సామెత కథల ఆమెత-15

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

బూడిదలో పోసిన పన్నీరు

[dropcap]వి[/dropcap]నయ్‌ని అప్పటి వరకు చదువుతున్న మామూలు స్కూల్లో నించి తీసేసి.. ఎనిమిదో క్లాసులో ఐఐటికి తగ్గట్టుగా తర్ఫీదు ఇచ్చే లాంగ్ టర్మ్ ‘కోచింగ్ సెంటర్ కం స్కూల్’లో చేర్చాడు చలపతి.

తన స్నేహితులందరినీ వదిలేసి ఈ వయసులో కొత్త స్కూల్లో చేరటానికి ఇష్టపడని వినయ్.. తల్లి భారతి దగ్గర సణుగుతూనే ఉన్నాడు.

‘ఈ ఐఐటి సిలబస్ ఎంత కష్టంగా ఉంటుందో? రోజుకెంత సేపు క్లాసులుంటాయో? అసలు రెస్ట్ అంటూ ఉంటుందా? ఆటలు ఆడుకునే వీలు ఉంటుందా? ఉన్నట్టుండి ఉరుము లేని పిడుగులాగా నాన్నగారు ఇలా ఎందుకు చేస్తున్నారో’ అనుకుంటూ టీవీ చూస్తున్న వినయ్ తల్లి దగ్గరకి వచ్చి..

“ఏంటమ్మా ఐఐటిలో చదివితేనే చదువా? నా పాత స్కూల్లో ఫ్రెండ్స్ అందరం చెస్, క్యారంస్ ఒక టీమ్‌గా తయారై ఇంటర్ స్కూల్ పోటీలకి వెళుతున్నాం. అప్పుడప్పుడూ మా ఫ్రెండ్ ఇంట్లో మేడ మీద ఉన్న వాళ్ళ గేమ్స్ హాల్లో టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతూ ఉంటాం! అందరూ నాతో ఎంతో స్నేహంగా ఉంటారు. కలిసి చదువుకుంటాం.. కలిసి ఆడుకుంటాం! ఎన్నో విషయాల మీద మేధో చర్చలు చేసుకుంటుంటాం! మేము మా భవిష్యత్తు గురించి ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం.”

“నాన్నగారు ఇలా ఎందుకు చేశారు? నా ఇష్టాయిష్టాలు అడగలేదు. నాతో మాట వరసకి చెప్పకుండా ఆఫీసులో ఎవరో ఏదో చెప్పారని ఇలా చేశారు. టీచర్లు కొత్త! ఇంత పెద్ద క్లాసుకొచ్చాక నన్నర్థం చేసుకునే ఫ్రెండ్స్ దొరకటం కష్టం! నేను చేరేటప్పటికే వాళ్ళందరూ ఎప్పటినించో ఫ్రెండ్స్. నన్ను వాళ్ళ గ్రూప్‌లో చేరనిస్తారో లేదో? ఇన్ని గందరగోళాల మధ్య ప్రశాంతంగా చదువెలా సాగుతుంది.. చెప్పు” అన్నాడు వినయ్ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని.

“అయినా చదవాల్సింది నేనా? ఆయనా? నాకంత శక్తి ఉందో లేదో కూడా లెక్కేసుకోకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు” అని తల్లితో వాదనకి దిగాడు.

***

అతని చదువులో కొత్తగా వచ్చిపడ్డ మార్పు విషయంలో కొడుకు అయిష్టత, మానసిక స్థితి తెలిసిన భారతి.. “నాన్నగారి ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన కిషోర్ గారు.. నాన్నకి ఈ స్కూల్ గురించి చెప్పి.. ‘మీ అబ్బాయి తెలివైన వాడు అంటున్నారు కద సర్.. ఇప్పుడైనా మించిపోయిందేమి లేదు. ఎనిమిదో క్లాసుకొచ్చాక కూడా వాళ్ళు ఎడ్మిషన్ ఇస్తారు. ఒకసారి అక్కడ చేర్చాక అతని తెలివితేటలు.. చదువు విషయంలో వచ్చే ఇంప్రూవ్‌మెంట్ మీకే తెలుస్తుంది. ఉన్న ఒక్క కొడుకుని ఐఐటిలో చదివించటానికి అంత ఆలోచిస్తారేంటి సర్’ అన్నాడుట. దానితో నాన్నగారు టెంప్ట్ అయ్యారు. నీకు ఒక విషయం చెప్పనా.. తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే ఏ తల్లిదండ్రులకి ఆశ పుట్టదు?”

***

“రామాయణంలో సీతాదేవిని పోగొట్టుకున్నాక, అడవంతా వెతుకుతూ తిరుగుతున్న రామచంద్ర మూర్తిని ఆంజనేయుడు, సుగ్రీవుడు కలవటం.. ఒకరి కష్ట సుఖాలు మరొకరితో పంచుకోవటం.. అన్యాయంగా తమ్ముడిని వేధించిన వాలిని రాముడు సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చెయ్యటం కధ నీకు తెలుసు కదా!”

