సామెత కథల ఆమెత-20

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

ఆలికి అన్నం పెట్టటం లోకోపకారమా?

[dropcap]పూ[/dropcap]ర్వకాలంలో ప్రతి ఇంట్లో మగవాళ్ళు సంపాదించి కుటుంబాన్ని పోషించేవారు. ఆడవారు పిల్లలని కని, పెంచి.. ఇల్లు నిర్వహించి.. ఇంటికొచ్చే అతిథి అభ్యాగతులని ఆదరించి వండి పెట్టేవారు. సంపాదించి.. పోషించే బాధ్యత మగవారిది అయినందువల్ల భార్యా పిల్లల తిండి ఖర్చు.. చదువు సంధ్యల నిర్ణయాలు మగవారివే అయి ఉండేవి.

అలా తన ఇంటి బాధ్యతలు నిర్వహించే భార్య బాగోగులు భర్తే చూసుకోవాలి. ఈ నేపధ్యంలో.. తన భార్యకి అన్నం పెట్టి పోషిస్తున్నానని గొప్పగా ఏ భర్త అయినా భావిస్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది. మనిషికి అతి ప్రాథమిక అవసరమైన అన్నాన్ని పెట్టటం అనేది మహోపకారం కాదు. అది భర్త కనీస ధర్మం!

సహజంగా తను చెయ్యాల్సిన పనిని చేసి.. దాని గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ఈ సామెత వాడతారు.

***

“ఏమండీ వియ్యంకుడు గారు ఊళ్ళోకి వచ్చారుట. ఫోన్ చేసి పలకరించి.. రేపు భోజనానికి రమ్మని చెప్పండి” అన్నది లక్ష్మి.

“ఆఁ సరే” అన్నాడే కానీ వంచిన తల ఎత్తకుండా ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు జగన్నాధ్.

ఇడ్లీకి, దోశకి పప్పు రుబ్బి.. ఇడ్లీ పిండిలో రవ్వ కలిపి, చారుపొడి మిక్సీ పట్టి.. కాసేపు రెస్ట్ కోసం కుర్చీలో కూర్చుని టీవీ ఆన్ చేసింది లక్ష్మి.

‘మిస్టర్ పెళ్ళాం’ సినిమా చూస్తూ అందులో మునిగిపోయి టైం గమనించలేదు. సాయంత్రం ఐదయిపోయింది. ఆ పూట పని మనిషి రాలేదని అప్పుడే అర్థం అయింది లక్ష్మికి.

ఉసూరుమంటూ వంట గదిలోకెళ్ళి సింకులో ఉన్న నాలుగు గిన్నెలు తోమేసి.. రాత్రి చపాతికి పిండి కలిపి, కూరల కోసం ఫ్రిజ్ తీసింది.

ట్రేలన్ని ఖాళీగా ఉన్నాయ్.

“ఏమండీ.. ఉదయం కింద తోపుడు బండి వాడి దగ్గర ఆలుగడ్డలు, క్యారట్, రెండు ఆకుకూరలు తెమ్మన్నాను. ఫ్రిజ్‌లో లేవు! తెచ్చి ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? లేక కొని డబ్బిచ్చేసి వాడి బండి మీదే వదిలేసి వచ్చారా” అన్నది.

“కూరలా.. నాకెప్పుడు చెప్పావు? నేను ఏ కూరలు కొనలేదు. ఎక్కడా మర్చిపోలేదు” అన్నాడు రెండు గంటల క్రితం కూర్చున్న భంగిమలోనే.. ఫోన్‌లో నించి తల పైకి ఎత్తని జగన్నాధ్.

“ఓహో కూరలు కొనటమే మర్చిపోయారు కానీ.. కొని ఎక్కడా పెట్టి మర్చిపోలేదన్నమాట” అన్నది లక్ష్మి వ్యంగ్యంగా!

“ఇప్పుడేం వండను? ఏ పని చెప్పినా అవుతుందన్న ఆశ లేదు. మొన్నటికి మొన్న బయటికెళుతూ గ్యాస్ సిలిండర్ వస్తుంది.. తీసుకుని లోపల పెట్టండి అని సిలిండర్ డబ్బు కూడా ఇచ్చి వెళితే.. వాడొచ్చినప్పుడు మేం బుక్ చెయ్యలేదు అని చెప్పి పంపేశారు.”

