Site icon Sanchika

సాగేను జీవిత నావ

[dropcap]ఫో[/dropcap]న్ మ్రోగింది. క్రొత్త నెంబర్ కనిపించడంతో సందేహంగా “హలో! ఎవరండీ” అన్నాను.

“శ్రీకర్ గారేనా?” అని స్త్రీ స్వరం వినిపించింది.

ఔనన్నాను కానీ అవతలి వ్యక్తిని గుర్తు పట్టలేకపోయాను. అందుకే తిరిగి “మీరెవరండీ” అన్నాను.

“గెస్ చెయ్యండి. చూద్దాం మీరెంత త్వరగా నన్ను గుర్తుపడ్తారో” నవ్వుతూ అనిందావిడ.

“సారీ. నాకు ప్రాంక్ కాల్స్ ఇష్టం లేదు” అని నేను ఫోన్ పెట్టేయబోయాను. వెంటనే “నో నో ప్లీజ్! ఫోన్ పెట్టేయకండి. సరే! నేనొక క్లూ ఇస్తున్నాను. మీ పెళ్లి, నా పెళ్లి ఒకే రోజు జరిగింది” అనిందావిడ.

“మై గాడ్! స్వాతి హౌ అర్ యూ! ఇరవై ఏళ్లయ్యిందనుకుంటా మీతో మాట్లాడి. ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు” అన్నాను.

“శ్రీకర్ నేను బావున్నానండీ. మీరు సైనిక్‌పురిలోనే ఉంటున్నారా?” అనింది స్వాతి.

“అవునండీ. కొన్నాళ్ళు జర్మనీలో ఉండి తిరిగొచ్చేశాను. చాలా సంతోషంగా ఉంది మీరు తిరిగి ఫోన్ చేసినందుకు” అన్నాను.

“శ్రీకర్! నన్ను మీరు అని పిలుస్తున్నారేంటి కొత్తగా?” అనింది స్వాతి.

“ఓహ్! స్వాతి చాలా ఏళ్లయ్యింది కదా నీతో మాట్లాడి. చాలా సార్లు నీతో మళ్ళీ మాట్లాడాలనుకున్నా. కానీ వీలు కాలేదు. నీ ఫోన్ నెంబర్ కూడా మారింది కదూ. ఏడాది క్రితం నీ గురించి గూగుల్ ద్వారా వెతికాను. నీ ప్రొఫైల్ లింక్డ్‌ఇన్‌లో కనపడింది. కంగ్రాట్స్! నువ్వు చాలా అద్భుతాలు చేసావు. స్టేట్ బ్యాంకులో క్లర్క్ నుంచి కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థల్లో పెద్ద స్థాయికి ఎదిగావు. నీ ప్రస్తుత స్టేటస్ ముంబయిలో చారిటబుల్ ట్రస్టులో పని చేస్తున్నట్లుంది. అక్కడే ఉంటున్నావా నువ్విప్పుడు?” అన్నాను.

“థాంక్యూ శ్రీకర్. కార్పొరేట్ ఉద్యోగాలు చేసి విసుగొచ్చి మూడేళ్ళ క్రితం నేను ఈ ట్రస్ట్‌లో డైరెక్టర్‌గా గౌరవ పదవి తీసుకున్నాను. హైదరాబాదులో ఉంటూనే కొన్ని రోజులు ముంబయి వెళ్లొస్తుంటాను. ఔను శ్రీకర్! మీరిప్పుడు తీరికగా ఉన్నారా? ఫోన్ చేసి మీ పనికేమీ అంతరాయం కల్గించట్లేదు కదా?” అనింది స్వాతి.

“అబ్బే ఏం లేదు స్వాతి. ఇవాళ ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేసి టీవీలో విశేషాలు చూస్తున్నా” అన్నాను.

“ఇంకేంటి శ్రీకర్ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు” అనింది స్వాతి.

“మేమంతా బావున్నాం. మా అమ్మాయి సుధకి పెళ్ళై ఒక బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు లండన్‌లో ఉంది” అన్నాను.

“ఓహ్ వెరీ నైస్! కంగ్రాట్స్ శ్రీకర్! మీరప్పుడే తాత కూడా అయ్యారా!” అనింది స్వాతి.

