Site icon Sanchika

సాగర ద్వీపంలో సాహస వీరులు-9

[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]”అ[/dropcap]లవాటు పడ్డ ప్రాణం ఏం చేయమంటావు. అందులోనూ భార్యావియోగంతో ఉన్నాను కదా. ఆ బాధ మర్చిపోవడానికి ఏదో వాగుతుంటాను, సరే కాని ‘అవ్వ సలహా’ అనే కథ విను.

అనగ అనగా ఒకఊరిలో శివయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను అడవిలోని ఎండుకట్టెలు సేకరించి వాటిని నగరంలోనికి వచ్చి అమ్మి ఆ ధనంతో తన తల్లి, అతను జీవించేవారు.

ఎప్పటిలానే దారిలోని గుడికి వెళ్ళి నమస్కరించిన అనంతరం, అడవిలోకి వెళ్ళి అమ్మకానికి ఎండుకర్రలు సేకరిస్తున్న శివయ్యకు, చేరువగా పులి గాండ్రింపు వినిపించడంతో చేతిలోని గొడ్డలి అక్కడే వదలి చేరువలోని చెట్టుపైకి ఎక్కి గుబురుగా ఉన్న చోటకూర్చోని చెట్టుకిందకు చూడసాగాడు.

జింకను వేటాడిన పులి దాన్ని చెట్టుకిందకు తీసుకువచ్చి నింపాదిగా తిని కడుపు నిండిన తరువాత జింకను వదిలి వెళ్ళిపోయింది.

కొద్దిచేపటికి వెనుకభాగాన ఉన్న రెండుకాళ్ళు పనిచేయని నక్క ముందర ఉన్న రెండు కాళ్ళతో తన దేహాన్ని ఈడ్చుకుంటూ వచ్చి, పులి వదలివెళ్ళిన జింకను తిని కడుపు నిండగానే తన శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది.

ఆశ్చర్యపోయిన శివయ్య ప్రతిదినం గుడికివెళ్ళి నమస్కరించే తను జీవించడానికి ఇంతకష్టపడాలా? ఏనాడు గుడికివెళ్ళని కుంటి నక్కకు ఆహారం ఉచితంగా లభించేలా చేసిన దేవుడిపై కోపం వచ్చింది. రేపు గుడికి వచ్చి నీ సంగతి తేల్చుకుంటాను అనుకుని,  సేకరించిన కర్రలు కట్టకట్టుకొని తలపై పెట్టుకుని నగరంలో అమ్మడానికి బయలుదేరాడు.

మరుదినం గుడిలో దేవుని దర్శనం చేసుకుని ‘నిన్న కుంటి నక్కకు నిన్ను అడగకుండా ఆహారం ఎలా ఇచ్చావో, ఈ రోజు నాకు ఆహారం అలాగే ఇవ్వు’ అని ప్రార్థించి, గుడి ముందర పెద్ద చెట్టుకింద ఉన్న మంటపంలో వెళ్ళి కూర్చున్నాడు. మూడవరోజు ఉదయం ఆకలి బాధ తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు శివయ్య. గుడి ముందు ఉన్నదారిలో పొలం పనికి వెళ్ళే ఒక కాలులేని అవ్వ కర్ర సహాయంతో వెళుతూ, శివయ్యని మూడురోజులుగా గమనిస్తుంది. ఉదయాన్నే పొలం వెళుతున్న అవ్వ, శివయ్య ముఖంపైన నీళ్ళు చల్లి స్పృహ తెప్పించి, తన వద్ద నున్న ఆహారాన్ని అతనికి తినిపించి “నాయనా మూడు రోజులుగా ఇక్కడే ఉన్నావు ఎందుకూ?”అన్నది.

అడవిలో జరిగిన సంఘటన మొత్తం వివరించాడు శివయ్య.