“ఎప్పుడు చూసినా ఆ ఫోన్‌లో మొహం దూర్చేసి మీరు చేసే నిర్వాకం ఏమిటి? అలా చూసీ చూసీ కళ్ళు పొడిగా అయిపోయి మంటలంటారు.”

“ఆరు నెలలకొకసారైనా డయాబెటిస్ యావరేజి టెస్ట్ (HB a1c) చేయించమని.. కళ్ళ విషయంలో అశ్రద్ధ చెయ్యద్దని డాక్టర్ చెబుతూనే ఉంటారు. నేను గుర్తు చేస్తూనే ఉంటాను. అన్నిటికీ ఒకటే సమాధానం.. రేపు వేళతాను.. ఎల్లుండి వెళతాను అని!”

“నేను ఎంత మొత్తుకు చచ్చినా వినపడదు. వినపడిన ఆ ఒకటి.. రెండు మాటలు బుర్రలోకి వెళ్ళవు. ఒక్క దాన్నే ఎంతకని చావను” అన్నది విసుగ్గా.

“మొన్న మన లాయర్ గారు ఏదో ఫోన్ నంబర్ పంపించారు. అది ఎక్కడ పోయిందో తెలియట్లేదోయ్! అది దొరికితే కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి కేసు వివరాలు చెప్పి డాక్యుమెంట్స్ ఇవ్వలేను. ఎస్సెమ్మెస్‌లో లేదు, మెయిల్లో లేదు.. వాట్సాప్‌లో లేదు. అది అర్జెంట్” అన్నాడు జగన్నాధ్ అయోమయం మొహం పెట్టి.

“మీ లాయర్ పేరు మీ కాంటాక్ట్ లిస్టులో ఉందా? పేరేంటి?” అన్నది అతని చేతిలోంచి ఫోన్ తీసుకుని.. వెతకటానికి ఉపక్రమించిన లక్ష్మి.

“అది పంపించింది. మన లాయర్ కాదు. అతని అసిస్టెంట్. అతని పేరు నాకు తెలియదు. ఎలా వెతకాలో తెలియక నేను జుట్టు పీక్కుంటుంటే.. నీ సాధింపొకటి!” అన్నాడు.

జగన్నాధ్ ఫోన్‌లో వివరాలు పట్టుకునే క్రమంలో లక్ష్మికి పాట్లు మొదలయ్యాయి.

ఎస్సెమ్మెస్‌లో 600 మెసేజిలు.

వాట్సాప్‌లో కొన్ని వందల ఫొటోలు, మెసేజిలు.. వీడియోలు.. లింకులు!

అందులో మూడు వంతులు.. పేర్లు లేకుండా కేవలం నంబర్లతో వచ్చిన మెసేజిలు.

“ఎవరండి వీళ్ళంతా? ఒక్క మెసేజి పట్టుకోవాలంటే.. ఫోన్లో ఉన్న అన్ని చదవని మెసేజిలు ఓపెన్ చెయ్యాలి.. అందులో ఉండే ఫొటోలని బట్టి తెలిసిన వాళ్ళో.. తెలియని ప్రకటనల తాలూకో నిర్ధారించుకోవాలి. మీ ఫోన్లో ‘అన్ రెడ్’ మెసేజిలే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇన్ని ఓపెన్ చేసి మనకి కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని పట్టుకోవాలంటే ‘కుక్క తోక పుచ్చుకు గోదావరి ఈదినట్టే’!”

“ఈ ఎక్సర్సైజ్ ఎప్పటికి అవుతుంది?” అని విసుక్కుంటూ “ఓ పని చెయ్యండి.. మీ లాయర్ మీకు మంచి ఫ్రెండే కదా! ఆయనకి ఫోన్ చేసి మళ్ళీ నంబర్ అడగండి. ఒక వేళ ఆయన ఏమైనా అనుకుంటాడు అనిపిస్తే.. వాళ్ళ అసిస్టెంట్‌కి ఫోన్ ఇమ్మని అతన్నే డైరెక్ట్‌గా అడగండి. అది నయం. లేదా.. ఇలా గంటలు గంటలు వెతుక్కుంటూ బుర్ర బద్దలు కొట్టుకునే బదులు.. ఒక్కడుగు వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్ తోనే డైరెక్ట్‌గా మాట్లాడండి” అన్నది.