“థాంక్యూ స్వాతి! ఔను నాకీ విధంగా ప్రమోషన్ వచ్చింది. నీ వైపు విశేషాలేంటి?” అన్నాను.

“నా వైపు పెద్దగా విశేషాలేవీ లేవు శ్రీకర్. మార్పేమీ లేదు. జీవితం కూడా నిజంగానే సాగుతోంది బంక లాగా!” అని నవ్వింది స్వాతి. నాకు కూడా నవ్వొచ్చింది ఈ మాటకి.

“స్వాతి! కొన్నేళ్ల కింద నేను మా కజిన్ పెళ్ళికి వెళ్ళాను. చూస్తే పెళ్లికూతురెవరో కాదు మాధవ్ చిన్నన్నయ్య రాము కూతురే! మాధవ్ వాళ్ళ కుటుంబమంతా ఉన్నారక్కడ. మాధవ్ వాళ్ళ డాక్టరక్కయ్య నీ గురించి అడిగారు.

నువ్వు వాళ్ళని అసలు కలవట్లేదా” అని అడిగాను.

“లేదు శ్రీకర్. నిజం చెప్పాలంటే మాధవ్ అనే వాడికి నా జీవితంతో సంబంధం ఉండేదనేదే నేను పూర్తిగా మర్చిపోయాను. ఆ చాప్టర్ గురించి నేనసలు తల్చుకోను. నా జ్ఞాపకాలలోంచి అది పూర్తిగా కరిగిపోయింది. ఇంకా వేరే ఏమైనా చెప్పండి శ్రీకర్” అనింది స్వాతి.

నా మనస్సులో అలజడి. ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. వాటినలా అణచిపెట్టి స్వాతితో ఇంకొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడాను. తర్వాత మళ్ళీ మాట్లాడతానని స్వాతి సెలవు తీసుకుంది.

మాధవ్ ప్రస్తావన రాగానే స్వాతి ఎక్కువ సేపు మాట్లాడలేదు. మాధవతో నా సాన్నిహిత్యం దృష్టిలో పెట్టుకుని వాడి గురించి నేను మరింకేం మాట్లాడకుండా కళ్లెం వేసింది. వాస్తవంగా మాధవతో తన జీవిత భాగస్వామ్యాన్ని తనెలా మర్చిపోతుంది. స్వాతి చెప్పినట్లు మాధవని పూర్తిగా మర్చిపోవటం సాధ్యమా?

ఇలాగే దాదాపు ఇరవై ఏళ్ల క్రితం నేనూహించని సమయంలో స్వాతి ఫోన్ చేసి “హ్యాపీ టెన్త్ వెడ్డింగ్ ఏనివర్సరీ శ్రీకర్!” అనింది. వెంటనే నాకెలా స్పందించాలో అర్ధం కాలేదు. ఎందుకంటే ఆ రోజే స్వాతి మాధవల పెళ్లి రోజు కూడా. మాధవ్ చనిపోయి మూడేళ్లయింది అప్పటికి. పిచ్చిపిల్ల తనలా గ్రీటింగ్స్ చెప్పటంతో నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థాంక్స్ చెప్పి తనెలాగుందో అడిగాను. స్వాతి గొంతు కూడా గాద్గదికమవ్వటం నాకు తెలుస్తోంది.

స్వాతితో కొంచెం సేపు కుశల సంభాషణ తరువాత నేను తనని మళ్ళీ పెళ్లి చేసుకోమని అన్నాను. వెంటనే స్వాతి “శ్రీకర్! ఆ విషయం గురించి మాట్లాడితే నేనిక ఫోన్ పెట్టేస్తాను” అని బెదిరించింది. నేను “సరే సరే! చెప్పు ఇంకేంటి విశేషాలు” అని అడిగాను. స్వాతి పార్ట్ టైం ఎం.బీ.ఏ చేస్తున్నానంది.

ఆ రోజు తరువాత తన ఫోన్ నెంబర్ మారటంతో నేను తిరిగి స్వాతితో మాట్లాడలేకపోయాను. స్టేట్ బ్యాంకులో తనకున్న చేదు జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని, స్వాతి వేరే ఉద్యోగంలోకి మారి హైదరాబాద్ కూడా విడిచి వెళ్లిందని నాకు తర్వాత తెలిసింది.

