Site icon Sanchika

సామెత కథల ఆమెత-18

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

ఉపకారం అంటే ఊళ్ళొంచి లేచిపోవటం

[dropcap]“అ[/dropcap]దేం బేబీకి స్కూల్ లేదా.. గోడకి కొట్టిన బంతల్లే పావు గంటలో వచ్చేశారు” అన్నది గాయత్రి భర్తతో!

“నాకు ఇవ్వాళ్ళ ఆఫీసులో స్టాక్ చెకింగ్ పనుంది.. త్వరగా వెళ్ళాలని చెప్పాను కదా! అయినా స్కూల్ బస్ రావట్లేదు దింపమని ఆర్డర్ జారీ చేశావు. మన పక్కింటి మురళి గారు ఆ రూట్ లోనే వెళతారు కదా దింపుతారేమో అని వాళ్ళింటికెళ్ళి అడిగాను. ఆయనకి ఏదో హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన పని ఉంది అన్నారు. అందుకే బేబీని నువ్వే తీసుకెళ్ళు అని చెబుదామని వెనక్కి తీసుకొచ్చా” అని స్కూటర్ మీద నించే జవాబిచ్చి హడావుడిగా వెళ్ళిపోయాడు మహేష్.

‘ఏడ్చినట్టే ఉంది. మన పని మనమే చేసుకునే ఆలోచన చెయ్యాలి కానీ.. పక్కింటాయన.. ఎదురింటి ఆవిడ చేస్తారని ఎలా నమ్ముతాం. ఆయనకి పనుందని ముందే చెప్పి ఉంటే నేనే రెడీ అయ్యే దాన్ని కదా’ అనుకుంటూ.. ఉన్న పళాన తల పై పైన దువ్వుకుని.. కట్టుకున్న చీరతోనే స్కూటీ తీసింది గాయత్రి, బేబీని దింపటానికి రెడీ అవుతూ.

***

“ఏమో అనుకున్నా కానీ మన పక్కింటి మురళి ‘ఉపకారమంటే ఊళ్ళోంచి లేచి పోతాడు’. ఆయన ఆఫీసుకి వెళ్ళే దారే కదా అని, ‘ఈ రోజు మా బేబీ స్కూల్ బస్ రాదుటండి. ఆఫీసులో నాకు అర్జెంట్ స్టాక్ చెకింగ్ ఉంది.. దయచేసి మా బేబీని స్కూల్ దగ్గర దింపండి’ అని పొద్దున అడిగితే హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన పని ఉందని చెప్పిన పెద్ద మనిషి.. ఆఫీసు ముందు స్కూటర్ పార్క్ చేస్తూ కనిపించాడు. ‘ఇంత త్వరగా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చేశారా’ అని అడిగా. ‘హాస్పిటల్ ఏంటి.. ఇంట్లో ఎవరికైనా బాగాలేదా’ అని పక్కనే ఉన్న వాళ్ళ కొలీగ్ అడిగాడు. ‘హుష్ మాట్లాడకు’ అని మెల్లగా గొణిగి నేను చూడలేదనుకుని అతనికి కను సైగ చేశాడు.”

“ఒట్ఠి నిరుపకారి” అన్నాడు అక్కసుగా.

“అక్కడికి మీరు పరోపకారి అయినట్టు” అని మూతి తిప్పి లోపలికి వెళ్ళింది గాయత్రి.

***

“అమ్మా.. గాయత్రీ దొడ్లో గుమ్మడి కాయ కాచింది. ఆఫీసు నించి వెళుతూ అల్లుడు గారు ఇటుగా వస్తే ఇచ్చి పంపిస్తాను. పాపం ఆయనకి గుమ్మడి వడియాలు ఇష్టం కూడాను. అలాగే మామిడి కాయలు కూడా ఇస్తాను. ఇప్పుడిప్పుడే పిందెలు పెద్దవవుతున్నాయి” అని అన్నపూర్ణ ఫోన్ చేసింది.

“అలాగేనమ్మా. నేను చెబుతాను కానీ.. ఆయన మూడ్స్! ఆయన అక్కడికి రావటం నా చేతుల్లో లేదు. కోసి పక్కకి పెట్టు. ఆయన రాకపోతే ఈ సారి నేను వచ్చినప్పుడు తీసుకుంటాలే!”

