సామెత కథల ఆమెత-14

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

పంచ పాండవులు మంచం కోళ్ళల్లే ముగ్గురు

[dropcap]‘త[/dropcap]ళ తళా.. మిల మిలా పగటి పూట వెన్నెలా’.. స్వప్న కూనిరాగం తీస్తూ బట్టలు మడత పెడుతోంది.

“హుషారుగా ఉన్నావ్ ఏంటి సంగతి” అన్నాడు జగదీష్.

“రేపు అక్షయ తృతీయ కదా! ఎంత బంగారం కొంటే అంత తూకంలో వెండి కాయిన్స్ ఇస్తారుట. ఇందాకే పేపర్‌లో చూశాను. అన్ని బంగారం షాపుల వాళ్ళు ఇంచుమించు ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నారు” అంది.

“వాళ్ళేం పిచ్చివాళ్ళా? ఇవన్నీ మీ ఆడవాళ్ళని బుట్టలో వెయ్యటానికి వాళ్ళు వాడే సేల్స్ ట్రిక్కులు. వెండి కాయిన్స్ ధర కూడా ఆ బంగారం వస్తువులో కలిపేస్తారు. మీరేమో వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారని ఎగబడి అక్కరలేని బంగారం కొని మా జేబులకి చిల్లులు పెడతారు” అన్నాడు.

“అయినా అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకుట కొనటం? ఏ వెధవ చెప్పాడు? ఏమిటి ఆ రోజు ప్రత్యేకత” అన్నాడు.

“భలే వారే.. అక్షయ తృతీయ అంటేనే మనం కొనే బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుంది అనే అర్థం ఆ మాటలోనే తెలియట్లేదా” అన్నది భర్తని ఒక వెర్రి వెంగళప్పలాగా చూసి.

“అక్షయ తృతీయ అంటే ఆ రోజు నువ్వు చేసే దానం అక్షయమైన ఫలితాన్నిస్తుందని అర్థం. ఆ రోజే ఆదిశంకరులు ‘కనకధార స్తవం’ చేసి ఒక పేదరాలి కోసం బంగారు ఉసిరికాయలు కురిపించారుట. ఆ రోజు సింహాచలం ఆలయంలో.. సంవత్సరమంతా వరాహ నరసింహస్వామి పై ఉండే గంధపు పూతని తీసేసి కొత్త గంధం పూస్తారుట. అలా చేసినప్పుడు.. స్వామి నిజ రూప దర్శనం జరుగుతుంది. అంతే కానీ ఈ బంగారం కొనటం.. లాకర్లు నింపటం ఎవరు చెప్పారో నీకు” అన్నాడు.

“పైగా బంగారం కొనటం అంటే డబుల్ ఖర్చు. కొనటానికి అయ్యే ఖర్చు ..మళ్ళీ అది దాచటానికి బ్యాంకులో లాకర్ తీసుకోవటం.. దానికి రెంట్ కట్టటం.. ఇదంతా వృథా ఖర్చు! అర్థమవుతోందా” అన్నాడు జగదీష్.

“మీరెన్నైనా చెప్పండి రేపు బంగారం కొనాల్సిందే. కొనటానికి షాపుకి వెళుతున్నానని మా ఫ్రెండ్‌కి కూడా చెప్పా” అన్నది మొండిగా స్వప్న.

“నువ్వు డిసైడ్ అయిపోయాక నేను ఆపితే మాత్రం ఆగుతావా? ఇంతకీ ఏం కొనాలి? బడ్జెట్ ఎంత” అన్నాడు నిస్పృహగా అందుకు కావలసిన డబ్బు ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తూ!

“రూబీ నెక్లెస్ కొనుక్కోవాలని ఎప్పటి నించో అనుకుంటున్నా!” అన్నది కళ్ళలో మెరుపులు కురిపిస్తూ.

“మొన్న మా రాజు కొడుకు పెళ్ళికి పెట్టుకున్నావు కదా! నేను బావుందని మెచ్చుకున్నాను కూడా.. నాకు గుర్తుంది” అన్నాడు.

“అది అన్ కట్ డైమండ్స్ కదండీ. దాన్ని రూబీ నెక్లెస్ అనరు” అన్నది.

“అందులో పెద్ద పెద్ద రూబీస్ ఉన్నాయిగా” అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.

“అవును.. ఉన్నాయి కానీ దాన్ని అన్ కట్ డైమండ్ నెక్‌లెస్ అంటారు” అన్నది భర్తని వెర్రివాడిలాగా చూసి.

“మా మేన కోడలి గృహ ప్రవేశానికి పెట్టుకున్న నెక్లెస్ మాటేమిటి” అన్నాడు పట్టు వదలని విక్రమార్కుడి లాగా.

“అది రూబీ-ఎమెరాల్డ్ నెక్లెస్ అండి. అందులో రూబీలు చిన్నవి. ఎమెరాల్డ్ డామినేటింగ్‌గా ఉండి ఎర్ర రాళ్ళు అస్సలు కనిపించవు. అందుకే ఈసారి ఏమైనా కానీ పూర్తి పెద్ద రూబీలతో నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను” అన్నది పట్టుదలగా.