ఎన్నో ఏళ్ల తరువాత తిరిగి ఈ రోజు స్వాతి నాతో మాట్లాడడం జరిగింది. అందుకే నేను మాధవ్ ప్రస్తావన పరోక్షంగా తెచ్చాను. మాధవ్ నాకు చిన్నప్పటినుండీ నేస్తం. వాడు నా ప్రాణ మిత్రుడని చెప్పాలంటే గుండె కలుక్కుమంటుంది. నిజంగా ప్రాణ మిత్రుడే ఐతే నాతో చెప్పకుండా వెళ్లిపోతాడా?

మాధవతో నా జ్ఞాపకాలు జీవిత కాలం మరువలేనివి.

అది నాలుగేళ్ల వయసున్న నేను బుడి బుడి రాగాలు తీస్తూ బళ్ళో చేరిన మొదటి రోజు. నాన్న పలకా బలపం ఇంకా టిఫిన్ బాక్స్ ఒక చిన్న సంచీలో పెట్టి, దాన్ని నా మెడకు తగిలించి నెమ్మదిగా నన్ను స్కూల్ గేటు లోపల దిగబెట్టారు. బిక్కు బిక్కుమంటూ లోపలికి అడుగులేస్తున్న నేను అక్కడే బెంచీ మీద కూర్చున్న ఒక అబ్బాయిని చూసాను. బాగా వదులుగా ఉన్న ఖాకీ రంగు చొక్కా చెడ్డీ వేసుకున్న వాణ్ని చూస్తే నాకు ఏడుపాగి ఒక్క క్షణం ఫక్కున నవ్వొచ్చింది. వాడి ప్రక్కన వెళ్లి కూర్చున్నాను. నీ పేరేంటన్నాను. “మాధవ్” అన్నాడు ముద్దుగా. నా పేరు చెబితే “శ్రీకలా” అన్నాడు. ” శ్రీకల్ కాదు శ్రీకర్” అన్నాన్నేను. వాడు మళ్ళీ “శ్రీకల్” అన్నాడు.

నాకు నవ్వాగలేదు. వాడికి ‘ర’ అక్షరం పలికేది కాదు.

అంతటితో నేనూరుకోకుండా “నీకు జుట్టు లేదా గుండు మాధవ్” అన్నాను. వాడు దిగులుగా “ఈ మధ్యే నాకు గుండు చేశారు. మా నాన్న పోయారుగా” అని ఏడవటం మొదలు పెట్టాడు. ఇంతలో ఒక టీచర్ గారొచ్చి

“పిల్లలూ మీరంతా కొత్తగా ఈ రోజే బడికి వచ్చారు కదా. ఇలా రండి మిమ్మల్ని మీ క్లాసులో కూర్చోబెడతాను” అని మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు.

ఆ రోజు నుంచీ మొదలైన మాధవ్ తోటి స్నేహం వాడు శాశ్వతంగా నన్నొదిలి పెట్టి వెళ్ళేదాకా సాగింది.

మాధవ్ చాలా బాగా చదివేవాడు. రోజూ వాళ్ళ ఇంటికి వెళ్తూ మాధవ్ కుటుంబానికి నేను బాగా చేరువయ్యాను. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మాధవ్ చిన్నన్నయ్య రాముకు బ్యాంకులో ఆఫీసరుగా ఉద్యోగం వచ్చింది. ఏడాది తిరక్కుండానే రాము పెళ్లి కూడా జరిగింది. రాము భార్య వసంత చాలా త్వరగానే కలుపుగోలుగా మా గురించి తెలుసుకుంది.

మాధవ్ నాతో తరచు చిన్న వదిన వసంత గురించి చెప్తున్నాడు. ఆవిడ చాలా తెలివైందని, సాంప్రదాయంగా కన్పించినా ఆధునికమని. వసంత వదినతో మాధవ్ చాలా త్వరగా దగ్గరయ్యాడు. ఒక రోజు ప్రొద్దున పదకొండింటికి నేను మాధవ్ వాళ్ళింటికెళ్ళాను. లోపలికెళ్ళి పిలిచినా పలక్కపోతే, పెరట్లోకి వెళ్లాను. మాధవ్ ఒక స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. వసంత వదిన వాడికి నలుగు పెట్టి తలంటి పోస్తోంది.