“తరువాత ప్రత్యుపకారంగా సుగ్రీవుడి అనుచరులందరూ సీతాన్వేషణకి బయలుదేరతారు. సుగ్రీవుడు అన్ని వైపులకి అందరినీ పంపించి దక్షిణ సముద్ర తీరానికి అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు.. ఇలా ఇతర ముఖ్యులందరినీ పంపిస్తాడు.”

“అక్కడ జటాయువు సోదరుడు సంపాతి.. రావణుడు సీతని తీసుకుని లంక వైపు వెళ్ళటం తను చూశానని చెబుతాడు. అప్పుడు అంత పెద్ద సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి ఎవరు వెళ్ళగలరు, వెళ్ళి మళ్ళీ విజయవంతంగా ఎవరు తిరిగి రాగలరు అనే ప్రశ్న వచ్చినప్పుడు.. అందరూ తమ తమ శక్తి సామర్థ్యాలు.. తమ పరిమితులు చెబుతారు.”

“ఏమి మాట్లాడకుండా ఒక పక్కగా కూర్చున్న ఆంజనేయ స్వామిని ఉద్దేశించి జాంబవంతుడు.. ‘హనుమా నువ్వొక్కడివే ఈ నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి అవతలికి వెళ్ళగలవు. సీతాన్వేషణ దిగ్విజయంగా చేసి.. ఆమె జాడ కనిపెట్టి మళ్ళీ తిరిగి రాగలవు. నీ శక్తి నీకు తెలియదు.. లే లేచి బయలుదేరు’ అని చెబుతాడు.”

‘అందరు చెప్పిన మాటలే కానీ ఆ సముద్రం ఆవలి ఒడ్డు వాస్తవంగా ఎంత దూరంలో ఉందో హనుమకి తెలియదు. జాంబవంతుడు తనకి శక్తి ఉందని చెప్పాడని.. తను దాటవలసిన సముద్రం లోతు, విస్తృతి.. దారిలో ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఏ విధమైన అంచనా లేకుండా.. అసలు ఎన్నడు చూడని సీతాదేవి ఎలా ఉంటుందో కూడా తెలియకుండా హనుమ తనకి అప్పగించిన పనిలోకి దూకాడు.”

“అలాగే మన ప్రమేయం లేకుండా మన జీవితంలో కొన్ని సార్లు అలాంటి సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు చెయ్యగలవు.. సాధించగలవు అనే అంచనాతో నాన్నగారు నిన్ను ఆ స్కూల్లో చేర్పించారు.”

“నీ విషయంలో నిజంగా అనుకున్నది సాధించగలిగితే.. ఈ మార్పు వ్యక్తిగతంగా నీకు ప్రయోజనమే! మంచి కాలేజిలో చేరతావు.. ఉత్తరోత్తరా పెద్ద ఉద్యోగంలో చేరతావు.”

“కానీ పైన చెప్పిన కథలో ఆలోచిస్తే.. అప్పగించిన ఆ పనిలో హనుమకి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమి లేదు.”

“ముందు నించే వ్యతిరేకంగా ఆలోచించకుండా.. వచ్చిన మార్పుని అవకాశంగా మార్చుకుని ఒక సవాలుగా తీసుకో! నీ వంతు కృషి నువ్వు చెయ్యి. అక్కడ ఉండే టీచర్లని బట్టో.. దొరికే ఫ్రెండ్స్‌ని బట్టో అనుకోకుండా నీకు దాని పట్ల ఇష్టత ఏర్పడచ్చు. సబ్జక్ట్ నువ్వనుకున్నంత కష్టంగా అనిపించకపోవచ్చు. క్రమేణా నీకు దాని మీద పట్టు దొరకచ్చు. ప్రయత్నం చెయ్యి.”

“కొంతకాలం గడిచాక నిజంగా నీకు నచ్చక.. నువ్వు చెయ్యలేను అనుకుంటే.. అప్పుడు నేను నాన్నగారితో మాట్లాడి ఆయన్ని ఒప్పించి నీకు ఇష్టమైన స్కూల్‌కి నిన్ను మార్పించేలా చూస్తాను.”

“కానీ ఒకటి గుర్తు పెట్టుకో! ఏ అఘాయిత్యం చేసుకోకు. నేను నీకు ఎప్పుడూ అండగా ఉంటాను.”