ఇంతలో జగదీష్ దృష్టి గోడకి వేలాడుతున్న తమిద్దరి కలర్ ఫొటో మీద పడింది. అందులో స్వప్న నిమ్మ పండు రంగుకి మెరూన్ అంచు ఉన్న చీర కట్టుకుంది. దానికి మ్యాచింగ్‌గా ఎర్ర రాళ్ళ నెక్లెస్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

తల తిప్పి “దీని మాటేమిటోయ్” అన్నాడు.. భృకుటి ముడిచి.

“అది రూబీస్ కాదనుకుంటానండి. ఆర్టిఫిషియల్ స్టోన్సేమో. నెల్లూరులో దొరుకుతాయని మా వదిన తెస్తే వాటితో మా ఊళ్ళో కంసాలితో మా అమ్మ చేయించింది” అన్నది.

ఇంతలో ఫోన్ మోగింది. అటు నించి కూతురు! భార్యతో ఇందాకటి నించి జరుగుతున్న సంభాషణ కూతురికి చెబుదామని ఫోన్ తీశాడు జగదీష్.

“నాన్నా అమ్మకివ్వండి ఫోన్.. ఒక మాట అడగాలి” అన్నది.

ఫోన్ చేతిలోకి తీసుకుని “ఏంటమ్మా” అన్నది.

కూతురు పెద్ద పెద్ద రూబీస్‌తో చేసిన ఒక చెయిన్ లాంటిది చూపించి “అమ్మా.. ఇది నువ్వెక్కడ చేయించావో అడగమన్నారు మా అత్తగారు. ఆవిడకి చాలా నచ్చిందిట. ఆవిడెక్కడ తనకిచ్చెయ్యమంటారో అని.. అది నీదని.. నీకు ఇచ్చెయ్యాలి అని చెప్పాను. ఈ సారి వచ్చినప్పుడు నీకు ఇచ్చేస్తాను. నా దగ్గర కనిపిస్తే మళ్ళీ అడగచ్చు” అన్నది.

జగదీష్ తల పక్కకి తిప్పి.. “ఓహో ఇదొకటి కూడా ఉందన్నమాట! అయినా అక్షయ తృతీయ పేరు చెప్పి మళ్ళీ రూబీ నెక్లెస్ అనే కార్యక్రమం తలపెట్టావన్నమాట” అన్నాడు.

“అది నిరుడు ధన్ తే రస్ కి మీరే కొన్నారు.. గుర్తు లేదా?” అన్నది.

“సరే ఎప్పుడు కొంటే ఏం? కొన్నాం కదా! ఇలా సంవత్సరానికి రెండు సార్లు ‘ధన్ తే రస్’పేరు చెప్పి, ‘అక్షయ తృతీయ’ పేరు చెప్పి షాపుల వాళ్ళు మనని లూటీ చేస్తున్నారు. ఆడవాళ్ళ బలహీనతని వాడుకుంటూ వాళ్ళ సేల్స్ పెంచుకుంటున్నారు.

పంచపాండవులు మంచం కోళ్ళల్లే ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించిందిట నీ బోటి ఆవిడ!

నాలుగు రూబీ నెక్లెస్‌లు ఉంటే ఒకటి అన్ కట్ డైమండ్ అంటావ్.. ఇంకొకటి ఎమెరాల్డ్ అంటావ్.. మరొకటి అసలు రూబీయే కాదంటావ్.. ఒకటి ‘అది నెక్లెస్ కాదు చెయిన్’ అంటావ్! అన్నిటికీ అన్నీ ఏవో కారణాలు చెబుతున్నావ్. అసలు నీకు కావలసింది నెక్లెస్సా? రూబీసా? లేక నా చేత డబ్బు ఖర్చు పెట్టించి అవసరం లేని బంగారం కొనిపించటమా” అన్నాడు.

“సరే.. బంగారం కొనాలనుకున్నాక వెనక్కి తగ్గటం మంచిది కాదండి. అరిష్టం! పోనీ అలా వెళ్ళి ఒక తులంలో బంగారం కాయిన్ కొనుక్కొద్దాం. ఆఫర్ కింద ఇంకొక తులం వెండి కాయిన్ ఇస్తాడు. ఇలా నాలుగైదు పోగయితే ఏదో ఒక వెండి డబ్బానో.. చిన్న పళ్ళెమో వస్తుంది” అన్నది స్వప్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా!

[‘పంచ’ అనటంలోనే ఐదు సంఖ్య తెలుస్తుండగా నాలుగు కోళ్ళు ఉండే మంచంతో వారిని పోల్చి.. ముగ్గురు అని నోటితో చెబుతూ.. రెండు వేళ్ళు చూపించటం అంటే తాము అనుకున్న దాన్ని సాధించటానికి అసంబద్ధమైన వాదన చేస్తే ఈ సామెత వాడతారు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here