ఇప్పుడుంటున్నఇల్లు చాలనందున రాము ప్రక్క కాలనీలోనే వేరే ఇంట్లోకి కాపురం మారాడు. మాధవ్ ఎక్కువగా అక్కడే ఉంటున్నాడు. మాధవకి ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల్లో చాలా మంచి మార్కులొచ్చాయి.

మెడికల్ కాలేజీలో చేరతాడనుకుంటే, మాధవ్ డిగ్రీ కోసం అగ్రికల్చర్ కోర్స్ లో చేరి అందరినీ నిర్ఘాంతపర్చాడు. పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఆఖరి పిల్లవాడైన మాధవ్, ఇన్నాళ్లు తనను పెంచి పోషిస్తున్న పెద్దన్నయ్యకి తన ఎంబీబీయస్ చదువు భారమౌతుందని ఈ నిర్ణయం తీసుకున్నానని అందరికీ చెప్పాడు.

పెళ్ళైన ఏడాదిలోపే రాముకి చండీఘడ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే గర్భిణి అవ్వటం వలన రాముతో పాటు వసంత వదిన చండీఘడ్ వెళ్ళలేకపోయింది. మాధవ్ అందుకే వసంత వదినకి తోడుగా రాము వాళ్ళింటికి మారాడు.

మాధవలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య మాధవ్ యథేచ్ఛగా ఇంట్లోనే సిగరెట్స్ కాల్చడం మొదలు పెట్టాడు. దీనికి వసంత వదిన అభ్యంతరం చెప్పకపోవటం నాకు ఆశ్చర్యంతో పాటు కోపం తెప్పించింది.

సిగరెట్ త్రాగని నన్ను ఆవిడ “శ్రీకర్ గుడ్ బాయ్ కదా” అనటం వ్యంగ్యంగా అనిపించింది. నాకు ఆవిడ ఆంతర్యంలో తేడా తెలుస్తోంది.

అగ్రికల్చర్ బి.ఎస్.సి తరువాత స్టైపెండ్ ఇస్తారు కాబట్టి అగ్రికల్చర్ ఎమ్మెస్సీ కూడా పూర్తి చేసాడు మాధవ్. ఇదౌతూనే సులభంగా స్టేట్ బ్యాంకులో అగ్రికల్చర్ ఆఫీసరుగా ఉద్యోగం తెచ్చుకుని సూర్యాపేట శాఖలో చేరిపోయాడు.

ఇదే సమయానికి మా మిత్ర బృందం కూడా చదువులు ముగించుకుని హైదరాబాదులో ఉద్యోగాల్లో చేరాము. శనివారం సాయంత్రమయ్యేసరికి మాధవ్ హైదరాబాదు వచ్చేసేవాడు. మాధవ్ వచ్చీరాగానే మా గ్యాంగ్ అంతా దగ్గర్లోని ఇరానీ కేఫ్‌లో హాజరు అయ్యేవాళ్ళం. మాధవ్ వాడి బ్యాంకులో జరిగిన విశేషాలన్నీ చెప్పేవాడు.

కొన్నాళ్ళకి మాధవ్ వాళ్ళ బ్యాంకులో క్రొత్తగా స్వాతి అనే అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చి చేరింది.

ఇక మేమంతా వాణ్ని ఆ అమ్మాయి గురించి తెగ అడుగుతుంటే, మాధవ్ “సరే రా! మీరు రండ్రా సూర్యాపేటకు. పరిచయం చేస్తా” అన్నాడు. అంతే! మరుసటి శనివారమే మా బ్యాచ్ అంతా పొలోమని వెళ్ళాం ఆ అమ్మాయిని చూడటానికి. స్వాతి సన్నగా నాజూగ్గా ఉంది. గొప్ప అందగత్తె కాకపోయినా చక్కగానే ఉందనిపించింది.

స్వాతి కూడా మాధవ్ టీంలో చేరి త్వరగానే వాళ్ళతో అలవాటై పోయింది. ఒక చేతిలో సిగరెట్తో చక చకా పనులు చేస్తూ, తిండి కూడా పట్టించుకోకుండా పూర్తిగా పనిలో నిమగ్నమయ్యే మాధవని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది స్వాతికి. ఇదేంటితను తనను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. నిజంగానే తనను పట్టించుకోవట్లేదా లేక నటిస్తున్నాడా అని మెల్లగా అతన్ని తాకుతూ, దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్తూ పరీక్షించడం మొదలు పెట్టింది. మాధవ్ చురుకుతనం, తెలివితేటలకు స్వాతి బాగా ఆకర్షితురాలయ్యింది.