“మీ ఫోన్లో సమాచారం పట్టుకోవాలంటే.. అన్నాహారాలు మానేసి అదే పని మీద కూర్చున్నా కనీసం ఐదారు రోజులు పడుతుంది. నాకు అంత టైం లేదు. మీకేమో చేత కాదు” అన్నది, ఇదొక పరిష్కారం అన్నట్టు!

“సరే ఇంతకీ మీరు రాత్రికి ఉత్తి చపాతీనే తినాలి. కూరలు తేలేదు కదా! నేను సతీ అనసూయనైతే ఏదో ఒకటి సృష్టిద్దును” అన్నది.. ఏడవలేక నవ్వుతూ!

“అన్నట్టు వియ్యంకుడు గారికి ఫోన్ చేశారా? మళ్ళీ ఆయన ఊరెళ్ళిపోతారుట” అన్నది గుర్తు చేస్తూ!

“ఆయనకి ఫోన్ చెయ్యమని నాకెప్పుడు చెప్పావ్?” అన్నాడు జగన్నాధ్ విసుగ్గా!

“ఫోన్‌లో అనవసరపు మెసేజిలు, ఫొటోలు డిలీట్ చెయ్యమని నువ్వే చెబుతావ్! చేస్తుంటే నువ్వే పిలిచి ఏదో ఒక పని చెబుతావ్! వినలేదని.. చెప్పిన పని చెయ్యలేదని నిష్ఠూరాలడతావ్! నీతో ఎట్లా చచ్చేది? నిన్న రాత్రి అమ్మాయి ఫోన్ చేస్తే మాట్లాడలేదని దెప్పావ్! నేను అప్పుడు సీరియస్‌గా నా ఫోన్ వాట్సాప్ క్లీనింగ్‌లో ఉన్నాను”

“మొన్న కొత్త కాంటాక్ట్స్ స్టోర్ అవ్వట్లేదని.. ఫోన్ పాడయ్యిందేమో చూపిద్దామని ఆ స్టోర్‌కి వెళ్ళాను. ‘ఫొటోలు, వీడియోలు, మెసేజిలతో మీ ఫోన్ ఓవర్‌లోడ్ అయింది సర్. మీరు ఇంకా స్టోరేజి కొనుక్కోవాలి’ అన్నాడు. పైగా అలా ప్రతి నెలా కొనాలిట. వాడిదేం పోయింది.. అలాగే చెబుతాడు. వాడి బిజినెస్ టెక్నిక్ వాడిది.”

“అందుకే ఫోన్ క్లీనింగ్ ఫుల్ టైం పనిగా పెట్టుకున్నాను. సరే వియ్యంకుడి గారికి ఇప్పుడు ఫోన్ చేస్తాను” అన్నాడు.

***

“భలే వారండి.. ఆ నింద కూడా నా మీదేనా!”

“ఆలికి అన్నం పెట్టటం లోకోపకారం” అన్నట్టుంది మీ వరస. మీ ఫోన్ మీరు క్లీన్ చేసుకోవటం.. అందులో అవసరమైన సమాచారం మీరు వెతుక్కోవటం.. మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టుంది.”

“నేనేదో మిమ్మల్ని లేటెస్ట్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ కొనుక్కోమన్నట్టు? ఇవి సెన్సిటివ్! అందులో ఉండే ఫీచర్స్ మనకి అర్ధం కావు.. వద్దని చెప్పినా వినరు!”

“ఈ టచ్ స్క్రీన్లతో తెలియకుండానే ఏదో నొక్కుడవ్వటం..”

“మనం వాడుతున్న యాప్ మాయమై పోయి ఇంకేదో దానిలోకి జంపై పోవటం..”

“పోయిన దాన్ని వెతుక్కునే క్రమంలో మనం మళ్ళీ ఏదో నొక్కటం.. ఇక అక్కడి నించీ అర్థం పర్థం లేని ప్రకటనలు ‘పాకిస్తాన్ చొరబాటు దారులల్లే’ మన ఫోన్ని తమ సామ్రాజ్యం లాగా వాడేసుకోవటం..”