ఫక్కున నవ్విన అవ్వ”ఓరి వెర్రివాడా, నిన్ను రెండు కాళ్ళులేని నక్కతో ఎందుకు పోల్చుకున్నావు? నీకు అన్ని అవయవాలు సరిగానే ఉన్నాయి కదా! అటువంటప్పుడు పులితో ఎందుకుపోల్చుకోలేదు? అంగవైకల్యం ఉన్ననేనే ఈ వయసులో కుంటుతూ కర్ర సహాయాంతో నడుస్తూ పొలం పనికి వెళ్ళి నా కుటుంబానికి సహాయపడుతున్నా, అన్ని అవయవాలు బాగున్న నీవు దేముడు పెడితే తిందామనుకున్నావా? దేవుడు ఎవరికైనా ఆహారం పెట్టగా చూసావా? దేవుడు దిగివచ్చి ఎవరికి ఆహారం పెట్టడు. మనమే దేవుడికి నైవేద్య రూపంలో పండ్లు, పలు రకాల పదార్థాలు వండి పెడతాము. దాన్ని ప్రసాదంగా భక్తులకు పంచిపెడతాము. వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించి పొదుపుగా వాడుకోవాలి. వృద్ధాప్యంలో దాచుకున్న ధనం పొదుపుగా వాడుకోవాలి, ఎవరో వస్తారు ఏదో తెస్తారు మనం తిందాం! అనుకోవడం అవివేకం. అలా అనడానికి నీకు సిగ్గు అనిపించడంలా?

మనిషి దయ, కరుణ, జాలి, పాపభీతి, పెద్దల ఎడల వినయం, దేవుని పట్ల భక్తితో, వృధ్ధులు, అన్నార్తులు, యాచకులు పట్ల సానుభూతితో సహాయం చేస్తూ మనిషిగా జీవించాలి. మనిషిలా పుట్టిన మనం మనిషిలానే జీవించాలి. పశువుతో పోలిక ఏమిటి?మనిషికి పశువుకి తేడా ఉంది కదా!

ఈ సృష్టిలో మనిషి మాత్రమే జ్జానవంతుడు, భాష నేర్చినవాడు. ఈ లోకంలో ఏ ప్రాణి వంట చేసుకు తినదు, తింటూ నీళ్ళు తాగదు, మనిషి మాత్రమే అలా చేయగలడు. సాటివారిని ఆపదలో ఆదుకోగలిగినవాడు మనిషి మాత్రమే! మనిషివై పుట్టిన నీవు ఇప్పటికైనా మనిషిలా ఆలోచిస్తూ జీవించు” అన్నది.

తన తప్పు తెలుసుకున్న శివయ్య అవ్వ నేర్పిన జీవితపాఠం నచ్చి, ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించి, ఎండు కర్రల కోసం అడవికి బయలుదేరాడు.

“ఎలా ఉందికథ?” అంటూ – ” ‘కథకు కాళ్ళులేవు ముంతకు చెవులు లేవు’ అన్నారు పెద్దలు. ఈ కథలు, మాటలు, సామెతలు అన్ని మా రాకుమారి సుగంధి నేర్పినవే. ఇంకా చాలావచ్చు. ముందు మనం ఈ రాత్రి సురక్షితంగా ఉండటానికి స్ధలం చూడు” అన్నది చిలుక.

విజయుడు కూడా రాత్రి తను ఉండటానికి అనువైన ప్రదేశం వెదుకుతూ నడుస్తుండగా…

హఠాత్తుగా పెద్ద తాడిచెట్టు అంత ఎత్తైన రాక్షసుడు వాళ్ళ ముందుకు రాతిగదతో వచ్చి కూర్చోన్నాడు. పకపకా నవ్వుతున్నప్పుడు రాక్షసుడి నోట్లో ఒక్క పన్నుమాత్రమే కనిపించింది.

”ఓరి మానవుడా నిన్నునేను కరకరా నమిలి మింగుతాను’ ‘అన్నాడు.

“ఓర్ని.. ఒంటికన్నోడిని, ఒంటి కొమ్ము రాక్షసుడిని చూసా! ఇప్పుడే ఒంటి పన్ను రాక్షసుడిని చూస్తున్నా! చాల్లే సంబడం. ‘బొంకరా బొంకరా మల్లన్నా అంటే మా ఊరి మిరియాలు తాటికాయంత అన్నాడంట’. ఒంటి పన్ను నోట్లో పెట్టుకుని కరకర నములుతాడంట, ‘అరిటాకు ముల్లు మీద పడినా ముల్లు అరిటాకుపైన పడినా అరిటాకుకే నష్టం’. ఇది కూడా అంతే అని ఈ వెర్రి రాక్షసుడికి తెలియకపోయే. ఓ తిక్కల రాక్షసుడా, తొందరగా పరుగుతీయి లేదంటే మా యువరాజు చేతిలో నీ పని అయిపోతుంది” అన్నాడు ఇకఇక.

