[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు..
[dropcap]ఇ[/dropcap]ప్పటిలాగా పూర్వం గ్యాస్ పొయ్యిలు.. కుక్కర్లు లేవు. అన్నం కట్టెల పొయ్యిల మీద.. బొగ్గుల కుంపట్ల మీద వండేవారు..
అలా వండేటప్పుడు.. మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ.. చేత్తో మెతుకు ‘ఉడికిందో లేదోనని’ పట్టుకుని చూసేవారు.
అలా ఆ ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అన్నం అంతా అలా చూడక్కరలేదు.
అలాగే కొందరి మనస్తత్వాన్ని.. పనితనాన్ని ఒక్కసారి చూస్తే చెప్పెయ్యగలము.. ఎక్కువ సార్లు చూడక్కరలేదు అని చెప్పటానికి ఈ సామెత వాడతారు.
***
“అమ్మా నా ఫోన్ రాత్రి పడుకునే ముందు ఈ టేబుల్ మీదే పెట్టాను. కనిపించట్లేదు. కాలేజికి టైమైపోతోంది” అని విసుక్కుంటూ వెతుక్కుంటున్నాడు బాచి.
“అక్కడ పెడితే ఏమవుతుందిరా.. నీది మరీ చోద్యం! సరిగ్గా చూడు. ఎక్కడో చార్జింగ్‌కి పెట్టి ఉంటావ్. చూడు” అంది వంటింట్లో నించే సరోజ.
వెతికి.. వెతికి విసుగొచ్చి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు బాచి.
“సరోజా టీవీ రిమోట్ కనిపించట్లేదు. రాత్రి పాడుతా తీయగా చూసి ఎక్కడ పెట్టావో? ఇటొచ్చి ఓ సారి చూస్తావా.. వార్తలు చూడాలి” అన్నాడు అసహనంగా దేవేందర్.
“ఏమయింది ఇవ్వాళ్ళ అందరికీ? నిజంగానే ఎదురుగా ఉన్న వస్తువు మీకెవ్వరికీ కనిపించట్లేదా.. లేక అవే ఎక్కడికైనా నడిచి వెళ్ళిపోయాయంటారా” అంటూ కాఫీ గ్లాసు చేత్తో పుచ్చుకొచ్చింది సరోజ.
తాపీగా కాఫీ తాగి.. తను కూడా వెతికే ప్రయత్నం చేసి “బాచి ఫోన్ సంగతేమో కానీండి.. టీవీ రిమోట్ మాత్రం కనిపించట్లేదు” అన్నది అలవాటుగా పెట్టే చోటుతో పాటు మరి కొన్ని చోట్ల వెతికి.
“పొద్దున్నే పని టైం. ఇప్పుడు కుదరదు. ఎలాగూ ఆఫీసుకెళ్ళాలి కదా.. సాయంత్రం వచ్చాక వెతుకుదాం లే. ముందు వెళ్ళి స్నానం చేసి రండి. బ్రేక్‌ఫాస్ట్ చేద్దురు” అన్నది.
ఆఫీసుకి రెడీ అయి షూ వేసుకుని కార్ కీస్ కోసం చూస్తే అవి కనిపించలేదు.
“ఏంటి మన ఇంట్లో దయ్యమేమైనా తిరుగుతోందా ఏమిటి? ఉన్నట్టుండి వస్తువులు మాయమవుతున్నాయ్” అన్నాడు చికాకుగా.
“అత్తయ్యా.. ఇంకా పడుకున్నారు రాత్రి సరిగా నిద్ర పట్టలేదా. లేవండి మీరు లేచి పళ్ళు తోముకుంటే కాఫీ ఇస్తాను. తరువాత స్నానం చేసొచ్చి టిఫిన్ తినచ్చు. నాకు కాలేజికి టైం అవుతున్నది” అంటూ అత్తగారి రూం లోకి వెళ్ళిన సరోజకి అక్కడ బాచి ఫోన్, టీవీ రిమోట్ కనిపించాయి.