మాధవకు బ్యాంకు ఇంచార్జిగా బాధ్యతలు పెంచారు. సూర్యాపేట చిన్న టౌన్ కాబట్టి మాధవను అక్కడి రైతులు, వ్యాపారస్తులు పరిచయం చేసుకుని వీణ్ణి మందు పార్టీలకు పిలిచి, వాళ్ళ ఋణ అవసరాల కోసం కోసం కాకా పట్టడం మొదలు పెట్టారు. మాధవకి ఏవైనా సందేహాలుంటే రాము కూడా వేరే బ్యాంకులో సీనియర్ మేనేజర్ కాబట్టి తనని అడిగి తెలుసుకునే వాడు. బ్యాంకు లావాదేవీల కిటుకులు తెలుసుకుని మాధవకి అనవసర ధీమా పెరిగింది.

మాధవ్ రూల్స్ అతిక్రమించి అవసరమైన రైతులకు బ్యాంకు డబ్బును సర్దుబాటు చేయటం మొదలు పెట్టాడు.

రాము చండీగఢ్ వెళ్లి ఐదేళ్ల పైనే అవుతోంది. వీలైనప్పుడు హైదరాబాద్ మూణ్ణెల్లకోసారి వచ్చేవాడు.

రాము తన బ్యాంకులో అక్రమ వ్యవహారాలలో ఇరుక్కోవటం వలన, తనకి డబ్బు సర్దుబాటు చెయ్యడానికి తెలివిగా వసంత వదిన మాధవని తప్పుడు పనులు చేయటానికి ప్రోత్సహిస్తోంది. మాధవ్ బ్యాంకు డబ్బును వసంత వదిన కోసం కూడా సర్దడం చేస్తున్నాడు. మాధవ్ డ్రింక్ చేసి ఇంటికెళ్ళినా వసంత వదిన అభ్యంతరం చెప్పట్లేదు. ఈ మధ్య కొన్నిసార్లు సెలవు పెట్టి ఇంట్లో ఉండి కూడా మాధవ్ మమ్మల్నికలవట్లేదు. మాధవ్ ఇంట్లో పెద్ద వాళ్లకు వీడి విషయం ఆలస్యంగా అర్థమైంది. వాళ్ళు దీనికి పరిష్కారం త్వరలో మాధవకి పెళ్లి చేయడమే అనుకున్నారు.

మా ఇంట్లో కూడా నా పెళ్లి కోసం సంబంధాలు వెతికి, ఒక సంబంధం మా అందరికీ నచ్చి నిశ్చయతాంబూలాలు తీసుకోవాలనుకున్నారు. ఇదే అదనుగా నేను మాధవని కూడా పెళ్లి చేసుకోవాలని గట్టిగా ప్రస్తావిస్తే, వాడు స్వాతి తనని ఇష్టపడి పెళ్లి చేసుకోమని కోరుతున్నట్లు చెప్పాడు. ఇదే మాట వాళ్ళింట్లో చెబితే మాధవ్ వాళ్ళ అమ్మ గారు, పెద్ద అన్నయ్య కూడా దీనికి సంతోషంగా ఒప్పుకున్నారు.

త్వరలోనే మా ఇంట్లోవాళ్ళు నా పెళ్లి తేదీ నిశ్చయం చేసి రాత్రి పూట ముహూర్తం అని తెలిపారు.

ఆశ్చర్యంగా మాధవ కూడా అదే రోజు ప్రొద్దున స్వాతితో వాడి పెళ్లి ముహూర్తం కుదిరిందని చెప్పాడు. మాధవది, నాదీ ఒకే రోజు పెళ్లి అనేసరికి నేను వాడితో గొడవ చేసాను “అదేంట్రా మనిద్దరి పెళ్లి ఒకే రోజైతే ఎలా” అని. కానీ వేరే మంచి ముహుర్తాలు అప్పట్లో లేనందున మా పెళ్లిళ్లు ఒకే రోజు జరిగిపోయాయి.