“మేమందరం ఫోన్లు వాడట్లేదా.. జాగ్రత్తలు తీసుకోవట్లేదా! మీ లాగా మేం కూడా అలా ఫోన్లో మొహం దూర్చి కూర్చుంటే ఇంట్లో మీ పనులేవీ అవ్వవు. మనకి తెలియని మెసేజిలు, ఫొటోలు వచ్చే నంబర్లని బ్లాక్ చెయ్యాలి. ఇప్పుడు వాట్సాప్‌కి టైమర్ వసతి కూడా ఇచ్చారు. 24 గంటల టైమర్ ఫిక్స్ చేసుకుంటే.. మెసేజిలు వాటంతట అవ్వే డిలీట్ అయిపోతాయి.”

“ఈ ఫోన్ ధ్యాసలో పడి వేళ్టికి మందులు వేసుకోరు.. స్నానం ఆలస్యం.. తిండి ఆలస్యం. ఇంటికొచ్చే వాళ్ళని మొహమాటానికి పలకరించి మళ్ళీ ఫోన్‌లో తల దూర్చేస్తున్నారు” అంది.

“ఎహె నువ్వు మరీ అతి! ఫోన్లో అనవసరమైనవి డిలీట్ చేస్తూ కూర్చుంటే.. ఎప్పుడూ ఫోన్లో తల దూరుస్తున్నానంటావ్. ఒక్క రోజు దాని వంక చూడకపోతే కుప్పలు కుప్పలు టిక్ టాక్‌లు.. ఇమోజిలు.. మెసేజిలు!”

“నీకు తెలుసా.. ఈ ఫోన్ల ప్రహసనంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయిలో ఉంటున్నాయిట. కొందరైతే విడిపోతున్నారుట కూడా! చూడు ఇప్పుడే ఎవడో పంపించాడు” అన్నాడు జగన్నాధ్.. అప్పుడే కొత్తగా వచ్చిన వాట్సాప్ మెసేజి చదువుతూ!

“సరే స్నానం చేసి రండి చపాతీ పెడతా” అంటూ వంటింట్లోకి వెళ్ళింది వేడిగా చపాతి చెయ్యటానికి.

“వియ్యంకుడి గారిని భోజనానికి పిలిచాం కదా! రేపు ఉదయం వెళ్ళి మన సందు చివర ‘పొలిమేర’ లో నాలుగు కూరలు పట్టుకు రండి” అన్నది.

***

“ఫోన్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ప్రపంచం లోని సమాచారం అంతా శ్రమ లేకుండా అరిచేతిలోకి వచ్చేస్తుందనుకుంటున్నాం. కానీ ఆ సమాచారంలో కానీ.. ఫోన్లల్లో ఉండే ఫీచర్స్ కానీ 90% మనకి.. మన వయసులకి అవసరం లేనిదే!”

“దాని వల్ల ఉపయోగం ఎంతో న్యూసెన్స్ అంత!.. జాగ్రత్త” అని హెచ్చరించింది లక్ష్మి.. కరణేషు మంత్రి లాగా చపాతి తింటున్న భర్తతో!

[ఇప్పుడు ఫోన్లు మన జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యమైన ఇంటి విషయాలు మాట్లాడుకునే టైం భార్యాభర్తలకి ఉండట్లేదు. మగవారికి ఇంటి విషయాలు తెలుసుకునే ఆసక్తి ఉండట్లేదు. అధవా ఇంట్లో వాళ్ళు చెప్పినా వాళ్ళ బుర్రలోకి ఎంత వరకు ఎక్కుతోందో సందేహమే! దీనికి ఆడా-మగా ఎవ్వరూ మినహాయింపు కావట్లేదు. సౌలభ్యం కొరకు ఏర్పడ్డ ఈ సౌకర్యం నిజంగా ఉపయోగమో.. శాపమో తెలియనంతగా మన జీవితాలని శాసిస్తున్నది. తెలుసుకుని మసులుకోవలసిన బాధ్యత నిస్సంకోచంగా మనదే!]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here