‘ఇవి ఈ గదిలోకెలా వచ్చాయబ్బా’ అనుకుంటూ తెచ్చి బయట పడేసి.. రాత్రి పెరుగు కోసం పాలు తోడు పెట్టటానికి వంటింట్లోకెళ్ళింది.
***
“అమ్మా.. పెద్దమ్మ రూమంతా చిందరవందరగా ఉంది. అలమారు లోనించి తీసి బట్టలు బయట పడేసినట్టుంది. దిండు కవరు తీసి అందులో స్నానం సబ్బు, పేస్టు ట్యూబ్, తువ్వాలు, దువ్వెన పెట్టి ఉన్నాయి. వాష్ ఏరియాలో ఉండే చీపురు కట్ట పెద్దమ్మ రూంలో ఉంది” అన్నది యాదమ్మ సాయంత్రం కాలేజి నించి వచ్చి రిలాక్స్‌డ్ గా కూర్చుని టీ తాగుతున్న సరోజతో!
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సరోజ గబుక్కున లేచి అత్తగారి రూం లోకి వెళ్ళింది. ఆవిడ పక్క మీద ఉండే దుప్పటి తీసి ముసుగు పెట్టి పడుకుని ఉన్నది. ఆవిడ కోసం డైనింగ్ టేబుల్ మీద మూత పెట్టి ఉంచిన కంచం అలాగే ఉన్నది. ‘అత్తయ్య భోజనం చేసినట్టు లేదు’ స్వగతంగా అనుకుంటూ ముందు గదిలోకొచ్చింది.
“మా అత్తగారేంటో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు అన్నం కూడా తినలేదు. ఏమిటంటావ్” అన్నది ఫ్రెండ్ పవిత్రకి ఫోన్ చేసి.
“ఈ మధ్య డిమెన్షియా కేసుల గురించి ఎక్కువగా వింటున్నాం. ఇవి ఆ రోగ లక్షణాల్లాగే అనిపిస్తున్నాయి. న్యూరో సైకియాట్రిస్ట్‌కి చూపించాలి. ముందు అర్జెంట్‌గా ఇంట్లో ఉండే నమ్మకస్థురాలైన ఒక మనిషి కోసం ప్రయత్నించు. మీరెవ్వరూ లేనప్పుడు ఆవిడ బయటికెళ్ళిపోవచ్చు. అటు ఇటు తిరుగుతూ పడిపోవచ్చు. దెబ్బలు తగలచ్చు. అప్పుడింకా ఇబ్బంది అవుతుంది” అన్నది పవిత్ర.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెబుతూ!
నేస్తం మాటతో ఎలర్ట్ అయిన సరోజ భర్తకి ఫోన్ చేసి “ఉదయం మనం అన్ని వస్తువుల కోసం వెతుక్కున్నాం కదా! అత్తయ్య తన రూంలో వస్తువులన్నీ చిందర వందరగా పడేసి.. పక్క దుప్పటి తీసుకుని దానితో ముసుగు తన్ని పడుకున్నారు. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. ఇవి డిమెన్షియా లక్షణాలు.. న్యూరో సైకియాట్రిస్ట్‌కి చూపించమన్నదండి మా ఫ్రెండ్ పవిత్ర. దానికి కొంచెం మెడికల్ నాలెడ్జి ఉంది లెండి. అలాగే మనం ఒక కేర్ టేకర్ ని కూడా వెతకాలి” అన్నది కంగారుగా!
“సరే నేనొచ్చాక మాట్లాడతాను” అన్నాడు.
తెలిసిన వారందరికీ మనిషిని వెతకమని చెప్పాడు.
***
ఆదివారం మధ్యాహ్నం పనయ్యాక నడుం వాల్చిన సరోజ.. కాలింగ్ బెల్ మోగిన చప్పుడుకి వచ్చి తలుపు తీసి వచ్చిన వ్యక్తిని లోపలికి రమ్మని డ్రాయింగ్ రూం లోకి దారి తీసింది. కుర్చీలో కూర్చుంటూ..