హుంకరిస్తు నిలబడి తన రాతిగదను పైకి ఎత్తాడు రాక్షసుడు.

త్రుటికాలంలో ఒరలోని కత్తిలాగి రాక్షసుని కుడి కాలి బొటనవేలిని తెగవేసాడు విజయుడు.

బాధతో పెడబొబ్బలు పెడుతూ అరణ్యంలోనికి పరుగుతీసాడు రాక్షసుడు.

“యువరాజా ‘గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు’ అనుకుని ఆ రాక్షసుని చంపకుండా వదిలావా?” అన్నాడు ఇకఇక.

నవ్వూతూ విజయుడు “అలాగే అనుకో” అని తమ ప్రయాణం కొనసాగించాడు.

ఆవలించిన ఇకఇక ” ‘ఆవలింతకు అన్నదమ్ములు ఉన్నారు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట’, నిద్ర వస్తుంది పద” అన్నాడు.

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతుండగా, బలమైన అడవితీగల వలలో వాళ్ళు క్షణకాలంలో బంధింపబడ్డారు.

“ఇదేమిటి? ‘పెనం మీద నుండి పొయిలో పడటం అంటే ఇదే!’ ఆ రాక్షసుడిని తప్పించుకున్నాం కదా అనుకుంటే ఈ ఉపద్రవం ఏమిటి? ‘అయినా కొత్త చెప్పేకదా కరిచేది’; ఇటువంటి కొత్త ప్రదేశంలో మనకు ఈ బాధలు తప్పవు” అన్న చిలక ఆ వలలోనుండి తప్పించుకున్న చెట్టుపై చేరింది.

వందమందికి పైగా ఆటవీకులు విల్లంబులు, బరిసెలు ధరించి వచ్చి విజయుడిని బంధించి తమ గూడేనికి తీసుకుపోసాగారు. చిలుక తప్పించుకుని ఆకాశమార్గాన వారిని అనుసరించసాగింది.

***

అక్కడ చాలామంది పల్లంగా ఉన్నప్రదేశంలో కూర్చుని ఉన్నారు. కొందరు ఆహారం వండుతున్నారు. “ఈసారి మనం భిల్లుగూడెంపైన దాడికి రెండు రోజుల అనంతరం వెళుతున్నాం” అన్నాడు వారిలోని ఒక వ్యక్తి.

“సరే నాయకా, ఆహారం సిద్ధం. ఆకులు తెచ్చుకొండి” అన్నాడు ఓ వ్యక్తి.

వాళ్ళను చూసిన జయంతుడు నెమ్మదిగా చెట్లచాటుగా వెడుతుండగా కాలు జారడంతో దొర్లుకుంటు వెళ్ళి అక్కడ ఉన్నవారి వద్ద పడ్డాడు. అది చూసిన దొంగలు జయంతుని బంధించి చెట్టుకు కట్టివేసారు.

“వీడి సంగతి తెల్లవారి చూధ్దాం, ఉదయం నుండి ఏమి తినలేదు బాగా ఆకలిగా ఉంది, ఆహారం వేయి” అని ఆకుదోనె పట్టాడు. అందరూ ఆహారం తిని నీళ్ళు తాగి నిద్రపోసాగారు.

కొంతసమయం గడచాక నెమ్మదిగా జయంతునివద్దకు వచ్చిన కోతి ‘ అతని నడుము పట్టిలోఉన్ని పిడిబాకుతో జయంతుని కట్లు కోసింది.బంధవిముక్తుడైన జయంతుడు అక్కడనుండి తప్పుకుని కోతితో కలసి వేగంగా నడవసాగాడు. రాత్రంతా అలా ప్రయాణం చేసి వచ్చిన జయంతునికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.

అక్కడ గంపనిండుగా తేనెతుట్టెలు పెట్టుకుని ఉన్న యువతి చేతిలోని కత్తితో తనపై దాడికి వచ్చిన ఎలుగుబంటిని ఎదుర్కొంటుంది.

పరుగు పరుగున వెళ్ళి తన చేతిలోని కత్తితో ఆ ఎలుగుబంటిని గాయపరచాడు జయంతుడు.

గాయపడిన ఎలుగుబంటి బాధతో అరుస్తూ అడవిలోనికి పరుగుతీసింది.

“అయ్యా మీరు ఎవరు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు? సమయానికి వచ్చి సాయపడ్డారు. ఇక్కడకు సమీపంలో మా భిల్లుగూడెం ఉంది దాని నాయకుడు మా అయ్య. వెళదాం పదండి” అని బుట్టనిండుగా ఉన్న తేనెతుట్టెలను తలపై పెట్టుకు బయలుదేరింది ఆ భిల్లు యువతి.

తను ఈ అడవిలోనికి ఎందుకు వచ్చింది, మిత్రుడు విజయుడి నుండి ఎలా విడిపోయింది వివరిస్తూ, ఆమెను అనుసరించాడు జయంతుడు.

కొందూరం ప్రయాణంచేసాక దాదాపు వందల్లో చుట్టు గుడిసెలు (ఒకరకమైన గుండ్రని పూరిళ్ళు) ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఎతైన వేదిక మీద కూర్చోని ఉన్న భిల్లుగూడెం నాయకుడికి జయంతుని చూపిస్తూ “అయ్యా నేను తేనె సేకరించడాని పోయా. అక్కడ ఎలుగుబంటి నా పైన దాడిచేసింది. దానితో నేను పోరాడుతున్న సమయంలో ఈ అన్న వచ్చి దాన్ని తరిమాడు” అని తన తండ్రికి చెప్పింది ఆ యువతి.

“బిడ్డా గాయాలైనవా” అన్నాడు తన కుమార్తెను భిల్లురాజు.

“లేదయ్య ఎలుగు దాడి మొదలు పెట్టగానే ఈ అన్న పరుగు పరుగున వచ్చి దాన్ని అడ్డుకున్నాడు” అన్నది భిల్లు యువతి.

“అయ్యా మంచిది. ఎలుగునే ఎదుర్కున్నావంటే మంచి గుండెనిబ్బరం ఉన్నోడివే! ఈ అడవిలోనికి ఎందుకువచ్చావు? ఎవరు నీవు?” అన్నాడు భిల్లురాజు.

జరిగిన విషయమంతా వివరించాడు జయంతుడు.

“నాయనా మా పూర్వీకులు అంగదేశం వారే. అపారమై నిధిని ఇక్కడ దాచి దాన్ని చేరుకునే మార్గం జింక చర్మంపై చిత్రికరించి దాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం మా వద్ద, మరో భాగం అంగదేశం వారే అయిన కోయల వద్ద మా పూర్వీకులు భద్రపరచారు. నిధికి మార్గం చిత్రీకరించిన ఒక భాగం నావద్ద ఉంది, నువ్వు మా అంగదేశపు రాజ పాలక వర్గంలోని వాడివే కనుక ఆ చిత్రభాగం తీసుకో” అని తన గుడెసెలోనికి వెళ్ళి మూరెడు పొడవున్న బంగారు మురళి వంటి దాన్ని జయంతుడికి అందించాడు భిల్లురాజు.

దాన్ని అందుకుని తన నడుము పట్టిలో భద్రపరచుకున్నాడు జయంతుడు.

”సరే నీ జతగాని వెదుకులాటకై మావాళ్ళను నలుదిక్కులకు పంపుతాను. అందాక కొద్దిరోజులు మా అతిథిగా మా గూడెంలో ఉండి మా యువకులను కత్తియుధ్ధం మెళకువలు నేర్పించు. అమ్మా మంజరి, అన్నని కొత్తగా కట్టిన మన గుడెసెకు తీసుకుపో” అన్నాడు భిల్లురాజు.

మంజరిని అనుసరించిన జయంతుడు, మంజరి చూపించిన కొత్త గుడెసె చేరుతూనే తనకు లభించిన పెద్ద బంగరు పిల్లనగ్రోవిని చేతిలోనికి తీసుకుని మూతభాగంలో ఉన్న మూడు బుడిపెలు ఒక్కసారిగా వత్తడంతో మూత ఊడింది. అందులో ఉన్నదాన్ని చూస్తూనే జయంతుడు ఆలోచనలో పడ్డాడు. పండిన చిన్న అరటిపళ్ళ గెలతో నవ్వూతూ గుడిసెలోనికి వచ్చింది జయంతుడు రక్షించిన కోతి.

***

 రాత్రంతా తమవద్ద బందీగా ఉన్న విజయుని ఉదయాన్నేతమ నాయకుని ముందు హాజరుపరిచారు కోయలు.

 విజయునికి చేరువగా వచ్చిన కోయరాజు విజయుని మెడలోని హారం, చేతికి ఉన్న రాజముద్రిక ఉంగరం చూస్తూనే విజయుని చేతులకు ఉన్న కట్లు ఊడదీసి

“నాయనా నీ కుడిచేతి జబ్బపై ఈ హారం గుర్తు ఉన్నదా?” అన్నాడు.

“ఉన్నది కోయరాజా. ఇది మా అంగరాజ్య రాజముద్రిక గుర్తు, మా రాజవంశంలో మగవారందరికి మెడలో హరంగా, కుడిచేతి జబ్బపైన పచ్చబొట్టుగా, వేలికి ఉంగరంగా ఉంటుంది.” అన్నాడు విజయుడు.

మోకాళ్ళపై కూర్చున్న కోయరాజు “ఏలికా మన్నించు, మావాళ్ళు తెలియక చేసిన అపరాధమిది” అని తన వాళ్ళవైపుకు తిరిగిన కోయరాజు

“ఓరేయ్ ఈయన మన ఏలిక(రాజు), మొక్కండి, గడిబిడీలు (నమస్కారాలు) చేయండి” అని చెప్పి, విజయునికి నమస్కరిస్తూ “ఏలికా కొన్ని తరాలకు ముందు మా పూర్వికులు తమ రాజ్యంనుండి ఏదో పని మీద ఈ దీవికి వచ్చారంట. పడవ ప్రమాదంలో కొందరు చనిపోగా మిగిలిన వాళ్ళు రాజ్యం వెళ్ళే దారి తెలియక ఇక్కడే ఉండిపోయారు. ఈడ ఉన్నవాళ్ళంతా వాళ్ళ సంతానమే, మమ్మల్ని రాజముద్రిక కోయలు అంటారు. తమరికి అప్పగించవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ముందు స్నానం భోజనం విశ్రాంతి అయినాక సాయత్రం మన దేవళానికి ఎళదాం” అన్నాడు భిల్లురాజు.

విజయుడు పక్కనే ఉన్న జలాశయంలో స్నానం చేసివచ్చేసరికి తనకు కేటాయించిన గుడిసెలో వెదురుబొంగులతో చేసిన ఆసనం ముందు వెదురుబొంగుల బల్లపై ఎన్నోరకాల పండ్లు, పెద్దపాత్ర నిండుగా పుట్టతేనె, మంచినీళ్ళు అమర్చి ఉన్నాయి.

అలా అతిథి మర్యాదలు అన్ని జరిగిన అనంతరం నిద్రపోయాడు విజయుడు.

సాయంత్రం తనవారితో వచ్చిన భిల్లురాజు “ఏలికా పదండి, మా దేవళం చూద్దురు గాని”అని కొద్దిదూరంలోని దేవాలయానికి తీసుకువెళ్ళాడు.

అక్కడ ఉన్నదేవతా విగ్రహాన్నిచూసిన విజయుడు ఆశ్చర్యపోయాడు.

అక్కడి దేవాలయంలో దేవతామూర్తి విగ్రహ స్ధానంలో తమ రాజముద్రిక ప్రతిష్ఠించి ఉంది.”ఏలికా, మీ రాజపాలకులు ఎవరువచ్చినా ఇవ్వమని మా పూర్వీకులు మాకు దీన్ని అప్పగించారు. దాదాపు మూడువందల ఏళ్ళుగా మా వాళ్ళు దీన్ని కాపాడుతూ వచ్చారు, స్వీకరించండి” అని విగ్రహం అడుగు భాగాన రహస్య అరలో దాచి ఉంచిన బంగారంతో చేయబడిన గుండ్రని మూరెడు పొడవైన వస్తువు రెండుపక్కలా మూతలు కలిగిన పిల్లనగ్రోవి వంటి వస్తువును అందించాడు కోయరాజు.

(సశేషం)

Exit mobile version