“ఇందాక నేను చెప్పిన కథలో ఆంజనేయుడు.. సముద్రం దాటే క్రమంలో దారిలో ఎదురైన అన్ని సమస్యలని.. కష్టాలని తన తెలివితో సమయస్ఫూర్తితో పరిష్కరించుకుని ఆవలి ఒడ్డుకి చేరి అక్కడ లంఖిణి అనే రాక్షసిని సంహరించి.. రావణాంతఃపురంలోకి ప్రవేశించి సీత కోసం వెతుకుతాడు.”

“అక్కడ అనేక మంది స్త్రీలని చూడ కూడని స్థితిలో.. అనేక రకాల అభ్యంతరకర అవస్థల్లో చూస్తాడు. అయినా ఆయనేమీ చలించడు. వచ్చిన పని మరచిపోయి అక్కడున్న సంపదకి, భోగాలకి, అందమైన స్త్రీలకి ప్రలోభపడడు. పరాయి స్త్రీలని అలా చూడటం తప్పు కదా అని కూడా అనుకుంటాడు. అంత వెతికినా సీతా దేవి జాడ కనిపించక చాలా నిరాశ పడతాడు.”

“తను ఇంత కష్టపడి సముద్రాన్ని లంఘించి.. ఎన్నో ఆపదల నించి బయటపడి ఇక్కడికి చేరి ఇంత వెదికినా సీత కనపడకపోయేసరికి.. ఈ కాలంలో మీలాంటి పిల్లలు అనుకున్నట్టు.. క్షణికమైన ఆవేశంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటాడు.”

“బతికుంటే ఎప్పుడైనా సీతని చూడచ్చు.. ఆత్మహత్య చేసుకుని, ఇప్పటి వరకు తను పడిన శ్రమని వృథా చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏముందని తనని తనే సంబాళించుకుని.. మళ్ళీ వెతకటం మొదలు పెడతాడు.”

***

“కష్టమైన చదువులతో సవాళ్ళని ఎదుర్కుంటున్న ఈ కాలపు పిల్లలు తల్లిదండ్రులకి తమ వాస్తవ స్థితిని ధైర్యంగా చెప్పలేక ఎలాగో అలా అనుకున్న కోర్సుల్లో చేరేవరకు కష్టపడుతున్నారు.”

“తీరా అనుకున్నది సాధించి.. ఒడ్డుకి చేరాక తాము ఆ కోర్సులో ముందు ముందు రాబోయే అగ్ని పరీక్షని తట్టుకోలేము అనే భయం వల్ల కలిగే ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.”

“అప్పుడు అప్పటివరకు వాళ్ళు పడిన శ్రమ అంతా ‘బూడిదలో పోసిన పన్నీరే’ కదా!”

“ఆ ఉద్వేగపు క్షణాలు వారిని అంత దూరం ఆలోచించనివ్వట్లేదు.”

“నిన్న ఉదయం పేపర్లో ‘ఈ సంవత్సరమే మెడిసిన్‌లో చేరి.. మొదటి సెమిస్టర్ పూర్తి చేసిన వందన (పేరు మార్చాను) ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ మేడపై నించి దూకి ఆత్మహత్య చేసుకుంది’ అనే వార్త చదివి ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటున్నారో అని బాధ పడ్డాను.”

“ఓ పక్క నేను టెన్షన్‌తో చస్తుంటే.. అమ్మ ఇలా లెక్చర్‌తో బాదేస్తోందేంటి అనుకుంటున్నావా?” అనడిగింది భారతి అంతవరకు మాట్లాడిన అలసటతో ఊపిరి తీసుకుంటూ.

“సందర్భం వచ్చినప్పుడే కదా పిల్లలకి వివరించగలిగేది! విడిగా ఊరికే మాట్లాడితే ‘భగవద్గీత’ చెబుతున్నాం అని మమ్మల్ని సాధిస్తారు!”

“కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏమిటంటే.. నచ్చని విషయాన్ని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పి ఒప్పించే పద్ధతిలో మాట్లాడటం నేర్చుకోవాలి. తమకి నచ్చిన రంగం గురించి, అందులో ఉన్న అవకాశాల గురించి టీచర్ల ద్వారా తెలుసుకోవాలి. అదే విషయాన్ని తల్లిదండ్రులతో చర్చించాలి. వాళ్ళు వినకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పాలి.”

“ముందు మీ బలాబలాలు మీకు తెలియాలి. మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. వినయ్ నీకు అండగా నేనెప్పుడూ ఉంటాను. అది మరచిపోకు. నిన్ను నిప్పుల గుండంలోకి మాత్రం తొయ్యనివ్వను. సరేనా” అంది తన వేళ్ళతో కొడుకు జుట్టు సవరిస్తూ!

“నువ్వింత చెప్పాక నేనూ ఆలోచిస్తాలే అమ్మా! నచ్చకపోతే నీ సహాయం నాకెప్పుడూ ఉంటుందిగా” అని తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి బయట ఫ్రెండ్స్‌ని కలవటానికి వెళ్ళాడు వినయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here