“నిన్నెక్కడో చూసినట్టుందమ్మా. మా ఇంటికెప్పుడయినా వచ్చావా? మీదే ఊరు? ఇంతకు ముందు ఎక్కడ పని చేశావు? నీ వయసు చూస్తే ఇంకా ముప్ఫయిల్లోనే ఉన్నట్టుంది. మా అత్తగారికి డిమెన్షియా అంటున్నారు డాక్టర్స్. ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలవా” అని తన మనసులో ఉన్న సందేహాలన్నీ బయటపెట్టింది సరోజ.
“నేను సర్జరీ అయి హాస్పిటల్ నించి డిస్చార్జ్ అయిన పెద్ద వాళ్ళని కనిపెట్టుకుని ఉండే పనే రెండేళ్ళ నించి చేస్తున్నానమ్మా. మీరేం సందేహించక్కరలేదు. రెండు రోజులు చూస్తే మీకే తెలుస్తుంది” అన్నది కిరణ్మయి.
ఇద్దరికీ బేరసారాలు కుదిరి కిరణ్మయి పనిలో చేరింది. “రేపటి నించి వస్తానమ్మా” అని వెళ్ళిపోయింది.
పేపర్ చూస్తూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తోంది సరోజ.
హఠాత్తుగా ఇరవయ్యేళ్ళ క్రితం.. తన పెళ్ళికి ముందు తమ కాలనీలో అందరూ కలిసి వెళ్ళిన కార్తీక వనభోజనాలు గుర్తొచ్చాయి. ‘ఆఁ ఇప్పుడు తెలిసింది.. ఈ అమ్మాయి ఆ రోజు తను చూసిన ఆ ఆరేళ్ళ పిల్లే’ అనుకునేసరికి.. ఆ అమ్మాయి సమర్థత గురించి మనసులో కలిగిన సందేహాలన్నీ పటాపంచలైనాయి.
***
కార్తీక మాసంలో మొదటి ఆదివారం ఆ కాలనీలో పెద్ద ఆయన సర్వేశ్వర్రావు గారు కాలం చెయ్యటం వల్ల.. అనుకోకుండా వచ్చిన అతిధి వానదేవుడి వల్ల మరో రెండు ఆదివారాలు కుదరక.. ఆ సంవత్సరం వన భోజనాల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.
కాలనీ వాసులందరూ చేరి ఎలాగైనా చివరి వారంలో ఆ వేడుక జరగాలని యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాట్లు చేశారు.
సమయాభావం ఉన్నా ఏర్పాట్లు మాత్రం ఆటపాటలతో ఘనంగా చేశారు. ఉదయం వస్తూనే ఫలహారాలు కానిచ్చి అందరూ మ్యూజికల్ చెయిర్స్, దాగుడు మూతలు, చాకలిబాన ఆటలు జోరుగా ఆడారు.
మధ్యవయస్కులైన ఆడవారు కొందరు బ్యాచిలు బ్యాచిలుగా షటిల్ ఆడుతున్నారు.
కొందరు మగవారు చతుర్ముఖ పారాయణంలో పడితే.. పెళ్ళి కాని యువతీ యువకులు ఒకరినొకరు ఆకర్షించే పనిలో కంటి సైగలు చేసుకుని ఒంటరిగా వెళ్ళి చెట్ల కింద కూర్చుని కబుర్లల్లో పడ్డారు.
క్యాటరింగుకి ఆర్డర్ ఇవ్వటం వల్ల ఆడవారు కూడా అత్యంత ఆనందోత్సాహలతో ఆటల్లో పాల్గొన్నారు.
“ఊఁ రండి రండి భోజనాల వేళయింది. భోజనాలయ్యాక అంతాక్షరి, తంబోలా, పాసింగ్ ది పార్సిల్ ఆటలున్నాయి. రావాలి.. రావాలి” అని అందరిలోకి పెద్ద.. అన్నపూర్ణమ్మగారు కేకేశారు.
