పదమూడవ మనువు ‘రౌచ్యుడు’. ఇంద్రుడు ‘దివస్తతి’. దేవతలు ‘సుత్రాములు’. పద్నాలుగో మనువు ‘బౌత్యుడ’వుతాడు. ఇంద్రుడు ‘శుచి’. దేవతలు ‘చాక్షువులు’. బ్రహ్మదేవుని ఒక పగలులోనే ఈ పధ్నాలుగు మన్వంతరాలు ఉంటాయి. ఈ రోజుకు పాఠం స్వస్తి.

నాయనలారా ఈ భూమండలంపై జరిగిన యుధ్ధాలలో మహాభారత యుధ్ధంలో అయిదు తరాలవారు పాల్గొన్నారు. మీ కోసం ఆ కథ క్లుప్తంగా…….

మహాభారతం పంచమ వేదంగా ప్రశస్తి పొందింది. సుమారు 1055 పాత్రలు మనకు కనిపిస్తాయి. సంస్కృత మూలం (వ్యాసవిరిచితం) లో లక్షకు పైగా శ్లోకాలు ఉన్నాయి. కవిత్రయంవారి ఆంధ్ర మహాభారతంలో సుమారు 21,5000 పద్య గద్యలు ఉన్నాయి. ఆంధ్రమహాభారతం ప్రకారం శతశృంగపర్వతం నుండి హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజుకు 16, భీమునికి 15, అర్జునునకు-14, కవలలైన నకుల సహదేవులకి 13 సంవత్సరాలని తెలుస్తుంది. భీముడు-ధుర్యోధనుడు ఒకేరోజున జన్మించారు కనుక యిరువురి వయస్సు ఒకటే. కృపాచార్యులు అనంతరం ద్రోణాచార్యుల వద్ద విలువిద్య అభ్యసించిన కాలం 13 సంవత్సరాలట. అంటే విలువిద్య ముగిసేనాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు. లక్కయింటిలోను, ఏకచక్రపురంలోనుకలిసి సంవత్సర కాలం ఉన్నారు అనుకుంటే ధర్మరాజు వయసు 30. ద్రౌపదిని వివాహం చేసుకుని పాండవులు ద్రుపదుని యింట సంవత్సరం ఉన్నారట. అంటే ధర్మరాజుకు 31 వయసు అనంతరం హస్తినకు వచ్చి 5 సంవత్సరాలు ఉమ్మడిగా జీవించారట. అంటే ధర్మరాజు వయస్సు 36. పిమ్మట రాజ్యం పంచుకుని ఇంద్రప్రస్ధపురం విశ్వకర్మచే నిర్మించుకొని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేసారని సభాపర్వం చెపుతుంది. అంటే36+23=59. పన్నెండేళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం 59+13=72 సంవత్సరాల వయసు ధర్మరాజుది. అతనికంటే కర్ణుడు దాదాపు 7లేక8 సంవత్సరాల పెద్దవాడు. మహభారత సంగ్రామం నాటికి ధర్మరాజు వయసు 72 అంటే అతని పితామహుడు అయిన భీష్ముని వయసు ఎంత? దాదాపు 150 నుండి 180 వరకు ఉండాలి. భీష్ముని తమ్ముడు బాహ్లీకుడు వయస్సు కూడా దాదాపుగా అంతే ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రుని 1. పితామహుడు, 2. పిత, 3.భ్రాతృడు, 4.పుత్రుడు, 5. పౌత్రుడు అనే 5 తరాలు అంతరించాయి.

వంశవృక్షం:

చంద్రవంశంలో 39వ తరం వాడు ప్రతీపుడు. యితను శిబి కుమార్తె అయిన సునందను వివాహం చేసుకున్నాడు. వీరికి దేవాపి, శంతన, బాహ్లీకుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు. దేవాపి బాల్యంలోనే తపోధనుడుగా వనవాసం వెళ్ళాడు. శంతనుడు రాజయ్యాడు. అతనికి గంగాదేవికి భీష్ముడు జన్మించాడు. అనంతరం యోజనగంధి అయిన సత్యవతిని వివాహం చేసుకోగా, చిత్రాంగద, విచిత్ర వీర్యులు జన్మించారు. వీరిలో ఒకరు గంధర్వరాజు చేతిలో మరణించగా, మరోకరు క్షయవ్యాధికి లోనై మరణించారు. సంతానం కొరకు సత్యవతి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికలకు దేవర న్యాయంగా కృష్ణ ద్వైపాయని (వ్యాసమహర్షి) వలన ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు, అంబిక పరిచారిక యందు విదురుడు జన్మించాడు. గాంధారికి జరిగిన గర్భస్రావాన్ని వ్యాస మహర్షి సంరక్షించగా నూరుగురు సంతతి జన్మించారు. కుంతి మాద్రిలకు పలు దేవతల వరాన పాండవులు జన్మించారు. ద్రౌపదికి పాండవులకు ప్రతివింధ్యుడు-శ్రుతసోముడు-శ్రుతకీర్తి-శతానీకుడు-శ్రుతసేనుడు అనే పుత్రులు జన్మించారు. అంతేకాకుండా ధర్మరాజుకు – దేవిక అనే భార్యకు యౌధేయుడు, భీముడు -జలంధరలకు సర్వంగుడు, హిడింబి యందు ఘటోత్కచుడు, అర్జున – సుభద్రలకు అభిమన్యుడు, ఉలూపికి ఇరావంతుడు, చిత్రాంగదకు బబ్రువాహనుడు, నకులుడు – రేణుమతిలకు నిరామిత్రుడు, సహదేవుడు -విజయలకు సుహోత్రుడు, అభిమన్యు ఉత్తరలకు పరీక్షిత్తుడు, ఇతనికి మద్రావతికి జనమేజయడు జన్మించారు. జనమేజయుని భార్య వుపుష్టి.

శంతనుడి సోదరుడు బాహ్లీకుడు అతనికి సోమదత్తుడు, అతనికి భూరిశ్రవుడు, శల శల్యులనే ముగ్గురు జన్మించారు. మెదటితరంలో భీష్మ , బాహ్లీకులు –

రెండో తరంలో సోమదత్తుడు, మూడవ తరంలో భూరిశ్రవుడు, అతని సంతతి, నాల్గవ తరంలో ధృతరాష్ట్ర – పాండురాజుల సంతతి. ఐదవ తరంలో లక్ష్మణకుమారుడు – అభిమన్యుడు – ఉపపాండవులు – ఇరావంతుడు – ఘటోత్కచుడు. పాండురాజు పౌత్రులలో చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడు తప్ప మిగిలిన 12 మంది యుద్దరంగంలో మరణించారు. ఇది అయిదు తరాల కథ.

వెళ్ళండి, వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి పొందండి” అన్నాడు రితధ్వని ముని.

ఆశ్రమ పరిసరాలు గమినించిన విజయుడు, జయంతుడు ఆ రాత్రి వారు ఒక పర్ణశాలలో నిద్రించసాగారు. ఒక రాత్రివేళ కూృరముృగాలు పర్ణశాలలో యధేచ్ఛగా సంచరించడం గమనించి, మరుదినం రితధ్వని ముని అనుమతితో ఎండిన చెట్లు కొట్టి తీసుకువచ్చి పర్ణశాలల చుట్టూ బలమైన ప్రహరిలా ఆ చెట్లు నాటి ద్వారం ఏర్పాటు చేసారు. యాగశాలకు వర్షం పడకుండా రక్షణ వలయం ఏర్పాటు చేసి, ఎక్కడో దూరంగా ఉన్న సెలఏటి పాయను కాలువ ద్వారా పర్ణశాలలో దాపుకు తీసుకువచ్చారు.

పర్ణశాలలు ఉన్న ప్రాంతమంతా శుభ్రపరచి ఫల, పుష్పాల మెక్కలు నాటారు. ముని బాలురు విద్య అభ్యసించే కుటీరాన్ని శుభ్రపరచి అందంగా అలంకరించారు. పర్ణశాలలను అందంగా తీర్చిదిద్దారు.

వీరి చర్యలను చూసిన చూసిన రితధ్వని మహర్షి “నాయనలారా మీ సేవాభావం, సహాకారగుణం అమోఘం. మా సదానందునికి తగిన శిష్యులు అనిపించుకున్నారు. మీ చర్యలు నాకు చాలా సంతోషం కలిగించాయి. శుచిగా అభ్యంగస్నానం చేసి తడి వస్త్రాలతో రండి, మీకు కొన్ని అమోఘ దివ్య ఆయుధాలు కాళీకాదేవి సమక్షంలో ఇస్తాను” అన్నాడు.

స్నానమాచరించి తడి వస్త్రాలతో వెళ్ళిన వారు దేవి ముందు ఆసీనులైనారు.

వారికి బల, అతిబల విద్యలు ఉపదేశించిన రితధ్వని ముని –

“నాయనలారా, ఈ విద్యల వలన పోరాడే సమయంలో ఆకలి, దాహం, అలసట, నిద్ర మీ దరిచేరవు. ఎన్నిరోజులైనా పోరాడగలిగే శక్తి మీకు లభిస్తుంది. ఇవిగో వీర ఖడ్గాలు, ఇవి మీచేతలో ఉన్నంతవరకు విజయం మీదే! ఈ శక్తులన్ని లోక కల్యాణానికి మాత్రమే వినియోగపడతాయి. ఎంతటి దూరమైన గమ్యమైన లక్ష్యసాధనతో చేరుకోవచ్చు. కృషి, పట్టుదల, ఆశయం ఉన్నచోట అపజయాలకు తావులేదు. మీరు ఎన్నడు ధైర్యాన్ని కోల్పోకండి. సాహసవంతులు, శౌర్యవంతులకు ఎన్నడూ ఓటమి ఉండదు. ముందురోజులలో మీ ప్రయాణంలో ఎన్నోకష్టాలు వస్తాయి. ఎన్నో వింత సమస్యలు ఎదురౌతాయి. మోక్కవోని మనోధైర్యంతో ముందుకుసాగండి. మీరు ఉత్తరదిశగా మూడు రోజులు ప్రయాణం చేస్తే సహరిత పర్వత పంక్తులు వస్తాయి. ఆ పర్వతాల మధ్యభాగాన జలపాతం పారే ప్రాంతంలో శాంభవి మాత అలయం ఉంది. ఆ దేవిని పూజించి మీ యాత్ర ప్రారంభించండి. శుభమస్తు, విజయోస్తు, కల్యాణమస్తు. వెళ్ళిరండి” అన్నాడు.

***

అలా మూడు రోజులు ప్రయాణంలో మొదటి రోజు ప్రయాణం ప్రారంభించారు మిత్రులు ఇరువురు. కొద్దిదూరం ప్రయాణం చేసాక వారికి వృధ్ధ దంపతులు ఎదురైనారు.

(సశేషం)

Exit mobile version