Site icon Sanchika

సామెత కథల ఆమెత-1

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

కొండంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువ

[dropcap]S.[/dropcap]P. రంగనాధ్ ఆరడుగుల మనిషి.

చేసే ఉద్యోగంలో మహా స్ట్రిక్ట్ అని పేరు.

ఎప్పుడూ పైకి ఉబ్బెత్తుగా ఉండే అతని దవడ ఎముక అతని సీరియస్‌నెస్‌ని చెప్పకనే చెబుతుంటుంది.

ఆఫీసులో కూడా ఎంతో అవసరం వస్తే తప్ప ఎక్కువగా ఎవరినీ మాట్లాడనివ్వడు.

***

“అమ్మో నాన్నొచ్చే వేళయింది” అంటూ.. ‘పొద్దుపోయినా ఇంకా ఆటలేనా’ అని కేకలేస్తారని హడావుడిగా చెంగున ప్లే గ్రౌండ్ నించి ఒక్క గంతులో ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని పుస్తకాలు ముందేసుక్కూర్చున్నాడు డిగ్రీ చదువుతున్న కొడుకు వంశీ.

“నాన్నేమైనా సింహమా.. పులా? రేపు ఇంటర్ కాలేజి మ్యాచ్ ఫైనల్స్ అని, ప్రాక్టీసుకెళ్ళానని చెప్పచ్చు కదరా! పైగా నాన్న ‘స్పోర్ట్స్ ఆడాలి.. ఒళ్ళు గట్టిపడుతుంది.. గెలుపు ఓటములు తెలుస్తాయి’ అని చెబుతుంటారు కదా” అన్నది రెండో కూతురు పూర్ణిమ.

“ఆఁ నువ్వంటే నాన్నకి గారాబం! నువ్వు ఏం చేసినా ఒక్క మాట కూడా అనకుండా ఓ చూపు చూసి వెళ్ళిపోతారు.. కానీ నిన్నేం అనరని ధైర్యం. నాన్న చేత మాట పడాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుసు” అన్నాడు చెల్లితో వంశీ.

“ఒరేయ్ కార్తీక్.. బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే తాతగారు తిడతారని తెలుసుగా! ఆఫీసు నించి వచ్చే టైమయింది. సోఫాలో ఉన్న నీ బొమ్మలు డబ్బాలో పడెయ్” అని ఒక్క కేక పెట్టింది పెద్దకూతురు వర్ధని.

పలక మీద బొమ్మలేస్తున్న కార్తీక్ అది పక్కన పడేసి బొమ్మలు తియ్యటానికి వచ్చాడు.

వర్ధని పురిటికని పుట్టింటికి వచ్చింది. కొడుకు మూడేళ్ళ వాడు.. తెలిసీ తెలియని వయసు. బొమ్మలు గీస్తూ గీస్తూ పుస్తకాలు, పలక ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడు.

రంగనాధ్ ఆఫీసు నించి వచ్చేసరికి ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసి ఇల్లు నీట్‌గా ఉంచటం ఇంట్లో వాళ్ళకి ఓ పెద్ద ఎక్సర్‌సైజ్.

ఆఫీసు నించి వచ్చి షూ విప్పుకోవటానికి సోఫాలో కూర్చున్న రంగనాధ్‌కి ఏదో గుచ్చుకుంది. ఒక్కసారి గుడ్లురుముతూ.. “ఏమిటిది? సోఫాలో పిల్లాడిని ఆడుకోనివ్వద్దని ఎన్ని సార్లు చెప్పాలి? ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏ క్రమశిక్షణ లేదు” అని గట్టిగా అరిచాడు.

మనవడి ఆటలు.. అల్లరి చాటుమాటుగా ఎంజాయ్ చేస్తున్నా.. కుటుంబ సభ్యుల ముందు మాత్రం తన బింకం సడలించకుండా “చిన్న పిల్లవాడని అలా వదిలేస్తే.. పెద్దయ్యాక మంచి.. చెడూ ఎలా తెలుస్తాయి. అల్లరి ముద్దేమిటి? ఇప్పుడు ముద్దని ఊరుకుంటే రేపు ఏకు మేకై కూర్చుంటాడు” అని గట్టిగా అరిచి చెబుతాడు రంగనాధ్.

ఇలా రంగనాధ్ ఇంట్లో ఉన్నంత సేపూ.. తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తమకే వినిపించేటంత నిశ్శబ్దాన్ని పాటిస్తారు కుటుంబ సభ్యులు.

***

రంగనాధ్ ఆఫీసు నించి వచ్చి యూనిఫార్మ్ మార్చుకుని.. స్నానం చేసి కూర్చునేసరికి స్నేహితుడు రంగనాయకులు ‘చెస్’ ఆడటానికి సిద్ధంగా వచ్చి కూర్చున్నాడు.

ఇద్దరికీ కాఫీ పట్టుకొచ్చి సైడ్ టేబుల్ మీద పెట్టింది కమల.

మిత్రులిద్దరూ కబుర్లాడుకుంటూ ఆటలో నిమగ్నమయ్యారు.

రంగనాధ్ తలెత్తేసరికి వంశీ చెప్పులేసుకుని బయటికెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు.