ఆటలాడీ ఆడీ పొద్దున తిన్న టిఫిన్ కాస్తా అరిగి పోయి ఆకలితో అందరూ నక నకలాడుతున్నారు. ఒకరు ఆకులేస్తుంటే.. ఒకరు పదార్ధాలు వడ్డిస్తున్నారు. కూర్చుని తినటానికి సౌకర్యమైన చోటు వెతుక్కుంటూ అందరూ విస్తళ్ళ ముందు కూలబడ్డారు. అలా హడావుడిగా కూర్చోవటంలో డెబ్భయేళ్ళ ఉమాపతి గారి పక్కకి ఆరేళ్ళ కిరణ్మయి వచ్చింది.
“అయ్యో ఈ చంటిది వెళ్ళి ఆ పెద్దాయన పక్కన కూర్చుంది. ఆయన మీదంతా మెతుకులు పోస్తుందేమో” అన్నది వడ్డిస్తున్న అనసూయ.
లేస్తే సీటు దొరికేట్లు లేదు.
“పోనీలేమ్మా.. కూర్చోనివ్వు. నేనే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది” అన్నారు ఉమాపతి గారు.
భోజనాలు మొదలు పెట్టే ముందు.. అన్నపూర్ణాష్టకం చదివి.. ‘భోజనకాలే భగవన్నామ స్మరణే గోవిందా గోవిందా’ అని అందరు గొంతెత్తి గట్టిగా చెప్పి భోజనం ప్రారంభించారు.
ఉమాపతి గారి అన్నం తినే విధానం చూసిన కిరణ్మయి తన చిట్టి చేతులతో తనే అన్నంలో పప్పుతో ఒక ముద్ద, కూరతో ఒక ముద్ద, పచ్చడితో ఒక ముద్ద కలిపి నాలుగు కుప్పలుగా చేసి విస్తరి నాలుగు పక్కల పెట్టి తినమన్నది.
ఉమాపతి గారు తింటూ ఉండగా పులిహోర వడ్డించే వాళ్ళొస్తే.. “తాతగారు ఇవి తిన్నాక నేనే పిలుస్తానండి” అన్నది.
కిరణ్మయి తల్లి.. తన కూతురు ఎక్కడ కూర్చుందో అని ఆదుర్దాగా వెతుకుతూ వచ్చింది. అక్కడ పరిస్థితి చూసి “భడవా నువ్వు తినకుండా ఆయనకి కలిపి పెడుతున్నావా! జాగ్రత్తమ్మా” అన్నది.
“మేం తాతగారి మీద మెతుకులు పోస్తుందేమో అని కంగారు పడుతుంటే.. తన చిట్టి చేతులతో తనే తినిపిస్తోందండి మీ అమ్మాయి. భలే పిల్లే” అన్నది సూర్యకాంతం.
ఉమాపతి గారు పూర్తిగా తినే వరకు జాగ్రత్తగా చూసి అప్పుడు అన్నం తిన్న ఆరేళ్ళ కిరణ్మయి ఆరోజు అందరి మనసు దోచుకుంది.
ఆ కిరణ్మయే ఈ పిల్ల అని గుర్తు వచ్చింది సరోజకి.
***
అన్న ప్రకారం మరునాడు వచ్చి డ్యూటీలో చేరిన కిరణ్మయి సరోజ అత్తగారు వర్ధనమ్మ గారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నది. అడపా దడపా ఆవిడ బట్టలు.. పడుకునే బెడ్ ఖరాబు చెయ్యటం జరుగుతూ ఉండేది. కొంచెం కూడా విసుక్కోకుండా.. తన వయసుకి మించిన సహనంతో ఆవిడని లాలించటం.. అన్నం తిననని మారాం చేస్తున్న ఆవిడని బుజ్జగించి అన్నం తినిపించటం చూసిన సరోజకి గుండెల మీద నించి పెద్ద భారం దింపినట్టయింది.