మాధవ్, స్వాతి సూర్యాపేటలో కాపురం పెట్టారు. పెళ్ళైన తరువాత ఆ వారాంతంలో మా మిత్రులందరం కలవాలనుకున్నాము. కానీ దాని క్రితం రోజు రాత్రి మాధవ్ స్వాతిని పుట్టింట్లో దింపి వసంత వదిన వాళ్ళింటికి ఒక్కడే వచ్చాడు. మేము కలిసి “ఏంట్రా ఒక్కడివే వచ్చావు” అంటే మాధవ్, వసంత వదినకి ఒంట్లో బాగోలేదని ఫోన్ చేసిందన్నాడు. రేపు ప్రొద్దున స్వాతి వాళ్ళింటి నుంచి ఇక్కడికి వస్తుందన్నాడు. నాకిది నచ్చలేదు. చూస్తే వసంత వదిన హుషారుగానే ఉంది. ఆ తరువాత కూడా మాధవ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా స్వాతిని వాళ్ళింట్లో వదిలి, వసంత వదిన ఇంట్లోనే గడపడం చూసి మాకెవరికీ అర్థం కాలేదు వీడెందుకిలా చేస్తున్నాడని. ఇదే మాట వాడితో అంటే స్వాతికి వాళ్ళ పుట్టింట్లో అయితే ఫ్రీగా ఉంటుందని అలా చేస్తున్నాడన్నాడు.

రోజులు గడుస్తున్నాయి. మాధవ్ బ్యాంకులో సమర్థంగా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ రాము కోసం బ్యాంకు డబ్బులను సర్దుబాటు చెయ్యడం మానలేదు. మాధవకి దీని పర్యవసానం త్వరలోనే

అనుభవించాల్సి వచ్చింది. రూల్స్ ఖచ్చితంగా పాటించే ఒక ఆడిటర్, మాధవ్ బ్యాంకు రూల్స్ అతిక్రమించినట్లు రిపోర్ట్ ఇచ్చాడు. నెలలోపే ఎంక్వయిరీ జరిగి మాధవకి బ్యాంకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది. పూర్తి ఎంక్వయిరీ అయ్యేదాకా సగం జీతం ఇస్తూ మాధవను బ్యాంకు విధులనుండి తొలగించారు.

మాధవకి జీవితంలో తిరిగి కోలుకోలేని పరిణామమిది. మేమందరం ఈ సంఘటనకి నిర్ఘాంతపోయాము.

మాధవ్ స్వాతికి కూడా బ్యాంకులో తలెత్తుకునే పరిస్థితి లేకుండా చేసాడు. అయినా మాధవకి ధైర్యం చెప్పి స్వాతి అండగా నిలబడింది. మాధవ్ మాత్రం సూర్యాపేటలో ఉండలేక తిరిగి వసంత వదిన గూటికి చేరాడు. మాధవ ఇప్పుడు ఇంట్లోనే మందు త్రాగడం మొదలు పెట్టాడు. వసంత వదిన దీనికి అభ్యంతరం చెప్పలేకపోయింది.

ఏడాది పాటు సాగిన సస్పెన్షన్ సమయంలో మాధవ్ పూర్తిగా కుంగిపోయాడు. వాణ్ని తిరిగి మామూలు మనిషిని చెయ్యాలన్న మా ప్రయత్నాలు ఫలించలేదు. మాధవ్ త్రాగుడుకి బానిసై వసంత వదిన ఇంట్లో స్వాతికి దూరంగా ఉండటంతో, పరిస్థితి అర్థమైన ఇంట్లో పెద్దవాళ్ళు గట్టిగా మందలించి వాణ్ని తిరిగి సూర్యాపేటకు పంపించారు. కానీ వారం తిరగకుండానే మాధవ్ వసంత వదిన ఇంటికి వచ్చాడు. ఇది తెలిసి నేను ఆగ్రహంతో మాధవని గట్టిగా నిలదీసి, వాడు చేస్తున్న పని తప్పని చెడామడా తిట్టాను. అప్పుడు వాడు ఏడుస్తూ చెప్పాడు వసంత వదినకి తను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని. పెళ్ళైన తరువాత కూడా తనని ఏదో వంకన ఇబ్బంది పెడుతోందని చెప్పాడు. ఇప్పుడు కూడా వసంత వదిన పదే పదే ఫోన్ చేసి విసిగిస్తుంటే ఆమెకి నచ్చ చెప్పాలని వచ్చాడట. కానీ ఆవిడ నిన్నరాత్రి గ్యాస్ స్టవ్ మంట మీద చీర కొంగు అంటించుకోబోయిందట. ఈ సంఘటనతో మాధవ విపరీతంగా భయపడి బెంబేలెత్తి పోయాడు.