“చదువు మానేసి ఇంత రాత్రి ఎక్కడికిరా” అన్నాడు రంగనాధ్.

“నా బి.పి. మందులు మొన్ననే అయిపోయాయిరా.. చూసుకోలేదు. నిన్న చెబుదామంటే గుర్తు లేదు. పడుకునే ముందు వేసుకోవాలి. అందుకే వాడిని తెమ్మని పంపుతున్నా” అంది రంగనాధ్ తల్లి మీనాక్షి.

“నీకెన్ని సార్లు చెప్పానమ్మా.. మందులు ఇంకా రెండు.. మూడు రోజులు వస్తాయనగా చెప్పమని. ఇప్పుడు.. ఇంత రాత్రి వేళ చదువుకునే వాడిని లేపి మందులు తెమ్మని పంపటమేంటి? నేను స్ట్రిక్ట్ అని.. కోప్పడతానని బిరుదులే కానీ ఎప్పటికి మారతారు” అని.

“ఒరేయ్ నువ్వెళ్ళి చదువుకో. నేనెళ్ళి తెస్తాను” అని “రంగనాయకులూ పద” అని బయటికి నడిచాడు.

“వయసుతో మరుపు సహజమే అని వీడికెప్పుడు అర్థమవుతుందో! వాడిక్కూడా వయసు రావాలేమో” అనుకున్నది చిన్నప్పటి నించీ కొడుకు క్రమశిక్షణ మోతాదు తెలిసిన మీనాక్షి.

లిఫ్టులో రెండు రోజులైనా పోయిన బల్బ్ వెయ్యలేదని, రోజు రాత్రి పూట గేటు సరిగ్గా వెయ్యట్లేదని సెక్యూరిటీ అతనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి.. పక్కనే గోలగా మాట్లాడుకుంటున్న కింద ఇంటి కుర్రాళ్ళ మీద “మీకేం చదువులు లేవా? ఈ టైములో ఆ కేకలు-అరుపులు ఏంటి? అందరికి డిస్టర్బెన్స్” అని ఒక్క అరుపు అరిచాడు.

మందులు తెచ్చి తల్లి చేతికిచ్చాడు.

***

“ఈ ఫోన్ పాడయిందో ఏంటో. ఎంత సేపు చార్జి చేసినా త్వరగా అయిపోతున్నది! ఒక సారి చూడరా” అన్నాడు మనవడు కార్తీక్‌తో రిటైర్డ్ ఎస్.పి. రంగనాధ్ బతిమాలుతున్న ధోరణిలో!

“పోయిన నెలే కదా తాతగారు కొత్త ఫోన్ కొన్నది. అప్పుడే పాడయిందా? రోజంతా దానిలో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ప్రవచనాలు వింటారు! వాట్సాప్‌లో జోకులు చూస్తూ ఉంటారు. దానికి కాస్త రెస్ట్ ఇవ్వండి! ఇంతలో కొంపలేమి మునగవు”

“నేను ఆడుకోవటానికి వెళుతున్నాను. వచ్చాక చూస్తాను. అప్పటి దాకా రెస్ట్ తీసుకోండి” అన్నాడు అమ్మమ్మ గారింట్లో ఉండి చదువుకుంటున్న కార్తీక్.

“అమ్మో చిన్నప్పుడు అన్నం తింటూ చేతకాక చుట్టూ మెతుకులు పోశానని.. చిన్నవాడినని కూడా చూడకుండా గుడ్లురిమేవారు ఈయన. పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తానని అమ్మని కేకలేసేవారు. మామయ్య ఎప్పుడో నాలుగు రోజులకోసారి టీవీలో క్రికెట్ చూస్తే ‘ఎప్పుడూ టీవీ యేనా.. చదువు సంధ్య లేకుండా’ అనేవారు”

“ఇప్పుడు రోజంతా స్మార్ట్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు.. అంతా కాల మహిమ.. డివైస్‌ల మహిమ” అనుకుంటూ బయటికి దారి తీశాడు మనవడు కార్తీక్.

“నువ్వొచ్చేసరికి ఎంత టైమవుతుందో.. ఒక్కసారి చూడు నాన్నా.. మా బంగారు కదూ” అని బతిమాలుతున్న భర్తని చూసి

“అయ్యో ఎలా ఉండేవారు ఎలా తయారయ్యారో? ఇంట్లో పసి పిల్ల బాలాది.. ముసలివాళ్ళ వరకూ నోరెత్తి మాట్లాడాలంటేనే హడలిపోయేవారు! ఇప్పుడు మనవడిని ఎలా బతిమాలుతున్నారో చూడు!” అని

“కొండంత గుమ్మడికాయ కత్తి పీటకి లోకువ” అన్నట్టు ఎంతటి వారయినా ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్లకి బానిసలే. అందువల్ల వాటి గురించి తెలిసిన పిల్లలకి లోకువ అయి.. వారిని బతిమాలుకోవలసి వస్తోంది కదా.. కలి మాయ!” అనుకుంటూ మీనాక్షి భర్త చూడకుండా బుగ్గలు నొక్కుకుంది.

భర్తని గౌరవించే సగటు భార్య మరి!

Exit mobile version