“వడియాలు తింటారు కానీ అందుకు కావలసిన పని చెబితే చెయ్యటానికి ఒళ్ళు వంగదు. మన పని మనం చేసుకోవటానికి ఈయనకి భేషజం” అన్నది గాయత్రి.

***

“అమ్మా వాళ్ళ దొడ్లో మామిడి చెట్టు ఈ సంవత్సరమే కొత్తగా కాయలు కాసిందిట. వస్తే ఓ అర డజను కాయలు ఇస్తానన్నదండీ. అలాగే గుమ్మడి కాయ కూడా ఇస్తానన్నది. ఇంచక్కా ఇంటి గుమ్మడి కాయతో వడియాలు, మామిడి కాయలతో తొణుకు ఆవకాయ వేసుకోవచ్చు. సాయంత్రం ఆఫీసు నించి అటెళ్ళి రండి” అన్నది గాయత్రి ఆఫీసుకి బయలుదేరిన భర్తతో.. క్యారేజి చేతికిస్తూ.

“ఇలాంటి సుత్తి పనులన్నీ నాకు పెట్టకు. అయినా అల్లుడు అత్తగారింటి నించి మామిడి కాయలు.. గుమ్మడి కాయలు తేవటమేమిటి.. అసహ్యంగా! చూసే వాళ్ళేమనుకుంటారు. అన్నీ అత్తవారే ఇస్తారు.. ఈయనకి తిండి ఖర్చే ఉండదు అనుకోరూ!” అన్నాడు.

“ఆఁ మరే! గుమ్మడి కాయలు.. మామిడి కాయలతోనే తిండి ఖర్చంతా వెళ్ళిపోతుందా.. మరీ బడాయి కాకపోతే! దొడ్లో కాసినవి అంటే ఎవరికైనా అపురూపం కదా! అందులోను పిల్లలు తింటే తల్లిదండ్రులకి అదొక తృప్తి.”

“మీరేమైనా ప్రత్యేకం వెళ్ళాలా? మీరొచ్చే దారిలో కాబట్టే ఆవిడ మనకివ్వాలని ఆశ పడింది. నేను వెళ్ళాలంటే ఎన్ని తెముల్చుకుని వెళ్ళాలి? అప్పటికి ఇంకో రెండు కాపులు వచ్చేస్తాయి. ఏ ఏటి కాయేడు వస్తూనే ఉన్నా.. మామిడి కాయలంటే వేసవి రాగానే కొత్తల్లో ఉండే ఆశ అలా ఉంటుంది.”

“పైగా ఎండలు మరీ ముదిరితే వడియాలు పెట్టటం కష్టం! వీపు, తల మాడిపోతూ ఉంటాయి. మీకు లొట్టలేసుకుంటూ తింటానికి బానే ఉంటాయి. ఆడ వాళ్ళు ఎంత కష్టపడితే అవి కంచంలోకి వస్తాయి!”

“ఊరికే సాకులు చెబుతూ ‘ఉపకారం అంటే ఊళ్ళొంచి లేచిపోక’, ఈ శని వారం ఆఫీసు నించి వస్తూ మా వాళ్ళింటికి వెళ్ళి.. శుభ్రంగా అత్తగారు పెట్టిన టిఫిన్ కడుపు నిండా తిని ఆ నాలుగు కాయలు పట్టుకు రండి. శని వారం అయితే మీరూ ఓ చెయ్యి వెయ్యచ్చు. రాత్రికి మీరే గుమ్మడి కాయ తరగచ్చు. ముక్కలకి ఉప్పు రాసి పెట్టుకుంటే ఆదివారం ఉదయం వడియాలు పెట్టుకోవచ్చు. బేబీకి స్కూల్ కూడా ఉండదు కనుక హడావుడి ఉండదు” అన్నది గాయత్రి.. ఇక తన మాటకి తిరుగు లేదన్నట్టు!

[జీవితంలో మనందరికి ఇలాంటి నిరుపకారుల అనుభవం ఉంటుంది. ఎదుటి వారిలో కనిపించే ఈ తప్పు మనలో మనం చూసుకోము. ఏదైనా పని చెప్పినప్పుడు.. అది చిన్నది కానీ.. పెద్దది కానీ.. మనలో ఉండే మురళిలు.. మహేష్‌లూ పైకొచ్చి ఆ పని ఎగ్గొట్టే మార్గాలు చెబుతారు. అవునా!]

Exit mobile version