చాలా కాలంగా మాధవ్ వాళ్ళ అమ్మగారు వసంత వదిన తీరు గురించి రాముకి ఎలా చెప్పాలో తెలియక కుమిలిపోతున్నారు. ఇప్పుడీ విషయం తెలిసిన తరువాత పరిస్థితి చేయి జారిపోతోందని గమనించిన మాధవ్ వాళ్ళ పెద్ద బావగారు, రాముని అర్జెంటుగా ఫ్లైట్ లో రప్పించి వసంత వ్యవహారం గురించి చెప్పారు. తన పరువెక్కడ పోతుందోనని రాము దీన్నసలు అంగీకరించక పోవటంతో, మాధవ్ వాళ్ళ బావగారు మూడో పక్షంగా నన్ను పిలిపించి అడిగారు. నేను మొహమాట పడకుండా నాకు తెలిసింది చెప్పాను. రాముకి మొహం చెల్లలేదు. మాధవ్ వాళ్ళ బావగారు పరోక్షంగా దీనంతటికీ కారణమైన రాముకి బాగా చీవాట్లు పెట్టి, మాధవకి కూడా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు.

వెంటనే మాధవని సూర్యాపేటకు పంపించేశారు. ఈ దిద్దుబాటు చర్య ముందే జరిగి వుంటే పరిస్థితి ఎంతో బాగుండేది కానీ, ఆలస్యమైందేమో అనిపించింది నాకు.

మాధవ్ సూర్యాపేటకు వెళ్లిన కొన్ని రోజులకే వాడి ఎంక్వయిరీ పూర్తయ్యింది. మాధవ్ సమర్థ పని తీరు, అలాగే మిగతా బ్యాంకు సిబ్బంది కూడా తన గురించి పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడంతో, మాధవని బ్యాంకు వాళ్ళు తిరిగి విధులలోకి చేర్చుకుని, కొన్ని హెచ్చరికలతో హైద్రాబాదులో ఒక బ్రాంచ్‌కి ట్రాన్స్ఫర్ చేశారు. తన సస్పెన్షన్ తొలగి తిరిగి విధుల్లోకి చేరిన మాధవ్ బాగానే కోలుకున్నాడు. త్వరలోనే స్వాతికి కూడా హైద్రాబాదుకు ట్రాన్స్ఫర్ అవ్వటంతో వాళ్లిద్దరూ వేరే ఇంట్లో కాపురం పెట్టారు.

చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. ఒక రోజు నేను ఆఫీసులో ఉండగా మధ్యాహ్నం మూడింటికి మాధవ్ ఆఖరి అన్నయ్య సురేష్ నుంచి ఫోన్ వచ్చింది. నన్ను వెంటనే అర్జెంటుగా స్వాతి వాళ్ళ ఇంటికి రమ్మని.

ఏమైందని ఆదుర్దాగా వెళ్లిన నాకు సురేష్ చెప్పాడు మాధవ్ ప్రొద్దున వాడింట్లో ఉరి వేసుకున్నాడని. స్వాతి ఆఫీసుకు వెళ్ళాక మాధవ్ ఫోన్ చేసి చెప్పాడట మధ్యాహ్నం ఇంటికి వచ్చేయమని. స్వాతి ఏంటంటే ఒంట్లో బాలేదన్నాడట.

స్వాతి అలాగేనని మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికొచ్చే సరికి ఈ ఘోరం జరిగిపోయింది. స్వాతి కుప్ప కూలిపోయింది.

అసలెందుకిలా జరిగిందో ఎవ్వరికీ అంతు పట్టలేదు.

ఆ రోజు రాత్రి పదకొండింటికి గానీ ఉస్మానియా హాస్పిటల్ మార్చురీలో మాధవని చూడలేకపోయాను.

నేనెంతో ఇష్టపడే మాధవ్ తన బాధని నాతో కూడా పంచుకోకుండా ప్రాణం తీసుకున్నాడు. ఎందుకిలా చేసావ్ మాధవ్ అంటూ బావురుమన్న నన్ను బలవంతాన మా ఇంటికి చేర్చారు. మర్నాడు మాధవ్ అంత్యక్రియల తరువాత స్వాతి వాళ్ళ నాన్నగారు మమ్మల్ని కలవాలనుకుంటున్నారని కబురందింది. నేనూ నా మిత్రుడు వెళ్ళాము. స్వాతి వాళ్ళ నాన్నగారు మమ్మల్ని అడిగారు ఎందుకిలా జరిగిందని. ఆయన బాధను చూసి మాకూ దుఃఖం ఆగలేదు. మాకసలు వాడిలా చేయబోతున్నాడని తెలియదని చెప్పాము. ఆ రోజు స్వాతి పరిస్థితి మాతో మాట్లాడేలా లేదు. అలాగే తర్వాత తనని కలిసి సముదాయించడానికి మాకే కాదు మాధవ్ కుటుంబానికి కూడా స్వాతి అవకాశమివ్వలేదు.

మాధవ్ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు తనకి తన మీదే తీవ్రమైన అసహ్యం కలిగి, జీవితం మీద విరక్తి పుట్టిందని. మాధవ్ తన వ్యక్తిగత ప్రవర్తనకి స్వాతికి క్షమాపణలు చెప్పాడు. మాధవ్ స్వాతికి కూడా ఎప్పుడూ తన విపరీతమైన ఆలోచన గురించి బయట పెట్టలేదు. ఉద్యోగంలో తన నిర్దోషిత్వం నిరూపణ అయ్యేదాకా ఆగిన మాధవ్, అది నెరవేరగానే ఈ పని చేసాడు. పాపం స్వాతి గురించి మాధవ్ ఎందుకు ఆలోచించలేదని చాలా బాధపడ్డాను.

అమాయకురాలైన స్వాతి బ్రతుకు ఛిద్రం చేసిన వసంతపై నాకు చెప్పలేనంత కోపం, జుగుప్స కలిగాయి. అప్పటి నుండీ నేను వసంతని తిరిగి కలవలేదు, మాట్లాడలేదు.

మళ్ళీ చాలా ఏళ్ల తరువాత మా బాబాయి వాళ్ళబ్బాయి ప్రవీణ్ పెళ్ళిలో వసంతను చూడాల్సి వచ్చింది.

నాకు తెలియదు వసంత కూతుర్నే మా బాబాయ్ కోడలిగా చేసుకుంటున్నాడని. రాము నన్ను పెళ్ళిలో చూసి షాక్ అయ్యాడు. తమాయించుకుని ముఖం మీద నవ్వు పులుముకుని నాతో చనువుగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఎదురొచ్చిన వసంతని, రాముని తప్పుకుని నేను పక్కకెళ్ళిపోయాను. బాబాయికి వీళ్ళ గురించి చెప్పడానికి సమయము, సందర్భమూ కాదది. పెళ్ళిలో మా వాళ్ళు అనుకుంటున్నారు పెళ్లి కూతురు తల్లి వసంతగారికి సాంప్రదాయాలన్నీ బాగా తెలుసని, అలాగే పాటిస్తోందని. ఇది వింటున్న నా పరిస్థితి వర్ణించలేనిది.

ఏదో సాకు చెప్పి త్వరగా పెళ్లి మండపం నుండి బయటపడ్డాను.

కాలం ఎంతో గడిచిపోయింది. మళ్ళీ ఇవాళ స్వాతి ఫోన్ చేసినప్పుడు మాధవని పూర్తిగా మర్చిపోయానంది.

కానీ, నాకు తెలుసు స్వాతి దాచిన నిజమైన ప్రేమ ఇంకా త్యాగం గురించి. స్వాతి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఉద్యోగంలో కూడా ఉన్నతమైన స్థాయికి ఎదిగి మానవ సేవలో తన జీవితాన్ని సాగిస్తోంది. ఇటు వసంత మాధవని సహజంగానే మర్చిపోయింది. రాము కట్టించిన పెద్ద ఇంట్లో భజనలు, వ్రతాలు నిర్వహిస్తూ తన కాలనీలో పెద్ద ముత్తైదువగా చలామణి అవుతోంది.

Exit mobile version