అప్పుడే కిరణ్మయి వచ్చి ఆరు నెల్లవుతోంది. కాలం ఇట్టే గడిచిపోతోంది.
ఒకరోజు మాటల్లో సరోజ “కిరణ్ నువ్వు వచ్చినప్పటినించీ అడుగుదామనుకుంటున్నాను. తప్పుగా అనుకోకపోతేనే చెప్పు. మీ నాన్నగారి ఆర్థిక స్థితి నీ చిన్నతనంలో బాగానే ఉండేది కదా! పెద్ద వాళ్ళు చేసే అశుభ్రాన్ని భరించవలసిన ఈ రంగాన్ని నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు? కొందరు స్వంత వాళ్ళకి చెయ్యటానికే ఇష్టపడరు. అలాంటిది పరాయి వాళ్ళకి చెయ్యటం అంటే ఎంతో విశాల హృదయం.. ఔన్నత్యం ఉండాలి” అన్నది.
“నేను చిన్నప్పటి నించీ మా నాయనమ్మ పక్కనే పడుకునే దాన్ని. పెద్ద వయసు వచ్చాక ఆవిడ నిస్సహాయత దగ్గరనించీ చూశాను. అందరూ చదువుకుని ఏవో ఒక డీసెంట్ ఉద్యోగాల్లో చేరటానికే ఇష్టపడతారు కానీ ఇలాంటి సేవ చెయ్యాలని కోరుకోరు. అందుకని ఎప్పటికైనా నేను అదే రంగంలో స్థిరపడాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను. అది నా ప్యాషన్ అండి” అన్నది.
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి “రా పవిత్రా. ఏమిటి ఇలా ఎండన పడి బయలుదేరావ్” అన్నది సరోజ.
“మా పినమామగారికి ఈ మధ్యన జబ్బు చేసింది. వాళ్ళు ఈ పక్క వీధిలో ఉంటారు. ఈ రోజు ఆదివారం కదా.. చూసి వెళదామని వచ్చాను. అన్నట్టు మీ అత్తగారు ఎలా ఉన్నారు? నమ్మకమైన మనిషి ఎవరైనా దొరికారా” అని పవిత్ర అంటూ ఉండగా ‘మంచి నీళ్ళు తీసుకోండి’ అంటూ గ్లాసు చేతిలో పెట్టింది కిరణ్మయి.
“ఈ అమ్మాయి ఎవరు” అనడిగింది.. కిరణ్మయి అటు వెళ్ళగానే.
“మా అత్తగారిని కనిపెట్టుకుని ఉండేది ఈ అమ్మాయే! చాలా ప్రేమతో, అంకిత భావంతో సేవ చేస్తుంది. మేమందరం అదృష్టవంతులం” అన్నది.
“అబ్బో అంత సర్టిఫికెట్ ఇచ్చేశావ్.. ఎన్నాళ్ళయిదేమిటి వచ్చి. కొందరు నమ్మకం కుదిరేవరకు బాగా ఉన్నట్టు నటిస్తారు. తరువాత తమ అసలు స్వభావం బయట పెడతారు” అన్నది.
“కాదు పవిత్రా.. నేను ఈ అమ్మాయిని చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయేనా అని నిర్ధారించుకున్నాను.”
“అన్నం అంతా పట్టి చూడక్కరలేదే.. ఒక్క మెతుకు పట్టి చూస్తేనే తెలిసిపోతుంది”.
“ఆరేళ్ళ వయసు అప్పుడే ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్య పోయాను. ఇప్పుడు ఆరు నెలల నించి చూస్తున్నాను. ఎంత ప్రేమగా మా అత్తగారిని చూస్తుందంటే.. బహుశ స్వంత కుటుంబ సభ్యులమైన మేము కూడా ఆవిడకి అంత సేవ చెయ్యలేమేమో అనిపిస్తుంది. ‘కడుపులో లేనిది కావలించుకోలేరు’ ఎవరైనా” అని ముగించింది సరోజ కిరణ్మయి పట్ల తృప్తి కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా!